అన్నింట అంతరాత్మ-37: గతమెంతో ఘనం.. ‘రోలు’ను నేను!

7
2

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం రోలు అంతరంగం తెలుసుకుందాం.

***

‘బామ్మొచ్చింది, బామ్మొచ్చింది’ పిల్లల సంతోషపు కేకలు నా చెవులకు అమృతంలా సోకాయి. వెంటనే ఆనందంగా చూపు అటు మళ్లించాను. ‘అంతా కులాసానా’ అంటూ, ‘కాళ్లు కడుక్కు వస్తా ఉండండి ఓ నిముషం’ అంటూ వాష్ ఏరియాకు వచ్చింది. అక్కడే ఓ మూల ఉన్న నేను ఆనందంగా పలకరించాను. కానీ రోలును కదా, నా పలకరింపు ఆమెకు చేరినట్లు లేదు. అయితేనేం, నన్ను చూడనే చూసింది, ‘రమా! నేనిచ్చిన రోలేమిటి, ఇక్కడ పడేశారు. అయ్యో! దుమ్ము కొట్టుకుపోయింది’ అంది బాధగా. ‘కొత్తలో ఏదో వాడేవాళ్లం కానీ, మిక్సీ కొన్నాం, వెట్ గ్రైండర్ కొన్నాం.. ఇంక దాంతో పనేముంది? ఇంట్లో చోటు దండగని అక్కడ పడేశాం. రోళ్లు, రోకళ్ల కాలం పోయింది అత్తయ్యా’ అంది రమ. అత్తయ్య అనసూయమ్మ ఏమనలేక మౌనంగా ఉండిపోయింది. కోడలిచ్చిన కాఫీ తాగుతూ, మనవల కబుర్లు వింటోంది. నేను మాత్రం అనసూయమ్మతో నా అనుబంధాన్ని నెమరు వేసుకున్నాను.

ఆ పల్లెలో అనసూయమ్మ ఇంట్లో ఉన్నప్పుడు నేనెప్పుడూ బిజీగా ఉండేదాన్ని. పచ్చళ్లు, పొడులు, గారెలపిండి, ఇడ్లీపిండి, దోశెపిండి ఏదైనా నాతోనే పని. ఎంతో శ్రద్ధగా ఎప్పటి కప్పుడు నన్ను కడిగి శుభ్రంగా ఉంచేది. నాకు జతగా చిన్న రోకలి, చక్కని పొత్రం.. కొడుకు పెళ్లయ్యాక ‘కొత్త రోలు కొంటే కొన్నాళ్లు వాడితేకానీ బాగా పనిచేయదు. అందుకని ఈ రోలు, పొత్రం, రోకలి మీరు పట్టుకెళ్లండి. నేను కొత్తది కొనుక్కుంటా’ అంటూ నన్ను రమకు ఇచ్చి పంపింది. అక్కణ్నుంచి రావటం నాకసలు ఇష్టమే లేదు, కానీ ఏం చేస్తాను. తీరా ఇక్కడకు వచ్చాక రమ ఎక్కువ రోజులు వాడనే లేదు. నేనిలా మూలపడ్డాను. నేనే కాదులే, మా జాతికి చెందిన విసుర్రాయి కూడా స్టోర్ రూమ్‌లో మూలుగుతోంది. ఇలా ఆలోచిస్తుంటే సమయమే తెలీలేదు. భోజనాల సమయమైనట్లుంది.

‘ఇదుగో చింతకాయ, గోంగూర నిన్ననే నూరి, పోపు పెట్టాను. మీ కోసం తెచ్చాను’ అంటూ చిన్న బాక్సులు తీసి, కోడలికి అందించింది. ‘నాకు గోంగూర వెయ్యవోయ్. అదే చేత్తో ఓ ఉల్లిపాయ, రెండు పచ్చి మిరపకాయలు కూడా ఇటివ్వు. అమ్మ చేతి పచ్చళ్లే పచ్చళ్లు’ కొడుకు శ్రీధర్ అన్నాడు. పిల్లలు కూడా చింతకాయ పచ్చడి తింటూ ‘అబ్బ! భలే బాగుంది. అమ్మా! నువ్వు చేస్తే ఇలా రాదెందుకు?’ అడిగారు. ‘నేను రోట్లో చేస్తాను కదా అందుకే రుచిగా ఉంటాయి’ అంది అనసూయమ్మ. మా జాతికి మెప్పుకోలు దక్కినందుకు నాకు చాలా రోజులకు ఆనందంగా అనిపించింది.

‘మీరు చెప్పింది నిజమే అత్తయ్యా! కానీ ఆ నూరడం, దంచడం, రుబ్బడం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అంత ఓపిక, తీరిక ఎవరికి?’ అంది. వెట్ గ్రైండర్, మిక్సీ తామే గొప్ప అన్నట్లు నావంక చూశాయి. నేను చిన్నబోయాను. అంతలో రమ తానూ గోంగూర వేసుకొని ‘బాగుంది అత్తయ్యా’ అంటూ తినసాగింది. నేను వెట్ గ్రైండర్, మిక్సీల వంక నవ్వుతూ చూశాను.

భోజనాలు అయ్యాక పిల్లలు బామ్మ దగ్గర చేరారు. ‘బామ్మా! బామ్మా! చిన్ని కృష్ణుణ్ణి వాళ్ల అమ్మ రోటికి కట్టేసిందట. ఆ కథ చెప్పవూ’ అన్నారు. ‘రోలు అనగానే మీకు అల్లరి కృష్ణుడు గుర్తుకొచ్చాడా? చెపుతా వినండి. కృష్ణుడు దేవకికి పుట్టినా, పెరిగింది యశోద దగ్గర. ఆమె చిన్ని కృష్ణుడిని ఎంతో ముద్దుగా చూసుకునేది. కృష్ణుడేమో వఠ్ఠి అల్లరివాడు. ఒకరోజు యశోద పెరుగు చిలుకుతుండగా, చిన్ని కృష్ణుడు పాలు కావాలని మారాం చేస్తూ ఏడవడం మొదలు పెట్టాడు. దాంతో ఆమె చేస్తున్న పని ఆపి, అతణ్ని ఒళ్లో పడుకోబెట్టుకుని పాలివ్వసాగింది. ఈ లోపల పొయ్యి మీద పెట్టిన పాలు పొంగడం గమనించిన యశోద, కృష్ణుడిని వదిలి, లోపలకు వెళ్లింది. వెంటనే చిన్నికృష్ణుడు పెరుగు కుండను పగలగొట్టి, వెన్న తిని పరుగెత్తిపోయాడు. యశోద వచ్చి, అతడి వెనుకే వెళ్లింది. మరొకరి ఇంట ఉట్టిలోని వెన్నను ఒక కోతికి తినిపిస్తున్న కొడుకు కనిపించాడు. చిన్ని కృష్ణుడి అల్లరిని ప్రత్యక్షంగా చూసిన ఆమె ఒక బెత్తం చేతిలోకి తీసుకుని అతడిని బెదిరించింది. దాంతో కృష్ణుడు భయపడ్డట్టు నటిస్తూ వేగంగా పరుగెత్తాడు. యశోద కూడా అతడి వెంట పరుగు తీసింది. చివరకు వెన్న దొంగ పట్టుబడ్డాడు. అతడిని కట్టేయాలనుకుంది ఆమె. అక్కడే ఉన్న ఒక రోటికి కట్టేయబోతే ఆ తాడు తక్కువైంది. ఎన్ని తాళ్లు తెచ్చినా అలాగే కావడంతో ఆమె అలసిపోయింది. అది గమనించి కృష్ణుడు ఆమె పై దయచూపాడు. దాంతో మరో ప్రయత్నం చేసిన యశోద చిన్ని కృష్ణుడిని కట్టేయగలిగింది. ఆమె తన పనులు చూసుకుంటుండగా, చిన్నికృష్ణుడు పెరటిలోని మద్ది చెట్ల వైపు చూశాడు. అవి నారద శాపం వల్ల జంట మద్దిచెట్లుగా ఉన్న నలకూబర, మణిగ్రీవులు. వెంటనే చిన్నికృష్ణుడు రోలును ఈడ్చుకుంటూ అటుగా వెళ్లి రోలును అడ్డంగా లాగాడు. వెంటనే మద్దిచెట్లు వేళ్లతో సహా పెకిలించబడి, పెద్ద చప్పుడు చేస్తూ నేలకూలాయి. దాంతో వారి శాపం తొలగిన నలకూబర, మణిగ్రీవులు బయటకొచ్చి, శాప విమోచనం చేసిన బాలకృష్ణుని స్తుతించి, వెళ్లి పోయారు. చిన్నికృష్ణుడు రోలును లాక్కెళ్లడం, అంత పెద్ద మద్ది చెట్లను కూల్చడం చూసి అంతా నివ్వెరపోయారు’ ముగించింది. ‘భలే.. భలే’ అన్నారు పిల్లలు. కృష్ణుడిని రోటికి కట్టడం విని నా మనసు పులకించిపోయింది. ‘ఆ రోలు ఎంత పుణ్యం చేసుకుందో.. దాని జన్మ ధన్యం’ అనుకున్నాను.

‘అత్తయ్యా! పెళ్లిళ్లలో పెళ్లికూతురు చేత సన్నికల్లు తొక్కిస్తారు ఎందుకని?’ అడిగింది రమ. బామ్మ జవాబు చెప్పబోయింది.. ‘ఆగు బామ్మా.. ముందు సన్నికల్లు అంటే ఏమిటో చెప్పు’ అడిగారు పిల్లలు. ‘అలాగే చెపుతా.. సన్నికల్లు అంటే నూరుడు బండ. గతంలో దీన్ని వాడేవారు. ఇంక పెళ్లిలో వధువుచేత ఎందుకు తొక్కిస్తారు అంటే ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా, సన్నికల్లు లాగా దృఢంగా, సహనంతో ఎదుర్కోవాలనేది అంతర్గత భావన. అలాగే వధూవరుల బంధం కూడా అంత దృఢంగా ఉండాలన్న ఆకాంక్ష కూడా ఉంది’ చెప్పింది బామ్మ.

‘అమ్మా! యాదవ కులంలో ముసలం పుట్టింది అంటుంటారు. ముసలం అంటే రోకలి అని తెలిసింది. కానీ ముసలం పుట్టడమేమిటి? ఆ సంగతేదో చెప్పు!’ అన్నాడు శ్రీధర్. ‘అదా.. వినండి మరి.. మహాభారతంలో మౌసల పర్వం అని ఒక అధ్యాయమే దీని గురించి ప్రత్యేకంగా ఉంది. మహాభారత యుద్ధంలో పుత్రులనందరినీ పోగొట్టుకున్న గాంధారి శోకంలో, తమ వంశం లాగా యాదవ వంశమూ నిర్వంశం కావాలని కృష్ణుణ్ణి శపించింది. అలా ఉండగా ఒక రోజు విశ్వామిత్రుడు, నారదుడు మొదలైన మహామునులందరూ తమ శిష్యులతో శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు. వారిని చూసిన యాదవులు గర్వంతో, ఆ మునులను ఆటపట్టించాలనుకున్నారు. వారిలో ఒకడైన సాంబుడికి, అంటే కృష్ణుడి కుమారుడికి ఆడవేషం వేసి వారి వద్దకు తీసుకెళ్లి ‘ఈమెకు సంతానం కలుగుతుందా’ అని అడిగారు. అన్నిటినీ గ్రహించగల ఆ ఋషులు ‘కృష్ణుడి కుమారుడైన ఈ సాంబుడు యాదవ వంశ నాశనానికి కారణమైన రోకలిని కంటాడు. మా మాట జరిగి తీరుతుంది పొండి. బలరామకృష్ణులు తప్ప అందరు రోకలికి ఉన్న దైవశక్తితో చనిపోతారు’ అని కృష్ణుని దర్శించకుండానే వారు వెళ్లిపోయారు. ఈ సంగతి తెలిసిన యాదవ పెద్దలు కృష్ణుని వద్ద బాధపడ్డారు. ‘విధిని ఎదిరించలేము’ అన్నాడు కృష్ణుడు. మర్నాడు సాంబుడి కడుపు నుండి ఇనుప రోకలి బైటపడింది. యాదవ పెద్దలు దాన్ని బాగా అరగదీయగా చిన్నకొన మిగిలింది. దాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలిపి ఇక ఆపద పోయినట్లే అని సంతోషించారు. కానీ ఆనాడు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే తుంగ మొక్కలుగా పుట్టింది. యాదవులు తమలో తాము కలహించుకొని, ఆ తుంగ మొక్కలతో బాదుకొనే మరణించారు. సున్నితంగా, మెత్తగా ఉండే తుంగ మొక్కలు వారి వినాశనానికి ఆయుధాలు కావడం విచిత్రం. యాదవ కులంలో ముసలం పుట్టడం అంటే అదే’ చెప్పింది బామ్మ. ‘ఇప్పుడు బాగా అర్థమైంది’ అన్నాడు శ్రీధర్. ఆ రోకలికి ఉన్న దైవశక్తి తలచుకుని ఆశ్చర్యపోయాను. మా జాతికి ఇంత ఇతిహాస నేపథ్యం ఉండటం కూడా నాకు ఒకింత గర్వంగా అనిపించింది.

అంతలో రమ ‘అత్తయ్యా! తిరుపతి దగ్గర నారాయణ వనంలో ఉన్న కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ పెద్ద తిరగలి ఉంది. పద్మావతి, శ్రీనివాసుల వివాహ సందర్భంలో పద్మావతీ దేవి మంగళ స్నానానికి నలుగు పిండిని ఆ తిరగలిలోనే విసిరారని చెప్పారు.’ అంది. ‘అవును రమా! నేనూ చూశాను. పుణ్యక్షేత్రాలకు ఎన్నో నేపథ్యకథలు ఉండటంతో పాటు అందుకు నిదర్శనాలు కూడా ఉండటం ఎంతైనా విశేషం’ అంది బామ్మగారు.

‘బామ్మా, బామ్మా! మొన్న మేం విహార యాత్రకు వెళ్లినప్పుడు అంత్యాక్షరి ఆడాం. మా రాజుగాడు ‘దంచవే మేనత్త కూతురా.. వడ్లు దంచవే నా గుండెలదరా..’ అంటూ భలే హుషారుగా పాడాడు. మనవడి మాటలకు బామ్మ పకపకా నవ్వింది. ఆమెతో పాటు అంతా నవ్వారు. నాకూ నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతారు’ చిరుకోపంతో అన్నాడు మనవడు. ‘కోపం తెచ్చుకోకురా. అది సినిమా పాటే కానీ రోకటి పాటలు, దంపుడు పాటలు అని జానపద గీతాలు ఎన్నో ఎప్పటినుంచో ఉన్నాయి. శ్రమ తెలియకుండా రకరకాల పాటలు పాడుకునేవారు. నాకు గుర్తున్న ఒక రోకటి పాట వినిపిస్తాను..

‘కారాలలో కెల్ల రెండు కారాలు
ఉప్పుకారమొకటి, ఉపకారమొకటి..
వాసాలలో కెల్ల రెండు వాసాలు
రాణి వాసామొకటి విశ్వాసమొకటి..
కుంటలలో కెల్ల రెండు కుంటల్లు
వడ్ల కుంటా ఒకటి, వైకుంఠమొకటి..’

పాడింది బామ్మ.

‘భలే భలే’ అనుకున్నాను నేను. ‘ఎంతో అర్థవంతంగా ఉంది అత్తయ్యా’ అంది రమ.

‘అన్నట్లు ఘంటసాల పాడిన దంపుడు పాట అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ హిట్టే.

‘అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా..
కోడల్లేని అత్త గుణవంతురాలు..
ఆహూఁ ఊహూఁ.. ఆహూఁ ఊహూఁ.. ॥ అత్త ॥
కోడల కోడల కొడుకు పెళ్లామా ఓయమ్మా
పచ్చిపాల మీద మీగడేదమ్మా..
ఆ వేడిపాలలోన వెన్న ఏదమ్మా..’

సరదాగా పాడాడు శ్రీధర్.

‘నాకు తెలుసురా.. ఈ పాట పాడి మా ఇద్దరి మధ్య తంపులు పెట్టాలని కుట్ర చేస్తున్నావు’ అంది అమ్మ నవ్వుతూ. ‘ఆయన కుట్ర చేస్తే మాత్రం.. మనం ఆదిపరాశక్తులం కదా, దాన్ని ఇట్టే భగ్నం చేసేస్తాం లెండి అత్తయ్యా.’ అంది రమ కూడా నవ్వుతూ. ఆ కుట్ర ఏమిటో కానీ నాకైతే ఆ ఆహూఁ.. పాట భలే నచ్చింది.

‘మరి తిరగలితో విసిరేటప్పుడు పాడే పాటలు లేవా?’ అడిగింది మనవరాలు. ‘ఎందుకు లేవూ. ఇదివరకు అమ్మాయిలు తిరగలిలో పిండి విసురుతూ ‘రాగులూ విసరంగ రవగాలి గొట్టంగ.. చేట బోర్లా పడి, పిండి గాలికి బోయె’ అంటూ పాడేవారు చెప్పింది బామ్మ.

‘అమ్మా! విసిరీ విసిరీ అలసి పోయి, పాండురంగడినే నమ్ముకున్న సతీ సక్కుబాయిని స్మరించుకోవద్దా’ అన్నాడు శ్రీధర్. ‘అవునురోయ్, బాగా గుర్తుచేశావు. పాండురంగడి భక్తిలో మునిగిన కోడలిని ముప్పతిప్పలు పెట్టేది అత్తగారు. బస్తాలకొద్దీ ధాన్యాన్ని ఒక రాత్రిలో విసరటం పూర్తిచేయాలని, లేకుంటే అన్నం పెట్టేదిలేదని శాసించింది. పాపం.. సక్కుబాయి ఎంత కష్టపడ్డా ఆ ధాన్యం తరిగితేనా. తొలి కోడి కూత వినిపించింది. ఆమె గుండె దడదడలాడింది. ఎలా ఆ పని పూర్తి చేయడం.. పాండురంగడినే స్మరిస్తూ సొమ్మసిల్లిపోయింది. పాండురంగడు ఆమె మొర విని, వచ్చి తన అద్భుతశక్తితో ఆ ధాన్యం మొత్తాన్ని పిండిగా మార్చి ఆమెను కాపాడాడు’ భక్తిగా చెప్పింది బామ్మ.

‘అత్తయ్యా! ఇది కూడా మరో కుట్రే’ నవ్వుతూ అంది రమ. ‘బాగుంది. కథ అలా ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను? గతంలో గయ్యాళి అత్తగార్లు కోడళ్లతో అలా దంపుడు పనులు, విసురుడు పనులు, రుబ్బుడు పనులు చేయించి కక్ష తీర్చుకునేవారు. నీకు లాగా అందరికీ మా అమ్మ లాంటి అత్తగారు దొరుకుంతుందేమిటి, కదా అమ్మా!’ అన్నాడు శ్రీధర్. ‘చాల్లే ఊరుకోరా.. కక్షలు లేవు, శిక్షలు లేవు’ అంది బామ్మ గారు. ‘బాగా చెప్పారు అత్తయ్యా’ అంది రమ.

‘అన్నట్లు అత్తయ్యా! ఆ మధ్య కరోనా కాలంలో కొంతమంది తిరగళ్లు కొన్నారని కూడా విన్నాను. చిరుధాన్యాలను తినడం పెరగడంతో, వాటిని మిక్సీ పట్టడం కన్నా విసిరితే రవ్వ సమంగా వస్తుందని కొనుక్కున్నారట’ చెప్పింది రమ. ‘మంచి పనే’ అంది బామ్మ. ‘ఇంట్లో విసుర్రాయి ఉన్నా బయటికి తీయలేదు నీ కోడలు’ అన్నాడు శ్రీధర్. ‘అవునవును. తీసి మీ చేత విసిరించాల్సింది’ అంది రమ ఎక్కడా తగ్గ కుండా. వాళ్ల మాటలు విని బామ్మ నవ్వేసింది.

‘అత్తయ్యా! ఈ మధ్య పెళ్లిళ్లలో ఫొటో షూట్లకు రోళ్లను, తిరగళ్లను అందంగా అలంకరించి అక్కడ ఉంచడం ఓ ట్రెండ్‌గా మారింది’ చెప్పింది. ‘పోనీలే.. తిరగలి ఉనికిని ఆ విధంగా అన్నా గుర్తిస్తున్నారు’ అంది బామ్మ అంటుంటే మా జాతివారు ఈ విధంగా ఉపయోగపడుతున్నారన్నమాట అనుకున్నాను. ‘అవునూ.. ఆయుర్వేద వైద్యుల దగ్గర కూడా చిన్న సైజు రోళ్లుంటాయి కదా’ అన్నాడు శ్రీధర్. ‘దాన్ని రోలు అనర్రా, కల్వం అంటారు. అంతేకాదు, రసాయన శాస్త్ర ప్రయోగాలకు కొన్ని పదార్థాలను చూర్ణం చేయడానికి కూడా కల్వాలను వాడతారు. ఇవి రాతివి మాత్రమే కాక, పింగాణివి కూడా ఉంటాయి’ వివరించింది బామ్మ. ‘అబ్బో! మా జాతి వల్ల ఈ ప్రయోజనాలు కూడా ఉన్నాయా’ అనుకున్నాను నేను.

‘అవునత్తయ్యా! ఆ మధ్య సూర్యగ్రహణం వచ్చినప్పుడు రోట్లో రోకలి పెడితే అది నిటారుగా నిలుచుందిట. గ్రహణ సమయం పూర్తి కాగానే పడిపోయిందట. ఆ వీడియోలు చూశాను’ అంది రమ. ‘నిజమే. నేనూ విన్నాను’ అంది బామ్మ. ‘రమా! కాఫీ టైమయింది. ఆ సంగతి చూడు’ అన్నాడు శ్రీధర్. ‘ఆఁ అలాగే’ అంటూ ‘అన్నట్లు మర్చిపోయా.. గారెలకని మినపప్పు నానబోశా. అరె, కరెంట్ లేదు. ఇప్పుడెలా?’ అంది రమ. ‘ఏముంది, బయట రుబ్బించుకు వస్తే సరి’ అన్నాడు శ్రీధర్. ‘ఈ మాత్రానికి బయటకు వెళ్లడమెందుకు. చక్కగా రోట్లో రుబ్బేసుకుంటే సరి. మీకెందుకు, నేను రుబ్బుతా చూస్తూ ఉండండి’ అంది బామ్మ. ‘అయ్యయ్యో.. మీకెందుకు శ్రమ’ అంది రమ. ‘నాకేం శ్రమ కాదు. నాకు అలవాటయిన పనే. నేను రుబ్బి ఇస్తా, నువ్వు గారెలు వేద్దూ గానీలే’ అంది బామ్మ.

‘బామ్మా! మొన్న టీవీలో ఓ పాత సినిమా చూశాను. అందులో కమెడియన్ హోటల్లో చక్కగా భోంచేస్తాడు. ఆ తర్వాత బిల్లు కట్టే సమయానికి తన పర్సు పోయినట్లు నాటకమాడతాడు. అప్పుడు హోటల్ యజమాని, ఆ పప్పులేం ఉడకవు. లోపలికెళ్లి పప్పు రుబ్బిపో’ అంటాడు’ నవ్వుతూ చెప్పాడు మనవడు. ‘అవును. ఆ రోజుల్లో ఇలాంటివి ఎక్కువగా జరిగేవి’ అంది బామ్మ. అంతలో ‘ముందు కాఫీ తాగండి’ అంటూ రమ కాఫీ అందించింది. బామ్మ కాఫీ కప్పు తాగి, ఆ తర్వాత నా దగ్గరకు వస్తుంటే నాలో సంతోషమే సంతోషం. వెట్ గ్రైండర్ వైపు చూశా. నా వైపు కోపంగా, అసూయగా చూస్తోంది. ‘రోజూ నిన్నేగా వాడతారు. జన్మానికో శివరాత్రి అన్నట్లు ఇవాళ ఒక్కరోజు నన్ను వాడుతుంటే నీకెందుకో అంత బాధ’ అన్నాను నేను. అది విని వెట్ గ్రైండర్ ముఖం అటు తిప్పుకుంది. బామ్మ వచ్చి నాకు స్నానం చేయించింది.. అదే నన్ను శుభ్రం చేసింది.

‘ఎన్నాళ్లకెన్నాళ్లకు’ అనుకున్నాను నేను. పొత్రాన్ని కూడా చక్కగా కడిగి ఇక రుబ్బడం మొదలు పెట్టింది. నాకు, పొత్రానికి హుషారే హుషారు. కొద్ది సేపటికి పిండి రుబ్బడం పూర్తయింది. మళ్లీ మమ్మల్ని కడిగి, శుభ్రం చేసి పిండి తీసుకుని వంటింటి వైపు నడిచింది బామ్మ. పిండి కోడలికి అందించి, హాల్లోకి వచ్చింది.

అంతలో రమకు ఫోన్ వచ్చింది. ‘ఆఁ ఆఁ కులాసానే. రేపే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారా, వస్తాంలే. పదింటికల్లా వచ్చేస్తాం లే.. ఊర్నుంచి అత్తయ్య కూడా వచ్చింది. ఆఁ తప్పక తీసుకు వస్తాను. ఏమిటీ.. రోలు, రోకలి తేవాలా.. సరే.. సరే. మా అత్తయ్య ఇందాకే దాన్ని కడిగి, శుభ్రం కూడా చేశారు. రేపు కలుసుకుందాం’ అంటూ ఫోన్ పెట్టేసింది. ‘అత్తయ్యా! మా అరుంధతి పిన్ని కూతురు పెళ్లి కుదిరింది. పెళ్లి పనులు పసుపు కొట్టి మొదలు పెడతారుగా. వాళ్లింట్లో రోలు, రోకలి లేవుట. నన్ను తెమ్మంది. మన రోలుకు సడెన్‌గా డిమాండ్ పెరిగింది. రేపు మనం వెళ్లాలి, పదింటికల్లా అక్కడుండాలి’ చెప్పింది రమ. ‘అవును. పెళ్లి పనులు పసుపు దంచే మొదలు పెడతారు. మనవాళ్లు రోలును లక్ష్మీదేవిగా, రోకలిని నారాయణుడిగా భావిస్తారు. అలాగే తిరగలి శివుడు, దాని పిడి పార్వతి అంటారు. అయితే రేపు మనకు సరదాయే సరదా అన్నమాట. మీ మామగారు పట్నంలో పేరంటాలేం ఉండవు అన్నారు. అదేం కాదు, సంప్రదాయాలు ఇంకా ఉన్నాయని నేను వాదించాను. ఇంటికెళ్లగానే ఈ సంగతి చెప్పాలి’ ఉత్సాహంగా అంది బామ్మ. అంతా నవ్వారు.

‘అయితే రేపు కార్లో, రోలు, రోకలిని కూడా ఎక్కించాలన్న మాట..’ నవ్వుతూ అన్నాడు శ్రీధర్. ‘తెస్తానని మాటిచ్చాను కదా, రోట్లో తల దూర్చాక రోకటి దెబ్బలకు భయపడితే ఎలా?’ అంది రమ. ‘ఏదో సామెత వాడేశావు కానీ నిజానికి నీకేం బాధోయ్. నేనే కదా వాటిని ఎత్తి పెట్టేది, అక్కడ దించేది’ అన్నాడు శ్రీధర్. ఏమైనా నేనూ రేపు బయటకు వెళ్తున్నానని, నాకు సింగారం చేసి, నన్ను వాడతారని తెలిశాక నా ఆనందానికి హద్దులే లేవు.

‘అన్నా, అన్నా! ఈ డ్రాయింగ్ కొంచెం వేసి పెట్టరా, నువ్వయితే బాగా వేస్తావు.. నాకింకా చాలా హోం వర్క్ ఉంది’ అంది పాప. ‘రోలు పోయి మద్దెలతో మొర పెట్టుకుందిట. నా ప్రాజెక్టు వర్క్ ఎలా పూర్తి చేయాలా అని నేను ఆలోచిస్తుంటే’ అన్నాడు బాబు. ‘వీళ్లకు సామెతలు బాగానే వంటబట్టినట్టున్నాయే’ నవ్వుతూ అంది బామ్మ మనవల వైపు చూస్తూ. అవి వింటుంటే నాకూ తమాషాగా అనిపించింది.

చూస్తుండగానే రాత్రయింది. కరెంటు రానే వచ్చింది. రమ గారెలు చేసి అందరికీ పెట్టింది. అంతా బ్రహ్మాండంగా ఉన్నాయంటూ తిన్నారు. దానికి నేనే కారణమని కాస్తంత గర్వంగా ఫీలయ్యాను. ‘మీకు ఈ రోలు ఇచ్చేశాక కొత్త రోలు కొనుక్కున్నాను. అన్నట్లు కొత్త రోలు కొన్నప్పుడు వెంటనే వాడేయడం కాదు. దానికి కొన్ని పద్ధతులున్నాయి. తెలుసా రమా?’ అడిగింది బామ్మ. ‘అలాగా. చెప్పండి అత్తయ్యా’ అంది రమ. ‘కొత్త రోలుకు పసుపు రాసి, కుంకుమబొట్లు పెట్టాలి. ఐదు పోగులతో దారం తీసుకుని, పసుపు కొమ్ముకట్టి, ఆ దారాన్ని రోలుకి కట్టాలి. అప్పుడు వాడుకోవాలి. మొదటగా నానబెట్టిన బియ్యం లేదా, ఉలవలు దంచడమో, రుబ్బడమో చేసి, పశుపక్ష్యాదులకు పెట్టాలి. అన్నట్లు రోలు కొండరాయితో చేసినదయితేనే మంచిది. నాపరాయితో చేసిన రోలు ఎన్నాళ్లయినా రుబ్బుతుంటే కొంచెం ఇసుక వస్తూనే ఉంటుంది. అలాగే రోకలి పనస కర్రతో చేసింది చాలా మంచిదంటారు’ చెప్పింది బామ్మ.

‘అమ్మా! బలరాముడి ఆయుధాలు నాగలి, రోకలి అని, ఆయన అన్నదాతలకు నిజమైన ప్రతినిధి అని, నాగలితో భూమిని దున్ని, పంటలు పండించి, పంటను రోకలితో దంచి భుజించమని సందేశమిచ్చాడని మొన్న టీవీలో ఓ పండితుడు చెప్పాడు’ అన్నాడు శ్రీధర్. ‘అదీ నిజమే’ అంది బామ్మ.

ఆ తర్వాత రమ వంటిల్లు సర్దుకుంటుంటే, పిల్లలు చదువుకుంటున్నారు. శ్రీధర్ మొబైల్లో తలదూర్చాడు. బామ్మ దివాన్ మీద నడుం వాల్చింది. నా గురించి వాళ్ల మాటలు అయిపోయినా, నేనింకా నా గురించిన ఆలోచన నుంచి బయటపడలేదు. నేను, పొత్రం, రోకలి, తిరగలి కూడా ఎంత బాధకయినా ఓర్చుకుని పనిచేసి సాయపడతాం. మొన్నమొన్నటి వరకూ మేం నిరంతరం పనిచేశాం. కాలానుగుణంగా ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు వచ్చినా కరెంటు లేని సందర్భాల్లో, అవి చెడిపోయిన సందర్భాల్లో మేం సాయానికి సర్వదా సిద్ధంగా ఉంటాం. వినే మనసుంటే మనుషులకు ఓ మాట చెప్పాలనుంది. అది.. పాతతరం వాళ్ల మని దయచేసి మమ్మల్ని పారేయవద్దు, రుబ్బు రోలులా ఉన్నదంటూ లావుగా ఉన్నవారిని హేళన చేస్తూ మమ్మల్ని కించపరచవద్దు, మా దగ్గరనుంచి దృఢంగా, సహనంగా ఉండటం అలవరచుకొని విజయాలను సాధించండి.. అనుకుంటుండగా.. టీవీలో పాట.. ఎన్టీఆర్ గారు హుషారుగా రోట్లో పిండి రుబ్బుతూ

‘లేచింది.. నిద్రలేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం..’

దాంతో నా కళ్లు, చెవులు అటే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here