అన్నమయ్య పద శృంగారం-8

0
2

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

నట్టనారాయణి

ఏమి సేయవచ్చునయ్య యేల సిగ్గులుపడేవు
కామినుల కేమిచ్చినా ఘనమౌను ఫలము ॥పల్లవి॥
కమ్మి యెవ్వతెచన్నుల గస్తూరి పూసితివో
వుమ్మడి నీమేన నంటివున్నది నేడు
ఇమ్ముల నింతలో జూచి యేల తుడుచుకొనేవు
నెమ్మి నీచేసినచేత నిన్నే తగిలెను ॥ఏమి॥
పడతి కెవ్వతెకును బాగా లొసగితివో
వుడివోని(క?) నీపుక్కిట నున్నది నేడు
అడరి తలచుకొని యట్టే వుమియజూచేవు
నడుమ నీవిచ్చినపుణ్యమే నిం(ని)న్నంటెను ॥ఏమి॥
శ్రీ వేంకటేశ యెవ్వతె జేరి వురమెక్కితివో
వోవల నీవురముపై నున్నది నేడు
ఆవిధాన నన్నేలితి వన్నిటికి మెచ్చేవు
కావించిన వినోదము కడు నినుమడించె ॥ఏమి॥ (63)

భావము: సఖి శ్రీవేంకటేశుని దక్షిణ నాయకత్వాన్ని గుర్తు చేస్తోంది. ఓ వేంకటేశా! నిన్ను ఏమి చేయగలం? సిగ్గులు పడతావెందుకు? ప్రియురాండ్రకు ఏమిచ్చినా అది ఇబ్బడిముబ్బడి ఫలాన్ని ఇస్తుంది. దగ్గరగా వెళ్లి ఎవతె చనుదోయికో కస్తూరీ సుగంధం పూశావు. ఆ కస్తూరి వెచ్చదనం ఇంకా నీ శరీరంపై ఆనవాలుగా వుంది. ఇంతలోనే దానిని తుడుచుకొంటున్నావు. నీవు చేసిన చేష్ట ఫలితం నీకే తగులుకొంది. ఎవరో ఒక వనితకు తాంబూలం అందించావో, అదుగో నీ పుక్కిటిలో ఆమె యిచ్చిన వీడెము ఇంకా మిగిలిపోయి వుంది. వెంటనే దానిని తలచుకొని ఉమ్మి వేయాలని ప్రయత్నిస్తున్నావు. నీవందించిన పుణ్య ఫలితమే నీకు మధ్యలో లభించింది ఇలా. నీవు ఎవతె గుండెల మీద చేరావో, మరో వనిత (లక్ష్మి) అలవోకగా నీగుండెపై తిష్ఠ వేసింది. నీవు చేసిన సరదాలే రెండింతలై నీకు అంటుకున్నాయి. ఆ విధంగా అన్ని పనులలో మెచ్చుకొని నన్ను ఏలుకున్నావు.

రామక్రియ

ఆయ నాయ నీయెమ్మె లటుండనీవే
నీయంత నీవెఱగవు నేనైనా జెప్పేను ॥పల్లవి॥
వంతులకే వచ్చేవు వాసులెల్ల నెరపేవు
పంతములు చూపగ నాపాటిదానవా
మంతనాన నప్పటి నామగనితో నవ్వేవు
యెంతలేదే నీపగటు యేమి చెప్పేదే ॥ఆయ॥
పురుండ్లకు జేరేవు పొత్తుల మాటలాడేవు
సరుస గూచుండగ నాసరిదానవా
తెరమాటుననే వుండి తేలించేవు రమణుని
తొరలినంతటిలోనే దొరవయ్యేవా ॥ఆయ॥
సలిగెలు మెరసేవు సాటి కిట్టే పెనగేవు
అలమేలుమంగను నాయంతదానవా
కలసెను నన్ను శ్రీ వేంకటేశుడు నీవు మెచ్చే –
వెలమి నీకు గారణ మేమైనా గలదా ॥ఆయ॥ (64)

భావము: అలమేలుమంగ మరొక వనిత తన పతిని మచ్చిక చేసుకోవడాన్ని నిందిస్తూ మాట్లాడుతోంది.

ఏమమ్మా! నీ విలాసాలు అటు పక్కనేపెట్టవే! నీ అంతట నీవు తెలుసుకోలేవుగాన నేనై చెబుతున్నాను. నాతో వంతులకు వచ్చి గొప్పదనాలు ఏకరవు పెడుతున్నావు. నాతో పంతాలు పోవడానికి నాతో సరితూగలదానవా? ఏకాంతంలో వున్న నా భర్తతో నవ్వావు. నీకు గర్వం ఎంత వుందే! ఏమని చెప్పను? పోటీలు పడి వచ్చి దగ్గరగా పొత్తు కుదుర్చుకొని మాట్లాడుతున్నావు. నా పక్కన కూచోవడానికి నాతో సరిసమానమైనదానవా? తెరచాటున వుండి నా భర్తను ఆనందంలో తేలిస్తున్నావు. నీకు ఆయన ఎదురుపడగానే దొరసానివయ్యావా? చనవులు చూపుతూ సాటియైన దానివలె పెనగులాడుతున్నావు. నేను అలమేలుమంగను. నీవు నాకు సమానురాలివా? శ్రీ వేంకటేశ్వరుడు నాతో క్రీడించాడు. నీవాయనపై మనసుపడి మెచ్చడానికి కారణమేమైనా వుందా? అని అలమేలు మంగ నిలదీసింది.

బౌళి

ఆపెకేల సన్న సేసే వంతటిలోనెనే –
నేపున నీసుద్దులకు యెగ్గుపట్టేనా ॥పల్లవి॥
తొల్లిటియలవాటున తొయ్యలి పిలిచెగాక
యెల్లవారు నుండుట యెఱుగునా
చల్లగా నీవిచ్చినచనవు మెరసెగాక
చిల్లరనీసేత గుట్టుసేయగ నేర్చునా ॥ఆపె॥
యెప్పటి వలెనంటానే యెదురుగా వచ్చెగాక
చొప్పులెత్తేసవతుల జూడవచ్చెనా
కప్పేమగడవుగాగా గాగిలించుకొనెగాక
తప్పకుండా నీమర్మాలు దాచిపెట్టనేర్చునా ॥ఆపె॥
దోమతెర మరగంటా తూరి ఇంతి గూడెగాక
నీమై నలమేల్మంగ చెందిన దెంచెనా
ఆముక శ్రీవేంకటేశ ఆమాటాడెగాక నిన్ను
నేమెల్లా నియాండ్ల మవుత నిన్న మొన్న వినెనా ॥ఆపె॥ (65)

భావము: దక్షిణనాయకుడైన పతితో భామలందరూ సరసాలాడుతున్నారు. ఓ వేంకటేశా! ఇంతలోపలే ఆగకుండా నీవు సైగలు చేస్తున్నావెందుకు? నీ మాటలు విని తప్పుబట్టుతోందా? ఇంతకు ముందటి అలవాటు ప్రకారం ఆ భామ నిన్ను పిలిచిందే గాని, అందరూ నీ చుట్టూ వున్నారని ఆమెకు తెలుసునా? నీవు ప్రీతితో ఇచ్చిన చనవు తీసుకొని వెలిగిపోతోంది గాని, చిల్లరమల్లరగా నీవు చేసే పనులు దాచిపెట్టగలదా? ఎప్పటిలాగానే నీకు ఎదురుగా వచ్చింది గాని, మాటామాటా పెంచే సవతులను చూడ వచ్చిందా? కప్పిపుచ్చే మగడవని ఎంచి నిన్ను కౌగిలించుకొంది గానీ, తప్పకుండా నీ రహస్యాలు దాచిపెట్టగలదా? దోమతెర చాటుగా వుందిలే అని దూరి ఆమె నీతో క్రీడించింది గాని, నీ ఎద అలమేలు మంగదనే విషయం తెలుసా? కైపెక్కి అలా మాట్లాడింది గాని, మేమందరము నీ భార్యలమని నిన్నా, మొన్నా (ఇటీవల) వినిందా? అని ప్రశ్నిస్తున్నారు.

శంకరాభరణం

ఇట్టే పిలిపించవయ్యా ఇందరము జూచేము
గుట్టు సేసి మాముందర కొంచకు నీవింకను ॥పల్లవి॥
యేమనిచెప్పి యంపైనో ఇంతి నీకు జెలులచే
నీ మోమున గళలు నిండుకొనెను
ఆముకొని చెలులతో నాడేవు యేకాంతాలు
ప్రేమము నీకాపెమీద బెరుగగబోలును ॥ఇట్టే॥
ఆనవా లేమి యంపైనొ యప్పటివి యాకె నీకు
ఆనుక పిడికిలి గొప్పయి వున్నది
పానుపుపై నేడిదేపనై కాచుకవున్నాడవు
తానకపువలపులు తగులగబోలును ॥ఇట్టే॥
ఆస యేమి వెట్టేంపెనో అలమేలుమంగ నీకు
సేసపెట్టుకున్నాడవు శ్రీ వేంకటేశ
పోసరించి మమ్ము గూడి పొందు లాపెవి చెప్పేవు
లాసి నీవుర మాపెకు లంకెలుగాబోలును ॥ఇట్టే॥ (66)

భావము: చెలులు వెంకటేశునితో సరసాలాడుతూ అలమేలుమంగపై నీ ప్రేమ అధికమైనదని అంటున్నారు.

శ్రీ వేంకటేశ! అలమేలుమంగను ఇలా మా ముందుకు పిలిపించవయ్యా! మేమందరము చూస్తాము. ఇకపై నీవు రహస్యాలు మా ముందర బయటపెట్టడానికి సందేహించవద్దు. చెలుల ద్వారా ఆ భామ నీకు ఏ వర్తమానం పంపిందోగాని, నీముఖం వెలిగిపోతున్నది. పైకొని చెలులతో ఏకాంతాలాడుతున్నావు. ఆమెపై నీ ప్రేమ అధికమైంది గాబోలు! ఆమె నీకు ఏమి ఆనవాళ్లు పంపిందోగాని నీ పిడికిలి గొప్పగా వుంది. ఈ రోజు నీవు అదే పనిగా పడకపై కాచుకొనివున్నావు, బహుశా స్థిరమైన ప్రేమ తగులుకొన్నదేమో! అలమేలుమంగ నీకు ఏవిధమైన ఆశలు పెట్టి పంపిందో గాని నీవు అక్షతలు పెట్టుక కూచున్నావు. ఉద్రేకించిన నీ ఎడద ఆమెకు బంధం (లంకె) కాబోలు, గర్వించిన నీవు మాతో కలిసి ఆమెను క్రీడించిన వివరాలు చెబుతున్నావు అని ఎకసెక్కాలు ఆడారు.

భైరవి

చిత్తగించు నాగుణము చెప్పితి నీకు
బతిసేసి నీకు మీదెత్తితి నావయసు ॥పల్లవి॥
రారాపులదాన గాను రాతిగుండెదాన గాను
కోరి నీకు మోహించినకొమ్మను నేను
బీరము లాడుకోను; నీపేరు చెవుల వింటేను
నీరువలె గరగును నెమ్మది నామనసు ॥చిత్త॥
కుచ్చితపుదాన గాను కొసరేటిదాన గాను
ఇచ్చకమే నీకు జేసే యింతిని నేను
చెచ్చెర మందెమేళాలు సేయను నిన్ను జూచితే
పచ్చిమదనకళల బరగు నామొగము ॥చిత్త॥
యెరపులదాన గాను యెగ్గుపట్టేదాన గాను
మరిగిన యలమేలుమంగను నేను.
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేడు
బెరసి నీకాగిటనే పెరుగు నాచన్నులు ॥చిత్త॥ (67)

భావము: తన వలపును స్వామికి బహిరంగంగా విన్నవించుకొంటోంది అలమేలుమంగ. శ్రీ వెంకటేశ! నా మనసును నీకు తెలియజేశాను. చిత్తగించవయ్యా! నా యవ్వనమంతా భక్తిగా నీకోసం ముడుపు గట్టాను. కోరి వరించిన కాంతను నేను. రచ్చ పెట్టుకొనే దానిని కాను. రాతిగుండెగలదానిని అంతకన్నా కాదు. గొప్పలు చెప్పుకొనే దానిని కాదు. నీ పేరు చెవులకు సొకితేనే నెమ్మదిగా నామనను నీరువలె కరగిపోతుంది. రోతపడే దానినికాను. కొసరి అడిగే దానిని కాను. నీకు ప్రియం చేసే వనితను నేను. తొందరపడి చనవులు ప్రదర్శించను. నిన్ను చూచితే కొత్తవైన మన్మథ కళలు నా ముఖంపై అల్లుకొంటాయి. నేను నీకు పరాయిదానిని కాను. నీకు హాని తలపెట్టే దానిని కాదు. నీతో అలవాటుపడిన అలమేలుమంగను. స్వామీ! ఈనాడు నన్ను ఏలుకున్నావు. నాచనుదోయి నీ కౌగిట్లోనే పెరుగుతున్నది – అంటూ విన్నపాలు చేస్తోంది.

పాడి

ఎఱగమా నీజాడ లింతకతొల్లి
మెఱసితి విట్టె యలమేలుమంగతనము ॥పల్లవి॥
సరసమెంతాడేవే చవులెంత చూపేవే
విరులేల చల్లేవే విభునిమీద
వరుసకు వచ్చిన వనితలెల్లా నుండగా
దొరవైతి విందరిలో తొయ్యలి నీవు ॥ఎఱ॥
నవ్వులెందాకా నవ్వేవే నాట నెంతచూచేవే
రవ్వగా బెనగనేలే రమణునితో
జవ్వనపువేడుకతో సవతులెల్లా జూడగా
పువ్విళ్లూర నీవతని వుర మెక్కుకొంటివే ॥ఎఱ॥
వావులేమి చెప్పేవే వడిగా నెట్టు గూడేవే
యేవేళైనా శ్రీవేంకటేశ్వరుని
సేవసేసి నేమెల్లా సేసవెట్టి పెండ్లాడగా
దేవరవలె పట్టపుదేవులవైతివే ॥ఎఱ॥ (68)

భావము: చెలులు అలమేలుమంగతో సరసాలాడుతున్నారు. ఏమమ్మా ! నీ వివరాలన్నీ ఇంతకు ముందు మాకు తెలియనివా? ఈనాడు అలమేలుమంగవై ధీరత్వంతో తిరుగుతున్నావు. విభునితో ఎన్ని సరసాలాడావే, ఎన్ని రుచులు చూపావే. ఆయన మీద ఎన్ని పూలు చల్లావే. ఆయనకు వరస అయిన భామినులందరూ వుండగా ఓ భామా! వీరందరిలో నీవు దొరవయ్యావు. ఎందాక నవ్వులు నవ్వుతున్నావే! ఎన్ని నటనలతో చూచావే! కాంతునితో రచ్చ చేస్తూ పెనగడమెందుకే? నీ సాటి సవతులందరూ యవ్వనపు సరదాలతో చూస్తుండగా ఆసక్తితో నీవితని గుండెలమీద చేరాలని మొక్కుకొన్నావు గదా! ఎన్నో రకాల వావి వరసలు కలిపి త్వరగా ఎలా కలిశావే! అన్ని వేళలా వేంకటేశ్వరునికి సేవలుజేసి మేమంతా సేసలు చల్లి ఆయనను పెళ్లాడగా దొరసానివలె పట్టపురాణివైనావే అంటూ చెలులు ఎత్తి పొడుస్తున్నారు.

రామక్రియ

చెప్పవే నీసుద్దులు చెవులారా నేము వినేము
వుప్పతిల్లీ దమకము లుల్లములో మాకును ॥పల్లవి॥
వెన్నెలగానీ మొగాన వేడుక నీ నవ్వులనే
సన్నలనే సంతోసాలు చాలామించీని
చెన్ను మీర నీపతి నీచేతికి లోనాయనా
పన్ని నేడు నీతపము ప(ఫ) లియించెనా ॥చెప్ప॥
చెక్కుల జెమటగారీ సిగ్గులు కన్నుల దేరీ
తక్కక నిండుగళలు దైవారీని
చక్కనినీపతి నీకు చనవులెల్లా నిచ్చెనా
మిక్కిలి నీవువేసిన మేలెల్లా నీడేరెనా ॥చెప్ప॥
మోవితేనె లుట్టిపడీ ముంచినతీపులతోడ
భావించితే నీకు మేన బచ్చి దేరీని
నీవలమేలుమంగవు నెమ్మది శ్రీవేంకటేశు-
డీవేళ నిన్ను గూడెనా యీడకు విచ్చేసెనా ॥చెప్ప॥ (69)

భావము: అలమేలుమంగతో చెలులు సరసాలాడుతున్నారు. ఏమమ్మా! నీ కథలన్నీ చెప్పవే! చెవులాలకించి మేమూ వింటాము. మాకు కూడా మనసులో మోహం పెరుగుతోంది. నీ నవ్వులతో సరదాగా నీ ముఖం మీద వెన్నెల కాసింది. నీ ఆనవాళ్లు చూస్తే సంతోషాలు అధికమైనట్లున్నాయి. ఇంతకూ అందంగా నీపతి నీచేత చిక్కాడా ఏమి? ఈరోజు నీవు చేసిన తపస్సు ఫలించిందా? బుగ్గలపై చెమట కారుతోంది. కళ్లలో సిగ్గుల మొగ్గలు కనిపిస్తున్నాయి. నీ భర్త నీకు చనవులిచ్చాడా? నీవు చేసిన మేళ్లు అన్నీ అధికంగా ఫలించాయా? నీపెదవి తేనెలు నిండిన తియ్యదనంతో ఊరుతున్నాయి. అలోచించి చూడగా నీ శరీరంపై మోహం నిండిపోయింది. నీవు అలమేలుమంగవు. ఈ రోజు శ్రీ వేంకటేశుడు ఇక్కడకు వచ్చాడా? నీతో క్రీడించాడా? – అని ఇతర ప్రియురాండ్రు అలమేలుమంగతో మేలమాడారు.

వరాళి

ఎదురుకొంటి వలపు తిరుమేలా నితనికి
బొదిగితే సరిచేసి భోగములై మించెనే ॥పల్లవి॥
నంటున నాతనితో నే నవ్వితే నీవందుకుగా
గొంటరివై పతినేల కొచ్చి చూచేవే
జంటల నిద్దరిని జాజులు గలువలునై
పెంటలపూజలై కడుబిక్కటిల్లీ మేనను ॥ఎదు॥
మక్కువల పతికి నే మరి పాదాలొత్తితేను
మొక్కలాన నాతనికి మొక్కవచ్చేవే
చిక్కనితామరలును జిగురులు గూడ పెట్టి
వొక్కట గుదిగుచ్చితే నోపునా యీతడు ॥ఎదు॥
యెలమి శ్రీవేంకటేశు నిట్టె నే గాగిలించితే
నులివచ్చితోనేల చన్నుల నొత్తేవే
అలమేలుమంగను నేనై నీవు భూపతివై
కలసితే జెప్పగొత్తె కతలై నిలిచెనే ॥ఎదు॥ (70)

భావము: అలమేలుమంగ తన సపత్నితో నిందాగర్భంగా మాట్లాడుతోంది. ఏమమ్మా! మనమిద్దరము ఎదురెదురుగా వచ్చి రెండు వైపులా వలపులు కుమ్మరిస్తే అతనికి అవి సరియైన భోగాలై మించాయి. ఆసక్తితో అతనితో నేను నవ్వితే, అందుకుగా నీవు దిట్టవై వచ్చి పతిని గుచ్చిగుచ్చి చూస్తున్నావే! మన జంటలు ఇద్దరివీ సన్నజాజులు, కలువలునై ఆతని శరీరం మీద సమృద్ధిగా పూజలై నిలిచాయి. ప్రీతితో నేను పతికి పాదాలొత్తితే, మోటుతనంగా నీవు వచ్చి మొక్కుతున్నావేమి? మంచి తామరపూలు, చేవదేరిన మొలకలు రెండూ కలిపి ఒక్కసారి గుదిగుచ్చి అలంకరిస్తే ఆతడు భరించగలడా? ప్రీతితో నేను శ్రీవేంకటేశుని కౌగిలిస్తే గంధంతో పచ్చిగా వున్న నీ చనుదోయితో అతని నేల వొత్తుతావు? నేను అలమేలుమంగగా, నీవు భూదేవివిగా ఆతనిని కలిస్తే చెప్పుకోవడానికి కొత్త కథలై లోకంలో నిలిచిపోయాయి సుమా! అని పరాచికాలాడుతోంది.

నారాయణి

చెలరేగి కొలువులు సేతువుగాక
మలసి నీకు తెరమఱగు లేమిటికే ॥పల్లవి॥
అగ్గలపుమోహమున నతడు నీ మోము చూచీ
సిగ్గులువడకువే చెలియా
వెళపుదమకము వెదచల్లీ నీమీద
తగ్గి నీవందుకుగాను తలవంచనేటికే ॥చెల॥
మనసిచ్చి యప్పటిని మాటలు నీతో నాడీ
వెనకతియ్యకువె వెలదీ
ననుపున జన్నులపై నగుతానే చేయిచాచీ
పెనగి నీవంతేసి బిగియగ నేటికే ॥చెల॥
ఆఱడై శ్రీవేంకటేశు డట్టె నిన్ను గాగిలించీ
మీఱకువే యిక నలమేలుమంగా
కాఱుకమ్మినరతుల గలసె నిన్నీతడు
ఆఱితేరె బనులెల్లా నలయించనేటికే ॥చెల॥ (71)

భావము: అలమేలుమంగ ముగ్ధత్వాన్ని చూచి సఖి హెచ్చరికలు చేస్తోంది. ఓ అలమేలుమంగా, ఎంతో ఆనందంతో శ్రీవేంకటేశునికి కొలువులు చేసే నీకు అడ్డుగా ఇంక తెరమరుగులెందుకు? నీ విభుడు నీమీద అధిక మోహంతో నీ ముఖం చూస్తున్నాడు. చెలీ! నీవు సిగ్గుపడవద్దు. అధికమైన మోహాన్ని నీమీద ప్రకటిస్తుంటే నీవు సిగ్గుతో తగ్గి తలవొంచుకోనేల? నీ మీద మనసుపడి అతడు పూర్వస్మృతులు గుర్తుకు తెస్తుంటే, ఓ వనితా! నీవు వెనకడుగు వేయవద్దు. ఆప్యాయంగా నవ్వుతూ అతడు నీ చనుదోయిపై చేయి చాచితే నీవు పెనగులాడి బిగుసుకపోవడమెందుకు? బహు కష్టం మీద శ్రీవేంకటేశుడు నిన్ను కౌగిలిస్తే నీవు మితిమీరవద్దు. దట్టమైన రతులలో నిన్నితడు కలిశాడు. అన్ని పనులలో ఆరితేరాడు. అతనిని అలసిపోయేలా చేయనేల?

మాళవిగౌళ

ఏమి చెప్పేది మోహము యెంతోకాని
కామిని నింతట నిట్టె కరుణించవయ్యా ॥పల్లవి॥
చెలి నిన్ను జూచి చూచి చిమ్మిరేగీ నాసలను
యెలమి బయ్యద జారు టెఱగదు
వెలలేని మాటలెల్లా వేడుకతో నాడీగాని
లలి బెదవిమీది కెంపులు దాచనేరదు ॥ఏమి॥
మొగమెత్తి చేతులెత్తి, మొక్కిలోలో జొక్కీ
జిగి(గి?) (చ?)న్నులు గానవచ్చేది యెంచదు
మిగులా సెలవులను మిక్కిలి నవ్వీగాని
చిగురుమోవిరసాలు చిందేది దలచదు ॥ఏమి॥
తక్కక కొలువుసేసే తమినే నిలుచున్నది
పక్కన మైసోకులు భావించదు
యిక్కడ శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
అక్కరతో గూడీగాని అలయగ నేరదు ॥ఏమి॥ (72)

భావము: ముగ్ధయైన నాయిక ఏమరుపాటుతనాన్ని నాయకునికి విన్నవిస్తోంది. శ్రీ వెంకటేశ! భామకు నీపై ఎంత మోహమో, ఏమని చెప్పేది. ఆమెను ఇలా కరుణించవయ్య! మా చెలి నిన్ను తదేకంగా చూచి ఆశలతో మిక్కిలిగా విజృంభించింది. పైట జారడం కూడా గమనించే స్థితిలో లేదు. లెక్కలేనన్ని ముచ్చట్లు సరదాగా చెబుతోందిగానీ తన పెదాలపై ఎర్రదనము దాచుకోవడం తెలియలేదు. తలపైకెత్తి, చేతులు జోడించి నీకు మొక్కి మనసులో సొక్కిపోయింది గానీ గట్టి చన్నులు పైట చాటు నుండి కన్పించడం గమనించలేదు. పెదవుల చివరన నవ్వులు చిందిస్తోంది గానీ, తన మృదువైన పెదవి నుండి చిందే రసాల గూర్చి ఆలోచించడం లేదు. వదలిపెట్టకుండా నీకు కొలువు చేయడానికి మోహంతో నిలుచున్నదిగానీ, పక్కనే వున్న శరీరపు అందాలు ఆలోచించలేదు. స్వామీ! ఇక్కడ ఈ అలమేలుమంగ తన అవసరంతో నిన్ను కలిసిందిగానీ, అలిసిపోవడం తెలియలేదు – అని స్వామికి విన్నవిస్తోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here