‘రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.
***
[dropcap]“అ[/dropcap]మ్మా!.. కామాక్షీ అమ్మగారూ!.. నమస్కారం!..”
వరండాలోనుండి ఇంట్లోకి వెళుతున్న కామాక్షమ్మ.. వెనుతిరిగి చూచింది. ఎదురుగా గ్రామ పౌరోహితులు.. గంగన్న శాస్త్రిగారు చిరునవ్వుతో నిలబడి వున్నారు.
వరండా చివరి వరకు వచ్చి కామాక్షమ్మ.. “శాస్త్రిగారూ రండీ!..” సాదరంగా ఆహ్వానించింది. నవ్వుతూ శాస్త్రిగారు వరండాలోకి ప్రవేశించారు.
“కూర్చోండి శాస్త్రిగారూ!..” కామాక్షమ్మ కుర్చీలో కూర్చుంది. ముసిముసి నవ్వులతో శాస్త్రిగారు ఆమె ఎదుటి కుర్చీలో కూర్చున్నారు.
“ఊరకరారు మహానుభావులు..” చిరునవ్వుతో అని, మరుక్షణంలో.. “ఏమిటి విశేషాలు శాస్త్రిగారూ..” అడిగింది కామాక్షమ్మ.
“ఆ.. తమరికి తెలియనిదంటూ నా దగ్గర విశేషం ఏముంటుందమ్మగారూ!.. మీకు తెలిసిన విషయమే..” నసిగారు శాస్త్రి గారు.
“ఏమిటది?..” కామాక్షమ్మగారి కంఠంలో గాంభీర్యం..
“వివాహం!..”
“ఎవరిది?..”
“అమ్మగారూ!…”
“ఏమిటండీ?..”
“విషయం మీకు తెలియదా..” ఎంతో ఆశ్చర్యాన్ని వెల్లడించారు శాస్త్రిగారు.
“శాస్త్రిగారూ!.. అనవసర ప్రసంగాన్ని ఆపి.. విషయం ఏమిటో చెప్పండి!..” కంఠంలో కాఠిన్యం.. కామాక్షమ్మ శాస్త్రిగారి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది.
శాస్త్రిగారికి ఒళ్లు జలదరించింది.. ముఖంలో భయం..
“అమ్మగారూ!..”
“విషయం ఏమిటో చెప్పండి..”
“పెద్దబ్బాయిగారి కుమార్తె.. తమ పెద్ద మనుమరాలి వివాహం?..”
“ఏమిటీ!..” కంఠంలో ఎంతో ఆశ్చర్యం..
“అవును తల్లీ!..”
“ఆ విషయం మా లక్ష్మణప్రసాద్‌కు తెలుసా!….”
“అమ్మగారూ!.. నిజం చెప్పమంటారా!..”
“చెప్పండీ!..”
“ఆ సంబంధం సంధాత మన లక్ష్మణప్రసాద్ బాబుగారేనని విన్నాను తల్లీ!..”
కామాక్షమ్మగారు.. శాస్త్రిగారి ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచింది. “ఇంకేమన్నా చెప్పాలా శాస్త్రీ!..” శూన్యంలోకి చూస్తూ అడిగింది కామాక్షమ్మ.
వీధిగేటు తెరుచుకొని లక్ష్మణప్రసాద్ ఇంటివైపుకు వచ్చాడు. వరండాను సమీపించాడు. ఎంతో వినయంగా తన తల్లిగారి ముందు కూర్చున్న శాస్త్రిగారిని చూచి చేతులు జోడించి..
“నమస్కారం శాస్త్రిగారూ!..” చిరునవ్వుతో చెప్పాడు.
శాస్త్రిగారు వణికే చేతులతో ప్రతినమస్కారం చేశారు.
“ఏం శాస్త్రిగారూ!.. అదోలా వున్నారు?.. ఏదైనా సమస్యా?..” అడిగాడు లక్ష్మణప్రసాద్.
శాస్త్రిగారు భయంతో కామాక్షమ్మ ముఖంలోకి చూచి.. కుర్చీ నుంచి లేవబోయారు.
“శాస్త్రిగారూ!.. కూర్చోండి..” గంభీరంగా చెప్పింది కామాక్షమ్మ.
తల్లి అన్న మాట.. శాస్త్రిగారి ముఖభంగిమలను చూచిన లక్ష్మణప్రసాద్.. వచ్చి తల్లి ప్రక్కనే కూర్చున్నాడు.
“అమ్మా!..”
కామాక్షమ్మ సూటిగా లక్ష్మణప్రసాద్ ముఖంలోకి చూచింది.
“శాస్త్రిగారు అప్రసన్నంగా వున్నారు.. విషయం ఏమిటమ్మా..” చిరునవ్వుతో అడిగాడు లక్ష్మణ ప్రసాద్.
“నీవు నాతో దాచిన విషయాన్ని అతను నాతో చెప్పాడు..” నిష్ఠూరంగా అంది కామాక్షమ్మ.
లక్ష్మణప్రసాద్ తల్లి శాస్త్రిగార్ల ముఖాల్లోకి పరీక్షగా చూచాడు.. పెద్దగా నవ్వాడు.. ఆ ఇరువురూ ఆశ్చర్యపోయారు.
“విషయం నాకు అర్థం అయిందమ్మా!..”
“ఏం అర్థం అయింది?..” కామాక్షమ్మగారి ప్రశ్న..
“వారు మీకు చెప్పిన విషయం!..”
శాస్త్రిగారు కుర్చీనుంచి లేచి.. “అమ్మగారూ!.. ఇక నేను వెళ్తాను.. నమస్తే!..” అన్నారు.
“శాస్త్రిగారూ.. మన సంభాషణ ఇంకా ముగియలేదు.. కూర్చోండి..” అంది కామాక్షమ్మ.
“ఆ.. అవును.. శాస్త్రిగారూ.. అమ్మతో నేను చెప్పేది విని ఆ పై తమరు వెళుదురుగాని.. కూర్చోండి..”
ముఖం వేలాడేసుకొని శాస్త్రి కుర్చీలో కూర్చున్నారు.
“రంగమ్మా..” బిగ్గరగా పిలిచాడు లక్ష్మణప్రసాద్.
పరుగున వచ్చింది పనిమనిషి రంగమ్మ.
“అయ్యగారూ!..”
“ఆ.. రంగమ్మా.. వాతావరణం చాలా వేడిగా వుంది. మా ముగ్గురకీ నిమ్మకాయ మజ్జిగ తీసుకురా!..” చిరునవ్వుతో చెప్పాడు లక్ష్మణప్రసాద్.
కళ్లు పెద్దవిచేసి తనయుని ముఖంలోకి చూచింది కామాక్షమ్మ.
‘ఏ క్షణాన ఇంటనుంచి బయలుదేరానో.. ఇలా అడకత్తెరలో ఇరుక్కుపోయాను.. అంతా విధి.. అనుభవించవలసిందే!..’ మనసున అనుకొన్నారు గంగన్నశాస్త్రి.
“ఆ.. గంగన్న శాస్త్రిగారూ!.. ఏమిటి ఇంకా విశేషాలు!..” క్రీగంట చూస్తూ అడిగాడు లక్ష్మణ ప్రసాద్.
“ఆ.. ఏమీలేవు చినబాబుగారూ!..”
“వుంది..”
“ఆ..” ఆశ్చర్యపోయారు శాస్త్రిగారు.
“అవును..”
“ఏమిటి చినబాబూగారు?…” భయంతో మెల్లగా అడిగాడు శాస్త్రి.
“తెలియదా!..” లక్ష్మణప్రసాద్ బాబుగారి ఆ ప్రశ్నలో ఎంతో ఆశ్చర్యం..
బిక్కముఖంతో అవునన్నట్టు మెల్లగా తల ఆడించాడు శాస్త్రిగారు.
“మీ ఆవు ఈనింది.. అది కోడెదూడను పెట్టింది..” పకపకా నవ్వాడు లక్ష్మణప్రసాద్.
రంగమ్మ ట్రేలో మూడు గాజుగ్లాసుల్లో నిమ్మకాయ మజ్జిగను తెచ్చి ముగ్గురికీ.. శాస్త్రిగారితో ప్రారంభించి.. చివరన లక్ష్మణప్రసాద్ బాబుకు అందించి లోనికి వెళ్లిపోయింది.
“శాస్త్రిగారూ! మీ ఇంట కోడెదూడ పుట్టిందా!..” మజ్జిగ గ్రుక్కమింగి అడిగింది కామాక్షమ్మ.
“అవును తల్లి!.. అదీ మీరు నాకు దానం ఇచ్చిన ఆవు పెయ్యకు!..”
“పేరేం పెట్టారు శాస్త్రిగారు!..”
“దశరథ..” మెల్లగా చెప్పాడు శాస్త్రిగారు.
“మూడు నెలలయింది కదా శాస్త్రిగారూ..” అడిగాడు లక్ష్మణప్రసాద్.
“ఆ.. అవును చినబాబూ!..” చేతిలోని ఖాళీ గ్లాసును క్రింద పెట్టాడు.
“ఆ.. శాస్త్రిగారూ.. మా గ్రామ పురోహితులుగా మీరు మా అన్న రామప్రసాద్ కుమార్తె కుసుమ వివాహ విషయాన్ని.. నాకంటే ముందుగా.. మా శ్రేయోభిలాషిగా.. మా అమ్మగారికి తెలియచేసినందుకు మీకు నా ధన్యవాదాలు..” నవ్వుతూ చేతిలోని గ్లాసును క్రింద పెట్టి ఇంట్లోకి వెళ్లిపోయాడు లక్ష్మణప్రసాద్.
ఎంతో ఆనందంగా ఇంట్లోకి వెళ్లిన లక్ష్మణప్రసాద్‌ను ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయింది కామాక్షమ్మ, తను.. వెళ్లేందుకు ఇదే తగిన సమయం అని కుర్చీనుండి లేచి.. కామాక్ష్మమ్మకు నమస్కరించి వేగంగా వరండా మెట్లు దిగి వీధివైపుకు నడిచారు గంగన్నశాస్త్రి.
కామాక్ష్మమ్మ సుదీర్ఘమైన నిట్టూర్పును విడిచి కుర్చీనుంచి లేవబోయింది. సెల్ మ్రోగింది. సెల్ తీసుకొని చెవిదగ్గరకు చేర్చింది.
“అత్తయ్యా!..”
“ఆ.. చెప్పు పద్మా..”
“రేపు అమ్మాయిని చూచేదానికి పెండ్లివారు వస్తున్నారు. మీరూ మన ఇంటికి రాత్రికి రావాలి అత్తయ్యా!..” అభిమానంతో చెప్పింది పద్మ.
“రాత్రికి వచ్చి చేసేదేముంది?.. ఉదయాన్నే వస్తాలే!..” అంది కామాక్షమ్మ.
“సరే అత్తయ్యా.. మీ ఇష్టం..” పద్మ సెల్ కట్ చేసింది. కామాక్ష్మమ్మ మనసున ఏదో ఆలోచన.. కళ్లు మూసుకుంది.
***
ఆ రాత్రి భోజన సమయంలో.. “లక్ష్మణా!..” పిలిచింది తల్లి కామాక్ష్మమ్మ.
తల్లీ కొడుకులు ఎదురెదురుగా కూర్చొని భోంచేస్తున్నారు. రంగమ్మ దూరంగా నిలబడి వుంది.
“నన్ను రాత్రికే రమ్మని పద్మ పిలిచింది.”
“ఆహా..”
“నేను ఉదయాన్నే వస్తానన్నాను.” అలాగా అన్నట్టు తల ఆడించాడు లక్ష్మణప్రసాద్…
పలకనందుకు విచిత్రంగా చూచింది కామాక్షమ్మ లక్ష్మణ ప్రసాద్ ముఖంలోకి.. తల్లీ కొడుకుల కళ్లు కలిసాయి.. కాని లక్ష్మణప్రసాద్ మౌనంగా భోంచేస్తున్నాడు.
‘ఇపుడు వీడిని ఏమి అడిగినా.. కోపంతో చెయ్యి కడిగేసుకొని వెళ్లిపోతాడు. అడగాలనుకొన్నది భోజనం తర్వాత అడుగుతా..’ అనుకొంది కామాక్షమ్మ. ఇరువురూ మౌనంగా భోజనం చేశారు.
కొద్ది నిముషాల తర్వాత చేతులు కడుక్కొని హాల్లో టీవీ ముందు సోఫాల్లో ఇరువురూ ప్రక్కప్రక్కన కూర్చున్నారు.
లక్ష్మణప్రసాద్ టీవీని ఆన్ చేయబోయి.. తల్లి ముఖంలోకి చూచాడు. “అమ్మా.. నీవు నాతో ఏమైనా మాట్లాడాలా!..”
“ఆ సంబంధాన్ని చూచింది ఎవరు?..”
“నేనేనమ్మా!..”
“అది నీకు అవసరమా!..”
“అవసరమే కాదు.. బాధ్యతమ్మా!..”
“నాతో ఒక్కమాట చెప్పకుండా నీవు.. నీవు..”
“నేనేం తప్పు చేయలేదమ్మా!.. విషయాన్ని వదిన చెప్పిందిగా!..”
“మరి వాడు..”
“ఎవరు?..”
“మీ రామన్న!…” వ్యంగ్యంగా పలికింది కామాక్షమ్మ.
“అమ్మా!… అన్నయ్య విషయంలో నీవు తప్పుచేశావు!.. వారిని ద్వేషించావు.. అవమానించావు.. ఆయనకూ మాట పట్టింపులుంటాయమ్మా!.. నీవు పెద్దదానివి… నీ పెద్దరికాన్ని నీవు.. నీ ప్రవర్తన.. నీ మాటలచేత కాపాడుకోవాలమ్మా!.. అన్నా వదినలు నిన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు. ఆ విషయాన్ని నీవు తెలుసుకోవాలి.. ఏ విషయంలోనైనా.. ఎవరివల్లనైనా.. నీకు అవమానం జరిగితే.. అది నాకు అవమానం. కారణం నీవు నా తల్లివి.. అలాగే రాము అన్నయ్యకు కూడా నీవు పినతల్లివే.. అంటే తల్లితో సమానురాలివి కదా అమ్మా.. నీకు నేను ఎంతో.. రాము అన్నయ్య కూడా అంతే అనే భావన నీకు వుండాలి కదమ్మా!.. కారణం నాకు అన్నయ్యకు తండ్రి ఒక్కరే కనుక. నీ తమ్ముడి మాటలు విని నమ్మి సంకుచితంగా అన్నా వదినల విషయంలో ఆలోచించకు. వారిని ద్వేషించకు.. అవమానించకు.. జరుగబోయేది శుభకార్యం. పెద్దదానివి కదా.. అందరితో మంచిగా వ్యవహరించి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో అమ్మా!.. ఆ చర్య నాకు ఎంతో ఆనందాన్ని కలుచేస్తుంది..” అనునయంగా తల్లికి చెప్పి లక్ష్మణప్రసాద్ తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు.
కామాక్షమ్మ సాలోచనగా తన గదిలోకి వెళ్లిపోయింది.
***
లక్ష్మణప్రసాద్ తండ్రి దశరథరామయ్య. వారికి రెండు వివాహాలు. మొదటి భార్య సంతతి రామప్రసాద్. వారి తల్లి పేరు కౌసల్య. రామప్రసాద్ వయస్సు పది సంవత్సరాలుండగా కౌసల్య రెండో కాన్పు సమయంలో జన్ని వలన చనిపోయింది. మూడునెలల లోపలే పోతపాలు గిట్టక అనారోగ్యంతో ఆ పుట్టిన మగశిశువు కూడా మరణించటం జరిగింది.
ముప్ఫై అయిదు సంవత్సరాల దశరథరామయ్యను మరో వివాహం చేసుకోవాల్సిందిగా పెద్దలు చెప్పి ఒప్పింపగా.. కౌసల్య పినతల్లి కుమార్తె కామాక్షమ్మను ద్వితీయ వివాహం చేసుకొన్నాడు దశరథరామయ్య.
సంవత్సరం లోపలే మొగబిడ్డ జననం. అతనే లక్ష్మణప్రసాద్. రామప్రసాద్‌కు తమ్ముడంటే ప్రాణం. మరో రెండు సంవత్సరాల్లో ఆడపిల్ల జననం. ఆమె పేరు చంద్రిక. ఇరువురు అన్నాతమ్ములకు ఆ చెల్లెలంటే.. పంచప్రాణాలు. మొదటి భార్యా వియోగంతో ఆ బాధను మరచి నిదురించేదానికి దశరథరామయ్య బావమరిది శరభయ్య మూలంగా త్రాగుడు అలవాటు పడ్డాడు. రెండవ పెండ్లి తర్వాత.. కామాక్షమ్మకు ఇరువురు సంతతి మూడు సంవత్సరాల లోపల కలగటం, ఆ బిడ్డలను ఎంతగానో అభిమానించడం.. రామప్రసాద్‍ను అసహ్యించుకోవడం.. అతనిమీద కామాక్షమ్మ చెప్పే చాడీలు విని విని.. కొన్ని దృశ్యాలను చూచి.. దశరథరామయ్య పూర్తిగా త్రాగుడుకు బానిసగా మారిపోయాడు. శకునిమామలా శరభయ్య.. అతని ఆవేదనకు ఆజ్యం పోస్తూ.. ఆవేదనను బలపరుస్తూ.. ఉపశమనానికి ఆదమరచి నిద్రపోవటానికి తప్పతాగించి పడుకోబెట్టేవాడు.. చేతికి చిక్కినంత తస్కరించేవాడు.
అక్క.. కామాక్షమ్మకు లేనిపోని మాటలను కల్పించి రామప్రసాద్‌ను గురించి చెప్పి.. ఆమె మన్ననకు పాత్రుడయ్యేవాడు. లక్ష్మణ్‌కు ఐదు సంవత్సరాల ప్రాయంలో గుండె నొప్పితో దశరధరామయ్య చనిపోయాడు.
ఆ చివరిదశలో.. రామప్రసాద్‌ను దగ్గరకు పిలిచి.. అతని చేతిలో తన చేతిని వుంచుకొని..
“రామా!.. నీవు.. నీ తమ్ముడిని చెల్లిని నీ జీవితాంతం నీ ప్రాణసమానంగా చూచుకోవాలి. వారిని బాగా చదివించాలి. వారికి నేను లేని లోటు తీర్చాలి.. అలాగే చేస్తానని మాట ఇవ్వు.. అది నా చివరి కోరిక..” కన్నీళ్లతో అన్నాడు.
పదిహేను సంవత్సరాల రామప్రసాద్.. “సరే” అన్నాడు.
దశరథరామయ్య ఆనందంగా ప్రాణాలను విడిచాడు.. క్రతువులన్ని ముగిశాయి.
రామప్రసాద్ టెన్త్ చదువును ఆపేశాడు. వారిది వ్యవసాయ కుటుంబం. తమ్ముడు లక్ష్మణ ప్రసాద్.. చంద్రికలను స్కూల్లో చేర్పించి బాగా చదివించాడు.
పినతల్లి.. మేనమామల ఈసడింపులను.. ధాష్టీకాలను.. ఆజ్ఞలను ఎంతో ఓర్పుగా భరించేవాడు.
లక్ష్మణప్రసాద్‌కు పదహారేళ్ల ప్రాయం.. చంద్రికకు పదునాలుగేళ్ల ప్రాయంలో వారికి.. తమ తల్లి మేనమామలు తమ అన్నను నీచంగా చూస్తున్నారని అర్థం అయింది. అన్నను ఎంతగానో అభిమానించేవారు.
రాము చేస్తున్న కొన్ని పనులను.. తన తీరిక సమయంలో.. అన్నతో కలసి రాము వారించినా లక్ష్మణ్ చేసేవాడు.. ఆ లక్ష్మణప్రసాద్ చంద్రికలకు తమ అన్న రామప్రసాద్ అంటే పంచప్రాణాలు..
ఆ యింట రామప్రసాద్ బ్రతుకు పాలేరు బ్రతుకు.. అన్ని బాధలను తండ్రికి ఇచ్చిన మాట కారణంగా కట్టుబడి.. సహనంతో జీవితాన్ని సాగిస్తున్నాడు రామప్రసాద్.
యం.టెక్. పాసై లక్ష్మణప్రసాద్ ఇంజనీర్ అయినాడు. బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న చంద్రిక తనతోపాటు ఫైనల్ ఇయర్‌లో ఉన్న విశ్వనాధ్‌తో ప్రేమలో పడింది.
ఆ విషయం లక్ష్మణప్రసాద్‌కు తెలిసి చంద్రికను అసహ్యించుకొని కోపగించుకొన్నాడు. చంద్రికకు తల్లి, మేనమామల సపోర్టు. విశ్వనాధ్ తండ్రి పేరుమోసిన సీనియర్ లాయర్.. కోట్లాధిపతి.. పేరు భూపతి.
చంద్రిక ఆ యింటి కోడలైతే.. కాలు క్రింద పెట్టాల్సిన అవసరమే వుండదనుకొన్నారు కామాక్షమ్మ శరభయ్యలు. లక్ష్మణ ప్రసాద్‌ను ఒప్పించారు.
అంటే.. రామప్రసాద్ ఇష్టాయిష్టాలతో వారికి సంబంధం లేదు. విశ్వనాధ్ తండ్రి భూపతి.. చంద్రిక విశ్వనాధ్ వివాహానికి ఒక లింక్ పెట్టాడు.
అదేమిటంటే.. ఒక కాలికి గ్రహణ దోషం తగిలిన తన అవిటి కూతురు పద్మను లక్ష్మణప్రసాద్ పెండ్లి చేసుకోవాలని కోరాడు భూపతి.
అన్నయ్య పెండ్లి కానిదే తాను చేసుకోనన్నాడు లక్ష్మణ్.. ఉభయవర్గాలవారు కిందామీదా పడి.. రామప్రసాద్‌కు పద్మకు.. చంద్రిక విశ్వనాధ్ లకు పెండ్లి జరిపించాలనే నిర్ణయానికి వచ్చారు.
భూపతి రెండు వివాహాలకు ముహూర్తాలు నిర్ణయించాడు. ఆ నలుగురి వివాహాలు ఘనంగా జరిగాయి. వివాహానంతరం.. కుటుంబాల్లో ఎలాంటి గొడవలు రాకుండా కామాక్షమ్మ.. రామప్రసాద్‌ను చూచే చూపుల్లోని.. మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి.. తన కూతురు పద్మకు ఆ యింట ఎలాంటి కష్టం కలుగకూడదని.. ఒక రైస్ మిల్ నిర్మించి ప్రక్కనే కూతురు అల్లుడు వుండేదానికి ఇంటిని నిర్మించి రామప్రసాద్ పద్మలను కామాక్షమ్మ నిలయం నుంచి వేరు కాపురం పెట్టించాడు భూపతి.
ఎవరి స్వార్థం వారిది.. వివాహానంతరం రెండు నెలల్లో విశ్వనాధ్ చంద్రికలు అమెరికా వెళ్లిపోయారు.
రామప్రసాద్ ఇంటికి దూరమైనందుకు కామాక్షమ్మ.. శరభయ్యలు ఆనందించారు. సీనియర్ లాయర్ భూపతిగారు దశరధరామయ్యగారి ఆస్తిని నాలుగు భాగాలుగా చేసి.. డాక్యుమెంట్సు తయారు చేసి నలుగురికీ ఆస్తి వివరాలు ఇచ్చేశాడు.
లక్ష్మణప్రసాద్ ఎంతగానో విచారించాడు. ఎవరు ఎన్నిచెప్పినా కొంతకాలం వివాహం చేసుకోనంటూ.. ఉద్యోగం చేసుకొంటూ ఆనందంగా బ్రతుకుతున్నాడు.
మంచంపై వాలిన లక్ష్మణప్రసాద్ మస్తిష్కంలో పై విధంగా గత చరిత్ర అంతా సినిమా రీల్‌లా ప్రతిబింబించింది. తనను ఇంతటి వాడిని చేసిన అన్న.. చెల్లెలి ప్రేమకోసం.. అవిటి యువతిని వివాహం చేసుకొన్న అన్న… అతని దృష్టిలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి.. తన జీవితాంతం అన్నకు అనుకూలంగా బ్రతకటం అతనికి ఆనందాన్ని కలిగించడం తన ధర్మం అని నిర్ణయించుకున్నాడు. పాటిస్తున్నాడు. తల్లి, మేనమామ అన్నయ్యకు వ్యతిరేకులని తెలుసు..
చెక్కిళ్ల పైకి జారిన కన్నీటిని తుడుచుకొని కళ్లు మూసుకొన్నాడు లక్ష్మణప్రసాద్.
***
రామప్రసాద్ పద్మల సంసార జీవితంలో.. రామప్రసాద్ సహనమూర్తి అయిన కారణంగా.. వివాహానంతరం పద్మను తన కంటిపాపలా చూచుకొంటూ.. ఏనాడు ఆమె అవిటితనాన్ని గురించి ఆమెను నొప్పించి బాధ పెట్టే రీతిగా మాట్లాడని కారణంగా ఆ దంపతుల మధ్య కొద్దిరోజుల్లో ఎంతో అన్యోన్యత ఏర్పడింది.
సంవత్సరం తిరిగేలోపల పద్మకు పండంటి కవలలు ఆడ మగ జన్మించారు. వారికి భూఫతి ఇష్టానుసారంగా లవ, కుసుమ.. అని పేర్లు పెట్టారు.
రామప్రసాద్ ఆనందానికి హద్దులు లేవు. ఇక లక్ష్మణప్రసాద్ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ గ్రామ ప్రజలందరికీ స్వీట్స్ పంచాడు.
సీనియర్ లాయర్ భూపతి.. వారి అర్ధాంగి అనితగారు బిడ్డ బాలసారెను ఎంతో ఘనంగా చేశారు. ఆ కార్యక్రమాల్లో పెత్తనం అంతా లక్ష్మణప్రసాద్ వారి చెల్లి చంద్రిక బావ విశ్వనాధ్ లదే.. ఒక్క కామాక్షమ్మ.. శరభయ్య తప్ప.. వూరి జనం.. బంధుమిత్రులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఆ చిన్నారులను మనసారా దీవించారు. ఆ బిడ్డల వయస్సు ఆరునెలల ప్రాయంగా వుండగా లాయరుగారి తమ్ముడు.. వారు డి.ఎస్.పి., సభాపతి.. వారి ఒక్కగానొక్క కూతురు హిమను.. లక్ష్మణప్రసాద్ తన అన్న రామప్రసాద్ కోరిక ప్రకారం వివాహం చేసుకొన్నాడు.
హిమ డాక్టర్.. ఆ పల్లెలో రామలక్ష్మణులు వాళ్ల నాన్నగారైన దశరథ.. రామప్రసాద్ తల్లిగారైన కౌసల్య పేర్లతో ‘కౌసల్య దశరథ హాస్పిటల్’ నిర్మించారు.
పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పరమ ప్రశాంతమైన ఆ పల్లెలో హిమ లక్ష్మణప్రసాదు ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు. హిమ చుట్టుప్రక్కల గ్రామాలకు సొంత వాహనంలో వెళ్లి పేదలకు వ్యాధిగ్రస్థులకు చికిత్సలు చేసేది. తనకు సాయంగా ఇరువురు జూనియర్ డాక్టర్లను ఏర్పాటు చేసుకొంది. హిమ చర్యలు కామాక్షమ్మగారికి నచ్చేవి కాదు. ఏదో సలహాలు ఇవ్వబోయేది..
హిమ ఆమె పెద్దరికాన్ని గౌరవించి.. లక్ష్మణప్రసాద్ తనకు చెప్పివున్న రీతిగా సున్నితంగా జవాబు చెప్పి ఆమె నోరు మూయించేది.
వివాహం అయిన రెండో సంవత్సరంలో వారికి పాప పుట్టింది. లక్ష్మణప్రసాద్ ఆ పాపకు కౌసల్య అని నామకరణం చేశాడు..
రామప్రసాద్ ఎంతో ఆనందంతో తమ్ముడు లక్ష్మణప్రసాద్‌ను పరవశంతో కౌగలించుకున్నాడు.
జవాబుగా లక్ష్మణప్రసాద్.. “నాకు ఇంతటి మంచి అన్నయ్యను ఇచ్చిన నా పెదతల్లిని నేను నా జీవితాంతం తలచుకోవాలి. అందుకే నా బిడ్డకు ఆ పేరు పెట్టాను” పారవశ్యంతో చెప్పాడు లక్ష్మణప్రసాద్.
ఆ మాటలను విన్న బంధువులంతా ఎంతగానో సంతోషించారు. లక్ష్మణప్రసాద్‌ను అభినందించారు.
ఆ సన్నివేశాన్ని.. అందరి సంభాషణలను అక్కా తమ్ములు.. కామాక్షమ్మ.. శరభయ్యలు చూడలేక.. వినలేక ప్రక్కకు వెళ్లిపోయారు.
***
లవ కుసుమల వయస్సు ఇరవైమూడు సంవత్సరాలు. కౌసల్య వయస్సు ఇరవై సంవత్సరాలు… లవ చిన్నాన్నలాగా ఇంజనీరు అయినాడు. కౌసల్య ఎం.బి.బి.యస్. చదువుతూవుంది.
కుసుమ డాక్టర్ అయింది. తన పిన్ని హిమలా.. తనతోనే చదువుకున్న మరో డాక్టర్ సత్య కుసుమను ప్రేమించాడు. వరుసకు తాతగారైన.. భూపతికి తన నిర్ణయాన్ని.. తన తల్లిదండ్రుల ద్వారా చెప్పించాడు. కుటుంబం మంచిదైనందున… భూపతి తన అల్లుడు కూతురుతో చర్చించి పెండ్లి చూపులుకు ఏర్పాటు చేశాడు.
తూర్పున భానుని అరుణకిరణాలు. పల్లె మేల్కొంది. కామాక్షమ్మ ఇంట..
కొడుకు కోడలు మనుమరాలు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని రామప్రసాద్ గారింటికి బయలుదేర సిద్ధం అయినారు.
అయిష్టంగానే లేచి.. స్నానం చేసి.. పట్టుచీర సింగారించుకొంది కామాక్షమ్మ.
“అమ్మా!..” పిలిచాడు లక్ష్మణప్రసాద్.
“ఆ..” భారంగా.. అసావేరి రాగాలాపన చేసింది కామాక్షమ్మ.
“మేము రడీ.. నీవు రావాలి..” అన్నాడు లక్ష్మణప్రసాద్.
“నానమ్మా.. త్వరగా రా..” పిలిచింది కౌసల్య.
“కౌసల్యా!..” పిలిచింది డాక్టర్ హిమ.. “చూడూ… నానీకి వయస్సు అయింది. నీలా చిన్నపిల్ల కాదు.. వెళ్లి చేయిపట్టుకొని తీసుకురా!..” చెప్పింది హిమ.
కౌసల్య కామాక్షమ్మగారు సింగారం చేసుకొంటున్న గదివైపు నడిచింది. “హిమా!..” లక్ష్మణప్రసాద్ పలకరింపు.
“ఆ..” హిమ జవాబు.
“కౌసు.. చిన్నపిల్ల కదా!.. అంత గట్టిగా చెప్పాలా!” అనునయంగా అడిగాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణప్రసాద్.
“సార్! నేను మీ అమ్మాయిగారిని ఏమీ అనలేదండీ!..” అందంగా నవ్వింది లక్ష్మణ ప్రసాద్ ముఖంలోకి చూస్తూ.
కౌసల్య నానమ్మ కామాక్షమ్మ కుడిచేతిని పట్టుకొని వరండాలోకి లాక్కొచ్చింది.
“అమ్మా.. జాగ్రత్తగా రా!..” లక్ష్మణప్రసాద్ హెచ్చరిక.
“చూడరా!!.. నీ కూతును నన్ను ఎలా లాక్కొని వస్తోందో!..” కామాక్షమ్మగారి నిష్ఠూరం.
“లాక్కురావడం లేదు.. కామాక్షమ్మగారూ!.. మీ కొడుకుతో నా పై చాడీలు చెప్పకండి.. మీ వయస్సు అయింది కదా.. అందుకని చేయిపట్టుకొని నడిపిస్తున్నా!.. అవునా.. కాదా అమ్మా..” అంది కౌసల్య.
“ఆ.. ఆ.. అవునులే..” నవ్వుతూ చెప్పింది హిమ.
“ఒరేయ్!.. లక్ష్మణా!.. ఇప్పుడు నేను ఆ ఇంటికి రావడం అవసరం అంటావా!..” అసహనంగా అడిగింది కామాక్షమ్మ. ఆమెకు రామప్రసాద్ ఇంటికి పోవడం.. అక్కడివారినందరిని చూడటం ఇష్టం లేదు.
“మాకందరికీ నీవే కదమ్మా పెద్దదానివి. నీ పెద్ద మనుమరాలికి సంబందించిన శుభకార్యం కదమ్మా ఇది!.. ఏంటి.. అలా అడుగుతావు.. నీవు రాకపోతే అన్నా వదినలు ఎంతో బాధపడతారు. పద.. కారెక్కు..” అనునయంగా చెప్పాడు లక్ష్మణప్రసాద్.
***
వాకిట్లో ఆగిన కారును చూచి రామప్రసాద్.. పెండ్లికూతురు కుసుమ పరుగున వాకిట్లోకి వచ్చారు. నలుగురూ కారు దిగారు.
“అమ్మా!.. రా!.. ఆప్యాయంగా పలకరించాడు రామప్రసాద్.
“నానమ్మా!.. రండి!..” ప్రీతిగా కుసుమ కామాక్షమ్మ చేతిని పట్టుకొంది.
సింహద్వారం దగ్గరుండి పద్మ మెల్లగా కర్ర సాయంతో వారికి ఎదురువచ్చింది. లవకుమార్ తల్లి ప్రక్కనే వున్నాడు.
“అక్కా!.. నీవు రావడం ఎందుకు!.. ఆగు మేమే వస్తున్నాంగా!” ప్రీతిగా ముందుకు నడిచింది హిమ. వాకిట్లోకి మూడు కార్లు వచ్చి ఆగాయి.
పిల్లవాని తల్లితండ్రులు వారి బంధువులు పదిమంది.. నలుగురు మగవారు, ఆరుగురు ఆడవారు పెండ్లికొడుకు కార్లనుండి దిగారు. ఇంట్లో వున్న భూపతి వారి అర్ధాంగి రామప్రసాద్, లక్ష్మణ్ ప్రసాద్ వారందరినీ చిరునవ్వులతో.. సాదరంగా ఆహ్వానించారు.
తొలుత.. అల్పాహారం.. కాఫీలను వచ్చిన వారందరికీ సమకూర్చడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పద్ధతిగా నిర్వహించింది హిమ, ఆమె కూతురు కౌసల్య. వారికి సాయంగా వుంటూ లక్ష్మణప్రసాద్, రామప్రసాద్.. పద్మలు జరుగుతున్న కార్యక్రమాన్ని ఆనందంగా చూస్తున్నారు.
ఆమె అయిష్టతను భూపతి వారి సతీమణి ఈశ్వరీ చూచి ఆమెను సమీపించి యోగక్షేమాలను పరామర్శించారు.
హిమ.. కుసుమను అలంకరించి హాల్లోకి తీసుకొనివచ్చింది. పెండ్లికొడుకు తరపున వచ్చిన అతను.. అతని తల్లి తండ్రి.. బందుమిత్రులు కుసుమను చూచి చాలా సంతోషించారు. వరుడు సత్య కుసుమను ప్రేమించినవాడు.. కాబట్టి.. అతనికి ఎంతో ఆనందం..
అందరి వదనాల్లో ఎంతో సంతోషం. భూపతి పెండ్లికొడుకును తన మనుమరాలు కుసుమను ప్రక్కప్రక్కన నిలుచోబెట్టి ఫొటోలు తీశాడు. భూపతిగారు చెప్పినమాట ప్రకారం వరుడు వధువులు సత్య కుసుమలు కామాక్షమ్మగారి పాదాలకు నమస్కారంచేశారు.
“కామాక్షమ్మగారూ!.. మీరు మా అందరికంటే పెద్దవారు.. పిల్లలను మనసారా ఆశీర్వదించండి.. మీరు చాలా అదృష్టవంతులు.. బంగారంలాంటి ఇద్దరు కొడుకులు.. కోడళ్లు.. మనుమలు.. మనుమరాళ్లు.. మీ కొడుకుల అన్యోన్యత ఎన్నో కుటుంబాలకు ఆదర్శం. మీ ఆశీస్సులు మా కుటుంబానికి కావాలి.” ఎంతో వినయంగా చెప్పి.. తనవారి అందరి ముఖాల్లోకి.. చిరునవ్వుతో చూచాడు భూపతిగారు.
ఆమె కుర్చీకి ఇరువైపు రామలక్ష్మణులు పద్మ హిమలు వారి సంతతి నిలబడి ఎంతో ప్రీతిగా నవ్వుతూ చూస్తూ.. చేతులు జోడించారు. భూపతిగారు వారి గ్రూప్ ఫొటోను తీశారు.
ఆ క్షణంలో కామాక్షమ్మ మనస్సులో ప్రళయం.. రామప్రసాద్ విషయంలో తాను ఎంత కర్కశంగా ప్రవర్తించింది జ్ఞప్తికి వచ్చి.. కళ్లనుండి అశ్రువులు.. జలజలా రాలాయి.
“అమ్మా.. ఎందుకమ్మా కన్నీరు?..” దగ్గరకు జరిగి ప్రీతిగా మెల్లగా అడిగాడు రామప్రసాద్. హృదయంలోని ఆవేదన కామాక్షమ్మను భోరున ఏడ్చేలా చేసింది. రామ్ ప్రసాద్ కళ్లల్లో కన్నీటి జీరలు.
“నన్ను క్షమించు రామా!..” కామాక్షమ్మ రామప్రసాద్ హృదయంపై వాలిపోయింది. పశ్చాత్తాపంతో ఆమె హృదయం దహించ సాగింది.
అన్నాతమ్ములూ ఇరువురు ఆ తల్లిని తమ చేతుల్లోకి తీసుకొన్నారు. ప్రీతిగా ఆమె కన్నీటిని తుడిచారు. పరమానందంతో భూపతి మిగతావారందరినీ నవ్వుతూ పరీక్షగా చూచాడు.
“అమ్మా.. కామాక్షమ్మగారూ!.. ఇది బాధపడవలసిన సమయం కాదు.. ఆనందించవలసిన సమయం.. నీ బిడ్డలు ఈ ‘అన్నదమ్ములు’.. ఆదర్శవంతులు.. ఎందరికో ఆదర్శవంతులమ్మా..” అంటూ ఆనందాతిశయంతో రెండుసార్లు అన్నారు భూపతిగారు.
అందరి వదనాల్లో పున్నమి వెన్నెల వెల్లివిరిసింది.