అన్నపూరణి..

0
2

[అన్నపూరణి సినిమా నేపథ్యంలో, వంటలు చేయడంలో ఆసక్తి ఉన్న తమ కుమార్తె గురించి చెబుతున్నారు ప్రమోద్ ఆవంచ]

[dropcap]ఒ[/dropcap]క సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన తమిళ బ్రాహ్మణ అమ్మాయి. తండ్రి చదువులో గోల్డ్ మెడలిస్ట్ అయినా శ్రీరంగంలో రంగనాథునికి ప్రసాదాలు చేసే వృత్తి చేస్తుంటాడు. లోకాన్ని ఏలే భగవంతుడికే ప్రసాదం చేసి నైవేద్యం పెట్టే అదృష్టం తనకు దక్కిందని సంతోషపడుతుంటాడు. వృద్దురాలైన తల్లి, భార్య, బిడ్డ అన్నపూరణిలతో జీవితం కొనసాగిస్తుంటాడు.

అన్నపూరణి పుట్టగానే డాక్టర్లు ఆమె తల్లికి “మీ అమ్మాయి ఎన్హాన్సుడ్ టేస్ట్ బడ్స్‌తో పుట్టింది, మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మీ పాలు తాగుతుంది..” అని చెపుతారు. అన్నపూరణి తన పన్నెండేళ్ళ వయసు నుంచి ఏ వంటకం అయినా రుచి, వాసన చూసి ఇట్టే చెప్పేది. కళ్ళకు గంతలు కట్టుకొని కూడా చెప్పేది. చిన్నప్పటి నుంచి తాను చెఫ్ కావాలని ఆశయం. హోటల్లో చెఫ్ అంటే వెజ్, నాన్ వెజ్ అన్నీ చేయాల్సి ఉంటుంది, అంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయడానికి తండ్రి ఒప్పుకోడు. తన ఇష్టాన్ని చంపుకోలేక, ఇంట్లో ఎంబీఏ చదువుతున్నానని చెప్పి ఒక స్నేహితుడి సహాయంతో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరుతుంది. కొన్ని రోజులకు విషయం తెలుసుకున్న అన్నపూరణి తండ్రి ఆమెతో కాలేజీ మాన్పించి పెళ్లి చేసేందుకు సిద్దపడుతాడు. కరెక్టుగా పెళ్లి రోజు ఎవరికీ చెప్పకుండా చెన్నైకి వెళ్లి పోతుంది. అక్కడ తాను చిన్నప్పటి నుంచి రోల్ మోడల్‌గా భావించే చీఫ్ చెఫ్ ఆనంద్ సుందరరాజన్‌ను కలవాలని చేసిన ప్రయత్నం విఫలం అవుతుంది. ఆ తరువాత ఆయనను కలిసే అవకాశం వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకొని ఆయన టీం లో చేరుతుంది. అక్కడ ఆ టీంను లీడ్ చేస్తున్న ఆనంద్ కొడుకు అన్నపూరణి జాయిన్ కావడం ఇష్టం లేక ఆమెను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే జరిగిన ఒక ఫైర్ ఆక్సిడెంట్‌లో తాను రుచిని కోల్పోతుంది. ఏం తిన్నా, తాగినా రుచి తెలియక బాధపడుతూ ఏడ్చేస్తుంది. తాను ప్రాణంగా, ఇష్టంగా ప్రేమించే వృత్తిలో కొనసాగాలంటే రుచి, వాసనలు.. రెండూ ప్రధానమైనవి. రుచి కోల్పోయినా అధైర్య పడకుండా కాంపిటీషన్‌లో పాల్గొంటుంది.. గెలుస్తుంది.. చెఫ్ ఉద్యోగం సంపాదిస్తుంది. ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి తన ఆశయ సాధనలో ఎన్ని అవరోధాలు ఎదురైనా, తట్టుకొని తాను అనుకున్నది సాధిస్తుంది.

ఇదీ నేను ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన అన్నపూరణి సినిమా. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఏవో కారణాల వల్ల ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించారు. తీసేసి కూడా చాలా రోజులు అయ్యింది.

బన్ని నా పెద్ద బిడ్డ. తనకు కూడా వంట చేయడమంటే ఎంతో ఇష్టం. అన్నపూరణి సినిమా చూస్తున్నంత సేపు నా మస్తిష్కంలో నా బిడ్డ బన్నీ తిరుగుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి అంటే తాను ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచి పెద్దవాళ్లు వంట చేస్తుంటే చూస్తుండేది. నేర్చుకునే క్రమంలో లేత చేతులను కాల్చుకునేది. పప్పు, ఇతర కూరలు చేయడం వాళ్ళ అమ్మమ్మ శారదమ్మ దగ్గర చూస్తూ నేర్చుకుంది. మా అత్తయ్య శారదమ్మ.. శాలిని వాళ్ళ అమ్మ.. ఆమె నిజంగా గాడెస్ ఆఫ్ ఫుడ్ (అన్నపూర్ణమ్మ). వంట ఎంతో ఇష్టంగా, శ్రద్ధగా, రుచిగా చేస్తుంది. ఆమెకు వేరే ప్రపంచం లేదు, భర్త, పిల్లలు, వంట తప్ప. వంట ఇల్లు ఆమె సామ్రాజ్యం. అక్కడ అన్ని అధికారాలు ఆమెవే. బన్ని మా నాన్న దగ్గర బిర్యానీ చేయడం నేర్చుకుంది. మసాలా వంటలు చేయడం ఆయన హాబీ. పండగలప్పుడు మా నాన్న బిర్యానీ చేస్తే ఆ వాసన చుట్టుపక్కల అంతా గుప్పుమనేది. ఈ నేపథ్యమే బన్నికి వంటల మీద ఆసక్తి కలిగిందని నేననుకుంటాను. ఛెఫ్ కావాలన్న కోరిక మనసులో బలంగా నాటుకుంది. ఆ సినిమాలో అన్నపూరణి తన తల్లిదండ్రులతో నేను చెఫ్ అవుతాననీ చెపుతుంది. దానికి అన్నపూరణి వాళ్ళ అమ్మ అంటుంది.. అందరికీ ఏవో కోరికలు ఉంటాయి, కానీ లక్షల్లో ఒకరికే అది సాధ్యం, అందరూ సచిన్ టెండూల్కర్లు, అమితాబ్ బచ్చన్‌లు కాలేరు.. పూర్ణీ అని. దానికి అన్నపూరణి సమాధానం ఇస్తూ.. ఏ పనినైనా ఇష్టంతో చేస్తే లక్షల్లో ఒకరు కాదు.. లక్ష మంది అనుకున్నది సాధిస్తారనీ సమాధానమిస్తుంది. బన్ని ఏం వండినా చాలా శ్రద్ధతో, ఇష్టంతో చేసేది. బన్ని బాగా వంట చేస్తుంది అని అందరూ అంటుంటే లోలోపల నేను గర్వంగా ఫీలయ్యేది. మా మామగారు అంటే శాలిని నాన్న, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంటే బన్ని పది పదమూడేళ్ళ వయసులో ప్రతి ఒక్క అతిథి దగ్గరకు వెళ్లి భోజనం చేసారా, వంటలు ఎలా ఉన్నాయి అంటూ పలకరించేది. వచ్చిన వాళ్ళంతా ఈ అమ్మాయి ఎవరు.. ఇంత ఆప్యాయంగా అడుగుతోంది అంటూ ఆరా తీసేవారు. శాలిని పెద్ద బిడ్డ అనగానే తల్లి లక్షణాలను పునికి పుచ్చుకుందని అనేవారు. శాలిని టీచర్‌గా పనిచేస్తూ స్కూలుకి వెళ్లి వచ్చాక బాగా అలసిపోయేది.

టెన్త్ క్లాసులో ఇంట్లో బన్ని వంట చేస్తుంటే, శాలిని తన రికార్డులు, బయాలజీలో బొమ్మలు చాలా చక్కగా వేసి ఇచ్చేది. కాలక్రమేణా  బన్ని వంటలో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయడం ప్రారంభించింది. కారణం తాను చదివిన స్కూలులో ఎక్కువ మంది నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఉండడంతో, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వంటలను కూడా నేర్చుకుంది. హిందీ చాలా బాగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. బన్ని చేసే టమాటా కూర చాలా రుచిగా, అద్బుతంగా ఉంటుందని, తను ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంటికి వచ్చి టమాటా కూర చేయించుకొని తిని పోయేవాళ్ళు. తను పై చదువులకు లండన్ వెళ్ళేముందు కూడా తన స్నేహితులు అంతా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా టమాటా కూర చేయించుకున్నారు.

అన్నపూరణి సినిమాలో వేరే దేశ ప్రధాని ఇండియాకు వచ్చినప్పుడు పూర్ణి పనిచేసే హోటల్ లోనే విడిది చేస్తాడు. ఫ్రెంచ్ దేశస్తుడు కాబట్టి ఆ హోటల్  చీఫ్ చెఫ్ ఆనంద్ సుందరరాజన్ అన్నీ ఫ్రెంచ్ వంటకాలు చేసి డైనింగ్ టేబుల్ పై సర్వ్ చేస్తాడు. వాటిని చూసిన మంత్రి, ఇవన్నీ మేం రోజూ తినేవే కదా ఇండియన్ ట్రెడిషనల్ వంటలు ఏమీ లేవని, సారీ అంటూ లేచి వెళ్లిపోతాడు, అప్పుడు మన అన్నపూరణి (నయనతార), తమిళనాడు ట్రెడిషనల్ వంట చేసి అతిథులకు వడ్డిస్తుంది. మంత్రి స్పూన్‌తో తినడం చూసి పూర్ణి చేతితో తింటేనే ఆ రుచిని ఆస్వాదించడం సాధ్యమవుతుందని చెప్పడంతో మంత్రి చేతితో తిని అద్బుతం అంటూ పూర్ణికి గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇస్తాడు. అవును ఏ వంటనైనా ఆస్వాదించాలంటే చేతితో తింటేనే దాని రుచి తెలుస్తుంది, బన్ని కూడా చేతితో తింటే ఆ డిష్ రుచిని ఆస్వాదించవచ్చని  చెప్పేది. నిజంగా ఆ సినిమాలోనీ చాలా సీన్స్ బన్నికి ఏదో ఒక సందర్భంలో కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

బన్ని ఇంటర్ పూర్తి చేసింది. సరే.. వాట్ ఈజ్ నెక్ట్స్.. బన్ని హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాలని నిర్ణయించుకుంది. నేను, శాలిని కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో బన్నిని చేర్పించాలని అనుకున్నాం. అందరం కలిసి గచ్చిబౌలిలోని ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి వెళ్ళాం. అన్ని క్లాస్ రూంలు తిరిగి చూసాం, క్లాసుల్లో అందరూ అబ్బాయిలే ఒక్క ఆడపిల్ల లేదు.

ఆశ్చర్యం.. వంట చేయాలి అంటే ప్రతి ఇంట్లో అమ్మనే చేయాలి. పుట్టినప్పుడు అమ్మ పాలు తాగి పెరుగుతాం,  అన్నప్రాశన నుంచి అమ్మ పెట్టిందే తింటాం. అమ్మ చేతి వంట ముందు ఏ కాంటినెంటల్ హోటల్ ఫుడ్డూ పనికి రాదు. నిజంగా ఆమె చేతిలో ఏదో అద్బుతం ఉంది. ఇకపోతే నా చిన్నప్పటి నుంచి చాలా ఇళ్ళల్లో గమనించాను, మగపిల్లవాడు పుడితే ఆడుకోవడానికి బొమ్మ పిస్టల్స్, ఆడపిల్ల పుడితే ఆడుకోవడానికి ప్లాస్టిక్ బొమ్మ గ్యాస్ సిలిండర్, స్టవ్, గిన్నెలు, గంటెలు కొని ఇచ్చేవారు. అంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలను వంటింటికే పరిమితం చేసే ప్రయత్నం,చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ చేయడం అన్నమాట,పెద్దయ్యాక నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మొగుడికి పిల్లలకు, ఇంటికొచ్చి పోయేవాళ్ళకు వండి పెట్టాల్సిందే అని ఇండైరెక్ట్ గా చెప్పడం అన్నమాట. ప్రతి ఇంట్లో ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు అదే విధంగా వ్యవహరిస్తారనేది నిజం. అమ్మమ్మ, అమ్మ, బిడ్డ వరుస తరాల్లో ఆడపిల్లలు విధిగా వంట నేర్చుకోవాలి,వంట చేయాలి.. ఇదిగో ఇలాంటి పద్దతులు సమాజంలో వందల సంవత్సరాల పైగా మన కుటుంబ వ్యవస్థలో పాతుకుపోయి ఉన్నాయి.. చిన్న స్థాయి హోటల్స్ దగ్గరినుంచి స్టార్ హోటళ్ళ వరకు మనం గమనిస్తే వంట వండేవాళ్ళు అదే స్టార్ హోటళ్ళలలో చెఫ్ అని పిలిచే వాళ్ళు మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు ఉంటేగింటే ప్లేట్లు కడగడమో, లేదంటే కూరగాయలు తరగడమో చేస్తుంటారు.. అందుకే నాకు ఆశ్చర్యం వేసింది, ఇంట్లో వంట చేసే ఆడవాళ్ళు హోటళ్ళలలో వంట చేయడానికి ఎందుకు పనికిరారు, వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఎందుకు చేరరు అని.

ప్రిన్సిపాల్ దగ్గర ఫీజు వివరాలతో కూడిన ప్రాస్పెక్టస్ తీసుకుని నేను, శాలిని, బన్ని కారులో ఇంటికి బయలుదేరాం. మార్గ మధ్యంలో కాలేజీలో ఒక్క ఆడపిల్ల లేదు, అలాంటి కాలేజీలో ఎలా చేర్పిస్తాం అనీ చర్చ.. ఇంటికి వచ్చే సరికి చర్చ తారాస్థాయికి చేరింది. బన్ని చేరుతాననీ, నేను, శాలిని వద్దని. కారులో ఉన్నప్పుడే నేను నా నలుగురు స్నేహితులకు ఫోన్ చేసి అడిగా, వాళ్ళంతా అమ్మాయిలు ఆ కోర్సులో చేరితే చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు, దేశంలో కానీ విదేశాల్లో కానీ అబ్బాయిలకే అవకాశాలు ఉన్నాయి అన్నారు. శాలిని వాళ్ళ టీచర్లకు ఫోన్ చేసింది, వాళ్ళ నుంచి అదే సమాధానం. బన్ని మొండిపట్టు పట్టింది. శాలిని కొంచెం గట్టిగానే మందలించింది. ఒక పదిహేను నిమిషాలు నిశ్శబ్దం.. ఆ తరువాత “మమ్మీ ఏం కూర చేయమంటావు” అంటూ నవ్వుతూ బన్నీ వాళ్ళ మమ్మీ ఒడిలో తల పెట్టింది.

అంతే ఒక్కసారిగా అందరి ముఖాలు నవ్వులతో వాతావరణం ప్రశాంతంగా మారింది. చిన్నప్పుడు  బన్ని, స్వీటీ ఇద్దరినీ, నేను ఎప్పుడూ కొట్టడం, తిట్టడం చేయలేదు. శాలిని మాత్రం ఊరుకునేది కాదు, ఏదైనా తప్పు చేస్తే బన్నిని స్వీటీని, కొట్టేది. బన్ని దగ్గర ఒక మంచి గుణం ఏమిటంటే వాళ్ళ మమ్మీ గానీ, నాయనమ్మ, అమ్మమ్మ తాతయ్య ఎవరైనా ఏమైనా అంటే మనసులో పెట్టుకునేది కాదు. క్షణాల్లో మర్చిపోయి కలిసిపోయేది. ఆ విధంగా మేమిద్దరం కలిసి బన్ని చెఫ్ కావాలనుకున్న కలను దిగ్విజయంగా తుంగలో తొక్కేసాం. పిల్లల ఆసక్తిని అర్థం చేసుకోని తల్లిదండ్రులుగా మిగిలిపోయాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు బాధగా అనిపించింది. మేం తప్పు చేసామా అనీ, బన్ని ఇంట్రెస్ట్‌ని కిల్ చేసామన్న బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. సినిమాలో చీఫ్ చెఫ్ ఆనంద్ సుందరరాజన్  ఆడపిల్లలు ఇంట్లోనే కాదు హోటళ్ళలో  కూడా వంట చేసి ఉన్నత స్థాయికి ఎదగగలరు.. అని అన్నపూరణి నిరూపించింది ఇంతకాలంగా ఉన్న హద్దులను చెరిపేసిందనీ చివర్లో అంటాడు.. ఆ మాటలు నా లాంటి తండ్రులకు ఆలోచింపజేసేలా ఉన్నాయి.

బన్నిని తనకిష్టమైన హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో కాకుండా ఇంజనీరింగ్‌లో చేర్పించాం. అయినా మా మీద తనకి ఎలాంటి కోపం రాలేదు. కొత్త కొత్త వంటలు చేయడం ఆపలేదు. దేశంలో ప్రముఖ చెఫ్‌లు అయిన రణ్ వీర్ బ్రార్, సంజీవ్ కపూర్ లను చూసి ఇంకా కొత్త వంటలు నేర్చుకుంది. రోజూ రొటీన్‌గా వంట చేయడం అంటే బన్నికి ఇష్టం ఉండదు. రోజూ ఏదో కొత్త వంటకం, చాలా రుచికరంగా చేయడం తనకి ఇష్టం. ఎవరో మెచ్చుకోవాలని కాదు.. తాను చేసింది ముందు తనకు నచ్చాలి. ఆ తరువాతే అందరికి వడ్డిస్తుంది..

ఒక రోజు ఏంటి, రోజూ లండన్ నుంచి బన్ని ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇంజనీరింగ్ అయిపోయాక బన్ని ఎంఎస్ కోసం లండన్‌కి వెళ్ళింది.. ఫోన్‌లో రోజూ నేను ఆడిగే ఒకే ఒక ప్రశ్న “తిన్నావా బిడ్డా” అని.. అంతే.. తాను చేసిన కొత్త వంటల గురించే చెపుతుంది.

నేను కూడా ఫుడీని, అందుకే చాలా ఇంట్రెస్ట్‌గా వింటాను. రోజూ తినేటప్పుడు ఫోన్ చేస్తుంది. “ఇవాళ కొత్త రకం కూర చేసాను. చాలా అద్బుతంగా కుదిరింది” అంటూ చెపుతుంది.

సాయంత్రం ఏడు గంటలు అయ్యింది, లండన్ నుంచి బన్ని ఫోన్ కాల్.. “నాన్నా ఇవాళ మేతీలస్సన్ (మెంతి కూర, ఎల్లిపాయలు) కూర చేసినా, చాలా బాగుంది, దాని రెసిపీ చెపుతా. నువ్వు కూడా ట్రై చేయి” అంటూ  చెప్పడం ప్రారంభించింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here