Site icon Sanchika

అన్నింట అంతరాత్మ-10: విశ్రాంతినిచ్చే మంచాన్ని నేను!

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం మంచం అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]’అం[/dropcap]తే నాకు చాలు.. తమలపాకు తొడిమే పదివేలు అందరివోలె అడిగేదాన్ని కాదు, కొందరివోలె కొసరేదాన్ని కాదు..’ పాప శ్రావ్య నా మీద కూర్చునే పాడుతోంది. దివాన్ అయిన నేనంటే పాపకు చాలా ఇష్టం. స్కూల్లో జానపదగీతాల పోటీ అట. నాలుగు రోజుల్నుంచి వాళ్లమ్మ నేర్పుతుంటే ఈ రోజుకి చివరి చరణానికి వచ్చింది. భలే తమాషా పాట. ముందు పాటలో జానపద నెరజాణ.. ముక్కుకు ముక్కెరలేక ముక్కు చిన్నాబోయినాది, ముద్దు టుంగరం కుదువబెట్టి ముక్కుకు చక్కని ముక్కెర తెమ్మంటుంది… అలాగే నాణ్యమైన ధాన్యం అమ్మి నడుముకు వడ్డాణం; కాడెద్దుల నమ్మి కాళ్లకు కడియాలు తెమ్మంటుంది. ఇప్పుడు చివరి చరణంలో ఏం కోరుతుందా అని చెవులు రిక్కించి వింటున్నాను..

పట్టెమంచం పరుపు లేక మనసూ చిన్నాబోయినాది..

పంటభూములమ్మూకోని పట్టెమంచం పరుపు తేరా..

అది వినడంతోనే పులకించిపోయాను. మంచాలంటే మనుషుల కెంత మక్కువో. మా ప్రాధాన్యత ఈనాటిదా? పట్టెమంచాలు పాత తరాలనాటివి అనుకుంటుంటే నాకు నా పూర్వ వైభవం గుర్తొచ్చింది. ఎలాగంటే నేనూ ఒకప్పుడు పట్టెమంచాన్నే. ఈ మధ్య కాలంలోనే ఆధునికంగా ఉండాలని నన్ను కాస్తంత కురచచేసి, మధ్యలో చెక్కపలక బిగించి, పట్టెలకు నగిషీలు చెక్కించి, కాళ్లు పొట్టివిచేసి దివాన్‌గా మార్పించారు. అప్పట్నుంచి ఈ హాలులో తిష్ఠవేశాను. నామీద ఎప్పుడూ ఎవరో ఒకరు సేద తీరుతుంటారు.

పరమేశంగారి హయాంలో నేను పట్టెమంచాన్ని. ఆయన, ఆయన ధర్మపత్ని విశాలాక్షిల పడకగదిలో నేనో ప్రధాన అలంకారం. విశాలాక్షికి నేనంటే ప్రాణం. మెత్తటి పరుపు, దాని పై మెత్తటి దిళ్లకు తాను స్వయంగా ఎంబ్రాయిడరీ చేసిన గులాబీలతలు, గుడ్‌నైట్, స్వీట్ డ్రీమ్స్‌లతో కూడిన తెలివెన్నెల లాంటి గలీబులు.. కాసింత కూడా మాయనిచ్చేది కాదు విశాలాక్షి. ఇంట్లో మరో మూడు చిన్న నవారు మంచాలుండేవి. పెరట్లో రెండు నులక మంచాలుండేవి. అతిథుల కోసం మడతమంచాలు సరేసరి. నాకేమో వెడల్పాటి నవారు బిగించేవారు. చిన్నమంచాలకు సన్నని అంటే తక్కువ వెడల్పున్న నవారు బిగించేవారు. ఆ కాలంలో నల్లుల బాధ కూడా ఉండేది. నా సైజు పెద్దది కావటంతో కదల్చలేక వదిలేసేవారు. నవారు సందుల్లో, కోళ్లకు, పట్టెలకు జాయింట్లలో టిక్ ట్వంటీ కొట్టేవారు. మిగతా మంచాలను ఎండలో వేసి, కాళ్లు ఎత్తి కొడుతుండేవారు. నల్లులు బయటకు రాగానే వాటి పని పట్టేవారు. ఆ మాటకొస్తే కుర్చీల్లో కూడా నల్లులుండేవి. ఇటీవల కాలంలో నల్లులు నశించినట్లుంది. ఇప్పుడు ఎంత సేపూ దోమల పేరే వినిపిస్తోంది.

పరమేశంగారు వయోవృద్ధులు కావటంతో కొడుకు కార్తికేయ తన దగ్గరకొచ్చేయమని ఒత్తిడి చేయటంతో పరమేశం గారికి ఊరు కదలక తప్పలేదు. ఊరు వదిలి పెట్టడం ఒక బాధయితే తరతరాలుగా వస్తూ తమ జీవితంలో ఓ భాగమయిన వస్తువులతోడి అనుబంధాన్ని వదులు కోవడం కూడా వారికి చాలా కష్టమైంది. పాతమంచాలన్నీ అయినకాడికి అమ్మిపడేయ మన్నాడు కార్తికేయ. కుదరదంటే కుదరదు, తమ కంఠంలో ప్రాణం ఉండగా వాటిని అమ్మటానికి వీల్లేదన్నారు పరమేశం దంపతులు. ఏం చేయలేక మౌనం వహించాడు కార్తికేయ. అదుగో అలా మా మంచాల బృందం కూడా వారితో పాటు పట్నం చేరి కార్తికేయ ఇంట కొలువు తీరింది.

కార్తికేయకు అప్పటికే అత్తగారిచ్చిన పందిరిమంచం ఉంది. ఇంత పెద్ద పట్టెమంచం పట్టే చోటు లేదంటూ నామీదే వేటు వేసి దివాన్‌గా మార్చేశారు. పరమేశం దంపతులు చిన్న నవారు మంచాలే వాడుకుంటున్నారు. నులక మంచాలను స్టోర్ రూమ్‌లో పడేశారు. మడతమంచం దొడ్లో గోడవారగా ఉంది. పాపం దాన్ని పట్టించుకునేవారే లేరు. అంతలో నులక మంచం తన గోడు వెళ్లబోసుకుంది..

“మమ్మల్ని ఈ స్టోర్ రూమ్‌లో బందీల్ని చేశారు. మమ్మల్ని ఎంత కళాత్మకంగా అల్లుతారో వీళ్లకసలు తెలుసా? తేలిగ్గా ఉండి, ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. ఈ ఊరు వచ్చేటప్పుడు తోవలో దాబాల దగ్గర మా నులక మంచాల స్నేహితులెందరో కనిపించారు. హాయిగా చల్లగాలిలో, వెన్నెట్లో ఎందరికో విశ్రాంతి కల్పిస్తూ.. ఎంత అందమైన జీవితం.. ఊళ్లో ఉన్నన్నాళ్లూ మా మీద కూర్చునికదా అంతా కథలు, కబుర్లు చెప్పుకునేవారు. సాయంత్రాలలో మామీద కూర్చునే మల్లెలు, మాలలు కట్టేవారు. ఆ రోజులన్నీ పోయి ఈ సామాన్ల గదిలో దుమ్ముకొట్టుకు పోతూ.. ఎప్పుడో ఒకసారి విశాలాక్షిగారు వచ్చి మమ్మల్ని తుడుస్తుంటే చెప్పొద్దూ మనసు చెమ్మగిల్లుతుంది. ఆమె కూడా పాత రోజులు గుర్తొచ్చి నిట్టూరుస్తూ వెళ్లిపోతుంది. మా అందర్లోకి నువ్వే అదృష్టవంతురాలివి. కాస్తంత కురచగా మారినా నీ దర్జా ఏం తగ్గలేదు” అంటే, “ఏమోలే కార్తికేయకు దాబా పెట్టాలన్న ఆలోచన వస్తే నీకూ మంచిరోజులు రావచ్చు” అన్నాను చిలిపిగా. “అవునవును నాకోసం దాబా కూడా పెడతాడు” చిరుకోపంగా అంది.

అంతలో టీవీ పెట్టడంతో మా దృష్టి అటుమళ్లింది. పాత మాయాబజార్ సినిమా వస్తోంది. ఘటోత్కచుడు బలరాముడి రాజభవనానికి వెళ్లి శశిరేఖను శయ్యతో సహా లేవనెత్తి.. ఒక్క చేత్తో మోస్తూ, ఆకాశంలో వెళ్తున్న దృశ్యం ఆశ్చర్యానందాలు కలిగిస్తోంది. అదేమాట చెప్పాను మా నులక మంచం నేస్తానికి.. అది విని “నీకేం హాల్లో ఉన్నావు.. అన్నీ చూస్తావు. పోన్లే నువ్వన్నా చూస్తున్నావు. అన్నట్లు ఆ ఊళ్లో ఉండగా పెరట్లో నా మీద కూర్చుని విశాలాక్షి కురుక్షేత్రం కథ చెప్పటం బాగా గుర్తుంది. అందులో భీష్ముడు పదకొండు రోజులు భారత యుద్ధంలో పాల్గొని, శిఖండి ఎదురు నిలవటంతో యుద్ధం నుండి తప్పుకుని, స్వచ్ఛంద మరణం కోరుకుని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అంపశయ్య మీద యాభై ఎనిమిది రోజులు వేచి ఉన్నాడని చెప్పింది” అంది.

“బాగుంది భారత కథ. ఎక్కడైనా శయ్య ఉండాల్సిందే” గర్వంగా అన్నాను. అంతలో టీవీలో వార్తలు మొదలయ్యాయి.. ‘ఆసుపత్రులలో మంచాల కొరతతో రోగులు నేల మీదే పడుకున్న దృశ్యం’ అంటూ చూపిస్తున్నాడు. ‘అయ్యో! మేం లేకపోతే రోగులకెంత అవస్థో కదా’ అనుకున్నాను.

విశాలాక్షి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోంది “అయ్యో! సుభద్రమ్మ వదిన మంచం పట్టిందా? అవున్లే.. పెద్దవయసుకదా.. కాలంనాడు ఆవిడ ఎంత పనిచే సేదో, బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు అయితే ఆమెను ఓ వారం ముందుగానే పిలిపించుకునేవారు. ముగ్గురు చేసే పని ఆవిడ ఒక్కత్తే చేసేది. అంత పనిమంతురాలు. ఆ మధ్య నడుం వంగిపోయిందన్నారు. ఇప్పుడు ఏకంగా మంచం పట్టిందన్నమాట. జరిగితే మంచమంత సుఖం లేదన్నారు.. కానీ కాలు చెయ్యి ఆడుతుంటేనే పెద్దవాళ్లకు రోజులు గడవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మంచాన పడితే కష్టమే. అయినా ఏంచేస్తాం. ఏనాటికి ఎవరు ఎట్లా ఉంటామో ఏం చెప్పగలం” అంది.

నిజమే. నిరంతరం మోయడానికి మేం సిద్ధంగా ఉన్నా, పాపం మనుషులకు అది కష్టమే. ఇంతలో పక్కింటి పద్మావతమ్మ వచ్చింది. “రండి, రండి కూర్చోండి” నన్ను చూపించింది విశాలాక్షి. పద్మావతి నామీద కూర్చుంది. “చాల రోజులయింది, కాసేపు మాట్లాడి పోదామని వచ్చా. మీ బి.పి. ఎట్లా ఉంది?” అడిగింది పద్మావతి. “ఫర్వాలేదమ్మా. బాగానే ఉన్నాను. అన్నట్లు ఆ మధ్య మీ పక్కన అపార్టుమెంటులో ముసలాయన ఎవరో పోయినట్లున్నారుగా” అడిగింది. “అవును. ఆయన ఎప్పటినుంచో మంచంలో తీసుకుంటున్నాడు. మొత్తానికి విముక్తుడయ్యాడు. కొడుకులు, కోడళ్లు ఎప్పుడు పోతాడా అని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అది సరే. ఆయన మంచం మీదే పోయాడట. మంచం ఉంచుకోకూడదన్నారట. దాంతో గొడవపడ్డారు. ముసలాయనకు బతికున్నప్పుడే మామూలు మంచంమీద పడుకోమని చెపితే వినలేదుట. నేను ఇష్టపడి చేయించుకున్న మంచం. నాకు సెంటిమెంటు, దీని మీదే పడుకుంటాను అనటంతో ఊరుకున్నారట. చక్కటి టేకు మంచం పారేయమంటే ఎలా అని ఆయన బతికుండగానే కింద పడుకోబెట్టామని అబద్ధాలు చెపుతున్నారని వాళ్ల పనిమనిషి చెప్పింది. మనిషి కోసం కాకుండా, మంచాల గురించి ఆలోచించే రోజులివి..” పద్మావతి దీర్ఘం తీసింది. “ఇలా కూడా ఉంటుందన్న మాట” విశాలాక్షి అంటుండగానే పద్మావతికి ఫోన్ రావడంతో “వస్తానండీ, ఇంటికి ఎవరో వచ్చారట” అంటూ హడావిడిగా లేచి వెళ్లిపోయింది.

‘మనిషి నా మీద పడుకుని మరణిస్తే నేను పనికి రాకుండా పోతానా? అలా అంటే ఆసుపత్రులలో మంచాల మాటేమిటి? మూర్ఖత్వం కాకపోతే. నాకున్న పాటి ఆలోచన కూడా ఈ మనుషులకు లేదా?’ అనుకుంటుండగానే టీవీలో అన్నమయ్య కీర్తనట.. ఓ సంగీత విద్వాంసురాలు పాడుతోంది. ‘విన్నపాలు వినవలె వింతవింతలు.. పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా’.. వినగానే మళ్లీ ఆలోచన.. అవును మంచానికి, దోమతెరకు అవినాభావ సంబంధం. వేంకటేశుడి శయ్యకు పన్నగపు దోమతెరనట. ఎంత చక్కటి ఊహో.

కార్తికేయ పందిరిమంచానికి కూడా చక్కటి నైలాన్ దోమతెర ఉంది. పిల్లల గదుల్లో కూడా పిల్లల మంచాలకూ దోమతెరలున్నాయి. అన్నట్లు కార్తికేయ వాళ్ల మంచానికి వస్తువులు దాచుకునేందుకు వీలుగా పెద్ద పెద్ద సొరుగులున్నాయి. చెప్పాలంటే మా మంచాలు మనుషులకు రహస్య స్థావరాలు. ముఖ్యమైన పత్రాలు దాచేవాళ్లు కొందరయితే, రాత్రిపూట గుచ్చుకుంటాయని మెడలోని గొలుసులు తీసి, దాచే మగువలు కొందరు, అడపా తడపా డబ్బులు దాస్తుంటారు. అన్నట్లు ఇందాక మాయాబజారు సినిమాలో గమ్మతైన మంచం చూశాను. ఎత్తుగా ఉన్న ఆ మంచమీద వాళ్లు కూచోగానో అటు, ఇటు అలంకారంగా ఉన్న కళాత్మక కర్రలు వచ్చి వాళ్ల తలలపై మోదటం ఎంత నవ్వు తెప్పించిందో. అదేమిటి.. గిల్పమట. అన్నట్లు మావాళ్లు సమయానుకూలంగా ఎంత సాయపడతారో.

పరమేశంగారు ఆ మధ్య విశాలాక్షితో కన్యాశుల్కం కథ చెప్తుంటే నేనూ విన్నాను. అందులో మధురవాణి దగ్గర రామప్ప పంతులు ఉండగా, గిరీశం తలుపు కొడితే మధురవాణి తలుపుతీయ బోవటంతో రామప్ప పంతులు మంచం కింద దాక్కుంటాడు. గిరీశం లోపలకు వస్తాడు. అతడు మాట్లాడుతుండగానే పూటకూళ్లమ్మ వస్తుంది. దాంతో గిరీశం కూడా మంచం కిందకు చేరుతాడు. ఇద్దరూ మంచం కింద మాట్లాడుకోవడం భలేగా ఉంటుంది. పూటకూళ్లమ్మ చాలా తెలివిగా మంచం కింద ఉన్న ఇద్దర్నీ చీపురుతో సత్కరిస్తుంది. పరమేశంగారయితే చెప్తూనే పడీపడీ నవ్వారు. నేనూ నవ్వాను కానీ ఆయనకా విషయం తెలియదు కదా.

పిల్లలు కూడా దాగుడుమూతలాడుతూ మంచాలకింద దాక్కోవడం మామూలే. ఇంతలో పరమేశంగారి మనవడు “తాతయ్యా, తాతయ్యా!” అంటూ వచ్చాడు. “ఏమిట్రా. మళ్లీ ఏమైనా సందేహమా?” అడిగారు. అందుకు మనవడు వంశీ “అవును తాతయ్యా. ఇవాళ మా టీచర్ పాఠం చెపుతూ క్వశ్చన్స్.. అదే అదే, ప్రశ్నలు అడిగింది” అన్నాడు. వంశీ ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నాడు. ఆయితే ఇంట్లో వీలైనంతవరకు ఇంగ్లీషు పదాలు వాడొద్దని తాతగారు చెప్పారు. అందులోనూ ఆయనతో మాట్లాడేటప్పుడు తప్పని సరిగా అన్నీ తెలుగుపదాలే వాడాలి. “అప్పుడేమయింది?” అడిగారు తాతగారు. “టీచర్ అడిగిన ప్రశ్నకు సర్వజ్ఞ తప్పు జవాబు చెప్పాడు. అప్పుడు టీచర్ ‘నీలాంటి వాడే పంచపాండవులెందరంటే మంచంకోళ్లలాగా మూడు’ అన్నాట్ట అంటూ నవ్వింది. మాకేమో అర్థం కాలేదు. ఆ సామెతకు అర్థం చెప్పవా తాతయ్యా?” అడిగాడు వంశీ. తాతగారు నవ్వుతూ “మూర్ఖుల గురించి చెప్పే సామెతరా ఇది. ప్రశ్నలోనే ‘పంచ’ అని ఉంది కదా. అది మూర్ఖుడైనవాడు గమనించకపోగా మంచం కోళ్లలాగా మూడు అంటాడు. మంచానికి నాలుగు కాళ్లుంటాయనే సాధారణ విషయం కూడా వాడికి తెలీదన్నమాట” వివరించారు. “సామెత భలేగా ఉంది తాతయ్యా” అంటూ వాడక్కణ్నుంచి తుర్రుమన్నాడు.

ఏమైనా మనుషులు విశ్రాంతి తీసుకోవటానికి నన్నే ఆశ్రయించటం నాకు గర్వకారణం. అలా సేవ చేయడంలో నాకెంలాంటి అభ్యంతరం లేదు కానీ అస్తమానం నిద్రలో జోగుతూ, బద్ధకాన్ని పెంచుకుంటూ, కాలం వ్యర్థం చేసే వాళ్లంటే నాకు జాలి, కోపం కూడాను. అతినిద్రాలోలులు కావద్దని మనుషులకు చెప్పాలని ఉంది, వినిపించేనా? అలాగే ఏదో చికాకులో గొడవ పడ్డ భార్యాభర్తలు నా సన్నిధిలోనే అలకలు తీరి చేరువవటం నాకెంతో సంతోషంగా ఉంటుంది. అదుగో… ఇప్పటిదాకా నామీద శయనించిన పరమేశంగారు లేచి లైటు తీసి, పడకగదిలోకి వెళ్తున్నారు. ఇంక రేపు ఉదయం దాకా నాకు విశ్రాంతే విశ్రాంతి.

Exit mobile version