అన్నింట అంతరాత్మ-1: కూర్చుండ ఇంటింట కుర్చీని నేను!

11
3

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ఓ కుర్చీ అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]వే[/dropcap]దమూర్తిగారు హాయిగా నా ఒళ్లో కూర్చుని పుస్తకం చదువుతున్నారు. ఒక్క వేదమూర్తిగారేమిటి, ఎవరైనా విశ్రాంతి తీసుకోవాలంటే, సౌకర్యవంతంగా కూర్చుని సేద తీరాలంటే నేను ఉండాల్సిందే. నేను లేని చోటే లేదు. ఒకప్పుడు చెక్కతో, ఇనుముతో, పేముతో మాత్రమే తయారయ్యేదాన్ని. ఆ తర్వాత స్టీలుతో.. ఆ పైన ప్లాస్టిక్‌తో కూడా తయారవుతున్నానేమో ధనిక, పేద తేడా లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చాను. నా రూపాలెన్నెన్నో. విశ్రాంతిగా చేతులు ఆనించుకోవడానికి వీలుగా ఉండే కుర్చీని ఆర్మ్ చెయిర్ అంటారు. సూపర్ డీలక్స్, లగ్జరీ బస్సుల్లో, విమానాల్లో వెనక్కి వాలేందుకు వీలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలుండే కుర్చీలు, ముందుకు, వెనక్కు ఊగేందుకు వీలుగా రాకింగ్ చెయిర్స్, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు ఇలా ఎన్నెన్నో రకాలుగా.. అలసిన వేళల సేద తీర్చేందుకు పడక్కుర్చీగా ఏనాటినుండో మానవ సేవలో ఉన్నాను. మా పూర్వీకుల గురించి, చరిత్ర గురించి మొన్ననే వేదమూర్తిగారి అబ్బాయి సత్యానంద్ చెపుతుంటే విన్నాను. ఈజిప్టులో ప్రాచీన కాలంనుంచి మావాళ్లు ఉండేవారనీ, ఆ తర్వాత గ్రీకులు, రోమన్లు కూడా మమ్మల్ని వాడారని చెప్పాడు. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన కుర్చీ సెయింట్ అగస్టీన్ కుర్చీ అట. అది పదమూడో శతాబ్ది నాటిదని కూడా చెప్పాడు. నా విషయంలో కొన్నిచోట్ల సెంటిమెంట్లు, తగాదాలు, వివాదాలు చూస్తుంటే నేనెంత గొప్పదాన్నో అని ఓ క్షణం గర్విస్తుంటా. అన్నట్లు వేదమూర్తి గారింట్లో అయితే ఆయన కుర్చీ ఆయనకే పరిమితం. అందులో మరెవరూ కూర్చోవటానికి వీల్లేదు. అంతెందుకూ, ఆమధ్య పక్కింటి ప్రసూన వచ్చి, ‘మా అత్తగారయితే ఆవిడ కుర్చీని తాకను కూడా తాకనివ్వదు’ అని చెప్పటం విన్నాను. ఇక వేదమూర్తిగారి మనవడు, మనవరాలు టింకు, పింకీలయితే తమ బుల్లికుర్చీలను ఎక్కడికంటే అక్కడికి తమ చిట్టి చేతులతో ఎత్తుకెళ్లి కూర్చుంటూ ఉంటారు. వాళ్లనలా చూస్తుంటే నాకెంత ఆనందమో. ఇంక ఎదురింటి టామీ పోర్టికోలో మహారాజులాగా దర్జాగా కుర్చీలో కూర్చుని పోజులు కొడుతుంది. అయితే మొన్న పెద్దాయిన అదే వేదమూర్తిగారు ‘కనకపు సింహాసనమున శునకము..’ అంటూ సుమతీ శతకంలోని పద్యమట.. అది చదివారు. కానీ ఆమాట నాకు నచ్చలేదు. పాపం శునకాలను ఎందుకు కించపరచటం.. శునకం గొప్ప విశ్వాసం గల జంతువు. మనుషులే స్వార్థంతో అన్ని అకృత్యాలు చేస్తుంటారు.

నేను వేదమూర్తి గారింటికి రాక ముందు అంటే ఆయన నన్ను కొనుగోలు చేయక ముందు ఫర్నిచర్ షాపులో ఉన్నాను కదా. అప్పుడు అక్కడ రకరకాల కుర్చీల జాతులుండేవి. సింహాసనం టైపు కుర్చీలకయితే ఎంత రాజసమో. ఓయబ్బో తమకే నగిషీలున్నాయని, తమకే మఖ్‌మల్ సీట్లను అమర్చారని, పెళ్లిళ్లల్లో, పేరంటాలలో, ఇతర వేడుకలు, సభలు, సమావేశ కార్యక్రమాలలో తమపై అందరి చూపు పడుతుందనీ, ఎంతో ముఖ్యమైన వ్యక్తులు కూర్చుంటారనీ తమ పేరే మహారాజా కుర్చీలని తెగ గొప్పలు పోయేవి. ఇద్దరో, ముగ్గురో కూర్చోగలిగే పెద్ద సోఫాల విలాసమయితే చెప్పక్కర్లేదు. కొనడానికి వచ్చిన వారిలో కొందరు బక్క ప్రాణులు తమమీద కూర్చోగానే అవి కిసుక్కున నవ్వేవి. ఆ నవ్వు కుర్చీలజాతికే వినిపిస్తుంది మరి. వేదమూర్తిగారు మొన్న చెపుతున్నారు.. ‘మా చిన్నప్పుడు సినిమా హాళ్లలో నేల టిక్కెట్టు ఉండేది. కుర్చీ క్లాసంటే మహా గొప్ప. ఆ కుర్చీల్లో నల్లులు చేరి తెగ కుడుతున్నా, సినిమాలో పడి పట్టించుకునే వాళ్లం కాదు. ఇప్పుడు బాల్కనీలు, బాక్స్‌లు వగైరా వచ్చాయి. ఆ చీకట్లో ఎంట్రెన్స్ దగ్గరున్న మనిషి చూపించే బ్యాటరీలైట్ గుడ్డి వెలుగులో నడకరాని వాళ్లలా నడుస్తూ, కూర్చున్న వాళ్లను తొక్కుతామేమో అనే భయంతో, గుడ్డివాళ్లలా తడుముకుంటూ, సీటు వెతుక్కోవటం నాకు చిరాగ్గా అనిపిస్తుంది. సీట్ల వరస మధ్య ఇంకొంచెం దూరం వదిలితే వాళ్ల సొమ్మేం పోతుందో’ అంటుంటే ఇంట్లో అంతా పక్కుమని నవ్వారు. మొన్న పక్కింటి పిల్లవాడు వచ్చి నా చేతిమీద పెన్నుతో రాయబోతే వేదమూర్తిగారి భార్య సావిత్రమ్మ గారు ‘తప్పుకదూ’ అని కోప్పడ్డారు. అప్పుడు వాడు ‘మా స్కూల్లో అంతా ఇలాగే చేస్తారాంటీ. పెన్నుతో కుర్చీల మీద, బల్లల మీద రాస్తారు. అంతేకాదు, బ్లేడుతో చెక్కుతారు కూడా. మొన్నయితే మాస్టారు వచ్చేసరికి ఆయన కుర్చీ హేండిల్‌కి గుండుసూదులు తల్లకిందులుగా గుచ్చి ఉంచారు. ఆయనొచ్చి చూసుకోకుండా చేతులు పెట్టి ‘అబ్బా’ అని ‘ఏ రాస్కెల్ ఈ పని చేశాడ’ని గట్టిగా అరిచారు. ఎవరికి వాళ్లు నవ్వు దాచుకుంటూ సైలెంట్ అయిపోయామాంటీ. ఇంకోసారయితే మాష్టారు అటు తిరిగి, బోర్డుమీద ఏదో రాస్తుంటే, గోపీగాడు వెళ్లి ఆయనకు డస్టర్ అందిస్తున్నట్లు నటించి, కుర్చీని పక్కకు మెల్లిగా జరిపాడు. ఆయన చూసుకోకుండా కూర్చోబోయారు. అంతా కిసుక్కున నవ్వులు..’ అని గొప్పగా చెపుతుంటే తనకెంత బాధేసిందో. మావాళ్లని హింసించారనే కాదు, పాపం చదువు చెప్పే గురువుగారిని ఏడిపించడం నాకస్సలు నచ్చలేదు. వేదమూర్తిగారి మనవరాలి బొమ్మల్లో కుర్చీల సెట్ కూడా ఉంది. నాలుగు కుర్చీలు, మధ్యలో బల్ల. కుర్చీల్లో చిన్నిచిన్ని బొమ్మల్ని కూర్చోబెడుతుంది. అబ్బ! ఆ బొమ్మ కుర్చీలు ఎంత ముద్దుగా ఉంటాయో.

అన్నట్లు మొన్న వేదమూర్తిగారి బావమరిది, ఆయన భార్య వచ్చారు.. ఆయన మాట్లాడుతూ ‘రైలు రెండు గంటలు లేటన్నారు. మళ్లీ వెనక్కి ఏం వెళ్లగలం. ప్లాట్‌ఫామ్ అంతా కిక్కిరిసి ఉంది. ఎక్కడా కుర్చీ ఖాళీలేదు. ఎవరో ఇద్దరమ్మాయిలు వాళ్లు లేచి మమ్మల్ని కూర్చోమన్నారు. ముసలాళ్లమని ఆ మాత్రం గౌరవం చూపించారంటే ఆ అమ్మాయిలెంత మంచివాళో. లేకపోతే మా వల్ల ఏమయ్యేది. రైల్లో చెయిర్ కార్ మాత్రం సౌఖ్యంగానే ఉంది’ అన్నాడు.

‘అవును, ఆసుపత్రులలో, బస్టాపుల్లో, బస్టాండ్‌లో, రైల్వే ప్లాట్‌ఫామ్ మీద కూర్చోవడానికి కుర్చీ దొరక్కపోతే పడిగాపులు కష్టమే’ అన్నారు వేదమూర్తి గారు. పోయిన నెల ఇంట్లో పార్టీ జరిగినప్పుడు అంతా కలిసి కుర్చీలాట ఆడారు. ఆడేవారి సంఖ్య కంటే ఒక కుర్చీ తక్కువ ఉంచారు. ‘పాట ఆగిందా, ఒకరి సీటు గోవిందా, సీటు పోయిందా, ఒకరి ఆట గోవిందా..’ పాట రికార్డు పెట్టి అంతా మా చుట్టూ నవ్వులతో, కేరింతలతో పరుగెట్టారు. అలా కుర్చీలం మేం ఆట సాధనాలు కూడా అవుతామన్న మాట. వేదమూర్తిగారి కోడలు కొన్నిసార్లు పై గూళ్లలోని వస్తువుల్ని, అటకమీద వస్తువుల్ని అందుకోవడానికి నన్నెక్కి అందుకుంటుంది. అప్పుడు నాకు కాస్తంత కోపం వస్తుంది కానీ పోన్లే పాపం అనుకుంటాను. అయినా అలా అనుకోక ఏం చేయగలను? ఒకసారి బ్యాలెన్స్ చూసుకోక ఒక పక్కగా నిల్చోవడంతో నేనొరిగిపోయాను. నాతో పాటు ఆమే పడిపోయింది. అంతా పరుగెత్తుకు వచ్చి, ఆమెను లేపి ‘దెబ్బలేం తగల్లేదు కదా’ అని కంగారు ప్రదర్శించారు. నన్నెవరూ పట్టించుకోలేదు. పైగా ‘అందుకే ఈ కుర్చీలు ఎక్కొద్దంటాను’ అంది వేదమూర్తిగారి భార్య, అక్కడికి అదేదో నా తప్పయినట్లు.

మొన్నోసారి వేదమూర్తిగారు చెపుతున్నారు, మార్నింగ్ వాక్‌కి వెళ్లి దగ్గరలోని పార్క్‌లో చిన్న కొలను ఒడ్డున ఉన్న కుర్చీలో కాసేపు కూర్చోకపోతే ఆ రోజంతా ఏమీ తోచదట. ఆ సిమెంటు కుర్చీ ఆయనకు అంత బాగా నచ్చిందట. ఆయన రోజూ ఆ సమయానికి ఆ కుర్చీలో కూర్చోవటం గమనించి, ఆయనది ఒకింత ఆలస్యమయినా ఆ కుర్చీలో వేరేవరూ కూర్చోకుండా ఆయనపట్ల గౌరవం చూపుతున్నారట. వేదమూర్తిగారి స్నేహితుడు సుదర్శనంగారేమో ఆ పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటారట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరిగి ఇంటిముఖం పడతారట.

ఎవరైనా అతిథులు వస్తే కూర్చోమని ఆసనం చూపటం మర్యాద కదా. కానీ అలనాడు హనుమంతుడు సీతాన్వేషణకై లంకకు వెళ్లిన సందర్భంలో రావణుడి సభలో ఆయనకు ఆ మర్యాద  దక్కలేదు. అయితే హనుమంతుల వారా, మజాకా, ఆయనే తన వాలాన్ని కావలసినంతగా పెంచుకుని దాన్నే చుట్టలు, చుట్టలుగా పేర్చి, ఆసనం అమర్చుకొని రావణుడికి దీటుగా బైఠాయించాడట.. నాకిదంతా వేదమూర్తిగారు ఏదో మాటల్లో చెపితే తెలిసింది మరి. సత్యానంద్ మరికొన్ని విశేషాలు చెప్పాడు. సభలు, సమావేశాలు అంటే కుర్చీ లుండవలసిందే కదా. ఆ సభకు, సమావేశానికి అధ్యక్షత వహించే వ్యక్తిని ‘చెయిర్ పర్సన్’ అంటారట. ఆ వ్యక్తి ఆసీనుడయ్యాక, పరిచయ వాక్యాలు చెప్పేవారు ‘అధ్యక్ష పీఠాన్నలంకరించిన’ వంటి విశేషణాలు వాడతారట. ఆ మాట వినగానే ఓ క్షణం నేనే ఆ పీఠంగా ఊహించుకున్నాను. ‘కూర్చునే వ్యక్తి నిజమైన పెద్దమనిషి, నిజాయితీపరుడు, సహృదయుడు అయితే ఆ మాటలు నాకూ సంతోషమే కలిగిస్తాయి. కానీ దుష్టుడు, దుర్మార్గుడు అయితే ఆ మాటలు నాకు ఒళ్లు మండించవూ.. పాపం ఆ పీఠం.. సత్యానంద్ ఇంకా ఇలా అన్నాడు.. రాజకీయాల్లో కుర్చీల కుమ్ములాటలు ఇంతింతకాదు, దాని కోసం, డబ్బుల పంపకాలు, కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, హింసలు.. ఒకసారి కుర్చీ గెలుచుకున్నాడంటే, ఇంక తరతరాలకు ఆ కుర్చీ తమదే కావాలనుకుంటారట. రాజకీయాలే కాదు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అదే పరిస్థితి. ఏ కుర్చీలో కూర్చుంటే పైసలు మస్తుగా వస్తాయో తెలుసుకుని, ఆ కుర్చీకోసం పైరవీలు చేసుకుంటారట. కక్కుర్తి మనుషులు! మొన్న టీవీలో అంతా ఓ సినిమా చూశారు. అందులో పంచాయితీ ప్రెసిడెంటు ఎక్కడి కెళ్లినా సేవకుడితో తన కుర్చీ మోయించుకెళ్లి అదే వేసుకుని కూర్చోవడం చూసి, చెప్పుకుని నవ్వుకున్నారు. నాకేమో అదీ మా కుర్చీల ఘనత, ప్రత్యేకత అనిపించింది. ఆ తర్వాత మళ్లీ వాళ్లే చెప్పుకున్నారు, అయినా వింతేముందిలే, కార్తీకమాసంలో ‘కోటి దీపోత్సవం’కు వచ్చేకొందరు పెద్దవాళ్లు అక్కడ నేల మీద కూర్చోలేక, ఇంటి నుంచే కుర్చీలు మోసుకొచ్చుకుంటుంటారు కదా. అలాగే బీచ్ లకు కూడా కారులో వెళ్లే వారయితే ఓ కుర్చీ తీసుకెళ్లి ఒడ్డున వేసుకుని హాయిగా కూర్చుని తనివి తీరా సముద్ర సౌందర్యాన్ని ఆరాధించేవాళ్లూ ఉన్నారు’ అని.

వేదమూర్తిగారు ఆ మధ్య తన స్నేహితులతో చెపుతుంటే విన్నాను, ‘సింహాసస ద్వాత్రింశిక’ రచన చాలా బాగుంటుందిట. అందులో విక్రమార్కుని సింహాసనానికి చెక్కిన ముప్ఫయ్ రెండు సాలభంజికలు, భోజరాజుకు ముప్ఫయ్ రెండు కథలు చెప్పాయట. అలాగే వేదమూర్తిగారు మనవలకు చందమామ కథలు చెపుతూ, ఓ రాజుగారు తన తర్వాత ఎవరిని సింహాసనంపై అధిష్టింపజేయాలో నిర్ణయించడానికి పోటీలో నిలిచిన వీరులకు కఠిన పరీక్షలు పెట్టాడని చెప్పారు.

అన్నట్లు ఇంట్లో దేవుడికి కూడా ఇత్తడి సింహాసనం ఉంది. నగిషీ చెక్కడంతో ఆ సింహాసనం ఎంతో అందంగా ఉంటుంది. దాన్ని అడపా, తడపా శుభ్రపరిచి, మెరిసేలా చేస్తుంటారు. అంతేనా వేదమూర్తిగారు పూజ చేస్తూ ‘సింహాససం సమర్పయామి, సింహాసనార్థం పుష్పం సమర్పయామి, లేదంటే అక్షతాన్ సమర్పయామి అని అంటుంటారు. మరేమో ఆయనే చెప్పారు, కవి కరుణశ్రీ గారు, ఉదయశ్రీ అనే ఖండకావ్యంలో, ‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు నా.. ప్రణయాంకమె సిద్ధపరచనుంటి!’ అని రాశారట. ఆ తర్వాత ఒకసారి ఓ సమావేశంలో, ‘కరుణశ్రీ గారూ! ఆ మాత్రం ఓ కుర్చీ కూడా మీ ఇంట్లో లేదా, ఎందుకు అంతలేసి అబద్ధాలు రాయడం’ అని ఓ అమాయకురాలు నిగ్గదీసి అడిగితే, ‘కుర్చీలు లేక కాదమ్మా, స్వామికి సరైన ఆసనాలు, కుర్చీలు కాదన్న ఉద్దేశంతో అలా రాశానూ’ అన్నారట. ఏమైనా, ఏ అర్థంలో అయినా కావ్యాల్లో కూడా నేను కూర్చోగలిగి నందుకు నాకు కాసింత గర్వంగానే ఉంది. మొన్న సుదర్శనంగా రొచ్చి చెపుతున్నారు. ఈ బస్సుల్లో సీట్లను కుర్చీల్లా వేర్వేరు సీట్లుగా ఏర్పాటు చేయడం నాకు బాగా నచ్చిందోయ్. ఒకరు ఎక్కువ చోటు ఆక్రమించాలన్నా కుదరదు. అయితే సీనియర్ సిటిజన్లకు కేవలం రెండు సీట్లిచ్చారు. ఏం సరిపోతాయి, బస్సు మొత్తం మీద ఇద్దరే సీనియర్ సిటిజన్లు ఉంటారా? అదృష్టం బాగుండి సీటు దొరికినా, వెంటనే ఏ పిల్ల తల్లో, ఏ గర్భిణీయో ఎదురుగా వచ్చి నిలుచుంటే ఏం కూర్చోగలం చెప్పు. మన బాధ ఇలా ఉంటే లేడీస్ సీట్లలో మగవాళ్లు కూర్చున్నారని రోజూ తగాదాలు నడుస్తూనే ఉంటాయి. ఖాళీగా ఉందని కూర్చున్నా మహిళలు రాగానే లేవరు. అక్కడే వస్తుంది తగాదా. లేడీస్ లేనప్పుడు కూర్చున్నా వాళ్లు రాగానే మన పని బోడీసే కదా’ అన్నాడు. దాంతో ఇద్దరూ నవ్వుకున్నారు.

ఆ తర్వాత వేదమూర్తిగారు ‘అన్నట్లు సుదర్శనం చిన్నప్పుడు స్కూల్లో గోడ కుర్చీ వేయించేవారు గుర్తుందా? శీనుగాడు రోజూ ఆలస్యంగానే వచ్చేవాడు. రోజూ వాడికి గోడకుర్చీ పనిష్‌మెంట్ ఇచ్చేవారు మాష్టారు. పాపం కాళ్లు నొప్పి పుట్టేలా రోజూ గోడకుర్చీ ఎలా వేసేవాడో’ అనగానే ‘ఆఁ నాకూ గుర్తుందిరా. ఆ రోజులే వేరు. ఈ రోజుల్లో గోడకుర్చీ వేయిస్తే, పిల్లల్ని హింసిస్తున్నారని, ఆ టీచర్‌పై కంప్లైంట్ చేసి గొడవ చేస్తారు’ అన్నారు సుదర్శనంగారు. ఆ రకంగా నాకు గోడకుర్చీ అనేది తెలిసింది. మనిషి గోడకుర్చీ వేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుని నవ్వుకున్నాను. నా చుట్టూ ఎన్నెన్ని తమాషాలు, కథలు నడుస్తుంటాయో అనిపిస్తుంది. ఇంతకూ నాకు ‘కుర్చీ’ అనే పేరెందుకొచ్చిందో, ఏముందిలే కూర్చోవడానికి ఉపయోగిస్తాను కాబట్టి కుర్చీ అని ఉంటారు.

అన్నట్లు ఒక్కోసారి టీవీలో చూస్తుంటాను కదా, అసెంబ్లీ సమావేశాల్లో, పంచాయితీ కార్యాలయాలు వగైరాలలో అక్కడి సభ్యులు వాళ్లల్లో వాళ్లు తగవులు పడి, చివరకు కుర్చీలు విసిరేయడం, కుర్చీలతో ఎదుటి వారిపై దాడి చేయడం చేస్తుంటారు. అప్పుడు నా తోటివాళ్లు అలా హింసకు గురవడం, హింసకు సాధనాలవటం చూస్తే నాకెంత బాధేస్తుందో. ఈ ఇంట్లో ఆ మూల ఓ పాత కుర్చీ ఉండేది. పిల్లలు రోజూ దాన్ని బరబరా ఇటు అటు ఈడుస్తుండేవాళ్లు. అలా హింసలు పడుతుండగానే ఓరోజు దాని మీద ఏదో బరువు పెట్టారు. వెంటనే ఆ కుర్చీకి ఓ కాలు విరిగిపోయింది. అంతే! ‘కుంటికులాసం, ఇంటికి మోసం’ అంటూ దాన్ని తీసుకెళ్లి పెరట్లో ఓ మూల పడేశారు. కొన్నాళ్లకి హోలీ పండగ వచ్చింది. ఓ అర్ధ రాత్రి ఎవరో వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయారు. కాముడి పున్నమి నాడు కామదహనంలో మా మిత్రుడు కుర్చీ కూడా బలయి పోయిందని నాకర్థమయింది. ఇంట్లో వాళ్లు ‘పోతేపోయింది, విరిగిన కుర్చీయే కదా’ అనుకున్నారు. అదే వేదమూర్తి గారి చిన్నబ్బాయికి కాలు ఫ్రాక్చరయితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి కట్టు కట్టించారు. నెలరోజులు కాలికి కట్టు అలాగే ఉంది. ఆ తర్వాత కట్టువిప్పారు. కాలు బాగైపోయింది. నా మిత్రుడు కుర్చీకి కూడా అలాగా ఏదైనా వైద్యం.. అదే రిపేరు అంటారు కాబోలు అది చేయిస్తే ఎంత బాగుండేది. ఈ మనుషుల బుద్ధే అంత. వాడుకున్నన్నాళ్లు వాడుకుని విసిరేస్తారు. ఈ మనుషుల హృదయాలకు చెవులుంటే, వినేట్లయితే నేనో మాట చెప్పాలనుకుంటున్నా. ‘మీ సేవకే నేనున్నాను. అయితే నన్ను హింసించటం, నా కోసం హింస జరపడం, నన్ను హింసకు వాడటం, నాకు అమర్యాద, అవమానం కలిగేలా ప్రవర్తించటం మానుకోమని’. అబ్బో! రాత్రయిపోయింది. వేదమూర్తిగారు నా ఒళ్లోంచి లేచి వెళ్లారు. హమ్మయ్య! రేపు ఉదయం వరకు నాకు, నా ఆలోచనలకు విశ్రాంతే, విశ్రాంతి’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here