Site icon Sanchika

అన్నమయ్య పద శృంగారం-18

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

శ్రీరాగం

రాఁడంటా నుంటివి రమణుఁడు నీవద్దికి
పోఁడిమి నీసకినా లిప్పుడు నిజమాయను ॥పల్లవి॥
చెక్కిటి చెయ్యేంటికే చిత్తపునుయ్యేంటికే
నిక్కిచూడవే ప్రతి నిలుచున్నాఁడు
మొక్కవే చేతులెత్తి మొగము చూచీ నతఁడు
నిక్కలలాయ నేఁడు నీవు గన్న కలలు ॥రాఁడం॥
సిగ్గులేకరఁగులేలే చెలులమరఁగులేలే
వొగ్గి కొలువు సేయవే వొంటినున్నాఁడు
దగ్గరి యెదురుకోవే తానే వచ్చీ నతఁడు
బగ్గన నీనోములెల్ల ఫలియించె నవిగొ ॥రాఁడం॥
నేలవాఁ (వ్రాఁ?)త లిదియేమే నీతలపోఁత లిదేమే
యేలుమనవే శ్రీ వేంకటేశుఁ డున్నాఁడు
మేలమాడవే అలమేలుమంగ వాతఁ డేలె
కోలుముందై తలకూడె కోరిన కోరికలు ॥రాఁడం॥ (163)

భావము: రాడనుకున్న పతి వచ్చాడు. దిగులు మానమని చెలులు అలమేలు మంగకు హితవు చెబుతున్నారు.

ఓ భామా! నీ రమణుడు నీ వద్దకు రాడంటూ ఉంటివి. నీకు కన్పించిన శకునాలు ఇప్పుడు నిజమైనాయి. చింతపడుతూ చెక్కిలిపై చేయి వేయవలసిన గతి ఎందుకే? అదుగో! తలఎత్తి చూడవే! నీపతి నీ ఎదుట నిలబడి ఉన్నాడు. నీవు కన్న కలలు ఈనాడు నిజమైనాయి. నీ ముఖం అతడు చూస్తున్నాడు. చేతులెత్తి నమస్కరించవే. సిగ్గులలో మునిగిపోనేల? చెలుల చాటున దాగి కొననేల? వొంటరిగానున్నాడు గదా తలయొగ్గి సేవలు చేయవే! నీవు నోచిన నోములన్నీ వెంటనే ఫలించాయి. అతడు వస్తున్నాడు. దగ్గరగా వెళ్లి ఎదురుకోవమ్మా! సిగ్గుతో నేల మీద గీతలు వ్రాయడమెందుకు నీ ఆలోచన లేమి ఉన్నాయే. శ్రీ వేంకటేశుడున్నాడు గదా ఏలుకొమ్మనవే. నీవు అలమేలుమంగవు గదా. మున్ముందుగా నీవు కోరిన కోర్కెలు ఫలించాయి. అతడు నిన్ను ఏలుకొన్నాడు – అని సరసమాడింది చెలి.

దేశాక్షి

చూచి వచ్చితి నీవున్న చోటికిఁ దోడి తెచ్చితి
చేచేతఁ బెండ్లాడు చిత్తగించవయ్యా ॥పల్లవి॥
లలితాంగి జవరాలు లావణ్యవతి యీకె
కలువకంటి మంచికంబుకంఠి
జలజవదన చక్రజఘన సింహమధ్య
తలిరుఁబోడిచక్కఁదన మిట్టిదయ్యా ॥చూచి॥
అలివేణి మిగులనీలాలక శశిబాల
మలయజగంధి మహామానిని యీకె
పెలుచుమరునివిండ్ల బొమ్మలది చారుబింబోష్ఠి
కనితకుందరద చక్కందన మిట్టిదయ్యా ॥చూచి॥
చెక్కుటద్దముల దిది శ్రీకారకన్న(ర్ణ?) ములది
నిక్కుఁజన్నుల రంభోరు నిర్మలపాద
గక్కన శ్రీ వేంకటేశ కదిసె లతాహ
దక్కెనీకీ లేమచక్కందన మిట్టిదయ్యా ॥చూచి॥ (164)

భావము: కవిసమయాలతో స్త్రీ అంగాంగ సౌందర్యాన్ని చెలి వర్ణిస్తోంది.

శ్రీవేంకటేశ! భామను నేను చూచి వచ్చాను. నీవున్న చోటికి ఆమెను తీసుకొని వచ్చాను. చిత్తగించి స్వయంగా పెండ్లాడవయ్యా! ఈమె సౌందర్భవతి. యౌవనంతో వున్న లలితాంగి. కలువపూలవంటి కన్నులు గలది. శంఖము వంటి కంఠము గలది. పద్మము వంటి ముఖము, విస్తారమైన పిరుదులు, సింహము నడుమువంటి నడుము గలిగిన ఈ పూబోడి చక్కదనమిటువంటిది. ఈ స్త్రీ మిక్కిలి నల్లని ముంగురులు గలది. చంద్రుని వంటి నుదురు, చందన సుగంధి, అయిన ఈమె గొప్ప మానము గలది. మన్మథుని విల్లుల వంటి అందమైన కనుబొమలు, ఎర్రని దొండపండువంటి పెదాలు, తెల్లని పలువరుస కలిగిన ఈమె సౌందర్యము అటువంటిదయ్యా! ఉన్నతమైన చనుదోయి, అరటి బోదెలవంటి తొడలు, నిర్మలమైన పాదాలు కలిగిన లతాంగి నిన్ను వెంటనే కౌగిలించింది. ఇంతటి సౌందర్యం కలిగిన ఈ భామ నీకు దక్కిందయ్యా!

ఆహిరి

తలపోసి తలపోసి తమకించీ నామనసు
చెలులాల ఆతఁ డేమి సేసీనొకో ॥పల్లవి॥
యెలయించినవాఁడు ఇంటికి రాఁడొకొ
చెలుల నంపితి మాఁట చేకొనెనొకొ
కలువల వేసినాఁడు కరుణించకుండునొకొ
సొలసి చూచినవాఁడు చుట్టమై చిక్కఁడొకొ ॥తల॥
మచ్చికచల్లినవాఁడు మంతనములాడఁడొకొ
ఇచ్చగించినాఁడు చనవియ్యఁడొకొ
కచ్చు పెట్టినవ్వేవాఁడు కప్పురవిడె మీఁడొకొ
వచ్చినవాఁ డిఁకను నావద్దనే వుండీనొకొ ॥తల॥
వేడుక సేసినవాఁడు వీడుజోడై చొక్కఁడొకొ
వాడికచూపినవాఁడు వసమౌనొకొ
యీడనె శ్రీ వేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
కూడినవాఁడు నాబత్తి గొబ్బన మెచ్చునొకొ ॥తల॥ (165)

భావము: పతి విముఖతకు పరాకు చెందిన వనిత సఖులతో తన సంశయాలు బయట పెడుతోంది.

చెలులార! నా విభుడు ఏ మాయజేసెనో గాని, నా మనసు అతనిని గూర్చి నిత్యమూ తలపోసి మోహిస్తోంది. నాపై ఆసక్తి కలిగించినవాడు ఇంటికి రాడా? నేను పంపిన చెలుల మాటలు విన్నాడా? నాపై పూలబంతులు విసిరినవాడు దయ తలచడా? ప్రేమతో చూచినవాడు నాకు చుట్టమై చిక్కడా? నాపై మత్తుమందు చల్లిన విభుడు ఏకాంతానికి రాడా? నన్ను ఇష్టపడిన వ్యక్తి నాకు చనవునియ్యడా? పంతంగా నవ్వే వ్యక్తి వీడెము అందివ్వడా? నా దగ్గరకు వచ్చినవాడు, ఇక్కడే వుండిపోడా? నాతో సరదాపడ్డ వ్యక్తి ఈడుజోడుగా పరవశించడా? నా దగ్గరకు తరచు వచ్చే మనిషి నాకు వశ పడడా? నాతో కూడిన విభుడు నా భక్తిని వెంటనే మెచ్చుకుంటాడా? ఇక్కడనే శ్రీవేంకటేశుడు అన్నిరకాలుగా నన్ను మెచ్చుకొన్నాడు – అని చెబుతోంది

కేదారగౌళ

అతిరాజసపువాఁడు ఆతఁడు దొల్లె
మతకమున నిన్నెంత మన్నించునో సుమ్మీ ॥పల్లవి॥
చిగురులు వేసేవు చెనకేవు కొనగోర
మగవానితో నెంతమారుకొనేవే
యెగసక్కేలకు నాతఁ డేమి సేసునో నిన్ను
ఇగురుఁబోడివి నేము యెఱఁగముసుమ్మీ ॥అతి॥
చేరి పంతాలాడేవు చెయిపట్టి పెనఁగేవు
సారెఁ బతితో నెంత చయ్యాటాలే
మారుకు మారాతఁడు మరియెంత సాదించునో
నారీమణి యిందరిలో నగుఁబాటుసుమ్మీ ॥అతి॥
జంకించేవు బొమ్మలను చలాలకే నవ్వేవు
యింక శ్రీ వేంకటేశుతో నింత యేఁటికే
అంకెల నిన్నాతఁ డేలె నటు వొంటిఁ జిక్కించుక
చింకచూపులాడి వీనిచి త్తము సుమ్మీ ॥అతి॥ (166)

భావము: ప్రౌఢ అయిన నాయిక ప్రియుని వశపరచుకొనడానికి చేసే ప్రయత్నాలను చెప్పి చెలులు ఎకసెక్కములాడుతున్నారు.

ఓ నారీమణీ! నీ విభుడు పూర్వము మిక్కిలి రాజసం గలవాడు. మాయలతో నిన్నెంత మన్నించెనోగదా! పెదవులపై గాట్లు వేశావు. కొనగోటితో గీరావు. ఎగసెక్కము లాడావు. అతడేమి చేస్తాడో గదా! నీవేమో ముద్దరాలివి – ఇకపై మాకేమీ తెలియదమ్మా! అతని దగ్గరచేరి పంతాలాడుతున్నావు. చేయి పట్టుకొని పెనగులాడుతున్నావు. మాటిమాటికీ నీ విభునితో సయ్యాటలెందుకే? బదులుకు బదులుగా అతడెంత సాధిస్తాడో? సఖీ! నలుగురిలో ఇది నగుబాటు గదా! కనుబొమలతో బెదిరిస్తున్నావు. పట్టుదలగా నవ్వుతున్నావు. జింక చూపులు చూచి వీని మనసు చిక్కించుకొన్నావు. ఇంత వగలెందుకే ! శ్రీవేంకటేశుడు నీకు వశపడి ఏలుకొన్నాడే – అని చెలులు సయ్యాటలాడారు.

సామంతం

తరుణి జవ్వనపుఁదపము సేయఁగను
వరుసతోడ జాతివైరము లుడిగె ॥పల్లవి॥
జక్కవపులుగులు జంటవాయవివె
గక్కన వెన్నెలగాసినను
యెక్కడఁ గోవిలయెలుఁగులు చెదరపు
గుక్కక వానలు గురిసినను ॥తరు॥
గుంపుఁదుమ్మెదలు గొబ్బున బెదరవు
సంపెఁగతావులు చల్లినను
ముంపునఁ జకోరములు వసివాడవు
సొంపుఁగళలు(ల?) పెనుసూర్యుఁ డుండఁగను ॥తరు॥
చిలుకలు సందడి సేసినఁ దొలఁగవు
కలసినసమరతికయ్యమున
యెలమిని శ్రీ వేంకటేశుఁడు గూడఁగ
చెలియంగములని చెప్పఁగఁ బొసఁగె ॥తరు॥ (167)

భావము: యువతి అంగాంగాలను జక్కవలు, కోకిలలు, తుమ్మెదలు, చకోరములు, చిలుకలతో పోలుస్తారు. జాతివైరాన్ని అవి మరచి ఆమెలో పొదిగాయని అన్నమయ్య చమత్కరిస్తున్నాడు.

అలమేలుమంగ యౌవనపు తపస్సు చేయగా వరుసగా సహజమైన జాతివైరం సమసిపోయిందన్నట్లు ఆ చెలి అంగాంగములు వృద్ధి పొందాయి. వెన్నెల కురిసినా జక్కవ పక్షులు తమ జంటను ఎడబాయలేదు. విపరీతంగా వానలు కురిసినా ఎక్కడా కోకిల గొంతులు బెదరడం లేదు. సంపెంగ వాసనలు విరిసినా తుమ్మెదల గుంపులు వెంటనే బెదరి పారిపోలేదు. సూర్యుని ప్రతాపం ఉన్నప్పటికీ భయంతో చకోర పక్షులు కృశించలేదు. నాయికా నాయకులు సమరతి యుద్ధం చేస్తూ చేసిన సందడికి చిలుకలు దూరంగా వెళ్లలేదు. శ్రీవేంకటేశుడు అలమేలు మంగతో క్రీడించు సమయమున అవి ఆ చెలి అంగాంగములైనవి.

మధ్యమావతి

మిమ్మే యలుగునిచ్చు మీవలపులు
చిమ్మిరేఁగ రట్టు పెట్టి చెనకించుఁగాక ॥పల్లవి॥
వొట్టులు పెట్టుకొంటిరి వొకరొక రిందాఁకా
అట్టె యింతలో నొక్కటైతిరా మీరు
దిట్టవై కాఁతాళించి దీకొంటి రప్పటిని
గుట్టుతోడ లోలోనే కూడుకొంటిరా ॥మిమ్మే॥
తగపుచెప్పుమంటిరి తరుణుల నింతవడి
మొగమోడి మీరుమీరే మొక్కుకొంటిరా
బిగియుచుఁ గొంతవడి పెనఁగుకొంటా నుంటిరి
జిగిఁగూడి బాసలెల్లఁ జేసుకొంటిరా ॥మిమ్మే॥
వెక్కసాన మంచాలపై వేరేవుంటి రింతవడి
చొక్కపుమీ మొగములు చూచుకొంటిరా
పక్కన మీరిద్దరూను బలిమిఁ బైకొంటిరి
చక్కని శ్రీ వేంకటేశ జాణలైతిరా ॥మిమ్మే॥ (168)

భావము: అలమేలు మంగా వేంకటేశుల కయ్యాలు, మరుక్షణంలో సయ్యాటలు చూసి చెలులు ఎద్దేవా చేస్తున్నారు.

శ్రీ వేంకటేశ! మీ ప్రేమలు పెచ్చుమీరి రచ్చజేసి మీలో మీరు అలిగేలా చేస్తున్నాయి సుమా! ఇంతకుముందే ఒకరికొకరు వొట్లు పెట్టుకున్నారు. ఇంతలోనే మీరిద్దరూ ఒకటైనారు. అప్పుడు మీరు దిట్టతనంతో ఒకరిపై ఒకరు కోపపడి, ఇంతలో రహస్యంగా ఏకాంతంలో కలిశారా? ఇంతసేపు న్యాయం చెప్పమని సఖియలను కోరారు. అంతలోనే మొహమాటపడి ఒకరినొకరు మొక్కుకొన్నారా? బిగదీసుకొని కూచొని కొంతసేపు పెనగులాడారు. ఇప్పుడు అందంగా దగ్గర చేరి బాసలు చేసుకొన్నారా? వెక్కసపడి వేర్వేరు మంచాలపై ఇంతసేపు వున్న మీరు ఇప్పుడు అందమైన మీ ముఖాలు చూచుకొన్నారు. శయనమందిరంలో ఇద్దరూ కలియబడ్డారు. స్వామీ! ఇలా మీరిద్దరు జాణలైనారు – అని చెలులు సరసాలాడారు.

దేసాళం

ఒయ్యనే లాలించి చన వొసఁగవయ్యా
నెయ్యపుసాము సేసిననీచేతుల కోపునా ॥పల్లవి॥
మొలకసిగ్గులతోడి ములువాఁడిగుబ్బలది
బలిమిసేసి యేల పైకొనేవయ్యా
చిలుకపలుకుల లేఁజిగురాకు మోవిలేమ –
నెలయింపులను నేఁటి కలయించే వయ్యా ॥ఒయ్య॥
కడుఁబచ్చివయసుతోఁ గారుకొన్న మానిని –
నొడిపెట్టి తీసి యెంత వొరసేవయ్యా
చిడుముడినగవులచిఱుతతనాలబాల
నడుమ నెందాఁకాఁ బెనఁగులాడేవయ్యా ॥ఒయ్య॥
పసురుఁబాయమునఁ బరగినజవరాలు
పిసికి కాఁగిట నెంతబిగించేవయ్యా
కొసరి శ్రీ వేంకటేశ కొత్త పెండ్లికూఁతురు
యెసఁగి కూడితి విందు కెంతమెచ్చేవయ్యా ॥ఒయ్య॥ (169)

భావము: ముద్దరాలిని నయగారంతో పాలించమని చెలి వేడుతోంది.

శ్రీవేంకటేశ! మా చెలిని వెంటనే లాలించి చనవుచూపవయ్యా! మదనకేళిలో నీవు చేసిన చేష్టలు భరించగలదా? చిరుసిగ్గులతో అప్పుడప్పుడే పొటమరిస్తున్న చనుదోయి గలదానిని అలా బలవంతంగా పిసికి పట్టుకొంటే ఎలా? మృదువుగా చిలుకపలుకులు పలికే లేచిగురాకు పెదవిగల భామను పారవశ్యంతో ఎందుకు బాధిస్తావయ్యా! ఇప్పుడిప్పుడే యౌవనం వచ్చిన భామినిని కొంగుపట్టిలాగి దగ్గరవుతున్నావెందుకు? చిలిపి నగవుల చిలిపి చేష్టలుగల బాలను మధ్యలో పెనగులాడడమెందుకయ్యా! పచ్చి ప్రాయంలో వున్న ఈ ముద్దరాలిని పిసికి కౌగిట్లో బంధించడమెందుకయ్యా. కొత్త పెళ్లి కూతురితో కొసరికొసరి క్రీడించావు. ఇందుకు ఆమెను ఎంతమెచ్చావయ్యా! అని సున్నితంగా ప్రవర్తించమని చెలి హెచ్చరిస్తోంది.

శుద్ధదేశి

ఏలికసానికి నేము యితవరులము తొల్లె
నీలీలకు లోనైతే నీవేపాటి వట్టేవా ॥పల్లవి॥
బలిమి మాయక్క విన్నపములు సేతుముగాక
చెలికత్తెల కేంటికి సిగ్గువడను
తలకొన్న నీచేఁతలు తారుకాణింతుముగాక
యెలమి నీతో మాకు నేల మొకదాకిరి ॥ఏలి॥
కొద్దిమీర నాకెమారై కొసరుదు మింతేకాక
వద్దనున్న వారికేల వట్టినేస్తాలు
సుద్దులతో నీగుణాలు సోదించి కందుముగాక
కద్దులేదని మాకేల కప్పి పెట్టి దాచను ॥ఏలి॥
యీడ నిన్నలమేల్మంగతోడఁ గూరుతుము గాక
వూడిగపువారికేల వొడ్డారాలు
కూడితే వింతలో నింతిఁ గోరి శ్రీ వేంకటేశ నీ
వేడుక మెత్తుము గాక వింతలేల సేయను ॥ఏలి॥ (170)

భావము: చెలికత్తెలు తమ దోషమేమీ లేదని విన్నవించుకొన్నారు.

శ్రీ వేంకటేశ! నీ వేడుకలను మేము మెచ్చుకొంటామేగాక, నీవు వింతలు సేయనేల? ముందటి నుంచి మేము మా యజమానురాలికి మేలు కోరేవారమే. నీ మాయలకు లోనైతే నీవు ఎంత మాత్రం తక్కువా? మా అక్క (అలమేలుమంగ) బలవంతంగా చేస్తున్న విన్నపాలు విన్నవిస్తున్నాము. చెలికత్తెలమైన మేము సిగ్గుపడనేల? సిద్ధించిన నీ పనులను ఉదాహరణగా చెబుతామనిగాక, నీతో మాకు మొహమాటమేల? ఆమెకు ప్రతినిధులముగా కొద్దిగా నీతో కొసరుతాము. ఇంతేగాక దగ్గరలో వున్నవారికి నీతో స్నేహాలెందుకు? మంచిమాటలతో నీగుణగణాలు శోధించి కనిపెడతాముగాక. “ఉంది, లేదు” – అని రహస్యాలు దాచిపెట్టవలసిన అవసరం మాకేమి? ఇక్కడ అలమేలుమంగతో నిన్ను కలుపుతాముగాని, సేవకులమైన మాకు అసూయలెందుకు? – అని ఎద్దేవా చేస్తున్నారు.

వరాళి

కాముకునికేల తగవులు విచారించ
ప్రేమగలచోట మేలుపెంచు టింతేకాక ॥పల్లవి॥
పున్నమవెన్నెలవలె పొలఁతి నీతో నవ్వితే
సన్నలనేల తిట్టేవు చందురునిని
కన్నులకలువలను గక్కన నిన్నుఁ జూచితే
పన్ని మరునితోనేల పంతమాడేవయ్యా ॥కాము॥
ముక్కులైన చనుమొనల నిన్నొత్తితేను
జక్కవపిట్టలనేల సాదించేవు
నిక్కినకొనగోరను నీమేను దాఁకించితేను
దక్కక మొగలిరేకుకొన రచనేలయ్యా ॥కాము॥
పలుకుల వెంగేలు పలుమారు నిన్నాడితే
చిలుకలనేల జంకించేవయ్యా నీవు
అలమి శ్రీ వేంకటేశ ఆకె రతి మించితే
చెలికత్తెల నెంత సంతోసించేవయ్యా ॥కాము॥ (171)

భావము: విరహాతురుడైన నాయకునితో చెలులు పరాచికాలాడుతున్నారు.

శ్రీవేంకటేశ! నిన్ను ప్రేమించిన వ్యక్తి సౌఖ్యాన్ని పెంచాలిగాని, కాముకుడవైన నీవు న్యాయాన్యాయాలు ఆలోచించడమేల? పండు వెన్నెలవంటి నవ్వు భామిని నవ్వితే నీవు సైగలతో ఆ చంద్రుని తిట్టడమెందుకు? ఆమె తన కలువ కనులతో వెంటనే నిన్ను చూచితే నీవు ఆ మన్మథునితో పంతాలాడడమెందుకు? ఆవిడ వాడియైన తన చనుమొనలతో నిన్ను వొత్తితే నీవు ఆ జక్కవ పక్షులను ఎందుకు సాధిస్తావు? వాడియైన కొనగోళ్లతో ఆమె నీ మేను తాకితే నీవు మొగలిరేకు కొన రాయడమెందుకు? వ్యంగ్యపు మాటలతో ఆమె పలుమారు మాట్లాడితే నీవు చిలుకలను బెదిరించడమెందుకు? స్వామీ! ఆమె రతిలో నిన్ను మించిపోతే చెలికత్తెలతో ఎంతో సంతోషించడమెందుకయ్యా!

చన్నులను జక్కవ పక్షులతోను, కనులను కలువలతోను, నవ్వును వెన్నెలతోను పోల్చడం కవి సమయం.

ముఖారి

మేలు నీజాణతనము మెచ్చిరి సతులిందరు
యేలికవంటాఁ జేరితే నిక్కువ లంటేవు ॥పల్లవి॥
నిమ్మపండ్లు గానుకగా నెలత నీ కియ్యరాఁగా
ఇమ్ముల నాపెచన్నులు యేల పట్టేవు
నెమ్మి మొకదాకిరితో నిన్నేమీ ననకుండితే
సమ్మతించెనంటా నెంత సంతోసించుకొనేవు ॥మేలు॥
తరుణి సూడిదెగాను తామర నీకియ్యరాఁగా
కరకమలమేల గక్కనఁ బట్టేవు
శిరసువంచు కందుకు సిగ్గుతోడ నుండితేను
కరఁగియున్న దంటాను కాఁగిలించుకొనేవు ॥మేలు॥
పచ్చిపగడము నీచేపట్టుగాఁ జెలియ్యరాఁగా
ముచ్చటతో సందసుడి మోవి యానేవు
అచ్చమై శ్రీ వేంకటేశ అందుకోరుచుకుండితే
ఇచ్చెరిఁగి కూడెనంటా నెంతగారవించేవు ॥మేలు॥ (172)

భావము: జాణయైన విభుడు నాయికను లోబరచుకోవడాన్ని చెలులు వివరంగా తెలుపుతున్నారు.

శ్రీవేంకటేశ! మా సతులు ఇంతమందీ నీ జాణతనాన్ని మెచ్చుకొన్నారు. మేలు మేలు! నీవే తన ప్రభువువని దగ్గర జేరితే ఆమె మర్మస్థానాలు ముట్టుకున్నావు. మా సఖి నీకు కానుకగా నిమ్మపండ్లు ఇవ్వడానికి నీ దగ్గరకు రాగా ప్రీతితో ఆమె చనుదోయి పట్టుకోవడమెందుకు? నీ మొహమాటంతో నీతో ఏమీ వాదించకుండా ఉండిపోతే, అంగీకారం తెలిపినదని అనుకొంటూ ఎంత సంబరపడ్డావు. మా సఖి నీకు కానుకగా తామరపూవు ఇవ్వడానికి రాగా ఆమె కరకమలాన్ని వెంటనే ఎందుకు పట్టావు? తలవంచుకొని ఎంతో సిగ్గుతో ఆమె వుండగా పారవశ్యంలో వుందని కౌగిలించుకొన్నావు. పచ్చిపగడము (పూవు) నీ చేతికి మా చెలి యివ్వడానికి రాగా నీవు మధ్యలో ముచ్చటపడి పెదవి కొరికావు. స్వామీ! దానిని ఆమె ఓర్చుకుని వుంటే ఇష్టపడి నీ వద్దకు వచ్చినదని ఎంత గౌరవించావో! అని చెలి సరసలాడింది.

(ఇంకా ఉంది)

Exit mobile version