అన్నింట అంతరాత్మ-32: మీ గౌరవ చిహ్నాన్ని.. ‘తలపాగా’ను నేను!

5
1

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం తలపాగా అంతరంగం తెలుసుకుందాం.

***

ఈ రోజు ఆదివారం. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న గోపీకృష్ణ దృష్టి ఎందుకో షో కేసులో ఉన్న మా మీద అదేనండీ.. మా తలపాగాల మీద పడింది. తదేకంగా చూస్తున్నాడు. ఈ షో కేసులో గోపీకృష్ణ తన తండ్రి వాడిన తలపాగా, తన పెళ్లినాటి తలపాగా, ఇంకా అతడు వేర్వేరు చోట్లకు వెళ్లినప్పుడు సేకరించిన తలపాగాలు ఉన్నాయి. నేను అతడికెంతో ఇష్టమైన తలపాగాను. ఎందుకంటే అతడు, తన పెళ్లిలో ధరించిన తలపాగాను నేను.. ‘ఇన్నాళ్లకు మేం గుర్తుకొచ్చాం’ అనుకున్నాను నేను. ఏవో ఆలోచనల్లో మునిగినట్లు అతడి వైఖరి చెపుతోంది.

అంతలో రాహుల్ రానే వచ్చాడు. రావడంతోనే ‘నాన్నా! నేను ఫ్యాన్సీ డ్రెస్ పోటీలకు పేరిచ్చాను. స్వామి వివేకానంద వేషం వేస్తున్నా. అలాంటి తలపాగా ఏమైనా ఉందా నీ కలెక్షన్‌లో?’ అడిగాడు. ‘ఉంది. కానీ నీ చిన్న తలకు ఇది పెద్దదవుతుంది. బయటే అద్దెకు తెద్దాంలే. డ్రెస్‌తోపాటు తలపాగా కూడా వాళ్లే ఇస్తారు’ అన్నాడు గోపీకృష్ణ.

మాలో ఏ ఒక్కరం ఉపయోగపడలేకపోయామని నేను బాధపడుతుంటే ‘సరే అయితే’ అన్నాడు రాహుల్.

‘నాన్నా! అసలు తలపాగాలు ఎందుకు ధరిస్తారు?’ అడిగాడు రాహుల్.

‘మొదట్లో ఎండ వేడిమి నుంచి రక్షణకు వాడేవారు. చాలా ప్రాంతాలలో తలపాగాను గౌరవచిహ్నంగా కూడా భావిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో అదొక భాగం కూడా. తెలుగువారు కూడా తలపాగాను ధరించడం మామూలే. రైతులు సైతం తలపాగా చుట్టుకుని పొలం పనులకు వెళ్లడం మనకు తెలిసిందే. చిలకమర్తి, కందుకూరి, గురజాడ, గిడుగు రామ్మూర్తి మొదలైన వాళ్ల ఫొటోలను చూశావా? అంతా తలపాగా ధరించే ఉంటారు. అలాగే గిరిజనులలో కూడా ఎంతో మంది తలపాగా ధరిస్తారు. పూర్వం మహారాజులు బరువైన కిరీటాలను ఉత్సవ సందర్భాలలో ధరించి, సాధారణ సందర్భాలలో తక్కువ బరువు ఉండే, నగిషీలతో అందంగా ఉండే తలపాగాలను ధరించేవారు.’ చెప్పాడు గోపీకృష్ణ.

‘నాన్నా! బాలగంగాధర్ తిలక్ గారి ఫొటో చూశాను. ఆయన తలపాగా వేరుగా ఉంది. అదేమిటి?’ అడిగాడు రాహుల్. ‘నిజమేరా. ఆయన ధరించిన తలపాగా ఎంతో భిన్నంగా ఉంటుంది. దానికి ‘పూనేరి పగిడీ’ అని పేరు. పగిడీ అంటే తలపాగా అని అర్థం. దీన్ని పంథొమ్మిదో శతాబ్దంలో మొదట ప్రాచుర్యంలోకి తెచ్చింది ‘మహదేవ్ గోవింద రెనేడే’. మన దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతంలో వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు రీతుల తలపాగాలు వాడుకలో ఉన్నాయి. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, మహారాష్ట్ర, కర్నాటకలో తలపాగాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. రాజస్థాన్‌లో అయితే ఒక్కో నగరంలో ఒక్కో రకమైన తలపాగా ధరిస్తారు. అది ఎడారి ప్రాంతం కావడంతో మొదట్లో తీవ్ర ఎండ వేడిమి నుంచి రక్షణ కోసం తలపాగా చుట్టుకునేవారట. అది కూడా మామూలుగా కాదు. ఓ పొడవాటి వస్త్రాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం తలపాగా చుట్టుకునేవారు. అందులోని పొరలు రోజంతా తడిగా ఉండటంతో వారికి ఎంతో ఉపశమనంగా ఉండేది’ వివరించాడు గోపీకృష్ణ. ‘అబ్బో! మాకు చాలా చరిత్రే ఉందే. తలకు రక్షణ నివ్వడంతోపాటు వ్యక్తి హోదాకు, గౌరవానికి ప్రతిబింబంగా, సంస్కృతి, సంప్రదాయాల చిహ్నంగా ఉన్నామన్నమాట’ మా వాళ్ల మంతా పరస్పరం చూపులతోనే అభినందించుకున్నాం.

ఇంతలో నీలిమ లోపల్నుంచి వచ్చింది. ‘ఏరా రాహుల్, స్వామి వివేకానంద వేషం వేస్తానంటున్నావు. తలపాగా గురించి అడిగావు. ఆయన తలపాగా పెట్టుకోవడం ఎలా మొదలైందో తెలుసా?’ అడిగింది. ‘తెలియదమ్మా’ రాహుల్ అంటుంటే, ‘వాడికే కాదు, నాకూ తెలియదు.. చెప్పండి టీచర్’ సరదాగా చేతులు కట్టుకుని అన్నాడు గోపీకృష్ణ.

‘వివేకానంద రాజస్థాన్ లోని ఖేత్రి సంస్థానంలో కొన్నాళ్లు ఉన్నారు. ఆ సంస్థానాధీశుడైన రాజా అజిత్ సింగ్ బహదూర్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మౌంట్ అబూలో వివేకానందను కలిశారు. ఆయన బోధనలకు ఎంతో ప్రభావితుడైన రాజా అజిత్ సింగ్, వివేకానందుడికి తలపాగాను బహుకరించారు. అదే తర్వాత వివేకానందుడి వస్త్రధారణలో ఓ భాగమైపోయింది’ చెప్పింది నీలిమ. ‘అలాగా’ అన్నట్లు చూశారిద్దరూ. మా జాతి గురించిన విశేషాలు వినడం మాక్కూడా ఎంతో ఆనందంగా ఉంది.

ఇంతలో గుమ్మంలో చప్పుడైంది. వెంటనే రాహుల్ ‘చరిత్ర తాతగారు’ అని అరిచాడు. ‘రండి బాబాయ్, పిన్నీ’ ఆహ్వానించారు గోపీకృష్ణ, నీలిమ. ‘ఏంటి, మీవాడు నా పేరునే చరిత్రగా మార్చేశాడు’ అన్నాడు నవ్వుతూ. ‘తప్పేముంది, మీరు వచ్చినప్పుడల్లా చరిత్ర విషయాలు చెపుతుంటారు కదా, అందుకే వాడలా అన్నాడు’ పిన్నిగారు రాహుల్ పిలుపును సమర్థిస్తూ అంది. ‘ఇంతకూ ఏమిటీ విషయం, ఏదో చర్చలో ఉన్నట్లున్నారు’ అన్నాడు బాబాయ్ భద్రం. ‘తలపాగాల గురించి మాట్లాడుకుంటున్నాం’ చెప్పింది నీలిమ. ‘గోపీకృష్ణకు తలపాగాల గురించి కొట్టినపిండే కదా’ అన్నాడు బాబాయ్.

‘సేకరించడమేగానీ వాటి గురించి చరిత్ర కోణంలో మీ అంతగా తెలియదు’ అన్నాడు గోపీకృష్ణ.

‘వాతావరణం చల్లగా ఉంది. కాఫీ తెస్తాను, దాన్ని ఆస్వాదిస్తూ మీరు చెప్పండి బాబాయ్’ అంటూ లోపలికి వెళ్లింది నీలిమ. ‘ఎలా ఉంది మీ ఆరోగ్యం’ అడిగాడు గోపీకృష్ణ. ‘బాగానే ఉన్నాం. అన్నట్లు ఈ మధ్య మా విద్యార్థులంతా కలిసి నన్ను సన్మానించారు. అప్పుడు నా తలక్కూడా ఓ మాంఛి పాగా పెట్టారు’ చెప్పాడు బాబాయ్. ‘ఇదుగో ఫొటో. అచ్చు సర్వేపల్లి వారిలాగా లేరూ?’ అంటూ పిన్ని మొబైల్‌లో ఫొటో చూపించింది. అదంతా చూస్తుంటే మాకెంతో సరదాగా ఉంది.

‘నిజమే పిన్నీ.. అలాగే ఉన్నారు. సన్మానాల్లో తలపాగా పెట్టడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది’ గోపీకృష్ణ అంటుంటే, నీలిమ కాఫీలు తీసుకు వచ్చి అందరికీ అందించింది. బాబాయ్ కాఫీ తాగుతూ ‘తలపాగాకు, కోహినూర్ వజ్రానికి సంబంధం ఉంది. తెలుసా?’ అన్నాడు. ‘అవునా.. అదెలా?’ ఆశ్చర్యంగా అడిగారు ముగ్గురూ.

బాబాయ్ కాఫీ కప్పును పక్కన పెట్టేసి, ‘అది పద్దెనిమిదో శతాబ్దం. ఢిల్లీ పాలకుడుగా మహమ్మద్ షా ఉండగా, నాదిర్ షా దండెత్తాడు. మహమ్మద్ షాను ఓడించాడు. ఆ తర్వాత నాదిర్ షా రెండు నెలలపాటు ఢిల్లీలోనే ఉండి, సంపదనంతా దోచుకుని, ఇరాన్ తిరిగి వెళ్లబోయే ముందు పాలనా పగ్గాలను మహమ్మద్ షాకు తిరిగి అప్పగించాలనుకున్నాడు. అదే సమయంలో అతనికో పరమ రహస్యం తెలిసిపోయింది. అది.. వజ్రం గురించి.. దాన్ని మహమ్మద్ షా తలపాగాలో దాచుకుంటాడని.. అది ఇప్పటివరకు దోచుకున్న సంపదకంటే ఎన్నో రెట్లు విలువైందని.. వెంటనే నాదిర్ షా ఓ ఎత్తు వేశాడు. మహమ్మద్ షా తో, ఇక పై ఇద్దరం సోదరులమని, ఈ సంతోష సమయంలో ఇరాన్ సంప్రదాయం ప్రకారం తలపాగాలు మార్చుకుందామన్నాడు. మహమ్మద్ షాకు, అతడి కుయుక్తి అర్థమైనా, ఏమీ అనలేని నిస్సహాయత. మౌనంగా ఉండిపోయాడు. నాదిర్ షా వెంటనే తన తలపాగా తీసి, మహమ్మద్ షా కు ధరింపజేసి, అతడి తలపాగాను తన తలకు ధరించాడు. ఆ తర్వాత నాదిర్ షా తలపాగాలోని వజ్రాన్ని చూశాడు. వెంటనే ‘కోహినూర్’ అని అరిచాడు. కోహ్-ఇ-నూర్ అంటే తేజోవంతమైన పర్వతం. పర్వతమంత ప్రకాశాన్నిస్తుందని.. అయితే కొంతకాలానికి నాదిర్ షా హత్యకు గురికావడం, కోహినూర్ చేతులు మారి చివరకు రంజిత్ సింగ్‌కు చేరడం, కాలక్రమంలో అది ఆంగ్లేయులకు చిక్కి, బ్రిటన్ చేరడం జరిగాయి’ చెప్పడం ముగించాడు. అంత విలువైన వజ్రాన్ని పదిలపరచడానికి మహమ్మద్ షా మా జాతినే ఎంచుకోవడం మాకెంతో గర్వకారణం అనిపించింది.

‘చాలా ఆసక్తికరంగా ఉంది. తలపాగాలు రహస్య స్థావరాలుగా కూడా ఉపయోగిస్తాయన్న మాట’ అన్నాడు గోపీకృష్ణ. ‘తలపాగా, యుద్ధంలో డాలుగా కూడా ఉపయోగపడింది’ అన్నాడు బాబాయ్. ‘అదేమిటో చెప్పండి’ అంది నీలిమ.

‘వినండి.. ఛత్రపతి శివాజీ సైన్యంలో ముఖ్యుడు తానాజీ. అందువల్లే ‘కొండానా’ దుర్గాన్ని జయించే బాధ్యతను తానాజీకి అప్పగించాడు శివాజీ. దుర్భేద్యమైన కొండానా దుర్గాన్ని ఉడుము సాయంతో సైన్య సమేతంగా ఎక్కాడు తానాజీ. కొండానా కిలేదార్‌గా అక్కడున్న ఉదయభాన్ రాథోడ్ సామాన్యుడు కాడు. పదిహేను వందలమంది సైన్యంతో తానాజీని ఎదుర్కొన్నాడు. తానాజీ సైన్యం కేవలం మూడువందలే. అయితేనేం శౌర్య పరాక్రమాలతో విరుచుకుపడ్డాడు. ఉదయభాన్‌తో నేరుగా తలపడవలసి వచ్చింది. అప్పటికే తీవ్రంగా గాయపడి ఉన్నాడు తానాజీ. తన తలపాగానే డాలుగా చేసుకుని, వీరోచితంగా పోరాడి నేలకొరిగాడు తానాజీ. వెంటనే అతడి తమ్ముడు సూర్యాజీ ఉదయభాన్ నెదుర్కొని అతణ్ణి హతం చేసి, కొండానా పై విజయం సాధించాడు. అలా తానాజీకి డాలుగా కూడా తలపాగా ఉపయోగపడింది’ చెప్పాడు బాబాయ్. ‘తానాజీ ఎంత గొప్ప హీరోనో’ అన్నాడు రాహుల్. తానాజీ అంతటి వీరుడికి డాలుగా ఉపయోగపడటం అంటే మా జాతి కూడా చరిత్రపుటలకెక్కి శాశ్వత కీర్తి పొందటమే కదా. మా పూర్వీకుల గొప్పతనానికి మా మేను పులకించింది.

అంతలో పక్కింటికి ఆడుకోవడానికి వెళ్లిన రమ్య తిరిగి వచ్చింది. ‘రా. రా… నువ్వు చాలా మిస్ అయ్యావు’ అన్నాడు రాహుల్. ‘ఏంటబ్బా అంత గొప్ప విషయం’ అంది రమ్య. ‘తలపాగాల గురించి తాతగారు చెప్పిన చరిత్ర కథలు. అయినా నేను, నీకు తర్వాత చెపుతానులే’ అన్నా డు రాహుల్.

‘అయితే సరే.. తలపాగాలు అంటే మన మోడీ గారే గుర్తుకొస్తారు. ఆయన ఎన్నెన్ని రకాల తలపాగాలు ధరించారో. డెబ్బయ్ అయిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో భలే తలపాగా ధరించారు. దాన్ని ‘కొల్హాపురి ఫెటా’ అంటారుట. పొడవైన కాషాయరంగు తలపాగా భలే ఉంది. అన్నట్లు ఆ మధ్య ఒకాయన తలపాగా చుట్టడంలో రికార్డు సాధించాడు. ఆయన పేరు.. ఆఁ పవన్ వ్యాస్. అరగంట వ్యవధిలో నాలుగు వందల యాభై మీటర్ల పొడవైన వస్త్రాన్ని తలపాగాగా చుట్టాడట. తలపాగా చుట్టడం అంత సులభమేం కాదు’ అంది రమ్య.

‘అబ్బో! నీకు కూడా తలపాగా కబుర్లు తెలుసునే’ అన్నాడు గోపీకృష్ణ. నీలిమ అందుకుని ‘ఎక్కడికి పోతుంది మీ వారసత్వం. రమ్య మాటలతో నాకు ఇంకో విషయం గుర్తుకొచ్చింది. ఆమధ్య లండన్‌లో స్థిరపడ్డ భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త రుటెన్ సింగ్‌ తన తలపాగాలకు మ్యాచ్ అయ్యే రంగుల్లో ఏడు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి వార్తలకెక్కాడు’ చెప్పింది. ‘అమ్మో! ఏడు రోల్స్ రాయిస్ కార్లంటే ఎంత డబ్బు కావాలో’ అంది పిన్ని. ‘రుటెన్ సింగ్‌కి డబ్బుదేం సమస్య? బ్రిటన్ బిల్ గేట్స్‌గా పేరొందాడు’ అన్నాడు బాబాయ్.

‘సిక్కులు తప్పని సరిగా తలపాగా ధరిస్తారు కదా, అది వాళ్ల మతాచారమా?’ అడిగాడు రాహుల్.

‘అవును. సిక్కు మతంలో తలపాగాకు ఎంతో ప్రాధాన్యత, గౌరవం ఉన్నాయి. సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ ప్రారంభించిన ఖల్సా పంత్‍లో చేరినవారు జుట్టు కత్తిరించుకోవడం నిషేధం. అందువల్ల వారు తమ జుట్టును ముడివేసుకొని, తలపాగాతో కప్పి ఉంచుతారు. సిక్కులు తలపాగాను, దస్తార్, పగ్రి, పాగ్ పేర్లతో పిలుస్తారు. తలపాగాను వీరు తమ గౌరవానికి, హెూదాకు చిహ్నంగా భావిస్తారు. ఈ తలపాగాలు ఆరు గజాల పొడవు, ఒకటి నుంచి రెండు గజాల వెడల్పుతో ఉంటాయి. వీటిని నూలుతోనే తయారు చేస్తారు. వివిధ రంగుల, డిజైన్లలో కూడా ఉంటాయి. కాషాయం, నీలం, తెలుపు తలపాగాలు సంప్రదాయసిద్ధంగా, మత పరమైన ఉత్సవాలలో ధరిస్తారు. ఎరుపురంగు తలపాగాను వివాహ సందర్భంలో ధరిస్తారు. చిన్నపిల్లలు ధరించేదాన్ని ‘పట్క’ అంటారు. అది చిన్న వస్త్రపు ముక్కగా ఉంటుంది. రంగు ఏదైనా ఉండవచ్చు. పిల్లలకు తొలిసారి సంపూర్ణ అంటే పెద్ద తలపాగా ధరింపజేయడాన్ని ఒక వేడుకగా జరుపుతారు. ఆ వేడుకను ‘దస్తార్‌బంది’ అంటారు. సిక్కులు తలపాగాను కోణీయ ఆకారంలో చుడతారు. అయితే ప్రాంతాన్ని బట్టి శైలి మారటం కూడా మనం గమనించవచ్చు. మన దేశంలో సిక్కులు పెద్ద తలపాగా ధరిస్తే, బ్రిటన్, ఆఫ్రికాలలో సిక్కులు చిన్న దస్తాలు ధరిస్తారు. ఉత్తర అమెరికాలో సిక్కులు మెత్తని తలపాగాలు ధరిస్తారు’ ఆగాడు గోపీకృష్ణ,

మా నేపథ్యంలో ఇన్ని విశేషాలా అని మేం ఆశ్చర్యపోతుండగానే ‘నాన్నా! సిక్కులలో ఆడపిల్లలు తలపాగా ధరించరా?’ అడిగింది రమ్య. గోపీకృష్ణ బదులిస్తూ, ‘సిక్కు గురువులు మహిళలు కూడా తమ ఇష్టాన్ని అనుసరించి తలపాగా ధరించవచ్చని చెప్పారు. పందొమ్మిదో శతాబ్ది చివర సిక్కు పునరుజ్జీవ ఉద్యమ కాలంలో, పంజాబ్‍లో ఎన్నో ఖల్సా బాలికల పాఠశాలలు నెలకొల్పారు. ఆ పాఠశాలల నియమావళిలో బాలికలు తప్పనిసరిగా చిన్న దస్తార్‌ని ధరించాలని పేర్కొన్నారు. నేడు ఈ సంప్రదాయాన్ని అమృతధారీస్ పాటిస్తున్నారు. ప్రఖ్యాత గాయని హర్షదీప్ కౌర్ తలపాగా ధరించడం తెలిసిందే’ వివరించాడు.

‘మరి ముస్లిమ్‍ల తలపాగా సంగతో’ అన్నాడు రాహుల్. ‘ఇస్లామిక్ మతంలో తలపాగా ధరించడం ఒక ఆచారం. ముస్లిమ్‍లు తలపాగాను ‘ఇమామా’ అని పిలుస్తారు. ముస్లిమ్ దేశాలలో పండితులలో అధికులు తలపాగా ధరిస్తారు. కాబట్టి దీన్ని శిరోభూషణంగా కూడా పరిగణిస్తారు. ముస్లిమ్ ప్రముఖులెంతో మంది తలపాగాలు ధరిస్తారు. అలాగే సామాన్యులు సైతం తమతమ రీతుల్లో తలపాగాలు ధరిస్తారు’ అన్నాడు గోపీకృష్ణ. ‘అలాగా’ అన్నట్లు చూశారందరూ.

బాబాయ్ అందుకుని ‘అన్నట్లు మైసోరి తలపాగాల గురించి కూడా చెప్పుకోవాలి. కర్నాటకలోని జిల్లాలలో తలపాగాను ‘మైసోరిపేట’ అని పిలుస్తారు. తలపాగాను వీరు గౌరవప్రదంగా భావిస్తారు. ప్రముఖులను సన్మానించే సందర్భంలో తప్పని సరిగా మైసోరిపేటను వారికి బహుకరిస్తారు’ అన్నాడు. సత్కారంలో మా పాత్ర ఉండటం విన్న నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సన్మాన గ్రహీతలకు మేమో తీపి గురుతుగా మిగులుతామంటే ఎంత సంతోషం!

నేనిలా అనుకుంటుండగానే నీలిమ అందుకుని ‘మహారాష్ట్రలో మరాఠీలు ధరిచే తలపాగాను ఫెటా అంటారు. అక్కడ ముఖ్యమైన సందర్భాలలో ప్రముఖులకు ఆహ్వానం పలికేటప్పుడు సంప్రదాయసిద్ధంగా ఫెటాను ధరిస్తారు. ఈ ఫెటా మూడు నుంచి ఆరు మీటర్ల పొడవుతో తెలుపు లేదా కాషాయం రంగులో ఉంటుంది. ఫెటా రంగును బట్టి సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. దీన్ని పటాక అని కూడా అంటారు. వారు ఫెటాను తమ సంస్కృతి సంప్రదాయాలపట్ల ప్రేమకు, భక్తికి చిహ్నంగా, అలాగే తమ హెూదాకు చిహ్నంగా భావిస్తారు. ఈ ఫెటాను చుట్టుకోవడంలో ఎంతో వైవిధ్యాన్ని కూడా గమనించవచ్చు. కొల్హాపురి, మవాలి, పునేరి, లహరి వంటి ఎన్నో రీతులు వాడుకలో ఉన్నాయి, అన్నట్లు ‘అంతర్జాతీయ తలపాగా దినోత్సవం అనేది ఒకటుందని మీకు తెలుసా?’ అంది.

తెలియదన్నట్లుగా తల అడ్డంగా ఊపారంతా. ‘ఏప్రిల్ పదమూడవ తేదీన అంతర్జాతీయ తలపాగా దినోత్సవం జరుపుకుంటారు. సిక్కుమతంలో తలపాగా తప్పనిసరి భాగం అనే అవగాహన కల్పించడానికి రెండువేల నాలుగునుంచి ఏటా అంతర్జాతీయ తలపాగా దినోత్సవం జరుపుకుంటున్నారు’ చెప్పింది. ‘భలే భలే’ అన్నాడు రాహల్. ‘బల్లే బల్లే’ అనాలి నవ్వుతూ అంది రమ్య.

‘అన్నట్లు ఇంత సేపు మర్చిపోయా. అమృత్‍సర్‌లో పగ్డీ మ్యూజియం ఉంది. అందులో వివిధరకాల తలపాగాలను విగ్రహాలకు అలంకరించి ఉంచారు. అందులో అకాలి, పాటియాల, పేష్వారి కుల్లా, దుమాలా, భాంగ్డా, రీగల్, మోడర్న్ ఎత్నిక్ టర్బన్, మోర్ని పాగ్, త్రీడి లాడ్.. ఇలా ఎన్నో రకాలను చూడవచ్చు. పేష్వారి కుల్లాలో తలపాగాలో నెమలి ఈకలు పరుచుకున్నట్లుగా ఫ్యాన్ లాగా అమరిక చూడముచ్చటగా ఉంటుంది. రెండో పొడవాటి కొసను ముందుకు వేసుకుంటారు. అలాగే రీగల్ పాగ్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో మెడ కూడా కప్పబడుతుంది. దీర్ఘకాలం గుర్రాలపై ప్రయాణించే సందర్భాల్లో ఎండ నుంచి రక్షణకు ఇది అనువుగా ఉండేది. ఇక భాంగ్డా పాగ్‌ను జాట్లు ధరిస్తారు. గంజి పెట్టిన వస్త్రం ఇందుకు ఉపయోగిస్తారు. వింజామర వంటి అలంకరణ, తలపాగాకు ఉండే బంగారు లేసు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇలా ఎన్నో విషయాలు ఆ మ్యూజియం చూస్తే అవగాహన చేసుకోవచ్చు’ బాబాయ్ వివరించారు. మాకు ఓ మ్యూజియం ఉండడం అనేది ఎంత గొప్ప అనిపించింది నాకు.

అంతలో రమ్య ‘తాతగారూ! మొన్నమొన్నటి వరకు మన ఎయిర్ ఇండియా మస్కట్ అదే మహారాజా లోగోలో కూడా తలపాగా దర్శనమిచ్చేది. అలాగే పెద్ద పెద్ద హోటళ్లలో స్వాగతం పలికే దర్బాన్‌లు ప్రత్యేకమైన వేషధారణలో, ముచ్చటైన తలపాగా ధరించి ఉంటారు’ చెప్పింది.

‘అవునమ్మా బాగా గుర్తుచేశావు’ అని, ‘ఇంక మేం వెళ్ళొస్తాం’ అంటూ లేచాడు బాబాయ్. ఆయనతో పాటే పిన్ని.. ‘మీరు సమయానికి వచ్చి తలపాగాల గురించి ఎన్నో విషయాలు చెప్పారు బాబాయ్. ఇప్పుడే కాదు, మీరు వచ్చిన ప్రతిసారి ఎన్నో విశేషాలు చెపుతారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలి?’ అన్నాడు గోపీకృష్ణ, ‘ఏముంది, నువ్వు కూడా ఆయనకు ఓ తలపాగా పెట్టు’ నవ్వుతూ అంది పిన్ని. అంతా నవ్వుకున్నారు. వాళ్లు వెళ్లగానే ఇంట్లో వారంతా ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.

మా జాతి గురించిన ఆలోచనలు మాత్రం నా తలలోంచి పోనంటున్నాయి. ఇలా మనుషుల తలలకు రక్షణగాను, గౌరవ చిహ్నంగాను, భూషణంగానూ ఉండటం మాకెంతో గర్వకారణం. కానీ కొందరు గౌరవప్రదంగా నడుచుకోకుండా తప్పుడు పనులు చేయడం మాకెంతో శిరోవేదన కలిగిస్తుంది. మాకు తలవంపులుగా అనిపిస్తుంది. ‘గౌరవచిహ్నంగా మమ్మల్ని ధరిస్తే చాలదు, గౌరవప్రదంగా నడుచుకోవాలి. అప్పుడే మీరు, మేము కూడా తలెత్తుకుని, గర్వంగా ఉండగలం’ అని చెప్పాలనిపిస్తుంది. కానీ తల పొగరు మనుషులు నా మాటలు వింటారా.. అనుకుంటుంటే,

తలపాగా బాగచుట్టి, ములుకోల చేతబట్టి

అరకదిమి పట్టుకొని, మెరక చేనులో వాడు

దున్నుతుంటే చూడాలి.. దున్నుతుంటే చూడాలి వాడి జోరు…

టీవీలో పాట రావడంతో ఆనందంతో నా తల అటు తిప్పాను.. నేనేమిటి, మా వాళ్ల తలలన్నీ కూడా అటే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here