అన్నమయ్య పద శృంగారం-11

0
2

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

లలిత

నీయందు నేమైనా నెరసు లెంచితిమా
చేయెత్తి మొక్కితేనేల సిగ్గువడేవు ॥పల్లవి॥
మంతనాన నిద్దరము మాటలాడుకొంటేను
అంతలో బెట్టుకొనేవు ఆనలు నీవు
సంతోసాన నీమోము సారె సారె జూచితేను
యెంతకెంత నీవేల యెగ్గుపట్టేవు ॥ నీయం॥
జవ్వనులము మాలోనే సన్నలు సేసుకొంటేను
యివ్వల సుద్దులు మమ్ము నేలడిగేవు
వువ్విళ్లూర నీమేనంటి వూడిగాలు సేసితేను
చువ్వన నీవెంత మాకు సోదనిచ్చేవు ॥ నీయం॥
కొమ్మల నిందరిని కొలువుకు బిలిచితే
కమ్మి యెంత మమ్ము నిట్టె కాగిలించేవు
యిమ్ముల శ్రీవేంకటేశ యెనసితి విన్నిటాను
తెమ్మలుగా మమ్ము నేమి తెలుపవచ్చేవు ॥ నీయం॥ (93)

భావము: ప్రియురాండ్రు అందరు వేంకటేశుని ఉదాసీనతను ప్రశ్నిస్తున్నారు.

శ్రీవెంకటేశ! మేము నీలో ఏమైనా దోషాలు లెక్కపెట్టితిమా? మేము చేతులు జోడించి మొక్కితే సిగ్గుపడుతావెందుకు? ఏకాంతంలో ఇద్దరం గుసగుసలుపోతే అంతలోనే నీవు వొట్టు పెట్టుకొంటావు. సంతోషంతో మాటిమాటికి నీముఖం చూచితే నీవు ఎంతలేసి నిందలు వేస్తున్నావు! యౌవనవతులమైన మేము మాలో సైగలు చేసుకొంటే, ఇక్కడ ఆ ముచ్చటలు చెప్పమని అడుగుతావెందుకు? ఎంతో సంబరంతో నీ శరీరం తాకి సేవలు చేసితే మేము బాధపడేలా నీవు శోధించావు (గాలించావు). వనితలనందరినీ నీ సేవలకు పిలిచితే దగ్గరగా కదిసి మమ్ములను వెంటనే కౌగిలించావు. ఇన్నిరకాలుగా నీవు విజృంభించావు. ఆర్ద్రతతో మాకు ఏమి చెప్పాలని వచ్చావు?

రామక్రియ

పడతుల గంటేనే పట్టలేవు తమకము
నడుమంత్రపుచెలులు నవ్వరా నిన్నును ॥ పల్లవి॥
చల్లువెదమాట లాడి సంగడినే గూచుండి
చిల్లరచేతలు సేసి చెక్కునొక్కేవు
యెల్ల వారిలోన నన్ను నేల సిగ్గువరచేవు
కొల్లలుగ యేకతాన గూడగరాదా ॥ పడ॥
పగటున నగి నీవాదము నామీద వేసి
మొగము చూచి నన్ను మొక్కుమనేవు
నిగిడి నిన్నింతలోనే నీవేల పచ్చిసేసేవు
వెగటేల మాయింటికి విచ్చేయరాదా ॥ పడ॥
చన్నులపై జేయివేసి సరుగున కాగిలించి
కన్నుల జొక్కించి మోవి గంటిసేసేవు
యిన్నిటా శ్రీ వేంకటేశయేల చిమ్మిరేదేవు
మన్నించితి విట్లానే నెంమ (నెమ్మ)ది నుండరాదా ॥ పడ॥ (94)

భావము: చిలిపి చేష్టలు మానుకోమని సతి శ్రీవేంకటేశుని మందలిస్తోంది.

శ్రీవేంకటేశ! యువతులను చూచితేనే మోహాన్ని అణచుకోలేవు. నిన్ను చూచి నడమంత్రపు సఖులు నవ్వరా? బాధపెట్టే మాటలు నాతో మాట్లాడి చిలిపి చేతలతో నా చెక్కిలి నొక్కావు. దగ్గరగా కూర్చుని అందరిలో నేను సిగ్గుపడేలా ఎందుకు చేస్తావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లయినా కలియరాదా? చిలిపిగా నవ్వి నీ పాదాన్ని నామీద వేసి నా ముఖం చూచి నన్ను మొక్కమని కోరావు. ఇంతలోనే నీవేల ఆరడి చేస్తున్నావు? నీకు వెగటు ఎందుకు? మా యింటికి రారాదా? నా చనుదోయిపై చేయివేసి వెంటనే కౌగిలించి కళ్లతో మోహ పరవశనుజేసి నా పెదవిపై గాట్లు పెట్టావు. ఇన్ని రకాలుగా విజృంభింపజేశావు. నన్ను గౌరవించావు (మన్నించావు) ఇలానే నెమ్మదిగా ఉండరాదా నీవు?

కా(కాం)బోది

ముద్దరాలవైతేనేమి మోహము చూపగవద్దా
కొద్దిమీర పతివద్ద గూచుండ వే ॥ పల్లవి॥
చెక్కుచేయేల పెట్టేవే సిగ్గులేల నెరపేవే
చిక్కనిచెమటలేల చిందేవే
నిక్కిచూచి రమణుడు నిమ్మపండు చేతికిచ్చి
మక్కువతో నందుకొని మాటలాడవే ॥ ముద్ద॥
దప్పుల బొరలేవేలే తలవంచుకొననేలే
ముప్పిరి నీగుబ్బలేల మూసిదాచ (చే) వే
కప్పురము(పు?) మోవి జూపి కాంతుడు నిన్ను లాలించీ
వొప్పుగఁ జేకొని నీవూ నుపచరించవే ॥ ముద్ద॥
నీవి వదలగనేలే నివ్వెరగు చూపనేలే
కావికన్నుల వేల కడుబొక్కే వే
యీవల శ్రీవేంకటేశు డింతలోనె నిన్ను గూడి
వేవేగ నీప్రియములు వెలయించవే ॥ ముద్ద॥ (95)

భావము: ముగ్ధ అయిన కాంతకు హితోపదేశం చేస్తోంది చెలి.

ఓ సఖీ! నీవు ముద్దరాలివైతేనేమి? నీ ముఖం పతికి చూపవద్దా? దగ్గరగా పతి దగ్గర కూర్చొనవే. బుగ్గలపై చేయి వేయడమెందుకు? సిగ్గులు పడతావెందుకు? దట్టమైన చెమటలు వొంటి నిండా నింపావెందుకు. తలపైకెత్తి చూచి ప్రియుడు నీ చేతికి ఆదరంతో నిమ్మ పండునిస్తే ప్రేమతో అందుకొని మాట్లాడవే! తప్పులు భావిస్తూ అందులోనే పొరలాడుతూ తలవంచుకొనడమెందుకే? బలిష్ఠమైన నీ చనుదోయిని చేతులతో మూసి దాచడమెందుకు? నీ విభుడు కర్పూరపు పెదవి జూపి నిన్ను లాలిస్తున్నాడే! చీరముడి వదలడమెందుకే! ఆశ్చర్యపడటమేలే, అందంగా భావించి నీవు కూడా సేవలు చేయవే. ఎర్రనైన కళ్లతో ఎందుకు బాధపడతావు? ఇక్కడ ఇంతటనే శ్రీవేంకటేశుడు నిన్ను కలిశాడు. త్వరగా నీ ప్రేమను తెలియజేయవే!

నాదరామక్రియ

ఔనయ్య తగవు నే డట్టిదె కాదా
మోనముతోడుత నీకు మొక్కు మొక్కేను ॥ పల్లవి॥
చెక్కు నొక్కి జవరాలు చేరి నిన్ను వేడుకొని
వుక్కు మీరి గుబ్బలు నిన్నారయగాను
యిక్కువల దొలుత నిన్నేమని తిట్టెనోకాని
పక్కన నింతటిలోనే పంతమిచ్చెను ॥ ఔన॥
కమ్మటి గాగిట నించి కడు నిన్ను లాలించి
సమ్మతి మోవితేనెలు చవిచూపుతా
యిమ్ముల దొలుత నిన్ను యేమిసేసెనో కాని
ముమ్మాటికి నీకు బ్రియములు చెప్పెను ॥ ఔన॥
తమకించి నిన్నుగూడి తమ్ములనకు నోరొగ్గి
ప్రమదాన దురుము నీపై నొరగగా
అమర శ్రీవేంకటేశ యంతలో నన్నేలితివి
సమమోహాలని యాపె సారె సారె మెచ్చెను ॥ ఔన॥ (96)

భావము: ముద్దరాలైన సఖిని లాలించవయ్యా! అని చెలులు వేడుకొంటున్నారు.

శ్రీ వెంకటేశ! ఆనాడు మీ తగవులాటు అలాంటిదే గదా! ఔనయ్యా! మౌనంగా మా సఖి నీకు మొక్కుతోంది. బలమైన చనుదోయి నిన్ను తాకగా బుగ్గనొక్కి ముద్దరాలు నీ దగ్గరకు వచ్చి వేడుకొంటోంది. సంకేత స్థలాలలో ఇంతకు ముందు నిన్ను ఏమని తిట్టిందోగాని, ఇంతలోనే నీ పక్కన చేరి ప్రతిజ్ఞ చేసింది. అంగీకారంతో పెదవి తేనెలను నీకు రుచి చూపుతూ అందంగా కౌగిటిలో చేర్చి నిన్ను లాలించింది. ప్రియంగా ఇంతకు ముందు నీకేమి చేసిందో గాని, ఇప్పుడు తప్పనిసరిగా ముచ్చటలాడుతోంది. సంతోషంతో కొప్పు నీపై జారగా మోహంతో నిన్ను చేరి తాంబూలానికి నోరు తెరచింది. అంతలోనే నీవు నన్ను ఏలుకున్నావు. సమానమైన మోహాలు గదా అని మాటిమాటికీ నిన్ను మెచ్చింది. తొల్లింటి తప్పులు మన్నించమని చెలి వేడుకొంటోంది.

రేకు 817

ముఖారి

తానే యెఱుగుగాక దండనున్నాడు విభుడు
యీనేరుపు లీకత లేమని చెప్పుదునే ॥ పల్లవి॥
చిత్తములోపలిసిగ్గు చెప్పరాదు
బతితోడితలపోత భావించరాదు
గుత్తపుగుబ్బలవుబ్బు గురి లేదు
యిత్తల నోచెలులాల యేమని చెప్పుదునే ॥ తానే॥
వాడికనాకోరిక వశగాదు
వేడుకకు నెంతైనాను వెలలేదు
వోడక నాతమకము వారువరాదు.
యీడనె నాయడియాస లేమని చెప్పుకునే ॥ తానే॥
తొట్టుకున్న జవ్వనము దొబ్బితే బోదు
చుట్టుకున్న నావలపు చూపరాదు
యిట్టె శ్రీవేంకటేశు డింతలోనె నన్ను గూడె
యెట్టనెదిటి సంతోస మేమని చెప్పుదునే ॥ తానే॥ (97)

భావము: తన విభుడు తనను నిర్లక్ష్యము చేస్తున్నాడని కొంత బాధపడతోంది.

ఓ సఖీ! నా బాధలు ఏమని చెప్పేది? నాపక్కనే వున్న విభునికి అన్నీ తెలుసు. అతడి నేర్పరితనము, ఈ కథలు ఏమని చెప్పేది? మనసులోని సిగ్గులు చెప్పలేను. భక్తితో గూడిన ఆలోచనలు వూహించలేను. బలమైన చన్నుల గొప్పదనంపై గురిలేదు. ఓ చెలులారా! ఇప్పుడు నా బాధ ఏమని చెప్పేది? నా విభుడు నా కోరికకు వశముకాడు. సరదాపడు వేడుకకు ఎంతైనా విలువలేదు. తగ్గని నా మోహాన్ని నేను ఓర్వలేను. ఇక్కడ నా అత్యాశలు ఏమని చెప్పేది? అధికమైన నా యౌవనం తొలగదోస్తే పోదు. అల్లుకున్న నా ప్రేమను ప్రకటించలేను. ఇంతలోనే శ్రీవేంకటేశుడు నన్ను కలిశాడు. ఎదురుగా వచ్చిన సంతోషాన్ని ఏమని చెప్పుదునే – అని సతి తన వేదనను వెల్లడిస్తోంది.

శ్రీరాగం

అంగనా నీవును మాటలాడుకోరయ్యా
చెంగటనున్న చెలులు సేసేపని యేదయ్యా ॥పల్లవి॥
వలపు లినుమడించే వాడికె లెదిరించె
చెలికి నీకు వావులు చిగిరించెను
తలపులు దైవారె తమకములు సందించే
యెలమి సుద్దులు మమ్ము నేమడిగేవయ్యా ॥అంగ॥
కొనచూపులు గదిసె కోరిక అల్లుకొనె
మనసులిద్దరివిని మర్మము లంటె
ననుపులు సరిదాకె నవ్వులు వియ్యములందె
యెనలేనివిచారము లిక నేటికయ్యా ॥అంగ॥
మోవు లొక్కమరె మాగె మోహము లొండొంటి ముట్టె
భావించ సమరతులు బంతికి వచ్చె
శ్రీవేంకటేశ యింతి జేకొని కుడితివిట్టె
యీవేళ నీసంతోసము లెంత చూపేవయ్యా ॥అంగ॥ (98)

భావము: ఓ స్వామీ! మీ యిద్దరి ప్రవర్తనలు గమనిస్తే అన్యోన్య ప్రేమ పైకి కనిపిస్తోంది. నీవు మా సఖిని ఏలుకోమని చెలి చెబుతోంది. శ్రీ వేంకటేశ! మీ సమీపంలో వున్న చెలులు చేసే పని ఏమున్నది. నీవును, ఆమె కలిసి మాట్లాడుకోండి. మీ ప్రేమలు రెట్టింపు అయినాయి. మీ వాడుకలు ఎదురు వచ్చాయి. మా చెలికీ, నీకు వావివరుసలు చిగురించాయి. ఆలోచనలు పొంగి పొరలాయి. మోహాలు కుదురుకున్నాయి. అలాంటప్పుడు ప్రీతితో నీవు ముచ్చటలు మమ్ములను ఏమని అడుగుతున్నావు. క్రీగంటి చూపులు దగ్గరయ్యాయి. కోరికలు అల్లుకొనిపోయాయి. మీ ఇద్దరి మనసులు రహస్య స్థావరాలను చేరుకున్నాయి. ప్రియాలు కలిసిపోయాయి. నవ్వులు పరస్పరం వియ్యమందుకొన్నాయి. ఇంకా అంతులేని దిగులు ఎందుకయ్యా! ఇద్దరి పెదవులు ఒక్క సారిగా మారిపోయాయి (రుచితో) మోహాలు పరస్పరం కలుసుకున్నాయి. సమరతులు పంక్తికి చేరాయి. ఓ స్వామీ! ఈ విధముగా ఇంతిని చేపట్టి క్రీడించావు. ఈ రోజు నీ ఆనందాన్ని ఎంత ఘనంగా చూపిస్తున్నావయ్యా!

లలిత

ఇటువలె నుండవద్దా యిద్దరిపొందు
తటుకన నీడేరె దనకు నాకిపుడు ॥పల్లవి॥
నేరుపు గలిగితేను నేస్తము లొనగూడు
మేరలోనే వుండితేను మించు వేడుక
వోరుచుకొంటేను వొద్దికొను సరసము
తారుకాణలాయ నాకు దనకు నేడిపుడు ॥ఇటు॥
చనవులు నెరపితే జవులుపుట్టు గాపురము
ననువులు జరపితే నవ్వులురేగు
చెనకులు బలిసితే సిగ్గులు మొదలౌను
మనసులు సరిదాకె దనకు నాకిపుడు ॥ఇటు॥
అంటిముట్టి పెనగితే నాయములు గరగును
జంటవాయకుండితేను సతమౌ మేలు
ఇంటిలోన శ్రీ వేంకటేశుడు తా నన్ను గూడె
దంటతనా లుప్పతిల్లె దనకు నాకిపుడు ॥ఇటు॥ (99)

భావము: ముద్దరాలైన ఓ వనిత తన ప్రియునితో సఖ్యతను చెలికి వివరిస్తోంది.

ఓ సఖీ! మా యిద్దరికీ వెంటనే ఇప్పుడు కోర్కెలు సఫలమైనాయి. ఈ పొందు ఇలానే వుండిపోవాలి గదా! నేర్పుగా వుంటేనే స్నేహాలు సమకూరుతాయి. ఎవరి హద్దులలో వారుంటే సరదాలు అధికమవుతాయి. ఓర్చుకొని వుంటేనే సరసాలు దగ్గరవుతాయి. మా యిద్దరికీ అలాంటి ఉదాహరణలు (తార్కాణలు) కన్పిస్తున్నాయి. సంసారంలో చనవులు కొనసాగితే రుచులు పుట్టుతాయి. ప్రియంగా వుంటే నవ్వులు వృద్ధి పొందుతాయి. నొక్కులు అధికమైతే సిగ్గులు ఆరంభమవుతాయి. మా యిద్దరికీ మనసులు ఇప్పుడు కలిశాయి. ఇద్దరం గాఢంగా పెనగులాడితే మర్మస్థానాలు తృప్తి నొందుతాయి. ఇద్దరం ఒకరినొకరు ఎడబాయక జీవిస్తే నిరంతరం మేలు కలుగుతుంది. మా యిద్దరికీ ఇప్పుడు నేర్పరితనాలు పుట్టాయి. ఇంటిలోనే శ్రీ వేంకటేశుడు నన్ను కలిశాడు.

భైరవి

పడతి నెప్పుడు నీవు పాయనివాడవె కాక
నిడి సాగిలె నీపెకు నీమీదిచింత ॥పల్లవి॥
నెలతకొప్పుపై నవే నీవువెట్టిన సేసలు
తలచుకున్నది నీతగుబాసలు
వలపులలో నున్నది (వి?) వడి నడియాసలు
యెలమి నీవెందుండినా నికనేల చింత ॥పడ॥
చన్నులపైనే వున్నవి చక్కని నీరేకలు
సన్నల నవ్వేనవ్వుల సమజోకలు
కన్నులెదుట నున్నవి గక్కన నీరాకలు
మన్నిం చెప్పుడు వచ్చినా మరియేల చింత ॥పడ॥
కూడిన కాగిట మించె గురుతైన నీ పొందులు
వాడికెమోవితేనెల వచ్చె విందులు
యీడనె శ్రీ వేంకటేశ యేలితి వీకె నిట్టె
జోడుగా ఫలించె నీకు జూపనేల చింత ॥పడ॥ (100)

భావము: శ్రీ వేంకటేశునితో తమ సఖి విరహాన్ని చెలి వివరిస్తోంది.

శ్రీ వేంకటేశ! మా సఖిని నీవెల్లప్పుడూ వదలిపెట్టనివాడవు. నీ మీది భ్రమ కాకలుదేరి సాగుతున్నది. ఆమె కొప్పుపైన నీవు పెట్టిన ఆక్షింతలు ఇంకా అలానే ఉన్నాయి. ఆమె నీవు చేసిన బాసలు తలచుకొంటూ వుంది. ఆమె ప్రేమలలో అధికమైన అడియాసలు ఉన్నాయి. నీవెక్కడున్నా అమె దిగులుపడనేల? నీవు గోటితో నొక్కిన గాట్లు అలానే ఆమె చనుదోయిపై కన్పిస్తున్నాయి. అలానే ఆమె పక్కనే చేరి నవ్విన నవ్వులు సమానమైన సౌందర్యాలు. నీవు వచ్చిన వైనాలు ఆమె కళ్ల ఎదుట ప్రత్యక్షమయ్యాయి. మరి ఆమెను ఆదరించి నీవు ఎప్పుడు వచ్చినా దిగులెందుకు? మీ యిద్దరి కౌగిలింతలలో గురుతుగా నిలిచిన నీతోడి క్రీడలు మించిపోయాయి. వాడుకగా పెదవిపై తియ్యందనాలు విందులైనాయి. ఇక్కడే ఈ విధంగా స్వామీ! ఏలుకున్నావు. జత కలిసి ఫలించిన వివరాలుండగా దిగులుపడనేల.

ముఖారి

చేయిపట్టి తియ్యనేలే చెలులాలా
యీయెడనే వున్నవాడు యేలుకొనీగాక ॥పల్లవి॥
సరసమాడెడువాడు సంగాతము సేయడా
మరిగినవాడు నన్ను మన్నించడా
వరుసకువచ్చేవాడు వలపులు చల్లడా
వెరవెఱగక యేల వేగిరించేరే ॥చేయి॥
చనవులిచ్చినవాడు సంగడి గూచుండడా
మనసెరిగినవాడు మాటలాడడా
కనుగొన్నవాడు యిక గాగిలించుకొనడా
తనివిబొందక యేల తమికించేరే ॥చేయి॥
కూడిమాడినవాడు గుట్టు నాకు జెప్పడా
వాడికెక్కినవాడు నావసమేకాడా
యీడనే శ్రీ వేంకటేశు డిన్నిటాను నన్ను నేలె
లియ యెంత సారె బెనగేరే ॥చేయి॥ (101)

భావము: సఖి తన చెలుల ఆగడాలను వారిస్తూ తన నాయకుడు మన్నిస్తాడని పలికింది.

ఓ చెలులారా! నాచేయి పట్టుకొని విడదీయనేలనే? ఇక్కడే ఉన్నాడు గదా విభుడు ఏలుకోనిండు. నాతో సరసాలాడే వాడు స్నేహం చేయలేదా? నన్ను అలవాటుపడినవాడు మన్నించడా? (ఆదరించడా?) వావివరసలు కలిపేవాడు ప్రేమను చిలకరించడా? ఉపాయం తెలిసికొనేలోగా తొందరపెడతారెందుకు? నాకు చనువులిచ్చిన యాతడు నా పక్కన కూర్చోడా? నా మనసు తెలుసుకున్నవాడు నాతో ప్రియంగా మాట్లాడడా? నన్ను చూచినవాడు కౌగిలించుకోడా? తృప్తిని పొందకుండా ఎందుకు తొందరపెడతారు? నాతో కలిసిమెలసి వున్నవాడు తన రహస్యం నాకు చెప్పడా? నాతో అలవాడుపడినవాడు నాకు వశం కాకపోతాడా? ఇక్కడనే అన్నిరకాలుగా శ్రీవేంకటేశుడు నన్ను ఏలుకొన్నాడు. ఆ జాడలు తెలియక మీరు మాటిమాటికి ఎందుకు పెనగులాడతారు?

ధీరురాలైన వనిత తనకు పతి వశంవదుడని నమ్మింది.

శుద్ధవసంతం

ఏమిసేతుమయ్య నిన్ను నేమిటా గెలువరాదు
ఆముకొన జనవిచ్చి యాసలు రేచేవు ॥ పల్లవి॥
పెనగితే బెళికి తప్పించుకొనజూచేవు
చెనకితే దలవంచి సిగ్గువడేవు
మొనసి సన్న సేసితే మూతులు గిరిపేవు.
ననుపు నటించితేను నవ్వులు నవ్వేవు ॥ ఏమి॥
నుడిగితే నెంతయినా బొడవులు సూపేవు
తడవితే రాచపంతాలు మీరేవు
బడివాయకుండగానే బాస అడుగవచ్చేవు
వొడివట్టీతే జలధి నెడముగొనేవు ॥ ఏమి॥
పొంచి మోము చూచితే పొందులే బోధించేపు
అంచల మొక్కితేనే వయ్యాళి చూపేవు
మంచితనాలనే నన్ను మన్నించితి విటు కూడి
ముంచి శ్రీ వేంకటేశుడ మోవి లంచమిచ్చేవు ॥ ఏమి॥ (102)

భావము: ఈ కీర్తనలో దశావతారాలను భంగ్యంతరంలో నాయిక వర్ణించింది.

శ్రీ వేంకటేశుడా! నిన్ను ఏ విధముగాను గెలువలేము. మేము ఏమి చేయగలము? నిన్ను కౌగిలించడానికి చనవులిచ్చి నాలో ఎన్నో ఆశలు రేపావు. నీతో పెనగులాడబోతే విలాసంగా తప్పించుకోబోతావు (మత్స్య); నొక్కులు నొక్కితే తలవంచుకొని సిగ్గుపడతావు (కూర్మ), దగ్గరగా వచ్చి సైగ చేస్తే మూతి ముడుచుకొంటావు (వరాహం); ప్రియాన్ని నటిస్తే నవ్వుతున్నావు (నారసింహ), నిన్ను విడిచిపెడితే ఎంతో పొడవులు చూపావు (వామన), నిన్ను తాకితే రాజులపై పంతాలు పెంచావు (పరశురామ), నీకు దూరం కాకుండా బాసలు అడగాలని వచ్చావు (రామ); వొడి పట్టుకుంటే సముద్రాన్ని దారి ఇమ్మని కోరావు (కృష్ణ); ఎదురుచూచి నీ ముఖం చూచితే కూడి వుండటాన్ని బోధిస్తున్నావు (బుద్ధ); పక్కన నిలబడి నమస్కరిస్తే స్వారీ చూపుతున్నావు (కల్కి). నన్ను ఆదరంతో మన్నించి ఇటు చేరి పారవశ్యంలో ముంచి నీ పెదవి లంచమిచ్చావు. వివిధ అవతారాలు దాల్చిన విష్ణువే శ్రీ వేంకటేశుడని భావన.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here