Site icon Sanchika

అన్నింట అంతరాత్మ-38: సమయపాలనకు సహకరిస్తా.. ‘గడియారాన్ని’ నేను!

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం గడియారం అంతరంగం తెలుసుకుందాం.

***

‘ఏరా రామం.. గోడ గడియారాన్ని ఈ రోజైనా బాగు చేయిస్తావా? అది పనిచేయకపోతే నాకు తోచదురా. మనసంతా దిగులుగా ఉంటుంది’ రంగబాబు కొడుకును అడిగారు. రంగనాథాన్ని నేను ‘రంగబాబు’ అనే అంటాను. ఎందుకంటే నేను ఈ ఇంటికొచ్చినప్పుడు రంగనాథం వయసు ఐదేళ్లు. వాళ్ల అమ్మా నాన్న ‘రంగబాబు’ అనే పిలిచేవాళ్లు.

కొడుకు బదులిచ్చేలోగానే కోడలు దూసుకొచ్చింది.. ‘తాతలనాటి గడియారమది.. ఎన్నిసార్లని బాగు చేయిస్తాం. ఇప్పటి వరకు దాని రిపేరుకు పెట్టిన డబ్బుకు కొత్త గడియారాలే ఓ నాలుగు వచ్చేవి. గోడకు దిష్టిబొమ్మలాగా ఇదొకటి’ విరుచుకుపడింది.

రామం ‘సుజా! నువ్వూరుకో. నీకెందుకు?’ అన్నాడు వారిస్తూ. ‘అవును.. నాకెందుకు, మీకు దాన్ని రిపేరు చేయించడానికి డబ్బులు, తీరిక ఉంటాయి కానీ మన పింకీ స్మార్ట్ వాచ్ కొనివ్వమని ఎప్పటినుంచో అడుగుతోంది. అదుగో, ఇదుగో అంటారు. కానీ కొన్నదే లేదు’ విసుక్కుంటూ లోపలికెళ్లింది. రంగనాథం గారు చిన్నబుచ్చుకున్నట్లు ఆయన ముఖమే చెపుతోంది. ఇక నా సంగతి సరేసరి. ‘దిష్టిబొమ్మ’ అన్న మాటతో నా గుండెకు తూట్లు పడ్డట్లయింది.

నా గత వైభవమంతా గుర్తొచ్చింది. రంగనాథంగారి చిన్నతనంలో ఈ ఇంటికొచ్చాను. హాల్లో గోడకు దర్జాగా ఉండేదాన్ని. రాగానే అందరి కళ్లూ నా పైనే ఉండేవి. నేను ఠంగ్ ఠంగ్ మని మోగుతూంటే ఇంట్లో వాళ్లు ‘అబ్బో! అప్పుడే ఇంత టైమయిందా’ అనుకుంటూ పనులు వేగంగా చేసుకునేవారు. రంగబాబు అదే రంగనాథం నన్ను చూసే గంటలు, నిమిషాలు, సెకన్లు, వగైరా సమయ వివరాలన్నీ నేర్చుకున్నాడు. ఆ చిన్న కుర్రాడు పెరిగి పెద్దవడం, రామం పేరుతో మరో తరం రావడంగాక, విక్కీ అనే ఇంకో తరం కూడా వచ్చేసింది. ఇన్ని తరాలు పనిచేసిన నేను అలసి, సొలసి ఇటీవల తిరగలేక ఆగుతున్నాను. నా మీద రంగబాబుకు ఉన్నంత ప్రేమ మిగతా వాళ్లకు ఎందుకుంటుంది? రామానికి తండ్రి అంటే కాసింత ప్రేమ, గౌరవం. ఆ కారణంగానే నన్ను ఇప్పటికి మూడుసార్లు రిపేరు చేయించాడు. పాత ఇల్లు పడగొట్టి, కొత్త ఇల్లు కట్టాక నా స్థానం హాలు నుంచి రంగబాబు గదికి మారింది.

‘ఇంతకూ స్మార్ట్ వాచ్ అంటే ఏమిట్రా?’ కొడుకుని అడిగాడు రంగనాథం. ‘నాన్నా! దాన్ని చేతికి పెట్టుకునే స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. వీటిని, స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేయడం వల్ల ఫోన్ తీయకుండానే వాచ్ ద్వారానే ఇన్‌కమింగ్ కాల్స్, ఇ-మెయిల్ సందేశాలు తెలుసుకోవచ్చు. ఫోన్ కాల్స్‌కు దీని ద్వారా బదులు ఇవ్వవచ్చు. రిజెక్ట్ చేయవచ్చు. మ్యూట్‌లో ఉంచుకోవచ్చు. వీటిలో ఆరోగ్యానికి ఉపయోగపడేవి కూడా ఉన్నాయి. హృదయ స్పందన రేటు, రక్తపోటు, పల్స్ వివరాలు తెలుసుకోవచ్చు. ఫిట్‌నెస్ ట్రాకింగ్ టెక్నాలజీ కూడా వీటిలో చేరుస్తున్నారు. వీటి ద్వారా ఎంత దూరం నడుస్తోంది తెలుసుకోవచ్చు. అలాగే వాచ్ లోని కెమెరాతో ఫొటోలు తీసుకోవచ్చు. అలారం రిమైండర్ కూడా ఉంటుంది. అంధులకు, చెవిటివారికి ఉపయోగించే స్మార్ట్ వాచ్‌లు కూడా ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్పాను కానీ మరెన్నో ఉపయోగాలున్నాయి’ చెప్పాడు రామం.

 ‘అబ్బో! టెక్నాలజీ ఎంత పెరిగి పోయిందో’ ఆశ్చర్యపోయాడు రంగబాబు. అతణ్ణి మించి నేను విస్తుపోయాను. నేనేదో ఇంత పెద్దగా, రాజసంగా ఉన్నానని నిన్నమొన్నటివరకు గర్వించాను కానీ ‘అంత చిన్న వాచీ ఎన్నో ఘనకార్యాలు చేస్తుంటే దాని ముందు నేనేపాటి?’ ఆత్మవిమర్శ చేసుకున్నా. ఆ పక్కనే కప్ బోర్డ్‌లో ఉన్న అలారం టైమ్ పీస్ కూడా నావంక సాభిప్రాయంగా చూసింది. ఆ పక్కనే టేబుల్ మీద పడి ఉన్న రిస్ట్ వాచ్‌లు కూడా అలాగే చూశాయి. మొబైల్స్ వచ్చాక వాటినెవరూ పట్టించుకోవట్లేదు. మొబైల్‌లో ఎట్లాగూ టైమ్ కనిపిస్తూనే ఉంటుందికదా.

ఆ పక్కనే ఓ బాక్స్‌లో ఉన్న మరో వాచీ కూడా తొంగిచూసింది. అది గతంలో రామం, సుజాకు ఓ పెళ్లి రోజున బహుకరించిన వాచీ. కట్టుకున్న చీరెకు మ్యాచ్ అయ్యేలా వేర్వేరు రంగుల డయల్స్ కూడా అదనంగా ఉన్నాయి. ఒకప్పుడు ఆ వాచీ ఎంత టెక్కుగా ఉండేదో.. ఓసారి అది నాతో ‘నువ్వు ఆ గోడకు అతుక్కునే ఉంటావు. మమ్మల్ని చేతికి పెట్టుకుంటారు కాబట్టి మనిషితో పాటే ఉంటాం ఇంకా చెప్పాలంటే మనిషిలో ఓ భాగంగా ఉంటాం’ గొప్పలు పోయింది.

నేనూ ఊరుకోలేదు.. ‘నువ్వు ఆ ఒక్క మనిషికే సమయం తెలుపుతావు. నేను ఇంట్లో అందరికీ, ఇంటికొచ్చిన వారికి కూడా సమయం తెలుపుతాను’ అన్నాను. అయినా అది ఓ తిరస్కారపు చూపు చూసింది. నేను ఆ జ్ఞాపకంలో ఉండగానే విక్కీ తాతయ్య దగ్గర సోఫాలో చేరాడు.

‘తాతయ్యా! తాతయ్యా!’ అన్నాడు. ‘ఏంట్రా విక్కీ’ అన్నాడు రంగబాబు, వాడి తల నిమురుతూ. ‘మరి ఈ గడియారాలు రాక ముందు టైమ్ ఎలా తెలుసుకునేవారు?’ అడిగాడు. ఆ ప్రశ్నకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. నా చరిత్రా! తప్పక తెలుసుకోవాలి.. నాలో ఆసక్తి తలెత్తింది. చూస్తే మా జాతివాళ్లయిన అలారం గడియారం, చేతి గడియారాల పరిస్థితీ అదే!

అంతలో తాత మొదలెట్టాడు ‘గడియారాలు రాకముందు చాలా కథే నడిచింది. అసలు మనిషి కనుగొన్న అతి ప్రాచీన వస్తువులలో గడియారం ఒకటి. తొలి రోజుల్లో పగటి కాలాన్ని లెక్కించడానికి సూర్య గడియారాన్ని వాడేవారు. గోళాకార రాతిని ఏర్పాటు చేసి, దానిపై సూర్యుని నీడను బట్టి కాలాన్ని లెక్కించేవారు. జైపూర్‌లో రాజా జైసింగ్-2 పద్దెనిమిదో శతాబ్దిలో ఏర్పాటు చేసిన జంతర్ మంతర్ లోని సూర్య గడియారం చాలా ప్రసిద్ధికెక్కింది..’

బామ్మ ఎప్పుడు వచ్చిందో, తాత మాటల్ని అడ్డుకుంటూ ‘అంతదాకా ఎందుకు, అన్నవరంలో కూడా సూర్య గడియారం ఉంది’ అంది.

‘అవును. బాగా గుర్తు చేశావు. ప్రాచీనకాలంలో ఇసుక గడియారాలు కూడా వాడుకలో ఉండేవి. ఇసుక గడియారంలో రెండు భాగాలుంటాయి. ఒక భాగం నిండా ఇసుక ఉంటుంది. ఆ మొత్తం ఇసుక కింది భాగానికి రాలడానికి నిర్దిష్ట సమయం పడుతుంది కదా. దాన్ని బట్టి సమయం లెక్కించుకునేవారు. అలాగే పూర్వకాలంలో ఈజిప్టు, చైనాలలో కొంతకాలం నీటి గడియారాలు వాడుకలో ఉండేవి. నీటి గడియారం అంటే ఎత్తుగా ఒక నీటి పాత్రను ఉంచి, దిగువన మరొక పాత్రకు ఆ నీటి ప్రవాహాన్ని క్రమంగా దిగువ పాత్రలో పడేట్లు ఏర్పాటు చేసేవారు. పాత్రలలో నీటి హెచ్చుతగ్గుల కొలతలను బట్టి సమయాన్ని లెక్కించుకునేవారు. ఆ తర్వాత కాలంలో సాంకేతిక జ్ఞానం పెరిగి ముల్లు, అంకెల గడియారాల ఆవిష్కరణ జరిగింది. వాటిలో భాగమే గోడ గడియారాలు. అలారం గడియారాలు మొదలైనవి. వీటిలో అంకెలను డిస్‌ప్లే చేయడానికి ఎలక్ట్రానిక్, లెడ్‌లను ఉపయోగిస్తారు. ఇక జేబు గడియారాల గురించి ప్రస్తావించుకుంటే పదిహేను వందల సంవత్సరంలోనే జర్మనీకి చెందిన పీటర్ హెన్లీన్ తొలిసారిగా జేబుగడియారం తయారు చేశాడు. ఆ తర్వాత దీన్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సమయంతో పాటు రోజు, తేదీ, నెల, సంవత్సరం చూపించే గడియారాలు వచ్చాయి. ఎక్కువ మంది వీటిని చేతికి పెట్టుకోవటం వల్ల వీటికి చేతి గడియారాలు అని పేరొచ్చింది. గతంలో యాంత్రిక గడియారాలు స్ప్రింగ్‌తో తిరిగేవి. వీటికి నిత్యం లేదా రెండు రోజులకొకసారి ‘కీ’ ఇవ్వవలసి వచ్చేది. ప్రస్తుత కాలంలో అయితే చేతి గడియారాలు బ్యాటరీతో నడుస్తున్నాయి. కొన్నింటిలో కావలసిన సమయానికి అలారం పెట్టుకునే సదుపాయం కూడా ఉంది’ చెప్పటం ఆపాడు.

‘అబ్బో! మాకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మా పెద్దలు ఎంత విభిన్నంగా ఉన్నారో’ అని గర్విస్తుండగా ‘తాతయ్యా! సూర్య గడియారాలు పగటివేళ మాత్రమేకదా సమయం చూపేది, మరి రాత్రి పూట సమయం ఎలా తెలుసుకునేవారు?’ విక్కీ తన సందేహాన్ని వెల్లడించాడు. ‘మంచి ప్రశ్న వేశావురా మనవడా. రాత్రిపూట కాల గణనకు సమాన కాల వ్యవధులలో కాలే కొవ్వొత్తులను వెలిగించేవారు. వీటిని కొవ్వొత్తి గడియారాలు అనేవారు. అలాగే అగరుబత్తి గడియారాలు’ వివరించారు తాతయ్య. ‘భలే ఉందే’ అన్నాడు విక్కీ.

‘ఇంతకూ మన పెళ్లికి మానాన్న మీకు రిస్టువాచీ ఇచ్చిన సంగతి చెప్పరేం?’ అంది బామ్మ. ‘మహ ఇచ్చాడు లేవోయ్, ఆ రోజుల్లో అల్లుళ్లకు ఇచ్చే కనీస కానుక అది’ అన్నాడు తాతయ్య. అంతలో రామం ‘అబ్బా! మీరు ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్లొద్దు. నేను చెప్పేది వినండి’ అన్నాడు. దాంతో బామ్మగారు తగ్గి ‘సరే, కానీ’ అంది.

‘సాలార్‌జంగ్ మ్యూజియంలో ‘క్లాక్ రూమ్’ అని ప్రత్యేక విభాగం ఉంది. విక్కీ నీ చిన్నప్పుడు వెళ్లాం. ఏమైనా గుర్తుందా?’ అడిగాడు. ‘నాకు కొంచెం కూడా గుర్తులేదు’ అన్నాడు విక్కీ. ‘సరే లే. ఈసారి సెలవుల్లో మళ్లీ తీసుకెళతాగానీ ముందు దాని గురించి చెపుతా విను. క్లాక్ రూమ్ విభాగంలో ప్రాచీన సూర్య గడియారాల నుంచి పెద్ద గడియారాల వరకు, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, హాలెండ్ వగైరా దేశాల నుంచి సేకరించిన ఆధునిక గడియారాల వరకు ఉన్నాయి. వీటిలో పంజరపు గడియారం, బ్రాకెట్ గడియారం, గ్రాండ్ ఫాదర్ గడియారాలు, స్కెలిటన్ గడియారాలు మొదలైన ఎన్నో రకాలున్నాయి. అన్నిటికంటే అద్భుతమైంది ఇంగ్లాండ్ లోని కుక్ అండ్ కెల్వే కంపెనీవారు రూపొందించిన మ్యూజికల్ గడియారం. దీన్ని మూడవ సాలార్‌జంగ్ కొన్నాడు. ప్రతి గంటకు ఒక టైమ్ కీపర్ గడియారం పై భాగం గది నుండి బయటికి వచ్చి సమయం ఎన్ని గంటలయితే అన్ని గంటలు కొట్టడం దీని ప్రత్యేకత. చాలామంది సందర్శకులు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఈ గడియారాన్ని చూడాలని కుతూహలపడతారు. ఎందుకంటే గంటలు కొట్టే మనిషి బొమ్మను ఎక్కువ సేపు చూడవచ్చని. ఈ బొమ్మ కాకుండా, అలాగే ఉండే మరొక బొమ్మ సెకండ్ల ముల్లుని కొడుతూ కనిపిస్తుంది. ఈ గడియారంలో రోజు, తేదీ, నెల తెలిపేందుకు మూడు ప్రత్యేకమైన చిన్న గడియారాలను కూడా ఇందులో ఇమిడ్చారు. ఈ మ్యూజికల్ గడియారం పూర్తిగా యాంత్రికమైంది. ఇందులో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లేవు’ వివరించాడు. నాకయితే మా జాతిలో ఉన్న గొప్పవాళ్లను కలుసుకోవాలనే కోరిక కలిగింది. అది అసాధ్యమని తెలుసు. కానీ ఊహలకేముంది..

నేనిలా అనుకుంటుంటే విక్కీ, ‘నాకు ఆ గంటలు కొట్టే గడియారాన్ని ఎంత తొందరగా చూద్దామా అనిపిస్తోంది. ఈసారి సెలవుల్లో తప్పనిసరిగా తీసుకెళ్లాలి’ అన్నాడు. ‘ఓ.. అలాగే’ అన్నాడు రామం.

‘నేనో చిత్రమైన గడియారం గురించి చెపుతా’ అంటూ వచ్చి కూర్చుంది సుజాత. ‘చిత్రమైన గడియారమా?’ అంతా ఒకేసారి అన్నారు. నాకూ ఆసక్తి పెరిగిపోయింది. వెంటనే సుజాత ‘అవును. మామూలుగా ప్రపంచంలో మనం చూసే గడియారాలన్నింటిలో పన్నెండు అంకెలు ఉండటం తెలిసిందే. కానీ స్విట్జర్లాండ్ లోని సోలోథర్న్ నగర కూడలి వద్ద ఉన్న గడియారంలో కేవలం పదకొండు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. పన్నెండు అంకె లేదు. అంటే పన్నెండు ఎప్పుడూ మోగదు. ఎందుకంటే ఈ నగర ప్రజలు పదకొండు సంఖ్యను ఇష్టపడతారు. ఇక్కడ చాలా విషయాలు పదకొండు చుట్టూనే తిరుగుతాయి. అందుకే ఆ గడియారంలో కూడా వారు పదకొండు అంకె వరకే ఏర్పాటు చేసుకున్నారు’ చెప్పింది.

‘ఎవరి పిచ్చి వారి కానందం. కాలాన్ని తెలిపే గడియారాన్ని ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవడమేమిటి?’ బామ్మ అంది. ‘చిత్రంగానే ఉంది’ తాతయ్య అన్నాడు.

‘సరేలే. నేనామధ్య కాలాన్ని వెనక్కి నడుపుతున్న గిరిజనుల గురించి చదివా. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ కమ్యూనిటీవారు తమ గ్రామాల్లోని అన్ని గడియారాలు యాంటీ క్లాక్ వైజ్‌గా అంటే అపసవ్యదిశలో నడిచేట్టు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా ఏ గడియారమైనా పన్నెండు నూన్ తర్వాత ఒకటి పి.ఎమ్. చూపిస్తుంది. కానీ ఇక్కడి గడియారాలు మాత్రం పదకొండు ఎ.ఎమ్.ను చూపిస్తాయి. భూమి కుడి నుండి ఎడమకు అంటే అపసవ్య దిశలో కదులుతుందని, చంద్రుడు, భూగ్రహం చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతున్నాడని వారు విశ్వసిస్తారు. అందుకే ఈ గిరిజన తెగవారి పెళ్లి వేడుకల్లో నూతన వధూవరులు కూడా అపసవ్య దిశలో ఏడడుగులు వేస్తారు’ వివరించాడు రామం. ‘తమాషాగా ఉంది’ అన్నారంతా.

‘నాన్నా, నాన్నా! మా స్నేహితుడు రాజీవ్ వాళ్ల కారు ‘రిమోట్’, గడియారంగా ఉంది. అందులో ఎనిమిది నుంచి తొమ్మిది అంకెల మధ్య తాకితే కారు తలుపులు తెరుచుకుంటాయి. మూడు నుంచి నాలుగు అంకెల మధ్య తాకితే కారు తలుపులు మూసుకుంటాయి. రెండింటినీ ఒకేసారి తాకితే కారు ఫ్లాష్ లైట్లు వెలుగుతాయి’ చెప్పాడు. ‘అవును ఇలాంటి రకరకాలు ఎన్నో వస్తున్నాయి’ అన్నాడు రామం. నాకయితే గమ్మత్తుగా అనిపించింది.

‘నీకు భారత ప్రామాణిక కాలం అంటే తెలుసా? దీన్నే ఇంగ్లీషులో ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అంటారు’ అడిగాడు రామం, విక్కీని. ‘తెలియదు’ అన్నాడు విక్కీ. ‘అయితే చెపుతా విను.. భారతదేశమంతటా పాటించే సమయం భారత ప్రామాణిక కాలమానం. ఇది గ్రీన్‌విచ్ సమయానికి ఐదున్నర గంటలు ముందు ఉంటుంది. భారత ప్రామాణిక కాలమానాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్క కడతారు. ఈ రేఖాంశం అలహాబాదు సమీపంలోని మీర్జాపూర్ పట్టణానికి కొంచెం పశ్చిమంగా, ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నగరం మీదుగా వెళుతుంది. ఢిల్లీలోని భారత జాతీయ భౌతిక ప్రయోగశాలకు ఈ సమయ పాలన బాధ్యతను అప్పగించినా, స్థానిక సమయాన్ని అలహాబాద్ అబ్జర్వేటరీ వద్ద ఉన్న ఉన్న గడియారస్తంభం నుండి లెక్కకడతారు’ వివరించాడు.

‘మరి గ్రీన్‌విచ్ సమయమన్నావు. అదేమిటి?’ అడిగాడు విక్కీ. ‘విను. యునైటెడ్ కింగ్‌డం లోని గ్రీన్‌విచ్‌లో రాయల్ అబ్జర్వేటరీ ఉంది. అక్కడి మీన్ సోలార్ టైమును గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జి.ఎమ్.టి.) అంటారు. ప్రపంచం లోని ఇతర ప్రాంతాల్లో వాటి రేఖాంశాలను బట్టి జి.ఎమ్.టి కంటే ముందు, జి.ఎమ్.టి కి వెనుక అని వ్యవహరిస్తుంటారు’ వివరించాడు రామం. ‘అలాగా’ అన్నాడు విక్కీ. మా జాతి పని తీరు వివరం విని ఆశ్చర్యపోయాను.

‘అన్నట్లు మనిషి శరీరంలో కూడా ఓ గడియారం ఉంది. దీన్ని ‘జీవ గడియారం’, శరీర ధర్మ గడియారం అని కూడా అంటారు’ అన్నాడు తాతయ్య. ‘మన శరీరంలో గడియారమా?’ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు విక్కీ. ‘అవును. భూమిపై నివసించే జీవులన్నింటిలో జరిగే కార్యకలాపాలు నిర్ణీత సమయాలను అనుసరించి ఆవృతి అవుతుంటాయి. మనిషిలో ఎన్ని గంటలకు నిద్ర పోవాలి? ఎన్ని గంటలకు నిద్ర లేవాలి? ఎప్పుడు భోజనం చేయాలి? అనే విషయాలు ఆరేడు నెలల వయసులో ఉన్నప్పుడే స్థిరపడిపోతాయి. ఈ గడియారాలు మనకు కనిపించక పోయినా వాటి ప్రభావం తెలుస్తూనే ఉంటుంది. అలాగే కోడిపుంజును గమనించు. ఇది రోజులో నిర్ణీత సమయాలలో చాలాసార్లు కూస్తుంది. ఇలా కూయడానికి కారణం దాని శరీరంలోని ఎవరికీ కనిపించని జీవ గడియారమే. ప్రాచీనకాలంలో కోడికూతను బట్టే సమయాన్ని లెక్కించుకునేవారు. కోడికూత తోనే తెల్లవారినట్లు గుర్తించి, పల్లెజనం లేచి పని పాటలకు సిద్ధమయ్యేవారు’ తాతయ్య చెపుతుండగానే ‘తెల్లారింది లెగండో కొక్కొరోక్కో.. మంచాలింక దిగండో కొక్కొరొక్కో’ పాట విన్నాలే’ అన్నాడు విక్కీ. ‘అవున్లే పాటల ద్వారా తెలుసుకోవాల్సిందే, ఈ నగరాల్లో కోడికూత లెక్కడ వినిపిస్తాయి?’ అన్నాడు తాతయ్య. నాకేమో టీవీలో.. ఏదో సినిమాలో కోడిని చూడటం గుర్తొచ్చింది.

‘ఇంకో విషయం చెపుతా, వినండి.. రకరకాల వస్తువులను సేకరించడం ఎందరికో హాబీగా ఉంటుంది. ఆ మధ్య గడియారాలు సేకరించే ఓ వ్యక్తిని గూర్చిన పరిచయం చదివా. చెన్నైకు చెందిన ఆ మనిషి పేరు రాబర్ట్ కెనడీ. ఆయనను అంతా ‘గడియారాల మనిషి’ అని పిలుస్తారట. పదహారో ఏటనుంచి గడియారాల సేకరణ మొదలు పెట్టిన కెనడీ అందుకు ఎంత డబ్బు ఖర్చుకైనా వెనుకాడడు. ముప్ఫయ్ ఏళ్లలో ఇందుకోసం యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. చెత్త సేకరించే షాపులకు వెళ్లి, పాత గోడ గడియారాలు, చేతి వాచీలు కొనుగోలు చేసి, తన వద్ద ఉన్న సహాయకులతో వాటిని మరమ్మతు చేసి ప్రదర్శనకు ఉంచుతాడు. ఇప్పటికి ఈయన వద్ద దాదాపు రెండున్నర వేల గోడ గడియారాలు, వాచీలు, అలారం గడియారాలు ఉన్నాయట. వాటిలో కొన్ని విదేశాలకు చెందినవి. ప్రతి గడియారం వెనుక ఓ కథ ఉంది. ఆయన సేకరించిన గడియారాలలో అత్యంత పురాతనమైంది రెండు వందల ఎనభై ఆరేళ్ల కిందటి గడియారం. ఇది ఓ ఆంగ్లేయుడు చేత్తో తయారు చేసింది. మరో గడియారం జర్మనీలో తయారైంది. దానికి ఏడాదిలో ఒకసారి టైమ్ సెట్ చేసి, కీ ఇస్తే చాలు ఏ రిపేరు లేకుండా ఏడాదంతా పనిచేస్తుందట. గడియారాల ప్రదర్శనకు ఇంట్లోనే స్థలం కేటాయించాడు. ఆ గడియారాలకు ‘కీ’ ఇవ్వడానికి ఆయనకు రోజు నాలుగ్గంటల సమయం పడుతుంది. ఎప్పటికైనా నగరంలో విడిగా తన గడియారాల మ్యూజియం ఏర్పాటు చేయాలని, గిన్నిస్ రికార్డులకెక్కాలని ఆశ పడుతున్నాడని చదివాను’ చెప్పాడు. ‘హాబీ కోసం డబ్బు, సమయం వెచ్చిస్తున్న ఆయనకు జేజేలు చెప్పాల్సిందే’ తాతయ్య మనస్ఫూర్తిగా అన్నాడు. అందరూ కూడా ‘చాలా గొప్ప’ అన్నారు. మా జాతి మీద విశేష మక్కువ చూపుతున్న కెనడీకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అనిపించింది నాకు.

అంతలో సుజా ‘ప్రముఖులు ధరించిన గడియారాల విలువ వెలలేనిది. మన జాతిపిత ధరించిన జేబు గడియారం ఎంతో ప్రసిద్ధమైనది. గాంధీగారు పందొమ్మిది వందల నలభైనాలుగులో, తనకు ఓ వ్యక్తి చేసిన సేవలకు కృతజ్ఞతాపూర్వకంగా తన జేబు గడియారాన్ని ఇచ్చారు. ఆ గడియారాన్ని రెండేళ్ల కిందట సదరు కుటుంబీకులు వేలం వేయగా పన్నెండు వేల పౌండ్లు.. రూపాయలలో లెక్కిస్తే, పదకొండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు పలికింది’ చెప్పింది. అంతా ఆశ్చర్యంగా ‘బాప్ రే!’ అని ఆశ్చర్యపోయారు. ‘గాంధీ ధరించారంటే ఆ జేబు గడియారం అదృష్టం ఎంతటిదో’ అనుకున్నాను నేను.

‘తాతయ్యా!’ అన్నాడు విక్కీ ‘ఏంటో అడుగు’ అన్నాడు తాతయ్య.

‘మరి ఏ గడియారాల షాపులో చూసినా, గూగుల్‌లో గడియారం చిత్రాలను చూసినా, అన్నీ పది గంటల పది నిమిషాల సమయాన్నే చూపిస్తాయెందుకు?’ తన సందేహాన్ని వెల్లడించాడు విక్కీ. ‘అదా.. పది గంటల పదినిమిషాలు చూపించేటప్పుడు మధ్యలో ఇంగ్లీషు అక్షరం ‘V’ ఆకారం ఏర్పడుతుంది. అది విక్టరీ అంటే విజయానికి సంకేతం. అందుకే ఆ సమయాన్నే సూచిస్తుంటారు. మరో కోణంలో ఆలోచిస్తే సమయం పది గంటల పది నిమిషాలుగా ఉన్నప్పుడు ఆ మధ్యలో ఉండే గడియారం బ్రాండ్ పేరు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసం కూడా అలా ఉంచుతారనుకోవచ్చు’ చెప్పాడు తాతయ్య. ‘అలాగా’ నేను మనసులో అనుకుంటే, విక్కీ పైకి అన్నాడు.

‘విక్కీ!’ స్నేహితుడి పిలుపు వినిపించి అక్కడి నుంచి పరుగుదీశాడు విక్కీ. మిగతావారు కూడా ‘అబ్బో! అప్పుడే నాలుగున్నర అయింది. గడియారం కబుర్లలో పడిపోయి పట్టించుకోలేదు. అర్జెంటుగా ఒక కాఫీ పడాలి’ అన్నాడు రామం. సుజా వంటింట్లోకి నడిచింది. ‘కాలం మనకోసం ఆగుతుందా’ అంటూ బామ్మ లేచింది. తాతయ్య అలసటగా కళ్లు మూసుకున్నాడు.

నాలో మాత్రం మా జాతి గురించిన ఆలోచనలు ఆగటం లేదు. మా జాతివారు అన్నిచోట్ల.. ఆఫీసుల్లో, రైల్వే స్టేషన్లలో, విద్యాలయాలలో, హోటళ్లలో ఒకచోట అనేమిటి సర్వత్రా ఉన్నారు. పైగా చాలా ఊళ్లలో ఏనాడో ఏర్పాటు చేసిన గడియారం స్తంభాలు ఉండనే ఉన్నాయి. పైగా నిరంతరం ఎక్కడో ఓ చోట టైమ్ ఎంతయిందీ? అనే మాట వినపడుతూనే ఉంటుంది. ఇంత ప్రాముఖ్యత ఉండటం నాకు ఎంతైనా గర్వకారణం. కానీ ఈ మనుషులు మమ్మల్ని సరిగా ఉపయోగించుకోక పోవటం నాకు ఎంతో విచారం కలిగిస్తుంది. గతంలో పిల్లలకు గడియారంలో సమయం అర్థం చేసుకోవటం ఎలాగో నేర్పేవారు. కానీ డిజిటల్ గడియారాలు వచ్చాక ఆ పద్ధతే పోయింది. విక్కీకయితే టైమ్ చూడటమే తెలియదు. మొబైల్ చూసి చెప్పేస్తుంటాడు. అరవై సెకన్లు ఒక నిమిషం, అరవై నిమిషాలు ఒక గంట వంటివి కూడా నేర్చుకోవడం లేదు. ఏమిటో.. అది అలా ఉంటే రామం ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకు అలారం పెడతాడు. కానీ అది మోగగానే కళ్లు మూసుకునే, దాన్ని ఆపేసి మళ్లీ నిద్రపోతాడు. అప్పుడిక మా ఉపయోగం ఏముంది? మనిషి వినేట్లయితే మా సేవలను సద్వినియోగం చేసుకోమని చెప్పాలనుంది. ఎక్కడికైనా సరే, సమయానికి చేరుకోవాలంటే మమ్మల్ని గమనించుకోవటం తప్పనిసరి. కొంత మందేమో మమ్మల్ని ముందు నడిచేట్లుగా సెట్ చేస్తుంటారు. అప్పుడు అనుకున్న సమయానికి తాము సంసిద్ధం కాగలమని వారి భావన. కొంతమంది బద్ధకస్తులేమో ఆలస్యంగా నడిచేట్లు సెట్ చేస్తుంటారు. అప్పుడిక మా గమనంలో ఖచ్చితత్వం ఎలా ఉంటుంది? మమ్మల్ని ముందు, వెనుక చేసినంత మాత్రాన అసలు కాలం ఆగిపోదని గుర్తించరెందుకని? విలువైన సమయాన్ని చూపే నా పట్ల నిర్లక్ష్యం వహించవద్దని చెప్పాలనుంది. వినేవారెవరు?’ అనుకుంటుంటే అంతలో సుజా అందరికీ కాఫీలు అందించింది.

తాతయ్య కాఫీ తాగుతూ ‘రామం! ఓ మాట..’ అన్నాడు. అదేమిటో అని నేను చెవులు రిక్కించాను. ‘చెప్పండి నాన్నా!’ అన్నాడు రామం. ‘ఏం లేదు, నేను ఉన్నంతకాలం సరే. ఆ తర్వాత ఆ గోడ గడియారాన్ని ఏ చెత్తవాడికో ఇచ్చేయకు. నీకు శ్రమ అయినా చెన్నైలోని కెనడీ గారికి అందించు. అదే నా కోరిక’ గద్గదంగా అన్నాడు తాతయ్య. ‘ఇప్పుడు అలాంటి మాటలేంటి నాన్నా!’ అన్నాడు రామం. ‘అనుకున్నప్పుడే చెప్పాలి. మళ్లీ నేను ఆ విషయం మరిచి పోవచ్చు’ అన్నాడు తాతయ్య.

నా పట్ల తాతయ్య అదే.. రంగబాబుకున్న ఆత్మీయతకు, బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు నా హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఏం జరిగిందో తెలియదు. నాలో కదలిక.. టిక్, టిక్.. ఐదు గంటలు కొట్టాను. రంగబాబుతో సహా అంతా ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తుంటే నేను రంగబాబు కేసి ఆనందంగా చూస్తున్నా. రంగబాబు లేచి నా దగ్గరగా వచ్చి ఆత్మీయంగా నన్ను తాకాడు. ఆనందంతో మెరిసే రంగబాబు కళ్లలో నా రూపు ఎంతో అందంగా..

Exit mobile version