అన్నింట అంతరాత్మ-36: నిర్మాణాలన్నీ నాతోనే కట్టుదిట్టం.. ‘స్తంభాన్ని నేను’!

6
2

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం స్తంభం అంతరంగం తెలుసుకుందాం.

***

‘నా ముందు నిల్చుని తల పైకెత్తి చూస్తూ నిలబడి పోయారు పిల్లలు’. అంతలో ‘ఏం చేస్తున్నారు ఇక్కడ’ అంటూ వాళ్ల తాతగారు కాబోలు వచ్చారు. ‘ఈ స్తంభం భలే ఉంది కదూ తాతయ్యా!’ ఓ పిల్లవాడు అన్నాడు. ‘దీన్ని ధ్వజస్తంభం అనాలి. ఆలయ ప్రాంగణంలో ముందు ఉండే ఈ స్తంభం వెనుక ఓ మాంఛి కథ ఉంది. దేవుణ్ణి చూసి వచ్చాక చెప్పుకుందాం’ అన్నారు. దాంతో పిల్లలు నలుగురూ తాత వెంట గుళ్లోకి వెళ్లారు.

ఆయన చెప్పే కథ ఏమిటో.. నాకు ఉత్కంఠ పెరిగిపోతోంది. కొద్ది దూరంలో ఉన్న ఉపాలయ స్తంభాలు నన్ను చూసి నవ్వుతూ ‘నీ నేపథ్య కథ వినాలని మాకూ కుతూహలంగా ఉంది’ అన్నాయి. ఈ రోజు జనం కూడా తక్కువగా ఉన్నారు.

అంతలో తాతగారు, బామ్మగారు పిల్లలు, వాళ్ల అమ్మా, నాన్నలు వచ్చేశారు. నేను ఊహించినట్లుగానే నాకు కొద్ది దూరంలోనే మెట్ల పైనే బైఠాయించారు. ‘తాతయ్యా! ధ్వజస్తంభం కథ..’ పిల్లలు కోరస్‌గా అరిచారు. ‘ఏమిటీ, ధ్వజస్తంభం కథా, మా నాన్న మాకెప్పుడూ చెప్పనే లేదు, మీతోపాటే మేమూ వింటాం అయితే’ నవ్వుతూ అన్నారు పిల్లల నాన్నలు. ‘ముందు ఈ ప్రసాదం తీసుకోండి’ అంటూ బామ్మగారు కొబ్బరి ముక్కలు అందరికీ పంచింది. కళ్లకద్దుకుని ప్రసాదం తిని తాతగారు మొదలెట్టారు,

‘మహాభారత కాలంలో మయూరధ్వజుడు అనే రాజు ఉండేవాడు. మణిపురానికి రాజయిన ఆయన గొప్ప పాలకుడు మాత్రమే కాదు, గొప్ప దాత కూడా. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసిన సందర్భంలో ఆ యాగాశ్వాన్ని బంధించాడు మయూరధ్వజుని కుమారుడు, తామ్ర ధ్వజుడు. యుద్ధానికి తలపడిన నకుల, సహదేవ, భీమార్జునులను ఓడించాడు. దాంతో ధర్మరాజు స్వయంగా బయలుదేరబోగా, కృష్ణుడు వారించి, మయూరధ్వజుణ్ణి యుద్ధంలో ఓడించడం కష్టమని, కపటోపాయంతో జయించాల్సిందే అన్నాడు. ఆ ప్రకారం శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఇద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మయూరధ్వజుడి వద్దకు వెళ్లారు. ఆయన, వారిని ఏం కావాలో కోరుకొమ్మని అడగగానే శ్రీకృష్ణుడు, ‘మేం మీ దర్శనార్థం వస్తుండగా మార్గమధ్యంలో ఓ సింహం, ఈతని కుమారుణ్ణి పట్టుకుంది. మేం, విడిచి పెట్టమని ఎంతగానో ప్రార్థించాం. అందుకు ఆ సింహం, మీరు మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు తెచ్చిస్తే, బాలుని విడిచి పెడతానంది, ప్రభువులు మీరే దయచూపాలి’ అన్నాడు శ్రీకృష్ణుడు. మయూరధ్వజుడు అందుకు వెంటనే అంగీకరించాడు. భార్యాపుత్రులే మయూరధ్వజుని కోసి, సగభాగం ఇవ్వాల్సి ఉంటుందని నియమం విధించాడు శ్రీకృష్ణుడు. ఆ ప్రకారమే వారు చేయడం చూసి, ధర్మరాజు నివ్వెర పోయాడు. ఆ సమయంలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావడం గమనించి శ్రీకృష్ణుడు ‘మీరు దుఃఖిస్తూ ఇచ్చే దానం మాకు వద్దు’ అన్నాడు. అప్పుడు మయూరధ్వజుడు ‘ఇది బాధ కాదు. నా కుడిభాగం పరోపకారానికి ఉపయోగపడింది, ఆ భాగ్యం నాకు కలగలేదని ఎడమ కన్ను బాధపడుతోంది’ అని వివరించడంతో, అతని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి, ఏదేని వరం కోరుకోమన్నాడు. అప్పుడు మయూరధ్వజుడు, ‘నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా, నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి’ అని కోరుకోగా, అందుకు పరమాత్మ ‘తథాస్తు’ అని, ‘నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి, ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తర్వాతే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు’ అన్నాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించడం విధాయకమైంది’ అంటూ కథ ముగించారు.

నా ఆశ్చర్యానికి అంతులేదు, సగానికి కోయడం, అదీ భార్యాసుతులే ఆ పని చేయాల్సి రావడం ఊహించుకుంటేనే స్తంభమైన నాకే వణుకు వచ్చినట్లయింది. ‘ఏమైనా నా వెనుక ఇంత కథ ఉందన్నమాట’ అనుకుంటుంటే, ‘బాబోయ్! సగానికి కోయడమే! మయూరధ్వజుడు నిజమైన హీరో’ అన్నాడు ఒక పిల్లవాడు అన్నాడు. ‘విజయ్! నువ్వు వీడియో గేమ్స్ మాని తాతగారి దగ్గర కూర్చుంటే నీకు ఇలాంటి అద్భుత కథలు చెపుతారు’ వాళ్ల నాన్న అన్నాడు. ‘అసలు నీ పేరు మీదే అంటే విజయ స్తంభాలు కూడా ఉన్నాయ్’ మరొకతను అన్నాడు. ‘విజయ స్తంభాలా! అవేమిటో చెప్పు బాబాయ్’ అన్నాడు విజయ్.

వెంటనే బాబాయ్, ‘చెపుతా వినండి’ అంటూ ‘పూర్వం రాజులు కొత్త రాజ్యాలను గెలవగానే తమ విజయానికి చిహ్నంగా విజయ స్తంభాలు ఏర్పాటు చేసేవారు. ఇలాటివాటిలో చితోర్‌ఘడ్ లోని విజయ స్తంభం చాలా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ గొప్ప పర్యాటక ఆకర్షణగా ఉంది. దీన్ని మహారాణా కుంభ నిర్మించాడు. మోసగాడైన మహమ్మద్ ఖిల్జీపై తమ విజయానికి చిహ్నంగా, ముప్ఫయ్ ఏడుమీటర్ల ఎత్తుతో, తొమ్మిది అంతస్తులతో నిర్మించాడు. ఈ స్తంభం పై హిందూదేవతల చిత్రాలు కూడా కనిపిస్తాయి. అంతదాకా ఎందుకు, వరంగల్ కోట దగ్గర కాకతీయులు నిర్మించిన విజయ స్తంభం ఉంది. ఈ రాతి స్తంభం ఎత్తు ముప్పయ్ అడుగులు. అందుకే ఆ ఊరి పేరు స్తంభం పల్లి అయింది’ ముగించాడు. ‘మా వాళ్లు ఎంత గొప్ప వాళ్లు’ అని నేను పొంగిపోయాను.

‘బాబాయ్! మా పాఠాల్లో అయితే అశోక పిల్లర్ సారనాథ్ గురించి చదువుకున్నాం.’ అంది దీపిక. ‘అవునమ్మా. ఉత్తర భారతదేశంలో కనిపించే అనేక స్తంభాలు అశోకుడు క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో ఏర్పాటు చేసినవే. సారనాథ్ లోని స్తూపం అశోకచక్రవర్తి పాలనకు చెందిన స్తంభాలలో ప్రసిద్ధి చెందింది. ఈ స్టూపంలో ఉన్న నాలుగు సింహాల బొమ్మ మన భారతదేశ జాతీయ చిహ్నంలో ఉంటుంది. ఇందులోని చక్రం మన జాతీయ జెండాలో చేర్చుకున్నాం’ చెప్పాడు బాబాయ్.

మావాళ్ల పరిచయం వినటం నాకెంతో ఆనందంగా, గర్వంగా అనిపిస్తోంది. వెంటనే తాతగారు అందుకుని ‘సారనాథ్ స్తూపం అంటే నాకు ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఆవరణలోని ఇనుప స్తంభం గుర్తుకొచ్చింది. పిల్లలూ! దాని గురించి చెపుతా వినండి. ఇది వేల ఏళ్లయినా తుప్పు పట్టని లోహ స్తంభం. దీని పైని లోహపు పూత మందం మిల్లీ మీటరులో ఇరయ్యవ వంతు మాత్రమే. ఇన్ని ఏళ్లుగా తుప్పు పట్టకపోవడానికి కారణమేమిటో, పూతగా వాడిన పదార్థమేమిటో తెలుసుకోవడానికి ఇప్పటికీ పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక కుతుబ్ మినార్‌ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడని చరిత్రలో చదువుతాం. దీని ఎత్తు 72.5 మీటర్లు. దీనికి మూడు వందల తొంభైతొమ్మిది మెట్లు ఉన్నాయి, ఐదు అంతస్తులున్నాయి. దీని అసలు పేరు విష్ణు ధ్వజమనే వాదనలు కూడా ఉన్నాయి’ వివరించారు. ‘అబ్బ! ఎన్ని రకాల స్తంభాలో’ దీపిక ఆశ్చర్యంగా అంది. నా మనసులో మాటే దీపిక చెప్పినట్లు అనిపించింది.

అంతలో ‘అన్నట్లు దీపూ, దీప స్తంభాలు కూడా ఉన్నాయి తెలుసా?’ అన్నాడు బాబాయ్. ‘అవునా! అయితే వాటిని గురించి కూడా చెప్పు’ అంది దీపిక. ‘సముద్రాల ఒడ్డున లైట్ హౌస్‌లను చూశావా ఎప్పుడైనా?’ అడిగాడు బాబాయ్. ‘ఓ.. చూశాం’ అన్నాడు విజయ్ ఉత్సాహంగా. ‘వాటినే తెలుగులో దీప స్తంభాలు అంటారు. సముద్రంలో ప్రయాణించే నావలకు వెలుగు నందించి సాయపడతాయి. ఇవి కాక కొన్ని ఆలయాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రమిదలు వెలిగించేందుకు వీలుగా రాతితో నిర్మితమైన దీప స్తంభాలు మనం చూడవచ్చు’ చెప్పాడు బాబాయ్. ‘భలే’ అన్నారు పిల్లలు.

‘మీరేనా చెప్పేది.. నేనూ చెపుతా మీకెవరికీ తెలియని కప్ప స్తంభం గురించి’ అంది బామ్మగారు. ‘కప్ప స్తంభమా!’ అని నేను ఆశ్చర్యపోతుంటే అంతా అదే మాట పైకి అనేశారు. అందుకు బామ్మగారు ‘అవును. ఈ కప్ప స్తంభం శ్రీవరాహ నరసింహ క్షేత్రమైన సింహాచలంలో ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో సంతాన గోపాల యంత్రాన్ని ప్రతిష్ఠించి, పైన కప్ప స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్తంభాన్ని కౌగలించుకున్న దంపతులకు సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం’ అంటుంటే, ‘అది సరే. మధ్యలో కప్ప ఏమిటి?’ ఈసారి పెద్ద కోడలు అడిగింది. ‘అదే చెప్పబోతున్నా.. వాస్తవానికి, ఇక్కడ కప్పము అంటే మొక్కుబడులు చెల్లించడం వల్ల గతంలో దీన్ని కప్పముస్తంభము అని పిలిచేవారట. అదే క్రమంగా వాడుకలో కప్పస్తంభంగా మారిపోయింది’ సందేహం తీర్చింది బామ్మగారు. ‘మాటతీరుల్లో అక్షరాలు ఎలా మింగేయ బడతాయో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.’ తాతగారు అన్నారు.

‘నేను ఓ కొత్తరకం ఒంటి స్తంభం మేడ గురించి చెపుతా. మామూలుగా ఒంటి స్తంభం మేడల గురించి మనకందరికీ తెలుసు. అయితే కేవలం పక్షుల కోసమే ఓ ఒంటి స్తంభం మేడ ఉండటం విచిత్రం. రాజస్థాన్ లోని తోలాసర్ అనే ఊళో ఆ గ్రామస్థులు అక్కడి పక్షులకు గూడు కట్టుకునే శ్రమ లేకుండా ఏకంగా పదకొండు అంతస్తుల ఒంటి స్తంభం మేడ కట్టారు. ఇందులో వెయ్యికి పైగా పక్షులు నివసించవచ్చు. ఇందులో పక్షులు తినేందుకు గింజలు, తాగునీటి కోసం నీటి తొట్లు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, అవి ఎంచక్కా ఈత కొట్టి వినోదించేందుకు ఈతకొలను కూడా ఏర్పాటు చేశారు’ చెప్పింది విజయ్ అమ్మ. ‘భలే భలే’ పిల్లలు చప్పట్లు కొట్టారు. నాక్కూడా ఆ పక్షులది ఎంత అదృష్టమో అనిపించింది. అంతేకాదు, పక్షులకు నీడ కల్పించడంలో మా జాతి పాత్ర కూడా ఉండడం ఎంతో గర్వకారణం అనిపించింది.

‘అన్నట్లు జానపద కళాకారులలో గరుడ స్తంభం దాసర్లు ఉన్నారు తెలుసా?’ తాతగారి గొంతు వినిపించి, నా దృష్టి అటు మళ్లింది. ‘వీరి దగ్గర శంఖం, జేగంట, దీపపు సెమ్మె, రాగిచెంబు, హనుమంతుడి బిళ్ల ఉంటాయి. వీరి దగ్గర ఉండే దీపపు సెమ్మెను ‘గరుడ స్తంభం’ అంటారు. వీరు కథలను గానం చేస్తారు. వీరిలో కొందరిని శంఖు దాసర్లని, మరి కొందరిని గరుడ స్తంభం దాసర్లని పిలుస్తారు. ఇంకా రకరకాల స్తంభాలు ఉన్నాయి. ఇదివరకు పల్లెల్లో లాంతరు స్తంభాలు ఉండేవి. ఇప్పుడు విద్యుత్తు వచ్చాక కరెంట్ స్తంభాల ఏర్పాటు మీకు తెలిసిందే. గంట స్తంభాలు కూడా ఉన్నాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గంటలను ఎతైన స్తంభం మీద బిగిస్తారు. ఇవి చర్చిలలో సర్వసాధారణం. అంతేకాకుండా పూర్వం రాజులు తమ పాలనకు చిహ్నంగా గంట స్తంభాలు నిర్మించేవారు. ప్రపంచంలో అతి పెద్ద గంట స్తంభం ఇటలీలోని ప్రియూలీ వెనెన్సియాజూలియా ప్రాంతంలో ఉంది. దీన్ని మోర్తె యానో బెల్ టవర్ అంటారు. దీని ఎత్తు మూడువందల డెభై ఒక్క అడుగులు. ఇంక గడియారం స్తంభాలు సరేసరి. పూర్వం సామాన్యులకు గడియారాలు అందుబాటులో ఉండక పోవడంతో పాలకులు వారి సదుపాయం కోసం వీటిని ఏర్పాటు చేసేవారు. అందుకే ఆనాటి గడియారం స్తంభాలను చాలా ప్రాంతాల్లో నేటికీ చూస్తున్నాం. స్తంభం చివర చిన్నబురుజు ఉండి, దాని నాలుగు వైపుల వెలుపల గోడలకు, నాలుగు దిక్కులకు కనపడేటట్లు గడియారాలను అమర్చేవారు’ చెప్పాడు తాతయ్య.

‘అవునవును.. సికింద్రాబాద్‌లో క్లాక్ టవర్ ఉందిగా’ అన్నాడు విజయ్. ‘మా జాతివారు ఎన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారో’ గర్వంగా అనుకున్నాను. ‘స్తంభాలంటే మరో విషయం గుర్తుకొస్తోంది. ఆ మధ్య బీజాపూర్ వెళ్లినపుడు ఒకటవ అలీ అదిల్ షా నిర్మించిన గగన్ మహల్ చూశాను. అక్కడ విశాల ప్రాంగణంలో కొయ్య స్తంభాలు, మధ్యలో చక్కటి ఆర్చి ఉన్నాయి’ చెప్పాడు.

‘అది సరేగానీ గాలిలో వేలాడే స్తంభం గురించి మీకు తెలుసా?’ అన్నాడు విజయ్ నాన్న. ‘వేలాడే స్తంభమా! భలే. త్వరగా చెప్పు’ అన్నారంతా. ‘లేపాక్షి దగ్గర్లో వీరభద్రస్వామి దేవాలయం ఉంది. అక్కడి మండపంలోని డెబ్బై స్తంభాలలో ఒక్కటి మాత్రం నేలకు ఆనకుండా గాలిలో వేలాడుతుంది. హామిల్టన్ అనే పరిశోధకుడు ఆ స్తంభాన్ని నేలకు ఆనించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆధారం చేసుకున్న శీర్షాలన్నీ కదిలాయి. పక్కనున్న స్తంభాలు దిశలు మారాయి. దాంతో ఈ స్తంభమే మొత్తం మండప భారాన్ని మోస్తోందని భావించి అలాగే వదిలేశాడు. అది ఆనాటి శిల్పుల చాతుర్యం. ప్రకృతి వైపరీత్యాలలో ప్రకంపనలకు నష్టం రాకుండా ఒక స్తంభాన్ని తూకపు స్తంభంగా నిర్మించారు. అదే ఈ స్తంభం’ వివరంగా చెప్పాడు.

‘బాగుంది. నేను మరో అద్భుతం గురించి చెపుతాను. అది మహారాష్ట్రలోని కేదారేశ్వర దేవాలయం. అదొక గుహాలయం. అందులో నాలుగు రాతి స్తంభాల మధ్య ఒక శివలింగం ఉంటుంది. దీని ఎత్తు ఐదు అడుగులు. ఇది ఎప్పుడు నిర్మితమైందో తెలిపే ఆధారాలేవీ లేవు. ఈ నాలుగు స్తంభాలు ఒక్కొక్క యుగానికి అంటే కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలకు ప్రతీకలు. ఒక్కొక్క యుగాంతం సమయంలో సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందు ఒక్కో స్తంభం విరిగి పోయిందని స్థానిక కథనం. విరిగి పోకుండా ఉన్న స్తంభం కలియుగానికి ప్రతీక. ఇది అంత పెద్ద రాతి బండను ఎలా మోస్తోందన్న విషయం అంతుచిక్కనిది. అలాగే ఇక్కడ ప్రతిరోజు నాలుగు గోడల నుండి నీరు గుహలోకి వస్తుంది. శివలింగం చుట్టూ వేసవి, శీతాకాలాలలో ఐదు అడుగుల ఎత్తులో చాలా చల్లని నీరు ఉంటుంది. కానీ వర్షాకాలంలో చుక్క నీరు కూడా గుహలోకి రాదు. ఇది కూడా జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది’ చెప్పాడు బాబాయ్. ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అదే మాట అంతా అన్నారు.

ఆ వెంటనే ‘అసలు ఇన్ని విశేషాలు చెప్పుకున్నాం కానీ నరసింహ స్వామి స్తంభంలోంచి ప్రత్యక్షమైన సంగతే మరచి పోయాం’ అంది బామ్మ దేవుణ్ణి తలచుకుని చెంపలు వేసుకుంటూ. ‘నరసింహ స్వామా!’ ఆశ్చర్యంగా అడిగింది. దీపిక. ‘అవును. ప్రహ్లాదుడి కథ ఆ మధ్య విన్నావుగా మరిచిపోయావా? భక్త ప్రహ్లాదుడు నిరంతరం హరి నామం జపిస్తుంటే, హరిని శత్రువుగా భావించే తండ్రి హిరణ్యకశిపుడు ‘ఎక్కడ నీ హరి?’ అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు హరి అంతటా ఉన్నాడని చెప్పగా, ‘అయితే ఈ స్తంభంలో చూపు, అంటూ గదతో అక్కడి స్తంభాన్ని పగలగొడతాడు. వెంటనే ఆ స్తంభంలో నరసింహ స్వామి ప్రత్యక్షమై, హిరణ్యకశిపుని సంహరిస్తాడు’ చెప్పింది బామ్మ. మా జాతి వారి నుంచి దేవుడు ప్రత్యక్షం అయిన విషయం నాకెంతో ఆనం దాన్నిచ్చింది.

అంతలో విజయ్ అమ్మ మాట్లాడుతూ ‘స్తంభాలలో శాసన స్తంభాలు కూడా పేరొందాయి. ఇటీవల కొలనుపాకలో కల్యాణ చాళుక్యుల నాటి శాసన స్తంభం వెలుగుచూసింది. దీనికి ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ స్తంభం ఎత్తు ఇరవై మూడు అడుగులు. స్తంభం నలువైపులా కన్నడంలో ఉన్న శాసనం నాటి చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ప్రతిబింబంగా ఉంది. అమరావతి స్థూపం గురించి మనందరికి తెలుసు. వరంగల్ లోని వేయి స్తంభాల గుడి ప్రఖ్యాతిగాంచింది. ఈ స్తంభాలపై నాణేలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్తస్వరాలు, లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది. ఇక హంపిలోని విఠల ఆలయంలో సప్త స్వరాలు పలికే సంగీత రాతి స్తంభాలు పర్యాటకులకు పెద్ద ఆకర్షణగా నిలిచాయి. ఇలా సంగీత స్తంభాలు గల ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇక అలనాటి రాజులు ఏర్పాటు చేసిన కీర్తి స్తంభాలలో ముఖ్యంగా చితోడ్‌గఢ్ లోని స్తంభం గురించి ప్రస్తావించుకోవాలి. దీన్ని ప్రతిష్ఠ బురుజు అని కూడా అంటారు. దీని ఎత్తు ఇరవై రెండు మీటర్లు. ఏడు అంతస్తులు ఉన్న ఈ కీర్తి స్తంభం మొదటి తీర్థంకరుడైన అధినాధునికి చెందింది. బురుజుల గోడల పై జైన తీర్థంకరుల చిత్రాలు కనిపిస్తాయి. రెండవ అంతస్తులో అద్భుతంగా చెక్కిన అధినాథుని శిల్పం ఉంది. ఈ స్తంభం ఏడో అంతస్తునుండి చితోడ్‌గఢ్ నగరాన్ని సమగ్రంగా వీక్షించవచ్చు’ చెప్పింది. అది విని ‘మాజాతి ఎంత విస్తృతమైందో’ మరో మారు గర్వపడ్డాను నేను. ఎన్ని విశేషాలో’ అంటూ అంతా ఆనందించారు.

‘అవును. హైదరాబాదులోని అమరవీరుల స్తూపాన్ని మరిచిపోతే ఎలా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి దశ ఉద్యమంలో అమరులైన తెలంగాణ వీరుల స్మారక చిహ్నంగా అసెంబ్లీ ముందున్న గన్‌పార్క్‌లో ఓ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఇక భారత సైన్యం ఇండియాలో తొలి బలిదాన్ స్తంభాన్ని జమ్మూలో ఏర్పాటు చేసింది. ఇది అరవై మీటర్ల ఎత్తులో సైనికుడి తుపాకీ ఆకారంలో ఉంటుంది. అక్కడ ఉన్న స్తంభాల పై నాలుగువేల ఎనిమిది వందల డెబ్భైఏడు మంది అమర జవాన్ల పేర్లు చెక్కారు’ చెప్పాడు బాబాయ్. దేశం కోసం ప్రాణాలొడ్డిన జవాన్ల స్మారకార్థంగా కూడా మా జాతి నిలవడం నాకెంతో ఆనందంగా అనిపించింది.

అంతలో తాతగారు అందుకుని ‘వంతెనల నిర్మాణంలో స్తంభాల పాత్ర ముఖ్యమైంది. వంతెనల స్తంభాలను లోప భూయిష్టంగా నిర్మిస్తే వంతెనలు కూలి పోతాయి. అలాటి దుర్ఘటనల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి. అలాగే అడపా తడపా కొంత మంది తమ కోర్కెల సాధన కోసం హైటెన్షన్ స్తంభాలనెక్కి బెదిరించడం కూడా తెలిసిందే. ఇక సెల్ టవర్లను విచ్చలవిడిగా ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ పెరిగి అనారోగ్యానికి కారణం అవుతుంది. అలాగే పక్షులకు కూడా హాని జరుగుతుంది’ చెప్పారు. ‘ఇవాళ స్తంభాల గురించి నా జనరల్ నాలెడ్జి చాలా పెరిగిపోయింది. విజయ్ నవ్వుతూ అన్నాడు. ‘అబ్బో! చీకటి పడిపోతోంది. పదండి పోదాం’ అంటూ లేచాడు బాబాయ్. అంతా ‘అవునవును’ అంటూ లేచి వెళ్లి ‘కియా’ కారెక్కారు.

ఇప్పటిదాకా ఎంత సందడిగా ఉందో. ఇక మళ్లీ నిశ్శబ్దం. కానీ నా ఆలోచనలు మాత్రం నిశ్శబ్దం కాలేదు. ‘వంతెన స్తంభాలను సరిగా కట్టక పోవడం ఎంత దారుణం! ఏ పాపం ఎరుగకున్నా, ఆ పాపం మా స్తంభాలకు చుట్టుకోవడం నాకు నచ్చలేదు. బెదిరింపులకు నన్ను ఎంచుకోవడం ఎంత దారుణం! ఇక సెల్ టవర్ల విషయంలో జాగ్రత్తలు పాటించకుండా అనారోగ్యాలు, ఆపదలు కొనితెచ్చుకోవడం బాధాకరం. నా మాట మనిషికి చేరినా, చేరకపోయినా నా మనోగతమైతే.. నిర్మాణాల విషయంలో స్వార్థంతో అవినీతికి పాల్పడి లోపభూయిష్ట నిర్మాణాలు చేయొద్దు. అలాగే బెదిరింపులకు దయచేసి మా జాతిని ఎంచుకోవద్దని మనవి. సెల్ టవర్లను కూడా తగు జాగ్రత్తలతో, నివాసాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది.. అనుకుంటుండగా, సందడి చేస్తూ ఓ భక్త బృందం ఇటే వస్తుండడంతో నా ఆలోచన చెదిరి, దృష్టి అటు మళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here