[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం కుక్క అంతరంగం తెలుసుకుందాం. [/box]
[dropcap]’ఈ[/dropcap] పేద్ద కిటికీలో కూర్చోవటం నాకెంతో ఇష్టం. ఇక్కడ్నుంచి నాకు రోడ్డంతా కనిపిస్తుంది. మా వాళ్లందరూ కూడా అటు, ఇటు తిరుగుతూ కనిపిస్తుంటారు. వాళ్లు ఎంత స్వేచ్ఛగా ఉంటారో. దూరాన ఉన్న మట్టి దిబ్బల్ని, రాళ్ల గుట్టల్ని ఎక్కి కూర్చుని సింహాసనం ఎక్కినట్లుగానో, ఎత్తయిన పర్వతం ఎక్కినట్లుగానో దర్జా ఒలకబోస్తూ చుట్టూ చూస్తుంటారు. అంతలోనే మా జాతే అయినాసరే వేరే శునకం కొత్తగా ఇక్కడ పాదం మోపితే చాలు సరిహద్దు గీతను దాటి వచ్చిన శత్రువును చూసినట్లు చూసి.. మూకుమ్మడిగా ఎలుగెత్తి అరిచి వెళ్లగొడతాయి. నాక్కూడా అలా ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తూ, మా వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ, సరదాగా పోట్లాడుకుంటూ గడపాలని ఉంటుంది. కానీ నాకు ఆ అవకాశం లేదే’. అదే అన్నాను ఓసారి ఆ మట్టిదిబ్బనెక్కిన గోధుమరంగు కుక్కతో మా భాషలో.. ఇక్కడి నుంచే.
అది విని అదేమో.. “పోయి పోయి నీకు, మా వీధి బతుకు నచ్చిందా. చక్కగా నిన్ను ముద్దు చేస్తూ, స్నానం చేయించి, బెల్టులు, గొలుసులతో సింగారిస్తూ, మంచి తిండి పెడుతూ, వాళ్లతో సమంగా చూస్తారు. వాళ్ల ఒడిలో కూర్చుని గారాలుపోతూ, వాళ్లతో సేవలు చేయించుకుంటూ, షికార్లకెళుతూ ఉంటావు. కలిగిన వారింట కుక్కగా ఉండటంకన్నా అదృష్టమేముంటుంది. మాకయితే మేం కూడా ఆ బంగళాలో ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం, అలాంటిది నువ్వు, మా బతుకు మీదసరదా పడటమా.. పొరపాటున కూడా అలా కోరుకోకు. ఇంక మా స్వేచ్ఛ అంటావా, అది కూడా ఒట్టిమాటే. అప్పుడప్పుడు కుక్కల్ని పట్టుకెళ్లే వ్యాన్ వస్తుంది. మేమంతా దాక్కోలేక చస్తుంటాం. పట్టుబడతామేమోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటాం. అడపా దడపా ఒకరిద్దరు పట్టుబడుతుంటారు కూడా. చూస్తూ కూడా అరవలేక నోరు నొక్కుకుని బాధను దిగుమింగుతాం. కొన్నిరోజుల పాటు వెళ్లిపోయిన మిత్రుణ్ని తలచుకుంటూ తిండి కూడా తినలేం. ఎవరైనా బిస్కెట్లో, బ్రెడ్డో చూపిస్తే పరుగెడుతాం. తిండి కనిపిస్తే చాలు తోక ఊపుతూ వచ్చేస్తుందని వాళ్లు నవ్వుకుంటారు. మా ఆకలి మాది” బాధగా అంది.
అది వినగానే నాకు చాలా బాధనిపించింది. అంతలో ‘రాజా’ అంటూ విశాలాక్షిగారు రానే వచ్చారు. “ఇక్కడున్నావా” అంటూ నన్ను ఎత్తుకున్నారు. పనిమనిషి రాములమ్మ వచ్చి “ఈ కుక్క ఎప్పుడు సూసినా ఆ కిటికీ ఎక్కి కూసుంటది. కర్టెన్ సరిగా ఉండనీయదు” అంది ఫిర్యాదు చేస్తున్నట్లుగా. అందుకు విశాలాక్షిగారు “మా రాజాను ఇంకోసారి కుక్క అంటే ఊరుకోను. రాజా అని చక్కని పేరుంటే కుక్కంటావేమిటి? కిటికీలో కూర్చుంటే కూర్చోనీ.. దానిష్టం” అంది నన్ను ప్రేమగా దువ్వుతూ. ‘తిక్క కుదిరింది’ అనుకున్నాను నేను గర్వంగా. “నేనేమంత తప్పు మాటన్నానని.. కుక్కని కుక్కంటే తప్పా?” అంది రాములమ్మ.
“మళ్లీ అదే మాట.. కుక్క అంటే భగవత్ స్వరూపం. నీకు తెలుసా? కాశీలో క్షేత్రపాలుడు కాలభైరవుడి వాహనం శునకమే. సాక్షాత్తు దత్తాత్రేయులవారి చెంతనే ఉన్న శునకాలను నువ్వెప్పుడూ చూడలేదేమో. రాజా నా బిడ్డలతో సమానం ఏమనుకున్నావో.. రాజా అనే పిలవాలి తెలిసిందా” అంది కాస్తంత కఠినంగా. “తప్పయి పోయిందమ్మా. ఇకనుంచి ‘రాజాబాబూ’ అని పిలుస్తాను” అంది రాములమ్మ. నా సంతోషానికి హద్దుల్లేకుండా ఉంది.
ఇంతలో విశ్వనాథంగారి అమ్మాయి ప్రతిభ అక్కడకు వచ్చింది.. “అమ్మా.. నీకు తెలుసా, నేపాల్‌లో శునకాల పండుగ జరుపుకుంటారు. వాళ్లకు దీపావళి ఐదురోజుల పండుగ. రెండవరోజున ‘కుకుర్ తిహార్’ అని శునకాల పండుగ చేస్తారు. ఆ రోజున శునకాలకు తిలకం దిద్ది, మెడలో పూలమాలలేసి, రకరకాల ఆహారపదార్థాలు వాటికి పెడతారు” చెప్పింది. విశాలాక్షిగారు ‘అవునా’.. అన్నట్లు చూస్తే రాములమ్మ ‘వింత విషయం’ అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది. నాకు కూడా కొత్తగా అనిపించింది.
“నాకూ ఓ విషయం గుర్తుకొస్తోంది. చిన్నప్పుడు మా ఊళ్లో మార్గశిర పౌర్ణమి రోజు.. అంటే దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయుడిని పూజించడంతో పాటు శునకాలకు రొట్టెలు అందించేవారు” విశాలాక్షి చెప్పింది. “అవునా.. నేను ఇంకో విషయం చెప్పనా.. ఢిల్లీలో శునకరాజాల కోసం ప్రత్యేకంగా డజనుకు పైగా ‘కెఫే’లు ఉన్నాయి.. ప్రముఖంగా చెప్పుకునే కెఫే ‘పప్పీ చినో’. ఇక్కడ ‘డాగ్ స్పా’ కూడా ఏర్పాటు చేశారు. శునకాల పుట్టిన రోజులు కూడా ప్రత్యేకంగా నిర్వహించే ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ శునకాలకు ఇష్టమైన ఆహార పదార్థాలెన్నో అందిస్తారు ఇటువంటివి విదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నాయనుకోండి” ప్రతిభ చెపుతుంటే విశాలాక్షి, రాములమ్మ నోరు తెరుచుకు అలా చూస్తుండి పోయారు. నేనైతే ‘ఆహాఁ’ అనుకుంటూ, ‘వీధిలో ఉన్న మావాళ్లు నాదే అదృష్టమంటారు, ఇలా కెఫేలు ఉన్నాయని.. మాకు తెలియని మా వాళ్లెందరో అక్కడ ఆనందిస్తున్నారని తెలిస్తే ఏమంటారో’ అనుకున్నాను. అంతలో ప్రతిభ అన్నయ్య ప్రవీణ్ పక్కగదిలోంచి వచ్చాడు.. “నేనంతా వింటూనే ఉన్నా.. ఎందుకంత ఆశ్చర్యం.. శునకాలు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా.. మీకు ‘లైకా’ గురించి తెలుసా?’ అడిగాడు. లైకా ఎవరో అనుకున్నాను.
విశాలాక్షి, రాములమ్మ ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టగా ప్రతిభ అందుకుని “నాకు తెలుసు.. సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి పంపిన కుక్క పేరే ‘లైకా’. కరెక్టేనా” అడిగింది. “అవును కరెక్టే. అంతరిక్షానికి చేరిన మొదటి జంతువులలో లైకా ఒకటి. వాస్తవానికి లైకా మొదట్లో మాస్కోలోని ఊరకుక్క మాత్రమే. రష్యావారు స్ఫుత్నిక్-రెండు ఉపగ్రహం ద్వారా అంతరిక్ష ప్రయోగానికి ఆ ఊరకుక్కను ఎంపిక చేసుకుని, దానికి శిక్షణనిచ్చి, పంధొమ్మిదివందల యాభై ఏడు నవంబర్ మూడో తేదీన అంతరిక్ష ప్రయోగం జరిపారు. దాంతో లైకా, ప్రాణంతో అంతరిక్షంలోకి ప్రవేశించిన జీవిగా చరిత్రకెక్కింది. భూకక్ష్యకు చేరిన మొదటి జంతువు కూడా ఇదే. అయితే భూకక్ష్యకు చేరగానే అధిక వేడి కారణంగా కొన్ని గంటలలోనే చనిపోయింది. అంతరిక్షయాన వాతావరణాలలో ప్రాణుల స్పందనలు ఎలా ఉంటాయనే తొలి డేటాను అందించిన ఘనత లైకాకు దక్కింది” చెప్పాడు. అది విని నేను గర్వంతో పొంగిపోయి, అప్రయత్నంగానే తోకాడించాను.
“ఏంటి ఏదో సమావేశం జరుపుతున్నారు” అంటూ విశ్వనాథంగారు వచ్చారు. ఆయనతో పాటు పోలీస్ అంకుల్ గంభీర్ కూడా ఉన్నారు. ఆయన అడపా దడపా వస్తూనే ఉంటారు కాబట్టి నాకు తెలుసు. ఆయన పోలీసుశాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. “శునకరాజాల ముచ్చట్లు చెప్పుకుంటున్నాం” అంది ప్రతిభ. వెంటనే పోలీస్ అంకుల్ అందుకుని “ఓఁ.. అలాగా. శునకాలు మా పోలీసుశాఖలో ఎంతో కీలకమైన పనులు చేస్తాయి, ముఖ్యంగా నేర పరిశోధనలో జాగిలాల సేవలు అమూల్యమైనవి. జాగిలాలకు హ్యాండ్లర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారనుకోండి. పోలీసు జాగిలాలకు ఉద్యోగం, బాధ్యతలు, పదవీ విరమణ మానవ ఉద్యోగులకు ఉన్నట్లే ఉంటాయి. మామూలుగా శునకాల జీవితకాలం పన్నెండు నుంచి పధ్నాలుగు సంవత్సరాలుంటుంది. శునకాలకు వాసన చూసే శక్తి మనిషికంటే నలభై రెట్లు, వినికిడి శక్తి ఇరవై రెట్లు, కంటిచూపు పదిరెట్లు అధికం. పోలీసు శాఖలో ఎనిమిదేళ్ల వయసు నిండగానే, ఉద్యోగ విరమణ ప్రకటిస్తారు. ఎందుకంటే అప్పటికి వాటికి వాసన పసిగట్టే శక్తి తగ్గుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత వాటిని హ్యాండ్లర్స్‌కు అప్పగిస్తారు. ఒకవేళ వారు సమ్మతించకపోతే వాటిని జంతు ప్రేమికులకు అప్పగిస్తారు” చెప్పారు.
“అంకుల్.. నేను ఒకసారి టీవీలో పోలీస్ జాగిలాల ఫీట్లు చూశాను. భలే చేశాయి. అలాగే డాగ్ షోలో ఎన్నిరకాల కుక్కలను చూపించారో” ఎప్పుడు అక్కడికి వచ్చాడో విశ్వనాథంగారి మనవడు ప్రతాప్ అన్నాడు. విశ్వనాథంగారు మాట్లాడుతూ “ఆర్మీలోనూ శునకాల పాత్ర తక్కువేమీ కాదు. ఉగ్రవాద కుట్రలను నిరోధించడంలో అవి మనకెంతో సాయం చేస్తున్నాయి. బాంబులను ముందుగానే పసిగట్టి, పేలుళ్లు జరగకుండా నిరోధించి, ప్రాణ నష్టం జరగకుండా చేస్తాయి. మైన్స్‌ను, గ్రెనేడ్లను, మాదకద్రవ్యాలను పసిగట్టడం.. గస్తీ తిరగటం.. లాంటి ఎన్నో పనులు చేస్తాయి. భూకంపాలు సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిధిలాల కింద సజీవంగా ఉన్న వారిని బయటకు తీసుకు రావడంలో ఈ శునకాలపాత్ర సాటిలేనిది” అన్నారు.
మా జాతి గొప్పతనం తెలిసి ‘ఔరా’ అనుకున్నాను. నేను గుమ్మంలో పడేసిన పేపర్ తెచ్చి అందించి, బాల్ ఆడుకుంటుంటే దాన్ని అందిస్తూ… ఇలా చిన్నాచితకా పనులు చేస్తూ నేనేదో చాలా ప్రత్యేకం అనుకుంటా.. నిజానికి పోలీస్ జాగిలాలు, మిలటరీ శునకాల సేవల ముందు నేనేపాటి అనుకుంటుండగానే, విశాలాక్షిగారు “ఇన్ని సేవలు చేసే శునకాల గురించి మనవాళ్లు కనకపు సింహాసనమున శునకముఁ గూర్చుండబెట్టి.. అంటూ వాటిని కించపరిచారు.. మనుషుల్లోని చెడును జంతువులకు ఆపాదించి వాటిని కించపరచడం ఎంతవరకు సబబు? ఎన్నో సామెతల్లో శునకాన్ని తక్కువ చేశారు. పాపంకదా” అంది. “అవునమ్మా” అంటూ ప్రతిభ “వాటి గొప్పతనం గుర్తించలేని వాళ్ల మాటలవి.. శునకాల గురించిన కొన్ని విశేషాలు చెపుతా వినండి.. అవి గిన్నిస్ బుక్‌కు కూడా ఎక్కాయి. సాధారణ శునక జీవితకాలం పధ్నాలుగేళ్లు అయితే బ్లూయీ అనే ఆస్ట్రేలియన్ శునకం ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదునెలలు బతికి గిన్నిస్ రికార్డుకెక్కింది. ఇంకో విచిత్రం ఏమిటంటే సుమారు పదిహేనువందల మందిని సముద్రం పాలు చేసిన టైటానిక్ నౌకవిషాద ఘటనలో ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ఉన్న మూడు శునకాలు మాత్రం బతికి బయటపడ్డాయి. ఇది ఇలా ఉంచితే గతంలో గ్రామ్‌ఫోన్ కంపెనీ హెచ్ఎమ్‌వి వారి ఎంబ్లెమ్ కుక్క బొమ్మే. అలాగే గతంలో సిండికేట్ బ్యాంక్ వారి ఎంబ్లెమ్ కూడా కుక్క బొమ్మే..ఇలా ఎన్నెన్నో” చెప్పింది.
అది విని ‘భలే భలే’ నేననుకుంటుండగా విశ్వనాథంగారు అందుకుని “అన్నట్లు ఆ మధ్య మోడీగారు కూడా తన ‘మన్ కీ బాత్’లో మిలటరీ శునకాలను ప్రస్తావించారు. విశిష్ట సేవలు అందించిన సోఫీ, విడా శునకాలను ప్రశంసించడమే కాదు, సమర్ధత విషయంలో భారతీయ జాతి శునకాలు తక్కువేమీ కాదని, ముధోల్ హౌండ్, హిమాచలి హౌండ్, రాజపాలయం, కన్నీ, చిప్పిపరాయ్, కొంబాయి వంటివి మేలైన రకాలని, ఆర్మీ, సిఐఎస్ఎఫ్, ఎన్‌ఎస్‌జి సంస్థలు ముధోల్ హౌండ్ శునకాలకు శిక్షణ ఇచ్చి డాగ్ స్క్వాడ్‌లో చేర్చారని చెప్పడమే కాదు, ‘మీరు కుక్కలను పెంచాలనుకుంటే భారతీయ జాతి శునకాలలో ఒకదాన్ని ఎంచుకోండి.. స్వావలంబనలో ఇది కూడా ఒక భాగమని సందేశమిచ్చారు’ అని వివరించారు” అన్నారు.
అంతలో ప్రవీణ్ భార్య చంద్రిక కాఫీ ట్రేతో వచ్చి.. అందరికీ అందించి, “మనిషి మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు శునకం. పధ్నాలుగువేల సంవత్సరాల క్రితం నుంచే మనిషితో కలిసి జీవిస్తోంది. అప్పట్లో నివాసానికి కాపలాగా, బండ్లను లాగడానికి ఉపయోగించేవాడు. గ్రామం మొత్తానికే కాపలాగా ఉంటుందని దాన్ని గ్రామసింహం అన్నారు. మనిషి తనకు తోడుగా కూడా శునకాన్ని వెంటబెట్టుకు తిరిగేవాడు. శునకం విశ్వాసానికి మారు పేరు. శునకం అనగానే నాకయితే హచికో ఉదంతమే గుర్తుకొస్తుంది” అంది.
“‘హచికో’ ఎవరు?” వెంటనే ప్రశ్నించాడు ప్రతాప్. నా సందేహం కూడా అదే.. అందుకే నేనూ చెవులు రిక్కించాను. “హచికో.. ఒక జపనీస్ శునకం. పంధొమ్మిది వందల ఇరవై మూడులో పుట్టింది. దానికి ఏడాది వయసుండగా టోక్యోకు చెందిన హిడేసబురో ఇనో అనే ప్రొఫెసర్ గారు దాన్ని తీసుకొని పెంచుకోసాగాడు. యజమాని అంటే హచికోకు ఎంతో ప్రేమ, అభిమానం. రోజూ ఆయన ఉద్యోగానికి వెళుతుంటే ఆయనతో పాటు రైల్వే స్టేషన్‌కు వెళ్లి, ఆయన రైలు ఎక్కి, వెళ్లేదాకా ఉండేది. తిరిగి సాయంత్రం ఆయన వచ్చేవేళకు రైలు స్టేషన్లో ఎదురు చూస్తూ ఉండేది. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు ఎప్పటి మాదిరే యజమాని రాకకోసం స్టేషన్లో ఎదురు చూస్తోంది. కానీ యజమాని రాలేదు. ఆయన సెరిబ్రల్ హేమరేజ్‌తో మరణించిన విషయం దానికి తెలియదు. తను చూడకుండా ఇంటికెళ్లి ఉంటాడేమో అని ఇంటికెళ్లి చూసింది. అక్కడా లేడు. తిరిగి స్టేషన్‌కు వచ్చింది. ఆరోజు నుంచి తొమ్మిదేళ్లకు పైగా స్టేషన్లోనే నిరీక్షిస్తూ, రైలు వచ్చినప్పుడల్లా యజమాని కోసం ఆత్రంగా చూస్తూ ఉండేది. దాని బాధ చూసి స్టేషన్ సిబ్బంది, ప్రయాణికులు జాలిపడి ఆహారం అందించినా అది తినేది కాదు, కొన్నిసార్లు తిన్నా ఏదో కొద్దిగా తినేది. అలా ఎదురు చూస్తూనే హచికో ఒకరోజు మరణించింది. ప్రొఫెసర్ గారి శిష్యుడొకరు ఈ ఉదంతంపై ఎన్నో వ్యాసాలు రాశాడు. ప్రజల మనసుల్లో హచికో నిలిచిపోయింది. ఒక జపాన్ శిల్పి హచికో కాంస్య విగ్రహం తయారు చేశాడు. దాన్ని శిబుయు రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రతిష్ఠించారు. అంతేకాదు, జపాన్ ప్రజలు హచికోపై తమ ప్రేమాభిమానాలకు గుర్తుగా హచికో కాంస్య పాదాలను.. ఎక్కడయితే అది, యజమాని కోసం ఎదురు చూసేదో సరిగ్గా అక్కడే ప్రతిష్ఠించారు. ఇప్పటికీ టోక్యో ప్రజలు ఏటా హచికో సంస్మరణ దినం జరుపుకుంటారు.ఈ వాస్తవ కథను ‘హచికో (ఎ డాగ్స్ టేల్)’ పేరుతో పంధొమ్మిది వందల ఎనభై ఏడులో జపనీస్ సినిమాగా రూపొందించారు. ఇదే సినిమాను రెండువేలతొమ్మిదిలో అమెరికన్ డ్రామా ఫిల్మ్ వారు ‘హచీ (ఎ డాగ్స్ టేల్)’ పేరిట చలన చిత్రంగా రూపొందించారు” అంటూ ముగించింది.
నా మనసంతా హచికో నిండిపోయింది. మనిషికన్నా గొప్ప మనసున్న జాతి మాది అనుకున్నాను. “ప్రేమాభిమానాలకే ప్రతీకగా నిలిచిన హచికో నిజంగా ఎంతో గొప్పది” అన్నాడు ప్రవీణ్. అంతా అవునవునన్నారు. “మరి కుక్క కరిస్తే ప్రమాదమంటారుకదా.. అందులోనూ పిచ్చికుక్క కరిస్తే మరీ ప్రమాదమని, రేబిస్ వస్తుందని అంటారుకదా” అడిగాడు ప్రతాప్. “అవును.. అయితే సాధారణంగా మనం వాటి జోలికి వెళ్లకపోతే అవి ఏమీ చేయవు. అవి మన దగ్గరగా వచ్చినప్పుడు అరవడం, పరుగెత్తడం లేదా దాని కళ్లలోకి సూటిగా చూడడం చేయకూడదు. అది తినేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, దాని పిల్లలతో ఉన్నప్పుడు దాని జోలికి వెళ్లకూడదు. ఇక శునకాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మనం నిర్లక్ష్యంగా ఉండి మూగప్రాణులను నిందిస్తే ఎలా? వాటిని సంరక్షించే బాధ్యత మనదేకదా” అన్నాడు విశ్వనాథంగారు. “అబ్బో.. చాలా టైమయింది. ఇంక నేను వస్తా” అంటూ లేచారు పోలీస్ అంకుల్. మిగతా వాళ్లంతాకూడా లేచి ఆయనకు వీడ్కోలు చెప్పడంలో మునిగిపోయారు.
మా జాతి గురించి విన్న విశేషాలన్నీ నా మనసులో ఇంకా తిరుగాడుతూనే ఉన్నాయి. మనిషి మాకు స్నేహితుడు అయినప్పుడు మనిషి హితం కోరి ఓ మాట చెప్పాలనుంది.. అది, ఏమాత్రం విశ్వాసం లేకుండా ప్రవర్తించే తీరు మార్చుకోమని.. కొంతమంది కని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఏమాత్రం విశ్వాసం లేకుండా విస్మరిస్తున్నారు. కొంతమంది ఉపకారం చేసినవారి పట్ల విశ్వాసం చూపడం మాట అటుంచి, ఎదురు ఎసరు పెట్టడమూ విన్నాను. ఇక మాతృభూమికే విద్రోహం తల పెట్టే విశ్వాసఘాతకుల గురించి విన్నాను. విశ్వాసంతో మెలిగి ఉత్కృష్టమైన మానవ జన్మను సార్ధకం చేసుకోమని చెప్పాలనుంది. అలాగే మావాళ్లకూ కోపాలూ, చిరాకులు, జబ్బులూ ఉండవచ్చు. అందువల్లే కరవడం చేస్తుంటారు. మరి వారి విషయంలో జాగ్రత్త తీసుకుని క్షేమంగా ఉండాలని నా మనవి.. కానీ నేను చెప్పే హితం, మనవి మనిషికి అర్థమయ్యేనా? అనుకుంటుంటే వీధిలోని మా వాళ్లు ఎలుగెత్తి పోట్లాట ఆట మొదలు పెట్టారు.. చూద్దామని మళ్లీ కిటికీ చేరాను.