అంతఃచక్షువు

1
2

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన డా. సన్నిహిత్ గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి.]

[dropcap]బా[/dropcap]గా చీకటిగా ఉంది. టైము అర్ధరాత్రి దాటి పది నిముషాలు అయింది.

కారు ఒక అడవి దారి గుండా పయనిస్తోంది. కార్లో భార్యాభర్తలు, వారి ఇద్దరి ఆడపిల్లలు. గుండెల్లో గుబులుగా ఉంది వాళ్ళకి. అసలు ఈ ప్రయాణం పెట్టుకోవడం తాము చేసిన తప్పు అని భావిస్తున్నారు.

బయలుదేరే ముందు వాతావరణ పరిస్థితిని ఇంటెర్నెట్‌లో చూసారు. తర్వాతే బయలుదేరారు. కానీ అనూహ్యంగా ఈ వర్షం. దానికి తోడు చీకటి. చుట్టూ గుబురు చెట్లు. మధ్యలో సన్నటి రోడ్డు.

కారు నడుపుతున్న భార్య ‘త్రిష’ను ఉద్దేశించి అతను అన్నాడు “ఏమీ ప్రోబ్లెం లేదు కదా” అని.

“ఏమీ పర్వాలేదండీ.. మీరు కంగారు పడొద్దు” అంది ఆమె. చిన్నగా నవ్వడు అతను.

వెనక కూర్చున్న ఇద్దరు ఆడపిల్లలు టెన్షన్‌గా చూస్తున్నారు. రోడ్డు మీద బాగా దృష్టి పెట్టి డ్రైవ్‌ చేస్తుందామె. నిర్మానుష్యంగా ఉంది. కనీసం వెహికల్స్‌ కూడా రావడం లేదు.

‘ఎందుకో ఈ రోజు ఇంత ఖాళీగా ఉంది రోడ్డు’ అనుకుని ఆశ్చర్యపోయిందామె.

ఇంతలో ఒక కోడి గుడ్డు వేగంగా వచ్చి కారు ముందు అద్దాన్ని తాకింది. భళ్ళున పగిలి అద్దం మీద గుడ్డు లోపలి పచ్చటి ద్రవం కారసాగింది. వైపర్‌ రన్‌ అవుతూ ఉండటం వల్ల అద్దం మొత్తం పూర్తిగా అలికినట్టు అయిపోయి ఏమీ కనపడటం లేదు ఆమెకి. వేగంగా వెళ్తున్న కారుని కంట్రోల్‌ చెయ్యడం కష్టం అయింది ఆమెకు. సడన్‌ బ్రేక్‌ వేసి కారుని నెమ్మదిగా కంట్రోల్‌ లోకి తెచ్చింది. రోడ్డుకి ఒక పక్కగా ఆపింది.

“ఏమయింది.. ఏంటా సౌండ్‌..?” అడిగాడు ఆమె భర్త ‘నేత్ర’.

“ఎవరో మన కారు అద్దం మీద కోడిగుడ్డు విసిరారు.. దారి కనబడక కారు పక్కకు తీసి ఆపు చేసాను” చెప్పింది.

“అవునా.. ఏదో దాడి జరగబోతోంది.. జాగ్రత్తగా ఉండాలి మనం.. ఎవరూ కారు దిగకండి” అని హెచ్చరించాడు

“అలాగే..” అన్నారు అందరూ.

ఇంతలో ఎవరో నలుగురు ఆగంతుకులు వచ్చి “రేయ్‌.. కారు దిగండ్రా..” అని అరుస్తున్నారు. వాళ్ళు దారిదొంగలు. వాళ్ళ చేతిలోని ఆయుధాలు చూసి ఆమె గట్టిగా అరిచింది. అతడు నెమ్మదిగా కారు దిగాడు.

“రేయ్‌.. మిగతా వాళ్ళను కూడా దిగమనరా..” అని అరిచాడు ఒక ఆగంతుకుడు. అంతే.. వెంటనే అతడి గొంతు మీద ఒక దెబ్బ పడింది. కిక్కురుమనకుండా నేలకూలాడు.

ఇంకొక ఆగంతకుడు అతని మీదకు దూకాడు. వాడి రెండు చేతులు వెనక్కు విరిచి వీపు మీద ఒక గట్టి దెబ్బ కొట్టాడు. వాడు నిశ్శబ్దంగా నేలకొరిగాడు.

మిగతా ఇద్దరు ఆగంతకులు, తాము దారి కాచి దాడి చేసి అనవసరంగా సమస్యల్లో పడ్డాం ఏమో అని సందేహపడుతున్నారు. కానీ ఇప్పుడు వెనక్కు వెళ్ళలేరు. అందుకే ఇద్దరూ ఒకేసారి ముందుకు ఉరికారు. అతను తన చేతుల్ని చురకత్తుల్లా మార్చి వారి చేతిలోని ఆయుధాలను నిర్వీర్యం చేసాడు. వెంటనే వారి గొంతులని తన అరచేతులతో బిగించి ఊపిరాడకుండా చేసాడు. నెమ్మదిగా వాళ్ళు కళ్ళు వాల్చేసారు.

నిశ్శబ్దంగా కారులోకి వచ్చి కూర్చున్నాడు. పిల్లలు విభ్రాంతితో చూస్తున్నారు. అతని భార్య కారు అద్దాన్ని క్లీన్‌ చేసింది.

“ఒరేయ్ గుడ్డి నాయాలా.. ఎంత దెబ్బ కొట్టావురా..” అని మూలుగుతున్నారు నేలకొరిగిన ఆగంతకులు. అవేమీ పట్టించుకోకుండా నవ్వుకుని మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు.

***

ఇంటికి చేరుకున్నాక పిల్లలు తల్లిని అడిగారు. “అమ్మా.. నాన్నలో ఇంత బలం.. గుండె ధైర్యం ఉన్నాయా?” అని.

చిన్నగా నవ్వి చెప్పిందామె “మీ నాన్న గురించి మీకు తెలీదు. ఆయన చాలా ధైర్యవంతుడు” అంది. ఇంతలో అతను తడుముకుంటూ అక్కడికి వచ్చాడు.

“ఏంటి.. పిల్లలకు నా గురించి అంత గొప్పగా చెబుతున్నావు?” అని నవ్వుతూ అడిగాడు.

“కొత్తగా ఏమీ చెప్పడం లేదు లెండి.. ఉన్న విషయమే చెబుతున్నాను” అంది.

పిల్లలు అడిగారు “నాన్నగారికి చూపు ఎలా పోయిందమ్మా” అని. ఆమె గాఢంగా నిశ్వసించింది.

“అదొక పీడకలమ్మా.. తర్వాత చెబుతాను” అని సమాధానం చెప్పి అక్కడి నుండి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది.

ఎందుకో ఆమెకు గతం గుర్తొచ్చింది. అప్పట్లో తాము ఎంత రొమేంటిక్‌గా గడిపేవారో కళ్ళ ముందు కదిలింది.

పెళ్ళి అయిన కొత్తలో.. వాళ్ళిద్దరూ హానీమూన్‌కి ఊటీ వెళ్ళారు. ఆర్మీలో పని చేస్తున్న నేత్ర సెలవు మీద వచ్చాడు. ఊటీ లాంటి సుందర ప్రదేశం.. వారి మనసుల్ని కలిపి దగ్గర చేసింది. తృప్తిగా ఏకాంతాన్ని అనుభవించారు. ఎన్నో ఊసులని కలబోసుకున్నారు. శారీరక సుఖంతో పాటూ, మానసిక ప్రశాంతతను కూడా చవిచూసారు. అలా హాయిగా గడిపి తిరిగి ఇంటికి వచ్చారు. అప్పుడే హెడ్‌ క్వార్టర్స్‌ నుండి అతనికి మెసేజ్‌ వచ్చింది ‘వెంటనే బయలుదేరి రమ్మ’ని. హడావిడిగా బయలుదేరాడు. బేలగా చూసింది ఆమె. కన్నీళ్ళు పెట్టుకుంది. ‘నా గుండె చప్పుడింక నీ గుండె చేరలేదు’ అన్నట్టు ఇంకా వారి తీపి అనుభవాల పచ్చిదనం ఆరకముందే అతను వెళ్ళిపోతున్నాడు. వదల లేక వదల లేక వదిలి వెళ్ళాడు అతను.

అలా వెళ్ళిన అతను తిన్నగా హెడ్‌ క్వార్టర్స్‌కి వెళ్ళి రిపోర్ట్‌ చేసాడు. పై అధికారి అతన్ని చూసి “ఒక సీక్రెట్‌ ఆపరేషన్‌ ఉంది. అది నీ వల్లనే అవుతుంది. నీతో పాటూ మనవాళ్ళు కొంతమంది వస్తారు. జాగ్రత్తగా వెళ్ళి రండి” అని చెప్పాడు.

అతను అడిగాడు “సార్‌.. ఈ ఆపరేషన్‌ పేరు ఏమిటి?” అని.

“ఆపరేషన్‌ త్రినేత్ర..” అని బలంగా చెప్పాడు ఆ పై అధికారి. దేశభక్తితో ఛాతీ ఉప్పొంగింది అతనికి.

తన టీమ్‌తో కలిసి, సాయుధుడై బయలుదేరాడు అతను. కాశ్మీర్‌లో సోన్‌మార్గ్‌ ప్రాంతం నుండి లడక్‌ వెళ్ళే రూట్‌లో లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌కి దగ్గర పొంచి ఉన్నారు పాకిస్తానీ మిలిటెంట్లు. అదును చూసి లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ దాటి మన భూభాగం లోకి వచ్చేశారు. అక్కడి నుండి నెమ్మదిగా కదులుతూ ముందుకు వస్తున్నారు. ఈ దురాక్రమణను అణిచివేయకపోతే అది యుద్ధానికి దారి తీస్తుంది. అందుకే అతను సీక్రెట్‌గా వాళ్ళని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

వాళ్ళు ఆ ప్రాంతం చేరుకునేటప్పటికి బాగా చీకటి పడింది. కొండలు లోయలు ఉన్న ప్రాంతం. దానికి తోడు విపరీతమైన చలి! అయినా సరే మొక్కవోని ధైర్యంతో ముందుకు కదులుతున్నారు. స్పై డ్రోన్‌ని పైకి ఎగరవేసారు. అది వీళ్ళకంటే ముందుగా కొంత ఎత్తులో సైలెంట్‌గా క్రూయిజ్‌ చేస్తోంది. దాని వీడియో అవుట్‌పుట్‌ని జాగ్రత్తగా చూస్తున్నాడు అతను. ఇంతలో అతనికి తెల్లని మానవ ఆకారాలు నేల మీద ప్రాకుతున్న దృశ్యాలు కనిపించసాగాయి. ఎలర్ట్‌ అయ్యారు అందరూ. ఆయుధాలను సరి చూసుకున్నారు. చలి దంచి కొడుతోంది. మంచు ధారగా కురుస్తోంది. అవేమీ లెక్కచేయకుండా పోరుకి సన్నద్ధం అయ్యారు. భారతమాతకు సేవ చేసుకునే అదృష్టం ఇప్పుడు వచ్చింది అని పొంగిపోయారు. కిల్లింగ్‌ ఇనిస్టింక్ట్‌తో ముందుకు కదులుతున్నారు. సమయం రానే వచ్చింది. శత్రువులని ఎదురుగా చూసేసరికి ఉగ్రుడై కాల్పులు మొదలు పెట్టాడు అతను. శత్రువులు అదిరిపడి ప్రతిదాడి మొదలు పెట్టారు. చాకచక్యంగా ఆ దాడిని ఎదుర్కొంటున్నారు మన సైనికులు. అతనితో పాటూ ఉన్నది నలుగురే. ఎక్కువ మంది అయితే శత్రువుల కళ్ళల్లో పడతారని లిమిటెడ్‌ టీమ్‌ని పంపారు అధికారులు. అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు. ఒక్కొక్కరిని మట్టుపెడుతూ ముందుకు కదులుతున్నారు మనవాళ్ళు. తుపాకీలు నిశ్శబ్దంగా తమ మారణహోమాన్ని కానిస్తున్నాయి. చిత్రంగా కాసేపు కాల్పులు ఆగాయి. అందరూ హతమయ్యారు అని భావించాడు అతను. కానీ ఇంతలో ఒక చురకత్తి వేగంగా వచ్చి అతని కళ్ళను తాకింది. “అమ్మా..” అని అరుస్తూ తుపాకీ వదిలేసాడు. వెంటనే ఇంకో సైనికుడు ఆ కత్తి విసిరిన శత్రువు గొంతులోకి బుల్లెట్‌ దించి వాడిని అంతమొందించాడు. వాడే చివరి శత్రువు. ఇక ఎవరూ లేరు. మిషన్‌ సక్సెస్‌ అయింది!!

నేత్రను ఆర్మీ హాస్పిటల్‌కి తీసుకు వచ్చారు. అప్పటికే పరిస్థితి విషమించింది. కళ్ళ నుండి రక్తం ఏకధాటిగా కారుతోంది. డాక్టర్లు శ్రమించి చికిత్స అందించారు. కానీ కంటి చూపు కోల్పోయాడు అతను. ట్రీట్‌మెంట్‌ పూర్తయ్యాక ఒకరిని తోడు ఇచ్చి ఇంటికి పంపించేసారు ఆర్మీ అధికారులు. నవ్వుతూ వెళ్ళి అంధుడై తిరిగి వచ్చిన భర్తను చూసి మూర్ఛపోయింది ఆమె. కన్నీరు మున్నీరు అయింది. “ఏమీ పర్వాలేదు.. నాకు నువ్వు ఉన్నావుగా” అని ధైర్యం చెప్పాడు నేత్ర.

***

కాలం సాగిపోతోంది. నెమ్మదిగా అతనికి అంధత్వం అలవాటైంది. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు కదా. అది అతనికి అవగతం కాసాగింది. కానీ అతను నిరుత్సాహపడలేదు. భార్య సాయంతో అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు.

ఒకసారి ఆమె షాపింగ్‌కి వెళ్తాను అని బయలు దేరింది. “నేనూ వస్తాను” అని మారాం చేసాడు నేత్ర.

“వద్దండీ.. చాలా రష్‌గా ఉంటుంది.. మిమ్మల్ని నేను హేండిల్‌ చెయ్యలేను” అంది.

“ఏమీ పర్వాలేదు.. వస్తాను” అన్నాడు. ఇక తప్పదని అతన్ని వెంట తీసుకెళ్ళింది. కేబ్‌ బుక్‌ చేసుకుని వెళ్ళారు ఇద్దరూ. అబిడ్స్‌లో దిగి షాపింగ్‌ చేసుకున్నారు. తర్వాత సుల్తాన్‌ బజార్‌ వైపు వచ్చి చిన్న చిన్న అయిటెమ్స్‌ కొనుక్కున్నారు.

“నాకు ఐస్‌ క్రీం కావాలి” అని అడిగాడు నేత్ర.

“అబ్బ.. మీరు రోజు రోజుకీ మరీ చిన్న పిల్లలు అయిపోతున్నారు” అని విసుక్కుంది.

“నువ్వు తల్లిలా నా పక్కనుంటే ఎప్పటికీ ఇలాగే చిన్న పిల్లాడిలా ఉండిపోతా” అని చిలిపిగా అన్నాడు. ఐస్‌ క్రీం కొని పెట్టింది. ఇష్టంగా తిన్నాడు.

తర్వాత గోకుల్‌ చాట్‌ వైపు రోడ్డు లోకి వచ్చారు. అక్కడి రోడ్డు మీద అమ్ముతున్న కొన్ని ఇంగ్లీష నావెల్స్‌ కొనుక్కుంది ఆమె.

“ఇవన్నీ నాకు చదివి బెడ్‌ టైమ్ స్టోరీస్‌లా వినిపించాలి” అని తమాషాగా అన్నాడు నేత్ర

“అలాగే మహానుభావా..” అని నవ్వింది. గోకుల్‌ చాట్‌ సమీపంలోకి వచ్చారు ఇద్దరూ. విపరీతమైన రష్. నడవడానికి కూడా సందులేకుండా జనం. షాప్‌ మీద ఎగబడి తింటున్నారు. ఇంతలో ఏదో అనుమానం వచ్చింది నేత్రకు. అతని అంతఃచక్షువు ఏదో ప్రమాదాన్ని హెచ్చరిస్తోంది.

ఆమెను దగ్గరగా తీసుకుని “ఏదో విధ్వంసం జరగబోతోంది..” అని అన్నాడు. ఆమె భయంగా చూసింది.

“అందరినీ దూరంగా వెళ్ళమను” అని గట్టిగా చెప్పాడు.

“పారిపొండి.. దూరంగా పారిపొండి” అని గట్టిగా అరిచిందామె. జనంలో కలకలం మొదలైంది. తింటున్న ప్లేట్లు విసిరేసి దూరంగా పారిపోయారు.

ఏం జరగబోతుందా అని విస్తుపోతూ చూస్తున్నారు. “అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చెయ్‌” అని చెప్పాడు నేత్ర. ఆమె వెంటనే కాల్‌ చేసింది. జనాలు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.

ఇంతలో ఢాం.. ఢాం.. అంటూ భారీ విస్ఫోటనం జరిగింది. అదిరిపడ్డారు అందరూ. కానీ అప్పటికే అందరూ దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. ఫైర్‌ ఇంజన్‌లు వచ్చాయి. మంటల్ని ఆర్పే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

బాంబ్ స్క్వేడ్ వచ్చింది. మిగతా చోట్ల ఉన్న బాంబులని డిఫ్యూజ్ చేస్తున్నారు. సిటీలో ఇంకొన్ని చోట్ల కూడా బాంబులు ఐడెంటిఫై అయ్యాయి. అన్నిటినీ డిఫ్యూజ్ చేసారు.

అందరూ నేత్ర చుట్టూ గుమిగూడారు.

“అంధుడైనా.. నీ భర్త చాలా గొప్ప వాడమ్మా..” అని త్రిషతో చెప్పి మెచ్చుకుంటున్నారు.

“ఆయన మాజీ సైనికుడు.. దేశ రక్షణే ఆయన ఊపిరి” అని చెప్పింది. సెల్యూట్‌ చేసారు జనం. ఈ వార్త అన్ని న్యూస్‌ చానెళ్ళ లోనూ ప్రసారం అయింది.

టీవీ చానెళ్ళు నేత్రను ఒక హీరోలా చూపించారు. కానీ మిగతా వాళ్ళలా హడావిడి చెయ్యలేదు నేత్ర. “అది నా బాధ్యత..” అని నవ్వి ఊరుకున్నాడు.

ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె అడిగింది “మీరు ఎలా పసిగట్టారు ఆ ప్రమాదాన్ని?” అని.

అతడు చిన్నగా నవ్వి చెప్పాడు. “గాలిలో తేలుతూ వస్తున్న ఎక్స్‌ప్లోజివ్స్ వాసన నా నాసికా పుటాలకి సోకింది. మీరు సాధారణంగా గమనించలేని ఆ వాసనని నేను పసికట్టాను. తీవ్రవాదులు బాంబ్‌ పెట్టారని గ్రహించాను. అందుకే మీ అందరినీ ఎలెర్ట్‌ చేసాను” అన్నాడు.

“నీవు సామాన్యుడివి కాదు నేత్రా.. హేట్సాఫ్‌” అంది.

“ఆర్మీలో నాకు నేర్పింది అదే.. సర్వేంద్రియాలను ఎప్పుడూ ఎలెర్ట్‌గా ఉంచుకుని రాబోయే ప్రమాదాన్ని పసిగట్టాలి అని. మాకు, మీలాంటి సివిలియన్స్‌కి అదే తేడా.. ఏది ఏమైనా ఒక పెద్ద ప్రమాదం తప్పింది ఈ రోజు” అన్నాడు.

“అవును..” అంటూ తేలిగ్గా ఊపిరి తీసుకుందామె.

***

నిజానికి కంటి చూపు కోల్పోయాక అతని కాన్సంట్రేషన్ మరింత పెరిగింది. శబ్దం, వాసన వీటి ద్వారా చుట్టూ ఉన్న విషయాలని చక్కగా వీక్షించగలుగుతున్నాడు. ఎందుకంటే అతను పుట్టు గుడ్డి కాదు. ప్రపంచాన్ని బాగా చూసాక చూపు కోల్పోయినవాడు. ప్రపంచం లోని అందాలు, ఆనందాలు, సుఖాలు, కష్టాలు అన్నీ చూసినవాడు. ఇప్పుడు చూపు కోల్పోయాక మనోనేత్రం తెరిచి అన్నిటినీ చూడగలుగుతున్నాడు. నేత్ర – విధివశాత్తు రెండు కళ్ళు కోల్పోయినా భార్య త్రిష మనసే అతనికి ఓ ‘నేత్రం’ !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here