అన్నింట అంతరాత్మ-29: బాల్యానికి ఆహ్లాదం అద్దుతాను.. ‘బెలూన్’ను నేను!

7
2

జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం బెలూన్ అంతరంగం తెలుసుకుందాం.

***

[dropcap]‘డా[/dropcap]లీ! ఇదుగో.. ఈ బెలూన్ల గుత్తిని ఇలా పట్టుకుని మెల్లగా పరుగెత్తు. నేను ఫొటో తీస్తా’ డాలీ వాళ్ల నాన్న చెపుతుంటే, డాలీ.. ‘అలాగే నాన్నా! రంగురంగుల బెలూన్లు ఎంత బాగున్నాయో’ అంటూ మమ్మల్ని అంటే మా బెలూన్ల గుత్తిని ఒక చేత్తో పట్టుకుని, వెనుకకు చూస్తూ ఇంటి ముందు తోటలో కాసింత వేగంగా ముందుకు కదులుతుండగా వాళ్ల నాన్న నాలుగు సార్లు క్లిక్ మనిపించి ‘డాలీ! ఇంక చాల్లే’ అన్నాడు. డాలీ, నాన్న దగ్గరకు పరుగెత్తుకొచ్చింది.

‘ఇదుగో చూడు! ఫొటోలు బాగున్నాయి కదూ!’ అంటూ డాలీకి మొబైల్ లోని ఫొటోలు చూపించాడు. ‘భలే భలే ఎంత బాగున్నాయో’ అంది డాలీ. అదే అదునుగా మేము కూడా ఫొటోలో మమ్మల్ని చూసుకున్నాం. పువ్వుల ఫ్రాక్ వేసుకుని, పువ్వంత అందంగా ఉన్న డాలీ మా కంటికి ఎంతో అందంగా అనిపించింది. మేమందరం అలా కలిసి ఫొటోలో ఉండడం కూడా మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. మమ్మల్ని చూసి డాలీ సంతోషంతో గంతులు వేయడం చూసి మా జన్మ ధన్యమైందనిపించింది. కానీ ఎక్కువ ఆనందపడకుండా జాగ్రత్త పడ్డాం. ఎందుకంటే ఆనందం పట్టలేకపోతే మేం ఠాప్‌మని పేలిపోయే ప్రమాదం ఉంది. డాలీ తండ్రితో పాటు ఇంటిలోపలికి నడిచి హాల్లో కూర్చుంది. ఇంతలో ఓ అతిధి.. అతడితో పాటు ఓ పాప, బాబు.

అతడిని చూడగానే డాలీ వాళ్ల నాన్న ‘రావోయ్ ప్రకాశం.. రారా!’ ఆహ్వానించాడు. ‘హాయ్ స్వీటీ, హాయ్ కిట్టూ’ అంది డాలీ. ‘హాయ్ డాలీ’ ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఇద్దరి చేతుల్లో మా జాతి వాళ్లే ఉన్నారు. కాకపోతే ఒకరి చేతిలో పిట్ట రూపంలో, మరొకరి చేతిలో మధ్యలో గుండ్రని బెలూను, చుట్టూ చిన్నచిన్న బెలూన్లు జత చేసి, వాటికి ఒక తోక బెలూన్‌ను జతచేసి ఓ బొమ్మలా ఉన్న బెలూన్.

‘తోవలో బెలూన్ల వాడు కనిపించాడు మహేశ్.. కొని తీరాల్సిందే అని గొడవ. తప్పేదేముంది.. చిన్ని చిన్ని ఆనందాలు’ నవ్వాడు ప్రకాశం. ‘అవునవును’ అన్నాడు డాలీ నాన్న మహేశ్.

‘నాన్నా! బెలూను తెలుగులో ఏమంటారు?’ డాలీ అడిగింది. ‘గాలి బుడగ లేదా బూర’ అంటారు, కానీ ఎక్కువగా బెలూన్ అన్న పదమే వాడుకలో ఉంది’ చెప్పాడు మహేశ్. ఆ వెంటనే ‘నాన్నా! ఈ బెలూన్ల లోపల ఏం ఉంటుంది?’ అందరికన్నా చిన్న పిల్ల స్వీటీ అడిగింది. మా గురించిన ప్రశ్న కావడంతో అసంకల్పితంగానే మా చెవులు అటు మళ్లాయి. ‘బెలూన్ లోపల ఉండేది గాలేనమ్మా. అంటే హీలియం, హైడ్రోజన్, నైట్రస్ ఆక్సై‌డ్, ఆక్సిజన్ వాయువులుంటాయి. ఈ కాలంలో తయారయ్యే బెలూన్లు రబ్బర్, లేటెక్స్, నైలాన్లతో తయారవుతున్నాయి’ చెప్పాడు ప్రకాశం.

ఇంతలో లోపల్నుంచి డాలీ వాళ్ల అమ్మనుకుంటా బిస్కెట్లు, కాఫీ కప్పులతో వచ్చి, ‘బాగున్నారా అన్నయ్యగారూ’ అంటూ పలకరించింది. ‘బాగున్నామమ్మా’ అంటూ కాఫీ కప్పు అందుకున్నాడు. పిల్లలు బిస్కెట్లు తీసుకున్నారు. ‘బెలూన్లలో ఎన్నో రకాలున్నాయి కదా’ అన్నాడు కిట్టూ. మహేశ్ అందుకుని ‘అవును కిట్టూ! ప్రాచీనకాలంలో మృత జంతువుల్లోని ఎండిన తిత్తులతో తయారుచేసేవారు. కొన్నింటిని అలంకరణకు, మరి కొన్నింటిని వినోదానికి వాడేవారు. ఇంకా వాతావరణ విభాగ పనులకు, వైద్య చికిత్సకు, మిలటరీ అవసరాలకు, రవాణాకు వాడేవారు. అయితే ప్రయోగశాలలో వాడుకునేందుకు వీలుగా రబ్బరు బెలూన్‌ను తొలిసారిగా పంథొమ్మిదో శతాబ్దంలో మైఖేల్ ఫారడే కనుగొన్నాడు’ వివరించాడు. ‘భలే.. మా వల్ల చాలా ప్రయోజనాలున్నాయన్నమాట’ అనుకుని మేమందరం గర్వపడ్డాం.

‘ఫంక్షన్ హాళ్లలో అలంకరించే బెలూన్ల గుత్తులు, దండలు భలే ఉంటాయి’ అంది డాలీ. ‘అవును. గుండ్రటి బెలూన్లతో రకరకాల ఆకృతులు చేసేవారిని ‘స్టాకర్స్’ అంటారు. అదే పెన్సిల్ రకం బెలూన్లను వాడుతూ ఆకృతులు తయారుచేసే వారిని ‘ట్విస్టర్స్’ అంటారు’ చెప్పింది డాలీ వాళ్ల అమ్మ. ‘ఇన్నాళ్లకు నాకు తెలియని ఓ విషయం చెప్పావు అపర్ణా’ ఆటపట్టించాడు మహేశ్. ‘చూడన్నయ్యా మీ స్నేహితుడు ఎలా అంటున్నారో’ ప్రకాశంతో అంది అపర్ణ. ‘వాడి మాటలకేం అమ్మా. అసలు ఆడవాళ్లకు తెలిసినన్ని విషయాలు మాకేం తెలుస్తాయమ్మా’ ప్రకాశం మాటలకు అపర్ణ మాలాగే ఉబ్బిపోయినట్లు ఆమె ముఖం చూస్తే తెలుస్తోంది.

‘చిన్నప్పుడు మేం స్టేషనరీ షాపుకెళ్లి ఊదని బెలూన్లను కొనుక్కునేవాళ్లం. ఎందుకంటే అవయితే ఎక్కువ వస్తాయని. ఇంటికి తెచ్చుకుని ఊదుకునేవాళ్లం. మా అన్నయ్య వాటిని పెద్దగా ఊది ఇచ్చేవాడు. ఆడుకున్నంత సేపు ఆడుకుని నా బెలూన్ పేలిపోతే వేరేవాళ్ల కారణంగానే పేలిపోయిందని గొడవ చేసేదాన్ని. మా అన్నయ్య పాపం సర్దిచెప్పేవాడు. మళ్లీ ఆ పేలిన బెలూన్ తోనే చిన్నచిన్న బెలూన్లు కట్టి ఇచ్చేవాడు. దాన్ని చేతికి రుద్దుతూ అది కీస్ కీస్ మని చప్పుడు చేస్తుంటే గమ్మత్తుగా ఉండేది. అమ్మేమో వాటిని పొరపాటున కూడా నోట్లో పెట్టుకోకు. చిన్న బెలూన్ ముక్క నోట్లోకి వెళ్లిపోయి నా ప్రమాదం అని కోప్పడేది’ అంది అపర్ణ.

‘అవును. ఆ రోజుల్లో అలాగే ఉండేది. ఇప్పుడు కూడా పేలిన బెలూన్ ముక్కలు ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. జంతువులు తిన్నా ప్రమాదమే. అన్నట్లు నా చిన్నప్పుడు మా అక్క, నాకు బెలూన్లను చూపించి రంగులను పరిచయం చేసి, నేర్పింది’ నవ్వుతూ అన్నాడు మహేశ్. ‘ఇప్పుడు నోటితో ఊదడం తగ్గిపోయింది. అమ్మేవాళ్లు హ్యాండ్ పంప్ లేదా సిలిండర్ గ్యాస్‌ను బెలూన్లలో నింపుతున్నారు’ అన్నాడు ప్రకాశం.

‘అత్తా! నెహ్రూ సెంటర్‌లో ‘జెయింట్ మాల్’ అని పెద్ద బెలూన్ ఆకాశంలో చాలా ఎత్తులో ఉంది’.

‘అవును. ఈ కాలంలో ప్రచారానికి కూడా బెలూన్లు ఉపయోగపడుతున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో అందరి దృష్టి వాటిపై పడుతుంది’ అంది అపర్ణ.

మా జాతి గొప్పతనం మాకు ఆనందం కలిగించింది. వెంటనే ప్రకాశం అందుకుని ‘ఇంటర్నెట్ సదుపాయానికి కూడా బెలూన్లు తోడ్పడుతున్నాయి, మీకు తెలుసా? గూగుల్‌కు చెందిన ‘లూన్’ ప్రాజెక్ట్, కెన్యాలోని మారుమూల ప్రాంతాలవారికి బెలూన్ల ద్వారా ఫోర్ జి ఇంటర్నెట్ సదుపాయాలను కొంతకాలం కల్పించింది. తర్వాత వరల్డ్ మొబైల్ గ్రూప్ ఆ పని చేపట్టినట్లు వార్తలొచ్చాయి’ చెప్పాడు. ‘అబ్బో! ఆధునిక సాంకేతికతలో కూడా మా జాతి భాగస్వామ్యం ఉందన్నమాట’ అనుకున్నాం ఆనందంగా. ‘ఇదేదో బాగుందే’ అన్నాడు మహేశ్.

‘నాకు ఓ పాట గుర్తుకొస్తోంది. దేవుడు చేసిన మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లారా.. వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల.. పాటలో శ్రీశ్రీ గారు ఇలా అన్నారు.. గాలి బుడగ జీవితం.. ఓటి పడవ యవ్వనం.. నిన్న మనది కాదు కాదు.. నేడే సుఖం.. నేడే సుఖం’ అని’ చెప్పాడు ప్రకాశం. ‘అవును. చాలా గొప్ప పాట.. చాలా హిట్ పాట కూడా’ అన్నాడు మహేశ్.

‘అన్నట్లు మీకు హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ’ గురించి తెలుసా?’ అడిగింది అపర్ణ. ‘అదేమిటి?’ ఆశ్చర్యంగా అడిగారు అందరూ. ‘చెపుతాను. మధ్యప్రదే‍శ్ లోని ‘బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్’లో హాట్ ఎయిర్ బెలూన్ సఫారి రెండువేల ఇరవైలో ప్రారంభమైంది. ఈ బెలూన్ సఫారి వల్ల పర్యాటకులు పులులు, ఎలుగుబంట్లు, చిరుత పులులను ఎత్తునుండి తిలకించవచ్చు. బెలూన్లోని గాలి వేడెక్కి, బయట ఉన్న గాలి కన్నా తక్కువ బరువై పైకి లేస్తుంది. లోపలి గాలిని చల్లబరిస్తే, మళ్లీ బెలూన్ కిందికి వస్తుంది. ఈ రకం బెలూన్లలో స్టీరింగ్ వంటిదేమీ ఉండదు. గాలివాటం బట్టి ముందుకు పోతాయని చదివాను’ చెప్పింది. ‘మనమూ వెళ్లి చూద్దాం అమ్మా’ అంది డాలీ. స్వీటీ, కిట్టూ కూడా తమ కోరిక కూడా అదే అన్నట్లు ప్రకాశ్ వంక చూశారు.

అంతలో మహేశ్ అందుకుని ‘సరే. ముందర బెలూన్ ఫెస్టివల్స్ గురించి తెలుసుకోండి. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని అనేక దేశాలలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఇవి ఎయిర్ హాట్ బెలూన్స్ ఆపరేటర్లకు, ప్రజలకు కూడా వేర్వేరు వినోదాంశాలలో పాల్గొనడానికి వేదికలవుతాయి. బ్రిస్టల్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్ యూరప్ లోనే అతి పెద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌గా పేర్గాంచింది. ఇదిలా ఉంటే న్యూమెక్సికోలోని అల్బుకెర్క్‌లో జరిగే బెలూన్ ఫెస్టివల్ పంథొమ్మిది వందల డెబ్బై రెండులో కేవలం పదమూడు బెలూన్లతో ప్రారంభమై, ఇప్పుడు ఐదువందల యాభై హాట్ ఎయిర్ బెలూన్లతో ప్రపంచంలోనే అతి పెద్ద బెలూన్ ఫెస్టివల్‌గా ప్రసిద్ధి చెందింది. విదేశాలలో మాట ఎలా ఉన్నా మన దేశంలో రాజస్థాన్, ఆగ్రాలలో ఈ ఫెస్టివల్స్ జరిగాయి. గంగానది పుష్కరాల సందర్భంగా లక్నోలో కూడా జరిగాయి. అంతెదుకు రెండువేల పంథొమ్మిదిలో మన తెలుగునాట ‘అరకు’లో కూడా జరిగింది. ఈ ఫెస్టివల్స్‌లో బెలూన్లలో నైట్రోజన్, ఎల్‌పిజి గ్యాస్‌ను నింపారు. బెలూన్ రైడ్‍కు ఉపయోగించే ఒక్కో బెలూన్ ఖరీదు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ నిజంగా ఆకాశంలో అద్భుతాల్లాగా ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి’ అన్నాడు.

‘ఆకాశంలో అంత పెద్ద పెద్ద బెలూన్లు ఎగురుతుంటే భలేగా ఉంటుంది. నేను టీవీలో చూశాను’ అన్నాడు కిట్టూ. అంతా వింటూ ‘మా జాతి ఇంత విస్తృతంగా పనిచేస్తోందా’ అనుకుని విస్తుపోయాం.

అంతలో ప్రకాశం మాట్లాడుతూ ‘నాకిప్పుడు గుర్తుకొస్తోంది. వాతావరణ విభాగంలోనూ బెలూన్లు పనిచేస్తాయి. పద్దెనిమిది వందల తొంభైలలో గుస్తావ్ హర్మైట్ మొట్టమొదటిసారిగా వాతావరణ బెలూన్లను కనుగొన్నాడు. వాతావరణ శాస్త్రవేత్తలు అధిక ఎత్తులో వాతావరణ కొలతలకు వాతావరణ బెలూన్లను ఉపయోగిస్తారు. శాస్త్రవేత్తలు హీలియం నిండిన బెలూన్‌కు రేడియో సాండ్ అనే పరికరాన్ని అనుసంధానం చేస్తారు. రేడియో సౌండే ఉష్ణోగ్రత, తేమ, వాయుపీడనాలను కొలుస్తుంది. ఈ కొలతలను రేడియో ట్రాన్స్‌మీటర్ల ద్వారా గ్రౌండ్ స్టేషన్లకు ప్రసారం చేస్తుంది. వాతావరణ బెలూన్ ఎత్తయిన ప్రదేశాలకు చేరినప్పుడు అక్కడ గాలిపీడనం తగ్గి, బెలూన్ లోపలి హీలియం లేదా హైడ్రోజన్ పీడనం పెరిగి, బెలూన్ విస్తరిస్తుంది. ఈ విధంగా బెలూన్, రేడియో సౌండ్ వాతావరణంలోకి ఒక స్థిరమైన వేగంతో పైకి లేస్తుంది. బెలూన్లు నిమిషానికి దాదాపు వేయి అడుగుల వేగంతో పైకి జూమ్ అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలు రోజుకు రెండు సార్లు దాదాపు తొమ్మిది వందల స్థానాల నుండి ఒకే సమయంలో వాతావరణ బెలూన్లను ప్రయోగిస్తారు’ చెప్పాడు.

‘బెలూన్ అంటే ఏదో ఆడుకునేదే అనుకున్నాను. బెలూన్‌లలో ఇన్ని రకాలున్నాయని, వాటివల్ల ఎన్నెన్నో ఉపయోగాలు న్నాయని ఇప్పుడే తెలిసింది’ కిట్టూ అన్నాడు. ‘ఇంకా ఉంది. బెలూన్లను వైద్య చికిత్సలో కూడా వాడతారు. గుండె జబ్బు ఉన్న వారికి బెలూన్ యాంజియోప్లాస్టీ చేయడం తెలిసిందే’ అన్నాడు మహేశ్. ఇది విన్న మా సంతోషం ఏమని చెప్పాలి. మా గుత్తి లోని ఓ బెలూన్ ఆనందం పట్టలేక ఠాప్‌మని పేలింది. ‘అయ్యో!’ అనుకున్నాం అందరం. కానీ ఆనందంతో నిష్క్రమించడం కూడా అదృష్టమే అనిపించింది. డాలీ కూడా ‘అయ్యో!’ అంది విచారంగా. అంతా ఓ నిముషం మౌనం.

‘మొన్న కథ చెప్పమంటే మా అమ్మ ‘మాట్లాడే బుడగ’ కథ చెప్పింది తెలుసా’ అంది స్వీటీ. దాంతో అందరితో పాటు మేం కూడా ఆ కథ వినాలని ఆత్రుతపడ్డాం. ‘త్వరగా చెప్పు’ అన్నారు డాలీ, కిట్టూ. ‘ఓ బెలూన్లు అమ్ముకునే వ్యక్తి రంగు రంగుల బెలూన్లను ఊది అమ్మకానికి తయారు చేస్తుండగా ఓ నీలం రంగు బెలూన్ హఠాత్తుగా మాట్లాడుతూ.. ‘నన్ను మిగతావాటికంటే పెద్దగా ఊదవా?’ అని అడిగింది. ఆ వ్యక్తి దాని మాటలకు ఆశ్చర్యపోతూనే ‘అలా అయితే నీకు గర్వం ఎక్కువవుతుంది’ అన్నాడు. అందుకు ఆ నీలం బెలూన్ ‘లేదు, లేదు నేను అణకువగానే ఉంటాను. పెద్దగా తయారుచేయవా?’ వేడుకొంది. ఆ వ్యక్తి ‘సరే’ అంటూ ఆ నీలం బెలూన్‍ని పెద్దగా ఊది దారంతో కట్టేశాడు. దాంతో ఆ నీలం బెలూన్ ఆనందానికి, అతిశయానికి హద్దుల్లేకుండా పోయాయి. మిగతా బెలూన్లతో ‘ఏంటి నన్ను చూసి కూడా ఏం మాట్లాడరు. నేను మీకన్నా పెద్దగా, ప్రత్యేకంగా ఉన్నానని మీకు అసూయ. అవునా?’ అంది. అందుకు మిగతావి ‘పెద్దగా ఉంటే ఏంటిట. ఎవరి ప్రత్యేకత వారిది’ అన్నాయి. అందుకు నీలం బెలూన్ ‘చాల్లే. నా ప్రత్యేకత వేరు. చూస్తూ ఉండండి. నన్నే ముందు కొనుక్కుంటారు.’ అంది. అన్నట్లు ఓ పిల్లవాడు తనకు నీలం బెలూనే కావాలని కొనుక్కున్నాడు. అది గర్వంగా చూస్తూ అతడి చేతిలోకి వెళ్లింది. బెలూన్లు అమ్ముకునే వ్యక్తి తన సైకిల్‌ను దగ్గరలోనే నిలిపాడు. నీలం బెలూన్ కొనుక్కున్న పిల్లవాడు దాన్ని ఉత్సాహంగా పై పైకి ఎగరేయసాగాడు. నీలం బెలూనకు భయం వేసింది. ‘ఇట్లా ఇష్టం వచ్చినట్లు ఎగరేస్తున్నాడు. దేనికైనా వెళ్లి కొట్టుకుంటే’ అనుకుని మరింత భయపడింది. అంతలోనే నీలం బెలూన్ వెళ్లి ఓ ముళ్ల చెట్టుకు ఢీకొని ఠాప్ మని పేలింది. అది చూసి బెలూన్లు అమ్మే వ్యక్తి, మిగిలిన బెలూన్లు కూడా ‘దాని ఆకారమే దానికి అంతం తెచ్చి పెట్టింది’ అనుకున్నాయి. అందుకే నేనే గొప్ప అని గర్వపడకూడదు. గర్వం మన నాశనానికే దారి తీస్తుంది అని చెప్పింది. అమ్మ’ ముగించింది స్వీటీ. ‘బాగుంది గర్విష్టి బెలూన్ కథ’ అన్నారందరూ.

‘ఇప్పటి వరకు మనవల్ల అన్నీ ఉపయోగాలే అని మనం చాలా గొప్పవాళ్లమనీ అనుకున్నాం. మన జాతిలో కూడా కొన్ని దుర్గుణాలు ఉన్నాయన్నమాట. ఎవరికైనా గర్వం ఎప్పుడూ మంచిది కాదు’ పరస్పరం అనుకున్నాం మేం.

‘ఇంక మేం వెళ్లిస్తాం మహేశ్’ అన్నాడు ప్రకాశ్. ‘టిఫిన్ చేసి వెళ్తురుగానీ ఉండండి’ అంది అపర్ణ. ‘లేదమ్మా! వచ్చేటపుడే పిల్లలు గొడవ చేస్తే సమోసాలు తినాల్సివచ్చింది. నా పొట్ట బెలూన్‌లా ఉందిప్పుడు’ అన్నాడు ప్రకాశం. దాంతో అంతా నవ్వారు. ప్రకాశ్ లేవడంతో, కిట్టూ, స్వీటీ కూడా లేచి వీడ్కోలు చెపుతూ ముందుకు కదిలారు.

డాలీ మా గుత్తిని పదిలంగా తన మంచం మీద ఉంచి, గులాబీ రంగు బెలూన్‌ను అయిన నన్ను ప్రేమగా నిమిరింది. ఆ ప్రేమకు నా మనసు ఉప్పొంగింది. ‘డాలీ!’ వాళ్లమ్మ పిలవడంతో మమ్మల్ని వదిలి వెళ్లింది. అంతా నిశ్శబ్దమయిపోయారు.

కానీ నా మనసు మాత్రం మళ్లీ సంభాషించడం మొదలు పెట్టింది. ‘మాకు, మానవులకు ఓ రకంగా దగ్గర పోలిక ఉందనే చెప్పాలి. మాలో గాలి ఉన్నంత వరకే మేం జీవిస్తాం. అలాగే మనిషి కూడా గాలి పీల్చుకోలేకపోతే మరణిస్తాడు. కాకపోతే మేం అల్పాయుష్కులం. అయితేనేం. ఆ స్వల్పకాలంలో కూడా అందరికీ సంతోషాన్నే కలిగిస్తాం. మరి మనిషి! ఇతరులను అనేక రకాలుగా బాధించి ఆనందిస్తుంటాడు. మమ్మల్ని అమ్మే వ్యక్తి ఇంట్లో కొంతకాలం ఉన్నాం. అప్పుడు టీవీలో వచ్చే ఓ సినిమా చూశాం. అందులో పుట్టినరోజు వేడుకలో అందరికీ ఆనందం కలిగిస్తూ ఉన్న మా జాతిని ఊదుకడ్డీతో పొడిచి మరీ పేల్చారు. అవి ఎంత దుఃఖపడి ఉంటాయి, ఏం చేశాయని వాటికి ఆ శిక్ష? మా ప్రాణం తీసి, ఠాప్ మనే శబ్దం రాగానే ఉలికి పడుతూ సంబరపడటం అదేం వేడుక? మనిషి నా మాట అర్థం చేసుకోగలిగితే అలా మా జాతిని పొడిచి మరీ చంపొద్దని చెప్పాలనుంది. మేం బతికేదే స్వల్ప కాలం. ఆ కాస్తలోనే దారుణంగా మా జాతిని చంపడం ఏం న్యాయం? మరోమాట.. పొగడ్తలకు ఉబ్బిపోయి, మంచి దారి వీడకండి. ఎందరికో ఉపాధి కల్పిస్తూ, పిల్లలు, పెద్దలందరికీ కనువిందును, సంతోషాన్ని కలుగజేస్తున్నాం. దానికన్నా జన్మకు ధన్యత మరేముంటుంది? అంతలోనే వీధిలో బెలూన్లు అమ్మేవాడి ఈల చప్పుడు వినిపించింది. మా వాళ్లను చూడాలని మనసు ఉరకలేసింది. అదే సమయంలో మా గుత్తికి ఉన్న బంధం తమాషాగా విడిపోయింది. అంతే.. మేం గాల్లో తేలుతూ, దొర్లుతూ..

డాలీ రానే వచ్చింది. ‘అయ్యో నా బెలూన్లు నా బెలూన్లు’ అంటూ గబగబా మమ్మల్ని పట్టుకునేందుకు మేం ఎటు వెళితే అటు.. డాలీ మాట విని అమ్మా, నాన్నలు కూడా వచ్చి చేరారు. ‘పట్టుకో.. పట్టుకో..’ అంటూ. మేం ఎగరసాగాం మరింతగా ఆనందం పంచుతూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here