[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
సామంతం
తానైతే నన్నిటా నుత్తమగుణవంతుఁడు
నేనెంతటిదానను నేరిచి పెనఁగను ॥పల్లవి॥
పలుకుల నెంతవొడఁబరచీనే తా నన్ను
చలముకొని (నఁ?) త(దః)నతో సరిదాననా
యెలమిఁ దొడపైనేల ఇడుకొనినే నన్ను
ఇలఁ దనకేమిబాఁతే ఇందరిలో నేను ॥తానై॥
మన్నించి నాపై నెంత మచ్చికచల్లీనే తాను
తన్ను మెచ్చ సేవసేసేదాననా నేను
చన్నులంటి నన్ను నెంత సరుకుసేసి నవ్వీనే
కన్నులఁ జూడ నంతచక్కనిదాననా ॥తానై॥
చనవిచ్చి ననునెంత సమరతికిఁ దీసీనే
ననిచిన మేనదాననా తనకు
చెనకి నన్నిట్టె కూడె శ్రీ వేంకటేశుఁడు తాను
వినయాల వేఁడుకొని విన్నవించనేర్తునా ॥తానై॥ (193)
భావము: సరసుడైన విభునికి నేను సరిదానను కానని ప్రియోక్తులు పలుకుతోంది:
ఓ చెలీ! నీ విభుడు అన్ని విధాలుగా గుణవంతుడు. అట్టి వానితో నేర్పుగా పెనగులాడుటకు నేనెంతటిదానను. ఆతడు నన్ను మాటలతో ఎన్నో రకాలుగా అంగీకరింపచేస్తున్నాడు. అతనితో పంతమాడటానికి నేను సరిదాననా? ప్రీతితో తాను నన్ను తన తొడపై కూర్చుండబెట్టుకోవడానికి ఇందరి సఖులలో నేనాతనికి అంతటి ప్రియురాలనా? నాపై అభిమానంతో తాను నాపై మచ్చిక వెదజల్లుతున్నాడుగదా! తాను మెచ్చుకొనే విధంగా నేను సేవలు చేయగలదాననా? చనవుతో నన్ను సమరతికి తాను పురికొల్పాడు. అతనికి ప్రియమైన శరీరంగలదాననా నేను? నన్ను ఉసిగొల్పి శ్రీ వేంకటేశుడు నాతో క్రీడించాడు. వినయాలతో వేడుకొని మొరపెట్టుకొనగలదాననా?
దేసాళం
చెలికత్తెలము నేము చెనకవచ్చేవు మమ్ము
చెలిమి చెట్టడిచితే చేటఁడవునయ్యా ॥పల్లవి॥
కోరి నిన్నుఁ బిలువఁగ కొమ్మ వంపఁగా వచ్చితి
వూరకే సుద్దులడిగే వొట్టుక నన్ను
మారుకు మాటాడఁబోతే మాటలెంనై (లెన్నై) నాఁ గలవు
గోర గీరితే నేరు కొచ్చిపారునయ్యా ॥చెలి॥
గందము నాచే సంపఁగా కానుక దెచ్చితి నీకు
అంది నాతో నవ్వవచ్చే నప్పుడే నీవు
చిందిచింది యెత్తఁబోతే చేరి మాపుదాఁకాఁబట్టు
చెందితేఁ జిగురుఁగొమ్మ చేఁగలవునయ్యా ॥చెలి॥
తనమారు నన్నంపఁగా దండముపెట్టితి నీకు
యెనసి కాఁగిటఁ గుచ్చియెత్తే వేమయ్యా
వెనక నాపె రాఁగా శ్రీ వేంకటేశ కూడితివి
ననిచి పైకొంటేను నవ్వు నిజమవునయ్యా ॥చెలి॥ (194)
భావము: ప్రియురాలు పంపిన దూతికతో స్వామి సరసాలాడటం వర్ణితం:
ఓ వెంకటేశ! మేము మా సఖి చెలికత్తెలము. నీవు మమ్ములను సరదా పట్టిస్తున్నావు. ప్రేమ అనే చెట్టును కదిలిస్తే (కొడితే) అది అధికం అవుతుందయ్యా! మా సఖి కోర్కె మేరకు ఆమె పంపగా మేము వచ్చాము. మాటిమాటికీ నీవు ఊరకే సుద్దులడుగుతున్నావు. మారు మాట్లాడబోతే మాటలెన్నైనా ఉన్నాయి. గోటితో గీరితే ఏరులు ప్రవహిస్తాయయ్యా! మా చెలి నీకు కానుకగా గంధము పంపగా తెచ్చాను. అది అందుకొనిన నీవు అప్పుడే నవ్వుటాలకు దిగావు. ఆ గంధపుపూత చిందితే, దానిని ఎత్తబోతే రాత్రి అంతా సరిపోతుంది. చిగురు కొమ్మను ముట్టుకొంటే అది చేవదేరుతుంది సుమా! ఓ స్వామీ! నా వెనుకనే ఆమె రాగా నీవామె పొందు పొందావు. ప్రీతితో ఆదరిస్తే నీ నవ్వు నిజమవుతుందయ్యా! అని సరసమాడింది చెలి.
గౌళ
నీవేమి సేసినాను నీకుఁ జెల్లును
మోవులు గిరుపనేల మోహించినదానికి ॥పల్లవి॥
చెలఁగి పతి ముట్టితే చేతికి లోనౌటగా
చలపాదితనమేల జవరాలికి
పిలిచి పేరుకొంటే బెరసి వూఁకొంటగాక
వలననిబిగువేల వలచినదానికి ॥నీవే॥
వొగ్గి విడెమిచ్చితేను వొడి నించుకొంటగాక
సిగ్గులు పడఁగనేల చిన్నదానికి
దిగ్గన సరసమాడితేఁ జెనకుట గాక
యెగ్గులుపట్టఁగనేల యిచ్చకపుదానికి ॥నీవే॥
చనుఁగవ లంటితేను సమ్మతించుకొంట గాక
పెనగులాడఁగనేల ప్రియురాలికి
యెనసితివి శ్రీ వేంకటేశ యింతలో నన్ను
తనిసితిఁ గొంకనేల తమకపుదానికి ॥నీవే॥ (195)
భావము: ముగ్ధగా భావం వ్యక్తం చేసే చెలిని హెచ్చరిస్తోంది:
ఓ చెలీ! ముద్దరాలివైన నీవు ఏమి చేసినా చెల్లుతుంది. మోహించిన దానికి నీకు పెదవులు విరువనేల? జవరాలివైన నిన్ను నీపతి విజృంభించి ముట్టుకొంటే అతని చేతిలోనికి లోను గావాలి గాని గర్వమెందుకు? నిన్ను పేరు బెట్టి ఆతడు పిలిస్తే నీవు ఊకొనాలిగాని, ప్రియురాలివైన నీకు వద్దని బిగువేల? దగ్గరగా వచ్చి తాంబూలం అందిస్తే వొడిలో దాచుకోవాలిగాని చిన్నదానివైన నీవు సిగ్గు లొలకనేల? వెంటనే అతడు నీతో సరసాలకు దిగితే అంగీకరించాలిగాని ప్రియురాలివైన నీవు తప్పులు పట్టనేల? ఆతడు నీ చనుదోయి పట్టుకొంటే అంగీకరించక ప్రియురాలివైన నీవు పెనగులాడడమెందుకు? శ్రీ వెంకటేశ! ఇంతలోనే నన్ను నీవు కలిశావు. మోహించిన నేను సంతృప్తిపడ్డాను. మరి భయపడనేల?
ధన్నాశి
ఎవ్వ రెఱుఁగుదురయ్య ఇటువంటి నీమనసు
పువ్వువంటియాఁటదాన బుద్దిచెప్పవయ్యా ॥పల్లవి॥
ఇందమని విడెమిచ్చే విప్పుడు నీవు
అందుకొంటి నాసకత్తెనని యందునో
పందెము వేసీ (సేఁ) జెయిపట్టుమనేవు
సందడిఁ జేయొగ్గితేను సాహసురా అందువో ॥ఎవ్వ॥
పైకొని పాదములు నాపై వేసేవు
చేకొని యొత్తఁగ నెంతచిత్తిణందువో
ఆకుమడిచిమ్మనుచు నానపెట్టేవు
యీకడ నియ్యకొంటే నిదెంత లాచీనందువో ॥ఎవ్వ॥
గుట్టుతోడఁ గాఁగిలించుకొమ్మనేవు
గట్టి చన్నులు నాఁటించఁగా నేమందువో
యిట్టె శ్రీ వేంకటేశ నన్నేలితివి
నెట్టన మొక్కఁగా నెంతనేరుపరి నందువో ॥ఎవ్వ॥ (196)
భావము: గడుసరియైన కాంతుని హెచ్చరిస్తోంది ప్రియురాలు:
శ్రీవేంకటేశ! నయకారివైన నీ మనసు ఎవరెరుగుదురు? సుకుమారమైన పూవు వంటి దానిని నేను. నీవే బుద్ధి చెప్పాలి. “ఇదుగో!” అని నీవిప్పుడు తాంబూలమిచ్చావు. నేను అందుకొంటే నీవే ఆశకత్తెనని దెప్పి పొడుస్తున్నావు. నాతో పందెం వేసి చేయి పట్టుకోమని కోరావు. దగ్గరగా వచ్చి చేయి అందిస్తే సాహసకత్తెనని అంటావు. తొందరపడి నాపై నీ పాదాలు వేసేవు. ఆ పాదాలు నేను సేవించబోతే పద్మినీ జాతి స్త్రీనని ఎద్దేవా చేస్తావు. తమలపాకులు మడిచి యిమ్మని ఆజ్ఞ చేశావు. ఇక్కడే ఇవ్వబోతే ఇది ఎంతగా పెనగులాడుతున్నదని అంటావు. స్వామీ! ఈ విధంగా నన్ను ఏలుకొన్నావు. ఇంతలో నేను మొక్కబోగా “ఓరా! నేర్పరియని” అంటావేమో! తానుచేసే పనిని విభుడు గడుసరిగా భావిస్తాడని సరసమాడుతోంది.
శంకరాభరణం
పిలువఁగదరే ప్రియునిని
చలువా లాతఁడు చల్లీఁగాని ॥పల్లవి॥
తలఁపారా దింతి తమకము రేఁగి
చెలపాచెమటాయ చెక్కులను –
పొలపావెన్నెలపోగులకు । మతి –
గొలుపా దీకె కెక్కుడువిరహమునా ॥పిలు॥
కెరలి మును మరిగినపొందూ । లోలో
మరలీ కాఁకలై మనసుననూ
పొరలీఁ బూఁబానుపున నీపెకు । వాడు –
దొరలీఁ దియ్యఁరె తొలువిరులెల్లా ॥పిలు॥
అలసె మోహపుటాసల । కడు –
బలిసెఁ జన్నులు పైపైనే
కలసె శ్రీ వేంకటపతి । మారు –
మలసే విదివో మరుబలములకూ ॥పిలు॥ (197)
భావము: మదనోద్రేకము కలిగించు సన్నివేశమును వర్తించుచున్నాడు:
ఓ సఖులారా! ఈమె విరహోత్కంఠిత. అతడు చలువలు చల్లుతున్నాడు. ఆమె ప్రియుని పిలవరే! మోహావేశంతో వున్న ఆమెకు మనసు కుదుటబడటం లేదు. చెక్కులపై చెమటలు దట్టమయ్యాయి. అధికమైన విరహంచేత వెన్నెలల సౌందర్యాన్ని ఆస్వాదించలేకుంది. ఇంతకు ముందు ప్రియునితో క్రీడించిన సన్నివేశాలు మనసులో మాటిమాటికీ గుర్తురాగా లోలోన బాధపడుతోంది. పూలసెజ్జపై అతనితో ఈమె దొరలింది. ఆ వాడిన పూలు తీసి వేయరే! అధికమైన మోహంతో కూడిన ఆశలతో అలసిపోయింది. చనుదోయి బాగా బలిసిపోయింది. స్వామి ఆమెను కలిశాడు. మన్మధ బాణాలకు ఆమె ఎదిరించలేక పోతోంది సుమా!
ఈ కీర్తన సంగీత పారవశ్యంతో సృజించబడిందని గౌరిపెద్ది వారు భావించారు.
దేవగాంధారి
కాదనఁగవచ్చునా ఘనుఁడ నీతోడిపొందు
యేదైనా నియ్యకొంటే నెక్కుడేకాదా ॥పల్లవి॥
నీకు సెలవై తేఁజాలు నీమోహపుసతులకు
చేకొని ప్రియములెల్లాఁ జెప్పేమయ్యా
యీకడనాకడ నీకు హితవైతేఁ జాలుఁగాక
మాకేమి వారినేరాలు మరచేమయ్యా ॥కాద॥
నట్టనడుమను నీకు నవ్వువచ్చితేఁజాలు
వొట్టి వారిచేఁతలకు నోరిచేమయ్యా
మట్టుమీర నేఁడు నీమనసువచ్చితేఁ జాలు
గట్టిగా నెంగిలిపొత్తు గల సేమయ్యా ॥కాద॥
చక్కఁగ నీకేపొందు సంతోసమైతేఁజాలు
వొక్కచోట నిద్దరము నుండేమయ్యా
యిక్కువతో శ్రీ వేంకటేశ మమ్ముఁ గూడితివి
చిక్కించుక నీపాదాలసేవ సేసేమయ్యా ॥కాద॥ (198)
భావము: దక్షిణ నాయకుడైన స్వామితో సరసాలాడుతూ విన్నపాలు చేస్తున్నారు.
శ్రీవేంకటేశ! నీవు దక్షిణ నాయకుడవు. అట్టి ఘనుడనైన నీతోడి పొందును నేను తిరస్కరించగలనా? ఎలాగైనా నీవు నన్ను ఇష్టపడటమే అధిక భాగ్యం. నీవు నాపై అభిమానం చూపితే అదే చాలు. నీవు మోహించిన సతులను దగ్గర చేర్చుకొని ఎన్నో ప్రియ సంభాషణలు చేస్తాను. అక్కడ, ఇక్కడ నీకు ఇష్టమైతే చాలు నాకు వారు చేసిన నేరాలతో పని ఏమి? వారి మధ్యలోనున్న నాపై నవ్వులు ప్రసరిస్తే చాలు వారు చేసే వొట్టి పనులను ఓర్చుకొంటాను. ఈ రోజు అధికంగా నాపై నీవు మనసు పడితేచాలు, నీతో ఎంగిలి పొత్తు సహిస్తాను. నా పొందు నీకు అందంగా సంతోషం కలిగిస్తే చాలు. ఆమె, నేను ఒక చోట కలిసి మెలిసి ఉంటాము. స్వామీ! ప్రియంగా నీవు నన్ను కూడావు. నీ పాదాలు చిక్కించుకొని సేవలు చేస్తామయ్యా! అని దీనంగా పలికింది.
పాడి
ఆపెనేల వుప్పతించే రమ్మలాల
యేపున వయసువచ్చి యెదుట నుండఁగను ॥పల్లవి॥
యెలమి నెవ్వరిభాగ్య మెట్టు దెలియఁగవచ్చు
మొలక చన్నులెకావా మోపులయ్యేది
కలిగినయట్టి కాలగతు లెట్టు చెప్పఁగవచ్చు
పలచనిమోవిఁగాదా పండి తేనె లూరేది ॥ఆపె॥
యెఱిఁగి యెవ్వరికొలఁ దెట్టు గురిపెట్టవచ్చు
నెఱులు పెరిగికాదా నిడుపయ్యేవి
మెఱసి దొరతనముమితి యెట్టు పెట్టవచ్చు
పిఱుఁదు బలిసికాదా పిక్కటిల్లేది ॥ఆపె॥
యెన్నఁగ నెవ్వరిబీర మేరుపరచే దెట్టు
కన్నులచూపులేకావా కాఁడిపారేవి
యిన్నిటా శ్రీ వేంకటేశుఁ డీకెను నన్నును గూడె
వున్నతిఁ జేదోయేకాదా వొక్క కాఁగి లయ్యేది ॥ఆపె॥ (199)
భావము: ప్రౌఢవయస్సుకు ఎదిగిన కాంత అవయవ పుష్ఠిని చెలుల ద్వారా ఇందులో వర్ణించాడు అన్నమయ్య.
ఓ అమ్మలారా! యౌవన ప్రాదుర్భావం ఎదురుగా వచ్చి నిల్చిన ఆమెనెందుకు ఆడి పోసుకొంటారు. ఎవరి భాగ్యము ఏ సమయాన ఎలా వుంటుందో తెలియలేము. మొలక చన్నులే గదా క్రమంగా బలిసి గట్టిపడేది. రాబోయే కాలగమనాన్ని ఎవరు ఊహించ గలరు? పలచనైన పెదవులే గదా వయస్సుతో పండి తేనెలూరిస్తాయి. తెలిసి ఎవరి సామర్థ్యాన్ని ఎవరు గురిపెట్టగలరు? ముంగురులు పెరిగి కాదా పొడవయ్యేది. దొరతనాన్ని ఏవిధంగా లెక్కించగలము? పిరుదులు బలిసి కదా గట్టిపడేది. లెక్కించగా ఎవరి గొప్పదనాలు వేరు పరచగలము. కడగంటి చూపులేగదా బాధించేవి. ఇన్ని రకాలుగా స్వామి నన్ను, ఈమెను కదిశాడు. ఘనంగా రెండు చేతులు కలిసితే గదా కౌగిలింతలవుతాయి.
బౌళి
సేసవెట్టి పెండ్లాడె చెనకి తొల్లే నన్ను
దోసముగాకుండాఁ బతిఁ దోడుకరారే ॥పల్లవి॥
పట్టరానిది వయసు పాయరానిది నేస్తము
గుట్టుతోఁ దిప్పరానిది గుణము
మట్టుపెట్టరానిది మనసులోఁ దలపోఁత
యిట్టె విభుఁడు రాఁడు యెట్టు సేతునే ॥సేస॥
ఆఁపరానిది వలపు అణఁచరానిది చూపు
దాఁపరానిది లోలో తమకము
రూపించరానిది రుచులైన తరితీపు
యీపొద్దే రమణుని కెఱిఁగించరే ॥సేస॥
తుంచరానిది యాస తొలఁగరానిది వావి
కొంచించరానిది కూడినరతి
అంచెల శ్రీ వేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
ముంచీ నాకు సిగ్గులు మొక్కితిననరే ॥సేస॥ (200)
భావము: విరహోత్కంఠిత అయిన కాంత చెలులకు తన గోడు వెల్లబోసుకుంటోంది.
“ఓ సఖులారా! ఇంతకుముందెన్నడో తాను సేసలుపోసి నన్ను పెండ్లాడాడు. దోసం జరగకుండా నా పతిని వెంటనే తోడ్కొని రండు! వయసా పట్టుకోరానిది. స్నేహమా వదలరానిది. గుణమా రహస్యంగా మళ్లించరానిది. మనసులో ఆలోచనలు అణచుకోలేనివి. నా విభుడు ఇంతకూ రాడు. నేనెలా భరిస్తాను? ప్రేమ ఆపుకోలేనిది. చూపులు అణచుకోలేనివి. లోలోపల మోహం దాచుకోలేనిది. నా మనసులో రుచులు రూపించలేము. ఈ సమయంలో నా రమణునికి తెలియజేయండి. ఆశలా తుంచరానివి. వావివరుసలు తొలగదోయరానివి. ఆయనతో కూడిన రతిక్రీడలు తగ్గించరానివి. వరుసగా స్వామి నన్ను కలిశాడు. నాకు సిగ్గులు ముంచుకొస్తున్నాయి. అందుకే మొక్కానని చెప్పవే” – అని తన గోడు చెప్పుకొంది.
శ్రీరాగం
ఆఁడువారిగుణ మిది యటువంటిదానఁ గాను
నేఁడు నన్నేలుకో వారు నిన్ను దూరఁజూతురు ॥పల్లవి॥
మటమాయతనమున మగువలు మగవారి
సటకారితనమున సాదింతురు
తటుకన వలచితేఁ దగిలించుకొని యట్టే
యిటునటు భ్రమయించి యెలయించఁజూతురు ॥ఆఁడు॥
వేసదావరినితలు వెంగెము లప్పటిఁ జూపి
కాసువీసములకుఁగాఁ గరఁగింతురు
ఆసపడి లోనై తే నండవాయకుండాఁ జేసి
బాసగొని మోసపుచ్చి పంతమాడఁజూతురు ॥ఆఁడు॥
యేతులాఁడికాంతలు యెందునైనా సందుచూచి
వాతరొట్టుమాట లాడి వంచుకొందురు
యీతల శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
చేతఁజిక్కుకున్న వారు సిగ్గువడఁజూతురు ॥ఆఁడు॥ (201)
భావము: పరకాంతలు తన పతిని మోసకారి మాటలతో వంచిస్తారని హెచ్చరిస్తోంది.
శ్రీవెంకటేశ! స్త్రీల గుణము విచిత్రము. కానీ నేను అటువంటిదానిని కాను. ఈనాడు నన్ను ఏలుకో! వారు నిన్ను నిందించే ప్రయత్నం చేస్తారు. మాయమాటలచేత స్త్రీలు మగవారిని వంచనతో సాధిస్తారు. పొరబాటున ప్రేమిస్తే తగులుకొని అటూ ఇటూ భ్రమపడేలా చేసి కౌగిలించుకోవాలని చూస్తారు. మాయదారి వేషాలు వేసే వనితలు అప్పటికప్పుడు వ్యంగ్యములు చూపి డబ్బుకు కక్కుర్తిపడి మెత్తబడేలా చూస్తారు. ఒకవేళ నీవు ఆశపడి వారికి లోబడితే వారి కట్టుబాటులో వుండేలా చేసి వాగ్దానము చేయించుకొని, మోసపుచ్చి పంతాలాడజూస్తారు. ప్రగల్భాలు పలికే ఆ కాంతలు ఎక్కడో సందు చూచి వదరుబోతు మాటలాడి నిన్ను లోబరచుకొంటారు. ఇక్కడ ఓ స్వామీ! ఈ విధంగా నన్ను కూడావు. చేతిలో చిక్కుకున్నవారు సిగ్గుపడేలా చూస్తారు. జాగ్రత్త సుమా!
వరాళి
ఏమీ రంగ వెంతవేసాలు సేసేవు
యీమేరనే రతివేళా నిట్టే వుండేవా ॥పల్లవి॥
ముసిముసినవ్వులతో ముందర నిలిచి చెలులఁ
బిసిసియెలుఁగులఁ బిలిచేవు
కసుగాటుమాటలు కఱచి కఱచి యాడే-
వెసఁగి ప్రియునియొద్ద నెంతగోలవే ॥ఏమీ॥
చిన్ని చిన్ని సిగ్గులతో చెలువునివద్ద నుండి
సన్నలెల్లఁ జేసేవు సతులతోను
చన్నులపై పయ్యద సాంచి బిగించుకొంటాను
కన్నెవలె నొదిగేవు కడునెంతగోలవే ॥ఏమీ॥
జలజల చెమటలుజార నింతులమాఁటున
నిలుచుండి పతిమోము నిక్కిచూచేవు.
వెలయ నన్నుఁ గూడె శ్రీ వేంకటేశుఁడు తొలుతె
వొలిసి యీతనిపాదా లొత్తే వెంతగోలవే ॥ఏమీ॥ (202)
భావము: ప్రౌఢతనంతో పతి మనసు చూరగొన్న కాంతతో చెలులు సరసాలాడుతున్నారు.
ఓ వనితా! ఏమీ ఎరగని నంగనాచివి నీవు. ఎన్ని వేషాలు వేశావు. ఈ హద్దులోనే రతి సమయంలో కూడా ఇలానే వుంటావా ? ముసిముసి నవ్వులతో అతని ముందర నిలిచి నీ చెలులను మెల్లమెల్లని గొంతుతో పిలుస్తున్నావు. లేతకాటు మాటలతో కరిచివలపించేవు. నీవు నీ ప్రియుని వద్ద ఎంత బేలవే? చిరుసిగ్గులు వొలకబోస్తూ నీ ప్రియుని వద్ద నిలిచి సతులకు సైగలు చేస్తున్నావు. చనుదోయిపై పైటను గట్టిగా బిగించి కన్యవలె వొదిగిపోయావు. నీవు ఎంతటి బేలవే. శరీరమంతా జలజలమని చెమటలు జారిపోగా కాంతల వెనుక నిలుచుండి నీ పతి ముఖాన్ని నిక్కి చూస్తున్నావు. శ్రీవేంకటేశుడు. ముందుగానే నన్ను కలిశాడు. అట్టివేళ నీవాతని పాదాలొత్తసాగావు. ఔరా! ఎంతటి బేలవే!
(ఇంకా ఉంది)