Site icon Sanchika

అన్నింట అంతరాత్మ-8: గొడవలన్నీ వింటా.. కానీ మాటే రాని గోడను నేను!

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం గోడ అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]’అ[/dropcap]రె.. ఎంత పెద్ద కళాఖండాన్ని మోసుకొస్తున్నారో. ఏం చిత్రమో’ అది.. కవర్ ఉండటంతో కనపడటం లేదు. “అక్కడ పెట్టు.. అక్కడ పెట్టు..” లక్ష్మీపతి చెపుతుంటే డ్రైవర్ పెట్టి వెళ్లిపోయాడు. ఇంతలో భార్య భాగ్యలక్ష్మి వచ్చి “ఏంటి లక్ష్మీ అది?” అని అడిగింది. నవ్వొచ్చింది నాకు. ఆమె భర్తని ‘లక్ష్మీ’ అని పిలుస్తుంది. అతడేమో ఆమెను ‘భాగ్యం’ అని పిలుస్తాడు. “నువ్వు నన్ను లక్ష్మీ అని పిలిస్తే వినేవాళ్లు నన్ను ఆడగా పొరబడే ప్రమాదం ఉందని ఎంత చెప్పినా వినవేం” అన్నాడతను. “ఎవరేమనుకుంటే నాకేం. నాకిదే ఇష్టం. లేకపోతే ఏమండీ, బెజవాడ బండి అని ఎవరినో పిలిచినట్లు పిలవాలా? నా మొగుడు.. నా ఇష్టం” అందామె. అతడికి ఆ మాట నచ్చినట్లుంది. పైగా ఏకైక కుమార్తెగా భాగ్యాన్ని తెచ్చిన సిసలైన భాగ్యం.. “సర్లే నీ ఇష్టమే కానీ” రాజీపడిపోయాడు.

“ఇంతకూ అది ఏం చిత్రమో చెప్పనే లేదు” అందామె. నేనూ అదే సస్పెన్స్‌లో ఉన్నానేమో చెవులు రిక్కించా. “‘గీతోపదేశం’. ఈ మధ్య అందరిళ్లలో ఇది ఉంటోంది. అందుకే తెచ్చా” చెప్పాడతను. ‘అంటే మళ్లీ నాకు మేకులు కొడతారన్నమాట. గోడను కదాని వాళ్లిష్టమే ఇష్టం. ఏం చేస్తాను. అందునా నేను హాలు గోడను. అలంకారం అని చెప్పి నా ఒళ్లంతా మేకులు కొడుతుంటారు. గోడకూ ‘గోడు’ ఉంటుందని వాళ్లకు తెలిస్తేగా’ అనుకున్నాను. లక్ష్మీపతికి భక్తి ఎక్కువే. ఇప్పటికే లక్ష్మీదేవి, ఏడుకొండల వేంకటేశ్వరుడు, సీతా రాములు, శివపార్వతులు, మరో వైపు సాయిబాబా ఫొటోలు ఉన్నాయి. భాగ్యం అంటోంది.. “మా తాతగారి ఇంట్లో అయితే హాల్లో అలంకారంగా దుప్పి కొమ్ములుండేవి. అంతేనా.. మూడు తరాల ఫొటోలు ఉండేవి. గ్రూప్ ఫొటోలు, పిల్లల ఫొటోలు, వివాహాల ఫొటోలు.. పెద్ద పెద్ద ఫ్రేములు గోడల నిండా ఉండేవి. ఇప్పుడు గోడలకు ఫొటోలెవరూ పెట్టడం లేదు. ఫొటోలన్నీ ఆల్బమ్ లోనే. ఏదో ఒకటీ, అరా, అలా టేబుల్ పై పెట్టుకుంటున్నారు” అంది భాగ్యలక్ష్మి. “నువ్వు చెప్పింది నిజమే భాగ్యం” అన్నాడు లక్ష్మీపతి. అంతేకాదు “మనవాళ్లు గోడల మీదే అద్భుతమైన చిత్రాలు వేశారు. వాటిని ‘కుడ్యచిత్రాలు’ అంటారు. అజంతా గుహల్లోనివి కుడ్య చిత్రాలే. ఈసారి వేసవి సెలవుల్లో మనం అజంతా వెళ్లాద్దాంలే” అన్నాడు. “సరే కానీ అన్నానికి రండి” అంటూ భాగ్యం లోపలికి వెళ్లింది. లక్ష్మీపతి కూడా పక్కగదిలోకి వెళ్లాడు.

ఇంతలో కాంపౌండ్ వాల్ గోడ పిలువు వినిపించింది. “ఏంటీ” అన్నాను. “నీ పనే బాగుంది. చక్కగా సింగారిస్తారు. నేనూ ఉన్నాను, ఎందుకూ.. రోడ్డుమీద పోయే గాడిదలంతా నా మీద మూత్రాభిషేకాలు చేసిపోతుంటారు. కంపు భరించలేక చస్తున్నా” వాపోయింది. “అదేంటీ.. ఆ మధ్య డ్రైవరు ‘ఇచ్చట మూత్రము పోయరాదు’ అని రాసినట్టున్నాడుగా” అడిగాను. “ఆఁ ఏం లాభం. ఎవడో పోకిరీ వెధవ చివర ‘దు’ చెరిపేసి, మూత్రం పోసి మరీ వెళ్లాడు. అంతా నా వైపు చూడటం, నవ్వుకోవడం.. ఏం చెప్పను నా దురవస్థ. అన్నట్లు అది చూసి లక్ష్మీపతి గారు ‘దడిగాడువానసిరా’ అన్నారు. అంటే ఏమిటో నీకేమైనా తెలుసా?” అడిగింది. “అయ్యో.. అలాగా.. ఈ మనుషుల బుద్ధులంతే. బాధపడకు. దడిగాడువానసిరా అంటే రాసినవాడు గాడిద.. తిరగేసిరాస్తే అలా అవుతుందట.. లక్ష్మీపతిగారు ఓసారి కొడుక్కి చెపుతుంటే విన్నాను.” ఓదార్చాను. “ఆఁ మళ్లీ ఎన్నికలుట. అదో గొడవ. రాత్రిపూట వచ్చి నా మీదంతా జిగురుపూసి, పోస్టర్లు అతికించిపోతారు” అంది కాంపౌండు గోడ. “మొన్న లక్ష్మీపతిగారు చెపుతుంటే విన్నాను. వాళ్ల పల్లెటూళ్లో అయితే కాంపౌండు గోడను ఎన్నికల సమయంలో అద్దెకు ఇచ్చేవారట. అన్ని పార్టీల వాళ్లు అద్దె డబ్బులిచ్చేవారట. ఒకరి పోస్టరును మరొకరు చించేసి మళ్లీ అతికించడం.. ఇలా ఎన్నికలయ్యేదాకా సాగేదట. ఎన్నికలయి పోయాక మళ్లీ గోడకు కలర్ వేసే వారట” చెప్పాను. ‘హూఁ బాగుంది’ నిట్టూర్చింది కాంపౌండు గోడ. “అంతేకాదు, పెరటి గోడలకయితే పిడకలు కొట్టడం మామూలేనట. ఇప్పుడు పల్లెల్లో కూడా పిడకల తయారీ తగ్గి, గోబర్ గ్యాస్ మొదలయిందని చెప్పారు”. “నాకే అనుకున్నా.. పల్లెల్లో గోడలకూ కష్టాలున్నాయన్నమాట. సర్లే రోడ్డుమీద ఏదో గొడవ జరుగుతోంది. చూడాలి. నీకయితే రోజంతా టీవీ చూసే అవకాశం ఉంది” అంది. “ఆఁ టీవీ పెట్టినప్పుడే చూడగలను. నువ్వయితే ఎప్పుడూ చూడగలవు. పైగా నువ్వు చూసే షో ప్రత్యేకమైంది, సహజమైంది. సర్లే ముందు చూడు” అంటూ నేను నాలోకంలోకి వచ్చాను.

నా మీద బల్లి యథేచ్ఛగా విహరిస్తోంది. అంతలో ఈగ కంటపడ్డట్టుంది. ఒక్కసారిగా ముందుకు దూకి నోరు తెరిచింది. నా మీద నడవ గలిగేది ఈ బల్లి ఒక్కటే. ఈగలు, దోమలు వగైరా వాలి ఎగురుతుంటాయి. అయితే టీవీలో కార్టూన్ ఫిల్మ్ స్పైడర్ మేన్‌ను చూశాను. ఇంతలో భాగ్యలక్ష్మి వచ్చి టీవీలో ఏదో పాత సినిమా పెట్టింది. నేనూ అటే చూస్తున్నా. హీరోగారు గోడకు మధ్యలో గుండ్రంగా కన్నం కొట్టి పక్కింటి ప్రమీలతో ప్రేమ ఊసులు చెపుతున్నాడు. అంతలో ప్రమీల తల్లి వచ్చింది. వెంటనే అటు హీరో, ఇటు ప్రమీల కన్నం కనపడకుండా క్యాలెండర్ కిందకు లాగారు. భాగ్యలక్ష్మి నవ్వుతుంటే ‘ఔరా.. మేం ఇలా కూడా ఉపయోగ పడతామా’ అనుకున్నాను నేను. ఇంతలో అమ్మాయి తండ్రి, భార్యను “నీతో చెప్పినా ఒకటే, గోడతో చెప్పినా ఒకటే” అంటున్నాడు. ‘హూఁ.. ఈ మనుషులు నన్నెంత అవమానిస్తారో కదా’. అయినా మొన్న భాగ్యలక్ష్మి స్నేహితురాలు వచ్చి, తన భర్త గురించి చెపుతూ ఆయనకు ఏమన్నా ఎదురు చెప్పకూడదని, మనిషి లాగా కాకుండా ఒక గోడల్లే ఉండాలని లేకపోతే పోట్లాట తప్పదని చెప్పింది. ఏమిటో ఈ భర్తలు.. కొందరికి భార్య గోడల్లే ఉండకూడదు, కొందరికి ఉండాలి అనుకుంటుండగా భాగ్యలక్ష్మి ఛానెల్ మార్చింది. అదేదో రియాల్టీ షో. కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రశ్నల రౌండ్ మొదలయింది. “గోడమీదబొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేపోయేవారికి వడ్డించు బొమ్మా.. ఏంటది?” అడిగారు. “బార్బీ బొమ్మ.. టెడ్డీ బేర్ బొమ్మ తెలుసు కానీ, ఈ గొలుసుల బొమ్మేమిటో?” భుజాలెగరేస్తూ ఒక అమ్మాయి గట్టిగా నవ్వింది. మరో అబ్బాయేమో.. “వడ్డిస్తుందా, ఇంకా నయం వడ్డీ ఇస్తుందన్నారు కాదు” జోకాడు.. అంతా నవ్వులు.. “వచ్చేపోయేవారికే వడ్డిస్తుందట, ఇంట్లో వాళ్లు ఏం పాపం చేసుకున్నారో” ఇంకో అమ్మాయి కొత్త పాయింట్ కనుగొన్నట్లు చూసింది. మరో అతను “ఏంటో తెలీదుగానీ, అలాంటి గొలుసుల బొమ్మను బహుమతిగా మాకు ఇప్పించండి” ఇకిలిస్తూ అన్నాడు. “ఓకే.. నేనే చెప్పేస్తున్నా జవాబు. ‘తేలు’. తెలిసిందా? పాయింట్ నాకే” అంటుండగానే “తేలా? బాబోయ్. తెలీక బహుమతిగా ఇవ్వమన్నాను. ఆ మాట నేననలేదు, మీరు వినలేదు, సరేనా” అంటున్నాడు అడిగినతను. “నాకు తెలిసినంత కూడా వీళ్లకు తెలియదు. ఏమిటో ఈ సెలబ్రిటీలు” పైకే అంది భాగ్యలక్ష్మి.

ఇంతలో కొడుకు విద్యాధర్ బడినుంచి వచ్చాడు. దాంతో భాగ్యలక్ష్మి టీవీ ఆపి లేచింది. “అమ్మా! సందీప్ వాళ్లింట్లో దొంగలు పడ్డారట” అని చెపుతుండగా “అయ్యో! ఎలా వచ్చారుట విద్యా?” అడిగింది. “వెనక గోడ దూకి వచ్చారట. అది వెనక వాళ్లకు, వీళ్లకు ఉమ్మడి గోడట. వాళ్లమ్మ నగలు పట్టుకెళ్లారట” చెప్పాడు. “అమ్మా! గోడమీద పిల్లివాటం అంటే ఏమిటమ్మా? సార్ సొంత వాక్యాలు రాయమన్నారు” అడిగాడు. “ఎప్పుడైనా గోడమీద పిల్లిని చూశావా, అది దాని అవసరాన్ని బట్టి అటొకసారి, ఇటొకసారి దూకుతుంటుంది. నీకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే నేను చాక్లెటిస్తానంటే నువ్వు, నా జట్టు ఉంటానంటావు, మీనాన్న ఐస్ క్రీమ్ కొనిస్తాననగానే నాన్న జట్టుకు మారిపోతుంటావు కదా. దాన్నే గోడమీద పిల్లివాటం అంటారు. రాజకీయ నాయకులు స్వార్థంతో పార్టీలు మారటం కూడా గోడమీద పిల్లివాటమే. అలాంటి వారిని క్లుప్త భాషలో ‘గోపి’లని పిలుస్తారు. నీకు ఇంకో విషయం తెలుసా? గతంలో బడిలో పిల్లలు అల్లరి చేస్తే శిక్షగా గోడకుర్చీ వేయించేవారు” చెప్పింది. “అంటే?” అన్నాడు విద్యా. “అంటే గోడకు వీపు పూర్తిగా ఆనించి, కుర్చీలో కుర్చున్నట్లుగా కూర్చోవాలి.” “పాపంకదా” అన్నాడు విద్యా.

ఇంతలో లక్ష్మీపతి వచ్చి టీవీ ఆన్ చేశాడు. ‘గోడ కూలి ముగ్గురు మృతి.. కొందరికి గాయాలు’.. బ్రేకింగ్ న్యూస్ గట్టిగా చదివాడు లక్ష్మీపతి. వాళ్లు పోయిన మనుషుల్ని గురించి బాధ పడుతున్నారు. నాకేమో కూలిన గోడ గురించి బాధగా ఉంది. పాపం.. వానలకు నాని బలహీనపడి ఉంటుంది. ఎప్పటి గోడో ఏమిటో. మధ్య మధ్యలో మరమ్మతులు చేయంచకపోతే కూలక ఏమవుతుంది? అదేదో గోడ తప్పన్నట్లు మాట్లాడతారు ఈ మనుషులు అనుకున్నాను. అంతలో ఛానెల్ మార్చారు. ఓ ముసలాయన ఓపిక లేక కాబోలు గోడ పట్టుకు నడుస్తున్నాడు. ప్రభుత్వ ఆసరా పథకం ఎలా ఉన్నా మా జాతి మాత్రం ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ ఆసరాగా ఉంటుంది. అంతలో సినిమా యాడ్. హీరోయిన్ ఓ గోడకు కుడికాలు మడిచి ఆనించి స్టైల్‌గా నిల్చుంది. “నాన్నా.. ఎక్కడ చూసినా ఇదే పోస్టర్ బయట” విద్యా అంటుంటే, లక్ష్మీపతి “అలాగా” అన్నాడు. “అవున్నాన్నా.. చైనా గోడ చాలా పెద్దదట కదా?” అడిగాడు విద్యా. “ఉండు ఈ టీవీ ఆపేసి చెపుతా” అంటూ టీవీ తీసేసి చెప్పటం మొదలు పెట్టాడు. నేను కూడా శ్రద్ధగా వినసాగాను.

“విద్యా! చైనా మహా కుడ్యంగా దాన్ని పిలుస్తారు. దాని పొడవు ఆరువేల ఐదువందల ఎనిమిది కిలోమీటర్లు. క్రీస్తు పూర్వం ఐదు, ఆరు శతాబ్దాలలో నిర్మించిన ఈ గోడను మధ్యమధ్యలో అంటే క్రీస్తుశకం పదహారోశతాబ్దం వరకు మళ్లీ మళ్లీ నిర్మించారు. అనేక గోడలు కలిసి పెద్దగోడగా రూపొందింది. చైనా ఉత్తర సరిహద్దుల రక్షణకు ఈ గోడను నిర్మించారు. చైనా అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ మహా కుడ్యమే” చెప్పాడు లక్ష్మీపతి. ఆ మాటలు వింటూ మా జాతికే గర్వకారణమైన ఆ గోడను ఊహించుకుంటుండగా, లక్ష్మీపతి “నువ్వు బెర్లిన్ గోడ గురించి కూడా తెలుసుకోవాలి విద్యా” అన్నాడు. “బెర్లిన్ గోడా? అదేమిటో చెప్పు” అన్నాడు విద్యా. లక్ష్మీపతి చెప్పసాగాడు.

“రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ రాజధాని బెర్లిలో తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరు చేస్తూ ఓ గోడ నిర్మించారు. అదే ‘బెర్లిన్ గోడ’ గా పేరొందింది. యుద్ధంలో జర్మనీ ఓటమి పాలవడంతో తూర్పు జర్మనీ రష్యా అధిపత్యంలోకి, పశ్చిమ జర్మనీ, అమెరికా ఆధిపత్యం లోకి వెళ్లాయి. ఈ రెండింటికీ అడ్డుగా పందొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ గోడను నిర్మించారు. దీన్ని ‘ఐరన్ కర్టెన్’ అని కూడా పిలిచేవారు. పందొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన సోవియట్ యూనియన్ తూర్పు జర్మనీకి సాయం చేయలేక పోయింది. దీంతో ప్రజలు ఎదురు తిరిగి సమ్మెలు మొదలు పెట్టారు. తూర్పు జర్మనీ అధ్యక్షుడు రాజీనామా చేశాడు. ఆ నేపథ్యంలో పశ్చిమ జర్మనీకి ప్రయాణ ఆంక్షలు తొలగించారు. దాంతో తూర్పు, పశ్చిమ జర్మనీలు విలీనం కావటంతో బెర్లిన్ గోడను ప్రజలే కూల్చేయడం మొదలు పెట్టారు. ఇదొక చరిత్రాత్మక ఘటన…”

అంతలో భాగ్యలక్ష్మి వచ్చి “ఇంక భోజనానికి లేవండి..” అంది. నేను బెర్లిన్ గోడ కట్టినప్పటి ప్రజల బాధలను, కూల్చినప్పుడు అటువారు, ఇటువారు ఏకమైన ఆనంద క్షణాలను ఊహించుకుంటున్నాను. మమ్మల్ని కట్టాలన్నా, కూల్చాలన్నా మనుషుల చేతుల్లో పనే. ఏవైనా రహస్యాలు మాట్లాడేటప్పుడు ‘గోడలకూ చెవులుంటాయి’ అంటుంటుంది. భాగ్యలక్ష్మి. కానీ అది రహస్యంగా మమ్మల్ని ఆనుకుని వినేవాళ్ల గురించి. మనిషికి కనీస అవసరాల్లో అన్ని కాలాల్లో రక్షణ ఇవ్వగల గూడు.. అదే ఇల్లొకటి. మరి నాలుగు గోడలు కలిసిందే కదా ఇల్లు. అంటే గోడ లేనిదే ఇల్లు లేదు. మనిషికి రక్షణను, చాటును.. ఒకరకంగా ఏకాంతాన్ని కల్పించేది కూడా మేమే. మేం గట్టిగా లేకపోతే ఇల్లు కూలడం ఖాయం. అయితే మామూలు ఇళ్ల గోడలు వేరు. కోటగోడలు వేరు. టీవీలో దేశంలోని కోటల గురించి కార్యక్రమం వచ్చింది. అందులో ఆ రాతి గోడలను చూస్తూ లక్ష్మీపతి దంపతులు ఎలా నిర్మించారో అని తెగ ఆశ్చర్యపోయారు. మా వాళ్లల్లో అంతటి గొప్పవాళ్లున్నారని నేనూ గర్వపడ్డాను.

ఆమధ్య భాగ్యలక్ష్మి ఓ సామెత చెప్పింది.. అది ‘అబద్దమాడితే గోడ కట్టినట్లుండాల’ని… అంటే అంత బలంగా ఉండాలనిట. అన్నట్లు మొన్న టీవీలో చూశాను..! పిల్లలు మేడమీద గాలిపటాలెగరేస్తూ, చూసుకోకుండా వెనక్కు నడుస్తూ పిట్టగోడమీదనుంచి కిందకు పడిపోయారట. పిట్టగోడ అంటే చిన్నగా ఉంటుందని, చిన్నపిల్లలు అలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలని భాగ్యలక్ష్మి మాటల ద్వారా తెలిసింది. నాకు నోరు గానీ ఉంటేనా, ఈ మనుషులకు ఓ మాట చెప్పాలనుంది. అది.. మమ్మల్ని కట్టేటప్పుడే గట్టిగా కట్టండి. అలాగే అప్పుడప్పుడు మాకు మరమ్మతులు చేయండి. మేం గట్టిగా ఉంటేనే మీకు భద్రత. లేదంటే మేమూ, మీరు కూడా కూలిపోతాం. అంతేకాదు, మీ మనసుల మధ్య మాత్రం అపోహలు, అసూయా ద్వేషాలు, కలగోడలు కట్టుకోకండి. అవి మీ జీవితాలనే కూల్చేస్తాయి.. అని. అంతలో లక్ష్మీపతి వచ్చి మళ్లీ టీవీ పెట్టాడు. వెంటనే ఇంటి రంగుల ప్రకటన వచ్చింది. ఎంత అందంగా ఉన్నాయో ఆ గోడలు.. ఎక్కువ కాలం నిలిచే, పిల్లలు బొమ్మలేసినా తుడిచేస్తే పోయే ఎంచక్కని రంగులట. మా వాళ్ల అందానికి కళ్లప్పగించి నేను..

Exit mobile version