[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం క్యాలెండర్ అంతరంగం తెలుసుకుందాం. [/box]
[dropcap]గో[/dropcap]డకు ఉన్న నా మీద వెలుగు పడటంతో తెల్లారిందని గ్రహించా. చీకటయితే విద్యుత్ కాంతులుంటాయి కానీ నాకు సూరీడి వెలుగుకు, కృత్రిమ కాంతులకు తేడా తెలుసు. చేతిలో కాఫీ పట్టుకుని పార్వతమ్మగారు నేరుగా నా దగ్గరకు వచ్చి నన్ను మేకునుంచి తొలగించి, మరో చేత్తో పదిలంగా పట్టుకుని పెరటి వాకిలి మెట్ల దగ్గరకు వెళ్లి అక్కడ బైఠాయించింది. గాలి పలకరింపుకు నేను పులకరించా.. ఆనందంతో రెపరెపలాడాను.
పార్వతమ్మగారు కాఫీకప్పు పక్కన పెట్టి నన్ను అదుపు చేసి, మళ్లీ కాఫీ కప్పు అందుకుని ఆస్వాదిస్తూ నన్ను పరిశీలిస్తూ… ‘హేమంత రుతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, పదింటికి పాడ్యమి వస్తోంది.. మృగశిర నక్షత్రం, భానువారం.. సరే.. తేదీ డిసెంబర్ పంథొమ్మిది..’ అనుకోగానే.. ‘అరే.. ఇవాళ జానూ పుట్టినరోజు. మరిచేపోయాను. ఫోన్ చేయాలి. చాలా రోజులయింది. చిట్టి చెల్లెలు ఎలా ఉందో’ అనుకుంటూ లేచి లోపలికి నడిచి మళ్లీ నన్ను గోడకు తగిలించి, మొబైల్ అందుకుంది.
కొద్దిసేపటికి వ్యంగ్యేశ్వరరావుగారు నా దగ్గరకు వచ్చారు. ఆయన అసలు పేరు వ్యాఘ్రేశ్వరరావు. కానీ ఆయన మాట తీరు వ్యంగ్యంగా ఉండటంతో దగ్గరి వారందరూ వ్యంగ్యేశ్వరరావు అని పిలుస్తుంటారు. ఆయన కళ్లద్దాల్లోంచి నన్ను నిశితంగా పరిశీలించి, “పారూ” అంటూ శ్రీమతిని కేకేశారు. “ఏంటా కేకలు, ఏం మునిగింది?” అంటూ పార్వతమ్మ రంగప్రవేశం చేసింది.
“ఇవాళ మనకు సంబరాల సదాశివం ఇంట్లో డి.పి. ఉంది. నువ్వు తొందరపడి వంట చేసేస్తావేమోనని చెప్తున్నా”. సదాశివం ఇంట్లో నెలకో వేడుకైనా జరుగుతుంటుంది. అందుకని ఆయన పేరుకు సంబరాల అని విశేషణం జోడించాడు వ్యంగ్యేశ్వరరావు. అది విని పార్వతమ్మ “అబ్బబ్బ! మీకెప్పుడూ తిండిగోలే. తెల్లవారడం ఆలస్యం డి.పి.ల గురించి క్యాలెండర్ చెకింగ్. అయినా మిమ్మల్ని డి.పి. అదే ధర్మపిండం అనే మాట వాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. వాళ్లేదో పెళ్లో, పూజో, పుట్టిన రోజో.. ఏదో ఒక వేడుకకు విందుకు పిలవడమేమిటి, మీరు దాన్ని అసహ్యంగా ధర్మపిండం అనడమేమిటి?” కోప్పడింది.
“నీతోనే కదా అంది. బయట వాళ్లతో అన్నట్లు ఓ ఇదయిపోతావేమిటి? పైకి ఇలా అంటారే కానీ నా మాటలకు అంతా హాయిగా నవ్వుకుంటుంటారు. నవ్వు ఎంతో ఆరోగ్యం కదా, అంటే నేను నా మాటలతో ఆరోగ్యాన్ని పంచుతున్నాను, పెంచుతున్నాను అన్నమాట” సమర్థించుకున్నాడు వ్యంగ్యేశ్వరరావు. “మహాప్రభూ! మీకో నమస్కారం. మీకు తీర్థప్రసాదాలు తెస్తానుండండి” అంటూ అక్కడినుంచి వెళ్లింది.
తీర్థ ప్రసాదాలంటే కాఫీ, టిఫిన్ అన్నమాట. ఎవరైనా పెళ్లి కార్డు, వడుగు కార్డులు ఇచ్చి వెళ్లినా లేదా పుట్టినరోజులు, షష్ఠిపూర్తులు వగైరాలకు పిలిచినా వ్యంగ్యేశ్వరరావుగారు వెంటనే నన్నందుకుని ఓ పెన్సిల్‌తో ఆ తేదీ దగ్గర డి.పి. అని రాస్తుంటారు. ఇంతలో పార్వతమ్మ వచ్చి, ఆయనకు కాఫీ, ఉప్మా అందించి, “అన్నట్లు ఇవాళ ఒక పాకెట్ పాలు ఎక్కువ తీసుకున్నా.. నోట్ చేసుకోండి” చెప్పింది. వెంటనే ఆయన మళ్లీ నా దగ్గరకొచ్చి ‘మిల్క్ ప్లస్ వన్’ అని రాసి, తీర్థ ప్రసాదాలు సేవించడానికి వెళ్లారు.
ఆయన ఆ కార్యక్రమం ముగిస్తుండగానే మనవడు విఖ్యాత్ వచ్చి “తాతయ్యా! ఇవాళ ఇంగ్లీష్ పేపర్ వేయలేదు” అన్నాడు. “అయితే క్యాలెండర్‌తో మళ్లీ పనిబడింది” అంటూ లేచి వచ్చి నన్నందుకుని ఆ విషయం నోట్ చేశారు. ఆదివారం కావడంతో ఇంట్లో ఒక్కొక్కరే బద్దకంగా లేస్తున్నారు. ఈ ఇంట్లో మా వాళ్లు గది గదికీ ఉన్నారు. పిల్లలకయితే ముచ్చటైన స్కూలు క్యాలెండర్లు ఉన్నాయి. పై గూట్లో ప్లాస్టిక్ డేటర్ ఉంది. దాన్ని వ్యంగ్యేశ్వరరావు గారు పాతికేళ్ల ప్రాయంలో ఉండగా ముచ్చటపడి కొన్నారట. దాన్ని ఏటా మార్చక్కర్లేదు. ఓవైపు సంవత్సరం, మరో వైపు నెల మార్చుకునే చక్రాలున్నాయి. మధ్యలో తేదీని రోజూ మార్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆయన ఎవర్నీ తాకనీయరు. ఈమధ్య సాయంత్రం నాలుగు కాగానే వ్యంగ్యేశ్వరరావు ‘రోజయిపోయిది’ అంటూ ఆ ప్లాస్టిక్ డేటర్ తేదీని మార్చేస్తున్నారు. అది చూసి ఇంట్లో అంతా ‘కాలం కంటే ముందుండమంటే ఇదేనేమో’ అని నవ్వుతుంటారు. చెప్పొద్దూ, నాక్కూడా ఆయన తీరు చిత్రంగా అనిపిస్తుంది. ఇక అందరి మొబైల్స్‌లో మావాళ్లున్నారు.. అలాగే కంప్యూటర్లలో ఉన్నారు. ఇక మా బుడతలు అదే.. పాకెట్ క్యాలెండర్లకు లెక్కేలేదు. బ్యాంకులు తదితర సంస్థలు, పెద్ద పెద్ద షాపుల వాళ్లు ఇచ్చే క్యాలెండర్లు సరేసరి.
ఇంతలో విఖ్యాత్ వచ్చి “తాతయ్యా! క్యాలెండర్‌ను తెలుగులో ఏమంటారు?” అడిగాడు. ‘భలే ప్రశ్న’ అనుకుంటూ నేను నా చెవులు రిక్కించా. “’కాల సూచిక’ అనవచ్చు. అయినా క్యాలెండర్ అనేమాటే ఎక్కువగా వాడుకలో ఉంది” చెప్పాడు వ్యంగ్యేశ్వరరావు. ఇంతలో మిగతా కుటుంబ సభ్యులు కూడా కాఫీ కప్పుతో అక్కడికి వచ్చికూర్చున్నారు.
“మాధవీ! ఇవాళ సదాశివం గారింట్లో ఫంక్షన్ గుర్తుందా” అంటూ వచ్చింది పార్వతమ్మ. “ఓ.. అయితే మనకు వంటపని తప్పిందన్న మాట” నవ్వుతూ అంది మాధవి. “నాకా విషయమే గుర్తులేదు. మీ మామగారే క్యాలెండర్ చూసి చెప్పారు” అంది పార్వతమ్మ. “నాన్నా! మన దేశంలో ఇంగ్లీషు క్యాలెండర్‌తో పాటు తిథులు, నక్షత్రాలు తెలిపే ప్రాంతీయ క్యాలెండర్లు ఉన్నాయికదా. మరి ప్రపంచం మొత్తంమీద కూడా వేర్వేరు క్యాలెండర్లు ఉన్నాయా” అడిగింది విద్య. మా గురించిన ప్రశ్నే కావడంతో నాకూ ఆసక్తిగా అనిపించింది. “మీ అమ్మ బాగా చెపుతుందమ్మా. మేధావీ! విద్య సందేహం తీర్చు” అన్నాడు మోహన్. అతడు మాధవిని సరదాగా మేధావీ అని పిలుస్తుంటాడు. “అవును విద్యా! ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్కృతుల ననుసరించి వివిధ రకాలైన క్యాలెండర్లను వాడుతుంటారు. ఉదాహరణకు జర్మన్, హిందూ,ఇస్లామిక్, ఇరానియన్, హిబ్రూ, బౌద్ధ క్యాలెండర్లు. అయితే అంతర్జాతీయంగా ఒకే క్యాలెండర్ ఉన్నప్పుడే దేశాలన్నిటి మధ్య సమన్వయం సాధ్యం అవుతుందని గుర్తించి గ్రెగోరియన్ క్యాలెండర్‌ను నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న మూడొందల అరవైఐదురోజుల, ఆరుగంటల క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండరే. దీన్నే వెస్టర్న్ క్యాలెండర్, క్రిస్టియన్ క్యాలెండర్ అని కూడా అంటారు. క్యాలెండర్లలో సౌర మానాన్ని అనుసరించేవి అంటే సూర్య గమనాన్ని అనుసరించేవి కొన్నయితే చంద్రమానాన్ని అనుసరించేవి కొన్ని” ఆగింది మాధవి. ‘మా వెనుక ఇంత కథ ఉందా!’ అనుకున్నాను నేను.
“అమ్మా! అన్నిటికన్నా పురాతనమైన క్యాలెండర్ ఏది?” ప్రశ్నించాడు విఖ్యాత్. “సుమారు పదివేల సంవత్సరాల క్రితం స్కాట్లాండ్ లోని వారెన్ ఫీల్డ్‌లో పన్నెండు గంటల మిసోలిథిక్ అమరిక ఒకటి లభించింది. దాన్ని చంద్రమాన క్యాలెండర్‌గా నిర్ధారించారు. రెండువేల పదమూడులో ఆ క్యాలెండర్‌నే ప్రపంచంలోని పురాతన క్యాలెండర్‌గా పేర్కొన్నారు” వివరించింది మాధవి. “మరి మన దేశంలో క్యాలెండర్‌ల సంగతేమిటి?” అడిగింది విద్య.
“నేను చెపుతా వినండి” అంటూ తాత వ్యంగ్యేశ్వరరావు అందుకుని, “ప్రాచీన భారతదేశంలో వేదాల ఆధారంగా క్యాలెండర్లు రూపొందాయంటారు. హిందూ క్యాలెండర్లు పురాతన కాలం నుండి భారత ఉపఖండంలో వాడుకలో ఉన్నాయి. భారత్, నేపాల్ లలో ఇప్పటికీ ప్రాచీన క్యాలెండర్లను వాడుతున్నా రు. ముఖ్యంగా హిందువుల పండుగ తేదీలను నిర్ణయించడానికి తిథి, వార, నక్షత్రాలన్నీ ఉండే హిందూ క్యాలెండర్లను అనుసరిస్తున్నారు. ఇవి చంద్రమానం అనుసరించి రూపొందేవి. అధికార వ్యవహారాలకు ఇంగ్లీష్ క్యాలెండర్‌నే అంతా అనుసరిస్తున్నారని ఇందాకే మీ అమ్మ చెప్పింది” ఆపాడు.
“అసలు క్యాలెండర్ అనే మాటకు అర్థమేమిటో” అన్నాడు విఖ్యాత్. ఈసారి మోహన్ అందుకుని, “క్యాలెర్ అంటే లాటిన్లో ‘పిలుపు’ అని అర్థం. నెలలో మొదటి రోజు క్యాలెండ్. అప్పుల లెక్కలు రాసుకునే పుస్తకం క్యాలెండర్‌గా ఆనాడు పరిగణించేవారు. పద్దులన్నీ ఒకటో తేదీనే రాసుకునేవారు. ఆ పుస్తకమే క్రమంగా తేదీ, వారం, సంవత్సరం తదితర వివరాలు తెలిపే క్యాలెండర్‌గా మారింది. అర్థమైందా” అన్నాడు. ‘ఇన్నాళ్లకు మన జాతి విశేషాలు తెలిశాయి. విన్నారా?’ అడిగాను ఇంట్లో వేర్వేరు చోట్ల ఉన్న మా వాళ్లను. వాళ్లు కూడా ‘అవును. విన్నాం’ అంటూ సంతోషంగా కదిలారు.
అంతలో “అసలు ఈ క్యాలెండర్ల తయారీ ఆలోచనలు ఎక్కడ మొదలయ్యాయి?” అడిగింది విద్య. “మంచి ప్రశ్నవేశావమ్మా! క్యాలెండర్ నిర్మాణంలో గ్రీకులు కీలకపాత్ర పోషించారని చరిత్ర చెపుతోంది. ఆ కాలంలోనే వందకు పైగా క్యాలెండర్లు వెలువడ్డాయట. అందులో ఏథెన్స్ క్యాలెండర్ బాగా ప్రాచుర్యం పొందింది. తొలినాటి క్యాలెండర్లలో అనేక గందరగోళాలు ఉండేవి. అప్పటి రాజు జూలియస్ సీజర్ దాన్ని సరిచేసే బాధ్యతను ఓ ఖగోళ శాస్త్ర పండితుడికి అప్పగించాడట. ఆయన ఆ క్యాలెండర్‌ను సంస్కరించి సంవత్సరానికి మూడొందల అరవైఐదు రోజులు ఖరారు చేశారు. మిగిలిన పావు దినాన్ని నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరంతో సర్దుబాటు చేస్తున్నారు” అన్నారు వ్యంగ్యేశ్వరరావు. “లీపు సంవత్సరం ప్రత్యేకత ఏమిటి?” మళ్లీ అడిగింది విద్య. “సంవత్సరానికి మూడొందల అరవైఐదు రోజులని చెప్పుకున్నాం కదా. కానీ లీపు సంవత్సరానికి మాత్రం మూడొందల అరవైఆరు రోజులుంటాయి. సాధారణ సంవత్సరాలలో ఫిబ్రవరికి ఇరవైఎనిమిది రోజులయితే, లీపు సంవత్సరంలో ఫిబ్రవరికి ఇరవైతొమ్మిది రోజులుంటాయి. క్రీస్తుశకం పదహారువందల సంవత్సరాన్ని మొదటి లీపు సంవత్సరంగా ప్రకటించారు” వివరించారు వ్యంగ్యేశ్వరరావు.
“మరి లీపు సంవత్సరంలో పుట్టినవాళ్లు పుట్టినరోజులు నాలుగేళ్లకోసారి చేసుకోవాలా?” అడిగాడు విఖ్యాత్. వెంటనే పార్వతమ్మ బదులిస్తూ “అలా ఏం లేదు. ముందు రోజే చేసుకుంటారు. అయినా ఇప్పుడు పని రోజుల్లో పుట్టినరోజులు వస్తే వారాంతాల్లో చేసుకోవడం లేదూ, ఇది కూడా అంతే” అంది. “బాగా చెప్పారు” అంది కోడలు. “ఇది వరకయితే ఇంటి గోడల నిండా క్యాలెండర్లు తగిలించేవారు. కుర్రకారు సినిమా తారల క్యాలెండర్లకు ప్రాధాన్యమిస్తే, భక్తిపరులు దేవుళ్ల క్యాలెండర్లకు, కళాభిరుచి ఉన్న వారు ప్రకృతి రమణీయ దృశ్యాలున్న క్యాలెండర్లకు ప్రాధాన్యమిచ్చే వారు. బట్టలషాపులు మొదలైనవాటికి వెళితే క్యాలెండర్ అడిగి మరీ తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ తీరే మారింది. ఇంట్లో గోడలకు ఓ రెండు ఏబ్‌స్ట్రాక్ట్ (నైరూప్య) చిత్రాలను అలంకరిస్తున్నారు. అయినా ఇప్పటికీ కొంతమంది తిరుమల కేలండర్‌ను మాత్రం ఇంట్లో తగిలిస్తున్నారు. పాత సంవత్సరాల క్యాలెండర్లయితే పిల్లల పుస్తకాలకు అట్టలుగా, గూళ్లలో పరుచుకోవడానికి వాడేవారు. ఇప్పుడు వాటికీ ప్లాస్టిక్ కవర్లు రావడంతో ఆ వాడకమూ పోయింది” అంది పార్వతమ్మ.
“పుస్తకాలకు బ్రౌన్ షీటు తప్ప వేరే అట్టలు వేస్తే మా స్కూల్లో అస్సలు ఒప్పుకోరు” అన్నాడు విఖ్యాత్. ఆ వెంటనే “అందరి సంగతేమోగానీ నాన్నగారి గదిలో షెల్ఫ్‌ల్లో ఇప్పటికీ క్యాలెండర్ కాగితాలనే వాడుతున్నారుగా” నవ్వుతూ అన్నాడు మోహన్. అందరూ నవ్వుతుండగా.. నా చూపు వెంటనే వ్యంగ్యేశ్వరరావుగారి గదిలో గూళ్లల్లో శయన భంగిమలో ఉన్న మావాళ్ల పై పడింది. అవి మొదట కాస్తంత దిగులుగా ముఖం పెట్టి, అంతలోనే సర్దుకుని “సంవత్సరం అయిపోవచ్చిందిగా, కొద్దిరోజుల్లో నీ పనీ ఇంతే సంగతులు” అన్నాయి. ‘నిజమే కొద్దిరోజుల్లో ఈ గోడకూ, నాకూ రుణం తీరబోతోంది. నిజానికి నేను ఈ ఇంటికి వచ్చిన రోజు నా ఆనందంలో గోడనుంచి తొలగిన మావాళ్ల బాధను గమనించనే లేదు.’ అనుకున్నాను.
“అన్నట్లు ఈ మధ్య ప్రభుత్వాలు చదువులకు సంబంధించి, అకడమిక్ క్యాలెండర్‌ను, ఉద్యోగావకాశ వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నాయి” అన్నాడు మోహన్. “అవునవును” అన్నారు వ్యంగ్యేశ్వరరావుగారు.
“అసలు క్యాలెండర్ తయారీయే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందన్న విషయం కూడా మనం గుర్తించాలి, గుర్తుంచుకోవాలి” అంది మాధవి. “నువ్వు చెప్పింది నిజమే. ఇంకో సంగతి.. ఈ మధ్య కొన్ని క్యాలెండర్లను కాగితం ఆదా కోసం, ఖర్చు తగ్గించుకోవడానికి, రెండువైపులా ముద్రించి ఆరు పేజీల్లో తయారు చేస్తున్నారు. కానీ పన్నెండు పేజీలు ఉంటేనే చూసుకునేందుకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది” అంది పార్వతమ్మ. “నువ్వు చెప్పింది నిజమే” ఎప్పుడూ పార్వతమ్మ మాటల్ని ఖండించే వ్యంగ్యేశ్వరరావు ఈ విషయంలో ఆమెతో ఏ కీభవించాడు.
“అరెరె.. మనం నిత్యం వినియోగించుకునే గూగులమ్మ సేవలను మరిచిపోతే ఎలా? కాల నిర్వహణ, ప్రణాళికకు గూగుల్ క్యాలెండర్ వాడకం ఇప్పుడు మామూలైపోయింది. మనం హాజరవాల్సిన సమావేశాలు, చేయవలసిన ఇతర పనులను ఒకసారి నోట్ చేసుకుంటే చాలు, మనం వాటి గురించి మరిచిపోయినా గూగుల్ గుర్తుంచుకుని మనల్ని హెచ్చరించి, మేలు చేస్తుంది.” అన్నాడు మోహన్. “అవును. గూగుల్ సేవలు చెప్పతరమా, అన్నట్లు మనం మాయన్ క్యాలెండర్ గురించి మాట్లాడుకోలేదు. పురాతన కాలంలో మధ్య అమెరికాలో వారి సంస్కృతిననుసరించి ఏర్పరచుకున్నదే మాయన్ క్యాలెండర్. మాయ సంస్కృతి నాలుగువేల సంవత్సరాల క్రిందటిది. ఇప్పటికీ గౌటెమాలా, బెలిజ్, హెండూరాస్, ఎల్ సాల్వెడార్లలో ఈ సంస్కృతి కనిపిస్తుంది. వారు ప్రధానంగా మూడురకాల క్యాలెండర్లను అనుసరించేవారు. అవి లాంగ్ కౌంట్, జోల్కిన్ (డివైన్), హాబ్ (సివిల్).. లాంగ్ కౌంట్‌లో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాల కాల గణన పొందుపరిచారు. మాయన్ క్యాలెండర్ ప్రకారం ఈ ప్రపంచం క్రీస్తుపూర్వం ఆగస్టు పదకొండు, మూడువేల నూటపధ్నాలుగు నాడు ప్రారంభమైంది. మాయన్ క్యాలెండర్ ప్రకారం రెండువేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన యుగాంతం అన్నారు. కానీ అదంతా అబద్ధమని తేలిపోయింది. అయితే అది పొరపాటుగా చెప్పిందని మాయన్ క్యాలెండర్ ప్రకారం రెండువేల ఇరవైజూన్ ఇరవైఒకటిన యుగాంతం అని కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు పేర్కొన్నారు. అదీ అబద్ధమయింది. అలా మాయన్ క్యాలెండర్ జనాలను మాయ చేసింది” నవ్వింది మాధవి.
“యుగాంతం గురించిన కథనాల్ని నమ్ముతూనే ఉంటాం. ఎందుకంటే కుతూహలం అలాంటిది. కబుర్లలో పడితే కాలమే తెలియదు. లేచి తయారవ్వాలి ఇంక. సదాశివం ఇంటికి వెళ్లాలికదా, ఆలస్యంగా వెళితే కేవలం డి.పి. కోసమే వెళ్లినట్లుంటుంది” అన్నాడు వ్యంగ్యేశ్వరరావు. అంతా నవ్వుతూ లేచారు.
మొత్తానికి ఈ రోజు మా జాతి గురించి చాలావిషయాలే తెలిశాయి. సెలవుదినాలు, ప్రముఖుల జయంతులు, వర్ధంతులు, చరిత్రలో ముఖ్యమైన తేదీలు వగైరాలన్నీ ఎరుపు రంగులో ఉండి ఎరుక చేసేది నేనే కదా అనుకుంటే గర్వంగా అనిపించింది. అయినా ఈ మనుషుల సంగతే నాకు అంతుపట్టదు. గొప్ప ఉద్దేశాలుంటాయి కానీ ఆచరణే శూన్యం. రోజూ నన్ను చూస్తూ పరీక్షలకు ఇంక ఓ నెలేఉంది, పదిరోజులే ఉంది అనుకుంటారు. కష్టపడి చదవాలి అనుకుంటారు. కానీ ఆ తర్వాత క్రియశూన్యం. ఆ రాత్రికి ఆ విషయం గుర్తుకొచ్చి రేపు అంటూ వాయిదా వేస్తారు. ఎన్నాళ్లు గడిచినా వాయిదాల పర్వం నడుస్తూనే ఉంటుంది. పరీక్షలనే కాదు, అనేకమైన పనులకు కాలపరిధిని నిర్ణయించు కోవడమే కానీ అమలు మాత్రం శూన్యం. అలా కాకుండా కాల ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే.. కాలాన్ని సద్వినియోగపరుచుకుని, విజయాలు అందుకున్నప్పుడే నాకూ సంతృప్తి.. ‘నేను కాలాన్ని సూచించగలనే కానీ కాలాన్నీ అప్పివ్వలేను.. తిరిగి తెచ్చివ్వలేను’ అని చెప్పాలనుంది. కానీ నా గొంతు మనిషికి వినపడేనా? అయినా ‘ఎందరో విజ్ఞులు కాలం విలువ గురించి చెపుతూనే ఉన్నా వినడం లేదు.. ఇంక నేనో లెక్కా?’ అనుకుంటుంటే అంతా చక్కగా తయారై వచ్చి, బయటకు నడిచారు. వారికి అర్ధమైనా.. కాకున్నా నేను రెపరెపలాడుతూ వారికి వీడ్కోలు చెప్పాను.