అన్నింట అంతరాత్మ-5: ప్రేమ గురుతును నేను,, ఉంగరాన్ని!

6
3

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ఓ ఉంగరం అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]’అ[/dropcap]బ్బ! మీ ఉంగరం ఎంత మెరిసిపోతోందో. అందులో మంచి ఎర్రరాళ్లు.. డిజైన్ కూడా బాగుంది’ పక్కింటి పల్లవి, మాధురి వేలుకి ఉన్న ఎర్రరాళ్ల ప్రధానపుటుంగరాన్ని.. అదే, నన్ను చూస్తూ మెచ్చుకుంది. ‘థాంక్యూ’ అంటోంది మాధురి. చెప్పొద్దూ నన్ను పొగిడినందుకు సంతోషంతో ఉబ్బిపోయాను. పిచ్చి మాధురి ‘ఈ మధ్య లావయినట్లున్నా.. ఈ ఉంగరాన్ని కూడా కొంచెం వదులు చేయించుకోవాలి’ అంటోంది.. ఆ పైన వాళ్ల మాటలు నాకు వినపడటం మానేశాయి. ఆలోచన మొదలయింది…

మనిషి తన చేతివేళ్లలో నాలుగో వేలుకు ‘ఉంగరం వేలు’ అని నామకరణం కూడా చేసుకున్నాడు. కానీ బొటనవేలు మినహా అన్నివేళ్లకీ ఉంగరాలు ధరించడం పరిపాటిగా ఉంది. అంతేకాదు, ఒక వేలుకే రెండు ఉంగరాలు పెట్టుకునే వాళ్లనూ చూశాను. అన్నట్లు ఈ మధ్య మాధురి ఆడపడుచుకు కొడుకు పుట్టాడు. మనవడి బారసాల నాడు తాతగారు గొలుసు బహుకరిస్తే, మాధురి భర్త మోహన్.. అదే మేనమామ చంటివాడి చిట్టివేలుకు, చక్కని చిన్ని ఉంగరం తొడిగి మురిసిపోయాడు. అన్నట్లు ఆమధ్య మోహన్ అన్నకొడుకు అన్నప్రాశన జరిగింది. అప్పుడు ఆ పసివాడికి ఉంగరంతోనే పరమానాన్ని తినిపించడం చూసి, ఔరా మా ఉంగరానికి ఎంత ప్రాముఖ్యమున్నదో అనుకున్నాను. ఒకసారి టీవీలో చూశాను.. వాలెంటైన్స్ డే అట.. బంగారం షాపుల్లో ఉంగరాలకు పెరిగిన డిమాండ్ అంటూ ఎన్నిరకాల ఉంగరాలను చూపించారో! ప్రేమ గురుతు.. అదే హృదయాకారంలోనే ఎన్నెన్ని డిజైన్లో. మరోసారి మాధురివాళ్లు ఒక వివాహ నిశ్చితార్థ (ఎంగేజ్‌మెంట్) కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ.. అమ్మాయి, అబ్బాయి పరస్పరం ఉంగరాలు అలంకరింప జేసుకున్నారు. ముచ్చటైన దృశ్యం. అంతా వేడుకగా చూశారు. అన్నట్లు ఒకసారి మాధురి జంట ఓ పెళ్లికెళ్లారు. అప్పుడు పెళ్లి వేడుకల్లో భాగంగా సగంవరకు నీళ్లున్న బిందెను వధూవరుల మధ్య ఉంచారు. పురోహితుడు ఓ ఉంగరాన్ని బిందెలో వేశాడు. ‘ఎయ్ హేమా త్వరగా తియ్’ అంటూ వధువు తరఫు బృందం అరుస్తుంటే, ‘శరత్! ఇది పవర్ గేమ్. ఏమాత్రం తగ్గకు’ అని అబ్బాయిలు.. అమ్మాయి చేయి తగలగానే అబ్బాయి పరవశించి పోవటం.. అమ్మాయి తెలివిగా ఉంగరాన్ని అందుకుని పైకితీయడం జరిగిపోయాయి. రెండో సారి ‘ఎంట్రా శరత్.. కనీసం ఇప్పుడైనా గెలవరా.. తర్వాత ఎలాగూ ‘చిత్తం శ్రీమతే..’ అన్నాడో స్నేహితుడు చిలిపిగా. దాంతో పెళ్లికొడుకు పట్టుబట్టి ఉంగరం తీశాడు. ఇలా కొన్నిసార్లు చేశాక అమ్మాయే ఎక్కువ సార్లు గెలిచింది. కాబట్టి అమ్మాయిదే పైచేయిగా ఉంటుంది అని ప్రకటించారు. అది చూస్తూ ‘మన పెళ్లిలో.. గుర్తొచ్చిందా’ అంటూ నవ్వుతూ చూశాడు మాధురివైపు ఆమె భర్త. ‘ఆఁ ఆఁ.. ఎందుకు గుర్తులేదూ.. అప్పుడేమో ఉదారంగా నన్ను గెలిపించారు కానీ ఆ తర్వాత అంతా మీదేగా పైచేయి.. అంతా బూటకం’ చిరు కోపంతో మూతి తిప్పింది మాధురి. నేను ఉల్లాసంగా ఉంగరాల ఆట ఊసులు వింటూ ఉండిపోయాను. అయినా మా ఉంగరాల చరిత్ర ఈనాటిదా? మా ప్రాధాన్యత ఇతిహాసకాలం నుంచి ఉంది. అప్పుడప్పుడు తాతగారు చెప్పే పురాణ కథలన్నీ వింటుంటానుగా. అందుకే నాకన్నీ తెలుసు.. అలనాడు దుష్యంతుడు వేటకోసం అడవులకు వెళ్లి అక్కడ శకుంతలను చూసి, తొలిచూపులోనే వలచి, ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని, గురుతుగా ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఆ సమయాన శకుంతలను పెంచి పెద్దచేసిన కణ్వముని లేకపోవటంతో మళ్లీ వచ్చి ఆమెను తనతో తీసుకు వెళ్తానని తన రాజ్యానికి వెళ్లిపోయాడు దుష్యంతుడు. అయితే శాపకారణంగా దుష్యంతుడు, శకుంతల సంగతే మరచిపోయాడు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. శకుంతలకు పుత్రోదయం అయింది. ఎన్నాళ్లయినా దుష్యంతుడి జాడే లేదు. చివరకు శకుంతలే కొడుకు భరతుడితో సహా దుష్యంతుడి వద్దకు వెళ్లింది. దుష్యంతుడు ఆమెను ‘నువ్వెవరో తెలియదు’ అన్నాడు, ఆమె చెప్పింది నమ్మలేదు. అంతలో ఆమెకు అతడిచ్చిన ఉంగరం గురుతుకొచ్చింది. రుజువుగా దాన్ని చూపబోయింది. కానీ వేలికి ఉంగరం కనిపిస్తేనా.. ఆమె కలవరపడింది. అంతలో ఓ జాలరి సభలో ప్రవేశించి తాను పట్టిన చేప కడుపులో ఉంగరం దొరికిందని ఇచ్చాడు. అది దుష్యంతుడు, శకుంతల వేలికి తొడిగిన ఉంగరమే. దానిని చూడటంతోనే దుష్యంతుడికి తన గాంధర్వ వివాహ ఉదంతమంతా గుర్తుకు వచ్చి శకుంతలను ఆదరిస్తాడు. మరి ఉంగరం వల్లే కదా శకుంతల, దుష్యంతుల కథ సుఖాంతమైంది.

రామాయణంలోనూ మా ఉంగరం పాత్ర ప్రముఖమైందే. రావణుడు, సీతను అపహరించడంతో సీతాన్వేషణకు వాయుపుత్రుడిని పంపాలని నిర్ణయించారు. అప్పుడు హనుమ శ్రీరాముడితో, తనను సీతాదేవి విశ్వసించేందుకు ఏదైనా ఆనవాలును ప్రసాదించమంటే రాముడు అతడికి తన ఉంగరం తీసి ఇస్తాడు. హనుమ సముద్రాన్ని లంఘించి, వాయువేగంతో అన్ని అవరోధాలను అధిగమించి, అశోకవనం చేరి, సీతాదేవి జాడను గుర్తించి, ఆమెకు శ్రీరాముడిచ్చిన ఉంగరాన్ని చూపుతాడు. దాంతో ఆమె, హనుమను రాముడే పంపాడని విశ్వసిస్తుంది.

అంతేకాదు, శివపురాణంలోని గుణనిధి కథలోనూ మా ఉంగరం ఉంది. ఆ కథ.. యజ్ఞదత్తుడు, సోమిదమ్మ తనయుడు గుణనిధి. యజ్ఞదత్తుడు రాజగురువు. గుణనిధి చెడు సావాసాలతో గుణహీనుడై జూదక్రీడకు బానిసవుతాడు. సొంత ఇంట్లోనే నగలను దొంగిలించడం మొదలు పెడతాడు. తల్లికి తెలిసినా, కొడుకు మీద ప్రేమతో.. భర్తకు చెపితే ఆగ్రహిస్తాడనే భయంతో చెప్పదు. యజ్ఞదత్తుడు తన విధులతో తీరికలేక కొడుకు తీరు గమనించడు. ఒకసారి గుణనిధి తన తండ్రికి, రాజుగారు ఇచ్చిన వజ్రపుటుంగరం దొంగిలించి పట్టుకెళ్లి, జూదంలో ఒడ్డి ఓడిపోతాడు. ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుడి కంటపడ్డాడు. యజ్ఞదత్తుడు అతడిని ఉంగరం గురించి నిలదీయగా, అది తాను జూదంలో గుణనిధి నుంచి గెలుచుకున్నానని చెపుతాడు. యజ్ఞదత్తుడు ఆగ్రహంతో ఇంటికి వెళ్లి భార్యను మందలిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గుణనిధి ఇంటికి వెళ్లే ధైర్యం లేక గౌతమీ నది దాటి పక్క ఊరు చేరాడు. అక్కడ శివాలయానికి వెళ్లటం, ఆరోజు శివరాత్రి కావటం.. అక్కడ నైవేద్యం దొంగిలించడం.. చివరకు కైలాసానికి చేరటం అదంతా వేరు సంగతి. కథ మలుపు తిరగడానికి మాత్రం మా వజ్రపుటుంగరమే కారణమైంది. ఇలా ఎన్నెన్నో.

ఇక చందమామ కథల్లో అయితే మహిమలతో కూడిన ఉంగరాలు భలే ఉంటాయి. ఆ మహిమాన్విత ఉంగరాన్ని దుష్టులు అపహరించడం, మళ్లీ రాజకుమారుడు దాన్ని అన్వేషించి దుష్టశిక్షణ చేసి సాధించడం.. సినిమాల్లోనూ మా ఉంగరాల పాత్ర కీలకమైందే. ఓసారి టీవీలో ఓ సినిమా చూశాను.. అదే.. జగదేక వీరుడు అతిలోక సుందరి. అందులో స్వర్గలోకాధిపతి ఇంద్రుడి తనయ ఇంద్రజ మానససరోవరంలో జలక్రీడకోసం భూలోకానికి వస్తుంది. ఆ సందర్భంలో స్వర్గలోక ప్రవేశానికి అధికార చిహ్నమైన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. దాంతో తిరిగి స్వర్గలోకానికి వెళ్లినా అనుమతించక పోవటంతో వెనుదిరిగి భూలోకానికి వస్తుంది. తన ఉంగరం రాజు అనే వ్యక్తి దగ్గర ఉందని తెలుసుకుని దాన్ని అతని వద్దనుంచి తీసుకోవడానికి అతడితో స్నేహం చేస్తుంది. అది ప్రేమగా మారడంతో చివరకు స్వర్గలోకానికి తిరిగి వెళ్లడం అనే ఆలోచన విరమించుకుని రాజును వివాహం చేసుకుంటుంది. ఆ ఉంగరం కోసం ‘మానవా.. మానవా’ అంటూ నాయిక, నాయకుడి వెంట తిరగడం భలేగా ఉంటుంది.

ఇంకో ముఖ్య విషయం.. ఉంగరాలు మనిషికి అదృష్టాన్ని కూడా తెచ్చి పెడతాయట. మొన్న, బామ్మగారు, తాతగారితో ‘ఎన్నాళ్లనుంచో వజ్రపుటుంగరం పెట్టుకోవాలని కోరిక.. నా కోరిక మీరు తీర్చనే లేదూ’ అంది నిష్ఠూరంగా. అందుకు తాతగారు ‘పిచ్చిదానా! వజ్రపుటుంగరం ఎవరంటే వాళ్లు పెట్టుకోకూడదు. ఎవరు ఏ రాయి పొదిగిన ఉంగరం ధరించాలో శాస్త్రం చెపుతుంది. ఆ ప్రకారమే ధరించాలి. ముత్యాలు, కెంపులు వంటివి ఎవరైనా ధరించవచ్చు కానీ వజ్రం వంటివి ఎవరుపడితే వాళ్లు ధరించకూడదు. ఒకసారి ఓ సిద్ధాంతి గారు నాకు చెప్పారు. నీకూ చెపుతా విను.. అంటూ చెప్పడం మొదలు పెట్టడంతో ‘మా జాతికి సంబంధించిన విషయం కదాని నేనూ చెవులింతలు చేసుకొని వినడం మొదలు పెట్టాను. ఆయన చెప్పింది బాగా గుర్తుంది.. కెంపు ఉంగరాన్ని బంగారం లేదా వెండితో తయారు చేయించుకుని కుడిచేతి ఉంగరపు వేలు లేదా మధ్య వేలుకు ధరించడం వల్ల కోపతాపాలు తగ్గుతాయని, జాతకంలో ఉద్యోగ ప్రతికూలతలుంటే తొలగుతాయని చెప్పారు. ముత్యాల ఉంగరం మనిషికి మనశ్శాంతిని, ప్రశాంతతను ఇస్తుందని.. దీనిని ఎవరైనా ధరించవచ్చని, అయితే దీన్ని వెండితో తయారు చేయించుకుంటేనే ఫలితం బాగుంటుందని, ముత్యం ఉంగరాన్ని కుడిచేతి చిటికెన వేలుకు ధరించాలని చెప్పారు. అందుకేనేమో బామ్మగారి చిటికెన వేలుకు ముత్యం ఉంగరం ఉందీ అనుకున్నాను. వెండితో తయారైన పగడం ఉంగరం ధరించటంవల్ల అనేక రుగ్మతలు తగ్గిపోతాయట. ఇక పచ్చల ఉంగరం ధరిస్తే కుటుంబంలో గొడవలు తగ్గుతాయని, గురుగ్రహదోషం ఉన్నవారు పుష్యరాగం పొదిగిన ఉంగరాన్ని ధరిస్తే మంచిదని చెప్పి వజ్రపుటుంగరం అయితే జ్యోతిష సిద్ధాంతిని సంప్రదించి ధరించాలని, ఇది శుక్ర గ్రహానికి ప్రతీక అని, బంగారంతో తయారు చేయించి, ఎడమచేతికి ధరించవలసి ఉంటుందని.. అలాగే నీలం పొదిగిన ఉంగరాన్ని శనిగ్రహ దోషం ఉన్నవారు వెండితో తయారుచేయించి, ఎడమచేతికి ధరిస్తారని వివరించారు. అలాగే రాహు సంబంధ దోషాలున్నవారు గోమేధికం పొదిగిన ఉంగరాన్ని ధరిస్తారని, దీనివల్ల మృత్యుభయం తగ్గి, శరీర బలం పెరుగుతుందని, ఇక వైఢూర్యం పొదిగిన ఉంగరం ధరించడంవల్ల కేతు గ్రహ దోషం పోయి, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయని చెప్పారు.

అన్నట్లు మా ఉంగరాల విషయంలో కొన్నిసార్లు తమాషాలు జరుగుతుంటాయి. కొన్నేళ్ల క్రితం బామ్మగారి ఉంగరం పోయింది. ఇల్లంతా వెదికినా కనిపించలేదు. దానికోసం బాధపడి, బాధపడి మరిచిపోతున్న సమయంలో ఒక రోజు కొడుకు వచ్చి ‘అమ్మా! నీ పోయిన ఉంగరం తెచ్చిస్తే నాకేమిస్తావు?’ అనడం, ‘ఏంటీ నా ఉంగరమా. దొరికిందా.. ఏది చూపించు ముందు’ అని ఆరాటపడటం, కొడుకు నవ్వుతూ ‘ఇదుగో నీ ఉంగరం’ అంటూ ఇవ్వడం జరిగాయి. ‘నీకెక్కడ దొరికిందిరా’ అంది బామ్మగారు ఆశ్చర్యానందాలతో. ‘ఆటోలో వెళ్తుంటే సడెన్‌గా బ్రేక్ వేయడంతో కుదుపు వచ్చింది. ఆ వెంటనే నా ప్యాంట్ కాలి మడతలోంచి ఈ ఉంగరం ఎగిరిపడింది. చూస్తే నీ ఉంగరం.. కాలిమడత దగ్గర కుట్లు ఊడిపోయి ఉన్నాయి. నువ్వు బట్టలు ఉతికేటప్పుడు సబ్బు వల్ల ఉంగరం వేలినుంచి జారి కొద్దిగా కుట్లు ఊడిన ప్యాంటు మడతలోకి వెళ్లుంటుంది. అది ఇన్నాళ్లూ పదిలంగా అలాగే ఉండటం, ఇప్పుడు ఇలా నాముందే బయటపడటం నీ అదృష్టం. నీ ఉంగరం దొరికిందిగా, నాకేమిస్తా?’ అన్నాడు. ‘మనదైన వస్తువు ఎక్కడికీ పోదంటారు. ఇందుకే. నీకు ఇష్టమైన క్యారెట్ హల్వా చేసి పెడతాలే’ అంది బామ్మగారు. ఉంగరం ధరించేవారు కొన్నిసార్లు లావవటం, సన్నబడటం సహజం. అప్పుడు ఉంగరం వదులైతే దారంచుట్టి పెట్టుకోవడం, బిగుతయితే సాగదీయించి పెట్టుకోవడం గమనించాను. ఇంక ఈ ఇంట్లో బామ్మగారికి లక్ష్మీదేవి ఉంగరం, తాతగారికి వేంకటేశ్వరస్వామి ఉంగరం, అబ్బాయికి సాయిబాబా ఉంగరం కూడా ఉన్నాయి.

అన్నట్లు కొంతమంది ఆరోగ్యానికి మంచిదని సాదా రాగి ఉంగరాలను ధరించటం కూడా చూశాను. అంతేనా! తమ పేరు మొదటి అక్షరం చెక్కిన ఉంగరాన్ని ధరించేవారిని, తమ పేరు, తమ భర్త పేరులోని మొదటి అక్షరాలతో కూడిన ఉంగరాలను ధరించే వారిని కూడా చూశాను. ఇదంతా బాగానే ఉంది కానీ ప్రేమజంటల మధ్య, భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చి కోపతాపాలు పెరిగిన సందర్భాల్లో అనుబంధ చిహ్నాలమైన మమ్మల్ని తీసి విసిరేయడం చాలా బాధనిపిస్తుంది. మమ్మల్ని విసిరేయొద్దనే కాదు, కలహాలొద్దు, కలసి ఉంటే ముద్దు అని చెప్పాలనిపిస్తుంది. కానీ మామాట వినిపిస్తేగా.. మా మూగమనసును వారు వింటేగా.. ఇంతలో మోహన్ వచ్చాడు. ‘ఏమండీ’ అంటూ మాధురి.. ‘ఏంటో సంగతి’ అన్నాడు మోహన్ నవ్వుతూ. “ఏంలేదు, కొత్త డిజైన్ ఉంగరం కొనుక్కుంటానని చాలా రోజులనుంచి అంటున్నా మీరు వినిపించుకోవట్లేదు.. ఇవాళ ‘ధగధగలు జ్యువెలర్స్’ ఓపెనింగ్. పది శాతం తగ్గింపు ఉంది. లక్కీ కూపన్ కూడా ఉంది. వెళ్దామండీ’ అంది. మా జాతి వాళ్లందరినీ చూడొచ్చని నేను కూడా ఉబలాట పడ్డాను. ఏ మూడ్‌లో ఉన్నాడో కానీ మోహన్ ‘సరే పద’ అన్నాడు. ఇంకేముంది.. మాధురితో పాటు నేనూ హుషారుగా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here