అన్నింట అంతరాత్మ-34: దేశ అస్తిత్వ ప్రతీకను.. ‘జాతీయ పతాక’ను నేను!

7
2

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం జాతీయ పతాకం అంతరంగం తెలుసుకుందాం.

***

‘భారతి విద్యాలయ్’.. ఐదో తరగతికి టీచర్ ఇంకా రాలేదు. పిల్లలందరూ కబుర్లలో మునిగారు. శ్రీరామ్, తన మిత్రులతో ‘ఒరేయ్! మనకు స్వతంత్ర్యం వచ్చి డెబ్బై అయిదేళ్లు అయిందని ఈసారి అమృతోత్సవం జరుపుకుంటున్నామట. ప్రతి ఇంటి పైన జెండా ఎగరేయాలని ప్రధాని చెప్పారు. ఆ జెండాలను పోస్టాఫీస్ నుంచి తెప్పించుకోవచ్చట. మా నాన్న తెప్పిస్తున్నారు’ చెప్పాడు.. అది విని నేను పరవశించి పోయాను. నేను.. అంటే శ్రీరామ్ తన తెలుగు పుస్తకంపై అతికించుకున్న త్రివర్ణపతాకాన్ని.. అంతలో శ్రీరామ్ మిత్రుడు సుభాష్ ‘మేమూ జెండా ఎగరేస్తాం.’ అంటూ

‘జెండా ఊంచా రహే హమారా
విజయీ విశ్వ తిరంగా ప్యారా
సదాశక్తి బర్సానే వాలా
ప్రేమసుధా సర్సానే వాలా
ఎరోంకో హర్షానే వాలా
మాతృభూమికా తన్ మన్ సారా… ‘

పాడసాగాడు. ‘సుభాష్! ఇప్పుడే ఎగరేసినట్లు పాడేస్తున్నావే’ అన్నాడు భరత్.

‘ఈ పాట నాకెంత ఇష్టమో’ సుభాష్ అంటుండగానే టీచర్ క్లాసు లోకి ప్రవేశించింది. దాంతో అంతా గప్ చుప్ అయిపోయారు

‘పిల్లలూ! స్వాతంత్ర్య దినోత్సవం వస్తోంది కదా. అందుకే పోటీలు పెడుతున్నాం. ‘భారత జాతీయ పతాకం’ అనే అంశం మీద ఎల్లుండి మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఒక్కొక్కళ్లు రెండేసి నిముషాలు మాట్లాడాలి. సరేనా’ అంది. అంతా సరే అన్నారు. ఆ తర్వాత టీచర్ పాఠం మొదలు పెట్టింది.

‘భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన వ్యక్తి తెలుగువారు కావడం మనకెంతో గర్వ కారణం. ఆయనే పింగళి వెంకయ్య’ చెపుతోంది టీచర్. ఓహో! అయితే మా పతాకను సృష్టించింది ఆయన అన్నమాట అనుకుంటున్నంతలో గుసగుసలు..

‘అన్వేష్! ఏంటా గుసగుసలు’ గద్దించింది టీచర్. ‘అసలు ఈ జెండా అనేది ఎందుకు అని నరేన్‍ను అడుగుతున్నా టీచర్’ చెప్పాడు అన్వేష్. ‘నిజమే.. నా ఉనికికి ఏదైనా ప్రయోజనం ఉందా?’ నాలో నేనే అనుకున్నాను.

‘ఏదైనా సందేహం వస్తే నన్ను అడగాలి కానీ మీలో మీరు మాట్లాడుకోవద్దు. సరే.. జెండా అనేది ఎందుకు అని కదా నీ ప్రశ్న.. ఏదైనా ఒక దేశం పేరు చెప్పగానే మనకు ఏం గుర్తుకొస్తుంది.. ఆ దేశపటం.. వారి జాతీయ పతాకం. అవునా.. జెండా అనేది దేశ ప్రతీక.. జాతికి ప్రతినిధి, దేశప్రజలను సమైక్యంగా నిలిపే గౌరవ చిహ్నం. సారభౌమత్వానికి ప్రతీక’ వివరించింది టీచర్. ‘ఇప్పుడర్థమైంది టీచర్’ అన్నాడు అన్వేష్. నా ఉనికికి అర్థం ఇప్పుడు తెలిసింది అనుకున్నాను నేను.

‘ఇంక మాట్లాడకుండా పాఠం వినండి.. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో ఒక జాతీయ పతాకం ఆవశ్యకతను గుర్తించారు. జెండా నమూనాలను పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఆంధ్రుడైన వెంకయ్యగారు మొదటినుండి దేశభక్తులే. పంథొమ్మిదవ ఏట దక్షిణాఫ్రికా వెళ్లి గాంధీజీని కలిశారు. అక్కడ జరుగుతున్న రెండవ బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అప్పటి నుండి చిరకాలం వారి అనుబంధం కొనసాగింది. పింగళి వెంకయ్య గారికి జెండా గురించిన ఆలోచన పంథొమ్మిది వందల ఆరులోనే కలిగింది. ఎలా అంటే కోల్‌కతాలో ఇరవై రెండవ అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆ సందర్భంలో సభ ప్రారంభానికి ముందు బ్రిటిష్ వారి పతాకమైన యూనియన్ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడం ఆయనను కలత పరిచింది. ‘మనకంటూ ప్రత్యేక జెండా ఉంటే..’ అనిపించింది. అదే విషయాన్ని సభలో వెల్లడించారు. దాంతో వెంకయ్యగారి దేశ భక్తి, ప్రతిభలను గుర్తించి ఆయనను కాంగ్రెస్ విషయ నిర్ణయ సమితి అధ్యక్షుడిగా నియమించారు. అప్పటినుండి ఆయన జెండాను రూపుదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ‘భారతదేశానికొక జాతీయ జెండా’ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాసి ప్రచురించారు కూడా. మొట్టమొదటిసారి పంథొమ్మిది వందల పదహారులో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య గారు రూపొందించిన జెండా ఎగురవేశారు. ఆ తర్వాత బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ, వెంకయ్యగారిని పిలిపించి, కాషాయం, ఆకుపచ్చ రంగులు వేసి, మధ్య రాట్నం గల జెండాను చిత్రించమని కోరారు. వెంకయ్యగారు ఆ విధంగా చిత్రించారు. ఆ తర్వాత సత్యం, అహింసలకు నిదర్శనంగా తెలుపు రంగు కూడా ఉండాలని అనడంతో వెంకయ్యగారు ఆ జెండాలో తెలుపు రంగును కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. అయితే పంథొమ్మిది వందల నలభై ఏడు జులైలో భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ త్రివర్ణ పతాకంలోని రాట్నం స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఉంచబోతున్నామన్నారు. ఆ విధంగా భారత జాతీయ పతాకం తుది రూపు సంతరించుకుంది. ఈ పతాకాన్నే ఆగస్టు పదిహేనున స్వతంత్ర్య భారత జాతీయ పతాకంగా ఉద్వేగభరితంగా ఎగురవేశారు. పింగళి వెంకయ్య, జెండా వెంకయ్యగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. రెండువేల తొమ్మిదిలో వెంకయ్య జ్ఞాపకార్థం భారత తపాలా శాఖ ఓ తపాలా ముద్రను విడుదల చేసింది’ వివరించింది టీచర్. అంతలో గంట మోగడంతో ‘రేపు ప్రశ్నలడుగుతా.. పాఠం చదువుకు రండి’ అంటూ టీచర్ వెళ్లిపోయింది. ‘నా వెనక ఇంత కథ ఉందన్నమాట. మహోన్నతంగా నిలిచి, గగన వీధిలో రెపరెపలాడుతూ అందరి వందనాలను అందుకునే పతాకం ఎంత గొప్పది’ అనుకున్నాను నేను.

ఆ తర్వాత సోషల్ టీచర్ రాకపోవడంతో వేరే టీచర్ వచ్చింది. ఆమె కూడా స్వాతంత్ర్య దినోత్సవం కబుర్లు చెపుతుండడంతో అన్వేష్ లేచి, ‘జాతీయ జెండాలు ఎక్కడ తయారు చేస్తారు టీచర్?’ అడిగాడు. ‘మంచి ప్రశ్న అడిగావు. అధికారికంగా కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంస్థ ఒక్కటే తయారు చేస్తుంది. ఇంకో సంగతి రెండు వేల ఆరు నుంచి ఇక్కడ మహిళలే జెండాలు తయారు చేస్తున్నారు. వీటిలో తొమ్మిది రకాల సైజులు ఉన్నాయి. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్లపై ఎగురవేసే జెండాలు 12×8 అడుగుల కొలతతో ఉంటాయి’ చెప్పి, ‘మీరందరూ ముఖ్యంగా ‘ఫ్లాగ్ కోడ్’ గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వం జాతీయ పతాకానికి సంబంధించి నియమావళి రూపొందించింది. దీనిని పౌరులు ఉల్లంఘిస్తే చట్టబద్ధంగా శిక్షార్హులవుతారు. అయితే ఈ ఫ్లాగ్ కోడ్‌కు రెండువేల రెండులో కొన్ని సవరణలు చేశారు. దీని ప్రకారం భారత పౌరులు జాతీయ జెండాను ఇళ్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలలో ఎప్పుడైనా ఎగురవేయవచ్చు. అయితే జాతీయ నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. అవి.. జాతీయ జెండా ఖాదీతోనే తయారు కావాలి. పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉండాలి. ప్లాస్టిక్ జెండాలు వాడకూడదు. చిన్న సైజు కాగితపు జెండాలు వాడవచ్చు. జెండా ఎగురవేయడం, దించడం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోపే జరగాలి. జెండాను నేలమీద, నీటిమీద పడనీయ కూడదు. జెండాను ఎగురవేసేటప్పుడు వేగంగా ఎగురవేసి, దించేటప్పుడు నెమ్మదిగా దించాలి. జెండాపై ఎలాంటి రాతలు, ముద్రలు ఉండకూడదు. ఇతర జెండాలతో కలిపి జాతీయజెండాను ఆవిష్కరించవలసి వస్తే, జాతీయజెండా అన్నింటికంటే ఎత్తుగా ఉండాలి. ప్రదర్శనలో అయితే మిగిలిన వాటికంటే మధ్యలో ఒక అడుగు ముందు ఉండాలి. జెండాను ఎప్పుడూ నిటారుగానే ఉంచాలి. కిందకు వంచకూడదు. ఎవరైనా దేశ ప్రముఖులు, సైనికరంగంవారు మృతి చెందినప్పుడు వారి పార్థివ దేహంపై జాతీయ జెండాను కప్పి గౌరవం ప్రకటిస్తారు. అలాగే ప్రముఖులు మృతి చెందిన సందర్భాలలో సంతాప దినాలు ప్రకటిస్తారు కదా. అప్పుడు మాత్రమే వారి పట్ల గౌరవ సూచకంగా, ఆ పరిమిత కాలం వరకే జెండాని అవనతం చేయాలి’ టీచర్ ముగించడం, గంట కొట్టడం ఒకేసారి జరిగాయి. ‘అబ్బో! చాలా నియమాలున్నాయి. జాతీయ జెండా ఎంత గొప్పదో’ అనుకున్నాను నేను.

టీచర్, పిల్లలు బయటకు నడుస్తున్నారు. అన్వేష్ తెలుగు బుక్‌ను బ్యాగ్‌లో జిప్ లేని అరలో హడావిడిగా నెట్టాడు. అలా నేను లోపలికి అడుగు పెట్టాను. అన్వేష్ స్నేహితులతో కలిసి స్కూల్ బస్సు ఎక్కాడు. బస్సులో కూర్చున్న అన్వేష్ కొద్ది సేపయ్యాక పక్కనున్న మిత్రుడితో ‘ఒరే అరవింద్! జాతీయ పతాకమే కాకుండా ఇంకా వేర్వేరు జెండాలు కూడా ఉంటాయి కదరా. నీకు గుర్తుందా, ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవంలో ఒలింపిక్ జెండాను చూస్తాం’ అన్నాడు. ‘అవునవును అందులో అయిదు సున్నాల డిజైన్ గుర్తుంది’ అన్నాడు ఆలోచిస్తూ. ఆ పక్కనే ఉన్న పదో తరగతి సుధీర్ నవ్వి ‘సున్నాలు అనకూడదు. రింగులు లేదంటే వలయాలు అనాలి. ఒలింపిక్ పతాకం గురించి అయితే నేను చెపుతా. పియరీ డీ కాబర్టీన్ ఆధ్వర్యంలో రూపొందించారు. తొలిసారిగా పంథొమ్మిది వందల ఇరవైలో బెల్జియంలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఈ పతాకాన్ని ఎగురవేశారు. దీనిపై నీలం, నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో అయిదు రింగులు ఉంటాయి. నీలం యూరపు, నలుపు ఆఫ్రికాకు, ఎరుపు అమెరికాకు, పసుపు ఆసియాకు, ఆకుపచ్చ ఆస్ట్రేలియాకు సంకేతాలు’ అంటుండగానే, నల్ల జెండాలతో ఓ ర్యాలి ఎదురైంది.

‘అదేంటి నల్లజెండాలు’ అన్నాడు అన్వేష్. ‘ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ.. ప్రొటెస్ట్ అంటే నిరసన తెలియజేస్తూ నల్లజెండాలను ప్రదర్శిస్తారన్నమాట’ సుధీర్ చెప్పడం, అతడి స్టాప్ రావడం ఒకేసారి జరిగాయి. దాంతో ‘బై’ అంటూ దిగి పోయాడతడు.

ఇంకొద్ది దూరం వెళ్లగానే ‘అన్వేష్! చూడు.. ఇక్కడ కూడా మరో ర్యాలి జరుగుతోంది. ఎన్ని జెండాలో..’ అన్నాడు అరవింద్. ‘అవును, అన్ని రాజకీయ పార్టీలకు వేర్వేరు జెండాలున్నాయిగా’ అన్నాడు అన్వేష్. ‘అన్నట్లు రైలు ప్రయాణాలప్పుడు చూస్తుంటాం కదా, గార్డు ఆకుపచ్చ జెండా ఊపటం, రైలు కదలటం.. అలాగే ఎర్ర జెండా లేదా కనీసం, ఎర్ర వస్త్రమేదైనా చూపినా రైలు ఆగిపోతుందిట. ఎందుకంటే ఎరుపు రంగు ప్రమాదానికి ప్రతీక అని చెప్పారు మా నాన్న’ అన్నాడు అరవింద్.

‘అవును. ఏదైనా పనికి, కార్యక్రమానికి ఆమోదం లభిస్తే ‘పచ్చజెండా ఊపారు’ అనటం మామూలయి పోయింది. అలాగే ఆటల పోటీలను కూడా జెండా ఊపి ప్రారంభించడం తెలిసిందే’ అన్నాడు అన్వేష్. బ్యాగ్ లోపల ఉండే, నేను అన్నీ వింటూ ఆనందిస్తున్నా.

అంతలో ‘అరవింద్! చూడరా ఆ రామాలయం పైన కూడా ఓ జెండా ఎగురుతోంది’ అన్నాడు అన్వేష్. ‘అవునవును. స్టాప్ వచ్చేస్తోంది పద’ అన్నాడు అరవింద్. ‘సరే పద.. గుడి జెండాల గురించి ఇంటికెళ్లి తాతయ్య నడుగుతా’ అంటూ బస్సు దిగాడు అన్వేష్. ఇద్దరూ పరస్పరం ‘బై’ చెప్పుకున్నారు. అన్వేష్ ఇంట్లోకి రాగానే ‘అన్వేష్! పోస్ట్‌లో జెండా వచ్చిందిరా’ చెప్పాడు తాతయ్య. ‘అవునా. వస్తున్నా’ అంటూ బ్యాగ్‌ను పక్క గూట్లో పెట్టి చక చకా బూట్లు విప్పేసి, కాళ్లు చేతులు కడుక్కుని, డ్రెస్ మార్చుకుని వచ్చాడు. ఈ లోపల బ్యాగ్‌ను హడావిడిగా పెట్టడంలో అంచున ఉన్న బ్యాగ్ పడిపోయింది. దాంతో జిప్ లేనందున నేను కిందపడ్డాను. తాతగారు నన్ను టేబుల్ మీద పెట్టారు. బరువైన బ్యాగ్‌ను పక్కగా ఉంచారు. అన్వేష్ వచ్చి గబగబా జెండాను చూశాడు. ‘ఎంత బాగుందో’ అన్నాడు. తాతయ్య నవ్వాడు.

ఆ పెద్ద జెండాను పలకరించబోయాను. కానీ ఆ జెండా నన్ను చూసి ఓ రకంగా నవ్వింది. ‘నువ్వు ఆ పుస్తకం పైనే.. పైగా అంత చిన్నగా.. నేను ఇంటి పైన ఆకాశవీధిలో ఎగురబోతున్నాను’ అంది గర్వంగా. నాకు బాధనిపించింది. నన్ను నేను సముదాయించుకుంటూ ‘నువ్వు ఆకాశంలో ఎగరటం నాకూ ఆనందమే. ఎందుకంటే మా జాతి పెద్దవు కదా. అయితే నేనేమీ తక్కువ కాదు, నన్ను ఎగుర వేయక పోయినా నేను అన్వేష్‌కు ఎల్లవేళలా సన్నిహితంగా ఉండి స్పూర్తినిస్తూనే ఉంటాను. కొన్నేళ్ల కిందట అన్వేష్ నన్ను ధరించాడు. ఆ తర్వాత భద్రంగా దాచి, ఇదుగో ఇలా పుస్తకంపై అతికించాడు. నేను రోజూ అన్వేష్‌తో పాటు బడికి వెళ్తున్నాను. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. నీకన్నా పెద్ద జెండాలు కూడా ఉంటాయని చెప్పారు. చిన్నదాన్నని నన్ను చులకన చేయకు’ అన్నాను. ‘అయ్యో! తొందరపాటు మాటలు. ఏమనుకోకు. మనమంతా ఒకటే’ అంది ఆ జెండా. నేనూ స్నేహపూర్వకంగా నవ్వేశాను.

అంతలో ‘తాతయ్యా! జాతీయ పతాకం గురించి మా టీచర్ చెప్పారు. అయితే నేను వచ్చేటప్పుడు రామాలయం పైన ఒక జెండా చూశాను. ఆలయాల్లో జెండాల గురించి నువ్వు చెపుతావా’ అడిగాడు. ఇంతలో ‘అన్వేష్! ముందు ఈ ఊతప్పం తిను’ అని ప్లేటు అందించింది అమ్మ అవనిజ. ‘మరి తాతకు?’ అన్నాడు అన్వేష్. ‘నేను ఏకంగా రాత్రికే తింటాను. కాఫీ కోటా అయిపోయిందిగా’ నవ్వుతూ అన్నాడు. అవనిజ లోపలికి వెళ్లింది. అన్వేష్ తినడం మొదలు పెట్టి ‘సరే, నువ్వు చెప్పు’ అన్నాడు. నేను కూడా దృష్టి మొత్తం తాతయ్య పైనే ఉంచాను.

‘విను మరి.. ఆలయాలలో ఉత్సవాలు జరిపేటప్పుడు జయపతాకను కట్టి పైదాకా ఎగురవేస్తారు. అది ఉత్సవ ప్రారంభానికి సంకేతమన్న మాట. ఉత్సవాలు ముగియగానే పతాకాన్ని కిందకు దింపుతారు. దీన్ని ‘ధ్వజావనతం’ అంటారు. వైష్ణవాలయాలలో జెండాపై గరుత్మంతుడి బొమ్మ, శివాలయాల్లో జెండాపై నందీశ్వరుడి బొమ్మ, అమ్మవారి గుళ్లలో జెండాపై సింహం బొమ్మ ఉంటాయి’ వివరించాడు. అది విని, నేను ‘ఓహో అనుకున్నాను.

అంతలో బామ్మ వచ్చి ‘పూరి క్షేత్రంలో ఆలయంపై జెండా గుర్తుందా?’ అడిగింది. ‘గుర్తొస్తోంది కానీ నువ్వు చెప్పు, మేం వింటాం’ అన్నాడు తాత. ‘అన్వేష్! పూరిలో ఆలయం పైన ఉండే జెండాకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా గాలివాటం ఎటు ఉంటే అటు ఊగుతుంది. కానీ పూరి ఆలయం పైన జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఊగుతుంది’ చెప్పింది. ‘అలాగా’ ఆశ్చర్యంగా అన్నాడు అన్వేష్. నేను కూడా ‘ఔరా’ అనుకున్నాను.

వెంటనే తాతయ్య అందుకొని ‘ఆ మధ్య గుజరాత్ లోని పావగఢ్ కొండ పైని కాళికామాత ఆలయాన్ని పునరాభివృద్ధి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ శిఖర ధ్వజాన్ని ఎగురవేశారు మోడీ. అయిదు శతాబ్దాల తర్వాత, స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై అయిదు ఏళ్లకు ఆలయ శిఖర ధ్వజాన్ని ఎగురవేయటం జరిగిందని పత్రికలలో రాశారు’ చెప్పాడు.

ఇంతలో తాతగారి మిత్రుడు ధర్మరాజు ‘ఏం చేస్తున్నారు?’ అంటూ వచ్చాడు. తాతగారు విషయం చెప్పారు. ‘అలాగా.. ప్రాచీన కాలంలో యుద్ధాలలో కూడా జెండాల ప్రాముఖ్యత ఉండేది. మహాభారత యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమంతుడు ఉన్న బంగారు జెండా ఉన్నట్లు తెలుస్తుంది. ఖాండవ వనాన్ని దహించినప్పుడు అగ్నిదేవుని కోరికపై వరుణదేవుడు, అర్జునుడికి అందించాడు. యుద్ధ సమయంలో పాండవులకు మద్దతుగా జెండాలో తాను నివసిస్తానని హనుమంతుడు వాగ్దానం చేశాడు. అన్నట్లుగానే యుద్ధ సమయంలో జెండాపై ఉన్న హనుమంతుడు కదులుతూ, కొన్నిసార్లు శత్రువులను భయపెట్టడానికి గర్జిస్తూ కనిపిస్తాడు. ఈ జెండా గురించి తిరుపతి వేంకట కవులు రాసిన పాండవోద్యోగ విజయాలు నాటకంలో విశేష ప్రజాదరణ పొందిన పద్యం ఉంది. మా బాబాయి తరచు పాడేవాడు.. అది విని నేను కూడా నేర్చుకున్నాను’ అన్నాడు ధర్మరాజు.

‘ఏదీ ఒకసారి ఆ పద్యం అందుకో.. మా మనవడికి పద్యం గొప్పతనమేమిటో తెలుస్తుంది’ అన్నాడు తాతయ్య. ‘చాలా కాలమైంది పాడి. అయినా నువ్వు అడిగావు కాబట్టి ప్రయత్నిస్తా..’ అంటూ

జెండా పై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం పూన్చి నే
దండంబుం గొని తోలు స్యందనము మీద న్నారిసారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకంజెండుచున్నప్పుడొ
క్కండున్ నీ మొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్

ఆయన రాగాలు తీస్తూ పాడుతుంటే అన్వేష్ నోరు తెరిచి చూస్తుండి పోయాడు. నా ఆశ్చర్యానికంతే లేదు. ‘ఈ మనుషులకు ఏదైనా సాధ్యమే’ అనుకున్నాను.

‘ఎంత బాగా పాడావు రాజూ! ఇంత వయసొచ్చినా నీ గాత్ర శక్తి తగ్గలేదు’ అన్నాడు తాతయ్య. ‘నిజంగానా.. అన్నట్లు మహాభారత యుద్ధంలో కృష్ణుడు పోరాడకపోయినా ఆయనకూ ఓ జెండా ఉంది. దానిపై పక్షుల రాజు గరుడ, డేగ, విష్ణు పర్వతం బొమ్మలుంటాయి. ఇక దుర్యోధనుడి జెండాపై ఏనుగు, దానిపై నల్లపాము ఉంటాయి. ఇలా పాండవులకు, కౌరవులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కోరకం జెండా ఉండటం గమనించవచ్చు’ అన్నాడు ధర్మరాజు. ‘భలే భలే’ అని అన్వేష్ అంటుంటే, నేను, పెద్ద జెండా కూడా ‘భలే కదా’ అనుకుని ఆనందించాం.

అంతలో అన్వేష్ ‘తాతయ్యా! మొన్న టీవీలో ఐక్యరాజ్య సమితి భవనాన్ని చూశాను. దాని ముందు ఎన్ని జెండాలో’ అన్నాడు. ‘అవును. ఐక్యరాజ్య సమితి భవనం ముందు అన్ని సభ్యదేశాల జెండాలను ఏర్పాటుచేశారు. అయితే గత సంవత్సరం భారతీయులకు గర్వ కారణమైన ఘటన జరిగింది. భద్రతామండలిలో అక్కడి భారతదేశ ప్రాంగణంలో భారతదేశ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇకపై ఆ జెండా ఎప్పటికీ అక్కడ ఉంటుంది. ఇది భారత్‌కు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ఈ జెండాను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఐక్యరాజ్య సమితిలో భారత్ ఎనిమిదోసారి తాత్కాలిక సభ్యదేశంగా చేరడమే’ చెప్పాడు తాతయ్య. ‘అలాగా’ అన్నాడు అన్వేష్.

ధర్మరాజు మాట్లాడుతూ.. ‘అన్నట్లు కిందటేడు డార్జిలింగ్ లోని హిమాలయ పర్వతారోహణ సంస్థకు చెందిన ఓ బృందం సిక్కిం హిమాలయాలలోని నాలుగు చిన్న శిఖరాలలో ‘క్లయింబ్-ఎ-థాన్ నిర్వహించింది. అందులో భాగంగా ఏడువేల ఐదొందల చదరపు అడుగుల జాతీయ జెండాను మౌంట్ రెనాక్ దగ్గర ఎగురవేసింది. ఇది ఏసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కింది. ఒక పర్వతం పైన అతి పెద్ద భారత జాతీయ జెండాను ఎగురవేయడం రికార్డులలో ఇదే తొలిసారి’ చెప్పాడు. ‘మా జెండా జాతి ఎంత గొప్పదో’ నేను అనుకుంటుటే అదే సమయంలో నాకేసి చూసిన పెద్ద జెండా ‘నిజం’ అంది. అన్వేష్ ‘నేను కూడా పెద్దయ్యాక హిమాలయాలపై జెండా ఎగరేస్తా’ అన్నాడు. ‘అలాగే కానీ’ అన్నారు పెద్దలు నవ్వుతూ.

అంతలో అవనిజ ట్రే పట్టుకుని వచ్చింది. సందేహంగా చూస్తున్న తాతయ్యతో ‘కాఫీ కాదు లెండి బత్తాయి రసం’ అంది నవ్వుతూ. తాతయ్య ముందు మిత్రుడికి ఒక గ్లాసు అందించి, తానూ ఒకటి అందుకున్నాడు. పళ్లరసం తాగడం ముగించాక, ‘ఇంక నే వస్తాను’ అంటూ లేచాడు ధర్మరాజు. ‘పద, నేను కూడా మార్కెట్ దాకా వస్తాను’ అంటూ అతడితో పాటే నడిచాడు తాతయ్య. అన్వేష్ ఆడుకోవడానికి పరుగెత్తుకెళ్లాడు.

నేను పరధ్యానంగా ఉండటం గమనించి “ఏంటి ఆలోచనలో పడ్డావు?’ అడిగింది పెద్ద జెండా. ‘మన గురించే. పవిత్ర భారతదేశానికి ప్రతీకగా ఉన్నాం కదా. కాషాయరంగు త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ సౌభాగ్యానికి, సాఫల్యతకు చిహ్నం అని టీవీలో విన్నాను. అలాగే అశోకచక్రంలోని ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలకు సంకేతాలని, మనిషి అలా నిరంతరం కృషి చేస్తూ, చలన శీలతతో ఉండాలని అర్థమట. కానీ ఈ మనుషులు ఎంతో అర్థవంతంగా జాతీయ జెండాను తయారు చేసుకున్నారు కానీ ఆచరణలో ఆ సారాంశాన్ని అందిపుచ్చుకోవడంలేదు. త్యాగానికి బదులు అంతా స్వార్థపూరితంగా, కుట్రలు, కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారు. ఇక శాంతి, స్వచ్ఛతలనేవి మచ్చుకైనా లేవు. ఎక్కడ చూసినా అశాంతి, అలజడులు, అత్యాచారాలు, హత్యలు.. ఇక అసంఖ్యాకంగా అభాగ్యులే ఉన్నప్పుడు సౌభాగ్యం ఎక్కడ? మనుషులు నా మాట వినే వీలుంటే ఓ మాట చెప్పాలనుంది’ అంది. ‘ఏమిటో అది’ అంది పెద్ద జెండా. ‘జాతీయ పతాకను ఉన్నతంగా ఆకాశవీధిలో ఎగరేసినట్లుగానే మనిషి కూడా మనిషితనంతో, నైతిక విలువలతో ఉన్నతంగా, ఉత్తమంగా ఎదగాలి. అప్పుడే ఏ అమృతోత్సవానికైనా అర్థం పరమార్థం’ చెప్పాను. ‘నువ్వు చెప్పింది నిజం. ఇదంతా విన్నాక నేను ఎగరబోతున్నానన్న సంతోషం ఎగిరిపోయింది.’ దిగులుగా అంది పెద్ద జెండా. ‘నిరుత్సాహం వద్దే వద్దు. ఆకాశవీధిలో నీ రెపరెపలు ఉత్తేజాన్ని, స్ఫూర్తిని తప్పక అందిస్తాయి, ఇప్పటికే అంతటా జెండాలు ఎగురుతున్నాయి. అందరి గుండెల్లోనూ జెండా సందడి చేస్తోంది’ అన్నాను నేను.

‘నా ఆవిష్కరణ నువ్వు చూడవుకదా మిత్రమా’ అంది పెద్ద జెండా.

‘మొబైల్‌లో వీడియో తీస్తారుగా. అన్వేష్ చూస్తుంటే నేనెలాగో అలా చూస్తాలే. ఇంకా టీవీలో ఎర్రకోట మీద జెండా వందనం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జెండా వందనాలు అన్నీ తిలకిస్తాను’ సంబరంగా చెప్పాను. అంతలో ‘జెండా ఊంఛా రహే హమారా..’ అంటూ అన్వేష్ లోపలికి వచ్చాడు.

ఆ పాట విని నాలో పరవశమే పరవశం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here