Site icon Sanchika

రామాయణ ధర్మ సూక్ష్మాల లఘు వ్యాసాల మాల ‘…అంతా రామమయం’

శ్రీ విహారి గారు బహుముఖీన ప్రతిభ కలిగిన సీనియర్ కవి, నవలా, కథా రచయిత. లబ్ధ ప్రతిష్ఠులు. 6,500 పద్యాలతో ఛందస్సుతో కూడిన మహాకావ్యం “శ్రీ పదచిత్ర రామాయణం”ను అందంగా చెక్కిన శ్రీ రామభక్తులు శ్రీ విహారి గారు.

మరోసారి, పాండిత్య ప్రమేయం లేని సామాన్య పాఠకులకు సైతం అర్ధమయ్యే సరళ భాషలో భక్తి పత్రికలో తాను రాయగా ధారావాహికంగా ప్రచురితమైన రామాయణ ధర్మ సూక్ష్మాల లఘు వ్యాసాల నన్నింటినీ ఒక చోట మాల గా చేర్చి ‘అంతా రామమయం’ పేరిట చక్కని ముఖచిత్రంతో ఈ పుస్తకం తెచ్చారు.

సాధారణంగా రామాయణం కథ స్థూలంగా ప్రతివారికీ తెలుస్తుంది. ప్రత్యేకించిన కొన్ని ఘట్టాలు మాత్రమే అందరికీ ఆకళింపులో ఉంటాయి. మొత్తం రామాయణాన్ని గురించిన అవగాహన భాషా ప్రవీణులైన కొద్ది మందికి పెద్దలకు మాత్రమే ఉంటుంది. వాడుక భాష మాత్రమే చదివే అలవాటున్న పాఠకులందరికీ రామాయణ గాథపై సమగ్ర అవగాహన రావడానికి ఈ వ్యాసాలు చక్కగా ఉపయోగపడతాయి. రామాయణం చిరాయువు, అది మంచి చెబుతుంది, వ్యక్తిత్వ వికాసానికీ, సమాజ కళ్యాణానికి దోహదపడుతుంది కనుక మళ్ళీ మళ్ళీ చెప్పాలి అన్న సదుద్దేశంతో రచయిత ఈ ప్రత్యేక వ్యాసాలు రాసారు.

శ్రీ రాముడి మొదలు బ్రహ్మర్షి విశ్వామిత్రుని వరకూ, మంధర, అనసూయ, శూర్పణఖ ఇంకా భరతుడు, శబరీ వంటి పాత్రల ఔచిత్యాన్ని ఈ వ్యాసాల్లో చక్కగా వివరించారు. రామాయణంలో ఉన్న ప్రధాన పాత్రలన్నిటి వ్యక్తిత్వ విశ్లేషణ, ప్రయోజనము చెబుతూ రాసిన ఈ వ్యాసాలు ఎంతో బావున్నాయి.

ఇంకా బాల,అయోధ్య,అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ మొదలైన ఆరు కాండముల గురించి సంక్షిప్తంగా వివరించారు. పద్య రామాయణముల గురించీ వాల్మీకి రామాయణ విశిష్టత గురించీ విపులీకరించారు. జ్ఞానపీఠ గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం మీద విహారి గారు “అనిర్వచనీయత” పేరున జాతీయ సదస్సుకు సమర్పించిన పత్రం ఈ పుస్తకంలో మణిపూస వంటిది. దీని ద్వారా కల్పవృక్ష సారాన్ని ఎంతో తాదాత్మ్యంతో రచయిత అందించారు. ఈ సంపుటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘రాత్రి ఒక్కటే పరి పరి తలపులు’ (శ్రీరాముని స్వగతం), ‘లక్ష్య సిద్ధి మెరిసిన రాత్రి’ (సీతారామ కల్యాణం), ‘వాల్మీకంలో కనిపించని వసిష్ఠ గీత’ (యోగవాసిష్ఠం) అనే మూడు వ్యాసాలు మరింత బావున్నాయి.

రామాయణం అమృత భాండం. ఎంతమందికి పంచినా తరగని అక్షయ పాత్ర. పంచే వారంతా మహితాత్ములే. తెలుగు రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన ఉన్న రామాలయాలలో ఏటా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవం,వడపప్పు రుచీ,మిర్యాల పానకం మంటా, అక్కడ పంచే విసన కర్రలూ మనందరికీ ఎప్పటికీ తరగని మధురానుభూతులే.

మృదువైన భాషలో రామాయణ మకరందాన్నిమనకు పంచిన విహారి గారి ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్యాస సంపుటిని అందరూ తప్పక చదివి, ఇంటిలో దాచుకుని పెట్టుకోవాలి.

***

‘…అంతా రామమయం’ (సారస్వత వ్యాసాలు)
రచన: విహారి
పేజీలు: 148
వెల: 150/-
ప్రచురణ, ప్రతులకు:
జె.ఎస్. మూర్తి (విహారి)
16-11-310/12/A /1/1
గణపతి టెంపుల్ స్ట్రీట్,
సలీమ్‌నగర్-2, మలక్‌పేట్
హైదరాబాదు 500036
ఫోన్: 9848025600
మెయిల్: vihaari912@gmail.com

Exit mobile version