కాజాల్లాంటి బాజాలు-19: అంతకు ముందు – ఆ తరువాత

1
4

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap] మధ్యనే వాలంటైన్స్ డే జరుపుకున్నాము. ఏదైనా వేడుకయిన సందర్భం జరుపుకోవాలంటే దానికి ముందు ఏర్పాట్లు చేసుకోవాలని అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రేమికులు ఈ రోజున బేకరీలకి స్వయంగా వెళ్ళీ అది కుదరనివాళ్ళు ఆన్‌లైన్ లోనూ వాళ్ల వాళ్ళ ప్రేమికులకి రోజాపూలూ, హృదయం ఆకారంలో ఉన్న ఎర్రటి బెలూన్లూ, కేకులూ, మంచి అర్ధాన్నిచ్చే వ్యాఖ్యలతో ఉన్న గ్రీటింగ్ కార్డులూ అందజేస్తుంటారు.

ఈ ముందు ప్రిపరేషన్లు అందరికీ తెలిసినవే కనక ఆ తర్వాత విషయమేమిటన్నదే నేను చెప్పబోతున్నది. వేలంటైన్స్ డే  మర్నాడు మా మేనకోడలు సిరి మా ఇంటికి వచ్చింది. అది ఇంజనీరింగ్ చదువుతోంది. సిరంటే నాకు భలే ఇష్టం. దాన్ని చూసినప్పుడల్లా నాకు నా చిన్నతనమే గుర్తొస్తుంటుంది. ఈ కాలం పిల్లల ఆలోచనలు తెలుసుకోవాలంటే ఆ వయసువాళ్ల తోటే మాట్లాడాలి కదా! అందుకే మా సిరి దగ్గర ఈ ప్రేమికుల దినోత్సవం టాపిక్ ఎత్తాను. “నీకెవరైనా గులాబీలు పంపించేరుటే!” అని చాలా మామూలుగా అడిగినట్లడిగేను. అది ఫక్కున నవ్వింది.

“ఇదంతా ఒక క్రేజ్ లాంటిది అత్తా, ఇలాగ మగపిల్లలు ఆడపిల్లలకి బహుమతులివ్వడం చాలా మామూలయిపోయింది. ఇవ్వడం ఏదో గొప్పతనంగా అబ్బాయిలనుకుంటే వట్టినే వస్తుంటే వద్దనడమెందుకని  తీసుకోవడం మా హక్కన్నట్టు మేం తీసుకుంటాం. అంతే. దీనివల్ల ముందు బిజినెస్ వాళ్ళు బాగుపడుతున్నారు..” అంది.

దాని సమాధానం విన్నాక నా అనుమానం సిరి తీరుస్తుందనిపించింది. నేను ఆ ప్రేమికులరోజు ఎందుకో అమీర్‌పేట వెళ్ళి వస్తుంటే ఓ కుర్రాడు కారు వెనక సీట్లో ఓ యాభై వరకూ హార్ట్ షేప్ లో ఉన్న బెలూన్ లని పెట్టుకుని వెడుతూ కనిపించాడు. అవి కూడా హైడ్రోజన్ గ్యాస్ నింపినవి. ఎగిరిపోకుండా కారు తలుపుకి గట్టిగా కట్టేసినట్టున్నాడు. అవి అటూ ఇటూ తెగ ఊగుతూ నా దృష్టిని ఆకర్షించేయి. ఆమాటే మా సిరికి చెపుతూ, “ ఆ కుర్రాడికి యాభైమందివరకూ లవర్స్ ఉంటారంటావా!” అనడిగేను.

మా సిరి నేను వేసిన పిచ్చిప్రశ్నకి నవ్వి నవ్వి ఇంక నవ్వలేక పొట్ట పట్టుకుని “యాభైమంది లవర్సా! హబ్బా హబ్బా.. నువ్వేవనుకుంటున్నావూ! ఆ కుర్రాడు ఒక్కొక్కళ్ళింటికీ వెళ్ళి తలుపుకొట్టి ఒక్కొక్కళ్ళకీ ఒక్కో బెలూన్ ఇస్తాడనుకుంటున్నావా  డెలివరీబాయ్ లాగా.. హ హ హ… ఎవరో ఒక్కమ్మాయికే తీసికెడుతుంటాడత్తా..” అంటూ ఇంక నవ్వలేక కింద కూలబడిపోయింది. నాకొళ్ళు మండింది. నేనూరుకోలేదు.

“ఏవిటీ! ఆ యాభై బెలూన్లూ ఒక్క పిల్లకేనా.. ఒకవేళ ఈ పిల్లాడు వెళ్ళి ఆ యాభై బెలూన్ల కట్టా ఆ పిల్ల చేతిలో పెడితే, అసలే హైడ్రోజన్ గ్యాస్ నింపినవి, ఒక్కసారిగా ఆ పిల్లని గాల్లోకి లేపేసి, ఆ పిల్ల తల వెళ్ళి సీలింగ్‌కి కొట్టుకుంటే ఈ కుర్రాడు నడుం పట్టుకుని ఆపుతాడా! అందులోనూ ఈ కాలం అమ్మాయిలు అసలే అస్తారుబస్తంగా నాజూగ్గా ఉంటున్నారు.

అలాకాకుండా ఒకవేళ ఈ పిల్లాడు రొమాంటిక్‌గా ఉంటుందనుకుంటూ ఏ పార్క్‌కో తీసుకుపోయి అక్కడ ఆ పిల్ల చేతిలో కనక ఈ బెలూన్లు పెడితే, ఇంక ఆ అమ్మాయి ఏకంగా అకాశంలోకే ఎగిరిపోతుంది.”

నేను సిరికి చెపుతున్నదంతా నా ఊహల్లో ఊహించేసుకుంటున్నదే!

మా సిరి నవ్వుని బలవంతంగా ఆపుకుని “అత్తా, నువ్వు మరీనూ. బెలూన్లకట్ట ఏవిటీ చీపురుకట్టలాగా.. చక్కగా బెలూన్ల బంచ్ అనొచ్చుకదా! అయినా ఆ మాత్రం ఆలోచన లేకుండానే అన్ని బెలూన్లు తీసికెడుతున్నాడంటావా ఆ అబ్బాయి.” అంది.

“అన్ని బెలూన్లు తీసుకుని ఆ అమ్మాయి యేం చెసుకుంటుందే!”

“అబ్బా అత్తా, అలా అనకూడదు. అలా అన్నవాళ్లని ప్రేమించే హృదయం లేని వాళ్లంటారు. అందుకే ఇచ్చినవి ఎంచక్కా పుచ్చుకోవాలి. ఇలా స్వయంగా ఇవ్వడవే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా పంపిస్తుంటారు అబ్బాయిలు ఈ బహుమతులు.”

నాకేం తెలీదనుకుంటోందేమో ఈ పిల్ల అనుకుంటూ, “అది నాకూ తెలుసులేవే.. ఒక్కమ్మాయికే ఇన్ని బెలూన్లు పట్టికెడుతున్నాడంటే ఇంక ఆన్‌లైన్‌లో ఆ డెలివరీ అబ్బాయి చాలామందికి అందివ్వాలి కదా! అన్ని బెలూన్లు డేలివర్ చెయ్యడానికి యే టెంపోయో కావాలేమో..”అన్నాను.

దానికి మా సిరి వెటకారంగా,”అబ్బే టెంపోకాదు.. లారీలో వేసుకెళ్తాడు..” అంది.

నాక్కోపం వచ్చింది. ఎంత తెలీని విషయం అడిగితే మటుకు మరీ ఇంత వెటకారమా..

“మరి అన్ని బెలూన్లూ, బొకేలూ ఎలా పట్టికెళ్తాడే..” అన్నాను. దానికి సిరి “ఈ కొరియర్ వాళ్ళేమైనా తెలివితక్కువ వాళ్ళా.. బెలూన్లన్నీ గాలి కొట్టకుండానే ఒక పేకెట్లో పట్టికెడతారు. డెలివరీ చేసేవి ఏ రెండో మూడో బెలూన్లయితే ఆ ఇంటికి కాస్త దూరంలో ఆగి, పంప్ తో బెలూన్లలో గాలి నింపి వెళ్ళి ఇచ్చి వస్తారు. అంతకన్న ఎక్కువ బెలూన్లు ఆర్డరుంటే అవన్నీఊదకుండానే ఒక పేకెట్ లో పెట్టేసి ఇచ్చేస్తారు. లేకపోతే ఇలా ఒక్కొక్క ఇంటిదగ్గరా డజన్లకొద్దీ బెలూన్లు గాలి కొట్టాలంటే వాళ్లకెంత టైమ్ వేస్టూ. ఈ లోపల ఇంకో పదిమందికి డెలివరీ చెయ్యొచ్చు. అందుకని పేకెట్లో పెట్టి ఇచ్చేస్తారు” అంది.

నాకింకో అనుమానం వచ్చింది. “మరి ఇలా పేకెట్లో వచ్చిన బెలూన్లన్నీ ఆ పిల్ల నోటితో ఊదుకుంటూ కూర్చుంటుందా! అందరిళ్లలోనూ గాలి కొట్టే పంపులు ఉండవు కదా!” అన్నాను.

నా ఊహల్లో ఓ కాలేజీ అమ్మాయి పక్కన ఎర్రగులాబీల గుత్తి పెట్టుకుని, మధ్యమధ్యలో కేకుముక్క తింటూ, మధ్యలో ఓసారి ఆ పక్కన పెట్టిన వాలెంటైన్ కార్డ్ మీద ఓ చూపు పడేస్తూ, ఒక్కొక్కటిగా బెలూన్లు ఊదుతున్న దృశ్యం కదలాడింది.

నా మాటలకి కిందపడిన సిరి ఈసారి కాసేపటిదాకా లేవలేకపోయింది. నాకో దండం పెట్టేస్తూ “అత్తా, ఇంక ఊహించేసుకోకు. మేమంత పిచ్చివాళ్లలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి..” అంది.

“మరేం చేస్తారే!” అన్నాను.

“ఇలా యాభై బెలూన్ల పేకెట్ వచ్చినప్పుడు సంధ్య ఏం చెసిందో తెల్సా!” నేను కొంచెం ముందుకి వంగేను.

“ఆ పేకెట్ పట్టికెళ్ళి వాళ్ల సందు చివరున్న కిరాణాకొట్లో ఇచ్చేసి కాడ్బరీస్ చాక్లెట్ తెచ్చుకుంది” అంది.

నేను నోరావలించేను. హాసినీ, ఎంత గడుగ్గాయిలూ ఈ ఆడపిల్లలూ.. అనుకున్నాను.

“పాపం, ఆ పిల్లాడు అంత ప్రేమతో అన్ని డబ్బులు ఖర్చుపెట్టి పంపితే ఇలా చెయ్యడం పాపం కదే!” అన్నాను.

“ఏవిటి పాపం. ఊరుకుంటున్నకొద్దీ ఈ అబ్బాయిల పిచ్చికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. లేకపోతే ఓ ప్రేమ పిచ్చోడు ఎవరో రేఖకి సరిగ్గా డేట్ మారే టైమ్‌కి అంటే ఆ రోజు అర్ధరాత్రి పన్నెండుగంటలకి ఈ బహుమతులు అందించమన్నాడుట. ఆ కొరియర్ బాయ్ అర్ధరాత్రి లేపేటప్పటికి ఇది వాణ్ణీ, వీణ్ణీ ఇద్దర్నీ కలిపి పిచ్చతిట్లు తిట్టిందిట..”

వామ్మో, ఇలాంటివాళ్ళు కూడా ఉంటారా అనుకున్నాను.

“పాపం, సరిగ్గా అర్ధరాత్రి డెలివర్ చెయ్యడానికి ఆ పిల్లాడు ఎన్ని డబ్బులు ఎక్కువ కట్టేడో..”

ఈ విషయం మీద నాకున్న ఉత్సాహం చూసిన సిరి,

“ఇంతేనా ఇంకా ఇలాంటి కబుర్లు బోలెడు చెప్తాను, మరి నాకేంటిటా..” అంది అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావులాగా ఒకచేత్తో ఇంకో చేతి మీద కొట్టుకుంటూ.

“చెప్పు, చెప్పు, నీకేం కావాలంటే అదిస్తాను..అసలు అన్నింటికన్న ముందు నీ విషయం చెప్పు.. నీకెన్ని గులాబీగుత్తులు వచ్చేయీ!” అన్నాను కొత్త విషయాలు తెలుస్తాయన్న  సంబరంతో.

“అయితే గులాబ్‌జామ్ చేసి రెడీగా ఉంచు. రేపొచ్చి చెప్తాను.” అంటూ తుర్రుమంది సిరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here