[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం త్రాసు అంతరంగం తెలుసుకుందాం. [/box]
[dropcap]బం[/dropcap]గారయ్యగారు చాలా రోజులకు నా దగ్గరకు వచ్చారు. నన్ను శుభ్రంగా తుడిచి మళ్లీ అల్మైరాలో పెట్టి ఏదో ఆలోచనలో మునిగిపోయారు. నాకు ఒక్కసారి నా గత వైభవం గుర్తొచ్చింది. బంగారయ్య గారి తండ్రి ధనయ్య కిరాణా కొట్టు నడిపేవారు. ఆ కొట్లో త్రాసును నేనే. చాలా ఏళ్లు తూకమంతా నాతోనే గడిచింది. ఆ తర్వాత కొత్తరకం త్రాసును కొని, నన్ను భద్రంగా దాచారు.
బంగారయ్య కూడా తండ్రికి అచ్చివచ్చిన త్రాసునని సెంటిమెంట్‌తో నన్ను ఎంతో అపురూపంగా దాచుకున్నారు. ఇంతలో “నాన్నా .. నాన్నా” అంటూ బంగారయ్య కొడుకు కుబేర్ వచ్చి “అరే. ఈ త్రాసు మనింట్లో కూడా ఉందా?” ఆశ్చర్యంగా అడిగాడు.
“ఇది తాత వాడిన త్రాసురా.. అప్పుడు చిన్న కిరాణాషాపు.. ఎప్పుడూ జనంతో కిటకిటలాడేది. తూచితూచి చేతులు నొప్పి పుట్టేవి. ఆ తర్వాత తర్వాత చేత్తో పట్టుకునే పని లేని కొత్తరకం త్రాసులు.. ఒకవైపు తూనిక రాళ్లు ఉంచి, మరో వైపు వస్తువులుంచే స్టీలు ట్రే ఉండేవి రావడంతో అందరితో పాటు తాత కూడా త్రాసు మార్చేశాడు” బంగారయ్య చెపుతుంటే నేను కూడా ఆసక్తిగా విన్నాను.
“ఇప్పటికీ ఈ త్రాసులున్నాయి కద నాన్నా.. కూరలవాళ్ల దగ్గర చూశాను” అన్నాడు.
“అవునవును” అన్నారు బంగారయ్య.
“అన్నట్లు నాన్నా.. మా టీచర్ ఇలాంటి త్రాసు మోడల్ తయారుచేసి తెమ్మన్నారు. మీరూ మీ చిన్నప్పుడు చేశారా?” అడిగాడు..
“ఆఁ ఎందుకు చేయలేదూ.. మా కాలంలో బత్తాయి డిప్పలకు, దారాలు తగిలించి చేశాను” చెప్పారు.
“నేను చిన్న ప్లాస్టిక్ ప్లేట్లతో తయారుచేస్తా” అన్నాడు కుబేర్.
“అలాగే చెయ్యరా” అన్నారు బంగారయ్య.
అంతలో ‘బాబీ..’ అంటూ నానమ్మ పిలవడంతో ఆమె దగ్గరకు వెళ్లాడు కుబేర్. “నువ్వు త్రాసుల గురించి అడుగుతున్నావు కదా. ఈ బరువుల లెక్కలు, ఎక్కువ, తక్కువలు, తగాదాలు.. వగైరాలకు సంబంధించి ఓ సరదా కథ చెపుతా. వింటావా?” అడిగింది. ‘ఓ’ అన్నాడు కుబేర్. నేనూ సిద్ధమైపోయా కథ వినడానికి.. నానమ్మ చెప్పసాగింది..
“ఒకసారి రెండు పిల్లులు కలిసి ఓ రొట్టెను సంపాదించాయి. రెండూ కష్టపడ్డాయి కాబట్టి రెండింటికీ సమానంగా రొట్టె రావాలి. ఆ విషయంలోనే రెండు పిల్లులు పేచీపడి కొట్టుకోసాగాయి. ఇవి కొట్టుకోవడం చెట్టుపై ఉన్న కోతి గమనించింది. వెంటనే అది కిందకు దూకి పిల్లులతో తాను వాటికి రొట్టెను సమంగా పంచి.. తగాదా తీరుస్తానని నమ్మబలికింది. ఒక త్రాసు కూడా తెచ్చి రొట్టెను తుంచి ఓ ముక్క ఓ వైపు, మరో ముక్కను మరోవైపు వేసింది. త్రాసును పరీక్షగా చూసి ఇటు వైపు రొట్టెముక్క పెద్దదిగా ఉంది అంటూ అందులోంచి ఓముక్క తుంచి నోట్లో వేసుకుని మళ్లీ తూచింది. దాంతో రెండోవైపు ముక్క పెద్దదయి పోయింది. అప్పుడు ఆ ముక్కను తుంచి నోట్లో వేసుకుంది. అలా నాలుగైదుసార్లు కోతి త్రాసుతో తూచటం, రొట్టెముక్క తగ్గిస్తూ నోట్లో వేసుకోవడం చేసేసరికి చివరకు చిన్న ముక్కే మిగిలింది. ‘అయ్యో’ అంటూనే దాన్నికూడా నోట్లో వేసుకుని గబుక్కున ఎగిరి చెట్టు పైకెక్కింది కోతి. అలా రెండు పిల్లులు తగవు పడి రొట్టెను పోగొట్టుకున్నాయి. మనలో మనకు ఐకమత్యం లేకపోతే మూడో వారికి లాభం.. మనకు నష్టం అనేది తెలుసుకోవాల్సిన నీతి అన్న మాట” చెప్పింది నానమ్మ.
“కోతి భలే చేసిందే” అని కుబేర్ అంటూ ఉంటే.. పాపం మా త్రాసు తప్పేముంది, కోతిదే పాడుబుద్ధి అనుకున్నాను నేను.
అంతలో కుబేర్ “మరో కథ చెప్పు నానమ్మా” అడిగాడు.
“సరే..శిబి చక్రవర్తి కథ చెపుతా విను” అంటూ మొదలు పెట్టింది.
“శిబి చక్రవర్తి గొప్ప దానశీలిగా పేరొందాడు. అది చూసి ఇంద్రుడు ఆయనను పరీక్షించాలి అనుకున్నాడు. అగ్నిదేవుడితో కలిసి ఒక పథకం వేశాడు. దాని ప్రకారం అగ్నిదేవుడు పావురంగా మారి ఎగురుకుంటూ వెళ్లి శిబి చక్రవర్తి భుజంపై వాలి, తనను రక్షించమని వేడుకుంది. శిబి చక్రవర్తి దానికి అభయమిచ్చాడు. అంతలో ఇంద్రుడు డేగగా మారి పావురాన్ని తరుముతూ వచ్చి, శిబి చక్రవర్తితో ‘ఆ పావురాన్ని వదిలేయండి. అది నా ఆహారం. నేను చాలా ఆకలితో ఉన్నాను’ అన్నాడు. అప్పుడు శిబి చక్రవర్తి ‘రక్షిస్తానని పావురానికి నేను మాట ఇచ్చాను. ఎట్టి పరిస్థితులలో నేను మాట తప్పను. నీకు ఎలాంటి ఆహారం కావాలో కోరుకో. నేను నీకు ఏర్పాటు చేస్తాను’ అన్నాడు చక్రవర్తి. ‘అయితే ఈ పావురానికి సరితూగే మాంసాన్ని నాకు ఇవ్వండి’ అంది. డేగ. అందుకు శిబి చక్రవర్తి సరేనని వెంటనే ఓ త్రాసు తెప్పించి అందులో ఓ వైపు పావురాన్ని కూర్చో పెట్టి మరోవైపు తన శరీరభాగాన్ని కోసి ఆ మాంసాన్ని అందులో ఉంచాడు. సరిపోలేదు. మళ్లీ మళ్లీ తన శరీరమాంసాన్ని కోసి వేసినా త్రాసు పావురం వైపే మొగ్గుతుండటంతో చివరకు ఆత్మార్పణకు సిద్ధపడి తానే రెండోవైపు కూర్చున్నాడు. అతడి త్యాగనిరతి చూసి, ఇంద్రుడు, అగ్ని నిజ రూపాలు ధరించి, శిబి చక్రవర్తి దానగుణాన్ని కీర్తించారు” చెప్పింది నానమ్మ.
“మరి శిబి చక్రవర్తి శరీరాన్ని కోసుకున్నాడు కదా..” సందేహం అడిగాడు కుబేర్.
“అది ఇంద్రుడి పరీక్ష కాబట్టి వారు ఎప్పుడైతే తృప్తి చెందారో, ఆ వెంటనే శిబి శరీరం ఎప్పటిలా మారిపోయింది” వివరించింది నానమ్మ. నేను శిబి చక్రవర్తిని ఊహించుకుంటుండగా కుబేర్ మాయమైనట్లున్నాడు. నానమ్మ టీవీ రిమోట్ నొక్కింది. వెంటనే కనిపించిన దృశ్యం నన్ను ఆశ్చర్యపరిచింది. పెద్ద త్రాసు. అందులో ఒకవైపు శ్రీకృష్ణుడు.. (టీవీ సినిమాల్లో శ్రీకృష్ణుణ్ని ఇప్పటికి చాలాసార్లే చూశాను).. మరోవైపు ధన, బంగారు రాసులు.. అంతలో నానమ్మ ఆనందంగా “శ్రీలక్ష్మీ! త్వరగా రా.. టీవీలో శ్రీకృష్ణ తులాభారం వస్తోంది” అంటూ పిలిచింది. శ్రీలక్ష్మి “అవునా” అంటూ గబగబా వచ్చి సోఫాలో బైఠాయించింది. మిగతా విషయాలలో ఎలా ఉన్నా సినిమాల విషయంలో మాత్రం అత్తాకోడలు సఖ్యతగా ఉంటారు. అంతలో కుబేర్ కూడా మళ్లీ వచ్చి టీవీ చూడసాగాడు. నా చూపూ టీవీ పైనే. ఎంత పెద్ద త్రాసో.. ఎంత సిరిసంపదలు తెచ్చి ఉంచినా త్రాసు శ్రీకృష్ణుడి వైపే మొగ్గుతోంది. “కృష్ణయ్యా! మజాకా!” అంటోంది నానమ్మ భక్తి పారవశ్యంతో. నారదుడేమో.. ‘లాభం లేదు. నేను శ్రీకృష్ణుణ్ని అమ్మేస్తాను..’ అంటూ ‘భలేమంచి చౌకబేరము’ అంటూ పాటందుకున్నా డు. సత్యభామకు కాళ్లూ చేతులూ ఆడలేదు. ఇంతలో రుక్మిణిని పిలుచుకు రమ్మన్నారు.
సత్యభామ పరుగున రుక్మిణి దగ్గరకు వెళ్లి విషయం చెప్పి ఎలాగైనా విపత్తు తప్పించమని కోరింది. వెంటనే రుక్మిణీదేవి తులసీదళాలు తీసుకొని శ్రీకృష్ణుడి వద్దకు వచ్చింది. ఆమె త్రాసులో ఇలా తులసీ దళాలు ఉంచగానే అలా త్రాసు సరితూగింది. ఇంకేముంది అందరికీ ఆనందమే ఆనందం. రుక్మిణి భక్తి మహిమను గుర్తించింది సత్య. తన అహంభావానికి తగిన పాఠం చెప్పడానికే ఈ నాటకమంతా ఆడారని అర్థం చేసుకొంది సత్యభామ. కథ సుఖాంతం అయింది. శ్రీలక్ష్మి లేచి లోపలికి వెళ్లింది. నానమ్మ కూడా టీవీ ఆపేసింది.
“నానమ్మా! ఇప్పుడు కూడా ఇలా మనుషులు త్రాసులో కూర్చోవటం.. తూచటం ఉందా?” అడిగాడు కుబేర్.
“ఎందుకు లేదు? తిరుపతి మొదలైన పుణ్యక్షేత్రాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకోవటానికి ఇలాంటి ఏర్పాటు ఉంది. కొంతమంది తమ ఎత్తు బెల్లం ఇస్తామని.. అలా ఎవరికి తోచింది వారు మొక్కుకుంటారు. ఆ ప్రకారం దేవుడికి మొక్కు తీర్చుకుంటారు. అప్పుడెప్పుడో శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తిరుపతిలో తులాభారం తూగి.. అంత సంపదను దేవుడికి సమర్పించుకున్నాడట” చెప్పింది. ఆశ్చర్యంగా విని మళ్లీ మాయమయ్యాడు కుబేర్.
అంతలో శ్రీలక్ష్మి మళ్లీ వచ్చి “అత్తయ్యా! నిన్న పక్కింటి సరస్వతి మాటల్లో ‘ఇసుక తక్కెడ, పేడ తక్కెడ’ అంది. మిమ్మల్ని అడుగుదామనుకుని మరిచిపోయాను. అంటే ఏమిటి?” అడిగింది.
నానమ్మ “అదా.. ఒకళ్లనొకళ్లుమోసం చేసుకోవాలనుకుని బోల్తాపడే సందర్భంలో వాడుతుంటారు. దాని వెనుకో కథ ఉంది. ఒకసారి ఇద్దరు ప్రయాణికులు ఓ సత్రంలో బసచేశారు. ఒకడి దగ్గర కావడిలో ఇసుక తక్కెడ ఉంటే, మరొకడి దగ్గర కావడిలో పేడ తక్కెడ ఉంది. అయితే ఎదుటివాడి దగ్గర ఏదో విలువైన వస్తువు ఉండి ఉంటుందని ఊహించుకుని, ఒకరి కావడి మరొకరు తీసుకొని ఎవరిదారిన వారు వెళ్తూ, తామే తెలివిగలవారమని మురిసిపోతారు. ఆ తర్వాత కావడిలో ఉన్నదేమిటో చూసుకుని మోసం చేయబోతే.. మోసమే ఎదురయిందని ఉసూరుమంటారు…” ఆగింది నానమ్మ. అదా సంగతి అంటూ మళ్లీ వంటింట్లోకి వెళ్లి పోయింది శ్రీలక్ష్మి.
ఆ తర్వాత భోజనాల వేళయింది. అంతా టేబుల్ ముందు కూర్చున్నారు. “ఏమండీ.. బ్రహ్మయ్యగారిని రమ్మని ఫోన్ చేశారా.. తెగిపోయిన నా పాత గొలుసు.. దుద్దుల్లాంటి చిన్న, చితకా వస్తువులు ఇచ్చి కొత్త నగ చేయించు కోవాలనుకుంటున్నానని చెప్పాను. మీకు గుర్తుందా అసలు” గట్టిగా అడిగింది.
“నువ్వు చెప్పటం.. నేను మరిచిపోవడం కూడానా.. ఇవాళ సాయంత్రం వస్తానన్నాడు. మార్చాలనుకున్న వస్తువులు రెడీగా ఉంచుకో. అప్పుడు వెతకటం మొదలు పెట్టకు” అన్నారు బంగారయ్య.
“అలాగే. మొదట్నుంచి తెలిసిన మనిషి. తూకం కరెక్టుగా ఉంటుంది. నమ్మకస్తుడు అని ఆయననే రమ్మనటం. లేకపోతే ఊళ్లో ఎన్ని పెద్ద పెద్ద షాపుల్లేవూ” అంది శ్రీలక్ష్మి.
“అన్నట్లు పొద్దున జనార్దన్ ఫోన్ చేశాడు. పాప పుట్టిందట” చెప్పారు బంగారయ్య.
“తొలిచూలు లక్ష్మి పుట్టిందన్నమాట. ఎంత బరువుందో చెప్పారా?” అడిగింది శ్రీలక్ష్మి.
“మూడు కిలోలు అని చెప్పారు. అంటే సాధారణంగా ఉండే బరువే. ఆరోగ్యంగానే ఉందిట” అన్నారు బంగారయ్య.
“అంటే పిల్లలు పుట్టగానే వారిని తూస్తారా?” అడిగాడు కుబేర్.
“అవున్రా. బరువు తక్కువుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలికదా. ఆ తర్వాత క్రమంగా ఎదిగే కొద్దీ బరువు పెరుగుతారు పిల్లలు. పిల్లలే కాదు, మనిషి ఏ వయసు వారైనా ఆ వయసుకు తగ్గ బరువుంటేనే ఆరోగ్యం. ఈ వయసుకు ఇంత బరువు అని ఓ పట్టిక ఏర్పరచారు. దాని ప్రకారం తమ బరువు ఉందో, లేదో తెలుసుకుని, మరీ తక్కువున్నా, ఎక్కువున్నా దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. డాక్టరు దగ్గరికెళ్లినప్పుడు అక్కడ బరువు కూడా చూసేది అందుకే. మనం ఇంట్లోనే బరువు చూసుకునేందుకు వీలుగా వెయింగ్ మెషిన్ కొందామనుకుంటున్నా” అన్నారు.
“అలాగే మనం తినే ఆహారంలో కూడా సమతౌల్యం పాటించాలి. శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందేట్లు పౌష్టికాహారాన్ని కొలత ప్రకారం తీసుకోవాలి. రుచిగా ఉందని లెక్క లేకుండా తింటే రోగాలు రావటం ఖాయం” చెప్పారు బంగారయ్య కంచం ముందు నుంచి లేస్తూ.
ఆ సాయంత్రం కంసాలి బ్రహ్మయ్య వచ్చాడు. అమ్మ ఇచ్చిన బంగారు వస్తువులను ముచ్చటగా ఉన్న చిన్న త్రాసులో జాగ్రత్తగా తూస్తుంటే కుబేర్ ఆసక్తిగా చూస్తున్నాడు.. నేనూ మా జాతి వాడిని ఆశ్చర్యంగా.. ఆనందంగా చూస్తున్నాను. బుజ్జిగా.. ఎంత ముద్దుగా ఉన్నాడో! అనుకుంటుండగానే కుబేర్ వాళ్ల నాన్నను “నాన్నా! చిన్ని త్రాసులు ఎంత తక్కువ బరువు వరకు తూస్తాయి?” అడిగాడు.
“ఒక మిల్లీగ్రాము వరకు తూచవచ్చు. భౌతిక, రసాయనిక ప్రయోగశాలల్లో కూడా ఈ చిన్ని త్రాసులను ఉపయోగిస్తారు” చెప్పారు బంగారయ్య.
బ్రహ్మయ్య గారు హారాల డిజైన్లు చూపించి, ఒక్కోటి ఎంత బరువు ఉంటుందో వివరించి వాటిల్లో ఏదైనా ఎంపిక చేసుకోమన్నాడు. చివరకు శ్రీలక్ష్మి, నానమ్మ కలిసి ఒక హారాన్ని ఎంపిక చేయడంతో.. ఆయన ఆ ఆర్డరు రాసుకుని ఓ వారంలో తెచ్చిస్తానని వెళ్లిపోయాడు. మా మిత్రుడికి నేను టాటా చెప్పాను. బుజ్జిగాడు కూడా నాకు టాటా చెప్పింది.
నానమ్మ మళ్లీ టీవీ పెట్టింది. వెంటనే ఓ పెద్ద భవనం.. దాని ముందు కళ్లకు గంతలు ఉండి, చేత్తో త్రాసు పట్టుకున్న ఓ స్త్రీమూర్తి విగ్రహం ప్రత్యక్షమయ్యాయి.
“నాన్నా! చూడు చూడు… ఆ విగ్రహం అలా ఉందేమిటి?” అడిగాడు కుబేర్. “అది న్యాయ దేవత విగ్రహం. న్యాయస్థానాలలో ఉంటుంది. ఏమాత్రం ప్రభావితం కాకుండా తరతమ బేధాల్లేకుండా అందరికీ సమన్యాయం ప్రసాదించటానికి సంకేతమే ఆ విగ్రహం” చెప్పారు బంగారయ్య.
“ఓహో.. అలాగా..” అన్నాడు కుబేర్.
‘అయితే మావాళ్లు న్యాయస్థానాల్లో కూడా ఉంటారన్నమాట’ అనుకున్నాను నేను. కాలం అలా దొర్లిపోతోంది. కుబేర్ మళ్లీ వచ్చాడు.. “మరి పెద్ద పెద్ద లారీలు.. లాంటి వాటిని కూడా తూచేట్లయితే ఎలా తూస్తారు?” అడిగాడు. “అన్నిటినీ తూస్తారు. హైవేల మీద లోడ్‌తో వెళ్లే లారీలను తూచే స్టేషన్లు ఉంటాయి. ఒక పెద్ద ఏటవాలు గట్టి బోర్డు లాంటి దాని మీదికి లారీని ఎక్కిస్తే.. దానికి ఉండే ఇండికేటర్ ఆ లోడ్ బరువును చూపిస్తుంది. మోటార్ సైకిల్స్ వంటి వాహనాలు కూడా నిర్ణీత బరువుతో తయారవుతాయి. వ్యక్తి తన బరువును బట్టి తాను నడప గలిగే వాహనాన్ని ఎంచుకుంటాడు. మనం వాడే ప్రతి చిన్న పెద్ద వస్తువు తూకం ప్రకారమే ఉంటుంది” వివరించారు బంగారయ్య.
“మరి అమ్మేవాళ్లు త్రాసులోని తూనిక రాళ్లకింద చింతపండు పెట్టారని, సరైన రాళ్లు వాడకుండా మామూలు రాళ్లు వాడారని ఒక్కోసారి పోట్లాటలు వస్తుంటాయి కదా.. అలాంటప్పుడు.. ఎలా?” అడిగాడు కుబేర్.
“అలాంటివి జరక్కుండా చూడటానికి ప్రభుత్వం తూనికలు, కొలతల శాఖను ఏర్పాటు చేసింది. వారు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తుంటారు. అంతేకాకుండా అన్యాయం జరిగితే వినియోగదారులు ఫిర్యాదు చేయడానికి వినియోగదారుల సమాఖ్యలు, కోర్టులు కూడా ఉన్నాయి” వివరించారు బంగారయ్య.
అర్థమైనట్లు తలూపాడు కుబేర్. ఈ రోజు నా గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నానో. ఈ లెక్కన మనుషులకు అడుగడుగునా నా అవసరం ఉందన్నమాట. మొన్నేదో వంటల కార్యక్రమం చూశాను. అందులో కూడా బొంబాయి రవ్వ అరకిలో, పంచదార అరకిలో, నెయ్యి వంద గ్రాములు, జీడిపప్పు, కిస్మిస్… వంద గ్రాములు.. ఇలా చెపుతుంటే ఏమిటోలే అనుకున్నా.. అంటే అవీ తూకం ప్రకారం తీసుకునేవే అన్నమాట. ఇన్ని రకాల సేవ చేయడం మాకూ ఇష్టమే కానీ కావాలని మోసం చేస్తుంటే ఆ అన్యాయంలో మేమూ భాగస్వాములయినట్లు బాధపడాల్సివస్తుంది. అందుకే మమ్మల్ని న్యాయబద్ధంగా వాడమని ఈ మనుషులకి మనవి చేయాలనిపిస్తుంది. అలాగే సమతుల ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండమని కూడా చెప్పాలని ఉంది. ఇంకో ముఖ్య విషయం.. ఇతరుల విలువను వారి ఆర్థిక హోదాను బట్టి, అందం, ఆకారాలను బట్టి కాక వారి ఉన్నత వ్యక్తిత్వాన్ని బట్టి తూచి చూడమని.. మరి నేను చెప్పేది వారికి వినిపిస్తే బాగుండు. ఏమైనా పాతకాలానికి చెందిన నేను, వేర్వేరు రూపుల్లో ఉన్న మావాళ్ల గురించి తెలుసుకుని గర్వపడుతూ నన్నింకా పదిలంగా చూసుకుంటున్న బంగారయ్యగారి వంక కృతజ్ఞతగా చూస్తుండిపోయాను.