[dropcap]ఆ[/dropcap]నందపురం ప్రజల్లో మూఢనమ్మకాలు ఎక్కువ! మా దేవుడు గొప్ప, మా కులం గొప్ప, మా మతం గొప్ప అంటూ వాదనలు చేసుకుంటూ ఒక్కక్కసారి పెద్ద తగవులు వేసుకుంటూ ఆనందపురంలో శాంతి లేకుండా చేయసాగారు!
ఈ పరిస్థితులను చక్కబెట్టి, ప్రజల్లో అన్ని మతాలు ఒక్కటే, అందరి దేవుళ్ళ శక్తి ఒక్కటే అని ఒప్పించడానికి గ్రామ పెద్ద సత్యమూర్తి ఎంతో ప్రయత్నించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన ఊరి వారిలో సఖ్యత కుదర్చలేక పోయాడు!
ఒకరోజు ఆ ఊరికి చంద్రశేఖర సరస్వతి అనే మహా యోగి వచ్చాడు. ఊరి రామాలయంలో ఆయన ఎన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక విషయాలు చెబుతూ ప్రజల్లో చైతన్యం కలిగించసాగాడు. అయినా ప్రజల్లో పాతుకపోయిన కులం, మతం, దైవాన్ని గురించి వక్రీకరించిన అవగాహన తొలగనట్లు సత్యమూర్తి గ్రహించాడు.
సత్యమూర్తి చంద్రశేఖరసరస్వతిని ఏకాంతంగా కలిసి ఈ విధంగా చెప్పాడు.
“మహానుభావా, మా ఊరిలో చాలా మందికి వారు పూజించే దైవమే గొప్ప అని, వారి కులం, మతం గొప్ప అనే అభిప్రాయంతో ఒకరిని ఒకరు కించపరుచుకుంటూ లేని పోని తగవులు తెచ్చుకుంటూ ఊరిలో అశాంతిని సృస్తిస్తున్నారు, దీనికి తమరే పరిష్కారం చూపించాలి” అని నమస్కారం పెట్టి చెప్పాడు సత్యమూర్తి.
ఒక్క నిముషం కళ్ళు మూసుకుని, ఒకింత ఆలోచించి చంద్రశేఖరసరస్వతి సత్యమూర్తి ఈవిధంగా చెప్పాడు.
“చూడు సత్యమూర్తి, అందరూ మంచి వారే, వారి వారి దేవుళ్ళు, మతాలు, కులాలు గొప్ప అనుకోవడంలో తప్పు లేదు! కానీ వాదించుకుంటూ తగవులు తెచ్చుకోవడం తప్పు. నీవు రేపు నన్ను కలువు మరింత ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచిస్తాను” అని చెప్పాడు.
రెండవ రోజు సత్యమూర్తి చంద్రశేఖర సరస్వతిని కలిశాడు.
“నేనొకటి ఆలోచించాను. ఊరిలో ఒక గుడి కట్టిద్దాము. కానీ, ఆ గుడిలో దేవుడు అన్ని దేవుళ్లను, అన్ని మతాలను ప్రతిబింబిచేటట్టు నాకు తెలిసిన శిల్పి చెక్కుతాడు. ఆ దేవాలయం లోనే ఒక గ్రంథాలయం నెలకొల్పి అందులో అన్ని మతాలకు చెందిన గ్రంథాలు ఉంచుదాము. అదీగాక అన్ని మతాల సారం ఒక్కటే కనుక, గోడల మీద ఆయా మతాల. సూక్తులు వ్రాయిద్దాము. గుడికి అన్ని మతాల వారి దగ్గర నుండి చందాలు సేకరిద్దాము. వారు అడిగితే మీ దైవం, మీ మతం ప్రతిబింబించే విషయం గుడిలో ఉంటుందని చెబుతాము. ఆ విధంగా ప్రయత్నించడంతో తప్పులేదు కదా!” అని వివరించారు చంద్రశేఖరసరస్వతి.
ఆ సూచన సత్యమూర్తికి ఎంతో నచ్చింది.
ఆ రోజు నుండి తన పరివారంతో ఊరిలోని ఆయా మత పెద్దలను, అందరిని కలిసి గుడి విషయం, చందాల విషయం వివరించాడు. సత్యమూర్తి మంచితనాన్ని తెలిసిన అందరూ గుడి కట్టడానికి ఒప్పుకుని, తమ చేతనైనంత చందాలు ఇచ్చారు.
అనుకున్నట్టుగానే రెండు సంవత్సరాలలో అద్భుతమైన రాతి గుడి తయారయింది. గుడి కడుతున్నప్పుడు చంద్రశేఖరసరస్వతి దగ్గర ఉండి శిల్పి గణపతికి అనేక విలువైన సూచనలు చేసి గుడిలో అన్ని మతాలకు సంభందించిన విగ్రహాలు స్తంభాలపై చెక్కించాడు. ఆయా మతాలు, దైవాలకు సంబంధించిన సూక్తులు కూడా గోడల మీద చోటు చేసుకున్నాయి!
అందమైన గ్రంథాలయం కూడా గుడి ఆవరణలో నిర్మించబడింది!
గుడి ప్రారంభోత్సవానికి ఊరిలో అందరిని పిలిచి, అందరిని సముచితంగా గౌరవించారు.
అన్నిటికన్నా ముఖ్య విషయం, గుడిలో మూలవిరాట్టుని చూస్తే శిల్పి గణపతి ప్రతిభ, చంద్రశేఖరసరస్వతి గొప్ప ఆలోచన ప్రస్ఫూటంగా తెలుస్తాయి!
విగ్రహంలో అన్ని మతాల దేవుళ్ళు ప్రతిబింబిస్తునట్టు ఉంది! మనం గర్భ గుడిలో ఎటువెళ్లినా విగ్రహం కళ్ళు మనల్నే చూస్తున్నట్టు చెక్కాడు శిల్పి గణపతి! ఎవరు ఆవిగ్రహాన్ని చూసినా తమ దైవం తమను చూస్తున్న పవిత్ర ఆలోచన కలుగుతుంది! దేవాలయంలో సూక్తులు చదివితే అవి అన్ని మతాల సారం ఒక్కటే ఆ ఈ సూచిస్తాయి!
దేవాలయంలో ఒకచోట ఈ విధంగా వ్రాయించారు:
కులాలు వేరు, మతాలు వేరు
అయినా మానవత్వం ఒక్కటే
దేవుళ్ళు వేరు దేవతలు వేరు
కానీ దైవత్వం ఒక్కటే!
ఏది వేరైనా కావలసింది
మానవత్వం ఒక్కటే!
మంచి తనమొక్కటే!
ఆ మహత్తరమైన దేవాలయం అన్ని మతాల వారిని ఆశీర్వదిస్తున్నట్టుంది!
చంద్రశేఖరసరస్వతి దేవాలయ ప్రాంగణంలో సభ ఏర్పాటు చేసి, ప్రజాలందరికీ అన్నీమతాలు, కులాల సారం దైవత్వం ఒక్కటేనని హృదయాలకు హత్తుకొనేటట్టు ప్రసంగించారు.
క్రమేపీ ఊరి ప్రజల్లో మంచి మార్పు చోటు చేసుకుంది.శాంతి నెలకొంది. నిజంగానే ఆ ఊరికి ఆనందపురం అనే పేరు సార్థకమైంది. చంద్రశేఖరసరస్వతి పేరు కూడా ఆ ఊరిలో చిరస్థాయిగా నిలిచిపోయింది.