Site icon Sanchika

అన్నింట అంతరాత్మ-6: రక్షణకు ప్రతీకను,, గొడుగును నేను!

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ఓ గొడుగు అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]’ఆ[/dropcap]కాశం మబ్బుపట్టి ఉంది. భలే! భలే! ఈరోజు మనమంతా బయటి ప్రపంచాన్ని చూస్తామన్నమాట. వాన రాకపోతే ఈ మనుషులకు మేమసలు గుర్తురాము. ఓ మూలన పనికిరాని వస్తువుల్లా పడుంటాం’ గొడుగు మిత్రులం అనుకున్నాం. మేమంతా వరుణేశ్వర్రావు గారింట్లో గొడుగులం. ఈ ఇంట్లో ఒక్కొక్కరికీ ఒక్కొక్క గొడుగు ఉంది. నేను పూలపూల చిన్ని గొడుగును. వరుణేశ్వర్రావుగారి అమ్మాయి వర్ష నన్నెంతో ముచ్చటపడి కొనుక్కుంది. నాకోసం ప్రత్యేక అర ఉన్న బ్యాగ్ కూడా కొనుక్కుంది. కొత్తల్లో ఆ బ్యాగే వాడేది. ఈరోజు వాన రావాలి, వాన రావాలి అని కోరుకునేది. వానొస్తే సంతోషంగా నన్ను బయటకు తీసేది. కొంతకాలానికి నా మీద మోజు తగ్గింది. అదీగాక తరచు వెరైటీ బ్యాగులు వేసుకెళ్తోంది. అన్నిట్లో నాకోసం ప్రత్యేక ఏర్పాటు ఉండదు కదా, అలా నేను అలమరలోనే ఉండిపోయాను. ‘వర్షా! గొడుగు తీసుకెళ్లటం మర్చిపోకు. మూడురోజులపాటు వానలని టీవీలో చెప్పారు.’ వాళ్లమ్మ చెప్పటం విని నేను బయటకు వెళ్లటం ఖాయం అనుకున్నాను. అనుకున్నట్లే వర్ష బయలుదేరే వేళకు సన్నజల్లు మొదలైంది. దాంతో ఆమె నేనున్న బ్యాగ్‌ను అందుకుని, నన్ను బయటకు తీసింది. ఆమె బయటకు నడుస్తుంటే నేను నా మిత్రులకు నవ్వుతూ టాటా చెప్పాను. అవి నాకేసి అసూయగా చూశాయి. వర్ష బస్‌స్టాపుకు నడిచింది. తోవంతా మావాళ్లెంతోమంది కనిపించారు. రంగురంగుల్లో, రకరకాల సైజుల్లో, చిత్ర విచిత్రమైన డిజైన్లలో.. బాగుంది.. ఇలా చినుకుల్లో, వర్షంలో తడవడం నాకెంత ఇష్టమో. నిజానికి మేమున్నదే మేం తడిసి, మనిషిని తడవకుండా ఉంచడానికి కదా. బస్‌స్టాప్ వచ్చేసింది. షెల్టర్‍లో జనం బాగా ఉండటంతో వర్ష ఇవతలగానే నుంచుంది.

అంతలో వెనక షాపులోంచి పాట వినిపించింది.. ‘ప్యార్ హువా.. ఇకరార్ హువా హై.. ప్యార్ సే ఫిర్ క్యోం డర్తా హై దిల్..’ ఆఁ ఈ పాట ఓసారి ఇంట్లో టీవీలో చూశాను. హీరో, హీరోయిన్లు గొడుగు పరస్పరం పట్టుకుంటూ ఆ పాట పాడతారు. శ్రీ ఫోర్‌ట్వంటీ సినిమాలో పాటట.. వరుణేశ్వర్రావు గారు చెప్పారు.. ‘అబ్బో ఆ రోజుల్లో రాజ్ కపూర్ సినిమాలు తెగ చూసేవాడిని,’ అని. ఇంతలో బస్ వచ్చేసింది. వర్ష నన్ను ముడిచేసి బస్కెక్కింది. లోపల కొంతమంది తడిసిపోయి ఉన్నారు. ‘ఇవాళ గొడుగు తెచ్చుకుందామని అనుకుని హడావిడిలో మరిచి పోయాను’ అందొకామె, చీర చెరుగుతో ముఖం తుడుచుకుంటూ. వర్ష ఇయర్‌ఫోన్స్ తగిలించుకుని మొబైల్‌లో పాటలు వింటోంది. నేను ఆలోచనలో పడ్డాను. కిందటేడు అనుకుంటా వర్ష వాళ్లు ఒక పెళ్లికి వెళ్లారు. ఆరోజు కూడా పెద్ద వాన. మేం వెళ్ళేసరికి అక్కడ అదేమిటి, ఆఁ కాశీయాత్ర ఘట్టం జరుగుతోంది. పెళ్లికొడుకు ఒక చేతిలో గొడుగు, మరోచేతిలో కర్ర, కాళ్లకు పాంకోళ్లు ధరించి సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు వెళ్తున్నానని బయల్దేరాడు. అంతా సరదాగా చూస్తున్నారు. అంతలో బావమరిది వెళ్లి, ‘మీరు కాశీ యాత్రకు వెళ్లకండి. మాచెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాం రండి బావగారూ’ అంటూ బతిమాలాడు. పెళ్లికొడుకు నవ్వుతూ వెనుదిరిగాడు. తెలుగువారి సంప్రదాయ పెళ్లిలో గొడుగు, అందులోనూ సరికొత్త గొడుగు తప్పక ఉండాల్సిందే అని తెలిసి గర్వపడ్డాను. అన్నట్లు వర్ష అన్న కొడుకు బబ్లూ ఓ రోజు దశావతారాల పాఠం చదివాడు. ఆ పుస్తకంలో అవతారాల బొమ్మలు ఎంచక్కని రంగుల్లో ఎంత బాగున్నాయో. అందులో ముఖ్యంగా నన్ను ఆకట్టుకుంది వామనావతారం. ఎందుకంటే వామనుడి తలపై నేనున్నాను.. అదే, గొడుగు ఉంది. మరో సంగతి గుర్తుకొస్తోంది. ఏటా వినాయక చవితి పండుగకు వరుణేశ్వరరావుగారు మట్టి వినాయకుడితో పాటు ఓ చక్కని, మెరిసే గొడుగు కూడా కొనుక్కొచ్చి వినాయకుడికి అలంకరిస్తుంటారు. అంతెందుకు, నిత్యజీవితంలో కూడా ఆయన పూజలో ‘ఛత్రం ఆచ్ఛాదయామి’ అంటుంటారు. ఛత్రం అంటే గొడుగని, దేవుడికి చేసే ఉపచర్యల్లో అది కూడా ఒకటని బబ్లూకి ఒకసారి వివరించి చెప్పారు. అరె, స్టాప్ వచ్చినట్లుంది. వర్ష బస్సు దిగేసింది.

రోడ్డంతా నీళ్లు ఏరులై పారుతున్నాయి. ఇంకా జల్లు పడుతూనే ఉంది. ఓ పిల్ల చేతిలోని గొడుగు ఎలా పడిపోయిందో నీళ్లలో పడి కొట్టుకుపోతుంటే ఆ అమ్మాయి ‘నా గొడుగు.. నా గొడుగు’ అని అరుస్తోంది. ఒకాయన వేగంగా పరుగెత్తుకెళ్లి ఆ గొడుగునందుకుని తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు. భలేగా అనిపించింది నాకు. వర్ష ఓ పత్రిక కార్యాలయంలో పనిచేస్తోంది. లోపలకెళ్లగానే అంతా మా గొడుగులన్నిటినీ ఓ మూల ఆరబెట్టారు. అందరూ వాన.. గొడుగుల గురించిన ముచ్చట్లే. అంతలో ఒకామె ‘అబ్బ! ఈ వాతావరణంలో కాఫీ తాగితే బాగుంటుందికదా’ అంటూ అటెండర్‌ను పిలిచి కాఫీ తెమ్మని చెప్పింది. అతను ‘గొడుగు ఇస్తే పోతాను’ అన్నాడు. ఆమె ‘అదుగో! ఆఁ లైట్ బ్లూ కలర్ గొడుగు నాదే. పట్టుకెళ్లు’ అంది. ఆ తర్వాత అతను కాఫీ తీసుకురాగానే కాఫీ తాగుతూ మళ్లీ మాటలు మొదలు పెట్టారు. ‘హే.. ఈ వారం గొడుగుల గురించి ఓ మాంఛి ఆర్టికల్ రాస్తే ఎలా ఉంటుంది’ వర్ష అంది. ‘అదురుతుంది. అయితే విశేషంగా ఏం రాస్తావు?’ అన్నది ఇంకో ఆమె. ‘చాలా రాయొచ్చు. అసలు గొడుగు పుట్టుపూర్వోత్తరాలు నీకు తెలుసా?’ అడిగింది వర్ష. ‘తెలియదోయ్’ అందామె. ‘చెపుతా విను’ అంది వర్ష. మా గురించి కదాని నేనూ ఒళ్లంతా చెవులు చేసుకున్నా. ‘నాలుగువేల సంవత్సరాల కిందట మెసొపొటేమియాలో గొడుగు వాడకం మొదలైనట్లు చరిత్ర చెపుతోంది. అయితే వారు ఎండకోసమే ఎక్కువగా గొడుగు వాడేవాళ్లుట. ఎందుకంటే అక్కడ వానలకంటే ఎండలే తీవ్రంగా బాధించేవట. మొదట్లో తాటి ఆకులతో, నెమలి ఈకలు మొదలైన వాటితో గొడుగులను తయారు చేసేవారు. ఆ కాలంలో ఉన్నత వర్గాల ప్రజలు మాత్రమే గొడుగుల్ని వాడేవారు. చైనాలో కూడా ఆకులు, ఈకలతో గొడుగులను తయారు చేసేవారు. ఇక ఇంగ్లీషులో వాడే ‘అంబ్రెల్లా’ పదం ‘అంబ్రా’ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందట. అంబ్రా అంటే నీడ అని అర్థం. తర్వాత కాలంలో గొడుగుల తయారీలో ఎన్నో మార్పులు వచ్చాయి. రకరకాల వస్త్రాలతో గొడుగుల తయారీ మొదలైంది. ఫ్యాషన్లకు పుట్టినిళ్లయిన ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్లలో గొడుగు ఫ్యాషన్‌లో భాగమైంది. మొదట్లో వీటిని కేవలం మహిళలు మాత్రమే వాడేవారు. పద్దెనిమిదవ శతాబ్దిలో జొనాస్‌హాన్ వే అనే ఆయన గొడుగు వాడిన తొలి పురుషుడిగా పేరొందాడు. క్రమంగా బహుళ ప్రయోజనాల గొడుగుల తయారీ మొదలైంది. గొడుగులో లైటు, గడియారం వంటి ప్రత్యేకతలతో రూపొందించారు. ముడిచే వీలుండే గొడుగును హాన్స్‌హాఫ్ట్ అనే ఆయన ఇరవయ్యవ శతాబ్దిలో తొలిసారిగా తయారు చేశాడు. ఆ పైన పారదర్శక (ట్రాన్సపరంట్) రకాలు, పాకెట్ సైజ్ గొడుగులు, వాకింగ్ స్టిక్ గొడుగులు ఇలా రక రకాల గొడుగులొచ్చాయి. వానచుక్కలు వెంటనే కిందకు జారేలా టెఫ్లాన్ కోటింగ్ చేర్చడంతో ఎక్కువ సౌకర్యవంతంగా రూపొందాయి. వాటర్ ప్రూఫ్ గొడుగులను తయారు చేసిన తొలిదేశం చైనా. ఇలా చాలా విశేషాలు ఉన్నాయిలే. అవన్నీ ఆర్టికల్‌లో చదువుకోండి’ అంది వర్ష.

‘ఆకట్టుకునేలా మాట్లాడటం, చదివించేలా రాయడంలో నువ్వు బెస్ట్ వర్షా’ మెచ్చుకుంది, ఏం రాస్తావని అడిగినామె. వాళ్లంతా పని ప్రారంభించారు. కొద్ది సేపటికి ఓ పెద్దాయన వచ్చాడు.. ‘ఏంటీ ఇవాళ గొడుగుల పండగా?” అన్నాడు మావైపు చూస్తూ, నవ్వుతూ. ‘వానొస్తే అంతేకదండీ’ అందొకామె. నేను గొడుగుల పండగని సరదాగా అన్నా, నిజంగా కొన్ని దేశాల్లో ‘అంబ్రెల్లా ఫెస్టివల్స్’ జరుగుతాయి’ అన్నాడు సీట్లో బైరాయిస్తూ. ‘ఎక్కడ సార్’ అందొకామె ఆసక్తిగా చూస్తూ. తన ఆర్టికల్ క్కూడా పనికొస్తుందనుకుంది కాబోలు వర్ష కూడా ఆసక్తిగా ఆయన వైపు చూసింది. ‘థాయ్‌లాండ్‌లో బొసాంగ్ అంబ్రెల్లా విలేజ్ అని ఒక ఊరుంది. అక్కడ గొడుగులను తయారుచేసే కళాకారులు హాండ్‌మేడ్ పేపర్‌తో గొడుగుల్ని తయారుచేస్తారు. వాళ్లు ఏటా గొడుగుల పండుగ జరుపుతారు. ఆ గొడుగులు ఆయిల్ కోటింగ్, చక్కని పూల డిజైన్లతో ఉంటాయి. ఆ ఫెస్టివల్ రోజుల్లో అక్కడంతా సందడే సందడి. అలాగే పోర్చుగల్ లోని అగ్వేడా టౌన్‌లో కూడా కొన్నేళ్లుగా గొడుగుల పండుగ జరుపుతున్నారు. రంగు రంగుల గొడుగుల్ని ఆ ప్రాంతమంతా వేలాడదీస్తారు. ఈ ఫెస్టివల్ ద్వారా తమ సంస్కృతి, కళలు మరింత ప్రచారం పొందుతాయని వారి ఉద్దేశం. ఆ రంగురంగుల గొడుగులకింద అలా నడుస్తూ వెళ్లడం అద్భుతమైన అనుభవమని యాత్రికులెందరో తమ కామెంట్లలో రాశారు’ అంటుండగానే ఆయనకేదో ఫోన్ రావడంతో లేచివెళ్లాడు. ‘బాగుంది’ అనుకుంటూ అంతా మళ్లీ పనిలో తలదూర్చారు.

‘మా గొడుగులగురించి ఇవాళ ఎన్ని విషయాలు తెలిశాయో’ అనుకున్నాను. మరో విషయం గుర్తుకొస్తోంది.. ఒకరోజు వరుణేశ్వరరావుగారు ఆఫీసులో ఒకతని గురించి చెపుతూ ‘ఏ ఎండకా గొడుగు పట్టే రకం’ అన్నారు. ‘అంటే ఏంటి తాతా’ అడిగాడు బబ్లూ. నాకు కలిగిన సందేహాన్నే బబ్లూ అడగడంతో సంతోషించా. ‘అంటే ఎవరి వల్ల తమకు లాభం ఉంటే వారికి తగ్గట్టుగా నిలకడ తప్పి ప్రవర్తించడమన్నమాట’ అన్నారు. అన్నట్లు బజార్లో చాలాచోట్ల రంగు రంగుల పెద్ద గొడుగుల కింద చిన్న వ్యాపారస్థులు తమ వ్యాపారం చేయడం చూశాను. అలాగే హెూటళ్ల ఆవరణలో సైతం పెద్ద పెద్ద గొడుగుల కింద సీట్ల ఏర్పాటు కూడా చూశాను. ఆమధ్య టీవీలో దేవుడి ఊరేగింపు చూశా. రథం దగ్గర ఇరువైపుల కళాత్మకంగా, ప్రత్యేకరీతిలో తయారుచేసిన గొడుగులను పట్టుకు నిల్చోవడం చూశాను. ఆకర్షణీయమైన రంగురంగుల సిల్క్ వస్త్రాలతో ఆ గొడుగులు తయారయ్యాయి. మధ్యలోని కర్రకు కూడా చక్కని జరీ అంచులున్న సిల్క్ వస్త్రాన్ని చుట్టారు. గొడుగు చుట్టూ వరుసగా ముత్యాల బారులు వేలాడుతున్నాయి. అన్నట్లు ఆమధ్య ఓ బీచ్‌ను కూడా టీవీ వారు చూపించారు. అక్కడ పెద్ద పెద్ద గొడుగులకింద బైఠాయించి స్నాక్స్ తింటూ, డ్రింక్స్ తాగుతూ సముద్రపు అందాలను వీక్షిస్తూ, వినోదిస్తున్న వారిని చూశాను. మా గొడుగుల్లో ఎంత వైవిధ్యమో అనుకుని అబ్బురపడ్డాను.

లంచ్ సమయం అయినట్లుంది. అంతా లేచారు. లంచ్ బాక్స్‌లు తెరిచే ముందే ‘మళ్లీ గొడుగులు మరిచిపోతాం’ అనుకుంటూ గొడుగులు తమ తమ బ్యాగుల్లోకి తరలించారు. నేను మళ్లీ వర్ష బ్యాగులోకి చేరాను. వాళ్లు తింటూ మాట్లాడుకుంటున్నారు. ‘ఈ గొడుగులు ఆయుధాలుగా ఉపయోగపడతాయి తెలుసా?’ అంది ఒకామె. ‘నువ్వెప్పుడన్నా వాడావా ఏమిటి?’ అడిగింది ఇంకొకామె. ‘అవును. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకసారి ఇంటికొస్తుంటే ఎవడో వెధవ నా వెనకే నడుస్తూ బూతు పాటేదో పాడటం మొదలు పెట్టాడు. ఓ నిముషం చూసి గిరుక్కున వెనక్కు తిరిగి గొడుగుతో ఒక్కటిచ్చా. అంతే! బాబోయ్ అంటూ వాడు పరుగో పరుగు’ చెప్పిందామె. ‘అందుకేనా నీ చేతిలో ఎప్పుడూ గొడుగుండేది’ మరో ఆమె నవ్వింది. ‘మా గొడుగులు ఈ రకంగా కూడా సేవలందిస్తున్నాయన్నమాట’ అనుకున్నాను. అంతా మళ్లీ సీట్లలో చేరారు. వర్ష గొడుగుల మీద ఆర్టికల్‌ను టైప్ చేసింది. ఫొటోలు వెతికి, చక్కని ఫొటోలు ఎంపికచేసుకుంది. మావాళ్ల ఫొటోలు ఎంత బాగున్నాయో అనుకున్నాను. చక్కగా పేజీ తయారు చేసింది. చూస్తుండగానే టైమ్ అయిపోయింది. వర్ష లేచింది. ఇంటి కెళ్లగానే మావాళ్లందరూ ఉన్నారా అని చూశాను. ఎందుకంటే ఒక సారి బబ్లూ పట్టుకెళ్లిన గొడుగును ఎవరో దొంగిలించారట. దాంతో మా నేస్తం గొడుగు ఏ ఇంటికి చేరిందో, ఈ మానవులకు ఇదేం పాడు బుద్ధే అని ఎంతో బాధపడ్డాం. అంతా కనిపించడంతో, చూపు మరల్చాను.. బబ్లూ, వరుణేశ్వరరావుగారి దగ్గర కూర్చున్నాడు.

‘ఇవాళ స్కూల్లో ఏం చెప్పారా?’ అడిగారు. ‘ఛత్రపతి శివాజీ గురించి చెప్పారు తాతా. శివాజీ పట్టాభిషేక సందర్భంలో తన పేరుకు ముందు ఛత్రపతి అని చేర్చుకున్నారట. ఛత్రపతి అంటే రక్షకుడని.. ప్రజలకు ఒక గొడుగులాగా రక్షణగా ఉండాలనే ఉద్దేశంతో ఛత్రపతి అని పెట్టుకున్నారని చెప్పారు టీచర్’ అన్నాడు. ‘మంచి విషయం చెప్పాలా బబ్లూ’ అన్నారు తాతగారు. ‘ఒరేయ్ అన్నటు నా చిన్నప్పుడు బందరులో మేం గొడుగు పేటలో ఉండేవాళ్లం’ మరో విశేషం చెప్పారు. ‘భలేగా ఉంది’ అన్నాడు బబ్లూ. నేనూ అదే అనుకున్నా. ఆ తర్వాత భోజనాలు చేయడం మొదలు పెట్టారు. మాటలు మొదలయ్యాయి. వర్ష వాళ్లమ్మ చెపుతోంది, రంగనాథం బాబాయ్‌ని పిల్లలెవరూ పట్టించుకోవడం లేదని, పెద్దవయసులో ఆయనకు రక్షణ లేకుండా పోయిందని చెపుతుంటే, అంతా అయ్యో! అంటున్నారు. పాపం తల్లిదండ్రులు పిల్లలకు గొడుగుల్లాగా రక్షణనిస్తూ పెంచుతారు. కానీ పిల్లలు పెద్దయ్యాక అది మరిచిపోయి ప్రవర్తిస్తుంటారు. నా మాట వినిపించేట్లయితే ఈ మనుషులకు చెప్పాలనిపిస్తుంది.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పిల్లలు గొడుగుల్లాగా నిలబడాలని, నిస్సహాయులకు బలవంతులు, సంపన్నులు గొడుగులుగా రక్షణనివ్వాలని.. పాలకులు, ప్రజలకు గొడుగులుగా మారాలని.. భోజనాలయిపోయినట్లున్నాయి.

అంతా నిద్రకుపక్రమించారు.

నేనూ ఆలోచనలతో అలిసిపోయానేమో విశ్రాంతిని వరించా.

Exit mobile version