Site icon Sanchika

అన్నమయ్య పద శృంగారం-5

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

నాదరామక్రియ

వేరే (రై?) నిన్ను బాసినట్టి విరహమే యరగదు
ఆరీతి గూడివుందాననంటానే వున్నది ॥పల్లవి॥
తలపులో నీరూపు తలపోసి మదిరాక్షి
సొలసి మాటలాడి చొక్కుచు నుండు
వలపు లూరకే చల్లు వాడికలు చేసుకొని
వులివచ్చిరతులలో నోలలాడును ॥వేరే॥
నెట్టన జేతిబాగాలు నీకు సమర్పణ చేసి
అట్టె తుమ్ము (తమ్ము?)లమ్ము నిన్నడుగుచుండు
గట్టిగా నీవిచ్చిన వుంగరము చన్నులంటించి
తొట్టుకొన్న యట్టిసిగ్గుతోడ గడునవ్వును ॥వేరే॥
పైపై నీ భావచిత్రపలక కాగిట జేర్చి
దీపించు వేడుకతో తెరవేసును
యేపున శ్రీ వేంకటేశ యింతలో నీవు గూడగా
వోపికతో నాఁడు నేఁడు నొక్కరీతినున్న (సున్న)ది ॥వేరే॥ (33)

భావము: శ్రీ వెంకటేశుని గాఢంగా ప్రేమించిన ఒక వనిత ఆయననే భావిస్తూ ఊహలోకంలో తేలిపోతోంది. ఆ విషయాన్ని సఖులు స్వామికి విన్నవిస్తున్నారు.

ఓ స్వామీ! మా సఖి నీకు దూరమై నిలిచిన విరహమే ఎరుగదు. ఇంకా అదేవిధంగా నీతోనే వున్నాననే భ్రమలో వుంది. తన మనసులో నీ రూపాన్నే తలపోసిన ఆ వనిత అలసి సొలసి మాట్లాడి సొమ్మసిల్లుతోంది. అలవాటుగా తన వలపులు నీపై చల్లుతోంది. ఉలికిపాటుపడుతూ రతిక్రీడలు ఊహించుకొంటోంది. తన చేతిలో వున్న తాంబూలం నీకిచ్చి, నీ తాంబూలాన్ని యివ్వమని నిన్ను అడుగుతోంది. నీవు కానుకగా ఇచ్చిన ఉంగరాన్ని తన చనోదోయికి తాకించి భరించలేని సిగ్గుతో పెద్దగా నవ్వుతోంది. నీ చిత్రపటాన్ని కౌగిట బంధించి అనందంగా తెరపచ్చడం వేసుకొంటోంది. నీవు కూడిన వేళను స్మరిస్తూ నాడూ, నేడు ఒకే రకంగా వుంది.

మోహపరవశమైన ఉన్మాదస్థితి యిది.

లలిత

అట్టే నీకాగిటి కాపె యాసపడి వచ్చెనేమో
దట్టముగ నిక దయదలచగరాదా ॥పల్లవి॥
మోవితేనె లుట్టిపడ ముచ్చటలాడీ జెలి
వోవరిలో గూచుండి వూకొనరాదా
చేవమీర గొనగోళ్ళ జిక్కు దీసీని నెరులు
సేవలకు మెచ్చి యిట్టె చిత్త గించరాదా ॥అట్టే॥
కొనచూపులనే నీపై గుమ్మరించీ వలపులు
పెనగక కాగిటికి బిలువరాదా
తనివోనితమకాన దడబడి నీకు మొక్కీ
చనువు చేకొని సరసములాడరాదా ॥అట్టే॥
సెలవుల నవ్వులనే సేసలు నీపై బెట్టీ
లలి గంకణము గట్టి లాలించరాదా
యెలమి శ్రీ వేంకటేశ యేలితి వీకె నింతలో
వెలసె నీకోరికలు విడెమియ్యరాదా ॥అట్టే॥ (34)

భావము: చెలులు తమసఖి పక్షాన వేంకటేశునికి విన్నపాలు చేస్తున్నారు. ఓ వేంకటేశా! నీ కౌగిలి కోసం మా చెలి ఆశపడి వచ్చిందేమో! గాఢంగా దయదలచకూడదా! పెదవులపై తేనెలు చిందులు వారగా మాచెలి నీతో ముచ్చటలాడుతోంది. చంద్రశిలలో కూర్చొని ఊకొట్టరాదా? అందమైన తన కొనగోళ్లతో నీ తల వెండ్రుకల చిక్కు తీస్తున్నది. ఆమె సేవలకు మెచ్చి అంగీకరించరాదా? నీపైన తన వలపులతో గూడిన కడగంటి చూపులు ప్రసరింపజేస్తోంది. ఆలసించక కౌగిట చేరమని పిలవరాదా? పట్టరాని మోహంతో తడబడుతూ నీకు మొక్కుతోంది, చనవుచేసి సరసాలాడరాదా? పెదవి మీద నవ్వులనే తలంబ్రాలు (సేసలు)గా పోస్తోంది. చేతికి కంకణం కట్టి లాలించరాదా? ఓ స్వామి! ఈమెను ఏలుకొన్నావుగదా నీ కోరికలనే తాంబూలం అందించరాదా – అని చెలులు ప్రాధేయపడుతున్నారు.

బెట్టు చేస్తున్న విభునికి చేస్తున్న విన్నపాలివి.

సాళంగం

నా వల్ల, (యందు) దప్పు లేదు నేనా చాటిచెప్పితిని
నాయము మీరు చెప్పరే నాకూ నాతనికీ ॥పల్లవి॥
పాయపువాడు గనక పంతములే యాడీని
చాయల నేనూ నిట్టే జవ్వనిగదే
చేయి మీదాయనంటాను చెనకగవచ్చీని
ఆయములు నేనూ గొంత అట్టె సోకింతుగదే ॥ నా వల్ల॥
వేడుకకాడు గనక వేసీ బూవులచెండున
వాడికి నాత్మ తనవంటిదే కదే
వీడెమిచ్చితినంటాను వెస గొంగువట్టీని
తోడనే నేసూ గాలుదొక్కి పైకొందుగదే ॥ నా వల్ల॥
బలిమికాడు గనక పట్టీ నాచనుగవ
నలి నేనూ గాగిట బెనగుదుగదే
యెలమి శ్రీ వేంకటేశు డింతసేసి నన్ను గూడె
కలసి తనమోవి యెంగిలిసేతు గదవే ॥ నా వల్ల॥ (35)

భావము: నాయిక తన చెలులతో విభుని ఉపేక్షను గుర్తు చేస్తోంది. ఓ చెలులారా! నా వలన ఏ దోషమూలేదు. నేను అందరికీ చాటింపు వేయలేదుగదా! మా యిద్దరి మధ్యా న్యాయం మీరే చెప్పండి. అతడు మంచి ప్రాయంలో వున్నాడు గాబట్టి పంతాలు పలుకుతున్నాడు. వయసులో ఉన్న యవ్వనవతినే నేను. చేయిపైన అయినదంటూ ఎదిరిస్తున్నాడు. నేనూ మర్మస్థానాలు సోకించగలను. అతడు జారుడు గనుక పూల చెండు విసురుతున్నాడు. నా మోహము తనవంటిదే గదా! తాంబూలం యిచ్చానంటూ నా కొంగు పట్టుకొన్నాడు. వెంటనే నేనూ కాలుతొక్కి పైబడగలను. అతడు బలిష్ఠుడు గనక నా చనుదోయి పట్టుకున్నాడు. నేను కూడా ప్రియంగా కౌగిట్లో పెనగగలను గదా! శ్రీ వేంకటేశ్వరుడు నన్ను పొంది ఇంత చేశాడు. నేను కూడా అతని పెదవిని ఎంగిలి చేయగలనులే – అని నాయిక తన మోహాన్ని వ్యక్తం చేస్తోంది.

మధ్యమావతి

వెలయ ముందటెత్తు విచారించుకొనవయ్య
కలసేవు నాకాగిట గాదనేనా నేను ॥ పల్లవి॥
బచ్చెనమాట లాడి భామ నిన్ను వలపించె
యిచ్చకములే సేసి యిల్లుమరిపె
లచ్చనగా మోవిమీద లకముద్రలును బెట్టె
యిచ్చటికి విచ్చేసితి వేమనునో ఆపె ॥ వెల॥
గక్కన తనసొమ్మని కంకణము చేత గట్టె
తక్కక సేవలుసేసి తమిరేచెను
పక్కన బూవులదండ పైవేసె గురుతుగా
ఇక్కడ నన్ను జెనకే వేమనునో ఆమె ॥ వెల॥
నెలకొని పాదాలొత్తి నిన్ను నిట్టె పెండ్లాడె
లలి గంటలనూలు నీమొల గట్టెను
చెలగి నాకు వలచి శ్రీ వేంకటేశ కూడితి –
వెలమి నిట్టె విని యేమనునో ఆపె ॥ వెల॥ (36)

భావము: దక్షిణ నాయకుడైన స్వామిని మరొక భామిని ఎత్తి పొడుస్తోంది. ఆతని శరీరంపై వున్న ఆనవాళ్లు చూసి హెచ్చరిస్తోంది. ఓ వేంకటేశ నా కౌగిట్లో చేరావు. నేను కాదనలేను సరే. నీ ముందరి సంగతి ఆలోచించుకో! మాయమాటలు ప్రీతిగా పలికి ఆ భామ నిన్ను వలపింపజేసింది. ప్రీతిగా మాట్లాడి తన యిల్లు మరిపింది నీకు. లక్షణంగా నీ పెదవి మీద అదుగో! లక్క ముద్రలు వేసింది. నీవేమో యిక్కడికి నా వద్దకు వచ్చావు. ఆమె ఏమి దెప్పి పొడుస్తుందో.

నీవు తన సొమ్మని నీ చేతికి కంకణం కట్టింది. నీకు ఎన్నో సేవలు చేసి మోహాన్ని పెంచింది. నీ మెడలో గుర్తుగా పూలదండ వేసింది. ఇప్పుడు నా దగ్గరకు చేరావంటే ఆమె ఏమంటుందో. ఆమె నీకు పాదసేవ చేసి నిన్ను అలా పెండ్లాడింది. నీ మొల నూలు గంటలు కట్టింది. ఇప్పుడు నన్ను వలచి వచ్చికూడావు. ఇది వింటే ఆమె ఏమనునో ఆలోచించు- అన్యాపదేశంగా విభుని దక్షిణ నాయకత్వాన్ని గుర్తు చేస్తోంది.

రేకు 807

సాళంగనాట

ఈదుకరమ్మనవే యిటు నన్ను జూచుగాని
యీదాడంటే గోదాడనేయెడమాట లేటికి ॥ పల్లవి॥
వలపు లీతలబంటి వడి నాకు నైతేను
తలపోతలకునైతే కలబంటి
కలువల కైతేను కామువింటితెగబంటి
చిలుకల కెల్లాను మచ్చిక బుక్కిళ్లబంటి ॥ ఈదు॥
పాయము మోపులకొద్ది పైపైనాకైతేను
కాయపుగుబ్బలకైతే గంపలకొద్ది
చాయవెన్నెలలకైతే చంద్రుడుగాసినకొద్ది
కోయిలలకై తేను కుత్తిక కొద్ది ॥ ఈదు॥
సారమైనవేడుకలు సందెడేసి నాకైతేను
కోరికలకై తేను గుంపెడేసి
యీరీతి శ్రీ వేంకటేశు డిట్టెవచ్చి నన్నుగూడె
శేరికలనోరిరొద చెప్ప జేటడేసి ॥ ఈదు॥ (37)

భావము: వలపుల నదిని దాటి తనవద్దకు ఆతనిని రమ్మని చెలులకు నాయిక చెబుతోంది. ఓ సఖీ! నన్ను చూడడానికి నదిని ఈదుకొని రమ్మనవే! ఈదడం మొదలెడితే గోదారి దాటడమే. వేరు మాటలేమిటికి? నాకైతే ఈ ప్రేమలు తలబంటి. తలపోతలకు తలబంటి. కలువలకైతే మన్మథుని వింటి తెగబంటి. చిలుకలకంతా ప్రేమ పుక్కిళ్ల బంటి. నాకైతే పాపం మోపుల కొద్ది. శరీరపు చనుదోయికు గంపలకొద్ది. వెన్నెలలకైతే చంద్రుడు కాసిన కొద్ది. కోయిలలకు కుత్తుకబంటి. నాకైతే వేడుకలు సందిట నిండా. కోరికలు గంపెడేసి. గోరింకల నోటి రొదలు చేరడేసి. ఈవిధంగా శ్రీ వేంకటేశుడు వచ్చి నన్ను కలిశాడు సుమా!

ఆహిరి

మగడట ఆలట మాటలెన్నైనా నాడితే
తగు తగదన నేలే తరుణులాలా ॥ పల్లవి॥
పాయపువారికినెల్లా పట్టరాదు తమకము
ఆయాలు సోక బతితో నాడకుందురా
చేయిమీదుగా నీతని జెనకెనంటా సతికి
నాయము లేమిచెప్పేరే నాతులాలా ॥ మగ॥
వలచినవారికి వడియుచుండు మదము
బలిమి బ్రియునికొంగు పట్టకుందురా
పెలుచుదనా నీకె పెనగెనంటా మీరు
పలుకనేలే సాకిరి పడతులాలా ॥ మగ॥
తతి గూడినవారికి దాచరాదు గర్వము
మితులు రతులలోన మీరకుందురా
ఇతవై శ్రీవేంకటేశునెద నీపె వున్నదంటా
కత లేమాడుకొనేరే కాంతలాలా ॥ మగ ॥ (38)

భావము: ఓ భామలారా! ఆలుమగలు అనే మాటలు ఎన్ని అయినా పలికితే ఔను, కాదనడ మెందుకే! వయసులో వున్న వారికందరికీ మోహం భరింపరానిది. మర్మస్థానాలను అంటితే పతితో క్రీడించకుండా ఉండగలరా? పైచేయిగా ఆమె ఇతనిని ఎదిరించెనట! అట్టి సతికి న్యాయాన్ని గూర్చి ఓ యింతులారా! ఏమి చెప్పగలరు.

ప్రేమించిన వారికి మదము స్రవిస్తూ వుంటుంది. అంత మాత్రం చేత ప్రియుని కొంగు పట్టుకొనకుందురా! అతిశయంతో ఈమె అతనితో పెనగులాడెనట. ఓ పడతులారా! మీరు సాక్ష్యము పలుకనేలా? పొందు గూడిన వారికి గర్వము దాచకూడదు. అట్టి రతి వేళలలో పరిమితులను దాటకుందురా? ఈమె శ్రీవేంకటేశుని ఎడదపై ఇష్టంగా వాలి వుంది. ఓ కాంతలారా ! మీరు కథలేమి చెబుతారే ఆమెను గూర్చి అని సఖులకు వివరిస్తోంది.

కా(కాం) బోది

చెల్లబో యెన్నాళ్లైనా జిన్న దానవా
వెల్ల విరి నీతనికి వినయాలు సేయవే ॥ పల్లవి॥
యీపొద్దు నీపతి వచ్చె నేల సిగ్గులువడేవే
చూపుల నివాళ్లేవే సుదతి
తీపైననీమోవివిందు తెల్లమిగ జెప్పవే
యేపున నీవేడుకల నెదురుకొనగదే ॥ చెల్ల॥
నలుగడ సెలవులనవ్వుల ముగ్గుపెట్టవే
నిలువుజెమటల పన్నీళ్లియ్యవే
పలుకులకప్పురాల బాగా లొసగవే
వెలయగ నీమేను విడిదేల సేయవే ॥ చెల్ల॥
పట్టగునీకాగిట బానుపు వరచవే
గట్టినీచన్నుల దలగడ పెట్టవే
యిట్టె శ్రీవేంకటేశు డిన్నిటా నిన్ను గూడె
బట్టిగొన్నరతి నుపచారాలు సేయవే ॥ చెల్ల॥ (39)

భావము: ముగ్ధ నాయికతో చెలులు సరసాలాడి తెగనాడుతున్నారు. ఓయమ్మా! ఇంత వయసు వచ్చినా నీవింకా చిన్నదానివేనా? నీవతనికి వినయాలు ప్రకటించవే! ఈ వేళ నీపతి నీవద్దకు వస్తే నీవు సిగ్గుపడనేల, చూపులతో హారతులిమ్ము. మధురమైన నీ పెదవి విందును తేటతెల్లం చేసి చెప్పవే. సంతోషంగా వెళ్లి ఎదురుకొనవే. నాలుగు వైపులా నీపెదాల చివరి నవ్వులతో ముగ్గుపెట్టవే. నీ నిలువు చెమటలే పన్నీరుగా చల్లవే! మాటల కర్పూర తాంబూలాలియ్యవే. నీ శరీరాన్నే ఆయనకు విడిదిగా చేయవే. అందమైన నీ కౌగిలినే పానుపుగా పరచవే! ఘనమైన నీ చనుదోయిని తలదిండుగా అమర్చవే. ఈ విధంగా శ్రీ వేంకటేశుడు అన్నిరకాలుగా నిన్ను పొందాడు. ఉభయులకు ఇష్టమైన రతితో ఉపచారాలు సేయవే – అని చెలి సరసాలాడింది.

చూపులే హారతులు, మోవి తేనెలే విందు, నవ్వులే ముగ్గు, చెమలులే పన్నీరు, పలుకులే కర్పూర తాంబూలము, కౌగిలియే పాన్పు, చనుదోయి తలగడగా ఏర్పరచి రతిసౌఖ్యమిమ్మని హితవు పలికింది.

మాళవి

ఈతడు గుట్టుమానిసి యీతడు గంభీరుడు
కాతరీడు గాడు యేల కాకలు సేసేవే ॥ పల్లవి॥
చెక్కు చేతబెట్టుకొని సెలవుల నవ్వుకొంటా
మక్కువ నీతనితోడ మాటలాడేవు
జక్కవచన్నులమీది చంద్రకానిపయ్యద
పక్కన జారించి యెంత భ్రమలబెట్టేవే ॥ ఈత॥
తలిరుమోవి చూపి తములము సేసుకొంటా
పలుమారు నీతని దప్పక చూచేవు
చెలులమాటుననుండి సిగ్గులు నెరపుకొంటా
వలపులు చల్లి యెంత వలల బెట్టేవే ॥ ఈత॥
చిమ్ముజెమటలతోడ సేసకొప్పు గదలగ
కమ్ముక శ్రీ వేంకటేశు గాగిలించేవు
పమ్మి నన్ను గూడినాడు బయలుసింగారాల
యెమ్మెలుసేసి యేల యెల ఇంచేవే ॥ ఈత॥ (40)

భావము: ఓయమ్మా! నాతో కూడివున్న విభుని నీవు లోబరచుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తావని దండిస్తోంది.

శ్రీవేంకటేశుడు గుట్టుగా వుండే వ్యక్తి. గంభీరమైన స్వభావం గలవాడు. కాతరడు కాదు. అట్టి వానితో నీవు ఎందుకు వలపులు పంచుతావు. బుగ్గ మీద చేయి వేసికొని పెదవులపై నవ్వుతూ ఇతనితో మాటలాడనేల. జక్కువ పక్షులవంటి చన్నుల మీది సింధుర వర్ణపు (ఎర్రని) పైట పక్కకు జారింది. నీవతనికి ఎంతటి భ్రమలు కలిగిస్తున్నావే! చిగురాకు పెదవిని చూసి తాంబూలం వేసుకొంటూ అనేకమార్లు అతనివైపు తదేకంగా చూస్తున్నావు. నీ సఖుల వెనక దాగి సిగ్గులు పోతూ ప్రేమజల్లులు చిలకరిస్తూ వలలు విసురుతున్నావు గదే! వొంటినిండా చెమటలతో పూలకొప్పు కదలగా గాఢంగా శ్రీ వేంకటేశుని కౌగిలించుకొన్నావు. ఇప్పుడు నాతో కూడిన అతనితో నీవు పై పై సింగారాలతో విలాసాలు చూపి భ్రమపెట్టినేలనే అని గద్దిస్తోంది.

బౌళి

అతడు నీకు మోహించీ నన్నిటా బత్తిసేసీని
చేతికి లోనై వుండవే చెప్పితినే బుద్దులు ॥ పల్లవి॥
వినయములే సేసి వేడుకలు చూపవే
మనసురా బతితోను మాటలాడవే
తనివోవ కేపొద్దు దండ గాచుకుండవే
ననుపుసేసుకొని నవ్వులెల్లా నవ్వవే ॥ అత॥
యెగ్గులు వట్టకువే ఇచ్చకము సేయవే
సిగ్గులువడకువే చెనకితేను
వెగ్గళించి రతులలో వేసట సేయకువే
అగ్గమై చన్నుల నొత్తి యట్టె పెనగవే ॥ అత॥
మొగమెత్తి చూడవే మోహములు చల్లవే
చిగురుమోవి చూపి చెలగించవే
జిగిమించ నంతలోనె శ్రీ వేంకటేశుడు గూడె
తగిలి పాయకు తముల మడుగనే ॥ అత॥ (41)

భావము: ఓయమ్మా! ఆతడు నిన్ను మోహించి అన్ని విధాలుగా భక్తి చూపాడు.

అతనికి అధీనంగా వుండవే. బుద్దులు చెప్పావే. నీవు వినయాలు చూపి అతనికి సంతోషం కలిగించు. పతిపై మనసు కలిగి మాట్లాడవే! తృప్తి చెందక అన్ని వేళలా అతని పక్కనే వుండవే. ప్రేమతో నవ్వులన్నీ నవ్వుతున్నావే. తప్పులు ఎన్నకుండా ప్రీతిని కలిగించవే. ఎదురుపడితే సిగ్గులొలికించకు. అధికమైన రతులతో శ్రమపడేలా చేయకుము. ప్రియంగా చనులతో వొత్తి అలా పెనుగులాడవే, మొహమెత్తి చూచి భ్రమలు కలిగించవే. చిగురాకు వంటి పెదవిని చూపి ఉద్రేకం కలిగించవే. ఇంతలోనే శ్రీవేంకటేశుడు నిన్ను కలియగా తాంబూలం అడగగానే దూరంగా వెళ్లవద్దు – అని ముద్దరాలికి సుద్దులు చెబుతోంది.

రామక్రియ

తనచిత్త మెఱగము తగులు నెట్టు వచ్చునే
చెనకేగానీ ముందే సేసవెట్టు మనవే ॥ పల్లవి॥
ననుపుగలసతులు నవ్వితే నమరు గాక
పెనగితే వింతవారు ప్రియమయ్యేరా
చనవు గలిగితేను సరసమాడుట గాక
మనసెనయనిచోట మచ్చిక గలుగునా ॥ తన॥
పిలిచితే గొంతగొంత బిగియగవచ్చుగాక
తలచకుండగ వచ్చి తమిరేతురా
వలపు గలుగుచోట వాడికి సేతురుగాక
కెలనిచుట్టాలు రతికేలి సేయదగునా ॥ తన॥
చెక్కునొక్కి వేడుకొంటే సిగ్గువడవచ్చుగాక
అక్కడిమోమై యుండగా నంటవచ్చునా
యిక్కు వెరిగి శ్రీ వేంకటేశుడే నం(న)న్నేలెగాక
తక్కినవారికినెల్లా దడవగ వచ్చునా ॥ తన॥ (42)

భావము: నాయిక తనపై ప్రియుని ఉదాసీన భావాన్ని చెప్పి బాధపడుతోంది. ఓ సఖీ! ఆయన మనసేమిటో తెలియదు. అలాంటిది అతనిని కలియుట ఎట్లు? నన్ను తాకుతున్నాడుగాన ముందు సేసలు పోయమని చెప్పవే! ప్రేమగలిగిన కాంతలు నవ్వితే అందంగాని, పెనగులాడితే కొత్తవారు ప్రియమవుతారా? చనవుగా మాట్లాడినప్పుడు సరససల్లాపాలు ఆడవచ్చును గాని, మనసులేని చోట ప్రియము కలుగుతుందా? నన్ను వచ్చి పిలిచితే కొంత బెట్టు చూపవచ్చును గాని, నన్ను పట్టించుకోకుండా వచ్చి మోహాన్ని రెచ్చగొడతారా? ప్రేమ గలిగినచోట కలిసి వుండవచ్చును గాని, దగ్గరి చుట్టాలతో రతికేళి చేయవచ్చునా? అతడు ఇష్టపడివచ్చి బుగ్గ గిల్లి వేడుకొంటే సిగ్గుపడవచ్చుగాని, పెడమామై వుండగా అతనిని మరగవచ్చునా? శ్రీ వేంకటేశుడే నా జాడ తెలిసి వచ్చి నన్నేలెను గాని, మిగిలిన వారందరినీ గుర్తు తెచ్చుకోగలమా? అని తన మనసులోని వ్యథను గుర్తు చేసింది.

(ఇంకా ఉంది)

Exit mobile version