అన్నింట అంతరాత్మ-13: సేవకు మారుపేరును.. చక్రాన్ని నేను!

5
2

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం చక్రం అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]”చ[/dropcap]క్రపాణీ!” అంటూ వచ్చారు తాతగారి మిత్రుడు జగన్నాథం. ఆయన వచ్చారంటే నాకూ పండగే. ఎందుకంటే వాళ్లిద్దరూ చెప్పుకునే కబుర్లు నాకూ ఆసక్తిగా ఉంటాయి. అందులోనూ తాతగారి మనవడు చక్రధర్ ఊరెళ్లడంతో అతడు ఆడుకునే మూడుచక్రాల సైకిల్ మూలనే ఉండిపోయింది. ఆ సైకిల్ చక్రాల్లో నేనొకదాన్ని. “రారా జగన్నాథం” అంటూ ఆహ్వానించారు తాతగారు.

ఆయన కూర్చుని “నిన్ను చక్రపాణీ! అని పిలవగానే నాకు వెంటనే ఓ కథ గుర్తొచ్చింది, అదేంటో తెలుసా?” అన్నారు జగన్నాథం. “ఏం కథో చెప్పకుండానే నాకెట్లా తెలుస్తుందోయ్. అదేమిటో నువ్వే చెప్పు” అన్నారు తాతగారు. “సరే విను. బాల వినాయకుడంటే మేనమామ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. ఒకసారి ఆయన సరదాగా వినాయకుడితో ఆడుకుంటున్న సమయంలో, వినాయకుడి దృష్టిని విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఆకర్షించింది. గబుక్కున చక్రాన్ని లాక్కుని మింగేశాడు వినాయకుడు. విష్ణుమూర్తి నివ్వెరపోయాడు. ఏం చేయాలో తోచలేదు. ఆ వెంటనే ఏదో స్ఫురించి తన చెవులను పట్టుకుని గుంజిళ్లు తీయడం మొదలు పెట్టాడు. మేనమామ గుంజిళ్లు తీయడం చూసి వినాయకుడు పకపకా నవ్వాడు. వినాయకుడి నోటినుండి చక్రం ఝామ్మని బయటపడింది. పథకం ఫలించడంతో విష్ణుమూర్తి లాఘవంగా చక్రాన్ని తిరిగి తన చేజిక్కించుకుని ‘హమ్మయ్య’ అనుకున్నాడు. అదీ కథ” చెప్పారు. భలే ఉంది కథ అనుకున్నాను నేను. “నాకు తెలియని కథ చెప్పావు. అయితే నాక్కూడా నీ పేరు అనుకోగానే శ్రీశ్రీ గారి ‘జగన్నాథుని రథచక్రాలు’ కవిత గుర్తుకొస్తోంది. అది చెపుతా, విను మరి..” అంటూ కవితా గానం మొదలు పెట్టారు తాతగారు.

పతితులార!
భ్రష్టులార!
బాధాసర్ప దష్టులార
బ్రదుకు కాలి,
పనికిమాలి,
శనిదేవత రథ చక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార!
హీనులార!
ఇక్కడేదో ఉండాలి.. గుర్తొచ్చింది పాడేస్తున్నా
మీ రక్తం కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి..
ఓ వ్యథానివిష్టులార
ఓ కథా వశిష్టులార!
పతితులార!
భ్రష్టులార!
బాధా సర్పదష్టులార!
ఏడవకం డేడవకండి!
వస్తున్నా యొస్తున్నాయి..
జగన్నాథ,
జగన్నాథ.
జగన్నాథ రథచక్రాల్!
జగన్నాథుని రథచక్రాల్
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నాయొస్తున్నాయి!

“అంతగా ఆవేశపడకండి ఇదుగోండి ఈ కాఫీ తీసుకోండి ఇద్దరూ” అంటూ ప్రవేశించింది తాతగారి శ్రీమతి, కామాక్షి. కాఫీ అందిస్తూ “ఈయన ఇంతే అన్నయ్యగారూ.. జగన్నాథ రథచక్రాలొస్తున్నాయంటూ కవితలు చదవడమే గానీ ఒక్కసారి పూరి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకుందామంటే కదిలిందే లేదు” ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది కామాక్షి.

అందుకాయన “చెల్లాయ్! నీ చేతి కాఫీయే కాఫీ. జగన్నాథుని రథ చక్రాలేమోగానీ, కోణార్క్ సూర్య రథ చక్రాలు చూసి తీరాలి. పన్నెండు జతల చక్రాలు, ఏడు గుర్రాలతో ఓ రథం లాగుతున్నట్లు నిర్మాణం ఉంటుంది. ఈ రథచక్రాలకుండే చువ్వలు ప్రత్యేకమైనవి. వాటి నీడను బట్టి సమయాన్ని తెలుసుకోవచ్చు. ఏడు గుర్రాలు వారంలో వచ్చే ఏడు రోజులకు, పన్నెండు జతల రథచక్రాలు ఏడాదిలోని పన్నెండు నెలలకు, ఇరవైనాలుగు చక్రాలు రోజుకు ఉండే ఇరవైనాలుగు గంటలకు ప్రతీకలని చెపుతారు. ప్రతి రథ చక్రానికి ఎనిమిది భాగాలుంటాయి. ఇవి రోజులోని ఎనిమిది జాములకు గుర్తంటారు. గడియారంలోని పెద్దముళ్లుగా వీటిని పేర్కొంటారు. ప్రతి రెండు ముళ్ల మధ్య సమాన దూరం ఉంటుంది. ఈ దూరం మూడు గంటల సమయ వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ప్రతి రెండు ముళ్ల మధ్య మరో సన్నటి ముల్లు ఆకారం కూడా ఉంటుంది. అది చిన్న ముల్లుగా భావించాలి. పెద్ద ముల్లు, చిన్న ముల్లు మధ్యదూరం గంటన్నర సమయ వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ప్రతి చిన్న, పెద్ద ముల్లు మధ్య ముప్ఫయ్ బిట్స్ చెక్కారు. ఒక్కో బిట్ మూడు నిమిషాలను సూచిస్తుంది. అంటే ముప్పయ్ బిట్స్ తొంభై నిమిషాలను, మరోలాగా చెప్పాలంటే గంటన్నర సమయాన్ని సూచిస్తాయన్నమాట. ఆ కాలంలోనే అంత శాస్త్రీయతతో రథచక్రాలను చెక్కిన శిల్పుల మేధకు భారతీయులుగా మనమెంతో గర్వించవచ్చు” తన్మయంగా చెప్పారు.

“నిజమే, వింటుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది” అన్నారు తాతగారు, వారి శ్రీమతి. “చక్రాలంటుంటే నాకూ ఓ విషయం గుర్తొస్తోంది. మానవ శరీరంలోనూ వెన్నెముక పొడవునా ఏడు చక్రాలు ఉంటాయి. చక్రాలంటే శక్తి కేంద్రాలే. అదృశ్యంగా ఉండే శక్తి ప్రవాహాలు ఈ చక్రాలలో కేంద్రీకృతమై ఉంటాయి. శరీరంలో ఉండే శక్తినే ప్రాణం అంటున్నాం. ఎప్పుడైతే ఏడుచక్రాలను.. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానాల ద్వారా సరైన స్థితిలో ఉంచుతామో అప్పుడు ప్రాణశక్తి ఈ చక్రాల ద్వారా పైకి, కిందకీ ఏ విధమైన ఆటంకం లేకుండా సంచరిస్తుంది. ఏడు చక్రాల పేర్లు.. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం” చెప్పింది కామాక్షి.

“అబ్బో! నీకూ చాలా విషయాలు తెలుసే” అన్నారు తాతగారు. “ఏదో మీ అంత కాకపోయినా..” అని ఆమె అంటుంటే జగన్నాథంగారు “ఆగండాగండి.. నాకు శ్రీ చక్రం గుర్తుకొచ్చింది. ఇదెంతో పవిత్రమైందంటారు. జ్యామితీయ నిర్మాణంతో ఉంటుది. ఓ బిందువు చుట్టూ వివిధ దశలలో ప్రయాణిస్తూ ఉండే చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల మాదిరి ఉంటుంది” వివరించారు.

“అవును, నేను చూశాను.. మా మేనమామ శ్రీ చక్రానికి పూజచేసేవాడు” చెప్పింది కామాక్షి.

“నాకు ఇంకో విషయం గుర్తిస్తోంది, పురాణాలకు నెలవైన నైమిశారణ్యం నేపథ్యంలో కూడా ఈ చక్రం ఉంది. పూర్వం ఋషులంతా కలిసి తాము తపస్సు చేసుకోవడానికి పవిత్ర ప్రదేశాన్ని చూపమని, బ్రహ్మను కోరారు. ఆయన వెంటనే తన రథ చక్రం విసిరి, ఆ చక్రం చుట్టూ ఉన్న కమ్మీ ఎక్కడ పడితే అదే పరమ పవిత్ర ప్రదేశం అన్నాడట. ఆ చక్రం ‘నేమి’ పడిన ప్రదేశమే ‘నైమిశారణ్యం’ అయింది” వివరించారు తాతగారు.

“ఇది నాకు కొత్త విషయమే. ఇంక వస్తా మరి” అంటూ లేచారు జగన్నాథం గారు. “ఈసారి మా వదినగారిని తీసుకురండి” అంది కామాక్షి. “అలాగే… మా నాలుగు చక్రాల వాహనం… అదే కారు రిపేరుకెళ్లింది. బాగయి వచ్చాక తీసుకొస్తాను” అంటూ ముందుకు కదిలారు.

“మన జాతి ఎంత గొప్పదో.. విన్నావా” అన్నాను వరండాలో ఉన్న మా సోదరుడు ద్విచక్ర స్కూటీతో. “ఆఁ ఆఁ వింటూనే ఉన్నా” బదులిచ్చాడు.

ఇంతలో “తాతయ్యా, తాతయ్యా” అంటూ తాతగారి కూతురు కొడుకు, పక్కింటి పిల్లలతో కలిసి వచ్చాడు. “హరీ! ఏంటా హడావిడి” అన్నారు తాతగారు. “మరి మన జాతీయ పతాకంలో మధ్యలో చక్రం ఉంటుంది కదా, అందులో పద్దెనిమిది ఆకులుంటాయని ఇదుగో ఈ పవన్ గాడు అంటున్నాడు. నేనేమో ఇరవై ఉంటాయన్నాను. ఎవరిది రైటో చెప్పు తాతయ్యా” అన్నాడు హరి. “ఇద్దరూ తప్పులో కాలేశారు. మన జాతీయ పతాకంలోని అశోకచక్రంలో ఇరవైనాలుగు ఆకులుంటాయి. ఈ చక్రం ధర్మానికి ప్రతీక” చెప్పారు తాతగారు.

“మహాభారత యుద్ధంలో అభిమన్యుడు రథచక్రమే ఆయుధంగా చేసుకొని యుద్ధం చేశాడని చెప్పింది మా అక్క” అన్నాడు చింటూ. “నిజమే. వీరులుదేన్నయినా ఆయుధంగా చేసుకొని చివరివరకూ పోరాడగలరు” అన్నారు తాతగారు. “మొన్న మా టీచర్ కుమ్మరి చక్రం గురించి చెప్పింది” అన్నాడు హరి. “అవును కుమ్మరి చక్రం వల్లే కుండలు గుండ్రంగా తయారవుతాయి” తాతగారు అంటుంటే, “అసలు సైకిలు, రిక్షా,ఆటో, కారు, లారీ, బస్సు, రైలు, విమానం.. ఇలా వాహనాలన్నిటికీ చక్రాలుంటాయి కదా, ఈ చక్రాల గురించి మాకు చెప్పవా తాతయ్యా” అడిగాడు హరి. “అవును చెప్పండి, చెప్పండి” అన్నారు మిగతా పిల్లలు.

‘అయితే వినండి.. ప్రాచీనకాలంలో మనిషి కనుగొన్న వస్తువులలో చక్రం అత్యంత కీలకమైంది. ఇది ఒక అక్షం చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. ఎన్నో రకాల యంత్రాలు కూడా చక్రాల ఆధారంగానే పని చేస్తాయి. ఇరుసు తోడ్పాటుతో చక్రం దొర్లడం వల్ల రవాణాలో రాపిడి లేదా ఘర్షణ తగ్గుతుంది. భారత్‌లో సింధూ నాగరికత నాటి నుంచే చక్రం వాడకం ఆరంభమైంది. ఇక ప్రకృతిలో వివిధ పదార్థాలు తయారీ నాటినుంచి, వినియోగం పూర్తయి తిరిగి వాటి జన్మస్థానం చేరడాన్ని కూడా చక్రాలుగా పేర్కొంటారు. ఉదాహరణకు నీటి చక్రం, ఆమ్లజని చక్రం, నత్రజని చక్రం. అన్నట్లు మీరెప్పుడైనా సూర్యభగవానుడి చిత్రం చూశారా.. ఒక చేతిలో చక్రం ధరించి ఉంటాడు. అందుకే సూర్యాష్టకంలో ‘ఏకచక్ర ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం’ అన్నారు.. అన్నట్లు మీకు కాల చక్రం గురించి కూడా చెపుతాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం పేర్లు మీరు వినే ఉంటారు. ఈ నాలుగు యుగాలు కలిపితే మహా యుగం అవుతుంది. కలియుగం నాలుగు లక్షల ముప్పయ్ రెండువేల సంవత్సరాలు. ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవైనాలుగు వేల సంవత్సరాలు. త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరువేల సంవత్సరాలు. కృత యుగం పదిహేడు లక్షల ఇరవైఎనిమిది వేల సంవత్సరాలు. అంటే ఒక మహాయుగం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు. డెబ్బై ఒక్క మహాయుగాలు ఒక మన్వంతరం అవుతుంది. పధ్నాలుగు మన్వంతరాలు కలిపి ఒక కల్పం అవుతుంది. ప్రస్తుతం మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం. ఇలాంటి కల్పాలు ఎన్నో ఉన్నాయి. తెలిసిందా” అంటుంటే ‘ఓ’ అన్నారు పిల్లలు.

వెంటనే పవన్ అందుకుని “తాతయ్యా దీపావళికి విష్ణుచక్రాలు, భూచక్రాలు కాలుస్తాం కదా, అవి నా కెంతో ఇష్టం” అన్నాడు. వెంటనే హరి “కానీ అవన్నీ పర్యావరణానికి హానికరాలు. అందుకే నేను టపాసులు కాల్చడం మానేశాను” అన్నాడు. “నాకు జెయింట్ వీల్ ఎక్కడం ఇష్టం. అదెంత పెద్ద చక్రమో” అన్నాడు చింటూ.

అంతలో “ఏం చేస్తున్నారు పిల్లలూ. అక్కడ అయిపోయింది, ఇంక ఇక్కడ మొదలెట్టారా మీ కబుర్లు” అంటూ వచ్చింది పక్కింటి పద్మలక్ష్మి. “తాతగారు చక్రం గురించి చెపుతుంటే వింటున్నాం” అన్నారు పిల్లలు. లోపల్నుంచి తాతగారి కూతురు జ్ఞానప్రసూన వచ్చి “అందరూ ప్రసాదం తీసుకోండి” అంటూ దొన్నెలు అందించింది. “ఓ.. చక్రపొంగలి.. నాకెంతో ఇష్టం” అన్నాడు హరి. పెద్దలంతా పెద్దగా నవ్వారు. వాళ్లెందుకు నవ్వారో అర్థంగాక పిల్లలు అయోమయంగా చూశారు. “చక్రపొంగలి కాదురా.. చక్కెర పొంగలి” నవ్వుతూ చెప్పారు తాతగారు. అది విని పిల్లలూ నవ్వేశారు.

“చక్రం గురించి నాకూ ఒక విషయం చెప్పాలనుంది. సంసారం అనే బండికి భార్యాభర్తలు రెండు చక్రాలాల్లంటి వారు అన్నారు పెద్దలు” పద్మలక్ష్మి అన్నదో లేదో, వెంటనే జ్ఞానప్రసూన అందుకుని “అవునవును అధికార చక్రం భర్తది, బాధ్యతల చక్రం భార్యది. చాలావరకు ఇళ్లలో ఇంతే. ఎక్కడో కొందరిళ్లలో మాత్రమే భార్య అధికార చక్రంగా ఉండేది. రాజకీయాల్లో చూడరాదూ.. మహిళలు ఎన్నికల్లో గెలిచి, పదవులు చేపట్టినా వారి భర్తలే వెనుక ఉండి చక్రం తిప్పుతున్న వైనం పత్రికల్లో టీవీల్లో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలదే అధికారం అంటారు గానీ ఓటు వేయడం వరకే వీరి సత్తా అంతా. అక్కడ కూడా ప్రలోభాలకు లొంగిపోతారు. ఆ పైన స్వార్థపరులు, అవినీతిపరులు, దుష్టులు, దుర్మార్గులు చక్రం తిప్పుతుంటారు” అవేశంగా అంది. “అవును. నువ్వు చెప్పింది నిజమే” అంది పద్మలక్ష్మి. “చక్రానికి సంబంధించి నువ్వు కొత్త కోణాన్ని చూపించావమ్మాయ్” అన్నారు తాతగారు. “సరే. ఇక పదండి పిల్లలూ” అంటూ లేచింది పద్మలక్ష్మి.

“ఆగండాగండి.. ఈ ఒక్క విషయం విని వెళ్లండి. మన దేశంలోని త్రివిధ దళాల సైనికులు ప్రదర్శించే అత్యున్నత ధైర్య, సాహసాలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘చక్ర’ పురస్కారాలు ప్రదానం చేస్తుంది భారత ప్రభుత్వం. యుద్ధరంగంలో అత్యంత వీరత్వాన్ని ప్రదర్శించిన వారిని పరమవీర చక్ర అవార్డుతో సన్మానిస్తుంది. పరమవీరచక్ర అత్యున్నత పురస్కారం కాగా, ఆ తర్వాత స్థాయిలలో మహావీరచక్ర, వీరచక్ర ఉన్నాయి. యుద్ధరంగంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో.. క్లిష్ట పరిస్థితులలో ఉదాహరణకు ఉగ్రవాదుల దాడులు వంటివి జరిగిన సందర్భాల్లో అత్యంత తెగువ చూపిన వారికి అశోక్ చక్ర అవార్డునిస్తారు. అశోక్ చక్రను సైనికులకే కాక అత్యున్నత ధైర్యసాహసాలు చూపిన ఏ భారతీయునికైనా ఇవ్వవచ్చు. ఆ తర్వాత స్థాయిలలో ప్రదానం చేసే అవార్డులు కీర్తిచక్ర, శౌర్యచక్ర” వివరించారు తాతగారు.

“చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇంక వస్తాం ప్రసూనా” అంటూ లేచింది పద్మలక్ష్మి. పిల్లలు కూడా “వస్తాం తాతయ్యా, బై హరీ” అంటూ ఆమె వెనుకే నడిచారు. జ్ఞానప్రసూన లోపలకి వెళ్లిపోయింది, తాతగారు తిరిగి రామకోటి రాసుకోవడం మొదలు పెట్టారు.

మా జాతి మానవ సేవలో ఇంత విస్తృతంగా ఉన్నందుకు నాకెంతో గర్వంగా అనిపించింది. దేశ రక్షణకు తమ ప్రాణాలకు సైతం వెనుకాడకుండా వీరోచితంగా పోరాడే సైనికులకు అందించే పురస్కారాలలో మేం ఉండటం నాకు మరింత గర్వంగా అనిపిస్తోంది. స్కూటీ సోదరుడు కూడా అదే అన్నాడు.. అసలు మేము లేనిదెక్కడ.. మొన్న టీవీలో చూశాను.. చక్రాల కుర్చీ రూపంలో దివ్యాంగులకు సేవ చేస్తున్నాం.

అయితే ఇవన్నీ విన్నాక మనిషికి నా మాటగా కొన్ని చెప్పాలనుంది. సంసారాలలో అయితే చక్రం తిప్పే అధికారంలో నేనంటే నేనని పోటీపడటం కాకుండా సమర్థతను బట్టి వ్యవహరించడం కుటుంబానికి మంచిది. ఇంక రాజకీయరంగంలో ప్రజా సేవే పరమార్థంగా భావించేవారు, న్యాయవర్తనులు, ధర్మవర్తనులు అధికార చక్రం తిప్పాలే గానీ దుష్టులు, దుర్మార్గులు కాదు. అలాగే డమ్మీ వ్యక్తులు కాకుండా అసలైన వ్యక్తులే చక్రం తిప్పాలి. మంచికి తోడ్పడినపుడే చక్రం సంతోషించేది. అవినీతిపరుల చేతుల్లో ఉన్న చక్రాలు తమ తప్పేమీ లేకున్నా అపరాధభావానికి గురికావలసి వస్తుంది. నేను చెప్పే మాటలు మనిషికి వినిపించేనా? వినిపించినా స్వార్థంతో మంచి పనులకు చక్రం అడ్డువేయడానికి అలవాటు పడ్డ ఈ మానవుడికి నా మాటలు రుచించేనా? అనుకుంటుండగా.. తాతగారు భాగవత పఠనం మొదలు పెట్టినట్లున్నారు…

చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూచిన అందందే గలడు..

పద్య పాదాలు వినపడటంతో, పుణ్యమైనా దక్కుతుందని నా చెవులనటు పడేశా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here