Site icon Sanchika

అన్నింట అంతరాత్మ-44: ఆత్మీయతా ముద్రను.. ‘శుభాకాంక్షల కార్డు’ను నేను!

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’శీర్షికలో ఈ వారం ‘గ్రీటింగ్ కార్డ్’ అంతరంగం తెలుసుకుందాం.

***

‘అత్తా, అత్తా! సోమవారం స్కూల్లో మాకు గ్రీటింగ్ కార్డు తయారీ పోటీ ఉంది. నా క్కొంచెం ఐడియా చెప్పవా?’ గీతను అడిగింది శుభ.

‘అలాగే. అయినా ఇంకా టైముందిగా. ఈ లోపు నువ్వు కూడా ఆలోచించు’ అంది గీత.

‘సరే అయితే’ అంది శుభ.

పుస్తకాల షెల్ఫ్‌లో ఫైల్లో ఉన్న నాకు మా జాతి గురించిన మాటలు అమృతంలా సోకాయి.

వారం నుంచి ‘కొత్త సంవత్సరం.. కొత్త సంవత్సరం’ అనే మాట తెగ వినిపిస్తోంది.

నేనున్న ఫైల్లో నాలాగే ఎన్నో గ్రీటింగ్ కార్డులున్నాయి.

నేనంటే ఆనందరావు గారికి ఎంత ఇష్టమో! అలా అని నేనేదో ఖరీదైన అట్టహాసపు కార్డును కాదు. ఆయనకు బాల్యంలో మిత్రుడు గోపి ఇచ్చిన డ్రాయింగ్ కాగితాన్ని. నా మీద ఇద్దరు అబ్బాయిలు పతంగులెగరేస్తున్న బొమ్మ..

ఆనంద్ గాడికి..

‘హేపీ ఫ్రెండ్‌షిప్ డే..’

గోపీ గాడు..

అనే అక్షరాలు.

అప్పుడప్పుడు ఈ ఫైల్ తెరిచి, నన్ను చూస్తూ జ్ఞాపకాలలో విహరించడం ఆనందరావుకు అలవాటే.

నాతో పాటే ఉన్న వేర్వేరు గ్రీటింగ్ కార్డులు కూడా ఆలోచనలో ఉన్నట్లు వాటి ముఖాలే చెపుతున్నాయి.

అందులో సంఖ్యాపరంగా చెప్పాలంటే న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులే ఎక్కువ. సూర్యోదయాలు, ఇంద్రధనుస్సులు, పూలు, సీతాకోక చిలుకలు, చెట్లు, పక్షులు, రమణీయ ప్రదేశాలు, ముద్దులొలికే చిన్నారులు, సుందరాంగులు.. ఇలా ఎన్నెన్నో అందాలను ఆవిష్కరించే కార్డులు. పుట్టినరోజు గ్రీటింగ్‌లు, ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ లు వచ్చినప్పుడు గ్రీటింగ్ లు, పెళ్లి గ్రీటింగ్ లు, పండుగల గ్రీటింగ్‌లు, పిల్లలు పుట్టినప్పుడు గ్రీటింగ్‌లు.. లెక్కే లేదు. నేను ఆలోచనల్లో వుండగానే రాత్రి అయింది.

చూస్తే, అంతా హాల్లో కూర్చుని మొబైళ్లలో మెదళ్లు దూర్చారు. అంతా చేస్తున్న పని ఒక్కటే.. అదే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పంపడం, తమకు వచ్చినవి చూసుకుని సంతోషించడం. హూ.. గతంలో అయితే గ్రీటింగ్ కార్డులు అంటే మమ్మల్ని కొనడం, రాయడం, లేదా సొంతగా తయారు చేయడం, ఆపైన పోస్ట్ చేయడం, పోస్ట్‌మన్ అందించే గ్రీటింగ్ కార్డులను అందుకుని మురిసిపోవడం, పదిలంగా దాచుకోవడం చేసేవారు. మాకు అదొక స్వర్ణయుగం. ఇప్పుడు మొబైల్లో, కంప్యూటర్ లోనే గ్రీటింగ్ లను క్షణాలమీద పంపిస్తున్నారు.

నేనిలా ఆలోచనలో వుండగానే ‘రేపు మా క్లాస్ టీచర్‌కు ఇవ్వాలని ఈ గ్రీటింగ్ కార్డ్ తయారు చేశా. తాతా చూడు.. బాగుందా?’ ఆనందరావును అడిగాడు సూర్య.

చూశాడు ఆనందరావు, రంగుల ఇంద్ర ధనుస్సు బొమ్మ వేసి శుభాకాంక్షలు రాశాడు.

‘వాడి చిన్ని మనసుకు, నూతన సంవత్సరం సప్తవర్ణ శోభితమైన ఇంద్రధనుస్సులా ఉండాలి అనేంత సృజనాత్మక భావన అందిందో లేదో కానీ అందాల ఏడు రంగుల హరివిల్లు బొమ్మను శుభాకాంక్షల కార్డుకు చక్కగా ఎంచుకున్నాడు’ అనుకున్నాను. ఆనందరావు మనవడు గీసిన బొమ్మను చూసి మురిసిపోతూ ‘చాలా బాగుందిరా’ మెచ్చుకున్నాడు.

సూర్య, ఆయన పక్కనే కూర్చుంటూ ‘తాతా! అసలీ గ్రీటింగ్ కార్డులు ఎప్పటినుంచి మొదలయ్యాయి?’ అడిగాడు.

‘మంచి ప్రశ్న వేశావురా. మొట్ట మొదటగా చెప్పాలంటే ఈజిప్టులో ఈ శుభాకాంక్షల సంప్రదాయం ఉండేదట. అయితే అప్పటికి కాగితం ఇంకా కనుక్కోలేదు. అందువల్ల వాళ్లు చెట్ల బెరడుపై శుభాకాంక్షలు రాసి ఆత్మీయులకు ఇచ్చేవారని చెపుతారు. కాగితం ఆవిష్కరణ జరిగాక ఆ శుభాకాంక్షల రాతలన్నీ కాగితం మీదకు మారాయి. పధ్నాలుగో శతాబ్దిలో కాగితంపై చేత్తో బొమ్మలు వేసి, మాటలు రాసి ఒకరికొకరు ఇచ్చుకునే సంప్రదాయం యూరప్‌లో ఉన్నట్లు ఆధారాలున్నాయి. వాటికి సాక్ష్యాలు ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉన్నాయి. అచ్చు యంత్రం కనుగొన్నాక వీటి తయారీ విపరీతంగా పెరిగింది. పద్దెనిమిది వందల నలభై రెండు, డిసెంబర్ తొమ్మిదో తేదీన విలియం మా ఈగ్లే అనే ఆయన మొట్టమొదటి గ్రీటింగ్ కార్డ్ తయారుచేశాడు. దాని మీద పై భాగంలో ఓ వైపుగా ‘టు’, కింద ‘ఫ్రమ్’ అని అచ్చువేసి, ఎవరికి, ఎవరు పంపుతున్నది, వారి పేర్లు రాయడానికి వీలు కల్పించాడు. తొలిగా జర్మనీ వారు ప్రత్యేక సందర్భాల కోసం గ్రీటింగ్ కార్డులను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గ్రీటింగ్ కార్డుల ముద్రణ, అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా పంధొమ్మిదో శతాబ్ది నుంచి వీటి వాడుక పెరిగింది. పద్దెనిమిది వందల డెబ్భై మూడులో ప్రాంగ్ చార్లెస్ డికెన్స్ ఆటోగ్రాఫ్‌తో గ్రీటింగ్ కార్డ్‌ను రూపొందించి బంధువులకు, స్నేహితులకు పంపి, ఆ పద్ధతికి ఒరవడి చుట్టాడు. ప్రఖ్యాత చిత్రకారులు కేట్ గిరవే, వాల్టర్ క్రేన్ తదితరులు రకరకాల డిజైన్లలో కార్డులు తయారు చేసి, ముద్రింపజేసేవారు. ఇక పంధొమ్మిదవ శతాబ్ది నుంచి మాతృ దినోత్సవాలు, పితృ దినోత్సవాలు వంటి ప్రత్యేక రోజులకు కూడా గ్రీటింగ్ కార్డుల ముద్రణ మొదలైంది’.

‘మాకు ఇంత చరిత్ర ఉందన్న మాట’ గర్వపడ్డాను నేను.

‘అంటే దాదాపు ఆరు శతాబ్దాలుగా గ్రీటింగ్ కార్డులు మార్పులు చెందుతూ వస్తున్నాయన్న మాట’ శుభ అంది.

‘అసలు మైత్రీ దినోత్సవం.. అదే ఫ్రెండ్‌షిప్ డే ఏర్పడడానికి కూడా ఈ గ్రీటింగ్ కార్డుల వ్యాపారే కారకుడు’ అన్నాడు సూర్య తండ్రి విశ్వం.

‘ఎవరు నాన్నా ఆ వ్యాపారి?’ వెంటనే అడిగాడు సూర్య.

‘అంతర్జాతీయంగా ప్రసిద్ధమైనవి హాల్‌మార్క్ కార్డులు. ఈ సంస్థ యజమాని జాయిస్ హాల్. పంధొమ్మిది వందల ముప్ఫైలో తమ హాల్‌మార్క్ కార్డుల అమ్మకాలు పెంచుకోవడం కోసం ఫ్రెండ్‌షిప్ డేను సృష్టించినట్లు చెపుతారు. ఐక్యరాజ్య సమితి జులై ముప్ఫైని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి గ్రీటింగ్ కార్డులను అందరూ కొని, ఆకాంక్షలను అందించే సంస్కృతి పెరిగింది. జాయిస్ హాల్‌కి కాసుల వర్షం కురిసింది. అయితే చాలా దేశాల్లో ఆగస్ట్ నెల మొదటి ఆదివారం రోజు మైత్రీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు’ వివరించాడు విశ్వం.

‘ప్రతి మాతృ దినోత్సవానికి వాణి ఎంత చక్కని.. అర్థవంతమైన గ్రీటింగ్ కార్డులు పంపేదో. ఇదుగో ఈ మొబైల్ వచ్చాక అందులోనే శుభాకాంక్షలు చెప్పడం, వాట్సాప్‌లో కార్డ్ పంపడం మొదలైంది’ నిట్టూర్చింది ఆనందరావు భార్య సావిత్రి.

‘నీకు, నేనో గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇస్తాలే బామ్మా’ ఓదార్పుగా సూర్య అనడంతో అంతా నవ్వారు.

‘మీకో విషయం తెలుసా, గ్రీటింగ్ కార్డ్‌ను ఆధారంగా చేసుకునే హాలివుడ్ దర్శకుడు ఫ్రాంక్ కాప్రా ఓ సినిమా తీశారు. ఆ సినిమా పేరు ‘ఇట్స్ ఎ వండర్‌ఫుల్ లైఫ్’. పంధొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన ఈ సినిమా ప్రపంచం మొత్తం మీద వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇటలీలో పుట్టిన ఫ్రాంక్ కాప్రా అమెరికన్ దర్శకులలో మేటి స్థానం సంపాదించాడు’ చెప్పింది సూర్య అమ్మ వసుధ.

‘మా ఆధారంగా సినిమా! ఎంత గొప్ప!’ నేను గర్వపడుతుండగా ‘బాగుంది. గొప్ప విశేషమే. గ్రీటింగ్ కార్డు కథ కాదు కానీ తెలుగులో కూడా ‘శుభాకాంక్షలు’ పేరుతో సినిమా వచ్చింది’ అంది గీత.

‘అవును. అన్నట్లు ప్రతి నిత్యం ఎక్కువగా వాడే గ్రీటింగ్ కార్డులు పుట్టినరోజు గ్రీటింగ్ కార్డులే. ఇక సీజనల్‌గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ గ్రీటింగ్‌లు అత్యధికంగా అమ్ముడవుతాయి. ఆ తర్వాత స్థానం వాలంటైన్స్ డే.. ఆ తర్వాత పండుగలు, మాతృ దినోత్సవం, పితృ దినోత్సవం.. ఇలా ఎన్నో’ అన్నాడు విశ్వం.

‘వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డుల విషయంలో జర్మనీ వారిది ప్రత్యేక శైలి అని చదివాను. అక్కడ వాలంటైన్స్ డే వస్తోంది అంటే చాలు, పంది పిల్లలకు గిరాకీ పెరిగిపోతుందని చదివాను..’ వసుధ ఇంకా చెప్పబోతుండగానే, ‘అదేంటి వసూ, ప్రేమికుల రోజుకు, పంది పిల్లలకు ఏం సంబంధం?’ అడిగింది సావిత్రి.

‘అదే చెపుతున్నాను అత్తయ్యా, ఆ పంది పిల్లలకు పువ్వులు పట్టుకున్నట్లు, నాలుగు ఆకులు పట్టుకున్నట్లు ఫోటోలు తీసి, వాటితో గ్రీటింగ్ కార్డులు ముద్రించి అమ్ముతారు. వాలంటైన్స్ డే రోజున అక్కడి ప్రేమికులు ఆ గ్రీటింగ్ కార్డులనే ఇచ్చి పుచ్చుకుంటారు. అది చాలా శుభ సూచకం అని వారి నమ్మకం’ చెప్పింది వసుధ.

‘పంది పిల్ల పందికే కాదు, జర్మన్ లకు కూడా ముద్దన్న మాట’ ఆనందరావు మాటలకు అంతా నవ్వారు.

‘నాకు మ్యూజికల్ గ్రీటింగ్ కార్డులంటే చాలా ఇష్టం. మొన్న నా పుట్టినరోజుకు దివ్య ఇచ్చింది. తెరవగానే ‘హ్యాపీ బర్త్ డే టు యు’ అని భలే పాడింది’ శుభ ఆ క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ సంతోషంగా అంది.

‘నాకయితే ‘పాప్ అప్ కార్డ్స్’ ఇష్టం’ అన్నాడు సూర్యం.

‘అంటే?’ వెంటనే అడిగింది శుభ.

నేను కూడా ఆసక్తిగా జవాబు కోసం ఎదురు చూస్తుండగా, ‘అంటే కార్డు తెరవగానే ఓ బొమ్మ బయటకు తొంగిచూస్తుందన్న మాట. భలే తమాషాగా ఉంటుంది’ అన్నాడు సూర్య.

‘ఓహో’ శుభ దీర్ఘం తీసింది

‘క్విల్లింగ్ కార్డులు కూడా బాగుంటాయి. లేసుల వంటివి వరుసలుగా అందంగా మడిచి చక్కటి డిజైన్‌గా తయారుచేస్తారు’ అంది గీత.

‘గ్రీటింగ్ కార్డులలో ఫ్యాబ్రిక్ అంటే వస్త్రంతో తయారుచేసేవి కూడా ఉన్నాయి. పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో, బోయర్ యుద్ధకాలంలో వచ్చిన క్రిస్మస్ పండుగకు న్యూజిలాండ్ లోని గ్లాస్గోలో ఖాకీ ఫ్యాబ్రిక్ కార్డులు తయారు చేశారట’ చెప్పింది వసుధ.

‘ప్రపంచంలో అతి పెద్ద గ్రీటింగ్ కార్డు కంపెనీలు ఏవంటే, ఒకటి హాల్‌మార్క్ గ్రీటింగ్స్ కంపెనీ అయితే, రెండోది అమెరికన్ గ్రీటింగ్స్ కంపెనీ. ఇంకో విశేషం ఏమిటంటే గ్రీటింగ్స్ తయారీ రంగంలో కూడా అవార్డులున్నాయి. యు.ఎస్.కు చెందిన గ్రీటింగ్ కార్డ్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం అత్యుత్తమ గ్రీటింగ్ కార్డుల ముద్రణకు ‘లూయీ అవార్డ్’ లను అందిస్తున్నారు. అమెరికన్ క్రిస్మస్ కార్డ్ పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన లూయీ ప్రాంగ్ పేరిట ఈ అవార్డులు నెలకొల్పారు’ అన్నాడు విశ్వం.

‘అబ్బో.. మా జాతికి ఇంత గుర్తింపా!’ నేను అనుకుంటుంటే ‘మంచి సంగతి, బాగుంది’ అని ఆనందరావు మెచ్చుకుంటూ, ‘గ్రీటింగ్ కార్డుల వ్యవహారంలో కొన్ని సార్లు తమాషా సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఒకసారి న్యూయార్క్ లోని డిప్యుకి చెందిన ఓ బామ్మగారు ఆత్మీయులకు గ్రీటింగ్ కార్డు పంపాలనుకుంది. ఓ కవర్లో ఆ గ్రీటింగ్ కార్డ్ ఉంచింది. అయితే అందులో తన డబ్బు ఎనిమిది వందల డాలర్లు ఉన్న విషయం పొరపాటున చూసుకోలేదు. అలాగే పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెకు ఆ విషయం తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని పోస్టల్ శాఖ వారికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. వారినుంచి సమాధానం రాకపోవడంతో ఫోన్ చేసింది. అంతా విని వారు, ఆమె పంపిన కార్డ్ గమ్యస్థానం చేరలేదని, డెలివరీ కానీ పోస్ట్ కట్టల్లో ఉండవచ్చని, వాటన్నిటినీ పరిశీలించాక ఆమె కవర్ కనిపిస్తే అందజేస్తామని చెప్పారు. కానీ ఆమె దగ్గర వేరే డబ్బులు లేకపోవడంతో తన ఇబ్బందిని స్థానిక టీవీ ఛానల్ ద్వారా కూడా తెలియజేసింది. అది చూసిన ప్రజలు తామందరం కలిసి ఆ పెద్దావిడకు ఆ మొత్తాన్ని సహాయం చేస్తామని చెప్పారు. దాంతో ఆ టీవీ ఛానల్ వారు బామ్మగారి ఇంటికి వెళ్ళారు. బామ్మగారు సంతోషిస్తున్న ఆ సమయంలోనే పోస్టల్ శాఖ ఉద్యోగిని కూడా అక్కడికి వచ్చి కవర్ అందించింది. బామ్మగారు టీవీ కెమెరా ముందే కవర్ తెరిచి, తన డబ్బు భద్రంగా ఉండడం చూసి తెగ సంతోషపడింది’ చెప్పాడు.

‘మొత్తానికి శుభం కార్డ్ పడింది’ గీత అనడంతో అంతా నవ్వారు.

అంతలో ‘ఇప్పుడు ఎడిబుల్ గ్రీటింగ్ కార్డులు కూడా వచ్చాయి తెలుసా?’ అంది వసుధ.

‘అంటే’ వెంటనే ప్రశ్నించింది సావిత్రి.

‘తినేవి బామ్మా’ అన్నాడు సూర్య.

‘గ్రీటింగ్ కార్డులను తినడం ఏమిట్రా!’ అంది సావిత్రి.

‘అంటే ఈ గ్రీటింగ్ కార్డులను చాకొలేట్‌తో తయారు చేస్తారు. గ్రీటింగ్ కార్డ్ సైజులో హృదయాకారంలో, లేదంటే వేరే డిజైన్ లలో చాకొలెట్లు చేసి, వాటి మీద కేకుపై ఐసింగ్ చేసినట్లు ఒక్కో సందర్భానికి ఒక్కో రకంగా ఆకర్షణీయ రూపాలను తయారుచేస్తారు. మధ్యలో సందర్భానికి తగ్గట్లు సందేశాలు, సూక్తులు మొదలైన వాటిని చాకొలేట్ క్రీమ్‌తో రాస్తారు. మన ఫోటోలను, మనం చెప్పే సందేశాలను అచ్చు వేసే సదుపాయం కూడా ఉంది. మామూలు గ్రీటింగ్ కార్డునయితే చదివి, ఓ చోట దాచిపెడతాం. అదే ఈ చాకొలేట్ గ్రీటింగ్ అయితే గిఫ్ట్ తెరవగానే ఒక ఫొటో తీసుకుని, చాకొలేట్‌ను తినేయవచ్చు. చాకొలేట్ మనకు చేరే లోపలే కరిగిపోకుండా ప్రత్యేక బాక్స్‌లో ప్యాక్ చేస్తారు’ వివరించింది వసుధ.

‘అమ్మా! అయితే ఇప్పుడే ఒక చాకొలేట్ గ్రీటింగ్ ఆర్డర్ చెయ్యమ్మా’ సూర్య, శుభ ఒకేసారి అన్నారు.

‘స్వయంకృతాపరాధం.. తప్పుతుందా’ నవ్వుతూ అంది వసుధ

‘స్వయం. ఏదో అన్నావు.. అంటే’ అడిగింది శుభ.

‘అంటే నేను చేసిన తప్పే కదా అని.. అంటే మీకు చాకొలేట్ గ్రీటింగ్ గురించి చెప్పడం వల్లే కదా మీరడిగింది’ అర్థం వివరించింది వసుధ.

‘ఓహో’ శుభ అంటుంటే అంతా నవ్వారు.

‘ఇప్పుడు రాజకీయాల్లో కూడా గ్రీటింగ్ కార్డ్ ప్రవేశించింది. కొంతకాలం క్రితం తమిళనాట వినాయక చవితి సందర్భంగా బహిరంగ స్థలాలలో వేడుకలు నిర్వహించరాదని ప్రభుత్వం ప్రకటిస్తే, ప్రతిపక్షం, ముఖ్యమంత్రికి పది లక్షల వినాయక చవితి గ్రీటింగ్ కార్డులు పంపి, తమ కోరికను తెలియజేయాలంది. అలాగే గతంలో ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు నరేంద్ర మోడీ యాప్‌లో అందుకోసం ప్రత్యేక విభాగం కేటాయించారు. అంటే ఎవరైనా సరే తమ స్మార్ట్ ఫోన్ నుంచి మోడీకి శుభాకాంక్షలు చెప్పవచ్చన్నమాట. అలాగే సొంతంగా గ్రీటింగ్ కార్డు తయారు చేసి, పంపడానికి వీలైంది’ చెప్పాడు విశ్వం.

వింటున్న నాకు, మా జాతి ప్రాధాన్యత అంతగా పెరగడం మజానిచ్చింది.

‘బాగుంది. మారుతున్న కాలంలో కొత్త పోకడలెన్నో’ అంది సావిత్రి.

ఇంతలో వసుధ అందుకుని ‘ఇవన్నీ సరే, మీరు వర్క్ ఫోర్స్ గ్రీటింగ్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి’ అంది.

‘ఇదేదో కొత్తగా ఉంది. వెంటనే చెప్పు’ గీత అంటుంటే అంతా అవునన్నట్లు చూశారు.

నాక్కూడా ఆ విషయం తెలుసుకోవాలని కుతూహలం పెరిగిపోతుండగా, వసుధ మొదలుపెట్టింది. ‘క్లిఫ్టన్ అండ్ కో వారు ‘పెజెంట్స్ ఆఫ్ ద రాజ్: ద వర్క్ ఫోర్స్’ పేరిట పోస్ట్ కార్డ్ గ్రీటింగ్ లను వెలువరించారు. వీటిపై దాదాపు వందేళ్ల కిందట బ్రిటిష్ పాలనలో ప్రముఖుల వద్ద పనిచేసిన వారి అంటే కింది స్థాయి పనివారి ఫొటోలను ముద్రించారు. వివిధ దేశాల ప్రజలు ఈ పోస్ట్ కార్డ్ గ్రీటింగ్ లను ఎంతగానో అభిమానించి, ఆదరించి బంధుమిత్రులకు పోస్ట్ చేయసాగారు. అయితే ఈ గ్రీటింగ్ కార్డులు దేవాంగన అనే ఆమెలో కొత్త ప్రశ్నలను రేకెత్తించాయి. ఆ పోస్ట్ కార్డ్ గ్రీటింగ్ లలో పాకీ మనిషి, చర్మకారుడు, ఆఫీస్ ప్యూన్, టేబుల్ సర్వెంట్, బార్బర్, దోభీ, వంటవాడు, చౌకీదార్, పాలమ్మి.. అని రాశారు. పనిమనుషులు అయినంత మాత్రాన వారికి పేర్లుండవా? కార్డ్ సైజు, ఫొటో సైజు వివరాలు సైతం పేర్కొన్న వారు, వాళ్ల పేర్లు తెలుసుకుని ఎందుకు ప్రచురించలేదు? ఏ పని చేసే వారు అయినా తక్కువ ఎందుకవుతారు? అనే ప్రశ్నలు ఆమెలో ఉదయించాయి. ఆ పనివారి పట్ల చిన్న చూపు ఆమెకు నచ్చలేదు. వెంటనే ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాత రికార్డుల ప్రకారం ఆయా పనివారి చిరునామాలకు వెళ్లారు. స్థానిక రికార్డులను పరిశీలించి, వీలైన చోట్ల వారి తాలూకు బంధువులను కలుసుకుని వారి పేరు వివరాలు సేకరించారు. దీనికంతటికీ దేవాంగనకు కొన్నేళ్లు పట్టింది. అయితే ఆమె కేవలం వారి పేర్లతో కార్డులను రీప్రింట్ చేస్తే సరిపోతుందనుకోలేదు. శ్రమకు పట్టాభిషేకం చేయాలనుకుంది. శ్రామికులను మహరాజుల్లా, మహరాణుల్లా గౌరవించాలని, వారికి పేరే కాదు, సమున్నత స్థానమూ ఉంటుందని తెలియజేయాలన్న ఒక గొప్ప ఆశయంతో ఆమె కార్డులపై ఆ ఫొటోలను రీ కాపీ చేశారు. నిలువెత్తు ముఖ్మల్ వస్త్రాలపై ఆధునిక టెక్నిక్‌తో ముద్రించారు. చక్కని జరీ అంచుతో నలుపు తెలుపులో ఉన్న వ్యక్తుల ఆహార్యాన్ని మార్చివేశారు. రత్నఖచిత ఆభరణాలను పొదిగారు. దాంతో వారి రూపురేఖలే మారిపోయాయి. చౌకీదార్ బహదూర్ సింగ్, టేబుల్ సర్వెంట్ జ్ఞాన్ ప్రకాష్, స్వీపర్ మహదేవ్, ఫూల్వంతి, దోభీ ఘనశ్యామ్, చర్మకారుడు తన్వీర్, ఆంగ్లో ఇండియన్ గ్రేస్.. ఇలా పేర్లు రాశారు. ఇంత గొప్పగా ఈ గ్రీటింగ్ కార్డులను రూపొందించిన దేవాంగన మన మాజీ పార్లమెంట్ స్పీకర్ మీరా కుమార్ కుమార్తె కావడం మరో విశేషం’ సవివరంగా చెప్పింది.

‘చాలా బాగుంది. మంచి మనసు, దానికి తగ్గ పట్టుదల ఉంటే కానీ అలాంటి పనులు చేయలేరు’ అన్నాడు ఆనందరావు.

మిగతావారు కూడా ‘మీరన్నది ఎంతో నిజం’ అన్నారు.

నాక్కూడా దేవాంగన చేసిన పని ఎంతో గొప్పగా అనిపించింది.

‘ఆసుపత్రులలో ఉండే రోగులకు ఈ గ్రీటింగ్ కార్డులు గొప్ప సాంత్వనని, సంతోషాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. నేను చదివిన ఓ ఉదంతం గుర్తుకొస్తోంది. అది.. కరోనా కాలంలో న్యూయార్క్ లోని వెస్టల్‌కు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి అరణ్య చోప్రా అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కోసం వందలాది గ్రీటింగ్ కార్డులు స్వయంగా తయారుచేసి పంపింది. వాటి తయారీకి కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బును ఖర్చు చేయడం ఆ చిన్నారి మంచి మనసును తెలుపుతుంది’ చెప్పింది గీత.

‘చాలా మంచి పని చేసింది. అరణ్య చోప్రా వంటి పిల్లలు బాలలకు ఆదర్శంగా నిలుస్తారు. సూర్యా, శుభా విన్నారా?’ అంది వసుధ.

‘విన్నాం’ అన్నారు పిల్లలిద్దరూ.

మా జాతి వల్ల ఇటువంటి మేలు జరుగుతుందని తెలిసి ఎంతో ఆనందించాను.

‘ఆమధ్య దుబాయ్ నివాసి రామ్ కుమార్ సారంగపాణి 8.2 చదరపు మీటర్ల పాప్ అప్ గ్రీటింగ్ కార్డ్ తయారుచేసి, అతి పెద్ద గ్రీటింగ్ కార్డు తయారీదారుడిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ పదవీ బాధ్యతలు స్వీకరించి పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా సారంగపాణి ఈ గ్రీటింగ్ రూపొందించాడని, ఆ గ్రీటింగ్ తయారీకి ఆరు నెలలు పట్టిందని చదివాను’ చెప్పాడు విశ్వం.

‘అంత పెద్దదే’ పిల్లలిద్దరూ ఆశ్చర్యంగా అన్నారు.

నాకేమో అది విని ఎంతో గర్వంగా అనిపించింది.

‘గ్రీటింగ్ కార్డులను మిత్రులు, బంధువులు, ఇతర ఆత్మీయులకు మాత్రమే కాదు, వివిధ వర్గాల వారికి అందించవచ్చు. గతంలో ఓ సారి చదివాను, జైలు అధికారి ఒకరు అక్కడ ఉన్న నేరగాళ్లకు చక్కటి సందేశాత్మక నూతన సంవత్సర శుభాకాంక్షల కార్డులు అందించారని, వాటిని చూసి వారు తమను ఆవిధంగా మన్నించినందుకు ఆనందించారని, వారిలో పరివర్తన మరింత బలపడిందని రాశారు. తప్పు చేసిన వారిని సరిదిద్దడానికి ఇలాంటి చర్యలు ఎంతో ఉపకరిస్తాయన డానికి ఈ ఉదంతమే ఉదాహరణ’ చెప్పారు ఆనందరావు.

‘నిజమే. ఇలాంటి చర్యలు వారిలో నిగూఢంగా ఉండే ఆత్మీయతానుభుతులను తట్టి లేపే అవకాశాలున్నాయి’ అన్నాడు విశ్వం.

‘కరడుకట్టిన నేరస్థుల విషయంలో మాత్రం ఇలాంటివి పనిచేయవు’ అంది సావిత్రి.

‘అది వేరే విషయం. సాధారణ నేరస్థులు మారినా కొంతవరకు నయమేగా. ఇటువంటి ప్రయత్నాలు చేయడంలో వచ్చే నష్టమైతే ఏమీ ఉండదు’ అంది వసుధ.

‘నువ్వు చెప్పిందీ నిజమే’ అంది సావిత్రి.

మా జాతి ఈ రకమైన మంచికి తోడ్పడుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

‘అన్నట్లు నాకు ఇంకో సంగతి జ్ఞాపకమొస్తోంది. నేను ఉద్యోగంలో చేరిన రోజుల్లో మా బాస్‌కి స్వయంగా గ్రీటింగ్ కార్డ్ తయారుచేసి ఇచ్చేవాడిని. అది కూడా టైప్ రైటర్ మీద. కొలతల ప్రకారం అటు, ఇటు మార్జిన్ వదిలి, ఎట్ ది రేట్ ఆఫ్ టైప్ చేస్తూ చతురస్రాకారంలో డిజైన్ చేసి మధ్యలో నూతన సంవత్సర శుభాకాంక్షలు రాసి అందించే వాడిని. మా బాస్ ఎంతో సంతోషించేవాడు. ఎందుకంటే మార్కెట్‌లో అందమైన, పెద్ద గ్రీటింగ్ కొనివ్వడం తేలికే. డబ్బు పెడితే వచ్చేస్తుంది. కానీ స్వహస్తాలతో తయారు చేయడంలో వాళ్ల పట్ల మనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధను, అభిమానాన్ని సూచిస్తుంది. ఆ రోజుల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ లేవుగా, టైప్ రైటరే రారాజుగా ఉండేది. ఇప్పుడేముందీ, ఇంటర్నెట్‌లో 123 నుంచి వందలాది గ్రీటింగ్ లలో కావాల్సినవి ఎంచుకుని, ఎంతమందికైనా క్షణాల్లో సులభంగా పంపిస్తున్నారు’ తన అనుభవాన్ని చెప్పాడు ఆనందరావు.

అది విని వసుధ ‘అవును. నేను పెళ్లి కాక ముందు మా వూళ్లో ఓ స్కూల్లో పనిచేశాను. అప్పుడు కొత్త సంవత్సరం వస్తే చాలు పిల్లలంతా చిట్టి, పొట్టి బొమ్మలతో, తళుకులతో తాము తయారుచేసిన రకరకాల గ్రీటింగ్ కార్డులను తెచ్చి, ‘టీచర్, టీచర్’ అంటూ ముందుగా ఇవ్వడానికి పోటీ పడేవాళ్లు. ఆ చిన్నారుల అభిమానానికి హద్దే ఉండేదికాదు’ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది.

సూర్య, ఆమె మాటల్ని విని ‘నేను కూడా మా క్లాస్ టీచర్ కోసం గ్రీటింగ్ తయారు చేశా కదా’ అంటుంటే, ‘నేను నీకన్నా ముందరే తయారుచేసి దాచి ఉంచా’ అంది శుభ.

వాళ్ల మాటలు విని, ‘మంచి పని చేశారు ‘అని అంతా మెచ్చుకున్నారు.

‘మా జాతి వల్ల ఇంత మందికి ఆనందం కలగడం అంటే మా జన్మ ధన్యమైనట్లే’ అనుకున్నాను నేను.

అంతలో అందరి మొబైల్స్ మెసేజ్ శబ్దాలు చేయడం మొదలెట్టడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ‘ఇదుగో, అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు పంపడం మొదలెట్టారు’ అన్నాడు విశ్వం.

‘మనం కూడా శుభాకాంక్షలు త్వరగా పంపాలి’ అంటూ ఆనందరావు కూడా మొబైల్ అందుకున్నాడు.

మిగతా వారూ అదే పనిలో మునిగారు.. పిల్లలు తమ గ్రీటింగ్‌లు చూసుకుంటున్నారు.

నా జాతి గురించిన ఆలోచనలు నన్ను చుట్టుకునే ఉన్నాయి. ఇంటర్నెట్ వచ్చినా కొన్ని దేశాల్లో మాకు ఆదరణ అధికంగానే ఉందని మొన్నామధ్య టీవీలో చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. అతి చిన్న గ్రీటింగ్ తయారీలో బ్రెజిల్ రికార్డ్ సాధించిందని, ఆగ్రాలో నూట ఇరవై ఏడు మీటర్ల అతి పెద్ద గ్రీటింగ్ కార్డ్ తయారు చేశారని కూడా చెప్పారు. అందరికీ మా జాతి ద్వారా ఆనందాన్ని, ఆత్మీయానురాగాలను పంచడం చాలా బాగుంది. కానీ కేవలం అదో సంప్రదాయంగా.. గొప్ప కోసమో, ఉనికి కోసమో, మొక్కుబడిగా, యాంత్రికంగా పంపడం మంచిది కాదనిపిస్తుంది. హృదయాంతరాళం నుంచి వచ్చే శుభాకాంక్షలు మాత్రమే అర్థవంతమైనవి. గ్రీటింగ్ కార్డు ఖరీదైనది కానవసరం లేదు, అట్టహాసంగా ఉండక్కర్లేదు. చిన్న గడ్డి పూవు బొమ్మ ఉన్నా ఆత్మీయమైన అక్షరాల శుభాకాంక్షలు అక్షరలక్షలుగా భావించాలి. ఈ-కార్డ్ రూపంలో అత్యధిక జనాభాకు అందుబాటులో ఉండడం కూడా మాకు గర్వకారణమే. ఏదో రూపంలో మానవాళికి మా శుభాకాంక్షలు చిరకాలం ఉంటాయి అనుకుంటుండగా ఓ పాట..

గుండె నిండా గుడిగంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ల నిండా సంక్రాంతులు
సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే..

వినసొంపై, నా మనసు చేయసాగింది ఆనంద విహారం!

Exit mobile version