అన్నింట అంతరాత్మ-2: అబద్ధమెరుగనిదాన్ని.. అద్దాన్ని!

8
2

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ఓ అద్దం అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]అ[/dropcap]లేఖ్య నా ముందునుంచి కదలటమే లేదు. నాలోకి పదేపదే తొంగితొంగి చూస్తోంది. ముస్తాబంతా నా ముందరే. క్రీములు, పౌడర్లు, బిందీ, ఐల్యాష్ వగైరాలయ్యాక పెదవులకు లిప్‍స్టిక్ అద్దుకుని చెవుల హ్యాంగింగ్స్ మార్చుకుని, హెయిర్ స్టయిల్ సరిచేసుకుని, డ్రెస్‌ను అటు, ఇటు తిరిగి చూసుకుని అబ్బ! ఎంత శ్రద్ధో. ఒకటి మాత్రం నిజం, అలేఖ్య అందం చూస్తే అద్దాన్ని నాకే ముచ్చటేస్తుంది. ‘అద్దం అబద్ధం చెప్పదు’ అని అందరూ ఏనాడో అంగీకరించారు. ఈ ఇంట్లో నిలువుటద్దాన్ని నేనే. ఇంటి కోడలు కోమలికి ఈమధ్య రెండు,మూడు వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఎవరూ చూడకుండా నాముందు కూర్చుని వాటిని పెరికివేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో ఎవరో ఒకరు ఆ పనికి భంగం కలిగిస్తుంటారు. మధ్యాహ్నం పూట చిన్నారి చోటీ వచ్చి నా ముందు కూర్చుని నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ ఆడుకుంటుంది. ఆ పైన పౌడర్ డబ్బా తీసి ముఖమంతా పట్టించుకుంటుంది. అప్పుడు నా పైన కూడా పౌడర్ పడుతుంది. ఇంతలో వాళ్లమ్మ కోమలి వచ్చి ‘చోటీ! ఎన్నిసార్లు చెప్పాను పౌడర్ డబ్బా తీయొద్దని, ముఖమంతా అంత పౌడరా? అంటూ చోటీ ముఖం తుడిచి, ‘అరె, అద్దమంతా కూడా పౌడరే’ అంటూ నన్ను కూడా తుడుస్తుంది. దాంతో నేను మళ్లీ యథాతథంగా మెరిసిపోతాను.

అంతలో పిచ్చుకలు ఇంట్లోకి వచ్చేసి, అటు, ఇటు ఎగురుతూ, గొడవ గొడవ చేసేస్తూండగా మధ్యలో వాటిచూపు నాపై పడుతుంది. తమ ప్రతిబింబాన్ని చూసి అవి శత్రువు లనుకుంటాయో, ఏమనుకుంటాయో గానీ తమ ముక్కుతో నన్ను తెగ పొడిచేస్తాయి. చక్కగా తమ సౌందర్యాన్ని చూసుకోక నన్ను ముక్కుతో పొడిచే వాటిని చూస్తే వాటి అమాయకత్వానికి చెప్పొద్దూ నాకు తెగ జాలివేస్తుంది. ఇంకా నా తోబుట్టువులు అన్ని గదుల్లో, హాల్లో, వాష్‌బేసిన్ దగ్గర, బాత్ రూమ్‌ల్లోనూ ఉన్నాయి. ఈ ఇంటా, ఆ ఇంటా అనేమిటి ప్రతి ఇంటా నేను ఉండాల్సిందే. పూరి గుడిసె అయినా చిన్న గానో, పెద్దగానో వేర్వేరు ఆకారాల్లో నేనుంటాను. ఆమాటకొస్తే ఇళ్ల లోనే కాదు, బ్యూటీ పార్లర్లలో, సెలూన్లలో ఆఫీసుల్లో, హెూటళ్లలో, రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూముల్లో, సినిమా హాళ్లలో ఇందు గలదందులేదని సందేహము వలదు అద్దమును నేను ఎందెందు వెదకిచూచిన అందందేగలను.. బైక్స్‌కు కూడా అద్దం ఉంటుందిగా, కుర్రకారు దాన్లో చూసుకుంటూ క్రాఫ్ తెగ దువ్వుకుంటుంటారు. అన్నట్లు ఆడవాళ్ల బ్యాగుల్లో అయితే తప్పకుండా ఉంటాను. ఫొటో స్టూడియోలలో కూడా మేం కొలువుతీరాం. పిల్లలకు పూల జడ ఫొటో అయితే నా పాత్ర మరీ ఎక్కువగా ఉంటుంది. ఇక కేరళలో అయితే చాలామంది హిందువుల ఇళ్లలో మెటల్‌తో తయారైన గుండ్రని అద్దాలు, హ్యాండిల్‌తో ఉన్నవి ఉంటాయి.

మలయాళీల ఉగాది ‘విషు’ రోజున పవిత్రమైన వస్తువులను చూసే ఆచారం ఉంది. పిల్లల కళ్లకు గంతలు కట్టి పూజగదిలోకి పంపుతారు. అక్కడ ఉండే వస్తువులలో అద్దం (వల్‌కన్నడి) కూడా ఉంటుంది. కళ్లు తెరవగానే వాటిని చూస్తే శుభప్రదమని, అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. ప్రతి తల్లి, తన కుమార్తెకు పెళ్లి రోజున గుండ్రటి అద్దాన్ని (వల్‌కన్నడి) ఇవ్వడం అక్కడి సంప్రదాయం. అలనాడు బాల రాముడు ఆకాశంలోని చంద్రుడు కావాలని మారాం చేస్తే నన్ను ముందుంచే కదా మరిపించారు. అన్నట్లు మనుషులకే కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి కూడా అద్దంలో చూసుకోవాలనిపిస్తుందట, ఆ మధ్య తాతగారు, బామ్మగారితో చెపుతుంటే విన్నాను. అయితే భగవానుడికి అలా అనిపించినపుడు ఆయన గరుడుడికేసి చూస్తాడని, ఎందుకంటే వేదాల అవతారమే గరుడుడు కాబట్టి నారాయణుడు తనను తాను గరుడుడిలో చూసుకుంటాడని, అన్ని వైష్ణవాలయాలలో గరుత్మంతుడు ద్వారం ముందరే ఉండటం తెలిసిందేకదా అని అన్నారు. అన్నట్లు నేను గట్టిగానే ఉన్నట్లనిపించినా నాది సున్ని’తత్వం’. ఏపాటి దెబ్బలు తట్టుకోలేను. కిందపడ్డానో అంతే సంగతులు.. నా పని గోవిందా. ముక్కలు ముక్కలయి పోతాను. అలా బద్దలయి పోయిన మావాళ్లెందరో లెక్కే లేదు. మొన్నటికి మొన్న ఇంట్లో చిన్నూగాడి చేయి జారి మా తోబుట్టువు అద్దమొకటి భళ్లుమంది. అదలా బద్దలయిపోయి బాధపడుతుంటే, కోడలు కోమలి ‘ఇంట్లో పగిలిన అద్దం ఉంటే అశుభం’ అంటూ ఎత్తి చెత్తలో పడేసింది. అది చూసి నా మనసు ముక్కలయింది. ఇక్కడ మరో విషయం గమనించాను. మేం పగిలినపుడు ఎవరైనా ఆ ముక్కల్ని తొక్కినా, అజాగ్రత్తగా పట్టుకున్నా వాళ్లు గాయపడతారు. అందులో మా తప్పేం ఉంది, తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సింది మనుషులేకదా. అయితే నేను బద్దలైనా దుర్మార్గులను హతం చేయడానికి ఆయుధంగా పనికొస్తాను. ఓ సినిమాలో హీరోయిన్ పగిలిన, వాడి అద్దం ముక్కతో బలాత్కారం చేయబోతున్న దుర్మార్గుడిని తీవ్రంగా గాయపరచి తనను తాను రక్షించుకుంది. ఆ రకంగా ఉప యోగపడటం కూడా మా ప్రత్యేకతే కదా.

మొన్న నా పుట్టుక గురించి చిన్నూకి, తాతగారు చెపుతుంటే విన్నాను.. మా ప్రాచీనులు గ్రీకుల కాలంలోనే ఉన్నారట. చేతి అద్దాలు అలనాడే ఉన్నట్లు తవ్వకాలలో దొరికిన మట్టి పాత్రల పైని చిత్రాలవల్ల తెలిసిందట. చరిత్ర ప్రకారం తొలి అద్దాన్ని జస్టస్‌వాన్ లీ బిగ్ అనే ఆయన రూపొందించాడని, ఆ తర్వాత జర్మన్ కెమిస్ట్ ఒకాయన అద్దానికి ఓవైపు మెటాలిక్ సిల్వర్ పూత పూశాడనీ, అధునాతన అద్దంగా పంధొమ్మిదో శతాబ్దిలో ఆవిష్కృతమయ్యాననీ చెప్పారు. చితోడ్‌గఢ్ చరిత్రలోనూ నా ప్రస్తావన ఉంది మరి. రాజా రతన్ సింగ్, అత్యంత సౌందర్యవతి అయిన తన రాణి పద్మావతిని, శత్రువు అల్లాఉద్దీన్ ఖిల్జీ చూస్తానంటే తప్పనిసరి పరిస్థితులలో ఒప్పుకోవలసి వచ్చింది. అప్పుడు అద్దం ఏర్పాటు చేసే, రాణి పద్మినిని, అతడికి చూపించాడు. దుష్టుడైన అల్లాఉద్దీన్ ఖిల్జీ అద్దంలోని ఆమె ప్రతిబింబాన్ని చూసి మోహించి, ఆమెను తన సొంతం చేసుకు తీరాలనుకున్నాడు.

నన్ను ఉపయోగించే అలనాడు మహారాజులెందరో అద్దాల మహళ్లు నిర్మింపజేశారు. భారతదేశంలో అయితే మచ్చుకు చెప్పాలంటే అయిదు అద్దాల మహళ్లు ఉన్నాయి, అవి ఆగ్రా కోటలోని శీష్ మహల్, జైపూర్‌లో అమర్‌ఫోర్ట్ లోని శీష్ మహల్, భుజ్ లోని ఐనా మహల్, మెహరన్ ఘర్ కోటలోని శీష్ మహల్, పాటియాలాలోని శీష్ మహల్. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఆయా దేవుళ్లకు సంబంధించిన అద్దాల మందిరాలు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉండటం తెలిసిందే. దేవుడి ప్రతిరూపాన్ని అనేక అద్దాలలో ఒకే చోట తిలకిస్తూ భక్తులు ఆనందానుభూతికి లోనవుతుంటారు.

కేవలం ప్రతిబింబాన్ని చూపే అద్దంగానే కాదు, దృష్టిదోషాలున్న వారికి అంటే హ్రస్వ, దీర్ఘ దృష్టి కలవారికి కంటి అద్దాలుగా కూడా రూపొందుతాను. మరీ పవర్ ఎక్కువుంటే చాలా మందపాటి అద్దాలను కంటి డాక్టరు సూచిస్తారు. వాటిని సోడాబుడ్డి కళ్లద్దాలు అనటం కూడా పరిపాటే. అయితే ఇటీవల ఫైబర్ గ్లాస్ వచ్చాక అచ్చమైన అద్దాన్ని కళ్లద్దాలకు వాడటం తగ్గిపోయింది. ఏం చేస్తాం, కాలమహిమ! ఇంటి కిటికీలకు, బస్సు కిటికీలకు, రైలు కిటికీలకు, కార్లకు అద్దాలు ఉండనే ఉంటాయి. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేవారు దారిపొడుగునా ప్రకృతి దృశ్యాలను వీక్షించడానికి కిటికీ పక్క సీటు కావాలని ఎంతగా కోరుకుంటారో నాకు తెలియంది కాదు. కిటికీ అద్దాన్ని మూసి ఉంచి, దాన్నుంచి ఎంచక్కా బయటి దృశ్యాలను వీక్షించడం వారికెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. బస్సుకు, కారుకు వెనకనుంచి వచ్చే వాహనాలు, వాహన చోదకుడికి కనిపించేందుకు వీలుగా కుంభాకార కటకాలు(అద్దాలు) ఏర్పాటు చేస్తారు. ఇక దుస్తులపై చిన్నిచిన్ని అద్దాల డిజైన్లు వేసుకోవడం ఏనాటినుంచో ఉన్న అభిరుచి. అలాగే మహిళలు ధరించే లక్కగాజులు, పాస్టిక్ గాజులు, దంతపుగాజులు వగైరాలకు చిన్నిచిన్ని అద్దంముక్కల్ని అతికించి, ముచ్చట గొలిపేలా రూపొందిస్తారు. బొమ్మలు తదితర కళాత్మక వస్తువుల తయారీలో అద్దం వాడకం విరివిగానే ఉంటుంది. అన్నట్లు మా తాతగారు ‘భూతద్దంగారు’ చాలా ప్రత్యేకమైన వారు. భూతద్దంలో చూస్తే చిన్న వస్తువులు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. ఇక ప్రయోగ శాలల్లోనూ సూక్ష్మజీవుల్ని మొదలైన వాటిని చూసేందుకు మైక్రో స్కోపులకు అమర్చేది ప్రత్యేక అద్దాన్నే. అంతేకాదు, ప్రయోగాలలో ప్రత్యేక అద్దాలు ఎన్నోరకాలుగా ఉపయోగ పడుతుంటాయి.

నేను నూటికి నూరుపాళ్లు సత్యవాదిని. ఉన్నది ఉన్నట్లు చూపడమే నా స్వభావం. యదార్థవాది లోకవిరోధి అని తాతగారు సామెత చెప్పగా విన్నాను. అది నాపట్ల ఎంతో నిజం. కొందరు తాము అందంగా లేకపోయినా, వారిని నేను అందంగా చూపలేదని, అది నా తప్పుగా భావించి నన్ను విసిరేస్తుంటారు. అన్నట్లు ‘స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్’ కథలో నా నిజాయితీని ఎంత చక్కగా చిత్రించారో. అందులోని మాయా అద్దం, మాట్లాడే అద్దం కూడా కావటం ఎంత గొప్ప! కపట రాణి మాయా అద్దాన్ని “ఈ ప్రపంచంలోనే గొప్ప అందగత్తె ఎవరు?” అని అడిగితే “మీరు అందంగానే ఉన్నా, మీకన్నా స్నోవైట్ వెయ్యిరెట్లు అందగత్తె” అని మాయా అద్దం బదులిచ్చింది. దాంతో కపట రాణి అసూయాద్వేషాలతో స్నోవైట్‌ను అడవికి తీసుకెళ్లి చంపి, ఆమె గుండె కాయను ఆనవాలుగా తీసుకురమ్మని సేవకుడిని ఆజ్ఞాపించిం ది. కానీ ఆ సేవకుడు ఆమెను చంపలేక అడవిలో వదిలేసి, ఓ జంతువు గుండెకాయను తీసుకెళ్లి కపట రాణికి చూపాడు. ఆ తర్వాత స్నోవైట్ అడవిలో కనిపించిన ఓ మరుగుజ్జుల ఇంట్లో ఉండసాగింది. కపట రాణి మళ్లీ మాయా అద్దాన్ని “ఈ ప్రపంచంలో అత్యంత సౌందర్యవతి ఎవరు?” అని ప్రశ్నించినా అది మళ్లీ “మీరు అందంగానే ఉన్నా, స్నోవైట్ మీకన్నా అందగత్తె” అని బదులిచ్చింది. అలా చివరివరకు నిజాన్నే వక్కాణించిన మాయా అద్దం గొప్పదికదూ. అన్నట్లు మాయా అద్దాలలో శక్తిమంతమైనవి కూడా ఉన్నాయి. చైనాలో కిన్ వంశానికి చెందిన తొలి చక్రవర్తి కిన్ షి హువాంగ్ తన దగ్గరున్న మాయా అద్దం కారణంగానే ఇతరుల దుష్టపు ఆలోచనలను పసిగట్టి, వారి ఆటకట్టించాడు. ఇక అందంగా లేని వాళ్లు, అందంగా ఉన్న వాళ్లను ప్రేమించిన సందర్భాల్లో కొన్ని సార్లు అవతలి వ్యక్తి ‘అద్దంలో నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా’ అని అంటుంటారు. అలాంటి మాటలను నేను అస్సలు హర్షించను. నాలో ప్రతిబింబించే ఓ వ్యక్తి బాహ్యసౌందర్యం కన్నా, నాకు అందని సదరు వ్యక్తి ఆంతరంగిక సౌందర్యమే గొప్పదని నేను భావిస్తాను. నా రూపమే కాదు, మనసూ స్వచ్ఛంగా ఉంటుంది. అయితే మనుషులే నిర్లక్ష్యంగా నాకు మకిలి పట్టిస్తుంటారు. దాంతో మసకేసిపోతాను. వారి ప్రతిబింబం మసకగా కనిపించినపుడుకానీ నన్ను శుభ్రం చేయాలని వారికి తోచదు. అయితే ఆ విషయం మనుషులకు తెలియదు. మంచి మనుషుల మనసులు కూడా సున్నితంగా ఉంటాయి. తాము ప్రేమించిన వ్యక్తులు, తమను నిర్లక్ష్యం చేస్తే, తిరస్కరిస్తే వారి మనసు అద్దం లానే ముక్కలవుతుంది. అది తిరిగి అతకనే అతకదు. అలాగే మొన్న టీవీలో ఓ సినిమా పాట విన్నాను.. ‘అందమైన జీవితము, అద్దాల సౌధము, చిన్నరాయి విసిరినా చెదరిపోవును, ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును..’ అంటూ జీవితమే అద్దాలమేడ అంది. ఈ మనుషులకు ఓ విషయం మనవి చేయాలనిపిస్తుంది. అదేమిటంటే ‘మీ అంతరంగాలను అద్దంలా అంటే నాలాగా శుభ్రంగా ఉంచుకోమని.. స్వార్థం, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలతో మనసును మలినం చేసుకోవద్ద’ని. మరో విషయం ఏమిటంటే సమ్మెలు, దాడులు వంటివాటిలో మనుషులు తమ ప్రతాపమంతా మామీదే చూపించి కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు రాలతో పగల గొడుతుంటారు. మధ్యలో మేమేంపాపం చేశామనో. అప్పుడు మేమెంత బాధపడతామో అర్థం చేసుకోమని. ఇంకో విషయం ఏమిటంటే కొంతమంది నా ముందే గంటలు గంటలు బైఠాయించి తమ మోమును పదేపదే చూసుకుంటూ, కాలం వ్యర్థం చేసుకుంటుంటారు. నా వల్ల వారు విలువైన కాలాన్ని కోల్పోతున్నారనుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఈ విషయం కూడా వారు తెలుసుకుంటే ఎంత బాగుండు! స్వగతంలో మునిగి నాకు కాలమే తెలీలేదు. అయ్యబాబోయ్! అప్పుడే సాయంత్రమయినట్లుంది. అన్నట్లు ఇవాళ వీళ్లంతా బర్త్ డే పార్టీకి వెళ్లాలి కాబోలు. అంతా నా ముందు, నా తోబుట్టువుల ముందు చేరుతున్నారు. నేనింక ప్రతిబింబించే పనిలో బిజీ..బిజీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here