Site icon Sanchika

అంతా చూస్తున్నా….!

“ప్రకృతీ, సమాజంలోని అందాలను, ఆనందాలను చూసినా వాటిని ఆస్వాదించలేను, ప్రపంచంలో అసమానత లనేకం ఉన్నందుకు బాధపడతాను” అంటున్నారు పెద్దాడ సత్యప్రసాద్అంతా చూస్తున్నా….!” కవితలో.

[dropcap style=”circle”]గోదారిపై మెరిసే పున్నమి
వెన్నెలను చూసి అనందపడను
అడవి పాలైన జాబిల్లిని చూసి జాలి పడతాను
జడలోనూ, దేవుడి గుడిలోనూ విరిసే
పువ్వును చూసి పరవశించిపోను
కర్కశ పదఘట్టనల కింద
నలిగిపోతున్న వేలాది పూబాల రోదనలనే వింటాను
ఎదుట పడిన అందాన్ని చూసి మురిసిపోను
బాధల మబ్బులలో బందీ అయిన
ఇంతకు వేయింతల అందాలను చూసి చలించిపోతాను
నా చుట్టూ వున్న అనందాన్ని చూసి మైమరచిపోలేను
ఈ కొన్ని సంతోషాల వెనక కనిపించలేని
కోట్లాది పొడిబారిన పెదవులనే చూస్తున్నాను
సుస్వరమైన కోయిల గానం వినిపిస్తున్నా
దూరాన ఎక్కడో గొంతెత్తి అరుస్తున్న
పలు కాకుల విలాపాన్నే వింటున్నా
ఎత్తైన కొండలనే కాదు
లోతైన లోయలనూ చూస్తున్నా
మెల్లగా సాగే క్రిష్ణమ్మలో
దాగున్న సుడులనూ చూస్తున్నా
కెరటాల చిరు సవ్వడితో
సందడి చేసే కడలిలోపల
కదలాడే ఆగాధాలనూ చూస్తున్నా
ఆ దేవుడు చేసిన అన్యాయాన్ని
కళ్ళప్పగించి మరీ చూస్తున్నా
ఈ అసమానతల జగతిని
సుజించిన ఆ దయ లేని
దైవాన్ని చూసి సిగ్గుపడుతున్నా…

Exit mobile version