నటనతో రంగు తేలిన చిత్రం – అంగ్రేజీ మీడియమ్

0
2

[box type=’note’ fontsize=’16’] “ఒక మాములు మనిషి వ్యవస్థలో చిక్కుకొని హాస్యపు మాధ్యమం ద్వారా సందేశాన్ని ఇవ్వగలిగే వ్యవహారం సామాన్యంగా మంచి ఫార్ములానే” అంటున్నారు వేదాంతం శ్రీపతిశర్మ ‘అంగ్రేజీ మీడియమ్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

‘అంగ్రేజీ మీడియమ్’ సినిమా సమీక్ష

[dropcap]హా[/dropcap]స్యం పండించాలంటే అతిశయోక్తిని వాడుకునే విధానం తెలియవలసి ఉంటుంది. ఒక పరిస్థితిలోంచి ఉత్పన్నమైన అంశాలు అనుకోని విధంగా పాత్రలకు స్పందింప జేసినప్పుడు హాస్యం ఒకలా ఉంటుంది. ఆ పరిస్థితిని సృజించారా, సృష్టించారా అనేది ప్రధానమైన విషయం, సృష్టించినట్లు కనిపించినప్పుడు రచనలో బలహీనత ముందుకు వస్తుంది. అసలు నేపథ్యంలోనే అతిశయక్తిని దాచేసి నటనలో దానిని వీలు వెంట వాడుకున్నప్పుడు సంభ్రమంతో పాటు నవ్వుకుంటూ ఉంటాం.

‘మోడర్న్ టైమ్స్’ లో చాప్లిన్ ఒక కుర్చీలో కూర్చుని అతనికి యాంత్రికంగా నోట్లకి వచ్చినవి తింటూ ఉంటాడు. ఆ ప్రక్రియలో రకరకాల పనిముట్లు వచ్చి అతనికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వకుండా వాటి పని అవి చేస్తూ ఉంటాయి. కుడి ప్రక్క నుండి యంత్రం వచ్చి మరో మరో అతన్ని మూతి మీద కొడుతూ ఉంటుంది. చాప్లిన్ దాని పైపు చిరాకుగా, కోపంగా చూస్తూ ఉంటాడు. అసలు ఆ పరిస్థితిలో కూర్చోవటమే ఒక ఇబ్బందికరమైన విషయం. బలవంతంగా కూర్చోవలసి వచ్చింది. గత్యంతరం లేదు. ఆ దిగ్భంధంలోంచి పోటుగాడిలాగా మరో దాని మీద చిరాకు పడటం అనేది తారాస్థాయికి చేరిన హాస్యం! ఇదీ మన వ్యవస్థలో మన ‘మోడర్న్ టైమ్స్’ అని సూక్ష్మంలో చేబుతాడు చాప్లిన్. అదొక కార్మాగారంలోని చిన్న ప్రయోగం. యాంత్రికంగా ఉన్నప్పటికీ యాదృచ్ఛికంగా ఉంటుంది. ఉన్న పరిస్థితిలోనే ప్రవర్తన భిన్నంగా ఉన్నప్పుడు నవ్వు రావచ్చు. దీని కోసం రెండు పాత్రలు, లేదా అసమంజసంగా ఉన్న ఓ నేపథ్యాన్ని సృష్టించినప్పుడు ప్రక్రియ దెబ్బతినటం మనం చూస్తాం.

‘అంగ్రేజీ మీడియమ్’ హిందీ చిత్రంలో రెండవ భాగం ఈ సమస్యకు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అది పెద్ద విషయం కాదు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా చలన చిత్రాలలో అధికంగా రెండవ భాగంలో ఏం చెయ్యాలో దర్శకులకు తెలియలేదు అని సామాన్య ప్రేక్షకులు గూడా చెప్పుకోవటం మనం చూసాం. ఈ జాబితాలో పేరు సంపాదించిన దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు.

ఈ సమస్యకి ప్రధానమైన కారణాలు రెండున్నాయి. ప్రతి కథలో రెండు కథలుంటాయి. ఒకటి అసలు అలోచనలో కదలిన కథాంశం. రెండు కథనం. కాగితం మీద వ్రాసిన కథ అయినా కథనం అనేది పూర్తిగా దృశ్యానికి చెందినది. దృశ్యం అనేది అనుభవ మార్గంలోంచి అనుభూతి అనే గమ్యానికి చేర్చేది. ఆ మార్గంలో నాటకీయత అనే అంశాన్ని ఎక్కడ నిలిపి తదుపరి సంఘటనలకు ప్రతిబింబింపచేయాలి అనే ప్రక్రియ సరైన క్రిస్టలైజేషన్‌కు దోహద పడుతుంది. హలీవుడ్‌లో ఈ ఆలోచనా పరంపరను ఎక్కువగా ‘పిచ్చింగ్’ అని వ్యవహరిస్తారు. ఏ రసాన్ని పలికించాలనుకున్నా ఈ అంశాన్ని విస్మరించే అవకాశం ఉండదు. దీని స్థానం భ్రంశమైనపుడు, లేదా అసలు దీని గురించి ఆలోచనే లేనపుడు చేప్పేందుకు, వినేందుకు చూసేందుకు కూడా ఏమీ ఉండదు. ఏమిటి ఈ నాటకీయత?

వాస్తవానికి భిన్నంగా ఉన్న దాన్ని సామాన్యుడు నాటకం అనుకుంటాడు. నాటకీయత అనేది ఏ ఆలోచనా పరంపరనైనా, సాహిత్యంలోనైనా, సంగీతంలోనైనా, రూపకంలోనైనా, చలన చిత్రంలోనైనా ఒక ఆయువు పట్టు అని అర్థం. ఎంచుకున్న సంఘటనలో లేదా వ్యూహంలో కనిపించిన పాత్రలన్నీ వాళ్ల వైపు నుండి వాళ్లు చేసిన వన్నీ కరెక్టుగానే కనిపించి అందరి స్పందనలు సమస్యకు దోహదం చేసినట్లు కనిపించటంలో సహజమైన వ్యూహం నిర్మింపబడాలి. ఈ సంఘటనకు మరో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఇందులో జరిగినవన్నీ వెనుకకు తీసుకోలేని నిర్ణయాలుంటాయి. ఇక్కడి నుండి పతాకకు ఒక పరుగే కనిపించాలి…. ఒక సరళిలోకి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ అంశం పూర్తిగా లోపించిన చిత్రం ‘అంగ్రేజీ మీడియమ్’. మరి ఇది ఎలా రాణించగలదు అంటే ఇందులోని నటులు చూపించిన చక్కని నటనా కౌశలం. పైన పేర్కొన్న విషయాలు గొప్ప గొప్ప చిత్రాలలో చిక్కగా సాగినప్పుడు అందులోని నటులు ఆ ప్రక్రియలో కనిపించినందుకు పేరు సంపాదించేసి ఉంటారు. అది స్క్ర్రిప్ట్ రైటర్, దర్శకుని ప్రతిభ. అలా లేనప్పుడు చిత్రాన్ని అద్యంతం చూసేలా చేయటం గొప్ప కళాకారులకు తప్ప సాధ్యం కాదు.

‘హిందీ మీడియమ్’ విజయవంతమైన తరువాత (2017) ‘అంగ్రేజీ మీడియమ్’ వైపు దృష్టి సారించారు. ఒక మాములు మనిషి వ్యవస్థలో చిక్కుకొని హాస్యపు మాధ్యమం ద్వారా సందేశాన్ని ఇవ్వగలిగే వ్యవహారం సామాన్యంగా మంచి ఫార్ములానే.

ఇర్ఫాన్ ఖాన్ చంపక్ బంసల్ పాత్రలో నటించారు. ఈయన కుమార్తె తారిక పాత్రలో రాధిక మదన్ నటించింది. మామూలు మార్కులు తెచ్చుకునే ఈమెకు లండన్ వెళ్లి చదువుకొనే కోరిక ప్రబలంగా ఉంటుంది. 85% మార్కులు తెచ్చుకుని మిఠాయిల దుకాణం గల తన తండ్రిని గర్వపడేలా చేస్తుంది. టాపర్ లండన్‌కు వెళ్ళనని చెప్పటంతో ఈమెకు లండన్ వెళ్లే అవకాశం వస్తుంది. వార్షిక సమారోహంలో చంపక్ స్టేజ్ మీద వున్న జడ్జి గారి అనైతికతను దుయ్యబట్టి ప్రిన్సిపాల్ అయిన భార్య అని తెలియక తన కూతురికి ఆ అవకాశాన్ని వదులుకునేలా చేస్తాడు. చేసేదేమీ లేక మిత్రుని సహాయంతో దొంగ పాస్‌పోర్ట్‌లతో పాకిస్తానీ వ్యక్తులలా తన మిత్రునితో కలిసి లండన్ చేరుకుంటాడు. (ఈ అనైతకత మరి అతకదు కదా?)

అమ్మాయి అడ్మిషన్ కోసం తంటాలు పడతాడు. అమ్మయి చిరుద్యోగం చేసుకుంటూ ఆ జీవన శైలికి అలవాటు పడటం వలన తండ్రీ కూతురు మధ్య ఘర్షణ ఏర్పడి వేరుగా ఉంటాడు. మరో పాత్ర డింపుల్ కపాడియా తన కుమార్తె కరీనా కపూర్‌తో (పోలీసు డిపార్ట్‌మెంట్) సంబంధాలు చెడగొట్టకుని కాలం గడపుతూ ఉంటుంది. వీళ్లు ఆమెకు దగ్గరవుతారు. చివరకు లండన్ లోని లోఫర్ (పాత మిత్రుడు) సహాయంతో అడ్మిషన్ సంపాదించి స్వీట్లు తీసుకుని కూతురు వద్దకు వెళతాడు చంపక్. అక్కడ అసభ్యంగా కుర్రాడితో అక్కడి దుస్తులలో కనిపిస్తుంది తారిక. తనని తలుపు కొట్టి రానందుకు తప్పు పడుతుంది. రోడ్డు మీదకి వచ్చి ఆ స్వీట్ పాకెట్‌తో ఇర్ఫాన్ కదిలించే నటన చూపించాడు….

హావాలాలో మూడు కోట్లు తెప్పించుకుని దొరికిపోగా కరీనా వీళ్లని కాపాడేందుకు డింపుల్ సహాయం తీసుకుంటుంది (డింపుల్‌ను వీళ్లు ఒకసారి ఇంటిలో స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పుడు ఆస్పత్రికి తీసుకుని వెళ్లటం జరుగుతుంది).

ఆ కారులో అమ్మాయితో ప్రయాణం చేస్తున్నపుడు ఆమె ఇండియాలోనే చదువుకుని మిఠాయి దుకాణం బ్రాండ్‌ను ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా మారుస్తానంటుంది.

ఈ చిత్రానికి హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. అనిల్ మెహతా కెమెరా పనితనం బాగుంది. ఎ. శ్రీకర్ ప్రసాద్ కూర్పు పనితనంలో ఎంతో శ్రమ ఉన్నదని తెలుస్తుంది. ఇది ఇలా లేకపోతే చిత్రం దెబ్బతినేది. సచిన్-జిగర్, తనిష్క్ బాగ్లీల సంగీతం కూడా బాగుంది. ‘ఏక్ జిందగీ’ పాట ఆకట్టుకుంది.

రాధికా మదన్ తారికా బంసల్ పాత్రలో ఎంతో సహజంగా నటించింది. అక్కడక్కడ కెమారా ఫోకస్, ఫ్రేమ్‌వర్క్‌లలో ఈమెను చిత్రించినప్పుడు ఈమె ఫ్రేమ్ లోంచి జారిపోతుందా అనిపించింది. ఒక మంచి నటికి ఇది అన్యాయమే. ఎడిటర్ ఇలాంటివి మాస్టర్ లోంచి ఎంచుకున్నప్పుడు జాగ్రత్త వహించ వలసి ఉంటుంది. రాధికా మదన్ ఎన్నో బరువైన పాత్రలు చేయగలదనిపించింది. ‘పటాఖా’ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చింది. కొన్ని అవార్డులు కూడా ఇప్పించింది. ఈ చిత్రం ఈమెకు మంచి పేరు తీసుకుని వచ్చి కేవలం బుల్లి తెర ప్రతిభ కాకుండా వెండి తెర మీద మరింత ఎదగ గలదనిపించింది.

దర్శకుడు ‘కంపైలేషన్ షాట్స్’ అనే సాంకేతిక పరమైన విషయం మీద ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంది. ఒక దేశం నుండి ఇంకో దేశం వెళ్లినప్పుడు ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇవి అతికినట్లుండటం వలన చాలా చోట్ల ‘క్రాస్ కటింగ్’ కూడా దెబ్బతిన్నది.

ఇటువంటి ఇతివృత్తానికి ‘బ్రింగింగ్ అప్ బేబీ’, ‘హిస్ గర్ల్ ఫ్రెండ్’ వంటివి హోవర్డ్ హాక్స్ 1938/1939 లో నాంది పలికాడు. మన దేశంలో కూడా కొందరు వెటరన్స్ ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు మన నేటివిటిలో చేసారు. కాకపోతే ‘పర్‌మిసివ్ నేటివిటీ’ కథాపరంగా ఎంత భాగం హాస్యం సంవాదాలతో కలసి రాణించగలదు అనే విషయం మీద చిత్రనిర్మాణం ముందరే అధ్యయనం చేయటం చాలా అవసరం.

(రేటింగ్ 3/5)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here