[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘అంతరార్థాలు..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]వి నిన్ను అనుక్షణం వెంటాడుతూ
నీకవి అనునిత్యం దర్శనమౌతూ
మదిని దోచుకుంటూనే ఉంటాయి
ఆదమరిచి ఉంటే చాలు
నీ ఉనికిని గల్లంతు చేసి సేద తీరుతుంటాయి..!
నీలో నిర్మొహమాటం ఉండనంత కాలం
ప్రశ్నల కొడవళ్ళు మొలవనంత కాలం
నయవంచక అవస్థల ప్రపంచం మారదు
నిన్ను నువ్వు పదును పెట్టుకోనంత కాలం
నీదైన అస్తిత్వానికి అంకురార్పణ జరగదు..!
అనంతమైన ఆలోచనల ముసురులో
జ్ఞాపకాల సుడిగుండంలో
భయానకమైన స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే
ఆచరణాత్మకమైన ఆపన్న హస్తం
దొరుకుతుందనే ఆశల్ని వదిలించుకోవాల్సిందే..!
ఎవరికి వాళ్లు దుర్భేద్యమైన గోడల్ని
అత్యంత పగడ్బందీగా నిర్మించుకున్నారు
మనసులోని భావాల్ని దాచుకోలేవు
అట్లని బయటికి కథనంలా చెప్పుకోలేవు
బందీఖానాలో కుమిలిపోతూనే ఉంటావు..!
దుఃఖ భరితమైన దారులకు అంతం లేదు
ఓదార్పుల కెరటాలకు కొదువలేదు
ఎన్నెన్నో ఉద్వేగాలను ముదుపులో పెట్టుకున్నా
ఒంటరి తండ్లాటల యాతనలు
నిన్ను అల్లుకొని సతమతం చేస్తుంటాయి..!
మాటల్లోని తాజాదనమింకా తరిగిపోదు
మనల్ని హత్తుకునే ఉంటుంది
సంక్లిష్టమైన జీవనయానంలో అన్ని దక్కవు
ఉపయుక్తం కానివి మాత్రం
పుంకాలు పుంకాలుగా వచ్చి చేరుతుంటాయి..!
కండ్లముందే రంగులు మారుతున్న ముఖాలు
అప్పుడప్పుడు బయటపడుతున్న నిజాలు
ఆశ్చర్యంతో చూడడం తప్ప ఆచరణకు దారేది
సాధనోత్సాహం సన్నగిల్లిపోయింది
అంతరార్థాలతో కలత చెందుతున్నారెందరో…!