అన్నమయ్య పద శృంగారం-6

0
3

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

కాంబోది

అంగన నీతో బెనగదంటా నేలసాదించేవు
చెంగలువవంటిది చెనక నిన్నోపునా ॥ పల్లవి॥
సెలవుల నవ్వేది సిగ్గుతోడ నుండేది
వలపుల సొల పాడువారిసాజము
చవివాయ లాలించేది చనవులు చెల్లించేది
నెలకొని మన్నించేది నీచేతి దికను ॥ అంగ॥
తనివోవక చూచేది దండనే నిలుచుండేది
గనమైనవినయమే కాంతలవోజ
మనసిచ్చి మాటాడేది మచ్చికతో గలసేది
నిను సేవించనిచ్చేది నీచేతి దికను ॥ అంగ॥
గుట్టుతోడ నుండేది కొసరుచు మొక్కేది
దట్టపుటాసలు వనితలగుణము
యిట్టె శ్రీ వేంకటేశ యీకె నేలుకొంటివి
నెట్టన బాయకుండేది నీచేతి దికను ॥ అంగ॥ (43)

భావము: ముగ్ధయైన తమ సఖి సిగ్గు పడుతున్నది గాని నీవు నీ యిష్టం వచ్చినట్లు ప్రేమను చూపుమని చెలి శ్రీ వేంకటేశునితో పలుకుతోంది.

ఓ వెంకటేశ! మా సఖి నీతో కూడలేదని ఏల సాధిస్తావు. ఎర్రకలువ వంటి దీమె నీ మోటు సరసానికి తట్టుకోగలదా? పెదవులపై నవ్వుతూ సిగ్గుల మొగ్గ అవుతోంది. వలపులతో సొమ్మసిల్లడం వారికది సహజగుణము. ముద్దుగా లాలించడము, చనవులు చూపడము, తప్పులు మన్నించడము ఇకపై నీ చేతిలో సంతృప్తి పడకుండా చూడడము, నీ పక్కనే నిలుచోవడము, అధికంగా వినయ విధేయతలు చూపడము ప్రియురాండ్ర సహజగుణము. మనసిచ్చి మాటలాడటము, తమతో కలియడము, సేవలు చేయించుకోవడము నీ చేతిలో పని. రహస్యంగా ఉండటము, మాటిమాటికి మొక్కడము, బలమైన ఆశలు స్త్రీలకు సమాజము. ఓ స్వామీ! ఈ విధంగా నీవామెను ఏలుకున్నావు. ఇక ఆమెను విడనాడకుండటం నీచేతిలో పని.

సిగ్గరియైన కాంత లక్షణాలు, ధీరుడైన నాయకుని లక్షణాలను అన్నమయ్య ఈ కీర్తనలో వివిధ భంగిమలలో పులకింపజేశాడు.

బౌళిరామక్రియ

నెఱజాణ విన్నిటాను నీవెఱగవా
మఱి నీచిత్తముకొద్ది మమ్ము మన్నించవయ్యా ॥ పల్లవి॥
చెలిమి కొలదియే చెల్లుబడి
కలిమికొలదియే కాపురము
వలపుకొలదియే వాడిక
తలపు కొలదియే తాలిమి ॥ నెఱ॥
పట్టినకొలదియే పంతము
చుట్టరికముకొలదే సోబనము
దిట్టతనముకొలదే తేకువ
నెట్టుకొన్న కొలదే నిలుకడ ॥ నెఱ॥
కూడినకొలదియే కూటమి
వేడుకకొలదియే విందులు
యీడనె శ్రీ వేంకటేశ యెనసితివి.
యీడుజోడై నకొలదే యింపులు ॥ నెఱ॥ (44)

భావము: దక్షిణనాయకుడైన శ్రీ వేంకటేశుడు నెరజాణ. అతని ప్రవర్తనను నాయిక విశ్లేషిస్తోంది.

ఓ వెంకటేశ! అన్నిటిలోను నీవు నెరజాణవు అనే విషయం నీకు గుర్తులేదా? నీవు దయతో నన్ను (మమ్ము) మన్నించవయ్యా! చెల్లుబడి స్నేహాన్ని బట్టి ఆధారపడి వుంటుంది. సంపదలు కలిగినపుడే కాపురము (ఉన్నప్పుడే కాపురం) ప్రేమను బట్టి రాకపోకలు. మనసును బట్టి ఓర్పు. పట్టుకొన్నంతవరకు పంతము. చుట్టరికాన్ని బట్టి శోభనం (శుభము) ధైర్యము దిట్టతనంపై ఆధారపడి వుంటుంది. పూనిక వున్నంతసేపే నిలకడ వుంటుంది. కలిసి మెలసి ఉన్నంత వరకు సఖ్యత. వేడుకలున్నంతవరకే విందులు. ఓ స్వామీ! ఇక్కడనే కలిశావు. ఈడు జోడయినంత సేపుసంతోషాలు.. అంటూ నాయిక స్వామికి విన్నవిస్తోంది.

ప్రేమ సామ్రాజ్యాలలో సరిహద్దులను సఖి వివరిస్తోంది.

పాడి

కాంతలకు బతులకు గడవరా దీమాయ
యెంతని చెప్పుదు దానే యెరుగు నావలపు ॥ పల్లవి॥
వదినె మరదియనేవావులే యాసలు రేచు
కదిసి పాయకుండితే కాక పుట్టించు
చెదరని చూపులే చింతకు మూలములవు
పొదలునేకాంతాలు పొందులెల్లా జేయును ॥ కాంత॥
పచ్చిదేరేసిగ్గులే భావములు గరగించు
ముచ్చటనవ్వులే కడుమోహము నించు
కచ్చుపెట్టి సరసాలు కాయము లంటింపించు
యిచ్చకము వినయము నింపులు పుట్టించును ॥ కాంత॥
పాయపుమదములు గొబ్బన రతులకు దీసు
చాయలు సన్నలు మోవిచవులు చూపు
యీయెడ శ్రీ వేంకటేశు డింతలోనె నన్ను గూడె
ఆయమైనమాటలు అన్నిటా జొక్కించును ॥ కాంత॥ (45)

భావము: నాయిక తన విభుని ప్రియమైన చేష్టలు వర్ణిస్తోంది. ఏమమ్మా! సతీపతులకు మోహమునే మాయ దాటరానిది. నేను ఎంతని వర్ణించగలను. నా ప్రేమ సంగతులు తనకే తెలియును. వదిన, మరదళ్ల వావి వరుసలే ఆశలను పెంచుతాయి. దగ్గరగా చేరి ఎడబాటు లేకుంటే వేడిని పుట్టించును. చెక్కుచెదరని చూపులే చింతిల్లడానికి మూలకారణాలవుతాయి. ఏకాంతంగా ఉండటాలు కలయికకు కారణాలవుతాయి. నును సిగ్గులే మనసులోని ప్రేమభావములను కలిగిస్తాయి. ముచ్చటపడి నవ్వే నవ్వులే అధికమైన మోహాన్ని నింపుతాయి. పట్టుదలగా చేసిన సరసాలు శరీరాలను దగ్గర చేస్తాయి. ప్రీతితో గూడిన వినయం అందాన్ని కలిగిస్తాయి. వయసులో వున్న మదములు వెంటనే రతులకు దారితీస్తాయి. వన్నెలు, చిన్నెలు పెదవి తీయదనాన్ని చూపుతాయి. మర్మంగా మాట్లాడే మాటలు అన్నివిధాలుగా సొమ్మసిల్లజేస్తాయి. ఇంతలోనే ఇక్కడ నన్ను శ్రీ వేంకటేశ్వరుడు కూడుకొన్నాడు – అని నాయిక వివరిస్తోంది.

మంగళ కౌశిక

విన్నవించవే యీమాట విభునికిని
కన్నులారా దానే వచ్చి కనుగొనుమనవే ॥ పల్లవి॥
తన్ను దలచుకొంటేను తలపోతలు
విన్న వినుకలి రేచీ వేడుకలు
చన్నులపై జేసినాడు చంద్రవంకలు
యెన్నరానినామోహ మేమని చెప్పుదునే ॥ విన్న॥
దిట్టనై నే నొంటినుండితే విరహము
అట్టె తొంగిచూచితేను ఆడియాసలు
కట్టినాడు ముంజేత గంకణము
యెట్టు వేగించగవచ్చు నేమి సేతునే ॥ విన్న॥
నేనే మాటాడేనంటే నిండీ సిగ్గు
మోనమున నుండితేను ముంచీ దమి
తానే శ్రీవేంకటేశుడు తగ నన్నేలె
యీనెపాలెల్లా నాకు నేమిటికి వచ్చునే ॥ విన్న॥ (46)

భావము: ముగ్ధనాయిక తన విరహాన్ని సఖి ద్వారా విభునికి విన్నవిస్తోంది. ఓ సఖీ! నా మాటగా విభునికి విన్నవించవమ్మా! నా విరహాన్ని తానే స్వయంగా వచ్చి కనులారా చూడమనవే! ఆయనను స్మరిస్తేనే ఎన్నోరకాల ఆలోచనలు చుట్టు ముట్టాయి. ఆయనను గూర్చి విన్న వార్తలు నాలో మోహాన్ని (వేడుకలను) రెచ్చగొడుతున్నాయి. ఇదిగో నా చనుదోయిపై చంద్రవంకలవలె గోటితో ఏర్పరచాడు. చెప్పలేని నా మోహాన్ని ఏమని వివరించేను. ధైర్యం చేసి వొంటరిగా నేనుంటే విరహం ముంచెత్తుతోంది. అతని వైపు అలా తొంగి చూస్తే అడియాసలు బయలుదేరాయి. ఆతడు నా ముంజేతికి కంకణం కట్టివేశారు. ఇంక నేనేమి చేసేది. ఎలా వేగేది. నేనుగా మాట్లాడాలనుకొంటే ఎక్కడలేని సిగ్గు, మోహ పారవశ్యంలో వుంటే వలపు ముంచుతోంది. శ్రీ వేంకటేశుడు తానే నన్ను ఏలుకొనగా ఈ విధమైన నెపాలెన్నడం నాకెందుకు అవసరం చెప్పు – అని సఖి ముందు బాధ పడుతోంది.

దేసాళం

ఏమని చెప్పుదుమయ్య యిదివో నీ భాగ్యము
భామవేడుకలు నీకు నామనై నిలిచెను ॥ పల్లవి॥
చెలిమేన గురిసేటి చెమటలవానకు
మొలచె జిరునవ్వులు మోసులెత్తి
చలువమంచితనాలు జవ్వనము పంట వండి
కొలదిలేనిచన్నుల గొప్పరాసులాయను ॥ ఏమ॥
కలికిమోముననున్న కారుమెఱుగులకును
జలజల బల్కుదేనె జడివట్టెను
యెలమి సింగారరస మేరులు నిండా బారి
తలపోతచెరువుల దైవారె మరవలు ॥ ఏమ॥
అలమేలుమంగమోహమనేసోనలు ముంచి
పలువిధములరతుల పదునెక్కెను
యెలమి శ్రీ వేంకటేశ యెదురీతకాగిట
వులివచ్చి యానందాన సూటులెత్తును ॥ ఏమ॥ (47)

భావము: చెలులు తమ సఖి వేడుకలను వసంతంతో పోల్చి వేంకటేశునకు వర్ణిస్తున్నారు. చెమటలను వానలుగా భావించి వసంతరుతువుతో పోలుస్తున్నారు. ఓ వేంకటేశా! ఇదిగో నీ భాగ్యం ఏమని చెప్పగలము. మా చెలి వేడుకలు నీకు – వసంతమై నిలిచాయి. ఎలానంటే మా చెలి శరీరంపై కురిసే చెమటలు వానకు చిరునవ్వుల మొలకలు మోసులెత్తాయి. చల్లని మంచితనాలతో కూడిన యవ్వనము పంట పండి లెక్కలేనంతగా చన్నుల గొప్పరాసులైనాయి. మా చెలి ముఖంపై వున్న కారుమేఘాలకు జలజలమని పలుకు తేనెల జడివాన ముంచెత్తింది. శృంగారరసము ఏరులై నిండా ప్రవహించి ఆలోచనల చెరువులు తూములు తెగాయి. మోహమనే వానలో అలమేలుమంగ మునిగి అనేక విధములైన రీతులలో గడుసరి అయినది. స్వామీ! మా చెలి ఎదురీత యీది కౌగిలిలో చలించి ఆనందంతో తన్మయురాలైంది.

అద్భుతమైన ఉపవాసాలు, ప్రేమజడివానలో తడిసిన నాయికానాయకుల వర్ణన యిది. ప్రబంధ కవులు తలలూపే ఉపమానాలు.

శుద్ధవసంతం

ఇంకా నెంత సేసునో యీపెకు నీతోడిపొందు
పొంకమైన కొత్తవలపులది యీ మగువ ॥ పల్లవి॥
చెమటలు మేననిండె సిగ్గులెల్లా ముంచుకొనె
రమణి నీతో సరసములాడగా
తమకము లుప్పతిల్లె తగ నిట్టూర్పులు రేగె
తిమురుచు సారెకు నీదిక్కు చూడగాను ॥ ఇంకా॥
సెలవుల నవ్వుదేరె సేసకొప్పు వెడజారె
నెలత నీ కొలువులో నిలుచుండగా
పులకలు మేన నిండె పొదిగె నడియాసలు
నెలకొన్న వేడుకతో నీవద్ద నుండగాను ॥ ఇంకా॥
కమ్ముకొనె గోరికలు కళలు మోమున దేరె
నెమ్మది జేతులెత్తి నీకు మొక్కగా
యిమ్ముల శ్రీ వేంకటేశ యీకె నిట్టె కూడితివి
చిమ్మిరేగె వలపులు సేవ సేయగాను ॥ ఇంకా॥ (48)

భావము: ముగ్ధమైన నాయిక భావాలను పతికి వివరిస్తున్నారు చెలులు. కొత్త వలపుల జవరాలు ఆమె.

కొత్తవైన వలపులు నిండిన మా చెలి నీతో పొందు అయిన తర్వాత ఇంకేమి చేయునో! చెలి నీతో సరససల్లాపాలు ఆడగా శరీరమంతా చెమటలు పట్టాయి. సిగ్గుల మొగ్గయై (ముంచుకొని) నిలుచున్నది. ప్రయత్నపూర్వకంగా మాటిమాటికి నిన్ను చూడగా ఆమెకు మోహం అతిశయించింది. మిక్కిలిగా నిట్టూర్పులు విడుస్తోంది. మా సఖి నీ సాన్నిధ్యంలో నిలబడగా పెదవులపై నవ్వు విరిసింది. పూల కొప్పు జారింది. ఎంతో ఆనందంతో నీ దగ్గర వుండగా శరీరంపై పులకలు నిండాయి. అడియాసలు చుట్టుముట్టాయి. ఆమె నిండు మనసుతో చేతులెత్తి నీకు మొక్కగా కోరికలు ముసురుకొన్నాయి. ముఖంపై కొత్తకళలు వెలిశాయి. నీకు సేవలు చేయగా వలపు తలపులు చెలరేగాయి. ఆమెను నీవు ఇలానే క్రీడించావు.

రేకు 809

కేదారగౌళ

ఇంత వేగిరకత్తెనా యెఱగనా నేనేమైనా
మంతనాన నన్నతడే మన్నించీగాక ॥ పల్లవి॥
సతినేల దూరేనే పడతీ
తతిగొన్న నావలపు దడవే గాక
రతిరా జేమిచేయునే రచ్చలోనను
ఇతవరి నావయసే ఇంతసేసీగాక ॥ ఇంత॥
సవతులు నననేలే సకియా
జవళినాచూపునే సాదించేగాక
నవకపుచంద్రునితో నాకేడ పగే
తివురుచు నావయసే దిమ్మురేచుగాక ॥ ఇంత॥
విరహము దిట్టనేలే వెలదీ
తిరమైన నాబుద్ధినే తెలిపేగాక
యిరవై శ్రీవేంకటేశు డిట్టె నన్నేలె
సరససల్లాపముల సతమయ్యేగాక ॥ ఇంత॥ (49)

భావము: నాయిక తన వయసు పొంకము ఎట్టిదో చెలికి వివరిస్తోంది. ఓ పడతీ! ఏకాంతంలో అతడే నన్ను మన్నించాడు గానీ నేనేమీ తొందరపడేదానినా? నాకు గుట్టురట్టులు తెలియవా! నా వలపు ఆలస్యమైనదే గానీ పతిని నిందించనేల? రంకులుపోయే నా వయసే ఇంత చేసిందిగానీ రచ్చలో మన్మథుడేమి చేస్తాడే! వేగిరపడిన నా చూపునే సాధించెనుగానీ సఖీ! సవతులను నిందించ పనియేమి? మదించిన నా వయసే మోహాన్ని పెంచిందిగానీ చల్లని చంద్రుడేమి చేశాడు? గట్టిదైన బుద్ధియే నా అలా చేసిందిగానీ ఓ వనితా! విరహవ్యథను తిట్టనవసరం లేదే. సరససల్లాపాలతో సతమతమవుతున్నానుగాక మరేమీలేదు. అనుకులంగా శ్రీ వేంకటేశుడు ఇలా నన్నేలుకొన్నాడు.

ఆహిరి

తప్పించుకొనగలడా దాటవచ్చునా తనకు
మెప్పించేగాని పానుపుమీదికి రమ్మనవే ॥ పల్లవి॥
మగువలమాటలు మంచిచక్కెర తీపులు
నగవు లందులోనికి నానబాలు
వెగటుగా దెతై (డెంతై?) నా వేగినంతా వాడినాను
చిగిరించి చిగిరించి చిమ్మించు ననవే ॥ తప్పించు॥
పొదలుగుబ్బలు వలపులబోనపుదొంతులు
కదలుకనుచూపులు కప్రవిడేలు
అదన బెనగితేను ఆసలాసలు పుట్టించు
పొదిగిపొదిగి కడుబోది సేసు ననవే ॥ తప్పించు॥
కలసినకాగిలి కమ్మపూవుచప్పరము
బలిమి మోవిరసాలు పానకాలు
యెలమి శ్రీవేంకటేశు డింతలోనె నన్నుగూడె
తలపించి తలపించి తగిలించుననవే ॥ తప్పించు॥ (50)

భావము: ప్రౌఢ అయిన నాయిక చెలితో చెప్పి స్వామికి సవాలు విసురుతోంది. ఓ సఖీ! అతడు నన్ను తప్పించుకోగలడా? నన్ను దాటిపోగలడా? అతగాడు పానుపు మీదికి వస్తే మెప్పించగల దిట్టను. ఇంతుల మాటలు చక్కని మధురమైన చక్కెరలు. అందులోకి నానబాలు నవ్వులు. ఎంతైనా వెగటు పుట్టదు. తపించినట్లు మాట్లాడాను. మోహము నాలో చిగురించి చిగురించి తాపాన్ని ప్రేరేపిస్తోంది. నా శరీరమంతా అతనికి నైవేద్యమే. ఉన్నతమైన చనుదోయి ప్రేమబానలదొంతరలు. నా కంటి చూపులు కప్పురపు తాంబూలాలు. సరియైన సమయంలో క్రీడిస్తే ఆశలదొంతరలు పుట్టుతాయి. అవి క్రమక్రమంగా పెరిగిపోతాయని చెప్పవే. మేము ఇద్దరము కలిసిన కౌగిలియే పూల పందిరి. మధురమైన పెదవి రసాలు తియ్యని పానకాలు. మనసు నెరిగి మసలుకొంటామని చెప్పవే. ఇంతలోనే వేంకటేశుడు నన్ను కూడినాడు. మధురమైన భావన.

కా(కాం) బోది

చేరి వూరకేల రట్టుసేసేపు నన్ను
సారె నాతో నవ్వేపు నీ సరిదాననా ॥ పల్లవి॥
వెలయు నా చెక్కు నొక్కి వేడుకొనే విందరిలో
అలుగు నీతో నే నంతదాననా
మలసి యప్పటి నన్ను మాటలాడించవచ్చేవు
పలుకకుండగ నీతో బంతగత్తెనా ॥ చేరి॥
జట్టిగొని చేయిపట్టి సంగడికి దీసేపు
అట్టె పెనగ నీతో వియ్యపుదాననా
గుట్టున నాపట్టుచీరకొంగు పట్టుకున్నాడవు
తొట్టినగర్వమున నీతో బలిమిదాననా ॥ చేరి॥
జక్క వచన్నులంటే సమరతి లాలించేవు
పక్కన నీతో మెచ్చేపాటిదాననా
యిక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నెక్కొని నీవలె నం (న)న్నీ నేర్చినదాననా ॥ చేరి॥ (51)

భావము: నాయిక తన విభుని ఆగడాలను ఎత్తి చూపుతోంది. ఓ స్వామీ! నీవు నా దరికి చేరి వూరకే రభస చేస్తున్నావు. మాటమాటికి నన్ను చూసి నవ్వుతావు. అంత నవ్వుటాలుగా వుండటానికి నేను నీతో సరితూగగలనా? ఇందరిలో నా బుగ్గ గిల్లి వేడుకొంటున్నావు. నీపై కోపగించుకోవడానికి నేనంత పెద్దదానినా? నా దగ్గర చేరి అప్పటివలె నాతో మాట్లాడటానికి వచ్చావు. పలుకకుండ వుండే దానికి నేను పంతాలు బోయేదానినా? రహస్యంగా నా పట్టు చీర కొంగు పట్టుకొని సరసాలాడుతున్నావు. నేను అంత అధికమైన గర్వంగల దానినా? జక్కవ పక్షులవంటి చనుదోయి పట్టుకొని సమరతిలో నన్ను ఆనందింపజేస్తున్నావు. నీ పక్కన నిలబడి నిన్ను మెచ్చుకొనేటంతటి దానినా, ఓ వేంకటేశ! ఇక్కడ నన్ను ఈ విధంగా ఏలావు. నీవలె అన్నీ నేర్చిన నేర్పుగత్తెనా? అని బ్రతిమాలుతోంది. అభిమానవతి అయిన నాయిక స్వామి కరుణకు పాత్రురాలై తాను అణగి మణగి సమాధానాలు చెబుతోంది.

సౌరాష్ట్రం

సొలసితే పాయరానిచుట్టమవు నీవు నాకు
నెలకొంటివి నామతి నీవే యెఱుగుదువు ॥ పల్లవి॥
పిలిచి చేపట్టితేను బెళకి తప్పించుకోకు
వలపులు చల్లితేను వంచకు తల
మోలనూలు వట్టగానే మోరతోపుదనమేల
చెలువుడ మారుమోము సేసుక నవ్వేవు ॥ సొల॥
పొందులు సేయగాను పొడవు దాచకు మిక
కందువ పతినలు కడుజూపేవు
మందలించి చెనకితే మలసేవు రాజసాన
విందువలె మేనంటితే వెలవెలఁబా రేవు ॥ సొల॥
సారె బుద్దులడిగితే చల్లేవు సిగ్గులెల్లా
కోరి చూచితే నాడేవు గుఱ్ఱముమీద
యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
తారుకాణ సేసేవు దశావస్థలూను ॥ సొల॥ (52)

భావము: ఈ కీర్తనలో నాయిక దశావతార స్ఫురణ కలిగించేలా భంగ్యంతరంలో మాట్లాడుతోంది.

ఓ వేంకటేశ! నేను పరవశిస్తే నాకు నీవు విడదీయరాని చుట్టము అవుతావు. (మత్స్య). నిన్ను పిలిచి చేయి పట్టుకొంటే వొరుసుకొని తప్పించుకోకు (కూర్మ) ప్రేమను వెదజల్లితే తలవొంచుకోకు. నీ మొలనూలు పట్టగానే మోరతో తొలగదోయడమేల (వరాహ). ఓ ప్రియా! నీవు మొహం అటు త్రిప్పి నవ్వుతున్నావు (నృసింహ). నీతో క్రీడించే సమయంలో నీ ఎత్తును దాచబోకు (వామన), ఏకాంతంలో అధికంగా ప్రతిజ్ఞలు చూపుతున్నావు. (పరశురామ); మందలించి దగ్గరగా చేరితే రాచరికపు బెట్టుతో తిరుగుతున్నావు (రామ); ప్రీతితో నీ శరీరాన్ని అంటితే వెలవెలబోతున్నావు. (బలరామ) మాటిమాటికి బుద్ధులు అడిగితే సిగ్గులొలకబోస్తున్నావు (బుద్ధ). నిన్ను కామించి వస్తే గుర్రంపై తిరుగుతున్నావు (కల్కి). ఈ విధంగా నీవు నన్ను ఏలుతూ దశావతారాలకు గుర్తులు చూపుతున్నావు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here