[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
రామక్రియ
ఔనయ్యా మంచివాఁడ వతివ నింతసేసితి
కానీవయ్యా యీకె నిట్టె కరుణించు మింకను ॥పల్లవి॥
మనసిచ్చి నీ వాపెతో మాటలాడఁగానేపో
తనివోనివలపులతమి వుట్టెను
కనుచూపు లటు నీవు కాఁడిపారించఁగాఁబో
కొనసాగి వొక్కొకటే కోరికలు రేఁగెను ॥ఔన॥
నాముగొన నీ వూరకె నవ్వులు నవ్వఁగాఁబో
మోమున రతికళలు మొలవఁజొచ్చె
చేముంచి నీవు సారెఁ జెనకఁగానే పో
యేమినెఱఁగనిబాల ఇంత రట్టుకెక్కెను ॥ఔన॥
ఇంటికే వచ్చి నీవు ఇట్లాఁ గూడఁగాఁ బో
దంటయై ఇంతేసికతలఁ గరంచె
జంట శ్రీ వేంకటేశ సరసమాడఁగాఁ బో
పెంటయైనసంతోసాలఁ బెనగొనె నిపుడు ॥ఔన॥ (223)
భావము: ప్రేమ పేరుతో సఖిని ఊరించడమెందుకని చెలులు సరసాలాడుతున్నారు.
శ్రీ వెంకటేశ! నీవెంత మంచి వాడవయ్య. మా సఖిని ఇంత దానిని చేశావు. అలానే కానీవయ్యా! ఈమెను ఇలానే ఇకపై దయతో చూడు. నీవు మనసిచ్చి ఆమెతో మాట్లాడేగానే తృప్తి పొందని వలపుల కోర్కెలు పుట్టాయి. నీ కనుచూపులు అటువైపు సారించగా కొనసాగిన కోర్కెలు ఒక్కొక్కటే విజృంభించాయి. అధికమయ్యేటట్లు నీవు వూరకే నవ్వులు నవ్వగా ఆమె ముఖంపై రతికళలు మొలకెత్తసాగాయి. నీవు చేయిముట్టి మాటిమాటికి కదియగా, ఏమీ తెలియని ముద్దరాలు ఇంత రచ్చకెక్కింది. నీవు ఆమె యింటికే వచ్చి ఈ విధంగా కలియగా ఆమె ధీరురాలై ఇంతలేసి కథలు నేర్చింది. మీరిద్దరు జంటయై సరసమాడగా మిక్కిలి సంతోషంతో పెనగులాడుతోంది.
హిందోళం
అచ్చివచ్చు నీ కెప్పుడు నంగనతోడిపొందు
కొచ్చికొచ్చి ఇందు కెంతకోరుకొంటా నుంటివో ॥పల్లవి॥
సరస నిలచుండఁగా సతితురుములోనుండి
విరులు నీ మీఁద రాలె వింతలుగాను
గరిమఁ దమకమునఁ గమ్మిననిట్టూర్పులు
వరుసతో నీకు నాలవట్టములాయను ॥అచ్చి॥
మాటలాడుకొనఁగాను మనసులేకమై లోలో
వాటములై తగిలెను వావులుగాను
సూటిదప్పకుండా నిన్నుఁ జూడఁగఁ జూడఁగాను
కోటికొండలై వలపు గుదిగొనె నీకును ॥అచ్చి॥
ముట్టి కొలువుసేయఁగ మునుకొని నీపూజకు
గుట్టునఁ జన్నులు పూవుగుత్తులాయను
ఇట్టె శ్రీ వేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
తొట్టి యాపెకూటమి దోమటాయను ॥అచ్చి॥ (224)
భావము: మా చెలితో సాంగత్యము నీకు అచ్చి వచ్చిందని చెబుతోంది సఖి.
శ్రీ వెంకటేశ! ఈ వనిత తోడి పొందు నీకు నిత్యం అచ్చి వస్తుంది. ఇందుకుగా నీవు గుచ్చిగుచ్చి ఎంతగా కోరుకుంటున్నావో గదా! ఆమె నీ సరసన నిలుచుండగా ఆమె కొప్పులోని పూలు వింతగా నీ మీద రాలాయి. మోహంతో అధికంగా కమ్మిన నిట్టూర్పులు వరుసగా నీకు వీవనలయ్యాయి. మీరిద్దరూ మాట్లాడుకొంటుండగా మీ మనసులు ఏకమై వావివరుసలై వాటంగా తగిలాయి. నిన్ను తదేకంగా చూడటం కోటికొండలై నీకు ప్రేమ అధికమైంది. నిన్ను ముట్టుకొని నీ కొలువు చేయడానికి ముందుకు వచ్చినపుడు నీ పూజకు గుంఫనంగా వున్న చన్నులు పూలగుత్తులైనాయి. ఈ విధంగా ఓ స్వామీ! ఇక్కడ నన్ను కూడావు. దగ్గరైన ఆమె సాంగత్యము నీకు వివాహపు విందు భోజనమైనది సుమా!
పాడి
వలపులకు గురైనవాఁడే మన్నించీఁగాక
చెలులతో దూరి దూరి చెప్పఁగనేమిటికి ॥పల్లవి॥
తలపోతలే నాకు తమకము రేఁచఁగాను
వెలినున్న చిలుకుతో విసుగనేలే
పలునాచూపులె నన్ను భ్రమయించఁజేయఁగాను
కలువల నీటు దూరఁ గారణమేమిటికి ॥వల॥
జవ్వనమదమె నాకు చవులు పుట్టించఁగాను
ఇవ్వలఁ బున్నమచంద్రుఁడేమి సేసునే
నివ్వటిల్ల నాయాసలే వ్వెరుగు నొందించఁగా
పువ్వు విలుతునితోడఁ బోరాడవలెనా ॥వల॥
కమ్మి శ్రీ వేంకటేశుఁడే కాఁగిటిలో నుండఁగాను
కొమ్మలాల చలిగాలిఁ గొసరేదేమే
నిమ్మపండ్లంతలై నిక్కి చన్నులు రాఁగా –
నిమ్ముల నాభాగ్యము నెంచిచెప్పవలెనా ॥వల॥ (225)
భావము: విరహోద్దీపనం చేసే చిలుకలు, కలువలు, చంద్రుడు, మలయ మారుతము, మన్మథుడు తన మోహాన్ని తగ్గించలేరని చెప్పింది.
ఓ సఖులారా! నా వలపులకు లోబడిన వాడే నన్ను మన్నించాడు గాన సఖులతో విశేషంగా చెప్పనవసరం లేదు. నా మనసులోని ఆలోచనలే నాకు మోహాన్ని పెంచగా, బయటనున్న చిలుక పలుకులకు విసుగనేల? నా చూపులే మిక్కిలిగా నన్ను భ్రమపెడుతుంటే కలువపూలను ఈ విధంగా నిందించన వసరమేమి? నీ యౌవనపు మదమే నాకు రుచులు పుట్టించగా, ఇవతల వైపు పున్నమి చంద్రుడు నన్నేమి చేస్తాడే? అధికమైన నాలోని ఆశలే భయాన్ని కలిగించగా మన్మథునితో పోరాడవలసిన అగత్యము లేదు. నన్ను ఆక్రమించుకొని శ్రీ వేంకటేశ్వరుడే నా కౌగిటనుండగా చలిగాలిని కొసరేది ఏముంది? నా చన్నులు నిక్కి నిమ్మపండ్లంతలై వుండగా నా అదృష్టాన్ని గూర్చి అధికంగా లెక్కించవలసిన అవసరం లేదు గదా!
నాగవరాళి
నీ కెంతపరాకైనా నెలఁత మరవలేదు
చేకొన్న నీమీఁదిబత్తి చిగిరించుఁగాక ॥పల్లవి॥
వేడుక గలవారలు వేసర రెంతైనాను
చూడఁజూడ వలపులు జొబ్బిలుఁగాని
వాడికైనపొందులు వదల వెన్నటికిని
యీడు జోడై మీఁదమీఁద హెచ్చుఁగాని ॥నీకెం॥
యెనపివుండినవారు యెగ్గుపట్ట రేమిటికి
వెనుకొన్న ముచ్చటలు వెలయుఁగాని
మనసువచ్చినచోట మానవు తీరితీపులు
వినయపుఁబ్రియములు వెగ(గ్గః)ళించుఁగాని ॥నీకెం॥
సమ్మతించినవారు జడియ రేపనికిని
వుమ్మగిలుకాఁగిళ్లు వొద్దికౌఁగాని
యిమ్ముల శ్రీ వేంకటేశ ఇంతి నిట్టె కూడితివి
చిమ్ముసరసము లింకాఁ జెలరేఁగుఁ గాని ॥నీకెం॥ (226)
భావము: పరాకుగా వున్న కాంతునికి చెలులు హితవు చెబుతున్నారు:
శ్రీ వేంకటేశ! నీకు ఎంత పరాకైనా మా భామ నిన్ను మరవలేదు. నీవు చేపట్టిన నీ మీద భక్తి చిగురిస్తుంది. సరదా పడినవారు ఎంతైనా బాధపడరు. పరికించి చూడగా ప్రేమలు అధికమవుతాయిగానీ, సరదాపడిన వారెంతైనా బాధపడరు. అలవాటుపడి సఖ్యతలు ఎన్నటికీ వదలిపెట్టవు. పైపై ఈడుజోడుగా నిలబడి హెచ్చిపోతాయి. కలిసి వున్నవారు తప్పులు దొర్లినా లెక్కపెట్టరు. పెనగొన్న ముచ్చట్లు విరిసిపోతాయి. మనసు మెచ్చిన చోట బాధ అనిపించదు. వినయంతో గూడిన ప్రీతి అతిశయిస్తుంది. వుక్కబెట్టు కాగిళులు వొద్దికగా వుంటాయి గానీ అంగీకరించిన వారు ఏ పనికైనా భయపడరు. విజృంభించే సరసాలు ఇంకా అధికమవుతాయిగాని, ఈ విధంగా స్వామి ! నీవు మా చెలిని మన్నించవయ్యా!
ధన్నాసి
చెప్పరాదు చూపరాదు చిత్తగించవయ్యా నీవు
ముప్పిరి నింకా నెంత మోపుగట్టీనో ॥పల్లవి॥
కానుకవట్టీఁ జూపులు కలికి నీయెదుటను
వానలుగఁ జెమటలు వడసీ మేన
నానఁబెట్టి సెలవుల నవ్వులు నవ్వీ నీతో
పూని మోహ మింకానెంత పోగువోసీనో ॥చెప్ప॥
వెదవెట్టీమాటలు వేడుకతో నీముందర
గుదిగుచ్చీ సిగ్గులు నీకొలువునను
పొదిగొన్న తమకము పొంచి నీపై దిగఁబోసీ
యెదుటఁ దనకోరిక లింకానెంత చూపీనో ॥చెప్ప॥
విందువెట్టీ మోవితేనె వింతలుగా నిందరిలో
అందిచ్చీ కాఁగిలి నీకు నటు చేతుల
కందువ శ్రీ వేంకటేశ కైకొని కూడితివి
పొంది రైతు లింకానెంత భోగించినో ॥చెప్ప॥ (227)
భావము: ముద్దరాలిని ప్రియంగా చేరదీసిన కాంతునిలో చెలి సిగ్గరితనాన్ని గుర్తు చేస్తున్నారు:
శ్రీ వేంకటేశ! నీ తీరును చెప్పరాదు. చూపరాదు. నీ ప్రేమ ముప్పిరిగొని యింకా ఎంత బలమవుతుందో గదా! చిత్తగించవయ్యా! మా చెలి నీ ఎదుట నిలబడి తన క్రీగంటి చూపులను కానుకగా పట్టింది. శరీరంపైన చెమటలు వానలుగా తడిసిపోయాయి. ఆమె నీతో యింకా ఎంత మోహాన్ని పోగు చేస్తోందో గాని, ఆనపెట్టి పెదవులపై నవ్వులు విరబూయిస్తోంది. మాటలు ఎదలో నాటుకొని వేడుకగా నీ ముందర నీ కొలువులో ఆమె సిగ్గులు గుంపుగా పోసింది. నీ ఎదుట తన కోర్కెలను ఇంకా ఎంతగా చూపదలచుకొందో గాని ఒకచోట ప్రోదియైన మోహాన్ని నీపై దిగబోసింది. రహస్యంగా తన పెదవి తేనెలను ఇందరిలో వింతగా నీకు విందుగా చేసింది. నీకు అటుగా వచ్చి చేతులతో కౌగిలి అందించింది. ఏకాంతంలో స్వామీ! నీ వామెను కలిశావు. రతి సౌఖ్యాలు యింకా ఎంత మీరు అనుభవిస్తారో గదా?
నాదరామక్రియ
ఏమని చెప్పుదునే యిదివో నావలపు
దోమటి మోవితేనెలఁ దొట్టుకొనే వలపు ॥పల్లవి॥
తలపోఁతలచేత దట్టమవును వలపు
సొలపులు నెరపితేఁ జుట్టుకొను వలపు
పలుకులఁ గొసరితేఁ బదనెక్కు వలపు
నెలకొని నవ్వితేను నిలుకడా వలపు ॥ఏమ॥
చెనకులు గనమైతే దిమ్మిరేఁగు వలపు
తనువు సోఁకులను తగులౌను వలపు
పెనఁగఁగాఁ బెనఁగఁగా బెచ్చురేఁగు వలపు
మనసురా మెలఁగితే మక్కళించు వలపు ॥ఏమ॥
తప్పక చూచితేనే తలకొను వలపు
ముప్పిరివినయములు ముంచుకొను వలపు
అప్పుఁడు శ్రీ వేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
చెప్పరానిరతులను చెట్టుకట్టు వలపు ॥ఏమ॥ (228)
భావము: వలపు గొప్పదనాన్ని పరిపరి విధాలుగా వర్ణిస్తోంది:
ఓ సఖీ! ఇదిగో నీ వలపు ఏమని వర్ణించగలను. అది పెదవి తేనెల విందుతో సమానం. సొక్కిపోతే వలపు చుట్టుకొంటుంది. మాటలు కొసరితే వలపు పదను ఎక్కతుంది. అందంగా నవ్వితే వలపు నిలకడగా నిలుస్తుంది. నొక్కులు ఎక్కువైతే వలపు విజృంభిస్తుంది. ఇద్దరి శరీరాలు దగ్గరైతే వలపు తగులుకొంటుంది. ఒకరికొకరు పెనగులాడగా వలపు అధికమవుతుంది. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొంటే వలపు వృద్ధి పొందుతుంది. గాఢంగా చూస్తే వలపు కలుగుతుంది. వినయాలు అధికమైతే వలపు ముంచుకొస్తుంది. అలాంటివేళ శ్రీ వేంకటేశుడు అంతలోనే నన్ను కలిశాడు. చెప్పలేనట్టి రతిక్రీడలతో వలపు గాఢమవుతుంది.
రేకు 839
సాళంగ నాట
వీఁడె చూడరే యెంతవేడుకకాఁడు.
తీఁడుకొని మీసాలు తిరువేంగళేశుఁడు ॥పల్లవి॥
భూపతిచెరువుకాడ పువ్వులమాకుల నీడ
రాపైనమిక్కిలిసింగారాలతోడ
చూపట్టుఁగాంతలనెల్లాఁ జొక్కించి చొక్కించి తరి –
తీపులఁబెట్టీ నిదే తిరువేంగళేశుఁడు ॥వీఁడె॥
కట్టుఁగాలువదండ కడుమచ్చికలు నిండ
మట్టుక వున్నదే తిరుమలకొండ
జట్టిగొని సతులతో సరసములాడుకొంటా
దిట్టయై నవ్వులు నవ్వీఁ దిరువెంగళేశుఁడు ॥వీఁడె॥
ముప్పిరిగొన్న వీదుల ముంచి మోహముపోదుల
విప్పుచుఁ బైఁజల్లేటి విరివాదుల
యెప్పుడు శ్రీవేంకటేశుఁ డితఁడె ఇంతులఁ గంటేఁ
దెప్పరము పెండ్లాడీఁ దిరువేంగళేశుఁడు ॥వీఁడె॥ (229)
భావము: తిరు వేంగళనాధుని కభేదమైన శ్రీవేంకటేశ్వరుని సౌందర్యం ఇందులో వర్ణితము:
ఓ సఖులారా! ఇతడెంత వేడుకకాడో చూడరే. ఈ తిరువేంగళనాథుడు మీసాలు మెలివేస్తున్నాడు. ఈ కోనేరు వద్ద పూలచెట్ల నీడలో అధికమైన శృంగారాలతో అందమైన భామలనందరినీ చొక్కింపజేసి బాధలు పెడుతున్నాడీ తిరువెంగళనాథుడు. కట్టు కాలువ పక్కనే స్నేహం నిండగా సమీపంలో తిరుమల కొండ వున్నది. ఈ విభుడు దండిగా నవ్వుతూ సతులతో జతగూడి సరసాలాడుకొంటున్నాడు. మోహపు కుప్పలను విప్పుతూ సంతోషంతో వీధులలో పూలవానలు చల్లి ముంచుతున్నాడు. ఇతడే శ్రీ వేంకటేశ్వరుడు. చూశారా! ఈతడు భామలను ఆనందంగా పెండ్లాడాడు.
బౌళి
చూడఁ బిన్నవాఁడు గాని జూటుఁదనాలు తనవి
యేడఁజూచినాఁ దానే యేమని చెప్పుదునే ॥పల్లవి॥
దొంగాడుఁ గృష్ణుఁడు తొయ్యలుల మొగములు
తొంగిచూచీ ముంగురులు దూలాడఁగా
ముంగిట ముద్దులుపెట్టి మోవితేనె లానుకొంటా
యెంగిలిసేసీ నిదె యిందరి నొక్కమాఁటె ॥చూడఁ॥
వెన్న ముద్దకృష్ణుఁడు వేడుకతో జవరాండ్ల –
చన్నులంటి సారె సారె సాము సేసీని
చిన్ని చేతు లటుచాఁచి సిగ్గులురేఁచి చెనకి
సన్నలు సేసి పిలిచి సరసములాడీని ॥చూడఁ॥
వుద్దగిరికృష్ణుఁడు వొడివట్టి మానినుల
అద్దుకొని కాఁగిలించి ఆసలు రేచీ
వొద్దిక శ్రీవేంకటాద్రి నొనగూడి మాచేఁతలు
సుద్దులుగాఁ జెప్పి చెప్పి సొలసి నవ్వీనే ॥చూడఁ॥ (230)
భావము: శ్రీకృష్ణుని బాల్యక్రీడలను వేంకటకృష్ణునిగా వర్ణిస్తున్నాడు.
ఓ సఖులారా! ఈ శ్రీకృష్ణుడు వయసున చూడడానికి పిన్నవాడు కాని అతనివి మోసకారి పనులు. ఎక్కడ చూచినా అతడే కనిపిస్తాడు. ఈ వింతలు ఏమని చెప్పగలను? ఈ కృష్ణుడు దొంగవాడు. వనితల ముఖాలు అదేపనిగా తొంగి చూచి ముంగురులు అందంగా నటించగా ముంగిట నిలిచి వనితలకు ముద్దులు పెట్టి పెదవులపై తేనెలు రుచి చూస్తూ అందరినీ ఒకే మారు ఎంగిలి చేశాడు. ఈతడే వెన్న ముద్ద (దొంగ) కృష్ణుడు. మాటిమాటికీ సరదాగా వనితల చనుదోయి ముట్టుకొని సాము గరిడీలు చేస్తున్నాడు. తన చిన్నారి చేతులను అటుగా చాచి సిగ్గులు రేకెత్తించి, దగ్గరగాచేరి సైగలు చేసి పిలిచి సరసాలాడుతున్నాడు. ఈ ఉదయగిరిలో వెలసిన శ్రీ కృష్ణుడు వనితల వాడి పట్టుకొని అడ్డుగా వచ్చి కౌగలించి ఆశలు పెట్రేగేలా చేశాడు. అతడే వెంకటాద్రిపై వొద్దికగా నిలిచి మాచేష్టలను కధలుగా చెప్పి మోహంతో నవ్వుతున్నాడు.
పాడి
నీవు సరసుఁడవు నే నీవూడిగపుదాన
భావించి నీ చిత్తము పట్టరాక కాక ॥పల్లవి॥
వొడివట్టి తియ్యఁగా నే నోపననేదాననా
అడరి మందెమేళము లౌనని కాక
తడవి చెనకఁగాను తప్పించుకొనేనా
సుడిసి కొనగో రెందుసోఁకునో యనికాక ॥నీవు॥
తగిలి నీవు చూడఁగాఁ దలవంచేదాననా
వొగి నీతో గర్వమని వుందానఁగాక
పగటున నవ్వఁగాను పరాకయ్యేదాననా
చిగిరించేనాలోనిసిగ్గులకుఁ గాక ॥నీవు॥
సరసములాడఁగాను సమ్మతించనిదాననా
సరికి బేసికి నీతో జరియఁ గాక
యిరవై శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
వొరసి నానీమన్నన నొద్దికయ్యేఁగాక ॥నీవు॥ (231)
భావము: సరసుడవైన నీతో సర్దుబాటు చేసుకోగలనని భామ విన్నవించుకొంటోంది.
శ్రీ వెంకటేశ! నీవా సరసుడవు. నేనేమో సేవలు చేసేదానిని. నీ మనసు తెలుసుకొని పట్టుకోలేక గాని, నా వొడి పట్టుకొని నీవు దగ్గరకు తీయగా నేను వారించేదాననా? నీతో అంతటి చనువు లేదని గాని, నీవు నన్ను సమీపించి కదియగా తప్పించుకొన్నానా? నా భయమంతా చుట్టుకొని నీ కొనగోరు నన్ను బాధిస్తుందనుకొన్నాను. నీకు గర్వమని ఉన్నదానినేగాని, నీవు నన్ను కలిసి చూపులు కలిపితే సిగ్గుతో తలవంచే దానినా? నాలో చిగురించే సిగ్గులకు భయపడిగాక నీవు అందంగా నవ్వితే నేను పరాకు చెందేదానినా? నీతో మంచికీ చెడుకీ ఎక్కువ మాట్లాడటమేగాని, నీవు సరసాలాడగా సమ్మతించిన దాననేగదా. ఈవిధంగా స్వామీ! నీవు పట్టుకొన్నావు. మన యిద్దరి మన్ననలు వొద్దికగా వుండబోతాయి సుమా!
గౌళ
ఒకటి కనుమదాయ నొద్దిక నీవలపులు
మొకమిచ్చలనాపొందు ముమ్మడించె నిపుడు ॥పల్లవి॥
వీడెమిచ్చినాపై నీపై వేడుకలు సేయఁగాను
వాడవారిపైఁ జల్లేవు వసంతము
వోడఁగట్టినదూలమై వొకతె నీకుండఁగాను
ఆడనే వేరొకతెకు నంటుబచ్చలై తివి ॥ఒక॥
పాదాలొత్తేయాపె నిన్నుఁ బలుకులఁ గొసరఁగ
వీదివారితో నాడేవు వెడమాటలు
తోదోపుల వేరొకతె తోడునీడై వుండఁగాను
సోదించి వేరొకతెకు సూదిరాయి వైతివి ॥ఒక॥
కాఁగిలించుకొన్న యాపె కందువలఁ గరఁగఁగా
లోఁగిటిలోనియాపెకు లోనైతివి
చేఁగదేరొకతె నీకు జిగురుఁగండై వుండఁగా
పాఁగి శ్రీ వేంకటేశ నాపాలిభాగ్య మైతివి ॥ఒక॥ (232)
భావము: పరసతిపై మోహంగల పతిని ఆమె నిందిస్తోంది:
శ్రీ వెంకటేశ! నీ ప్రేమలు ఒకటికి రెండయినాయి. మొహమాటంతో నా తోడి పొందు మూడింతలైంది. నీకు తాంబూలమిచ్చిన భామ నీతో సరదాపడగా నీవు ఊళ్లో వనితలపై వసంతాలు చల్లావు. నీకు విడిపోని బంధంగా ఒక వనిత ఉండగా (అనపాయిని) అక్కడే మరొకతెకు నీవు అంటుబచ్చలివి అయినావు. నీ పాదసేవ చేసే వనిత మాటలతో నిన్ను కొసరుతుండగా, నీవు వెదికి పట్టి మరొకతెకు అయస్కాంతమైనావు. నీవు కౌగిలించుకున్న వనిత ఏకాంతంలో మురిసిపోగా, నీ యింటిలోపల ఉన్న ఆమెకు నీవు లోబడ్డావు. ఒకతె నీకు చేవదేరి జిగురుకండెగా ఉండగా స్వామీ నీవు పొంగిపోయి నాపాలి భాగ్యమైనావు.
(ఇంకా ఉంది)