అందరూ చెడ్డవారు కాదు

0
2

[dropcap]అ[/dropcap]డవిలో ఒక మడుగు ఉన్నది. దానికి దగ్గర్లో ఒక బాతు తన పిల్లలతో జీవిస్తున్నది. బాతు పిల్లలు  చాలా చిన్నవి. అమ్మ ఎటు వెళితే అటే వెళుతూ ఉంటాయి. అమ్మ వెనకాలే బుడి బుడి అడుగులు వేసుకుంటూ వెళతాయి. అమ్మతో పాటు రోజంతా విహారం చేస్తుంటాయి.

అమ్మ బాతు తన పిల్లలను ఎక్కువగా నీళ్ళలోనే ఆడిస్తుంది. నీటిలో మునిగిపోకుండా నడవటమెలాగో నేర్పిస్తుంది. మంచినీటి సరస్సులోనూ ఉప్పు నీటిలోనూ జీవించడం గురించి చక్కగా చెపుతుంది. ఆహరం వెతుక్కోవాలో చూపిస్తుంది.

నీటిలో ఉండే గడ్డి, నాచు, చిన్న పురుగులు, బల్లి మొలస్క్ లను ఎలా తినాలో నేర్పిస్తుంది. తాను ముందుగా నడుస్తూ మొక్కల్ని, కీటకాల్ని పట్టుకొని తినడం చూపిస్తుంది. పిల్లలు తల్లి వెంటే నడుస్తూ తల్లిని అనుకరిస్తాయి.

తల్లి తన పిల్లలతో ఇలా చెప్పింది –  “చూడండి పిల్లలూ ! మన చుట్టూ మన శత్రువులు పొంచి ఉంటారు మనల్ని వేటాడటానికి పక్షులు, పెద్ద చేపలు, తాబేళ్లు మొసళ్ళు చూస్తుంటాయి. అందువలన మనం అడుగు వేసేటప్పుడే చుట్టూ పరిశీలించాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆగి పోవాలి.

అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం కేవలం జంతువులు మాత్రమే మనల్ని తినేస్తాయని అనుకోకూడదు. మనుష్యులు కూడా ప్రమాదకారులే. గుడ్లనూ, పిల్లల్నీ ఎత్తుకుపోతారు. అందుకని వాళ్ళ నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నాకేదైనా అయితే కూడా మీరంతా జాగ్రత్తగా ఉండాలి” అంటూ తల్లిబాతు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది.

పిల్లలు అమ్మ చెప్పినదంతా శ్రద్ధగా విన్నాయి. “అమ్మా మనుష్యలు మంచివాళ్ళు కాదా!” అని అడిగింది ఒక బాతు పిల్ల. “అవునమ్మా! వాళ్ళు మన మాంసాన్నీ, గుడ్లనూ తినేస్తారు తినేస్తారు” అన్నది అమ్మబాతు. “అమ్మో మనుష్యులంతా దుర్మార్గులే!” అంటూ బాతు పిల్లలని ఆశ్చర్యంతో నోటి మీద వేలేసుకున్నాయి.

రోజూ అమ్మబాతు తన పిల్లల్ని వెంట తీసుకొని పోతూ అన్ని విషయాల గురించీ చెపుతున్నది. జీవితంలో ఎలా బతకాలో నేర్పిస్తున్నది.

ఒక రోజు అమ్మబాతు, పిల్లబాతులు ఆహరం తింటూ, వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళాయి. అడవిని ఆనుకుని ఉన్న హైవే దాకా వెళ్ళిపోయాయి. పిల్లలు హైవేను చూసి ఆశ్చర్యపోయాయి. “అమ్మా, ఇదేమిటి కొత్తగా ఉన్నది?” అని అడిగాయి.

“మనుష్యులు తమ వాహనాలు నడవటానికి వేసుకున్న రోడ్డమ్మా ఇది. దీని మీద పెద్ద పెద్ద వాహనాలు వెళుతుంటాయి. మనుష్యులు వాటిలో కూర్చుని ప్రయాణిస్తుంటారు” అన్నది అమ్మబాతు.

“అవునా! హైవే భలే బాగుంది. అవతల వైపుకు వెళ్ళి చూద్దామా” అడిగాయి పిల్లలు.

“సరేలే! వాహనాలు రానప్పుడు అటు వైపుకు వెళ్ళాలి. జాగ్రత్తగా నా వెనకే రండి” అంటూ అమ్మబాతు అటూ ఇటూ చూసుకుంటూ నడక ప్రారంభించింది.

పిలలు తల్లి వెనకాలే నడుస్తూ హైవేను సంభ్రమంగా చూస్తున్నాయి. హైవే పక్కనున్న ఫుట్‌పాత్ ఎక్కి వాహనాలను చూసుకుంటూ నడవాలని చెప్తూ ముందుకు వెళ్ళింది అమ్మబాతు. ఫుట్‌పాత్ మీద ఉన్న డ్రైనేజీ మూతను దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. పిల్లలు కూడా వెంటనే నడుస్తూ వెళ్ళాయి. ఆ చివరకు వెళ్ళి తల్లి తన పిల్లలను లేక్కవేసుకుంటే రెండు పిల్లలు లేవు. వెనక్కి తిరిగి చూసింది.

రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయాయేమో అనుకిని చూస్తే ఎక్కడా కనిపించలేదు. మరల వెనక్కి వచ్చి చూస్తే డ్రైనేజి హోల్‌లో నుంచి ‘అమ్మా అమ్మా’ అని అరుపులు వినిపించాయి. డ్రైనేజీ  హోల్‌లో నుంచి తొంగి చూస్తే రెండు పిల్లలు ఏడుస్తూ కనిపించాయి.

అమ్మబాతుకు గుండె ఆగినంత పనయింది. ఎం చేయాలో అర్థం కాలేదు. “ఏడవకండి నేనున్నాను” అంటూ ధైర్యం చెబుతున్నది గానీ అందులో ఎలా పడిపోయాయా అని చూసింది. మ్యాన్ హోల్ మూతకు రంధ్రాలు దూరంగా ఉన్నాయి. “పిల్లలు సన్నగా ఉండటం మూలంగా లోపలికి జారిపోయాయి, మిగతా పిల్లలు కొద్దిగా లావుగా ఉన్నాయి పడిపోలేదు. తాను పెద్దగా ఉండేటప్పటికి సమస్య రానేలేదు” ఆలోచిస్తున్నది.

బాతుపిల్లల ఏడుపు అమ్మబాతు అయోమయాన్ని ఆ దారి వెంట వెళుతున్న ఒక జవాను చూసాడు. కారు ఆపి దగ్గర కొచ్చి చూశాడు. వెంటనే మ్యాన్ హోల్ మూత తొలగించాడు. తన చేతిని లోపల పెట్టి పిల్లల్ని తీద్దామని ప్రయత్నించాడు.

లోపల ఇరుక్కున్న పిల్లలు మనిషి చేతిని చూసి దూరం జరిగాయి. మనిషి దుర్మార్గుడని అమ్మ చెప్పిన మాటలకు భయపడి వెనక్కి వెళ్ళాయి. జవానుకు బాతు పిల్లలు అందలేదు. జవాను నేల మీద పడుకొని చేతిని లోపలకు పోనిచ్చాడు. బాతు పిల్లలు చేతికి అందాయి. బాతు పిల్లలు ఇంకా పెద్దగా ఏడవడం ఆరంభించాయి.

జవాను పిల్లల్ని బయటకు తీసి తల్లి చేతికి ఇచ్చాడు. బాతు పిల్లలు మనిషిని చూసి వణికి పోతున్నాయి. అమ్మ బాతు పిల్లల్ని భయపడవద్దు అన్నట్టుగా పొదివి పట్టుకున్నది. జవాను బాతుకు, బాతుపిల్లలకి వివరించాడు. “మనుష్యులందరూ చెడ్డవాళ్ళు కాదు. అపకారులు కాదు. సహాయం చేసే మంచివాళ్ళు కూడా ఉంటారు. తెలుసుకోండి” అన్నాడు జవాను నవ్వుతూ..

అమ్మబాతు లోపల బితుకు బితుకు మంటున్నా ధైర్యంగా ఉన్నట్టు నటిస్తోంది. జవాను బాతుకు బాతు పిల్లలలకూ ధైర్యం చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here