Site icon Sanchika

అన్నింట అంతరాత్మ-23: బహుళ ప్రయోజనకారి ‘బల్లను’ నేను!

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం బల్ల అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]రా[/dropcap]త్రి.. సమయం రెండు గంటలు అవుతోంది. రచయిత వాణీనాథంగారి కళ్లు మూతలు పడుతున్నాయి. మెల్లగా నా మీదకు ఒరిగిపోయాడు. ఈ అక్షర ప్రేమికుడంటే నాకు ఎంతో ప్రేమ. అలాగే నేనంటే (బల్లను) ఆయనకూ ఎంతో ఇష్టం. ఎవరినీ నన్ను తాకనీయడు. ఇంట్లో వాళ్లంతా నన్ను టేబుల్ అనే అంటారు. అది ఇంగ్లీషు పదమైనా తెలుగు భాషలో కలిసిపోయింది కాబట్టి ఎక్కువ మంది ‘టేబుల్’ అనే అంటారు. అంతెందుకు, వాణీనాథం గారు కూడా ఆయన రచనల్లో నా ప్రస్తావన వస్తే ‘టేబుల్’ అనే రాస్తారు.

ఈ ఇంట్లో మా జాతి వాళ్లు ఇంకా అనేకమంది ఉన్నారు. పాత కాలం నాటి వస్తువులంటే వాణీనాథంగారికి ఎంతో మక్కువ. అందుకే హాల్లో ఉన్న ఉయ్యాల బల్లను అలాగే ఉంచారు. పిల్లల గదిలో చదువుకోవడానికి స్టడీ టేబుల్ ఉంది. భోజనాల గదిలో డైనింగ్ టేబుల్ ఉండనే ఉంది. పెరట్లో మొజాయిక్ రౌండ్ టేబుల్, కుర్చీలు ఉన్నాయి. నా సొరుగుల్లో ఏవేవో కాగితాలు, ఫైళ్లు, పెన్నులు.. పక్కనే ఓ పుస్తకాల బీరువా. నా పక్కనే ఓ ప్లాస్టిక్ చెత్త బుట్ట. వాణీనాథంగారికి రాసింది ఏ మాత్రం నచ్చకపోయినా వెంటనే ఉండచుట్టి చెత్తబుట్టలో పడేస్తుంటారు. ఇంతలో డైనింగ్ టేబుల్ ‘హలో’ అని పిలిచింది. అటు చూశాను.

‘నీకు చక్కగా పొద్దు పోతుంది. రచయితగారు రోజులో ఎక్కువ సేపు నీ దగ్గరే ఉంటారు కదా’ అంది. ‘భోజనాల బల్లవు. నీకు మాత్రం ఏం తక్కువ? ఎప్పుడూ పాత్రలతో కళకళలాడుతుంటావు’ అన్నాను. ‘ఆఁ గిన్నెలుంటే చాలా? మనుషులు చుట్టూ చేరితే కదా సందడి. ఏదో ఆదివారం రచయితగారి మాట కాదనలేక అందరూ నా దగ్గర చేరి భోజనం చేస్తారు.. మిగతా రోజుల్లో ఎవరి గదుల్లో వాళ్లే. ఒకవేళ నా దగ్గర కూర్చునే తిన్నా ఎవరి మొబైల్లో వారు కళ్లప్పగించి లేదా మాట్లాడుతూ తమ లోకంలో తాముంటారు’ నిరాశగా అంది డైనింగ్ టేబుల్.

ఇంతలో పిల్లల గదిలోని స్టడీ టేబుల్ ‘హలో మిత్రులారా! మీరిద్దరే కబుర్లు చెప్పుకుంటారా, నా మాటా వినండి..’ అంటూ ‘నాకు మాత్రం సందడికేం తక్కువ లేదు. కరోనా సమయంలో కూడా పిల్లలు మొబైల్స్‌తో, ల్యాప్‌టాప్‌లతో నా దగ్గరే కూర్చున్నారు. పైగా బడిలో తమ బల్లలను తరచు తలచుకున్నారు. తమ టేబుల్ మీద సరదాగా వేసిన బొమ్మలను, రాసిన పేర్లను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ టేబుల్స్ అన్నీ దుమ్ముకొట్టుకుపోయుంటాయని దిగులు పడ్డారు. మళ్లీ ఈ మధ్యనే బడులకు వెళ్తున్నారుగా.. మళ్లీ వాళ్ల ముఖాల్లో హుషారు వచ్చింది’ చెప్పింది.

‘బాగుంది. అయినా మన జాతి లేని చోటే లేదంటే అతిశయోక్తి కాదు, బడి మాత్రమే కాదు, ఆఫీసులు, హోటళ్లు, బార్లు, శాససన సభలు, కోర్టులు, షాపులు.. ఇలా ఎందెందు వెదకి చూచిన అందందే గలం మనం’ అన్నాను నేను. ‘అబ్బో! రచయిత గారి సహవాస భాగ్యం కాబోలు, నీకూ కవిత్వం వస్తోంది’ అంది డైనింగ్ టేబుల్.

‘అన్నట్లు అంతర్జాతీయ రాజకీయ సమావేశాల్లోనూ మనది ప్రముఖ పాత్రే. ఆ మధ్య టీవీలో చూశాను.. భారత స్వాతంత్ర్య సమర కాలంలో భారత స్వపరిపాలనా విషయాలను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం, లండన్లో ఏర్పాటు చేసిన రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీగారు కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా పాల్గొన్నారట’ చెప్పాను.

‘బాగుంది. మీకు తెలుసో లేదోగానీ కొన్ని వస్తువులకు ముందర మన పేరు తోడయి ఉంటుంది. టేబుల్ క్లాత్, టేబుల్ సాల్ట్, టేబుల్ స్పూన్.. నాకెంతో గర్వంగా అనిపిస్తుంది’ అంది డైనింగ్ టేబుల్. ‘టేబుల్ సాల్ట్’ అంటే ఏమిటో?’ అన్నాను నేను. ‘నాకు తెలుసు. పిల్లలు చెప్పుకోగా విన్నాను. అందులో అత్యధిక శాతం సోడియం క్లోరైడ్ ఉంటుందట. ఇక టేబుల్ స్పూన్ అంటే స్పూన్ కన్నా పెద్దది, గరిటెకన్నా చిన్నది. వంటల్లో వాడే పదార్థాల కొలతల్లో ఈ టేబుల్ స్పూన్ పదం ఎక్కువ వాడుతుంటారు. అంతేకాదు టేబుల్ దగ్గర మెలగవలసిన తీరుని ‘టేబుల్ మ్యానర్స్ అంటారు’ వివరించింది స్టడీ టేబుల్.

‘బాగా చెప్పావు. మొత్తానికి స్టడీ టేబుల్ పేరును సార్థకం చేసుకున్నావు అంది డైనింగ్ టేబుల్. అంతలో పక్క గదిలోంచి ‘మీరెవ్వరూ నా సాటి రారు. కంప్యూటర్‌తో పని చేసుకోవడానికి అనువుగా ఎంత స్టైలిష్‌గా ఉన్నానో చూడండి. పార్థు నన్ను ఏరికోరి ఎంపిక చేసుకొని కొన్నారు’ గొప్పలు పోయింది కంప్యూటర్ టేబుల్. అందరూ చిన్నగా నవ్వారు.

‘ఎవరి ప్రత్యేకత వారిది, నీ దగ్గర నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కమ్మగా భోజనం చేయలేరు కదా’ అంది డైనింగ్ టేబుల్, కంప్యూటర్ టేబుల్ గాలి తీసేస్తూ. దాంతో అది ముఖం ముడుచుకు మౌనం వహించింది. ‘సర్లే, మనలో మనం పోట్లాడు కోవడం ఎందుకు, కలసి ఉంటే కలదు సుఖం’ అన్నాను నేను. ‘అంతేగా, అంతేగా’ అంది చిలిపిగా స్టడీ టేబుల్. పిల్లలు వాడే లేటెస్టు సినీ డైలాగులన్నీ ఇది కూడా బట్టీపడుతున్నట్టుంది.

‘మొన్న టీవీలో ఓ సినిమా చూశాను. అందులో కోర్టు సన్నివేశంలో జడ్జిగారు ‘ఆర్డర్.. ఆర్డర్’ అంటూ సుత్తితో టేబుల్ మీద కొడుతున్నాడు. పాపం ఆ టేబుల్‌కు ఎంత నొప్పి ఉంటుందో అనిపించింది. దేవుడి దయవల్ల మనకలాంటి బాధల్లేవు’ అన్నాను నేను. పెరట్లోని మొజాయిక్ టేబుల్ ‘హలో! మీ మాటలన్నీ వింటున్నా. నా సంగతులూ వినండి. చక్కని సాయంకాలాలలో నా చుట్టూ కూర్చుని టీయో, కాఫీయో తాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటారు. అలాగే వెన్నెల రాత్రులలో. అప్పుడు వారి మాటలు వింటూ ఎంత ఆనందిస్తానో. అలాగే పద్మావతమ్మగారు నాదగ్గర కూర్చుని త్యాగ రాజకీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు పాడుతుంటే వింటూ ఆనందిస్తాను. నా మీదపడే పారిజాత పూల పరిమళాలను ఆస్వాదిస్తుంటాను’ చెప్పింది.

‘చాలా బాగున్నాయి నీ అనుభూతులు. వాణీనాథంగారికి ఈ సంగతి స్ఫురిస్తే, ఏ కథ లోనో నిన్నో పాత్రను చేసేస్తారు’ అన్నాను నేను. ‘అవునవును’ అన్నాయి డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్.

‘కొన్ని సినిమాల్లో అయితే హాస్య సన్నివేశాలకు మనమే కేంద్రం.. ఓ కుర్రాడు ప్రేమికురాలిని కలుసుకోవడానికి ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లడం, అదే అవకాశంగా ఖుషీగా కబుర్లు చెపుతుండడం, అంతలో అనుకోనట్లుగా పిల్ల తండ్రి రావడం, దాంతో కంగారుపడి తప్పించుకోవడానికి టేబుల్ కింద దాక్కోవడం, మరో సినిమాలో తన మీద కోపంగా ఉన్న తండ్రి కంట పడకూడదని, డైనింగ్ టేబుల్ కింద కూర్చుని, రహస్యంగా పైన ప్లేట్లలోని ఆహార పదార్థాలు తినేస్తుండడం.. అబ్బ! నవ్వులే నవ్వులు’ అంది డైనింగ్ టేబుల్. ‘భలే భలే’ అంది స్టడీ టేబుల్. నేను కూడా నవ్వేశాను.

అంతలో ‘అన్నట్లు కొన్ని ఆటల్లో కూడా మన జాతి ఉంది. టేబుల్ టెన్నిస్, బిలియడ్స్, స్నూకర్, పూల్ ఆటలకు ప్రత్యేక టేబుళ్లు ఉంటాయి. పిల్లలు చెప్పుకోగా ఈ విషయం విన్నాను. టీవీలో కూడా బిలియడ్స్ చూశాననుకో’ అంది స్టడీ టేబుల్. ‘నువ్వు చెప్పింది నిజమే. బాగా గుర్తు చేశావు’ అన్నాం నేను, డైనింగ్ టేబుల్.

‘మీకు తెలుసా, చట్టసభల్లో మనవాళ్లెంతో మంది ఉంటారు. ప్రతిపాదించిన అంశంపై తమ హర్షాన్ని తెలియజేస్తూ మన వాళ్ల మీద చేతుల్తో గట్టిగా చరుస్తుంటారు. అలా బాదుతున్నా ఆ సంతోషాన్ని చూసి మనవాళ్లు పొంగిపోయి, బాధను భరిస్తుంటారు. అక్కడ పూలకుండీలతో, కాగితాలు, కంప్యూటర్లు, మంచినీళ్ల సీసాలతో టేబుళ్లు దర్జాను ఒలకబోస్తూ ఉంటాయి. ఆ మధ్య టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తూ గమనించా’ అంది స్టడీ టేబుల్.

‘నేను టీవీలో సాహిత్య సమావేశాల కార్యక్రమాలు చూశా. అబ్బో! అక్కడ నా సోదరులు సాహితీమూర్తుల ముందు ఎంచక్కా కొత్త టేబుల్ క్లాత్‍లు ధరించి ఉంటారు. ఆవిష్కరించే కొత్త పుస్తకాలు, మంచినీళ్ల సీసాలు, మైకు, పక్క ఓ టేబుల్ పై సరస్వతీదేవి ఫొటో.. అదంతా ఓ ప్రత్యేక వాతావరణమనుకో. అంతటి సాహితీ పెద్దల ప్రసంగాలతో టేబుళ్లు కూడా పులకరించిపోతాయి’ అన్నాను నేను.

‘రచయిత టేబుల్‌వి. నువ్వు అలా అనుకోవడంలో ఆశ్చర్యమేం లేదులే’ అంది డైనింగ్ టేబుల్. ‘వేదిక మీదే కాదు, కొన్ని సభల్లో వేదిక అడుగున కూడా ఉండేవి టేబుళ్లే. ముఖ్యంగా వినాయక చవితికి, శ్రీరామనవమికి ఏర్పాటు చేసే నవరాత్రుల వేదికలు ఇలా ఉంటాయి’ అన్నాను నేను. ‘అలాగా, డైనింగ్ టేబుళ్లయితే హోటళ్లలో, కేఫ్‌లలో, పబ్బులు, క్లబ్బులలో కూడా ఉంటాయి. ఇంక బఫే పార్టీలకు ఏర్పాటు చేసే టేబుళ్లయితే రకరకాల ఆహార పదార్థాలతో ‘ఆహా!’ అనిపిస్తాయి. పెద్ద సంఖ్యలో అతిథులు తమ వద్దకు వచ్చి వడ్డించుకుని, ఆరగిస్తుంటే మా జాతివాళ్లు నిత్య కల్యాణం, పచ్చతోరణంలా’ ఉంటారు అంది డైనింగ్ టేబుల్.

అంతలో ఏదో గుర్తొచ్చినట్లు ‘అన్నట్లు ముడిచే చిన్నపాటి డైనింగ్ టేబుళ్లు రైళ్లలో, విమానాల్లో కూడా ఉంటాయి’ అంది గర్వంగా. ‘లైబ్రరీలలో కూడా ఎన్నో టేబుళ్లు, కుర్చీలు ఉంటాయి. లైబ్రరీలకు వచ్చే పాఠకులు ఎంచక్కా మనవాళ్ల ముందు కూర్చుని గంటలు గంటలు చదువుకుంటూ ఉంటారు. పుస్తకాలు, వివిధ రకాల వార్తాపత్రికలతో సరస్వతీదేవి సభ తీర్చినట్లు ఉంటాయి అక్కడి టేబుళ్లు. ఆమధ్య లైబ్రరీలపై టీవీలో డాక్యుమెంటరీ చూశాలే’ అన్నాను నేను నా వర్గం గొప్పతనం వివరిస్తూ.

ఇంతలో మూలనుంచి ఫోల్డబుల్ (మడిచే వీలున్న) బల్ల ‘హలో! మీరంతా నన్ను మరిచిపోయారు. నన్ను ఎక్కడంటే అక్కడ ఉపయోగించుకోవచ్చు. మడుస్తారు కనుక చోటు కూడా కలిసి వస్తుంది. నడవలేని పెద్దవాళ్లకు నేనెంతో ఉపయోగకరం’ అంది తన ప్రత్యేకతను చాటుకుంటూ. ‘అవునవును, నీ ప్రత్యేకత నీకుంది’ అన్నాం మేమంతా. ‘అసలు ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్నో టేబుళ్లుంటాయని, మేనేజర్ టేబుల్, సెక్రటరీ టేబుల్, చైర్మన్ టేబుల్ అని వ్యవహరిస్తారని, కొన్ని కార్యాలయాలలో టేబుళ్లపై ఫైళ్లు దుమ్ముకొట్టుకు పోయుంటాయని, దక్షిణమో, ఉత్తరమో లేనిదే వాటికి మోక్షం ఉండదని వాణీనాథం గారి తమ్ముడు సంజీవరావు ఆ మధ్య చెపుతుంటే విన్నాను. అలాగే ‘అక్షరశక్తి’ పత్రికాఫీసులో పనిచేసే రామ్మూర్తి గారు ఓరోజు వచ్చి, వాళ్ల ఆఫీసు కబుర్లు చెప్పారు. ప్రింటింగ్ వారితో పాటు ఇంకా కొంతమంది ముఖ్యమైన సిబ్బంది పేపర్ అచ్చయ్యేవరకు అక్కడే ఉంటారట. అర్ధరాత్రివేళ ఇళ్లకు వెళ్లటం కష్టమని ఆఫీసులోని టేబుళ్ల పైనే నిద్రపోయి, తెల్లారి ఇంటిదారి పడతారట. అంటే మంచాలుగా కూడా టేబుళ్లు ఉపయోగపడ్డట్లేగా’ అన్నాను నేను.

‘నిజమే. అంతేనా, ఏ ఫ్యాన్ ఊడదీయాలన్నా, దుమ్ము దులపాలన్నా టేబుల్ పైకి ఎక్కేస్తుంటారు’ అంది స్టడీ టేబుల్. ‘అన్నట్లు ఇంకో విశేషం చెప్పటం మరిచిపోయా… ఆమధ్య వాణీనాథం గారు తన మిత్రుడితో మాట్లాడుతుంటే విన్నాను, కాఫీ టేబుల్ బుక్ లని ప్రత్యేకం ఉంటాయట. అతిథులను అలరించే ప్రదేశాలలో, వారు చదవడానికి వీలుగా రూపొందించే పుస్తకాన్ని ‘కాఫీ టేబుల్ బుక్’ అంటారుట. వాటిని ‘కాక్‌టెయిల్ టేబుల్ బుక్’ అని కూడా పిలుస్తారట. ఆ మధ్య మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పదవి నధిష్ఠించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ పేరిట పుస్తకాన్ని వెలువరించారని, మన గవర్నర్ తమిళి సై గారు కూడా ‘వన్ ఎమాంగ్ అండ్ ఎమాంగ్‌స్ట్ ద పీపుల్’ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారని, శ్రీశ్రీ గారి మహోన్నత రచన ‘మహా ప్రస్థానం’ పుస్తకం పెద్ద సైజు కాఫీ టేబుల్ బుక్‍గా వెలువరించారని చెప్పారు’ అన్నాను నేను.

‘నిజంగా మాకివి కొత్త సంగతులే’ అన్నాయి డైనింగ్, స్టడీ టేబుళ్లు. ‘మన గురించి మనం ఎన్నో విషయాలు పరస్పరం మాట్లాడుకుని తెలుసుకున్నాం. చాలా టైమైంది. ఇంక విశ్రాంతి తీసుకుందాం’ అంది డైనింగ్ టేబుల్. స్టడీ టేబుల్ ‘అవునవును’ అంది. ‘అలాగే’ అన్నాను నేను.

కానీ నా ఆలోచన ఇంకా ఆగలేదు. ‘ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న మా జాతిని ఎవరు గుర్తిస్తారు? గుర్తించకపోతే ఫరవాలేదు కానీ టేబుల్ కింద చేతులు చాచి లంచాలు తీసుకోవడం వంటి అవినీతి పనులు చేయడం, అలాంటి పనులకు మేం సాక్షులం కావడం ఎంత విచారకరం. అవినీతి సొమ్మును మా సొరుగుల్లో దాచడం, టేబుల్ పైని ఫైళ్ల పనిని సకాలంలో పూర్తి చేయకుండా కొన్ని ఫైళ్లను అలాగే తొక్కి పెట్టడం ఎంత అన్యాయం! ఇంక పరీక్షలలో అయితే భావి భారత పౌరులైన విద్యార్థులు టేబుళ్ల సాక్షిగా కాపీలు కొట్టడం చూసే టేబుళ్లకు ఎంత బాధ! ఇంక హాటళ్లు, బార్లు, పబ్బులు, క్లబ్బులలో అవినీతి వ్యాపారాల లావాదేవీలు టేబుళ్ల దగ్గరే జరగడం, కుట్రలు, కుతంత్రాల రచనలు మా జాతి ముందే జరగడం మా ఖర్మ. చెడు చూడకు, చెడు వినకు అంటారు కానీ మా వాళ్లకు మాత్రం తప్పని తెలిసినా తప్పడం లేదు. బార్లు, పబ్బులలో అయితే తాగి తందనాలాడుతూ విచక్షణ కోల్పోయి కారుకూతలు కూస్తుంటారు. కొన్నిసార్లు తగాదాలు ముదిరి కొట్టుకుని బీభత్సం చేయడం, కొన్నిసార్లు కాల్పులు, కత్తిపోట్లు కూడా చోటు చేసుకోవడం ఎంత విషాదం! మా టేబుళ్ల జాతిని ఎన్ని రకాలుగా సద్వినియోగం చేసుకున్నా సంతోషిస్తాం. కానీ ఇలా మా ముందు అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడవద్దని బుద్ధిజీవులైన ఈ మనుషులకు చెప్పాలని ఉంది. కానీ మామాట వారి చెవికి చేరేనా?’ అని అనుకుంటున్నంతలో నా మీద తలవాల్చి నిద్రిస్తున్న వాణీనాథంగారు హఠాత్తు లేవడంతో, నా ఆలోచన ఎగిరిపోయింది!

Exit mobile version