అన్నింట అంతరాత్మ-33: ప్రతి ఇంటా ఉంటాను ‘పెట్టె’ను నేను!

7
2

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం పెట్టె అంతరంగం తెలుసుకుందాం.

***

‘ఒరే కిట్టూ! ఒక్కసారి ఇటు వచ్చి నా ట్రంకు పెట్టెను కాస్త బయటికి లాగి నా ముందు టేబుల్ మీద పెట్టరా’ అడిగింది. ‘ఊఁ నాలుగు రోజులకొకసారి ఈ పెట్టె తీయమంటావు. నాకు తెలియ కడుగుతాను, ఏం నిధులు దాచావు బామ్మా’ అంటూ నన్ను బయటకు లాగి బామ్మ ముందుంచి వెళ్లాడు.

‘నా దగ్గరేముంటాయిరా నిధులు’ అంటూ నన్ను ప్రేమగా తాకింది. నా తనువు పులకించింది. గర్వంగా పైకి చూశాను. ఎందుకంటే మా జాతివే అయిన రెండు పెద్ద సైజు అరిస్టోక్రాట్ సూట్‌కేసులు రెండేళ్లుగా పై అటక మీదే ఉండిపోయాయి. వాటి ముఖం చూసిన వాళ్లే లేరు. అవి నా వంక అసూయగా చూశాయి. బామ్మ నా మూత తెరిచింది. నాలో దాచిన ఒక్కో వస్తువును తాకి చూసి, ఆలోచనల్లో మునుగుతూ, ఆనందిస్తోంది.

అందులో ఆమె పెళ్లినాటి పట్టుచీరెలు రెండు, ఓ ఉంగరం, గజ్జెల పట్టీలు, తమ పెళ్లినాటి ఫొటో, పిల్లల ఫొటోలు, పాత పెళ్లి పత్రికలు, తాతగారు అంటే ఆవిడ భర్త వాడిన కళ్లద్దాలు, ఆయన చేతిరాత ఉన్న పుస్తకాలు, ఓ మూడు ఆధ్యాత్మిక గ్రంథాలు వగైరాలు. వస్తువుల మధ్య నాఫ్తలీన్ ఉండలు. నన్ను కూడా అటక పైకి చేర్చాలని కొడుకు, కోడలు ప్రయత్నించారు. బామ్మగారు పట్టుపట్టడంతో అయిష్టంగానే ఊరుకున్నారు.

ఇంతలో పైనున్న అరిస్టోక్రాట్ పెద్ద పెట్టెలు ‘మరీ అంత మురిసిపోకు. ఏదో ఈ మాయదారి కరోనా వల్ల రెండేళ్లుగా మేం ఏ విదేశాలకూ వెళ్లలేదు కానీ లేకపోతేనా అబ్బో! మా ఠీవి ఏం చూశావ్.. ఎన్నెన్ని సరుకులను నింపుకుని, విమానాలెక్కి వెళతాం. మేం సరిగా చేరామో, లేదో అని ఎంత టెన్షన్ పడతారో నీకేం తెలుసు? మమ్మల్ని చూడగానే వాళ్ల కళ్లలో ఎంత ఆనందం’ అంది ఓ పెద్ద సూటుకేసు.

వెంటనే మరో పెద్ద సూట్‌కేసు అందుకుని ‘విదేశంలో ఇంటికి చేరగానే మమ్మల్ని తెరిచి లోపలి వస్తువులను అందిస్తుంటే అక్కడివారు ఎంత ఆత్రంగా, కుతూహలంగా, సంతోషంగా అందుకుంటుంటారో. అసలు ప్రయాణానికి రెండు వారాల ముందునుంచే మమ్మల్ని నింపుతుంటారు. మా స్థాయే వేరు తెలుసా?’ అంది.

‘మరీ అంత మిడిసిపడకండి. ఎవరికి తెలియదు.. మిమ్మల్ని శల్య పరీక్షచేసి గానీ అనుమతించరని, అక్కడ ఎయిర్‌పోర్టులలో విసిరి, విసిరికొడుతూ మీ నడుములు విరగొడతారని.. నేనేమీ మీకు తీసిపోను. ఎన్నెన్ని తీపి గురుతులను దాచి, బామ్మగారిని పాత బంగారు లోకానికి తీసుకెళ్తుంటానో మీకేం తెలుసు?’ అని నేను అంటూ ఉండగానే ‘బామ్మా!’ అంటూ లహరి వచ్చింది.

రాగానే తెరిచి ఉన్న నాకేసి ఆసక్తిగా చూస్తూ ‘ఈ పెట్టె ఎప్పుడుకొన్నారు బామ్మా?’ అడిగింది. ‘ఇది నన్ను అత్తగారింటికి పంపేటప్పుడు నాకోసం మా నాన్న కొనుక్కొచ్చిన పెట్టె. ఇప్పటికీ ఉక్కులా ఉంది. అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు కొత్త పెట్టె కొనివ్వడం సంప్రదాయం. ఇప్పుడూ చాలామంది ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు. కానీ ట్రంకు పెట్టెలు మోటయిపోయి.. ఈడ్చుకెళ్లే కొత్తరకం సూట్‌కేసులిస్తున్నారు’ అంది బామ్మ.

‘ఈడ్చుకెళ్లే’ మాట విని లహరి పకపక నవ్వింది. ‘భలే దానివి బామ్మా.. అన్నట్లు నువ్వు భలే కథలు చెపుతావు కదా, పెట్టె గురించి కూడా చెపుతావా?’ అడిగింది. ‘చెపుతా కానీ ఈ పెట్టెను జాగ్రత్తగా మళ్లీ నా మంచం కింద పెట్టాలి మరి’ అంటూ నన్ను మూసేసింది బామ్మ. ‘సరే’ అంటూ లహరి నన్ను ఎత్తి, మంచం కిందకి తోసింది.

‘ఇంక చెప్పు’ అంది లహరి బామ్మ పక్కనచేరి.. ‘వేరే కథలెందుకు, రామాయణ మహాభారతాల్లోనే పెట్టె ప్రస్తావన ఉంది. రామాయణంలో సీతాదేవి పుట్టుక గురించి తెలుసా?’ అడిగింది. తెలియదన్నట్లు లహరి తల అడ్డంగా ఊపింది. ‘జనక మహారాజు యాగం చేస్తూ, భూమి దున్నుతుంటే నాగలికి గట్టిగా ఏదో తగిలింది. చూస్తే ఓ పెట్టె.. అందులో అందాల పసిపాప. నాగేటి చాలులో దొరికిందని ఆమెకు ‘సీత’ అని పేరు పెట్టారు. అలా సీతాదేవినే అందించిన భాగ్యం పెట్టెకు దక్కింది. ఇక భారతంలో కుంతీదేవి, దూర్వాసుడు ఇచ్చిన వరాన్ని పరీక్షించి చూడాలనే చాపల్యంతో గగనాన ఉన్న సూర్యుణ్ణే ఆహ్వానించింది. ఫలితంగా కవచ కుండలాలతో వెలిగిపోతూ బిడ్డ.. కన్య అయిన కుంతి భయపడింది. ఆ బిడ్డను ఏం చేయాలో తెలియక, ఓ పెట్టెలో ఉంచి గంగానదిలో వదిలింది. ఆ పెట్టె, రథాలను నడిపే అతిరథుడికి దొరికింది. అప్పటివరకు సంతానం లేని అతిరథుడు, అతడి భార్య రాధ సహజ కవచ కుండలాలతో మెరుస్తున్న ఆ బిడ్డకు వసుసేనుడు అని పేరు పెట్టుకుని పెంచసాగారు. పెద్దయ్యాక వసుసేనుడు ఎవరు ఏది అడిగినా లేదనక ఇచ్చేవాడు. ఓ సారి వసుసేనుడు సూర్యోపాసనలో ఉన్న వేళ ఇంద్రుడు, బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కవచ కుండలాలు అడిగితే వెంటనే ఇచ్చేయడంతో అప్పటి నుండి కర్ణుడిగా వినుతికెక్కాడు. అలా పసివాడైన కర్ణుడిని కూడా అతిరథుడి వద్దకు చేర్చింది పెట్టే. అయితే పురాణకాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ అనుకుంటా, ఆ ఊళ్లో పడవ నడిపే వ్యక్తికి నదిలో ఓ పెట్టె దొరికిందిట. ఏమిటా అని తెరిచి చూస్తే పసిపాప వస్త్రంలో చుట్టి ఉంది. అంతేకాదు పాపను ఉంచిందెవరో కానీ పాప జాతక చక్రం కూడా పెట్టెలో ఉంచారట. ఇలాటివెన్నో జరుగుతుంటాయి’ బామ్మ మాటల్ని లహరితో పాటు మేమూ ఆశ్చర్యంగా ఆలకించాం.

ఇంతలో కిట్టూ వచ్చాడు. ‘ఏమిటి మళ్లీ కథలు మొదలు పెట్టారా?’ అంటూ. ‘అవును అన్నా, పెట్టెల కథలు’ అంది లహరి. ‘బామ్మా! పెట్టెల్లో ఎన్నో రకాలున్నాయి, ఇస్త్రీ పెట్టె, మందుల పెట్టె, పుస్తకాల పెట్టె, దుకాణాలలో గల్లా పెట్టె.. అంటూ ఓ క్షణం ఆగాడు.

వెంటనే లహరి అందుకుని ‘నేనూ చెపుతా.. రైలు పెట్టె, అందులో మళ్లీ ఆడవాళ్ల పెట్టె, నగల పెట్టె, పోపుల పెట్టె, తాంబూలం పెట్టె, సబ్బు పెట్టె, అగ్గి పెట్టె.. ఇంకేమున్నాయి’ అంటూ ఆగింది. ‘బాగా చెప్పారు. మీ మాటలు వింటుంటే నాకో పొడుపు కథ గుర్తు కొస్తోంది, అడగనా?’ అంది బామ్మ. ‘అడుగడుగు’ పిల్లలిద్దరూ ఒకేసారి అన్నారు. ‘పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది, తెచ్చుకోపోతేనూ గుచ్చుకుంటుంది. ఏమిటది?’ అడిగింది బామ్మ. ఇద్దరూ తెల్లముఖం వేశారు.

అదే నిముషంలో ‘ఏంటి బామ్మను విసిగిస్తున్నారు’ అంటూ కోడలు కాత్యాయని వచ్చింది. ‘ఏం లేదు కాత్యా, పెట్టెల గురించి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో నేనో పొడుపు కథ అడిగాను, చెప్పలేకపోయారు’ నవ్వుతూ అంది బామ్మ. ‘ఏమిటా పొడుపు కథ?’ అడిగింది కాత్యాయని. బామ్మ మళ్లీ చెప్పింది.

అది విని ‘నేను చెప్పగలను, మొగలి పువ్వు. ఇప్పటి పిల్లలకేం తెలుస్తుంది. మొగలి పూలతో జడ ఈ కాలంలో వేయడమే లేదు’ నవ్వుతూ అంది కాత్యాయని. ‘నిజమే. ఆ రోజులే వేరు. పిల్లలూ! ఆ రోజుల్లో పిల్లలకు బొమ్మల పెట్టె ప్రత్యేకం ఉండేది. రోజూ ఆడుకునే బొమ్మలు వేరు సంక్రాంతికి పెట్టుకునే బొమ్మలు వేరు. పండక్కు బొమ్మల కొలువులో ఉంచే బొమ్మల్ని ఓ పెట్టెలో పదిలంగా భద్రపరిచేవారు’ అంది బామ్మ.

పిల్లలు ‘అప్పుడు షో కేసుల్లేవేమో’ అంటుంటే నేనేమో ‘అబ్బో! మాది చాలా పెద్ద జాతి అన్న మాట. ఇన్నాళ్లూ మాకు తెలియనే లేదు’ అనుకుంటూ గర్వపడ్డాం.

‘మా రోజుల్లో ప్రతి ఇంట్లో హార్మోనియం పెట్టి ఉండేది. ఆడపిల్లలు తప్పనిసరిగా హార్మోనియం నేర్చుకునేవారు’ అంది బామ్మ. ‘అవును, మా అమ్మ చెపుతూ ఉండేది, పెళ్లి సంగీతమట. పెళ్లివారి ప్రశ్నల్లో సంగీతం వచ్చా అనేది తప్పనిసరి ప్రశ్నకావడంతో అమ్మాయిలకు హార్మోనియం నేర్పించేవారట’ అని, మా తాతగారింట్లో అయితే ఇనప్పెట్టె ఉండేది. మా తాతగారు గ్రామ కరణంగా పనిచేసేవారు. ఆ ఇనప్పెట్టెలో డబ్బు దాచేవారు. అది తెరవటం, మూయడం మేం ఆశ్చర్యంగా చూసేవాళ్లం. ఇంక బట్టలకు ట్రంకు పెట్టెలుండేవి, వాడని సామాన్లకు భోషాణాలు అంటే పెద్ద పెద్ద చెక్క పెట్టెలు, కావడి పెట్టెలు ఉండేవి. రోజులతో పాటు అవీ మారిపోయాయి. తర్వాత కాలంలో కొన్నాళ్లు తోలు పెట్టెలు, రెక్సిన్ పెట్టెలు వచ్చాయి. ఆ తర్వాత ఫైబర్ పెట్టెలు మొదలయ్యాయి. ప్రయాణాలకు మాత్రమే ఇప్పుడు పెట్టెలు. కొంతమంది ప్రయాణాలకు కూడా బరువు తక్కువ ఉండి, బట్టలు ఎక్కువ పడతాయని పెద్ద బ్యాగులు వాడుతున్నారు. ఇంట్లో అయితే పెట్టెల స్థానంలో బీరువాలు, కప్ బోర్డులు వచ్చి చేరాయి. మామూలు చెక్క పెట్టెలను పళ్ల రవాణాకు, కొన్ని కొన్ని సరుకుల రవాణాకు వాడుతున్నారు. ఇప్పుడయితే అమెజాన్ వంటి ఆన్‌లైన్ కంపెనీలన్నీ నిత్యం అట్ట పెట్టెలలో సరుకులను అందజేయడం చూస్తూనే ఉన్నాం’ అంది కాత్యాయని.

ఇంతలో చేతిలో బ్రీఫ్‌కేసుతో ప్రవేశించాడు భాస్కరం, ‘ఏంటీ అంతా బామ్మ దగ్గర చేరారు’ అంటూ. ‘అదుగో.. నాన్న చేతిలో బ్రీఫ్‌కేస్.. అది కూడా పెట్టే కదా’ అన్నాడు కిట్టూ. ‘అయితే ఏమిటి?’ అన్నాడు భాస్కరం అక్కడే ఉన్న కుర్చీలో బైరాయిస్తూ.

‘మేం పెట్టెల గురించి మాట్లాడుకుంటున్నాం’ అంది లహరి. ‘అవును ఈ కాలంలో ఆఫీసర్లందరి చేతుల్లో బ్రీఫ్‌కేసులు ఉంటాయి. ఆఫీసర్లనే కాదు, ముఖ్యమైన కాగితాలు పట్టుకెళ్లాలంటే అంతా వాడేది బ్రీఫ్ కేసే. అంతేకాదు, పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంలో ఆర్ధికమంత్రి కూడా బ్రీఫ్‍కేస్ తోనే ప్రవేశిస్తారు’ నవ్వుతూ అన్నాడు భాస్కరం. అంతలో కాత్యాయని మంచినీళ్లు, బిస్కెట్లు, కాఫీ పట్టుకొచ్చింది. అవి తింటూ, తాగుతూ మళ్లీ మాటలు మొదలు పెట్టారు.

‘నేను మళ్లీ మరో పొడుపు కథ అడుగుతా, చెపుతారా’ అంది బామ్మ. ‘అడుగడుగు’ ఏం అడుగుతుందో అని ఆసక్తి చూపారు పిల్లలు. వెంటనే బామ్మ ‘అంగుళం గదిలో అరవై మంది. ఏమిటది?’ అంది. పిల్లలు తెల్లముఖం వేశారు. మేం కూడా ఏమై ఉంటుందీ అనుకుంటుండగా, భాస్కరం నవ్వి ‘నీకు పొడుపు కథల పిచ్చి పోలేదు, నా చిన్నప్పటినుంచి అడుగుతూనే ఉన్నావు.. పిల్లలూ.. జవాబు అగ్గి పెట్టె. అందులో చాలా అగ్గిపుల్లలుంటాయి కదా.. అదన్నమాట’ అన్నాడు. ‘ఓహో..అదా’ అన్నారు పిల్లలు. ‘భలే ఉంది’ అనుకున్నాను నేను.

‘పిల్లలూ! చిన్నప్పుడు మా తాతగారి ఊరు వెళ్లినప్పుడు తిరునాళ్లలో జంతర్ పెట్టె తమాషా చూసేవాణ్ని’ అన్నాడు భాస్కరం. ‘జంతర్ పెట్టా! అదేమిటి?’ పిల్లలు ఆశ్చర్యంగా అడిగారు. మాక్కూడా తెలుసుకోవాలని ఉత్కంఠ ఎక్కువైంది.

‘చెపుతాను, నాలుగు పలకల ఒక పెద్ద పెట్టెను రకరకాల అందాలను జతచేర్చి ఆకర్షవంతంగా చేస్తారు. ఆ పెట్టెను మూడు కాళ్ల స్టాండుపై పిల్లలు, పెద్దలు కూడా చూసేందుకు వీలుగా ఉంచుతారు. ఆ పెట్టెకు ఓ వైపు ఓ రంధ్రం ఉంటుంది. అందులోంచి చూస్తే లోపల బొమ్మలు కనపడతాయన్నమాట. రెండోవైపు బొమ్మలు చూపించేవాడు నిలబడి వరుసగా పేర్చిన బొమ్మలను నడుపుతూ ఉంటాడు. మరొకడు తాళం కొడుతూ రాబోయే బొమ్మ గురించి చెపుతుంటాడు. ‘కాశీపట్నం చూడర బాబూ’ అంటే బొమ్మ లోపల కాశీ విశ్వనాథుని దేవాలయం, గంగానది కనిపిస్తాయి. అలా అతడు చెప్పేదానికి అనుగుణంగా బొమ్మ తరువాత బొమ్మ చూపిస్తారన్నమాట. అయితే ఇందులో ఒక్కరు మాత్రమే బొమ్మ చూసే అవకాశం ఉంటుంది. తాళం కొట్టేవాడు ‘కాశీపట్నం చూశావా’ అని అడగటం, చూశామని తల ఊపడం మామూలే. ఒకరి తర్వాత ఒకరు అలా డబ్బులు ఇచ్చి ఆ బొమ్మలను చూసేవాళ్లు. టీవీలు, కంప్యూటర్లు, మొబైళ్లు లేని ఆ కాలంలో.. ముఖ్యంగా మారుమూల పల్లెల్లో ఈ జంతర్ పెట్టి తమాషా అందరికీ ఇష్టమైన వినోదంగా ఉండేది. దీన్నే ఇంగ్లీషులో బయస్కోప్ అంటారు’ చెప్పాడు భాస్కరం.

‘ఫొటోలు చూడటానికి ఒక్కొక్కళ్లు లైన్లో నిల్చోవాలా’ అంటూ కిట్టూ నవ్వుతుంటే, లహరి కూడా జత కలిపింది. నేను మాత్రం వినోదాన్ని పంచడంలో కూడా మా పాత్ర ఉందన్న మాట అనుకుని ఆనందించాను.

అంతలో బామ్మ ‘నేను మీకెవరికీ తెలియని పెట్టె గురించి చెపుతాను’ అంది. ‘ఎవరికీ తెలియని పెట్టా? కొంపదీసి ఏదైనా నిధి దాచిన పెట్టా?’ అన్నాడు భాస్కరం. ‘అదేం కాదులే, నేను చెప్పేది దేవర పెట్టె గురించి’ అంది. అంతా వింతగా చూశారు. బామ్మ ‘వినండి’ అంటూ ‘జానపద కళాకారులలో ‘బైకానివారు’ అని ఉంటారు. వాళ్ల దగ్గర ఒక పెట్టె ఉంటుంది. దాన్ని బైకాని పెట్టె అంటారు. దానికి మరో పేరే దేవర పెట్టె. యాదవులు రెండేళ్లకొకసారి జరుపుకునే గంగమ్మ, కోటిలింగాల, లింగమంతుల, సౌనమ్మ పండగల్లో బైకానివారు ప్రదర్శలిస్తారు. వాళ్లు దేవాలయాలున్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన గుడారంలోకి ఆ దేవర పెట్టెను తీసుకువస్తారు. ఆ పెట్టెలో వీరు చెప్పే కథలకు సంబంధించిన దేవతా విగ్రహాలుంటాయి. వాటిని అక్కడ ఉంచి, పూజలు చేసి, వాటిని చూపెడుతూ కథలు చెపుతారన్నమాట. వారు దేవతలను ఉంచే పెట్టే దేవర పెట్టె అంటారు’ వివరించింది. ‘భలే ఉంది’ అన్నారు పిల్లలు. నేను కూడా ‘భలే. దేవుళ్లను కూడా మేం భద్రపరుస్తామన్నమాట’ అనుకుంటుంటే కాస్తంత గర్వంగా అనిపించింది.

ఈసారి కాత్యాయని అందుకుని ‘మా చిన్నప్పుడు మా అన్నయ్య డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదివేవాడు. వాటిల్లో ‘పెట్టెలో శవం’ కూడా చూసినట్లు గుర్తు. ఆ సంగతి అటుంచి ఈ మధ్య ఎవరో హత్యానేరం చేసి, శవాన్ని పెట్టెలో ఉంచి ఊరి శివార్లలో పడేసిన కథనాలను కూడా విన్నాం. ఇక కొన్ని మతాలవారు తమ వారు చనిపోతే మృతదేహాన్ని శవ పేటికలో పెట్టి, గోతిలో ఉంచి పూడ్చడం తెలిసిందే. ఆ మధ్య ఒకాయన బతికుండగానే తనకు నచ్చిన శవ పేటికను తయారు చేయించుకున్నట్లు ఏదో పత్రికలో చదివాను. మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్ణీత వ్యవధిలో చేయడం కుదరని పక్షంలో గాజు శవ పేటికలో భద్రపరచడం మనకు తెలిసిందే’ చెప్పింది. అంతా అవునన్నట్లు తల ఊపారు. నాకు మాత్రం హత్య చేసి, పెట్టెలో పెట్టడం మాత్రం చాలా బాధనిపించింది. అదే సమయంలో శవపేటికగా కూడా మా జాతి, మనిషికి ఉపయోగపడి, అతడిని అనుసరించడం గొప్పగా అనిపించింది.

‘ఒరే భాస్కరం నీకు గుర్తుందా’ బామ్మ మాటతో ఉలిక్కిపడ్డాను. ‘ఏమిటో చెపితే కదా, నాకు గుర్తుందీ, లేనిదీ తెలిసేది’ అన్నాడు భాస్కరం. ‘అదేరా, నీ చిన్నప్పుడు స్కూలుకు ఓ అల్యూమినియం పెట్టెలో పుస్తకాలు పట్టుకెళ్లేవాడివి’ అంది బామ్మ. ‘ఆఁ బాగా గుర్తు చేశావు. నిజమే. కొంతకాలం ఆ పెట్టెలు వాడారు. ఆ తర్వాత మళ్లీ అంతా బ్యాగులే వాడుతున్నారు. అన్నట్లు చెప్పటం మర్చిపోయా, కాత్యా! మీ బాబాయ్ ఫోన్ చేశాడు. వాళ్ల చిన్నమ్మాయి పెళ్లిట. శుభలేఖ లేటుగా వేశారట.. ‘సమయానికి శుభలేఖ అందుతుందో, లేదో.. అందుకే ఫోన్ చేశాను. తప్పకుండా రండి.. ఒకవేళ నువ్వు బిజీగా ఉంటే మా అమ్మాయి, పిల్లలనైనా పంపు అన్నాడాయన. వెళ్తావా?’ అడిగాడు.

వెంటనే కాత్యాయని ‘వాళ్లింట్లో ఆఖరి కార్యం. వెళ్లకుండా ఎలా?’ అంది. ‘అయితే పెట్టే బేడా సర్దుకో’ అన్నాడు భాస్కరం. ఆ సంభాషణ వింటున్న కిట్టూ ‘పెట్టె తెలుసు కానీ బేడా ఏమిటి?’ అడిగాడు. నాకూ అదే సందేహం కలిగింది. బామ్మ వెంటనే ‘నే చెపుతా విను, బేడా అంటే పాతకాలంలో పన్నెండు పైసలు, దాన్నే రెండు అణాలు అని కూడా చెప్పవచ్చు. ఇక్క డ బేడా అంటే డబ్బు అనే అర్థంలో వాడారు. ప్రయాణానికి బేడా కూడా అవసరం కాబట్టి ముందుగా సర్దుబాటు చేసుకోవాలని’ వివరించింది బామ్మ. ‘అలాగా’ అన్నాడు కిట్టూ. నేను కూడా ‘ఓహో’ అనుకున్నా.

అంతలో వంటింట్లో నుంచి స్టీలు గిన్నె కిందపడిన శబ్దం వినపడటంతో అంతా ఉలిక్కిపడ్డారు. కాత్యాయని ఒక్క ఉదుటన లేచి ‘వెధవ పిల్లి మళ్లీ వచ్చినట్లుంది’ అంటూ పరుగు తీసింది. అదే సమయంలో భాస్కరం, మొబైల్ మోగడంతో లేచి అవతలకు వెళ్లాడు. పిల్లలు కూడా ‘బాబోయ్.. చాలా టైమయింది’ అంటూ లేచారు. ‘చాలా సేపు కూర్చున్నా. ఇంక నడుం వాల్చాలి’ అనుకుంటూ బామ్మగారు పడుకుని కళ్లు మూసుకున్నారు.

అలా ఎవరి దారిన వారున్నా నాకు మాత్రం మా గురించిన ఆలోచన ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ మధ్య టీవీలో ఓ పాత సినిమా చూశా. ఓ రైలు ప్రయాణంలో ఓ అమ్మాయి, అబ్బాయిల పెట్టెలు తారుమారవుతాయి. అబ్బాయి ఆ దుస్తుల్ని చూసి, బిత్తరబోయి, ఆ తర్వాత పెట్టె పుచ్చుకుని ఆమె దగ్గరకు వెళ్లడం.. అలా పరిచయం మొదలై, ప్రేమ కథ నడుస్తుంది. అంటే కథకు మూలం పెట్టెలు మారడమే.. అలాగే మిథునం సినిమాలో సీన్ కూడా గుర్తుకొస్తోంది.. అప్పదాసు, భార్య బుచ్చి పాతకాలం ట్రంకు పెట్టె… అచ్చు నా వంటి పెట్టే.. ముందేసుకు కూర్చుంటారు. అందులో చీరెలన్నీ ఆమె ఒక్కొక్కటీ తీస్తుంటే, వాటిని ఆమె ఎప్పుడెప్పుడు కట్టుకున్నదీ, వాటిల్లో ఇనుమడించిన ఆమె సౌందర్యం.. అతడు గుర్తుచేస్తాడు. ఎంత చక్కటి సన్నివేశం. ఆ పాత్రల్లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ఎంత చక్కగా ఒదిగి పోయారో.. అన్నట్లు కొన్ని సినిమాలలో కరెన్సీ కట్టలు లేదంటే, వజ్రాల వంటి విలువైన వస్తువులున్న పెట్టెలను దొంగల ముఠా దోచుకోవడం, ఆ తర్వాత రెండు ముఠాలకు మధ్య, లేదంటే దొంగల ముఠాకు, హీరోకు మధ్య భీకరంగా ఫైటింగ్ జరగడం, ఆ సందర్భంలో పెట్టెను అటు, ఇటు బంతిలా విసిరేస్తూ ఉంటే నాకు మహా టెన్షన్‍గా ఉంటుంది. ‘పాపం మా బ్రో’ అనుకుంటాను. హీరో చేతికి క్షేమంగా చిక్కినప్పుడు ‘హమ్మయ్య’ అనుకుంటాను.

మంచిమాట వింటామంటే ఈ మనుషులకు ఓ మాట చెప్పాలనుంది. అది.. విలువైన వస్తువులను దాచి ఉంచడానికి మేమెప్పుడూ సిద్ధమే. కానీ నల్లధనం, నకిలీ కరెన్సీ, దొంగసొమ్ములు పెట్టెల్లో దాయకండి, అది మాకు అవమానకరం. మేము మీ నేరంలో భాగస్థులమై, పాపం చేసిన వాళ్లమవుతామని మా హృదయం క్షోభిస్తుంది. అలాగే దొంగలు నన్ను కాజేసినపుడు, కొల్లగొట్టినప్పుడు ఎంతో బాధపడతాను, నా కోసం కాదు, మీ కోసం, మీ సొమ్ము అన్యాయమైపోతోందని.. గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు అనుసంధానంగా, మీ వెంట ఉండి, అనుబంధాలను, గతం తాలూకు మధురోహలను గుర్తుచేసే నన్ను పదిలంగా చూసుకోండి. విలువైన వస్తువులతో మా పెట్టెలను ఎలా నింపుతారో మీ మనసును కూడా మానవీయ విలువలతో కూడిన ఆలోచనలతో నింపండి.. అబ్బ! అలసటగా ఉంది.. ఇంక నా ఆలోచనల పెట్టె మూసేస్తా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here