Site icon Sanchika

అంత లేని వాడు సంతకెళ్లినట్లు

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

[dropcap]గి[/dropcap]రిజన ప్రాంతాలలో వారపు సంతలు జరుగుతుంటాయి. ఈ సంతకు మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు విధిగా వస్తుంటారు. వారు సంతల్లో రగ్గులు, దుప్పట్లు, పంచెలు, తువ్వాళ్లు, వంట పాత్రలు, బంగారు, వెండి ఆభరణాలు మున్నగునవి విక్రయిస్తారు. అలాగే గిరిజనులు సంతకు తెచ్చిన పిప్పళ్లు, పసుపు, అల్లం, చింతపండు, గుమ్మడి పండ్లు, పనస, కమలాపండ్లు తదితర ఉత్పత్తులను కొంటుంటారు. గిరిజనులు తాము విక్రయించిన వాటితో వచ్చిన డబ్బులతో తమకు కావాలసిన పొగాకు, ఉల్లిపాయలు, కిరసనాయిలు, టీ గుండ, బెల్లం, మసాలా సామాన్లు కొనుక్కుని ఇళ్లకు చేరుకుంటారు.

గిరిజన స్త్రీలు కూడా సంతలకు తమ భర్తలతోపాటు వెళ్తుంటారు. వారు గాజులు, బొట్టు బిళ్లలు, పౌడరు డబ్బా, కాటుక, చీరలు కొనుక్కుంటారు. ఉత్సాహంగా ఇళ్లకు తిరిగి వెళుతూ దారిలో సారా కల్లు వంటివి త్రాగుతారు. తినడానికి జంతికలు, కారం గారెలు కొని దారిపొడవునా నములుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇళ్లకు చేరుతారు.

ఒకనాడు చిట్టిదొర అనే గిరిజనుడు సంతకు ఏవీ తీసుకెళ్లకుండా చేతులూపుకొంటూ వెళ్లాడు. సంతంతా తిరిగి తెలిసిన గిరిజన స్త్రీలతో పరాచకాలాడూతూ సాయంత్రం వరకు గడిపాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కడుపు కాలిపోతోంది. ఎవరినైనా అప్పుడు అడుగుదామంటే పరిచయస్థులంతా అప్పుడే తమ ఊళ్లకు బయలుదేరిపోయారు. కాళ్లీడ్చుకుంటూ రాత్రి ఇంటికి చేరాడు చిట్టిదొర.

చిట్టిదొర మామ పోతురాజు సంతలో అల్లుడిని చూశాడు. వీడు ఏమీ సంతకు తీసుకురాలేదని గ్రహించి సంతలో కొన్ని దినుసలు కొనేసి తన కూతురింటికి వచ్చాడు. ఇదిగో గున్నీ (కూతురా) ఈ సామాన్లు ఇంట్లో దాచు. నేనిచ్చానని నీ మొగుడుకి చెప్పకు అని చెప్పి తన ఊరికి వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి వచ్చిన మొగుడికి అన్నం పెట్టి సంత నుంచి ఏమిటి తెచ్చావు? అని అతని పెళ్లాం చిన్నమ్మి అడగ్గా ఏమీ తేలేదు అని జవాబు చెప్పాడు. మరి సంతకెందుకెళ్లావు? అని అడగ్గా నా దగ్గర చిల్లిగవ్వలేదు. సంతలో ఎవరైనా డబ్బులు అప్పిస్తారేమోనని వెళ్లాను. ఎవరూ నాకు అప్పు ఇవ్వలేదన్నాడు. నువ్వు ఒట్టి తిండిపోతువి. నీ కసలే ఆకలెక్కువ అని కోపగించుకుంది. చిట్టిదొర సంతకు వెళ్లి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన అతని ఇరుగుపొరుగు వారు, చుట్టాలు, అతనితో “అంత లేని వాడివి సంతకెందుకెళ్లావు?” అని వేళాకోళమాడారు. ఈ మాట సామెతగా మారింది.

Exit mobile version