Site icon Sanchika

అన్నింట అంతరాత్మ-27: నేనంటే అందరికీ ఇష్టం.. స్వీటును నేను!

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం స్వీటు అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]వే[/dropcap]సవికాలం.. మిట్ట మధ్యాహ్నం. ముత్యం రెడ్డి మిఠాయి షాపులో రద్దీ పెద్దగా లేదు కానీ ముందురోజు పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇచ్చి వెళ్లిన వారి ఐటమ్స్ అన్నిటినీ సిద్ధంగా ఉంచమని ముత్యం రెడ్డి హెచ్చరించడంతో సిబ్బంది ఆ పనిలో ఉన్నారు. పెళ్లిళ్ల సీజను కావడంతో ఆర్డర్లు ఎక్కువగానే ఉంటాయి. అద్దాల అరల్లో రకరకాల స్వీట్లు నోరూరించేలా కొలువుతీరి ఉన్నాయి.

ముత్యం రెడ్డి మనవడు గణేశ్ బడికి సెలవులని కాబోలు తాతతోపాటు షాపు కొచ్చాడు. షాపును నిశితంగా చూశాడు. వెంటనే ‘తాతా! తాతా!’ పిలిచాడు. ‘ఏంటి గణేశూ’ అడిగాడు ముత్యం రెడ్డి. ‘మరి అసలు ఈ స్వీట్లను తయారు చేయడం ఎప్పటి నుంచి మొదలైంది?’ అడిగాడు. ఆ మాట వినగానే షాపులోని స్వీట్లన్నీ ముత్యం రెడ్డి ఏం చెపుతాడా అని ఆయనపై దృష్టి పెట్టాయి. ‘మంచి ప్రశ్నే అడిగావురా గణేశూ. ఏదో స్వీట్ల షాపు నడుపుకోవడమే కానీ ఈ సంగతి గురించి నేను అంత లోతుగా ఆలోచించ లేదు. కానీ ఓ సారి ఓ మేగజైన్లో చదివాను. స్వీట్లన్నీ చాలావరకు చక్కెరతోనే కదా తయారు చేస్తున్నాం. చక్కెర వాడకం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దిలో భారత్ లోనే మొదలైందని చైనా గ్రంథాల్లో రాశారట. గుప్తులు, బౌద్ధులకాలం నుంచి పంచదార స్పటిక రూపంలో తయారైందని రాశారు. అయితే నాలుగవ శతాబ్దిలోనే చెరుకు పండించినట్లు కాళిదాసు పద్యాల్లో ఉందని కూడా ఆ వ్యాసంలో చదివాను. అంటే చక్కెర తయారీ కాలం నుంచే స్వీట్ల తయారీ జరిగిందని అర్ధం చేసుకోవచ్చు’ అన్నాడు ముత్యం రెడ్డి. అది విని స్వీట్లన్నీ ‘అబ్బో! మన ఉనికి ప్రాచీనకాలం నుంచే ఉందన్నమాట. ఎంత గొప్పో’ అనుకుని మురిసిపోయాయి. ‘తాతా! తాతా! ఓ లడ్డూ తీసుకుంటా’ అన్నాడు గణేశ్. ‘లడ్డూ కావాలా బాబూ.. తీసుకో’ నవ్వుతూ అన్నాడు ముత్యం రెడ్డి.

గణేశ్ లడ్డూ తింటూ ‘తాతా! లడ్డూకి ఈ పేరు ఎలా వచ్చింది, దీని చరిత్ర ఏమిటి?’ అడిగాడు. షాపులో లడ్డూలన్నీ తమ ప్రస్తావన రావడంతో ఏం చెపుతారో అని చెవులు రిక్కించాయి. ‘లడ్డూల గురించి ఆ మధ్య టీవీ ఛానెల్‌లో చెపుతుంటే విన్నాను. లడ్డు అనే పదం ‘లట్టిక’ అనే ఉర్దూ పదం నుంచి వచ్చిందని చెప్పారు. పూర్వ కాలంలో మనిషిలో జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం ఓ వంటకాన్ని కనుగొన్నారట. దాన్ని ఔషధంగా సేవించేవారని అదే తర్వాత కాలంలో క్రమంగా లడ్డూగా రూపొందిందని చెప్పారు. అయితే ఆయుర్వేద వైద్యుడు సుశ్రుతుడి కాలంలోనే లడ్డూల ప్రస్తావన ఉందని కొన్ని గ్రంథాలవల్ల తెలుస్తోందని కూడా చెప్పారు’ వివరించాడు ముత్యం రెడ్డి.

‘ఇన్ని స్వీట్లు ఉన్నా లడ్డు అన్నిటికంటే ప్రత్యేకమైంది. దేవుడికి పెట్టే నైవేద్యాలలో కూడా లడ్డూ ముఖ్యమైంది. వినాయక చవితికి వినాయకుడి చేతిలో పెద్ద లడ్డూ పెడతారుకదా. నిమజ్జనం రోజున ఆ పెద్ద లడ్డూను వేలంపాట పాడతారని, ఎవరు ఎక్కువ డబ్బు పాడితే ఆ లడ్డు, వారి సొంతమవుతుందని తేజ చెప్పాడు. పైగా ఎన్ని రకాల లడ్డూలో. మోతీచూర్ లడ్డు, రవ్వ లడ్డు, బేసిన్లోడ్డు, బందరు లడ్డు, అటుకుల లడ్డు, పాల లడ్డు, కాశ్మీరీ లడ్డు, బూందీ లడ్డు, ఓట్స్ లడ్డు.. మొన్న కరోనా టైమ్‌లో అయితే అమ్మ అదేంటి.. ఎనర్జీ లడ్డు తయారు చేసింది’ గణేశు చెపుతుంటే లడ్లన్నీ ఆనందంతో పరవశించాయి.

అంతలో ‘ముత్యం!’ అంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ‘రారా వెంకటేశం. తిరుపతి వెళ్లావేమో కదా. దర్శనం బాగా అయిందా?’ ఆహ్వానిస్తూ అడిగాడు ముత్యం రెడ్డి. ‘ఆఁ కల్యాణం చేయించాం. ఇదిగో లడ్లు.’ అంటూ ఓ పెద్ద ప్యాకెట్ అందించాడు వెంకటేశం. ‘ప్రసాదం అంటూ అంత పెద్ద ప్యాకెట్ ఇస్తున్నావేమిటి?’ అన్నాడు ముత్యం రెడ్డి. ‘కల్యాణం చేయించామని చాలా లడ్లు ఇచ్చారు. ఫర్వాలేదులే.. నీ దగ్గర ఎన్ని రకాల లడ్డు ఉన్నా తిరుపతి లడ్డు రుచి వేరు. ఉండనీ’ అన్నాడు వెంకటేశం. ఆ తర్వాత వాళ్లిద్దరూ వేరే కబుర్లు మొదలెట్టారు.

తిరుపతి లడ్ల వంక మిగిలిన లడ్లు అసూయగా చూస్తే, తిరుపతి లడ్లు వాటి వంక అతిశయంగా చూశాయి. వాటి వంక చూస్తున్న కాకినాడ కాజా ‘అసలు మీరిద్దరూ లేనిపోని గొప్పలు పోతున్నారు కానీ, నాకు దక్కిన గౌరవం సంగతి మీకింకా తెలీదల్లే ఉంది. నాకు, మాడుగుల హల్వాకు కిందటి సంవత్సరమే ప్రభుత్వ గుర్తింపు లభించింది. నా బొమ్మతో ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు, మాడుగుల హల్వా బొమ్మతో పోస్టల్ కవర్ విడుదల చేశారని తెలుసా?’ అంది కళ్ళెగరేస్తూ. అప్పుడే తయారై వచ్చిన జిలేబీలు ఆ మాటలు విన్నాయి. వాటిలో ఓ జిలేబి వెంటనే ప్రతిస్పందిస్తూ, ‘చాలు. చాలు. ఆపండి. మాకు ఉన్న గిరాకీ మీకెక్కడిది? రోజూ సాయంత్రం కాగానే మాకోసం ఎంతమంది క్యూలో నిలబడతారో, వేడి వేడి జిలేబీలు అంటూ ఎంతగా ఆస్వాదిస్తారో ఎప్పుడైనా చూశారా? మా జాతి ఏనాడో పర్షియన్ టర్కిష్ వ్యాపారుల ద్వారా ఇండియాకు వచ్చిందని ఇందాక మమ్మల్ని తయారు చేస్తూ శంకర్ భయ్యా చెప్పాడు. అంతేకాదు మా అసలు పేరు జలబియా అని.. అది అరబిక్ పదమని, భారత్‌కు వచ్చాక మమ్మల్ని కొంతమంది జలేబి అని, కొంతమంది జిలేబి అని పిలవటం మొదలెట్టారని చెప్పాడు. అసలు మా వంక ఒక్కసారి చూడండి. చుట్టలు చుట్టలుగా మంచిరంగులో ఎంతందంగా ఉన్నామో’ అంది.

అది విని రసగుల్లా వెటకారంగా నవ్వుతూ ‘మీరింకా పాతకాలం లోనే ఉన్నారు. నిన్ననే ముత్యంరెడ్డి కొడుకు ప్రసాదరెడ్డి చెపుతుంటే విన్నాను. గూగుల్ ట్రెండ్స్ స్కోరు ప్రకారం రసగుల్లాకు అంటే నాకు డెబ్బయ్ ఒక్కమార్కులు, గులాబ్ జామ్‌కు అరవై ఒక్క మార్కులు, బర్ఫీకి యాభై ఏడు మార్కులు, కాజు కట్లీకి ముప్పై నాలుగు మార్కులు. ఆ తర్వాత స్థానంలో సోన్ పాపిడి ఉంది. తెలిసిందా?’ అంది.

అంతలో మైసూర్ పాక్ మాట్లాడుతూ.. ‘ఇలా మనలో మనం తగవుపడటం ఎందుకు. మనందరం మధుర పదార్థాలమే కదా. ఎవరి ప్రత్యేకత వాళ్లకు ఉంటుంది. మనం ఉండేదే కొద్దిరోజులు. ఆ భాగ్యానికి ఎందుకు తగవులు, మనల్ని మనం పరస్పరం పరిచయం చేసుకుంటే బాగుంటుంది కదా’ అంది తన మంచి మనసును చాటుకుంటూ. ‘నా పేరు మైసూర్ పాక్ అని మీకు తెలుసు. నేను ప్రధానంగా కర్ణాటకకు చెందిన దాన్నే అయినా నాకున్న గొప్పరుచి వల్ల అన్ని రాష్ట్రాలకు వ్యాపించాను. కేవలం మైసూర్ పాక్‍ను మాత్రమే అమ్మే షాపులు కూడా ఉన్నాయి’ చెప్పింది.

‘నా పేరు రసగుల్లా. కోల్‍కతా మా పుట్టిల్లు. రసగుల్లాకు అందరూ గులాములే అని గూగుల్ ట్రెండ్స్ స్కోరు చెప్పనే చెప్పింది’ అంది రసగుల్లా. ‘నా పేరు రాఖీ. బనారస్ మా జాతికి ఫేమస్. డ్రై ఫ్రూట్లు, కేసర్, చిక్కటి పాలతో నన్ను తయారు చేస్తారు. చెప్పింది రాఖీ. ‘నా పేరు సందేశ్. బెంగాల్లో పుట్టినా దేశమంతా వ్యాపించాను. మాలో ఎన్నో రకాలు. బెల్లంతో తయారవుతాను. అలాగే ఐస్ క్రీమ్ సందేశ్, మామిడి సందేశ్ ఇలా రకరకాలుగా అందరినీ అలరిస్తుంటాను’ చెప్పింది సందేశ్. ‘నా పేరు సోన్ పాప్డీ. గుజరాత్‌కు చెందిన స్వీటునయినా ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఉనికి చాటుకున్నాను. పిల్లలు, పెద్దలు అందరూ నన్నెంతో ఇష్టంగా తింటారు’ అంది సోన్ పాప్డీ. ‘నువ్వే కాదు, నేనూ గుజరాత్ స్వీటునే, స్వీటు ప్రియులకు నేనంటే ఎంతో ఇష్టం’ అంది కాజు కట్లీ. ‘నేను మోదక్‍ను. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన నేనంటే గణేశ్ మహరాజ్‌కు ఎంతో ఇష్టం. మాతో పాటు ఇంకా ఎన్నో స్వీట్లున్నాయి కానీ ముఖ్యంగా ఫిర్ని, హల్వా అంటే ఎక్కువమంది ఇష్టపడతారు’ అంది మోదక్. ‘నేను పేఠాను. ఆగ్రాకీ పేఠా అంటే అఖిల భారతీయులు ఇష్టపడతారు. నేను మిగతా స్వీట్ల లాగా ఏ పిండితోనో తయారు కాను. బూడిద గుమ్మడి కాయతో తయారవుతాను. అదే నా ప్రత్యేకత’ వివరించింది పేఠా. ‘నా పేరు అరిసె. తెలుగు రాష్ట్రాలలో నేను ప్రసిద్ధి. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట నేను ఉండవలసిందే. పైగా నేను ఎక్కువ కాలం నిలవ ఉంటాను. పెళ్లిళ్లలో సారెకు కూడా నన్నే ఎంచుకుంటారు. అంతెందుకు, పిల్లలు అడుగులేయడం ప్రారంభిస్తే అరిసెలు పంచి వేడుక చేసుకుంటారు’ చెప్పింది అరిసె.

‘నా పేరు పూతరేకు. నేను ఆంధ్రప్రదేశ్‍కు చెందినదాన్ని. నా తయారీ ఇతర స్వీట్లన్నింటి కన్నా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా తయారుచేస్తారు. ఆత్రేయపురం పూతరేకులంటే అందరి నోళ్లూ ఊరిపోతాయి’ పరిచయం చేసుకుని, ‘మేమే కాదు, తెలుగు నాట మాతో పాటు సున్నుండలు, పంచదార చిలకలు, పాకం ఉండలు, పాలకాయలు, బొబ్బట్లు, గవ్వలు, పూర్ణబూరెలు, పాకం గారెలు.. ఇలా ఎన్నెన్నో స్వీట్లు ఉన్నాయి’ చెప్పింది పూతరేకు.

‘నా పేరు రసమలై. హరిద్వార్, కాన్పూర్ లలో మేం ప్రసిద్ధి చెందినా, రానురాను మా రుచికి అన్ని రాష్ట్రాలవారు మెచ్చి, విరివిగా తిని ఆనందిస్తున్నారు’ చెప్పింది. ‘పుట్టింది ఉత్తరభారత్‌లో అయినా దక్షిణాదినా గొప్ప పేరు సంపాదించాను’ ఒకేసారి అన్నాయి కలాకండ్, గులాబ్ జామూన్. ‘నా పేరు ఘెవార్. రాజస్థాన్ నా మొదటి అడ్డా అయినా ఇప్పుడు అన్నిరాష్ట్రాల వారూ నన్ను ఆదరిస్తున్నారు’ అంది ఘెవార్. ‘నా పేరు పాలకోవా. నన్నే దూద్ పేడా అంటారు ఉత్తర భారతీయులు. నా రుచికి అందరూ ‘వహ్వా’ అనవలసిందే’ అంది, దరహాసాలు ఒలికించింది.

అంతలో ‘ఇది విన్నావా?’ అన్నాడు వెంకటేశం. ‘నువ్వు విషయం చెప్పకుండా, ఇది విన్నావా?’ అంటే నేనేం చెప్పగలను. అయినా అదేదో నువ్వే చెప్పు వింటాను’ అన్నాడు ముత్యం రెడ్డి. ఆ మాటలకు స్వీట్లన్నీ అటు తిరిగి, అదేమిటా అని చెవులు రిక్కించా యి. ‘అదే.. తూర్పు గోదావరి జిల్లాలో ఆ మధ్య ఓ మామగారు అల్లుడికి ఆషాఢంలో రకరకాల ఆహార పదార్థాలతో పాటు యాభై రకాల స్వీట్లతో సారె కావిళ్లు పంపాడట. ఆ అల్లుడు తానూ తగ్గేదేలే అని, శ్రావణ సారెలో భాగంగా పదివేల కేజీల స్వీట్ల కావిడి పంపాడట’ చెప్పాడు వెంకటేశం. ‘పదివేల కేజీలే’ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ముత్యం రెడ్డి. స్వీట్లన్నీ కూడా ‘మనకెంత డిమాండో. భలే భలే’ గర్వంగా అనుకున్నాయి. ‘స్వీట్లు ఎక్కువగా తినకూడదంటారు కదా తాతా’ అడిగాడు ముత్యం రెడ్డి మనవడు. ‘అన్ని కేజీలు ఒకళ్లే తింటారేమిటి, ఊరంతా పంచుతారు. అయినా మితంగా తినవచ్చు. నిజానికి బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక చిన్న స్వీటు తింటే ఆరోగ్యమే. దానివల్ల శరీరానికి మంచి శక్తి వచ్చి, రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. లంచ్ తర్వాత చాలా మంది స్వీటు తింటారు. అందుకే రెస్టారెంట్లలో భోజనం చివర ఓ గులాబ్ జామూన్ లేదా రసగుల్లా వంటివి అందిస్తుంటారు’ చెప్పాడు ముత్యంరెడ్డి. ‘ఈ మధ్య చక్కెర వ్యాధిగ్రస్తులు కూడా తినేందుకు వీలుగా చక్కెర లేని మిరాయిలు కూడా అందుబాటులోకి వచ్చాయి’ అన్నాడు వెంకటేశం.

‘అవును’ అన్నాడు ముత్యంరెడ్డి. ‘అన్నట్లు చెప్పడం మరిచిపోయా.. మా వాడికి అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. ఆఫీసులో అందరికీ స్వీట్లు ఇవ్వాలట. ఓ కేజీ ఆఫీసుకు, మా ఇంట్లోకి ఓ అరకేజీ స్వీట్లు ఇవ్వు. ఒకే రకం కాకుండా అన్ని రకాల కోవా స్వీట్లు కలిపి ఇవ్వు’ అన్నాడు వెంకటేశం. ‘భలే వాడివే. ఇంతసేపూ చెప్పవేం, చాలా సంతోషం’ అంటూ వెంటనే అతడడిగినట్లుగా తానే స్వయంగా స్వీట్లను పేర్చి, బాక్సులు అందించాడు. వెంకటేశం వాటినందుకుని డబ్బులందించాడు. ‘మా ఇంట్లో తరచు స్వీట్లు ఉండాల్సిందే. పరీక్ష పాసయినా, ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, పెళ్లి చూపులు జరిగినా, పెళ్లి సంబంధం కుదిరినా, పెళ్లంటే సరేసరి, ఆ తర్వాత సారెలు వగైరాలు, సీమంతం వేడుకలయినా, బిడ్డ పుట్టినా.. ఇలా ఒకటా, రెండా ఇంట ఏ శుభం జరిగినా స్వీట్లు ఉండాల్సిందే. దీపావళి పండగయితే స్వీట్ల సందడి ఇంతా అంతా కాదు. స్నేహ సంబంధాల పెంపుకు కూడా స్వీట్లు ఇచ్చి, పుచ్చుకోవడం మనకు తెలిసిందే. ఈ యేడు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంలో భారత్, చైనా సైనికులు పరస్పరం స్వీట్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ప్రేమికుడు, ప్రియురాలిని ‘స్వీట్ హార్ట్’ అనడం తెలిసిందే. అలాగే ఇంటికి సైతం ‘స్వీట్ హోమ్’ అని పేరు పెట్టుకోవడం, పిల్లలను ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుచుకోవడం మామూలే. ఇంత ప్రాధాన్యం ఉన్న స్వీట్ల వ్యాపారం మొదలు పెట్టి నువ్వు మంచి పని చేశావు’ అన్నాడు వెంకటేశం. ‘భలే తియ్యగా మాట్లాడావు వెంకటేశం’ మెచ్చుకున్నాడు ముత్యంరెడ్డి. ‘ఇంక నే వస్తా’ అంటూ బయల్దేరాడు. ‘అలాగే’ అంటూ మరో వినియోగదారుడు రావడంతో చూపు అటు తిప్పాడు ముత్యం రెడ్డి.

‘తీయగా మాట్లాడటం’ అన్న మాట షాపులోని ఓ పెద్ద లడ్డూను ఆలోచనలో పడేసింది. తమకు ఉన్న ప్రత్యేక గుణాన్ని మనిషి, మాటకు కూడా ఆపాదించుకున్నాడు. మొన్న ‘తీయ తీయని మాటల తేనెలతో తీస్తారు సుమా గోతులు.. నమ్మ వద్దూ’ అనే పాట వింది. అంటే తమ తీయదనం లాగా మనిషి మాట తీయదనం నిఖార్సయినది కాదన్నమాట. పైకి అలా మాట్లాడుతూ మోసం చేయడం అంటే అది చెడ్డగుణమే కదా. అంతెందుకు మొన్న టీవీలో చూసింది.. ‘పాడుతా తీయగా, చల్లగా’ అని.. పాటకు కూడా తీయదనమే విశేషణంగా చేర్చారు. ప్రేమ కూడా తీయనైందని, ‘వలపువలె తీయగా వచ్చినావు నిండుగా..’ అని ఓ సినీ గీతం కూడా విన్నాను. ఊహల్లో కూడా మధురోహలు ఉండటం తెలిసిందే. తీయని తలపులు, తీపి గురుతులు పద ప్రయోగాలు కూడా విన్నాను. ఏమైనా మనుషులకు ఓ మాట చెప్పాలనుంది.. తీపి రుచుల నందిస్తున్నందుకు మా స్వీట్లకు ఎంతో గర్వంగా ఉంటుంది. మీ జిహ్వకు అంకితం కావడంలోనే మాకు సార్థకత ఉందనుకుంటాం. మేం మనసు, తనువు.. నిలువెల్లా నిండైన తీయదనం కలిగి ఉంటాం. కానీ మీలో చాలా మంది కృత్రిమ తీయదనాన్ని ప్రదర్శించడం చూస్తే నాకు బాధేస్తుంది. పైకి తీయగా మాట్లాడి లోపల ఈర్ష్వా ద్వేషాలతో ఉండటం కూడదని చెప్పాలనిపిస్తుంది, మనస్ఫూర్తిగా మధుర వచనాలు పలకాలని. వీలైనంత వరకు ఇతరుల మదిలో తీపి గురుతుగా మిగలడానికి ప్రయత్నిస్తే ఎంత బాగుంటుంది. అలాగే కొంతమంది మమ్మల్ని అమితంగా తిని, చివరకు మధుమేహ వ్యాధికి గురయి, నెపం మా మీదకు నెడుతూ ‘అవి స్వీట్లు కావు, విషాలు’ అంటూ తీవ్రంగా మమ్మల్ని నిందిస్తుంటారు. అలాటివారు మితం తప్పిన తమ పొరపాటును తాము గుర్తించాలని, మితంగా తింటే మేం అమృత తుల్యులమేనన్న నిజాన్ని ఒప్పుకోవాలని చెప్పాలనుంది. అయినా నా పిచ్చి గానీ ఈ మనుషులకు మంచి మాటలెప్పుడూ చేదుగానే ఉంటాయిగా..’ అనుకుంటుంటే.. మా షాపు కుర్రాడు నన్ను, తీసి, స్వీటు బాక్సులో పెట్టడంతో నా ఆలోచన పటాపంచలైంది. నా తోటివారిని కూడా తీసి బాక్సులో సర్ది తూస్తున్నాడు. ‘ఓఁ షాపు నుంచి వెళ్లిపోతున్నామన్నమాట. ఎవరి నోటినో తీపి చేసి, నా జన్మ చరితార్ధం చేసుకొనే సమయం వచ్చేసిందన్నమాట’ అనుకుంటూ, షాపులోని స్వీట్లకు వీడ్కోలు చెపుతుండగానే.. షాపు కుర్రాడు బాక్సును మూసేసి, వినియోగదారుడికి అందించాడు.

Exit mobile version