అన్నింట అంతరాత్మ-7: పాద సేవకుడిని,, పాదరక్షను నేను!

3
2

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం చెప్పు అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]”ఇం[/dropcap]కా ఎన్నాళ్లు ఆ పాత చెప్పులు వేసుకు తిరుగుతారు, ఈ రోజైనా కొత్త వాటికి ప్రారంభోత్సవం చేయండి.. కొనుక్కున్నది వాడుకోవడానికా, దాచుకోవడానికా” మీనాక్షమ్మ మాటలకు నాకు భలే సంతోషం కలిగింది. ఇప్పుడైనా రావుగారు ఆమె మాట వింటే బాగుండు. ఆ పాదుకా ఫుట్‌వేర్ షెల్స్ లోని పై అరలో కొంతకాలం ఉన్నా.. ఆ పైన రావుగారు వచ్చి మెచ్చడంతో ఇంక నాకు మోక్షం వచ్చింది కదా అనుకున్నాను. కానీ నా సంతోషం తాత్కాలికమే అయింది.. రావుగారింటికి రాగానే “ఇప్పుడున్నవి గట్టిగానే ఉన్నాయి. కొంతకాలం పాత వాటితోనే కాలక్షేపం చేస్తా” అంటూ నేనున్న బాక్స్‌ను భద్రంగా షెల్ఫ్‌లో పెట్టడంతో నా సంతోషం కాస్తా ఆవిరయిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ నా ప్రస్తావన.. ఏమంటారో అని చెవులు రిక్కించా. రావుగారు ఏ కళనున్నారో “అలాగేలే..” అన్నారు.

రోజూ ఈ ఇంట్లో ఉన్న మిగతా పాదరక్షలన్నీ చకచకా బయటకు వెళ్లిపోతుంటే నాకు చాలా అసూయగా ఉండేది. అయితే ఇంట్లో నాకు తోడుగా మరికొన్ని పాదరక్షలున్నాయి. అయితే అవన్నీ కొన్నిసార్లు వాడినవే. ఈ ఇంట్లో మేఘన, అరవిందలకు చాలా జతల పాదరక్షలున్నాయి. వేసుకునే డ్రెస్‌కు మేచ్ అయ్యేట్లుగా పాదరక్షలు మార్చేస్తూ ఉంటారు. వానొస్తే ఒక రకం, చలికాలం బూట్లు, ఫంక్షన్లయితే ప్రత్యేక రకాలు.. ఇలా మారుస్తుంటారు. ఏమయితేనేం.. ఈరోజు రావుగారు నన్ను ధరించారు. ఆయన అడుగులు వేస్తుంటే నేనే వేస్తున్నట్లు పొంగిపోయా. ఇంక నాలో సంతోషంతో పాటు ఒకింత గర్వం కూడా మొదలయింది. ‘అసలు మేమే లేకపోతే ఈ మనుషుల పాదాలు ఎలా ఉండేవో.. ఆదిమ మానవుడు ఆ కష్టాలన్నీ భరించాడుగా.. తర్వాత తర్వాత మా (పాదరక్షల) తయారీ ఆలోచన చేశాడు’. రావుగారు బస్సెక్కా రు. ఎంతమందో, ఎన్ని రకాల పాదరక్షలో.. మావాళ్లవైపు పరకాయించి చూశాను. కొన్నింటికి బొటనవేలు పట్టే ఉంగరం లాంటి డిజైన్ ఉంది. కొన్నింటికి ఎత్తు మడమలు. ఇంకొన్నింటికి బెల్ట్, తోలువి, రబ్బరువి, ప్లాస్టిక్‌వి, ఫెదర్ లైట్‌వి, మెత్తటి స్లిప్పర్లు, బూట్లు.. ఆడవాళ్లవి కొన్ని పూలు, పూసలు, చెమ్కీ డిజైన్లతో ఉన్నాయి. పిల్లలవయితే వాళ్లు అడుగు కదపగానే కీ కీస్ మంటూ ధ్వని చేసేవిగాను, మరికొన్ని లైట్లు వెలిగేవిగాను ఉన్నాయి. ఇవన్నీ కూడా ‘పాదుకా ఫుట్‌వేర్’లో ఉండేవే. దాంతో పాత మిత్రులను చూసిన అనుభూతి కలిగింది. ఇవే కాదు, పాదరక్షల్లో అథ్లెట్లకు, పర్వతారోహకులకు, స్కేటింగ్ చేసేవారికి, బ్యాలే డ్యాన్సింగ్‌కు ఇలా వేర్వేరు అవసరాలకు తగ్గట్లుగా వేర్వేరు రకాలున్నాయి. అలాగే ఆరోగ్య రీత్యా డయాబెటిక్ షూస్ వంటివి, పాదాలు ఫ్లాట్‌గా ఉండేవారికి ప్రత్యేకరకాలు కూడా ఉన్నాయి. రావుగారు సీట్లో కూర్చున్నారు. ఆయన ఫోన్ మాట్లాడుకుంటుంటే నేను తెలియకుండానే ఆలోచనల్లోకి జారిపోయాను.

‘ఆఁ అన్నట్లు పాదరక్షలను చెక్కతోనూ తయారుచేస్తారు. వాటిని పాంకోళ్లు అంటారట. మొన్నరావుగారే మనవడు సిద్ధార్థ్‌తో చెపుతుంటే విని ఎన్నో విశేషాలు తెలుసుకున్నాను.. అలనాడు శ్రీరాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు వాటినే ధరించాడని, ఆ తర్వాత భరతుడు వచ్చి శ్రీరాముణ్ని అయోధ్యకు తిరిగి వచ్చి, రాజ్యమేలుకోమంటే, శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకు భంగం రానీయనని, అందువల్ల పధ్నాలుగేళ్ల వనవాసం పూర్తి కానిదే అయోధ్యకు తిరిగిరాలేనని చెప్పడంతో, భరతుడు కనీసం పాదుకలనైనా ప్రసాదించమని పట్టుబట్టాడట. అలా శ్రీరాముడి పాదుకలను తెచ్చి, సింహాసనంపై ఉంచి, భరతుడు పాలనా బాధ్యతలు నిర్వహించాడు. సింహాసనాన్ని అధిష్టించిన ఘనత మా జాతికి దక్కిందని తెలిసి నా గుండె గర్వంతో ఉప్పొంగింది. ‘పాదుకా పట్టాభిషేకం’ పేరుతో తెలుగు సినిమా కూడా వచ్చిందని చెప్పారు రావుగారు.

నేనిలా అనుకుంటుండగానే రావు గారు దిగాల్సిన స్టాప్ రావడం, ఆయన లేచి కాళ్లకు పనిచెప్పడంతో మళ్లీ నా విధి మొదలైంది. ఇక ఆఫీసుకు చేరి, సెక్షన్లలో అడుగు పెట్టారో లేదో నవ్వులు వినిపించాయి. “ఏంటోయ్ అంతగా నవ్వుతున్నారు, మన జోగారావు ఏమైనా జోకాడా ఏమిటి?” అడిగారు రావుగారు. “అది కాద్సార్.. మన గందరగోళం గంభీరరావుగారు తొందరలో ఒక చెప్పు తనది, మరో చెప్పు వాళ్లావిడది వేసుకొచ్చారు” చెప్పాడు. రావుగారు కూడా నవ్వేసి “బాగుంది..” అంటుండగానే ఆఫీసర్ బూట్ల టకటక విని అంతా నిశ్శబ్దమయి పోయారు. ‘చెప్పులను కూడా ఆడ, మగ తేడాలతో తయారుచేయడం ఎప్పటినుంచో వాడుకలో ఉందని, అయితే ఈ మధ్య స్త్రీవాదులు అసలు చెప్పుల్లో కూడా ఆ వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నార’ని ఓనాటి సాయంకాలం కబుర్లలో మేఘన, అరవిందతో అనడం నాకు గుర్తుకొచ్చింది. ఇంకో విషయమేమిటంటే ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అని అంటారు కానీ మా విషయంలో అది అస్సలు కుదరదు. కుడి కుడే, ఎడమ ఎడమే. లంచ్ టైమ్ అయినట్లుంది. వీరభోజేశ్వరరావు (ఇందాక ఎవరో పిలుస్తుంటే ఆయన పేరు తెలిసింది) లేచి “కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయ్, త్వరగా లేవండి” అంటూ లంచ్ బాక్స్ బయటకు తీశాడు. అది వినగానే ఆ మధ్య ఇంట్లో మీనాక్షమ్మ చెప్పును ఎలుక కొరికేసిన సంగతి గుర్తొచ్చింది. అంతలో “ఏం, టిఫిన్ చేయలేదా?” అడిగాడు ఆరానందం. “ఆఁ ఉప్మా చేసింది. అదేమంటే దోశెలవీ చేయడానికి గైండర్ చెడిపోయింది. బాగుచేయించమంటే వినరు కానీ ఇప్పుడు మాత్రం రుచులు కావాలా అంటూ ఎదురు క్లాసు పీకింది”. “పాపం.. ఆమె చెప్పింది కూడా నిజమేగా” అన్నాడు జాలి జనార్ధన్. “సర్లేవోయ్. ఆ పనిచేసినా ఇంకోటి వచ్చిపడుతునే ఉంటుంది. ఇల్లాలి పోరుకి అంతమేం ఉండదు.. అందుకేగదా మన వేమన గారు.. చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ, ఇంటిలోన పోరు ఇంతిత గాదయా.. అన్నాడు”, అంటూ సమర్థించుకున్నాడు

ఆ పద్యమేమోగానీ నన్ను మొదటి పంక్తి ఆకట్టుకుంది. చెప్పులో రాయి దూరితే మనిషి తనకు బాధ అనుకుంటాడేగానీ మరి నేనో… రాయైనా, ముల్లయినా, మేకైనా, రేకు ముక్కైనా మౌనంగా భరించాల్సిందే. “అన్నట్లు కొత్త చెప్పులు కొనుక్కోవాలోయ్, మొన్న గుడికెళితే పోయాయి. ఇంట్లో వాడే స్లిప్పర్లు వేసుకు తిరుగుతున్నా” వాపోయాడు భద్రం. “ఎలా పోయాయి, చెప్పుల స్టాండు వాడి దగ్గర పెట్టలేదా?” అడిగాడు ఆరానందం.. ఎలాగైనా భద్రం పిసినారి అన్న విషయం బహిరంగం చేయాలని. “పెడదామనే అనుకున్నా, కానీ అక్కడ మనిషెవరూ కనబడకపోతే, ఎదురుచూసే ఓపికలేక ఓ పక్కన విడిచాను. అంతే.. మళ్లీ వచ్చేసరికి మాయం. ‘దొంగలున్నారు జాగ్రత్త’ బోర్డు అప్పుడు కనిపించి, వెక్కిరించింది. కొత్త చెప్పులు, కొని రెండు వారాలు కూడా కాలేదు” విచారంగా అన్నాడు భద్రం. “అయినగాని అప్పుడు దేవుని మీద ఏం మనసు నిలుస్తది. అందుకే అంటరుకదా, చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అని.. జరభద్రం గుండాలె గురూ” నవ్వాడు నాగేందర్. లంచ్ అయిపోయి అంతా ఎవరి సీట్లలో వారు బైఠాయించారు. అంతా ఎవరిపనిలో వారు.. నేనేమో ఆలోచనల్లో అలా అలా..

మొన్న రావుగారి మనవరాలు సిండ్రెల్లా కథ చదివింది. అందులో సిండ్రెల్లా రాజభవనం వద్ద పారేసుకున్న ఒక పాదరక్ష సాయంతోనే రాజకుమారుడు సిండ్రెల్లాను వెదికి గుర్తించి వివాహం చేసుకున్నాడు. అలా పాదరక్ష సిండ్రెల్లాకు రాజకుమారుడితో వివాహయోగాన్ని కల్పించింది. ఒకసారి నేను పాదుకా షాపులో ఉండగానే అంటే ఇంకా రావుగారికి అమ్ముడుపోక ముందర షాపుకు ఒక కుటుంబం వచ్చింది. వాళ్ల పాపకు చెప్పులు చూపించమన్నారు. షాపువారు ఎన్నోరకాలు చూపించినా ఆ పాపకు వాళ్ల అమ్మకోసం చూపించిన జతే నచ్చింది. అది తన పాదానికి ఎక్కువైనంత మేర కట్ చేసి ఇమ్మంటుంది. అది విని మొదట అంతా సరదాగా నవ్వారు. అలా కుదరదని నచ్చచెప్పబోయారు. కానీ ఆ పాప ఒప్పుకోలేదు. చాలా సేపు గొడవ చేసింది. చివరకు వాళ్లమ్మ “ఇంటికెళ్లాక నేనే కట్ చేసి ఇస్తా, సరేనా” అని పాపకు చెప్పి, ఆ జత కొని తీసుకెళ్లింది. ‘భలే పాప’ అనుకున్నాను. అన్నట్లు పొట్టి వాళ్లను కాస్తంత పొడుగ్గా చూపించడానికి మా పాదరక్షలే శరణ్యం. హైహీల్స్ వేసుకుంటే పొడుగ్గా ఉండటమేకాదు, స్టయిల్‌గా కూడా ఉంటుంది. వీటి వాడకం పదహారో శతాబ్దంలో, ఇంగ్లండ్‌లో మొదలైందని ఓ సారి మేఘన చెపుతుంటే విన్నాను. ఇంతలో హడావుడి శబ్దాలు వినిపించాయి. చూస్తే అంతా పని ముగించి బ్యాగులందుకుని లేస్తున్నారు. అంటే ఆఫీసు టైమయిపోయిందన్నమాట. రావుగారు కూడా లేచారు. బస్సు తొందరగానే దొరికింది. ఎవరో అరుస్తున్నారు “అబ్బ! బూటుకాలితో తొక్కుతున్నావ్, మనిషివేనా”, “ఎవరయినా కావాలని తొక్కుతారా, తొందరలో తొక్కి ఉండొచ్చు. నువ్వు మనిషివయితే అర్థం చేసుకోవాలి” ఆ ఘాటు జవాబుకు అవతలి ఆయన మరి కిమ్మనలేదు.

ఒకాయన కాళ్లకు బాటా చెప్పులు కనిపించాయి. మంచి బ్రాండుట.. రావుగారింట్లో చెప్పుకుంటుంటే విన్నాను. రేటేమో ఎన్ని రూపాయిలయినా చివర తొంభై తొమ్మిది పైసలు తప్పనిసరి ఉంటుందిట. “అలా తొంభైతొమ్మిది పైసలు ఎందుకో. ఇంకో రూపాయి అంటే ఎవడు కాదంటాడు. ఆ పైసా ఎట్లాగు ఇచ్చేదిలేదు” అని రావుగారబ్బాయి అన్నాడు. ఇంతలో బస్సులో గొడవ మొదలైంది. ఎవరో దుష్టుడు ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడట. ఆ అమ్మాయి “చెప్పు తీసుకు కొడతా” అంటూ అపర కాళి అయింది. ఆ అమ్మాయిని సెభాష్ అనుకున్నా మనసులో. అయితే తప్పు చేసిన వాడిని దండించడం సబబే కానీ చెప్పు తీసుకు కొడతా అని ఎందుకంటారో. కర్ర తీసుకు కొడితే అవమానం కాదుగానీ చెప్పు తీసుకు కొడితేనే ఎక్కువ అవమానం అనే అర్థం వచ్చేట్లుగా మాట్లాడుతారు. అంటే అది నా తక్కువతనమనేగా. ఎందుకలా? అలాగే ‘చెప్పు తెగుద్ది’ అని హెచ్చరిస్తుంటారు. రాజకీయ సభల్లో కొన్నిసార్లు ప్రతిపక్షం వారి ప్రేరణ పై జనం నాయకుల మీదకు చెప్పులు విసరడం కద్దు. ఆ పరిస్థితులలో వారికి కోపం రావడం సహజం. కానీ కొంతమంది కోపం తెచ్చుకోకుండా ‘ఒకటి విసిరితే ఏం లాభం, రెండోది కూడా విసిరితే ఉపయోగించే వీలుంటుంది’ అని ఆ చర్యను పట్టించుకోరు. అవమానించే క్రియల్లో మెడలో చెప్పుల దండ వేయడం కూడా ఒకటి. కటౌట్లకు ఆ మర్యాద చేయడం కద్దు. ఇంతలో స్టాప్ రావడంతో రావుగారు బస్ దిగేశారు.

ఇంటికి చేరడంతో నా స్థానంలో నేను సెటిలయిపోయాను. పక్కనే రావుగారి అబ్బాయి బూట్లు, మేజోళ్లు. అవును జతగానే ఉపయోగపడగల పాదరక్షలకు మరో జోడి మేజోళ్లు. చలికాలమయితే చెప్పులు వేసుకునేవారు కూడా మేజోళ్లు వేసుకోవడం పరిపాటి. రావుగారి మనవరాలు ఆరునెలల పాప. ఆ పాపకు రంగు రంగుల మేజోళ్లు.. ఆ చిన్ని పాదాలకు ఎంత ముదొస్తుంటాయో. అన్నట్లు మా చెప్పుల రకాల్లో ఆక్యుప్రెషర్ రకాలు ప్రత్యేకించి ఉంటాయి. ఒకప్పుడు చెప్పులనేవి మనిషికో జత మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు. ప్రతి ఇంటా చెప్పుల స్టాండ్ తప్పనిసరిగా ఉంటోంది. ఒక్కో వ్యక్తికి కనీసం మూడు రకాల పాదరక్షలుంటున్నాయి. పిల్లలకు బడి యూనిఫామ్‌లో పాటు నల్ల బూట్లు, శనివారాల్లో తెలుపు కాన్వాస్ షూస్ మామూలే. ఇకవారు విడిగా వాడుకునే పాదరక్షలు వేరే ఉండాల్సిందే.

చెప్పు చెప్పేదేమిటి? అని అనుకోకుండా వినేట్లయితే ఈ మనుషులకు ఓ మాట చెప్పాలనుంది. ఇంట్లోకి, బయటకు, పార్టీలకు అంటూ ఇన్ని రకాలు వాడతారు. కానీ ఎంతమంది పేదలు పాదరక్షలు లేకుండా తిరుగుతున్నారో ఆలోచించమని.. అలాంటివారికి ఓ జత చెప్పుల దానం చేసి తమ సహృదయతను చాటుకుంటే బాగుంటుందని.. అలాగే కొంతమంది నేను కృశించి, నశించి తెగేదాకా నన్ను బాధిస్తుంటారు. పైగా నేను ఏదో రోజున తెగి విల విలలాడుతుంటే “వెధవ చెప్పు ఇప్పుడే ఈ వానలోనే తెగాలా?” అంటూ చెప్పులు కుట్టేవారికోసం దిక్కులు వెతుకుతారు. దానికి బదులు నేను బలహీనపడినపుడే నాకు సర్జరీ చేయించి.. అదే కుట్టించవచ్చుకదా. కొంతమందేమో నేను తెగగానే క్రెడిట్ కార్డ్ భరోసా చూసుకుని వెంటనే నన్ను విసిరికొట్టి, దగ్గర్లోని చెప్పుల షాపుకు నడుస్తారు. అంతకాలం నేను చేసిన సేవ క్షణంలో విస్మరిస్తారు. మమ్మల్ని కుడుతూ, మాకు పాలిష్ చేస్తూ ఎందరో జీవనం వెళ్లదీస్తున్నారు. మా జాతి వారికి జీవనాధారంగా ఉన్నందుకు నాకెంతో తృప్తిగా ఉంటుంది. ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’ ఇలాంటి పద ప్రయోగాలు విన్నప్పుడు మమ్మల్ని తక్కువ చేసినట్లు బాధ పడతాను. కొన్ని క్రిమికీటకాలను చంపడానికి నన్నే వాడతారు. ముఖ్యంగా తేలు అయితే దాన్ని చంపడానికి తప్పనిసరిగా నన్నే అందుకుంటారు. ‘కాలికింద చెప్పులా పడి ఉండు’ అని తోటి మనుషులను అనడం ఎంతో అనుచితం అనిపిస్తుంది. అణకువతో మీ పాదాలను అంటి పెట్టికుని ఉండే మమ్మల్ని, అహంకారంతో ఇతరులను కొట్టి అవమానించడానికి వాడి, కించ పరచకండి అనేది నా విన్నపం.. ఇక విశ్రాంతి తీసుకోవాలి, మళ్లీ తెల్లవారితే డ్యూటీ ఉంది కదా.. అనుకుంటూ నాకు నేనే శుభరాత్రి చెప్పుకున్నా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here