Site icon Sanchika

అన్నింట అంతరాత్మ-19: అందరు మెచ్చే వాహనాన్ని.. కారును నేను!

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం కారు అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]అ[/dropcap]యిపోయింది.. అంతా అయిపోయింది. నిత్యనూతన్ గారు నన్ను అమ్మేశారు. నేనిప్పుడు శ్రీవెంకటరమణ మోటార్స్.. సెకండ్ హాండ్ కార్ డీలర్స్ కాంపౌండ్‌లో ప్రవేశించాను. అబ్బో! మావాళ్లు అనేకులు ఇక్కడున్నారు. వేర్వేరు జాతులు. మారుతి సుజుకి ఆల్టో, రెనాల్ట్ క్విడ్, మారుతి ఎస్‌ప్రెస్సో, మారుతి వాగన్ ఆర్, టాటా టొయాట, మారుతి సెలెరియో, హుండై, హుండై గ్రాండ్, వోల్స్ వ్యాగెన్, ఫోర్డ్ ఫిగో, మారుతి బాలెనో సిగ్మా.. ఇలా ఎన్నెన్నో.. అవన్నీ నన్ను చూసి పలకరింపుగా నవ్వాయి. తిరిగి నవ్వటం మర్యాద అని నాకు తెలుసు. కానీ నా మనసంతా బాధతో నిండి ఉంది అయినా తప్పదన్నట్లు నవ్వే ప్రయత్నం చేశాను. కాని సరిగా ఫలించలేదు.

“ఫర్వాలేదు సాంట్రో! మేం ఏం అనుకోంలే.. మొదట్లో మేమూ నీలాగే బాధపడ్డాం. అయినా ఒకటి ఆలోచించు.. తయారీ తర్వాత మనం అంచెలంచెలుగా మకాం మారుస్తూనే ఉన్నాం కదా. డీలర్ దగ్గర్నుంచి ఎవరో మనల్ని కొనుగోలు చేసి ఇంటికో, ఆఫీసుకో పట్టుకెళితే అదేదో మన శాశ్వత నివాసమనీ, మనమూ వారి కుటుంబంలోనో, సిబ్బందిలోనో భాగమనీ అతిగా ఊహించేసుకుంటాం. కొంతకాలానికి మనం పాతబడతాం. మనలో కొన్ని భాగాలకు మరమ్మతు అవసరమవుతుంది, కొన్నిసార్లు మరమ్మతు చేసినా వారు కోరుకున్న రీతిలో పరుగులు తీయలేం. ఇవన్నీ అలా ఉంచి, ట్రెండ్ మారిపోయిందంటూ మనం బాగానే ఉన్నా, కొత్త వాటిపై మోజుతో మనల్ని వదిలించుకునే పోకడలు.. ఏం చేస్తాం” అంది మారుతి స్విఫ్ట్.

బదులిద్దామనుకుంటే ఎవరో మనుషులు అటు వచ్చారు. దాంతో మారుతి స్విఫ్ట్ అటు ముఖం తిప్పుకుంది. నిజమే. తను చెప్పింది. తనకు ఆరోజు.. బాగా గుర్తుంది. షోరూమ్‌లో తనను చూసిన నిత్యనూతన్ కళ్లు ఎంతలా మెరిసాయో. ఎర్రని ఎరుపులో ప్రకాశిస్తున్న నన్ను చూసి ‘నాకు ఇష్టమైన రంగు’ అని నూతన్ భార్య నవ్య మురిసిపోయింది. తనకూ అదేమిటో వాళ్లపట్ల ఆత్మీయతా భావం కలిగింది. ఇంటికెళ్లాక నూతన్ అమ్మ, నాన్నలు, పిల్లలు తనను చూసి ఎంత ఆనందించారో. వినాయకుడి గుడికి తీసుకెళ్లి వాహనపూజ చేయించారు, అది మొదలు ఇంక సందడే సందడి. నిత్యనూతన్ పిల్లల్ని స్కూల్లో దింపి, భార్యను ఆమె ఆఫీసులో దింపి తను ఆఫీసుకెళ్లేవాడు. ప్రయాణమంతా మధురమైన సంగీతం.. పాటలు.. తనకు కూడా అలసట అనిపించేది కాదు. కారు మీద నూతన్, నవ్యల పేర్లు మరోవైపు పిల్లల పేర్లు కిరణ్, కీర్తి రాయించారు. అసలు పెట్రోలుతో నడిచే కారును బెంజ్ అనే ఆయన కనుగొన్నాడని నూతన్ పిల్లలకు చెపుతుంటే విన్నది. నవ్య అయితే తన చిన్నతనంలో కారు ఓ విలాస వస్తువుగా ఉండేదని, యద్దనపూడి సులోచనారాణి రాసిన సెక్రటరీ నవలలో రాజశేఖరం పడవ కారు వర్ణన చదివి తెగ ఊహించుకునే వాళ్లమని చెప్పింది.

అంతలో మనుషులంతా వెళ్లిపోయినట్లున్నారు, మారుతి స్విఫ్ట్ మళ్లీ పలకరించింది.. “ఇంతకూ ఎన్నాళ్ల అనుబంధమేమిటి?” నవ్వుతూ ప్రశ్నించింది. ‘పన్నెండేళ్లు’ అన్నా ఆలోచనగా. “అవునా.. ఏం చేస్తాం మా యజమాని కొడుకు శ్రీకృష్ణకయితే నేనంటే ఎంత ఇష్టంగా ఉండేదో. ఏమాటకామాటే.. భలే నడిపేవాడు. స్నేహితులతో పెద్ద పెద్ద మాల్స్‌కి తరచు వెళ్లడం.. పార్కింగ్ సెల్లార్‌లో ఎన్నో మలుపులు ఎంతెంతో నేర్పుగా తిప్పుతూ.. చివరకు స్థలం దొరకగానే యాహూఁ అనుకోవడం.. వాళ్ల హుషారు, సరదా, సంతోషాలు చూస్తుంటే నాకు ఎంతో ఉత్సాహంగా ఉండేది. రోజులెలా గడిచి పోయాయో.. అంతలో నా మీద మోజు పోయింది. అందులోనూ కారు లోన్లు, క్రెడిట్ కార్డులు అందుబాటులోకి రావటంతో మనల్ని మార్చడానికి వెనుకాడటం లేదు. ఇంకో సంగతి. ఈ కరోనా కాలంలో జనం బాగా ఉండే బస్సులు, రైళ్లల్లో ప్రయాణిస్తే కరోనా అంటుకునే అవకాశాలు ఎక్కువని ఎవరికి వారు సొంత వాహనంలో ప్రయాణించడం క్షేమమనే నిర్ణయానికి వచ్చి కార్లు తెగ కొనేస్తున్నారట” అంది. ఇంతలో మళ్లీ ఎవరో వచ్చారు. దాంతో మళ్లీ మౌనం దాల్చింది.

ఆలోచన ఆరంభం.. నూతన్ కుటుంబంలో నేనూ ఒక భాగం అనుకున్నా. పిల్లవాడికి దెబ్బ తగిలితే ఎంత బాధపడుతూ ఆసుపత్రికి పరుగులు తీశాను.. అలాగే రైల్లోనో, విమానంలోనో వచ్చే చుట్టాలను ఇంటికి తీసుకురావడానికి వెళ్లడాలు వాళ్లకు స్వాగతాలు, ఆత్మీయమైన కబుర్లు.. నాకూ ఏదో బంధమున్నట్లుగా సంతోషించేదాన్ని. మళ్లీ వాళ్లకు ఊళ్లోని దర్శనీయ స్థలాలు చూపించటాలు.. ఆ విహారాలు.. అబ్బబ్బ! ఒకటా, రెండా ఎన్నెన్ని అనుభవాలు.. ఎంతెంత ఆనందం! ఒకసారి తాతగారికి జబ్బుచేసింది. ఆసుపత్రిలో నెలరోజులున్నారు. రోజూ ఆసుపత్రికి వెళ్లడం.. నూతన్ వాళ్లంటే లోపలకు వెళతారు. మరి నేను మాత్రం బయటేగా.. వాళ్లు తిరిగివచ్చి ఆయన కులాసా గురించిన విషయాలు మాట్లాడుకుంటుంటే విని నిట్టూర్చేదాన్ని. ఆయనను ఇంటికి తిరిగితెచ్చే రోజున ఎంత సంతోషమనీ.. ఇన్నాళ్లకు చూడబోతున్నానని ఎంత ఆనందమో.. కానీ నా మనసు వాళ్లకు తెలిస్తేగా. షోరూమ్‌లో ఉంటే పెద్దగా విషయాలేమీ తెలిసేవి కావు కానీ నూతన్ నన్ను కొనుక్కున్నాక వాళ్లు కార్లో మాట్లాడుకునే సంభాషణల్లో ఎన్నో విషయాలు తెలిసేవి. అందులో నా గురించి కూడా అనేక ప్రస్తావనలు. ఒకసారి పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు కార్ల గురించి ఎన్నో ప్రశ్నలు వేశారు. నా గురించి అడిగేసరికి పరుగులు తీస్తూ నా విధి నిర్వర్తిస్తూనే ఓ చెవి అటు ఉంచాను. నూతన్ వాళ్ల బాబాయి కూడా వాళ్లతో పాటు ఉన్నాడు. ఆయన వారికి చెపుతుంటే విన్నా.. కార్ల్ ఫ్రెడ్రిక్ బెంజ్ అనే జర్మనీ పౌరుడు కార్ల ఆవిష్కరణలో ఆద్యుడని, ఆయన ఇంజన్ డిజైనర్, ఆటోమోటివ్ ఇంజినీర్ అని తెలిసింది. ఆయన రూపొందించిన మోటార్ కారుకు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పేటెంట్ లభించింది కాబట్టి అదే కార్ల జన్మ సంవత్సరంగా పరిగణించాలన్నారు. ఆ తర్వాత కాలంలో బెంజ్ కార్లు ఎంతో ప్రాచుర్యం పొందాయట. ఇంకో విశేషమేమిటంటే తొలిసారిగా ఎక్కువ దూరం కారును నడిపిన వ్యక్తిగా రికార్డుల కెక్కింది కార్ల్ బెంజ్ సతీమణి బెర్తా బెంజ్. ఇరవయ్యవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా కార్లు వినియోగానికి అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఒకప్పుడు మనదేశంలో మారిస్ మైనర్, ఫియట్, అంబాసిడర్, ప్లిమత్ కార్లు ఎక్కువగా వాడేవారు. ప్లిమత్ అయితే పడవంత పెద్దకారు. కార్లలో పెట్రోలుతో నడిచేవి మాత్రమే కాదు, డీజిల్‌తో నడిచేవీ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లు రానే వచ్చాయి. బ్యాటరీ కార్లు, సోలార్ కార్లు కూడా మున్ముందు పాపులర్ అవుతాయట. ఇదే అనుకుంటే ఎగిరే కార్లు కూడా వస్తున్నాయని ఆయన చెప్పటంతో నేను ఆశ్చర్యపోయాను.

‘ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ కార్లు వాడకంలో ఉన్నాయని, చైనా, ఇండియాలతో పాటు పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్న ఇతర దేశాలలో కూడా కార్ల వినియోగం మరింతగా పెరిగిపోతోందని నూతన్ చెప్పాడు’ అనుకుంటుండగానే ఇటునుంచి హుండై గ్రాండ్ ‘హలో’ అంటూ పలకరించింది. అటుచూసి చిరునవ్వు నవ్వాను.

“ఇంకా మీ యజమాని వాళ్ల గురించే ఆలోచిస్తున్నావా?” అంది. నా పిచ్చిగానీ నేను మాత్రం ఆ సంగతుల్ని మరిచిపోతే కదా.. జ్ఞాపకాలు ఓ పట్టాన వదలవు. హాయిగా చక్కని పాటలు వింటూ, వాళ్ల కబుర్లు వింటూ పరుగులు తీసేదాన్ని. చాలా పెళ్లిళ్లకు కూడా నన్ను వాడారు. అబ్బో! అప్పుడు నాకెంత షోకు చేశారో. ఎర్రటి గులాబీల అలంకరణలో నాకు నేనే ముద్దిచ్చేదాన్ని. పెళ్లి వారిని తీసుకెళ్లడం అదో దర్జా. వధూవరుల ఊరేగింపులో మెల్లగా నడుస్తూ, మధ్యలో ఆగుతూ.. నా ముందు బ్యాండ్ మేళాలు, నృత్యాలు.. ఒహ్ ఎంత సరదాగా ఉండేదో. ఇక పిక్నిక్ లకు, విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఆ జోష్ వేరు.

“అన్నట్లు మనలోనూ సంపన్నులున్నారట. వారిని లగ్జరీ కార్లు అంటారని అప్పట్లో మా యజమానివాళ్లు అనుకుంటుంటే విన్నాను. అదేమిటబ్బా.. ఆఁ రోల్స్ రాయిస్ కారయితే కోట్ల రూపాయలు పలుకుతుందట. డబ్బున్నా అది వెంటనే అందే కారు కాదట. బుక్ చేసుకుంటే ఓ ఏడాది తర్వాత కానీ కొనుగోలుదారుడికి అందదట. దాని రంగులు, ఆ ఠీవి.. దాని రూటే సపరేటని అనుకున్నారు. ఇప్పుడు ధనికులు ఆడీ కారంటే తెగ మోజు పడుతున్నారట. ఇలా ఎన్నో పేర్లు చెప్పారులే. నీకో విషయం తెలుసా? కారు నంబరు మాకు ఇది కావాలని కొనుగోలుదారుడు అడిగే వీలుందట. కొన్ని నంబర్లు కావాలంటే ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుందట.

అన్నట్లు మేం ఓసారి జూపార్క్ దగ్గరున్న ‘సుధా కార్స్ మ్యూజియం’కు వెళ్లాం. నేను ఎలాగూ బయటే పార్కింగ్‌లో ఉన్నాను కానీ వాళ్ళొచ్చి దాని గురించి చెపుతుంటే భలే ఆశ్చర్యం వేసింది. ఆ రకం కార్ మ్యూజియం ప్రపంచంలో ఇదొక్కటేట. కె.సుధాకర్ అనే ఆయన హాబీగా తన స్కూలు రోజు లనుంచి ఎన్నో ఏళ్లపాటు రకరకాల వస్తువుల ఆకారాలలో కార్లను తయారు చేశారని, చేస్తున్నారని.. రెండువేలపది సంవత్సరంలో వాటితోనే ఆ మ్యూజియం ఏర్పాటు చేశారని చెప్పారు అవన్నీ ఎంతో తమాషాగా ఉన్నాయని చెప్పుకున్నారు. హ్యాండ్ బ్యాగ్, లిప్ స్టిక్, పెన్ను, పుస్తకం, పెన్సిల్, రబ్బర్,బూటు, హెల్మెట్, కెమెరా, మంచం, బర్గర్, శివలింగం, కంప్యూటర్, ఆకారాలలో ఆ కార్లు ఉన్నాయని, అవన్నీ చేత్తో తయారు చేసినవని విని ఎంత ఆశ్చర్యపోయానో.. ఈలోకంలో ఎన్నెన్ని వింతలో. అడపాతడపా సందర్భాలను పురస్కరించుకుని వాటిని రోడ్ షోల కోసం మ్యూజియం నుంచి బయటకు తెస్తారని చెప్పారు. అంతేకాదు ఈ మధ్య సుధాకర్ గారు కరోనా పట్ల ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం కోసం తన వంతు బాధ్యతగా ‘కరోనా కారు’ (వైరస్ ఆకారంలో)ను కూడా రూపొందించారని, కొద్దికాలంలో పూనే సమీపంలోని లోనావాలాలో ఇటువంటిదే మరో మ్యూజియం ఏర్పాటు చేస్తారని చెప్పారు” అని ఆగింది.

అది వింటుంటే నాకూ ఎంతో గమ్మత్తుగా అనిపించింది. “భలే విషయం చెప్పావు హండై గ్రాండ్! మన ప్రపంచం చాలా పెద్దది, గొప్పదన్నమాట” అన్నాను. “అవును. హమ్ కిసీ సే కమ్ నహీ’ అంది గర్వంగా తన హిందీ పరిజ్ఞానం ఒలక బోస్తూ. నాకూ కాస్తో కూస్తో హిందీ ముక్కలు తెలుసు. ఎందుకంటే నూతన్ వాళ్లు కూడా అప్పుడప్పుడు మాటల మధ్యలో హిందీ ముక్కలు చేర్చేవాళ్లు. అంతలో హుండై గ్రాండ్ ‘నిజానికి ఈ మనుషుల కంటే మనమే నయం. వాళ్ల గురించి ఇంతగా ఆలోచిస్తున్నా మంటే మన మనసే కల్లాకపటం లేనిది. మా యజమాని విశాల్ అయితే తన అమ్మగారు మంచంపట్టగానే తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చాడు. ఆమెను అక్కడకు తీసుకెళ్తుంటే నాకు ఎంత బాధేసిందో. ఆ పని నాకసలు నచ్చలేదు. ఆ పాపంలో నా పాత్ర కూడానా.. అనుకుంటే విపరీతమైన బాధ.. నా బాధకు చక్రాలు కదలనన్నాయి. విశాల్ కిందికి దిగి, అంతా పరీక్షించి ‘అంతా బాగానే ఉందే.. మరి ఏం మాయరోగం.. ఏంచేస్తాం..’ అంటూ కార్ రిపేరింగ్ వాళ్లకు ఫోన్ చేసి, వారి మనిషి రాగానే నన్ను అప్పజెప్పి, అతను మరో టాక్సీ మాట్లాడుకుని అమ్మను తీసుకెళ్లాడు. వెళ్లిపోతున్న ఆమె వంక దీనంగా చూడటం తప్ప ఏం చేయగలను?” ఆ రోజును గుర్తు చేసుకుంటూ మళ్లీ బాధపడింది. అది విని నాకూ బాధేసింది. దాన్ని ఓదారుస్తూ “అందుకు నువ్వేం చేయగలవు. బాధపడకు, ఊరుకో” అన్నాను. ఇంతలో ఎవరో అటు రావడంతో మళ్లీ నిశ్శబ్దం.

నిజమే. మనిషికి ఎంతో తెలివి ఉంది. ఎంతో శక్తి ఉంది. రకరకాల కార్లను తయారు చేయడమే కాదు, ప్రమాదాల్లో ప్రాణరక్షణ కోసం కార్లలో ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు కూడా చేసుకున్నాడు. ప్రభుత్వాధినేతలు, ప్రముఖ రాజకీయ నాయకుల కోసం బుల్లెట్ ప్రూఫ్ కారు సృష్టించాడు. అన్నట్లు రానున్న కాలంలో మనిషి, తను స్వయంగా కారును నడిపే అవసరం లేకుండా, వాటంతట అవే నడిచే సాంకేతికతో కార్లను రూపొందిస్తున్నాడట.

కానీ మంచి, చెడు విచక్షణలో మాత్రం తరచు చెడువైపే మొగ్గుతున్నాడు. నూతన్ కుటుంబం అనేకరకాల విషయాలు చర్చించుకునేవాళ్లు. ప్రభుత్వాధికారులు తమ కార్లను వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం, దానికి సంబంధించి తప్పుడు లెక్కలు చూపడం గురించి చెపుతుంటే విని.. ‘అవినీతి మా కార్ల చుట్టూ కూడా తిరుగుతుందన్నమాట’ అనుకున్నాను. అలాగే అమిత వేగంతో కారు నడిపి ప్రమాదాలను కొనితెచ్చుకోవడం గురించి ఓసారి మాట్లాడుకున్నారు. ఓ రాజకీయ నాయకుడి కొడుకు తాగి కారు నడపటం, ఆ మత్తులో ప్రమాదం జరిగి అవతలి కారులోని తల్లీ, బిడ్డ మరణించడం.. వింటుంటే ఎంత బాధేసిందో.. ఇంక మరికొందరు కిరాయి రౌడీలు డబ్బుకోసం ప్రమాదం రూపంలో హత్యలు చేయడం, ఇంకొందరు నీచులు కార్లలోనే అమ్మాయిలపై అత్యాచారాలు చేయడం, చంపడం, ఆ కారులోనే తీసుకెళ్లి శవాన్ని తగలేయడం, కొన్నిసార్లు కారును కూడా తగలేయడం, నీటి ప్రవాహంలో పడేయడం.. ఎంత అమానుషం. కొంతమంది ప్రబుద్ధులు బీమా డబ్బులొస్తాయని కార్లను తగలేస్తారట. అలాగే రాజకీయ నాయకుల పట్ల నిరసన తెలిపే సందర్భాల్లో కార్లపై రాళ్లు వేయడం, శత్రువుల కార్లను అగ్నికి ఆహుతి చేయడం, ఉగ్రవాదులు కారు బాంబులతో హింసాకాండకు పాల్పడడం.. ఎంత అన్యాయం! ఈ మనుషులకు నా మాటగా కొన్ని విషయాలు చెప్పాలని ఉంది. అది.. ఎంత సేవ అయినా చేయడానికి మేం సిద్ధం. కానీ మమ్మల్ని అడ్డం పెట్టుకుని కావాలని ప్రమాదాలు చేసి, మనుషుల్ని హతం చేయడం, అత్యాచారాలు చేయడం వంటి పనులు చేయవద్దని. అలాగే స్పోర్ట్స్ కార్లతో మితిమీరిన వేగంతో పోటీలు పడి ప్రాణాల మీదకు తెచ్చుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని. వినేదెవరు? ఇంతకూ నన్ను మళ్లీ ఎవరు కొనుక్కుంటారో ఏమో. మంచి యజమాని అయితే బాగుండు. లేదంటే నేను అన్యాయాల్లో భాగాన్నవుతా. దేవుడా! ఈ కారు మనవి నీవైనా ఆలకించు అనుకుంటుంటే వరుణుడు కరుణించి, చిరుజల్లులు మొదలయ్యాయి… వేదన మరచి సేద తీరుతున్నా.

Exit mobile version