Site icon Sanchika

అన్నమయ్య పద శృంగారం-9

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

సాళంగనాట

సిగ్గరి పెండ్లికొడుకు చెలులముందరనెల్లా
యెగ్గెరగక మెరసీ నిదివో యనుచు ॥పల్లవి॥
జంటతేరులమీద సతులు నీవును నెక్కి
యింటింట వీధివీధి నేగిరాగాను
పెంటలగోపికలెల్లా పెదపెదమేడ లెక్కి
నంటున జూచి సిగ్గుతో నవ్వులు నవ్వేరు ॥సిగ్గ॥
గొడ(డు?) గులనీడను కోలుపడిగెలతోడ
యెడనెడవాడల నీవేగిరాగాను
మెడలెత్తి నీ పొందుల మెలుత లబ్బురమంది.
జడిగొని తోగిచూచి జాణతనాలాడేరు ॥సిగ్గ॥
విరులదండలలోన వింజామరలలోన
యిరవై దేవుళ్ళు నీవు నేగిరాగాను
పరగ నలమేల్మంగపతిని శ్రీ వేంకటేశ
సొరిది బురసతులు చూచి పొగడేరు ॥సిగ్గ॥ (73)

భావము: తేరులమీద శ్రీదేవీభూదేవీ సమేతుడై శ్రీవేంకటేశ్వరుడు తిరువీధులలో సంచరించడాన్ని సఖులు వివరిస్తున్నారు. శ్రీ వేంకటేశ! సిగ్గులుపోయే పెండ్లికొడుకు తన చెలుల ముందర ఎగ్గులేకుండా ఇదిగో ప్రకాశిస్తున్నాడు. నీవు, నీ సతులు ఇద్దరు జంట తేరులమీద ఎక్కి వీధి వీధులలో ఇంటింటికి తిరిగి రాగా, అధిక సంఖ్యలో గోపికలందరూ పెద్ద పెద్ద మేడల మీదికెక్కి దగ్గరగా నిన్ను చూచి సిగ్గులతో నవ్వులు నవ్వుతున్నారు. గొడుగుల నీడలో పెద్ద పడగలతో (పెద్దశేషవాహనంపై) అక్కడక్కడ వీధి వాడలలో నీవు తిరిగి రాగా నీ ప్రియురాండ్రయిన స్త్రీలు ఆశ్చర్యంతో మెడలెత్తి గుంపుగా కూడి తొంగిచూచి జాణతనాలు చూపుతున్నారు. పూలదండలతో, వింజామరలతో, ప్రియమైన నీ దేవేరులతో నీవు బయలుదేరి రాగా, అలమేలుమంగ పతివైన నిన్ను చూచి నగరకాంతలు పొగడుతున్నారు – అని స్వామి తిరువీధులలో తిరిగే వైభవాన్ని వర్ణిస్తున్నారు.

బౌళి

ఈకె నీచుట్టరికము లెఱుగుదుము
మాకు నీవు లోగుదురా మరగు లింతేల ॥పల్లవి॥
కలువపూవులు వేసి కప్పురము మొవి జూపీ
పొలతికి నీ కెన్నటిపొందులోకాని
పిలిచీ మెల్లనె నిన్ను బేరుకొని; యంతలోనే
పలుకవయ్యా యేల పరాకుసేసేవు ॥ఈకె॥
సిగ్గు గొంత చల్లిచల్లి సెలవుల నవ్వు నవ్వి
వెగ్గళించీ జేత లెంతవేడుకోకాని
వొగ్గీ దమ్ములానకు వూరకే చేతిసన్నల
యెగ్గులేదు చూడవయ్యా యేల దాచేవు తమి ॥ఈకె॥
చన్ను మొనలు దాకించి సారెకు సేవలు సేసీ
యెన్నడు గూడితివో యింతకతొల్లి
యిన్నిటా శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
నన్ను గూడితివి యెంత నాటకము సేసేవు ॥ఈకె॥ (74)

భావము: దక్షిణ నాయకుడైన వేంకటేశుని అలమేలుమంగ నిలదీసి అడుగుతోంది. శ్రీ వేంకటేశ! ఈమెకు, నీకు మధ్యవున్న చుట్టరికాలు మాకు తెలుసు. మాకు నీవు వశపడినవాడవు. ఇంకా రహస్యమేల? ఈ భామకు, నీకు ఏనాడు పొందు కలిగెనోగాని, నీపై కలువపూలు విసిరి, కప్పురపు పెదవి నంటించింది. మృదువుగా నిన్ను పిలిచి పేరు వల్లించింది. ఇంతలో ఎడమొగం పెడతావేమి? పలకవయ్యా! మితిమీరిన (తిరస్కరించిన) చేష్టలతో ఎంత వేడుకయో గాని సిగ్గులు కొద్దిగా వెదజల్లుతూ పెదవుల చివర నవ్వుతోంది. చేతి సైగలతో తాంబూలమిమ్మని తలవొగ్గుతోంది. ఏ విధమైన ఎగ్గూ లేదు. నీ మోహాన్ని దాచుకోకుండా చూడవయ్యా! ఇంతకుముందు నీ వామెతో ఎన్నడు క్రీడించావో గానీ మాటిమాటికి ఆమె చనుమొనలు నీకు తాకించి సేవలు చేస్తోంది. ఇన్ని రకాలుగా నన్ను కూడి ఎంత నాటకాలు చేస్తున్నావు. నేను అలమేలుమంగను.

సామవరాళి

ఎందాకా బుజ్జగించే వేమయ్యా
మందెమేళమయ్యీ మరి నేమొక్కేనయ్యా ॥పల్లవి॥
యీడుపెట్టుకొని నన్ను యెంతవొడబరచేవు
వేడుకతో నీమాటలు వింటినయ్యా
నీడకు దీసి నన్ను నిమిరేవు నా చెక్కులు
తోడనే యిందుకు నే సంతోసించుకొంటి నయ్యా ॥ఎందా॥
సరుస నన్ను బెట్టుక చన్ను లెంతపుడికేవు
గరిమ నీమన్ననలు గైకొంటి నయ్యా
విరులు ముడిచి నన్ను వెస నెంతలాలించేవు
సరవులన్నిటా నాకు సమ్మతాయనయ్యా ॥ఎందా॥
చనవిచ్చి నన్ను నెంత సారెకు గాగిలించేవు
నినుపురతులను తనిసితినయ్యా
యెనసితివి శ్రీవేంకటేశ యల మేల్మంగను
మనసున నీపొందులు మరిగితినయ్యా ॥ఎందా॥ (75)

భావము: ముగ్ధమైన నాయిక స్వామిని బ్రతిమాలుతోంది. శ్రీవేంకటేశ! ఎంతసేపు నన్ను బుజ్జగిస్తావయ్యా! చనవుతో మరి నేను మొక్కుతున్నానయ్యా! ఈడుజోడు కుదిరిందని చెప్పి నన్ను ఎంతో అంగీకరింపజేశావు. నీ మాటలన్నీ సరదాగా విన్నానయ్య! నీడలోకి నన్ను చేర్చి నా చెక్కులు నిమిరేవు. వెంటనే అందుకు నేను సంతోషపడ్డానయ్యా. నీ పక్కనే నన్ను చేర్చుకొని నా చన్నులు పిసికావు. నీ మర్యాదలు ఎంతగానో స్వీకరించానయ్యా. తలలో పూలు తురిమి నన్ను ఎంతగానో లాలించావు. వావివరసలన్నిటిలో నాకు సమ్మతమేనయ్యా! ఎంతగానో చనవులిచ్చి మాటిమాటికీ కౌగిలించావు. అధికమైన రతులలో నేను తృప్తి చెందానయ్యా! స్వామీ! నేను అలమేలుమంగను. నా మనసులో నీ సౌఖ్యన్ని బాగా మరిగానయ్యా!

ధన్నాసి

ఎవ్వరి నేరుపు లెంచే మిందు లోనను
వువ్విళ్లూరి మీలో మీకు నొనగూడె వలపు ॥పల్లవి॥
చిమ్ముజూపులను జూచీ సిగ్గరిపెండ్లికూతురు
నిమ్మపంట వేసేవు నీవాపెను
తమ్మిమోములు వంచేరు దండనున్న పేరటాండ్లు
సమ్మతించి మీలో మీకు చలివాసె వలపు ॥ఎవ్వ॥
కుప్పళించే జెమటలు కొత్తపెండ్లి కూతురు
నెప్పున మెయిసోకించేవు నీవాపెను
వొప్పుగ మోములు చూచే రూడిగపువారలు
చెప్పరాక మీలో మీకు చిమ్మి రేగె వలపు ॥ఎవ్వ॥
మొక్కీ నలమేలుమంగ ముద్దుల పెండ్లికూతురు
నెక్కొని కాగిలించేవు నీవాపెను
చొక్కపు శ్రీవేంకటేశ చుట్టాలెల్లా మెచ్చేరు
వుక్కు మీరి మీలో మీకు నుమ్మగిలీ వలపు ॥ఎవ్వ॥ (76)

భావము: వెంకటేశుడు, అలమేలుమంగ సరసాలను సఖులు మేలమాడు తున్నారు. శ్రీ వేంకటేశ! మీలో మీకు ప్రేమ వువ్విళూరేలా సమకూరింది. ఇందులో ఎవరి నేర్పులను మేము లెక్కించగలము? సిగ్గుల మొగ్గ అయిన పెండ్లికూతురు ఆటాడించే చూపులతో నిన్ను చూస్తోంది. నీవు ఆమెకు ఉపకారం చేశావు. మీకు దగ్గరలో వున్న పేరంటాండ్రు పద్మాల వంటి ముఖాలను వంచుతున్నారు. అంగీకరించిన ప్రేమ మీలో మీకు (బిడియపు) చలిని పోగొట్టింది. కొత్త పెళ్లికూతురు చెమటలలో ముద్ద అయింది. నేరుగా నీవు ఆమెకు నీ శరీరాన్ని తాకించావు. మీ సేవలు చేసేవారు అందమైన మీ ముఖాలు చూస్తున్నారు. అదే సమయంలో చెప్పరాని ప్రేమ మీలో మీకు వృద్ధి పొందింది. మురిపెపు పెళ్లి కూతురైన అలమేలుమంగ నీకు మ్రొక్కగా నీ వామెను ప్రేమతో కౌగిలించావు. స్వామీ! మీ సరసాలను బంధువులందరూ మెచ్చుకొన్నారు. ప్రేమ బలిష్ఠమై మీలో మీకు ఉక్కబెట్టిస్తోంది.

ముఖారి

సారె సారె మన్నించేపు చనవులిచ్చేవు నాకు
యీరీతి నీసతులలో నెవ్వరి బోలుదును ॥పల్లవి॥
చక్కెరమాట లాడి సాదించు నిన్ను నాపె
మిక్కిలి సేవలు సేసి మెప్పించును
చిక్కనిచన్నులు చూపి చిత్తమెల్లా గరగించు
ఇక్కడ నన్ను జెనకే వేమిబాతి నేను ॥సారె॥
సన్నలనే మోవిచూపి చవులు రేచు నాపె
వన్నెలుగా నవ్వునవ్వి వలపించును
కన్నుల మొక్కులు మొక్కి కళలెల్లా బుట్టించు
ఇన్నిటా నన్ను బొగడే వెంతదాన నేను ॥సారె॥
ఆయములంటు నిన్ను నలమేలుమంగ యాపె
చాయల నీవురమెక్కి జట్టిగొనును
పాయకుండు నిన్నే పొద్దు బత్తితో శ్రీ వేంకటేశ
యీయెడ నన్నేలితివి యితవైతి నేను ॥సారె॥ (77)

భావము: దక్షిణనాయకుడైన వేంకటేశుని నాయిక మృదువుగా మందలిస్తోంది. శ్రీ వేంకటేశ! నన్ను మాటి మాటికీ ఆదరిస్తూ చనవులిచ్చావు. నీ ఇతర సతులలో ఈ విధంగా ఎవరు సరిపోలుతారు. ఆమె నీతో తియ్యగా మాట్లాడి నిన్ను సాధించింది. అనేక రకాల సేవలు చేసి మెప్పించింది. తన ఘనమైన చనుదోయి చూపించి నీ మనసు కరిగింపజేసింది. నీవు ఇప్పుడు ఇక్కడ నన్ను కవ్విస్తున్నావు. నాపై ఎంత ప్రేమ నీకు? ఆమె సైగలతో తన పెదవిచూపి రుచులు పుట్టిస్తోంది. అందంగా నవ్వు నవ్వి ప్రేమించింది. కంటితో మొక్కులు మొక్కి నీలో మోహాన్ని పుట్టించింది. ఇన్ని రకాలుగా నన్ను పొగుడుతున్నావు. నేనెంత దానిని? ఆ అలమేలుమంగ రహస్యస్థానాలు అంటించింది. నీ గుండెపైకెక్కి నీతో జట్టీ కట్టింది. భక్తితో నిన్ను ఎన్ని వేళలా ఎడబాయక వుంటోంది. స్వామీ! ఇక్కడ నన్ను పాలించావు. నేను నీకు హితవయ్యాను.

మంగళ కౌశిక

నేరుపరివి నీవైతే నెలతైతే ముద్దరాలు
పేరున బిలిచి నీవే పెనగగరాదా ॥పల్లవి॥
చిన్నది గనక యింతి సిగ్గుతోడ నున్నది
అన్నిటా రట్టడివి మాటాడించరాదా
తన్నుదానె నీపై ప్రేమ దాచుకొని వున్నది
సన్నలనే నీమోవి చవిచూపరాదా ॥నేరు॥
జవరాలుగనక అసల బొంచుకవున్నది
నవకపుజాణవు నవ్వించరాదా
వివరించి బత్తి వెల్లవిరి సేయకున్నది
చివురు కెంగేలు చాచి చిమ్మి రేచరాదా ॥నేరు॥
కొమరెగనక కడుగుట్టుతోడ నున్నది
నెమకి దిట్టవు మేలు నెరపరాదా
అమర శ్రీవేంకటేశ అండ వాయకున్నది
సమరతి నిట్లానే చనవియ్యరాదా ॥నేరు॥ (78)

భావము: ముగ్ధయైన తమ చెలిని చనవుతో చూడమని సఖులు కోరుతున్నారు. శ్రీ వేంకటేశ! నీవు నేర్పరివైతే, ఆమె ముగ్ధ. పేరు పెట్టి పిలిచి నీవే క్రీడించరాదా? వయసులో చిన్నది కావున కన్య సిగ్గులు పోతోంది. అన్ని రకాలుగా అల్లరి చేసేవాడివైన నీవు ఆమెచే మాట్లాడించరాదా? తనంత తానే నీ మీద ప్రేమను దాచుకొన్నదిగదా, సైగలతో నీ పెదవి రుచి ఆమెకు చూపరాదా? యౌవనవతి కాబట్టి ఆశలతో పొంచుకొచి వున్నది. మృదువైన జాణవుగదానీవు ఆమెను నవ్వింపజేయరాదా? తన మనసులో భక్తిని తెలిసి బట్టబయలు చేయలేకున్నది. చిగురుటాకుల వంటి నీ చేతిని చాచి ప్రేమ పుట్టించరాదా? ముద్దరాలు కాబట్టి ఎంతో గుట్టుగా వున్నది. నేర్పరివైన నీవు మేలు చేయరాదా? ఆమె నిన్ను ఎడబాయక దగ్గరనే వున్నది. ఇదే విధంగా సమరతితో చనువు చూపరాదా? అని స్వామికి చెలులు సూచిస్తున్నారు.

దేవగాంధారి

పొలతీ నీనటనలు పొగడ నలవిగాదు
నిలువున వలపులు నివ్వటిల్లజేయునే ॥పల్లవి॥
కందువైన నీమాటలు కప్పురపుబేంట్లు
పొందుల నీపతికి దప్పులు దీర్చునే
అందిన నీసొలపు మోహములకలగలపు
సందడించి యతనికి సంతోసము రేచునే ॥పొల॥
సూటియైననీచూపులు సొంపగుదరి తీపులు
గాటమై యీతనికి నక్కర దీర్చునే
కూటపు నీ నవ్వులు గుదిగుచ్చిన పువ్వులు
పాటించి యీతనిమతి బరిమళించునే ॥పొల॥
మంతనపుజెనకులు మాణికపుమినుకులు
చెంతల నీసొమ్ములై సింగారించునే
యింతలోనె శ్రీ వేంకటేశుడు నిన్నిదె కూడె
వింతలగునీరతులు వేడుక పుట్టించునే ॥పొల॥ (79)

భావము: చెలులు అలమేలుమంగతో సరసాలాడుతున్నారు. ఓ సఖీ! (అలమేలుమంగా) – నీవు చేసే పనులు (నటనలు) పొగడలేము. ఉన్నపళాన ప్రేమను అవి పెంచుతాయి. ప్రియమైన నీమాటలు కర్పూరపు కలయికలు. నీతో క్రీడించునపుడు నీ పతికి అవి దాహం తీరుస్తాయి. నీవు అందించిన అధికమైన మోహము, ప్రేమల కలయిక సంతోషాన్ని అతనికి వృద్ధి పొందిస్తాయి. వాడియైన నీ చూపులు అందమైన వలుపులుగా గాఢమై ఆతని అవసరం తీరుస్తాయి. మోసపూరితమైన నీ నవ్వులు దండగా అమర్చిన పువ్వులై యీతని మనసులో పరిమళిస్తాయి. ఏకాంతంలో మీ కలయికల మాణిక్యపు కాంతులు – నీ దగ్గర సొమ్ములై అలంకరిస్తాయి. ఇంతలోనే శ్రీవేంకటేశుడు నిన్ను కలిసి వింతవింతలైన రతులతో నీకు సరదా పుట్టిస్తాడు లేవమ్మా! అని ఛలోక్తి విసిరారు.

భూపాళం

చిత్తగింతువు రావయ్యా చిల్లరపరాకు మాని
హత్తి తారుకాణ వచ్చి నప్పుడే నీకు ॥పల్లవి॥
చిగురాకుమోవిమీద జెలి యాడేమాటలు
మిగులా దేనెలకంటే మించుదీపులు
జిగిమించ నీతోడ జేసేటిచెలుములు
జిగురుగండెలకంటే జిక్కించేబందనలు ॥చిత్త॥
తమ్మిరేకుగన్నులలో దళుకనే చూపులు
తుమ్మిదపౌజులకంటే దూరిపారును
వుమ్మగిలుబయ్యదలో నుండేటి కుచములు
నిమ్మపండ్లకంటేను నీకు గానుకలౌతాను ॥చిత్త॥
లతలచేతులు చాచి లాచేటి కాగిలి
రతి బెండ్లిచవికకంటే రమ్యమైనది.
యితవై శ్రీవేంకటేశ యేలితివి నీమోహపు
సతికంటే నెక్కుడు జాణతనాలు ॥చిత్త॥ (80)

భావము: వేంకటేశునితో సఖులు తమ చెలిని చేరదీయమని సూచిస్తున్నారు. శ్రీవేంకటేశ! చిన్నచిన్న పరాకులు వదలి ఆమెను దయ దలచవయ్యా! వెంటనే నీకు తార్కాణం వచ్చింది. చిగురాకు పెదవి మీద మా చెలి మాట్లాడే మాటలు తేనెలకంటే మించిన తియ్యందనాలు. అందంగా నీతో చేసే ప్రేమలు జిగురుకండెలకంటె మించిన కట్టుబాట్లు (బంధనము). తామర రేకులవంటి కనులలో తళుక్కుమని మెరిసే చూపులు తుమ్మెదల సైన్యం కంటె మించి దూరి పరువులెత్తుతాయి. పయ్యెదలో ఉక్కపోతగా వుంటే స్తనాలు, నిమ్మపండ్ల కంటే అధికంగా నీకు కానుకలవుతాయి. మృదువైన తీగల వంటి చేతులు చాచి ఉద్రేకించిన కౌగిలిలోని రతి పెండ్లి పందిరికంటే మనోహరం. ప్రీతితో నీవు ఆమెను ఏలుకున్నావు. ఆమె కంటె నీవి ఎక్కువ జాణతనాలు.

గౌళ

నావాడనేయంటా నమ్మించేపు నన్ను నేడు
చేవల నిన్నాపె చూచి సిగ్గుపడనేలయ్యా ॥పల్లవి॥
మంతనాన నీవు నేను మాటలాడుకొన్న వెల్లా
ఇంతలోనే యాపె వినుటెట్లయ్యా
వింతలైన నామట్టెలు వేల బెట్టుకొంటివి
వంతులు నాపై చేతికి వచ్చుటెట్లయ్యా ॥నావా॥
పొందుగా నీవును నేను బూసుకొన్న పరిమళ-
మందముగా నాపెమేన నంటు టెట్లయ్యా
కిందట మాయింట నారగించినకూరలచవులు
మందలించి యాపె చెప్పీ మర్మమేటి దయ్యా ॥నావా॥
చెలరేగి నీరతులఁ జేసిననానేర్పులకు
నలువంక నాపె నిన్ను నగుటెట్లయ్యా
యెలమి శ్రీ వేంకటేశ యిటు నన్ను గూడితివి
మెలుపున నిన్ను నాపె మెచ్చుటెట్లయ్యా ॥నావా॥ (81)

భావము: దక్షిణనాయకుడైన శ్రీవేంకటేశుని ఒక ప్రియురాలు స్వామిని నిందాలాపంగా ప్రశ్నిస్తోంది.

ఓ శ్రీవేంకటేశ! నీవు ఈరోజు ‘నీవాడనే గదా!’ అని నమ్మింప జూస్తున్నావు. నీ సమీపంలో నిన్ను ఆమె చూచి సిగ్గుపడనేల? ఏకాంతంలో మనమిద్దరమూ మాట్లాడుకున్న మాటలో ఇంతలో ఆమె ఎలా వినగల్గింది? అందమైన నా కాలి మట్టెలను నీ వేలికి తగిలించుకున్నావు గదా! అవి చేతులు మారి ఆమె చేతికి ఎలా వచ్చాయయ్యా! అందంగా మనమిద్దరము పూసుకున్న సుగంధద్రవ్యాలు సొగసుగా ఆమె శరీరానికి ఎలా అంటుకొన్నాయయ్యా! ముందు రోజు మాయింట్లో నీవు భోంచేసిన కూరల రుచులు ఆమె మందలిస్తూ చెప్పే రహస్యమేమి? రతి సమయంలో నేను విజృంభించి చేసిన నేర్పులకు నాలుగు దిక్కులా ఆమె నిన్ను చూసి నవ్వడమెందుకు? స్వామీ! నీవు నన్ను కలిసిన వేళ ఉత్సాహంగా నిన్ను ఆమె మెచ్చడమేమిటయ్యా? – స్వామి పరకాంతలను జేరిన వివరాలను భామిని నిలదీసింది.

సామంతం

ఆతని జూపవె మాకు నదెంతచక్కనివాడొ
ఆతఱి నిన్ను గలసినంతటి జాణ డెవ్వడె ॥పల్లవి॥
జక్కవచన్నులమీద చంద్రోదయము లాయ
చుక్కలు నీమోవిమీద జూపట్టెను
మిక్కిలి శిరసుమీద మేఘములు గారుకొనె
యెక్కడనుండి వచ్చేవే యెవ్వడే నీమగడు ॥ఆత॥
సరి గన్ను కలువల సంధ్యాకాలము వచ్చె
అరిది సంపెంగముక్కం దాయిటి రేగె
తొరిగి చుక్కమీద దొలుకరించే జెమట
యిరవై యేడనుంటివే యెవ్వడే నీమగడు ॥ఆత॥
నాటుకొని సెలవుల నవ్వుల వెన్నెల గాసె
తేటల చూపులనే తెల్లవారెను
మేటిశ్రీ వేంకటాద్రి దేవుడ(డం?)టా నీవు
యేటపెట్టుకుండే(డే?)నా (వా?)త డెవ్వడే నీమగడు ॥ఆత॥ (82)

భావము: చెలులందరూ కలిసి ఒక భామ యింటికి వెళ్లి ఆమె శరీరం పైగల మన్మథ కళలను చూసి ఎకసెక్కము లాడుతున్నారు.

ఏమమ్మా! నీ ప్రియుడెంతటివాడో అతని నొకసారి మాకు చూపవే! అంతకు ముందు నిన్ను కలిసి క్రీడించిన ఆ జాణకాడు ఎవ్వరే? నీ శరీరంపైన ఆనవాళ్లు చూస్తే – జక్కవలవంటి చన్నుల మీద గోటి నొక్కులతో చంద్రోదయాలు కనిస్తున్నాయి. నీ శిరస్సు మీద మేఘాలు ముసురుకొన్నాయి. నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? నీమగడెవరో చెప్పవే! కలువల వంటి కన్నులు సంధ్యాకాలంలో విచ్చుకున్నాయి. సంపెంగనుబోలిన నీ ముక్కు మీద ఆవిరులు పెరిగాయి (గాఢ విశ్వాసం), నీ చుక్కబొట్టు మీద చెమటలు తొలకరి చినుకుల్లా పట్టాయి. ఇష్టంగా నీవు ఇంతసేపు ఎక్కడున్నావే? నీ మగడెవరే? నీ పెదవుల చివరన నవ్వుల వెన్నెలలు ప్రకాశించాయి. అందమైన చూపులతో తెల్లవారింది. మేటివాడైన శ్రీ వేంకటాద్రి దేవుడట. (ఏటవెట్టుకొన్నాడా??) నీ మగడెవరో చెప్పవే!

(ఇంకా ఉంది)

Exit mobile version