అన్నింట అంతరాత్మ-3: బడిలో.. గుడిలో.. అంతట మ్రోగే గంటను నేను

7
2

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ఓ గంట అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]ఎ[/dropcap]వరో పిల్లవాడు ఇటే వస్తున్నాడు. వచ్చి స్తంభానికి ఎగబాకి నా వంక చిరకాలానికి చూసిన మిత్రుణ్ని చూసినట్టు ఒక చూపు చూసి నన్ను మళ్లీ మళ్లీ మోగించాడు. నాకెంత ఆనందమనిపించిందో. ఎన్నాళ్లయింది నేను మోగి! ఇంతలో ‘నాతో పాటు నడవమంటే చేయి విదుల్చుకుని స్కూలు లోపలకు వచ్చావా. నీ అల్లరి రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఇదుగో శానిటైజర్. ముందు చేతులు శుభ్రం చేసుకో. జాగ్రత్తగా ఉండాలని చెప్పానా’ వాళ్ల నాన్న కోప్పడ్డాడు. ‘బడి గంట వినాలనిపించింది నాన్నా’ నా వంకే చూస్తూ చెప్పాడు ఆ పిల్లవాడు. ‘ఊఁ..కొట్టావు, విన్నావు. ఇంక పద’ వాళ్ళ నాన్న మళ్లీ హెచ్చరించడంతో నా వంక ప్రేమగా, ఆ తర్వాత దిగులుగా ఓ సారి చూసి తండ్రిని అనుసరించాడు. పిల్లవాడు. పెద్దగేటుకు ఉన్న చిన్న తలుపులోంచి ఇద్దరూ దూరి వెళ్లిపోయారు. మళ్లీ నేను.. నా ఏకాంతము. ఈ కోవిడ్ గొడవ లేకపోతే నా చుట్టూ పిల్లలతో, టీచర్లతో, వచ్చి, పోయే వారితో ఎంత కోలాహలంగా ఉండేది! అసలు నన్ను మోగిస్తేనే కదా బడి మొదలయ్యేది. ఫస్ట్ బెల్ సమయానికి కొంతమంది బడికి చేరుకుంటే సెకండ్ బెల్ మోగితే చాలు ఎక్కడెక్కడి వాళ్లు ఉరుకులు పరుగులతో బడికి చేరుకునేవారు. ఆ తర్వాత మొదటి పీరియెడ్ నుంచి ప్రతి పీరియెడ్‌కు నిరిష్ట సమయానికి నన్ను మోగించాల్సిందే. లంచ్ బెల్ మోగగానే పిల్లల ముఖాల్లో అప్పుడు ఎంత ఆనందమో. ఏదో నిర్బంధం లోంచి బయట పడ్డట్టు. లంచ్ బెల్ అయిపోయినట్టు నేను మోగగానే అప్పుడే అయిపోయిందా అన్నట్టు తరగతి గదుల్లోకి మెల్ల మెల్లగా అడుగులు. మళ్లీ మధ్యాహ్నం పీరియెడ్లు. చివరి పీరియెడ్ గేమ్స్. అప్పుడు మాత్రం నేను మోగగానే పిల్లలకు ఎంత ఉ త్సాహమో. అందరూ పొలోమంటూ గ్రౌండ్ లోకి.. అలాగే చివరగా ఇంటిబెల్ మోగగానే అంతా హడావుడిగా బ్యాగులు అందుకుని, కబుర్లు చెప్పుకుంటూ, బైబైలు చెప్పుకుంటూ వెళ్లిపోయేవారు. అంతవరకు నేనూ డ్యూటీ చేస్తున్నట్లే భావించేదాన్ని. ఒక్కోసారి అల్లరి పిల్లలు అటెండర్ చూడకుండా టైమ్ కాకముందే బెల్ కొట్టడం, అంతలో ఎవర్రా అది అంటూ అరవడం.. తరగతి గదుల్లో ఎవరూ అప్పుడే లేవకండి అంటూ అరుపులు.. ఇవన్నీ మామూలే. అలాంటి సందడి అంతా హఠాత్తుగా ఆగిపోయింది. ఎవరూ బడికి రావట్లేదు. ఈ మాయదారి కోవిడ్ ఎప్పుడు పోతుందో, మళ్లీ నేను గణగణ మోగేదెప్పుడో…

అన్నట్లు ఓసారి అరవింద్ అనే అబ్బాయి బడికి ఆలస్యంగా వచ్చాడు. టీచర్ ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే ‘టీచర్ వచ్చేటప్పుడు తోవలో ఉన్న గుడికెళ్లాను టీచర్. గుడికెళితే తప్పనిసరిగా గంటకొట్టాలని మా అమ్మ చెప్పింది. అందుకని గంట కొట్టాలని ప్రయత్నించా. అందలేదు. ఎన్నిసార్లు ఎగిరానో. చివరకు ఒక అంకుల్ నన్నెత్తుకుని గంట కొట్టించారు. దాంతో లేటయింది టీచర్’, అరవింద్ చెప్పింది విని అంతా నవ్వారు. టీచర్ కూడా ముసిముసి నవ్వులు నవ్వి ‘ఊఁ…సర్లే, స్కూలుకు టైమవుతుంటే అలా వెళ్లకూడదు. సాయంత్రం పూట, లేదంటే సెలవుల్లో వెళ్లాలి. ఇంకోసారి ఇలా చేయకు’ అని కోప్పడింది. అప్పుడనుకున్నాను గుళ్ళలో కూడా నా బంధువులున్నారని. అయితే ఒకటి వాళ్లు నా కన్నా భిన్నంగా ఉంటారు. నాకెలా తెలుసు అంటే, ఒకటో తరగతి తెలుగు వాచకంలో ‘గంట’ అని బొమ్మతో సహా ఉంది. టీచర్ పిల్లలకు చెపుతూ ‘గుళ్లో గంటలు ఇలా ఉంటాయి’ అంటూ చెప్పింది. అలాగే ఇంగ్లీషు టీచర్ పిల్లలకు ఇంగ్లీషు పదాలు చెపుతూ ‘బి ఫర్ బెల్.. బెల్ అంటే గంట’ అని చెప్పటమూ విన్నాను.

అన్నట్లు రోజూ కొందరు పెద్దవాళ్లు మార్నింగ్ వాక్‌కు వచ్చి ఇక్క డ చెట్ల దగ్గర కూర్చుని మాస్క్‌లు ధరించే మాట్లాడుతుంటారు. వాళ్ల మాటల్లో నాకెన్నో విశేషాలు తెలుస్తుంటాయి. ఆమధ్య అయోధ్య రామాలయం కోసం ఉత్తరప్రదేశ్ లోని జిలేసర్ పట్టణంలోని గంటల తయారీదారులైన దయాళ్ కుటుంబం వారు రెండువేల వంద కిలోల బరువుండే గంటను తయారుచేసి అందించారట. దాని తయారీకి అయిన ఖర్చు దాదాపు ఇరవై ఒక్క లక్షల రూపాయలట. ఆ గంటను ఇక్బాల్ మిస్త్రీ అనే ముస్లిం కళాకారుడు డిజైన్ చేశాడట. ఈ గంట తయారీలో కంచుతోపాటు బంగారం, వెండి, ఇత్తడి, రాగి, సీసం, తగరం, ఇనుము, పాదరసం వంటి అష్ట ధాతువులను వినియోగించారని, దాని శబ్దం పదిహేను కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందని, ఇక దక్షిణ భారతదేశం నుంచి కూడా ఓ గంటను పంపారని, దాన్ని రామేశ్వరంలో రూపొందించారని, దాని బరువు ఆరొందల పదమూడు కిలోలని, దాన్ని మోగిస్తే ‘ఓం’ అనే శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరంవరకు వినిపిస్తుందని పరస్పరం చెప్పుకోగా విన్నాను. అంతేనా. మరో ఆయన అందుకుని, ‘ఈ గంటల బరువునే గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ప్రపంచంలో అన్నిటికంటే బరువైన గంట రష్యన్ జార్ బెల్, అది మాస్కో, క్రెమ్లిన్‍లో ఉంది, దాని బరువు రెండువందల పదహారు టన్నుల’ని చెప్పడంతో ఆశ్చర్యపోయి, మా గంట జాతి ఎంత గొప్ప దో అని పొంగిపోయాను. ఇంకో రోజు వారే మరో చర్చజరిపారు.

అదెలాగంటే నరసింహారావుగారు ‘ఏమండీ శ్రీనివాసమూర్తిగారూ! అసలు గుడిలో గంట ఎందుకు కొడతారో మీకేమైనా తెలుసా?’ అని అడిగారు. వెంటనే ప్రసాదరావు అనే ఆయన అందుకొని ‘ఆఁ ఏముంది, మేం వచ్చాము అని గుడిలో దేవుడికి తెలియజేయడానికి’ అన్నారు. ‘అది సరేలే. శ్రీనివాసమూర్తి గారయితే విశేషార్థాలు చెపుతారు. మీరు చెప్పండి’ అన్నారు నరసింహారావు. దాంతో ఆయ న ‘సరే, వినండి. ఆలయానికి వెళ్లినపుడు ముందుగా గంటను మోగించి, ఆ పైన దైవాన్ని దర్శించుకుంటాం. గంటను మోగిం చినపుడు వచ్చే శబ్దాన్నే ఘంటానాదం అంటాం. శబ్దం రెండు రకాలు. ధ్వని, నాదం. ధ్వని అంటే వినిపించి, వెంటనే ఆగిపోయేది. ఇక నాదం, కొద్ది సమయం పాటు అలా వినిపిస్తూనే ఉంటుంది. దేవాలయంలో గంటకు సంబంధించి ఓ శ్లోకం ఉంది..

ఆగమార్థంతు దేవానం గమనార్థంతు రాక్షసాం।
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం॥

ఈ శ్లోకం చెపుతూ, ఘంటానాదంతో ఓంకారాన్ని పుట్టించడంలో గల అంతరార్థం ఈ పవిత్ర శబ్దంతో దేవతలకు స్వాగతం పలుకుతూ, రాక్షసులను అక్కడనుంచి వెళ్లగొట్టడమన్నమాట. ఆ శబ్దంతో పరిసరాలన్నీ పవిత్రమవుతాయన్న భావన. అదే సమయంలో మన అంతరంగాన్ని కూడా పరిశుద్ధం చేసుకోవాలి. భక్తులే కాదు, ఆలయాలలో మంగళహారతుల సమయంలో, మహానివేదన సమయంలో, నీరాజనాన్ని సమర్పించేటపుడు గంట తప్పనిసరిగా మోగించడం తెలిసిందే. కుండలినీ యోగంలో అయితే గంటను మోగించడం వల్ల వచ్చే శబ్దం శరీరంలోని చక్రాలను శక్తిమంతం చేసి, శక్తిపంపిణీని సమతుల్యం చేస్తుందని చెపుతారు. ఇక పంచధాతువులతో తయారయ్యే ఈ గంటలు పంచభూతాలకు ప్రతీకలంటారు. అలాగే గంటలో వంపుతిరిగిన భాగం ‘అనంత’కు, లోపలి గంట భాగం ‘సరస్వతి’కి, పైనుండే హేండిల్ ప్రాణశక్తికి ప్రతీకలని హిందూమతం చెపుతుంది’ అంటూ వివరించాడాయన.

‘చర్చిలలో కూడా గంటల ఏర్పాటు ఉంటుంది. ప్రార్థనల సమయమైందని తెలియజేస్తూ, అక్కడకు ఆ వేళకు అందరూ చేరుకునేందుకు వీలుగా గంటలు మోగిస్తారు’ చెప్పాడు మరొకాయన.

అన్నట్లు ఆమధ్య అంటే ప్రపంచమంతా సవ్యంగా ఉండి బడి పిల్లలతో సందడిగా ఉన్న రోజుల్లో ఓ రోజు ఉన్నట్లుండి రోడ్డుమీద ఓ వాహనం గణగణ గంటలు మోగించుకుంటూ శరవేగంగా వెళ్లింది. అప్పుడు అటెండర్ రామయ్య ‘ఫైరింజన్ వెళ్తోంది, ఎక్కడ అగ్నిప్రమాదం జరిగిందో ఏమో’ అన్నాడు ఆయా కమలమ్మతో. అప్పుడర్థమైంది ఇలా కూడా మావాళ్లు సేవలందిస్తున్నారని. ఇంకో సంగతి ఏమంటే రామయ్య రోజూ బడికి సైకిల్ మీద వస్తాడు. షెడ్‌లో పెట్టిన ఆ సైకిల్ దగ్గరకెళ్లి కొంతమంది చిన్నపిల్లలు సైకిల్ బెల్ ఒకటే మోగిస్తారు. రామయ్య పరుగెత్తుకొచ్చి కోప్పడితే అక్కడ్నుంచి పరుగుతీస్తారు. అంటే సైకిల్ బెల్ మా జాతి లోదే. అంతేకాదు, ప్రిన్సిపల్ రూమ్‌లో మరో బెల్ ఉంది. ఆమె అది మోగించగానే రామయ్య లోపలికి వెళ్తాడు. ఒకవేళ రామయ్య గానీ ఆలస్యం చేశాడా, ‘కాలింగ్ బెల్ వినిపించడం లేదా?’ అని క్లాసు తీసుకుంటుంది. అలాగే పిల్లలకు వక్తృత్వ పోటీలవంటివి పెట్టిన పుడు కూడా ఈ బెల్ కొట్టి మాట్లాడేవారికి ఇచ్చిన సమయం అయిపోయిందని తెలియజేస్తుంటారు.

అన్నట్లు పనేమీ లేనప్పుడు రామయ్య, కమలమ్మతో కబుర్లు చెపుతుంటాడు. ఓ రోజు ‘మా సొంతూరు జాజులూరులో ఒకప్పుడు మాతాత రైల్వే స్టేషన్లో రైలుబండి రాకపోకలప్పుడు గంట కొట్టేవాడు. ఇప్పుడు నేను బడిగంట కొడుతున్నాను. లౌడ్ స్పీకర్లు వచ్చాక రైల్వే స్టేషన్లలో గంట కొట్టడం లేదు. అయినా చిన్నచిన్న స్టేషన్లలో ఇంకా ఉండే ఉంటాయి’.

ఓ రోజు తెలుగు టీచర్ కథ చెపుతూ ‘అవంతీ రాజ్యాన్ని మహీపాలుడనే రాజు పాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలకు సత్వర న్యాయం అందేది. రాత్రింబగళ్లు అందుకు పాటుపడేవాడు. అందుకోసం ధర్మగంటను ఏర్పాటుచేసి ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే, ఏ సమయంలో అయినా సరే, వచ్చి ధర్మగంట మోగిస్తే చాలు, రాజు వెంటనే వెళ్లి వారి సంగతి విచారించి, న్యాయం ప్రసాదించేవాడు’ అని చెప్పింది. ‘ధర్మగంట’ పేరు ఎంతబా గుందో అనిపించింది.

ఆఁ అన్నట్లు గుర్తొచ్చింది. ప్రిన్సిపల్ రూమ్‌లో ప్రతి గంట కాలవ్యవధికి గంటలుకొట్టే గోడ గడియారం కూడా ఉంది. అలా సమయాన్ని తెలియచెప్పడానికి కూడా మా సోదరుడే పనిచేస్తున్నాడని గర్వపడతాను.

అన్నట్లు ఓ రోజు ఐదో తరగతి అమ్మాయి అవనిజ పుట్టిన రోజున పట్టులంగా ధరించి ప్రత్యేకంగా తయారయి వచ్చింది. ఆ అమ్మా యి చాక్లెట్లు పంచుతుంటే ‘నీ జడగంటలు చాలా బాగున్నాయ్’ అంది టీచరు. అప్పుడర్థమైంది, జడకు పెట్టుకున్న వాటిని కూడా ‘గంటలు’ అంటారు. బహుశా వాటి ఆకారాన్ని బట్టి ఆ పేరు వచ్చి ఉంటుంది. ఆ మధ్య గంగిరెద్దుతో విన్యాసాలు చేయిస్తూ సన్నాయి ఊదుతూ ఊదుతూంటే అందరూ ఆసక్తిగా చూడటం గ మనించాను. ఆ గంగిరెద్దు మెడలో కూడా చిన్ని చిన్ని గంటల అలంకారం ఉంది. ‘ఓఁ అయితే నేను అలంకారంగా కూడా పని కొస్తానన్నమాట’ అనుకున్నాను. అలంకారమంటే గుర్తుకొస్తోంది. ఆమధ్య రవళి అనే పాప ఓ డ్రెస్ వేసుకొచ్చింది. దానికి ప్లాస్టిక్ గంటల అమరిక కూడా ఉంది. మరో పిల్ల వచ్చి ‘నీ లెహంగాకు ఈ ప్లాస్టిక్ గంటల డిజైన్ చాలా బాగుంది’ అంది.

ఓ రోజు రాకేష్ అనే కుర్రాడు దినేష్‌తో ‘స్కూల్లోనే కాదురా సినిమా హాల్లో కూడా ఇంటర్వెల్ ఉంటుంది. దానికి బెల్ కూడా ఉంటుంది’ అంటుంటే విన్న గుర్తు. అన్నట్లు ఒకసారి బడి వార్షికోత్సవంలో ఒకాయన ప్రసంగిస్తూ తన చిన్నప్పటి బడి గంటల ధ్వని ఇప్పటికీ మదిలో వినిపిస్తూనే ఉంటుందని, ‘గంటలు’ పేరుతో మహాకవి శ్రీశ్రీ కవిత రాశారని కవిత మొత్తం చదివాడు.. తన గురించి ఎంత గొప్పగా రాశారో.. కవిత మొత్తం గుర్తులేదుకానీ మధ్య లోని కొన్ని పంక్తులు మాత్రం తన హృదయంలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అవి..

కర్మాగారాము, కళాయతనమూ,
కార్యాలయమూ, కారాగృహముల
దేవుని గుడిలో, బడిలో, మడిలో
ప్రాణము మ్రోగే ప్రతిస్థలములో,
నీ హృదయములో, నా హృదయములో
గంటలు! గంటలు!
గంటలు! గంటలు!
ఉత్తరమందూ, దక్షిణమందూ,
ఉదయమునందూ, ప్రదోషమందూ,
వెన్నెలలోనూ, చీకటిలోనూ,
మండుటెండలో, జడిలో, చలిలో
ఇపుడూ, అపుడూ, ఎపుడూ మ్రోగెడు
గంటలు! గంటలు!గంటలు!….
గణగణ గణగణ గంటలు! గంటలు!…

మొన్న ఉదయపు నడకల వారు మాట్లాడుకుంటూ ముంచుకొచ్చే విపత్తుల గురించి ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నా ప్రభుత్వం చెవిని పెట్టటం లేదని అన్నారు. ఇలా ఎన్నో రకాల అర్థాలతో మోగే మా గంటల జాతి సేవలను ఈ మానవులు సద్వినియోగం చేసుకోవాలని నా కోరిక. చైతన్య పరుస్తూ, హెచ్చరికలు చేస్తూ, నిర్దిష్ట సమయాన్ని తెలుపుతూ సేవలందించడం నాకెంతో గర్వకారణమని ‘ఘంటా’పథంగా చెప్పగలను. ఈ కరోనా నేపథ్యంలో చాలా చోట్ల లాక్ డౌన్ పరిస్థితులున్న కారణంగా మోగే గుణం గల నేను మూగగా, నాలో నేనే గొణుక్కుంటున్నాను. ఎంత దౌర్భాగ్యం! ఆఁ అదుగో కోతి.. పరుగున వచ్చిపదే పదే నన్ను మోగిస్తోంది. నా మనసంతా ఆనందం ఉప్పొంగగా మోగుతున్నా.. గణగణ..గణగణ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here