Site icon Sanchika

అంతరం-3

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో డాక్టర్ జయప్రకాష్ మవినాకులి “అంతర” పేరిట వ్రాసిన నవలను “అంతరం” అనే శీర్షికతో తెలుగులో అందిస్తున్నారు స్వాతీ శ్రీపాద. ఈ ధారావాహికలో ఇది మూడవ భాగం. [/box]

[dropcap]నే[/dropcap]ను మర్నాడు మన డిపార్ట్‌మెంట్‌కి త్వరగా వచ్చాను. అసాధారణమైన మానసికత నాకు ఇష్టమైన టాపిక్. అది అంత త్వరగా తలకెక్కదు. అర్థం కాక తలగోక్కు౦టున్నాను. ఆ అసౌకర్యం గమనించి రీడర్ స్వర్ణ అడిగారు, “ ఏమైంది నీకు?”

నిశ్శబ్దమే నా జవాబు. మొత్తం క్లాస్‌లో నేనొక్కదాన్నే ఒంటరిగా ఫీలయాను, డెస్క్ చివర కూచుని ఉన్నాను. కీ బంచ్ మీద ఏదో రాస్తున్నాను. దగ్గరగా పరీక్షిస్తే ఆ వాక్యం కనబడుతు౦ది.

సువర్ణా ప్రభాకర్ ..సు..వ.,,ర్ణా.. ప్ర…

ఆ రోజు మన డిపార్ట్‌మెంట్‌కి త్వరగా వచ్చాక నీ హాస్టల్ వంక చూస్తూ కారిడార్‌లో ని౦చున్నాను.

గోడ మీద చీమలు వరసలు వరసలుగా క్రమశిక్షణతో వెళ్తున్నాయి.

ప్రభాకర్ మనిషి తన భావోద్వేగాలకు బానిస కారాదని అనిపించింది నాకు. సున్నితమైన భావాలకు అతను అతీతంగా పెరగాలి. అతను ఏకాంతపు భావన అనుభవించాలి, అమ్మాయిలకు ఏమాత్రం తక్కువ కాదుగా. నిన్న గాక మొన్న మీరా డైనింగ్ హాల్‌లో నాతో చెప్పింది.

“సువర్ణా, ఏ విషయానికీ గాభరాపడకు. శాంతంగా ఉండు. ఎప్పటికీ ఆనందంగా ఉండటం మన చేతిలో లేనిది అనుకోడం ఒక వంక అంతే.”

నీకు మీరా తెలుసనుకుంటాను, బొద్దుగా, గుండ్రంగా టమాటాలా ఉంది గాగుల్స్ పెట్టుకుని సీతాకోక చిలుకలా చంచలిస్తూ ఉంటుంది.

గుర్తుందా? లేదా? తన అతిపెద్దవైన రొమ్ములు ప్రదర్శి౦చుకుని ఆనందపడిపోతు౦దే, అయినా అవి ఏమీ సహజమైనవి కాదు, కృత్రిమంగా పాడ్‌లు అమర్చుకు౦టు౦ది.

ఆ రొమ్ముల వల్లే అది పేరు తెచ్చుకుంది. రెండు సార్లు అబార్షన్లు కూడా చేసుకుందని చెప్పుకుంటారు. వాటి గురించి పెద్ద పట్టి౦చుకోదు. అదెప్పుడూ ఆధునికత నావలో తేలుతూ వికసించే అమ్మాయినని గర్వపడుతుంది. దాని నడుమ్మీద జారుతున్న రెండు మూడు ముడతలు దాని యౌవన కథనాన్ని చెప్తాయిగా.

నిన్న గాక మొన్న నువ్వు దానితో వెళ్లావుగా? నువ్వు ఏ మాత్రం మామూలు మనిషివి కాదు. సంబంధాల సున్నితత్వం నీకు అర్థం కాదు. అందుకే కావాలనే నాతో మాట్లాడలేదు. నువ్వు పక్కకి జరిగి వెళ్ళిపోయావు.

నేన్నీతో ఎందుకు మాట్లాడాలి? నీతో మాట్లాడి రెండు రోజులైనా ఎన్నో ఏళ్ళు అయినట్టుగా అనిపి౦చి౦ది నాకు.

అందుకే నేనూ నా ప్రాక్టికల్స్ క్లాస్‌కి వెళ్ళలేదు. నువ్వు సైకాలజీ విద్యార్ధివి. నన్నెందుకు అర్ధం చేసుకోలేవు? నన్నింత నిర్లక్ష్యం చెయ్యడం నీకు తగునా? నువ్వు విపరీతమైన ఆధిక్యతా భావం పెంచుకున్నావు. నీకు విపరీతంగా నీ గురించి నువ్వు పట్టించుకోడం అలవాటై ఎదుటి వారిని తక్కువ అంచనా వేస్తున్నావు. ఎందుకిలాటి భావన పెంచుకున్నావు?

ఈ వ్యక్తిగత బలహీనత పట్ల నీకు సునిశితమైన ఆలోచనలు ఎందుకివ్వలేదో ఆ భగవంతుడికే తెలియాలి.

తరువాత రోజున నువ్వు కారిడార్‌లో వస్తున్నావు. షేవ్ చేసుకోకుండా ఉన్న నీ నిర్లక్ష్యత నీ అవతారం చెపుతోంది. క్లాస్ లోకి వచ్చావు. నేనెపుడూ చూడనట్టుగా నటన. నేను నా అహం వదులుకుని ‘హలో’ అని పలకరించాను.

‘హలో’ నీ జవాబు. నావైపు చూసి క్లాస్ లోకి వెళ్లి పోయావు. ఆగి మాట్లాడతావనుకున్నాను. క్లాస్ ఎగ్గొట్టి కాంటీన్‌కి వెళ్లడమో లేదా పార్క్‌కి వెళ్లి సరదాగా గడపాలనో అనుకున్నాను. కాని నువ్వు నా వెచ్చని, నా తొలి ప్రేమ కోరిక పట్ల కోపం ప్రదర్శించావు. రోజూ ఎవరితో ఏ౦చేస్తున్నావో తెలిసిన నాకు నీ భుజం పట్టుకుని లాక్కువెళ్ళడం సాధ్యమా? నా పరిశోధనా క్రమంలో ఎన్ని క్లాస్‌లు డుమ్మా కొట్టానో కదా?

ఆ రోజుల్లో నువ్వు ఆర్‌తో కలిసి తిరుగుతున్నావని నేను కనుక్కున్నాను. ఒక రోజున కాంటీన్‌లో నేను నిన్ను ఆమెతో చాలా దగ్గరగా ఒక నిర్లక్ష్య ధోరణిలో చూసాను. నాలోని నిజమైన ప్రేమ ఈర్ష్యతో పిచ్చెక్కి ఆమె గొ౦తు నులిమి చంపెయ్యాలనే నేర స్థాయికి చేరింది. నా నరాలన్నీ నిప్పుల పైన ఉన్నట్టయి౦ది. విసిగిపోయిన ప్రేమ వల్ల వచ్చే ఈర్ష్య ప్రేమ కన్నా ఎక్కువ తీవ్రతను జీవిస్తుంది.

నేనెంత బాధపడ్డానో ఊహించగలవా?

వరుసగా నిద్రపట్టని రాత్రులు ఎన్నో… ప్రేమ రహస్యాలు బట్టబయలు కానంత వరకూ రహస్యంగా ఉన్నంత వరకూ అందరూ దగ్గరే.

కాని అవి అనుభవతకు వచ్చాక అందరూ నిన్ను వదిలేస్తారు ప్రభాకర్.

ప్రతి వారికీ ఒక హృదయం ఉంటుంది. పొగడ్తలు కురిసినప్పుడు బెలూన్‌లా ఉబ్బిపోతు౦ది.

పక్కకు నెట్టేయ్యగానే అది పేలిపోతుంది.

సైకాలజీ విద్యార్ధిగా నీకిది తెలిసి ఉండాలి. అమ్మాయిల హృదయం ఒక సున్నితమైన పుష్పం. మనిషికి హృదయం కావాలి. నీకా హృదయం ఉందా?

హృదయం అంటే హృదయమే. విలియం హార్వే చెప్పినది విన్నావా?

“హృదయానికి పక్కపక్కన రెండు పంపులు ఉంటాయి. ఒకటి కుడి వైపు ఒకటి ఎడమ వైపు. ప్రతి పంపుకు రెండు గదులు ఉంటాయి. ఒకదానిపైన ఒకటి. పైనున్న సన్నటి గోడలు గలవి ఆరికిల్స్, కింద ఉన్నవి వె౦ట్రికిల్స్…”

నాకూ ఒక హృదయం ఉందనే మామూలు సత్యం నీకెందుకు తట్టలేదు? మొ౦డితనం నీ రక్తపు లక్షణమైతే నాలోనూ అంతో ఇంతో అది లేకపోలేదు. నీ స్మార్ట్‌నెస్ నీకు తెలుసు సైకాలజీ విద్యార్ధిగా. నేను క్లాస్ లోకి రాలేదు. నేను హాస్టల్ తిరిగి వెళ్లి పడకపైన వాలాను.

హాస్టల్ వట్టిపోయినట్టు కనిపించింది. అందరూ క్లాస్‌లకు వెళ్ళారు. నా హృదయాన్ని నిశ్శబ్దం వేదించి౦ది. ఇంటి గురించి, అమ్మ గురించి ఆలోచించి విరక్తి చెందాను. ఆ అతి పెద్ద విశాలమైన కాంప్‌లో నేను ఒకే ఒక్క ఒంటరి అనాథను అనుకున్నాను.

మా నాన్న నా పెళ్ళి జరిపించి ఉంటే …

నిశ్చయమైన పెళ్లి గనక జరిగిపోయి ఉంటే…

నా వెనకాల వె౦టాడుతున్న జ్ఞాపక౦

అది జనవరి నెల అనుకుంటాను. ఒకరోజున చిలక జోస్యం చెప్పే హలక్కి నరసన్న మా గేట్ ముందు ఆగి “అంతా సవ్యంగా ఉంది..” అంటూ మొదలు పెట్టాడు. నానమ్మ వరండా వైపు పరుగున వెళ్ళింది.

నాన్న వరండాలో తమలపాకులు నములుతూ కూచున్నాడు.

ఆ చిలక జోస్యగాడు మళ్ళీ మొదలెట్టాడు. “మంచి రోజులు, శుభ ఘడియలు ముందున్నాయి”

“ఏమివ్వను? బియ్యమా? పోక చెక్కలా?” నానమ్మ అడిగింది.

వాడికి ఏదీ వద్దట. “మీ ఇంట్లో పవిత్రమైన శుభ సంఘటనలు జరగబోతున్నాయి” అన్నాడు.

నానమ్మ సంతోషంగా నమ్మకంగా వింది. మధ్య ఇంట్లో వాస్తు గడప దాటుతున్నాను నేను. జోస్యం చెప్పిన ప్రతి మాటా విన్నాను.

నేను చిన్నప్పుడు లంగా జాకెట్ వేసుకునేప్పుడు స్కూల్‌కి పరుగెడుతుంటే నానమ్మ కథలు చెప్పేది. జోస్యగాళ్ళు శ్మశానాన్ని దర్శిస్తారనీ, అక్కడ భవిష్యత్తు చెప్పే పక్షులు వీళ్ళ చెవుల్లో అందరి భవిష్యత్తు చెప్తాయనీ. వాళ్ళు చెప్పినదంతా జరిగి తీరుతుందనీ.

నానమ్మ అతనికి బోలెడు వక్కలు, పాత బట్టలు ఇచ్చింది.

“సువ్వి వెళ్లి దేవుడి దగ్గర దీపం వెలిగించి సాష్టా౦గపడు” అంది నానమ్మ. నేను కాదనలేదు.

ఆ రోజు రాత్రి నా కలల ప్రపంచంలో ఆ భవిష్యత్తు చెప్పే పక్షి మా ఇంటిముందు కూచుని ఉంది. పిడికెడు బియ్యం తెచ్చి అడిగాను, “భవిష్యత్తు చెప్పే పక్షీ, మంచి భవిష్యత్తు చెప్పు”

కాని ఆ పక్షి మౌనంగా ఉ౦డి పోయి౦ది.

మళ్ళీ కల. ఆ పక్షి నా ఎద పైన కూచుని “సువ్వి నీ పెళ్లి త్వరలో జరుగుతుంది. దక్షిణ కన్నడ నుండి వస్తాడు వరుడు. అందగాడు…”

నాకు మెలుకువ వచ్చింది కాని ఆ భవిష్యవాణి పక్షి ఎగిరిపోయింది. నిద్ర కూడా కేవలం దాని ఆలోచనలు జారవిడిచి వెళ్ళిపోయింది.

అతను అలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? అతని ఒంటి రంగు ఎలా ఉంటుంది? మీసాలు ఉంటాయా అతనికి? ఎన్నో వ౦దలకొద్దీ ఊహలు…

పవిత్రమైన శుభ సంఘటనలు జరగబోతున్నాయి—

అంతా మ౦చే, బాగుంది కాని పూర్తిచెయ్యకుండా ఆ భవిష్య వాణి పక్షి ఎందుకలా ఎగిరిపోయింది.

ఆ జ్యోతిష్యుడు, చిలక సాయంతో చెప్పిన జోస్యం నిజమై౦ది. పవిత్రమైన శుభ సంఘటనలు జరగబోతున్నాయి

అది చెప్పాక నా నిశ్చితార్ధం కుదిరింది ప్రభాకర్. పెళ్లి పత్రికలూ ప్రి౦ట్ అయ్యాయి. హాల్ పచ్చని మొక్కలతో పూలూ మొగ్గలతో అల౦కరి౦చారు.

ఇంటి నిండా బంధువులు, ఆహ్వానితులు. వచ్చిన పెళ్లి వాళ్ళకోసం వంట వాళ్ళు స్వీట్లు మరికొన్ని పిండివంటలు చేస్తున్నారు. మా వైపు అమ్మ, అన్నయ్య, మామయ్యా, అన్నయ్య పెళ్లి వాళ్ళను ఎదుర్కొని ఆహ్వానించటం కాస్త ఆలస్యమయింది. అది చాలు కదా. అది వారి అహాన్ని గాయపరచింది. వాళ్ళు కార్లు దిగడానికి నిరాకరించారు. ముగింపుకి అది మొదలు. ఆ సంఘటనకు ఎదురు చూడని నాంది అనిపి౦చి౦ది.

మా అత్తయ్య నన్ను అల౦కరిస్తో౦ది. నేను నా కలలు కట్టుకు౦టూన్నాను. నా మనసూ శరీరమూ కూడా వికసించి ఒక తియ్యని ఎదురు చూపులో పువ్వులా మారాయి.

ఆ సమయంలోనే అత్తయ్యను ఎవరో పిలిచారు. వాళ్ళు ఏవో లో గొ౦తుకలతో మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య తలుపు మూస్తూ “సువ్వీ జడ అల్లుకో” అని బయటకు వెళ్ళింది.

వాళ్ళ మాటలు వినబడటం లేదు. నేను గది తలుపులు తెరిచి మధ్య నడవా దాటి తలుపు దగ్గర నిల్చున్నాను.

పందిట్లో అంతా అయోమయంగా ఉంది. మా మామయ్యా అన్నయ్యా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు చల్లబరచడానికి. బయటి వరండా మెట్లు నెమ్మదిగా దిగి అలంకరించిన పందిట్లోకి అడుగుపెట్టాను నేను. పురోహితుడు వెండి పళ్ళెం పట్టుకుని నిల్చుని ఉన్నాడు. పెళ్ళికొడుకు చుట్టూ లాజలు చల్లి స్వాగతం పలికారు పురోహితులవారు.

అబ్బాయిలు గోలగోలగా అరుస్తున్నారు. “పెళ్లి ఎలా జరగదో చూస్తాము” అని. మా మామయ్యా ఇటూ అటూ పరుగులు తీస్తున్నాడు రాజీ కుదర్చడానికి.

వాళ్ళ కండిషన్ పెళ్లి కూతురి తండ్రి క్షమార్పణ కోరాలి.

మా అన్నయ్య , “ నాన్నా మీరు క్షమించమని అడగనవసరం లేదు. నేను అడుగుతాను” అన్నాడు. కాని పెళ్ళికొడుకు తరఫు వారు మొండిగానే ఉన్నారు. ఆ పెళ్ళికొడుకుకు ఎంత ధీమా, ఆత్మా గౌరవం ఉన్న ఏ పెళ్లి కూతురి తండ్రీ ఎప్పటికీ లొ౦గిపోడు. అందరూ నాన్నకు నచ్చజెప్పాలని చూసి ఓడిపోయారు.

చివరికి, నాన్న తన సంస్కారం, సంప్రదాయం నిలబెట్టుకుని కూతురికి మంచి చెయ్యాలని అనుకున్నాడు. ఆయన అంతక్రితం ఎవరికీ ఎప్పుడూ తల వంచలేదు.

ఎంత అందంగా ఉన్నాడు పెళ్ళికొడుకు! అతను ముంబైలో ఒక ఇంజనీరు. పెళ్లి అనేది పూర్తిగా ఒక భిన్నమైన వాతావరణం నుండి వచ్చే అమ్మాయికి ప్రేమ ఒక ఆశ్రయం ఇచ్చే ఒక సజీవమైన బాధ్యత.

కొత్త జీవితం వికసించి పుష్పి౦చాలి. పెళ్ళిలో కళ్ళ కలయికకు మి౦చి మరేదో ఉంటుంది. అది కేవలం ఒక పిచ్చి శృ౦గార కౌగిలింతలో నగ్నంగా పవళి౦చడానికి కాదు. పెళ్లి అనేది ఒక జంట ఆనందకరమైన అర్ధవంతమైన జీవనం ప్రతినిమిషం కలిసి గడిపేందుకు ఒక సాంప్రదాయిక ఆరంభ సంరంబం.

కాని ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. హఠాత్తుగా పెళ్ళికొడుకు కోరలు, పొడవైన గోళ్ళు పెంచుకున్నాడు. అతను పెళ్లి కొడుకా? ఒక రాక్షసుడు.

ఒక మనిషి ఎంత త్వరగా ఒక రాక్షసుడిలా మారాడు? ఎంత దారుణమైన మోసం? నేను నా సుషుప్తి నుండి మేల్కొన్నాను. ఆ గుంపు మధ్యనుండి ముందుకు నడిచాను. మా అత్తయ్య నావెనకాల అరుస్తూ పరుగెత్తుకు వచ్చింది. “సువ్వీ, సువ్వీ ఒద్దు, ఎవరక్కడ, సువ్విని పట్టుకో౦డి. పెళ్లి కూతురిని పట్టుకో౦డి” అని.

ఆ సమయంలో నేను అక్కడికి చేరాను. ఎర్రటి సిల్క్ బట్టల్లో ఉన్న మా నాన్న తన కాబోయే అల్లుడి కాళ్ళు తాకడానికి తల వంచాడు. ఆ క్రమంలో ఈ వెండి పాత్రను తన కొడుక్కి అందించాడు.

పెళ్లి కొడుకు, ఆ కార్యక్రమంలో ఉత్స విగ్రహం అనేవాడు నెమ్మదిగా కారు లోనుండి కాలు కింద పెట్టబోతున్నాడు.

నాన్న చేతులు పట్టుకుని అరిచాను, “నాన్నా, ఒ౦గవద్దు, లొ౦గవద్దు. అది మనకు మంచిది కాదు. మీ చేతులు మమ్ములను దీవి౦చాలి, కాని కాళ్ళు పట్టుకు౦దుకు కాదు”

“మనం పెళ్ళికూతురు వైపు వాళ్ళం కదా, ఒదిగి ఉ౦డాలి. అమ్మాయ్, నువ్వు లోపలకు వెళ్ళు” అన్నాడు నాన్న.

చిరచిర లాడుతూ, పొగలూ సెగలూ కక్కుతూ కోపం వెంటనే తన్నుకు వచ్చింది, “ముట్టుకోడం వదిలెయ్యండి మీరు వాళ్ళ కాళ్ళు నాకినా, నేనీ పెళ్లి చేసుకోడం లేదు. వాళ్ళు మహారాజులా వెనక్కు వెళ్లి ఇంటిదారి వెతుక్కోవచ్చును. ఇక్కడికి ఈ పెళ్లి అధ్యాయం ముగిసింది” అన్నాను.

తడబడుతున్న స్వరంతో నాన్న అన్నాడు, “ అమ్మాయ్, సువీ, సువ్వీ…”

“నాన్నా గొప్ప నగరవాసులు ఈ గొప్ప జనాలు ఎంత తక్కువ వాళ్ళో చూపించుకున్నారు. రేపు ఎలాటి అనుమానం నీడైనా లేకుండా నన్ను ముంబై మార్కెట్ లో అమ్మేస్తారు” అలా అంటుంటే నా కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.

మా నాన్నకు నేను అవిధేయంగా ఉండటం, నా లోలోపలి శక్తిని ప్రదర్శించటం అదే మొదటిసారి. స్త్రీని ఎప్పుడూ లెఖ్కలోకే తీసుకోరు కాని క్లిష్టమైన సమయంలో ఆమె కదా అగ్నిపర్వతం లావాలా ఎగసేది?

అది ప్రకృతి రక్షణ విధానం. అంత వరకూ ఎప్పుడూ నా స్వాతంత్ర్య ఆలోచనా కార్యశీలత ప్రదర్శించలేదు. ప్రవాహంతో పాటు ముందుకు వెళ్తున్నాను అంతే.

ఎవరికి తెలుసు, నా యక్తిత్వంలో అదే ఒక ధనాత్మక లక్షణమేమో.

నా స్వతంత్ర భావన ఒక ఒక మెరుపు చర్యను వెలిగించింది. ఆ మగపిల్లలు పెళ్ళికొడుకు కాలర్ పట్టుకున్నారు. కాని మా మామయ్యా, అన్నయ్య పెళ్ళికొడుకును వాళ్ళ పట్టునుండి విడిపించారు.

పవిత్రమైన పెళ్లి ప్రదేశం యుద్ధరంగంలా కోలాహలంగా మారిపోయింది.

పవిత్ర కార్యక్రమం ప్రశాంతత చెదిరి చెలరేగిన యువతతో తుఫానులా మారిపోయింది. కోపంతో చెలరేగిపోయిన గు౦పును కంట్రోల్ చెయ్యడం కష్టమై పోయి౦ది. నేను ముందుకు జరిగి గట్టిగా అరిచాను.

“వాళ్ళు మన అతిథులు. వాళ్ళ అవమానం మన అవమానమే. మీరు వాళ్ళపైన చేతులు ఎత్తితే అది నా మీద ఎత్తినట్టే. ప్లీజ్ నాగరికంగా , కంట్రోల్ లో ఉండండి”

పెళ్లికొడుకు రక్షి౦చబడ్డాడు. సినిమాలో లాగ గోల, గొడవ సద్దుమణిగాయి. వాళ్ళు క్లూ అందుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారు. నాన్న దూరం నుండి మా అన్నయ్యని అరిచారు.

“వాళ్ళు దూరం నుండి వచ్చారు. తిండి తిని పొమ్మని చెప్పు”

నేను లోపలి వెళ్లి దేవుడి గదిలో కూచున్నాను. మా అమ్మ దీపాలు వెలిగించి ఏడుస్తూ కూచుంది. స్త్రీ అంటే మార్కెట్ లో అమ్మకానికి పెట్టిన వస్తువుకాదు. వేలానికి పెట్టిన చేప పిల్లా కాదు. అమెరికాలో నీగ్రో స్త్రీలను అమ్మకానికి పెట్టే ముందు కొనేవాళ్ళు వాళ్ళ శరీరం ముట్టుకుని నొక్కి చూస్తారట.

ఎంత అనాగరికపు పశు చర్య అది.

ఎంత లజ్జాకరమైన పురుష ప్రవృత్తి.

మీకు దున్నపోతులకూ మధ్య తేడా ఏమిటి? నేనంత ధైర్యం ఎలా కూడగాట్టుకున్నానో నాకే తెలియదు. అది ధైర్యం కూడా కాదు. అదొక ప్రేరేపిత దశ.

నీళ్ళలో దూకే వరకూ ఈత రాదు. ప్రభాకర్ మీ మగవారంతా మూర్ఖులు. మీరంతా ఉపయోగి౦చుకోడం గురించి మాట్లాడతారు. కాని ఈ రోజు నేను చెప్పనా, పురుషులు స్త్రీలను ఎక్స్‌ప్లాయిట్ చేస్టారు, వారిని హారాజ్ చేస్తారు.

తిరుగుబాటు అంటూ వస్తే అది స్త్రీల ను౦డే వస్తుంది. పురుషులకి అది స్పష్టంగా తెలియదు. మనిషి తన అంతరాత్మను పోగొట్టుకున్నాడు. జీవితాన జలప్రళయం సమయాన కనిపించని మౌలికమైన హస్త౦ ఒకటి ఉండే ఉంటుంది కార్యాచరణలో.

ఈ సంఘటన తరువాత మేమంతా విపరీతంగా దిగులు పడిపోయి ఒకరకంగా వదిలేసిన వారలా అనుకునేవార౦. నా మనసు ఒక రకమైన ఉద్రేకపూరితంగా ఉండేది. నేను తప్పు చేసానేమో అన్న భావన మొదలైంది. మృత్యువు తప్పి౦చుకోలేనిదే గాని పోగొట్టుకు౦దుకు జీవితం ఎంతో విలువైనది కదా.

నా విషాదకర ఘట్టం తరువాత ఒకరకమైన చీకటి మా ఇంటి చుట్టూ ఆవరి౦చుకు౦ది. జీవితం మా అందరికీ నల్లగా కనిపించడం మొదలైంది.

నిశ్శబ్దం రాజ్యమేలేది. కళకళలాడే వాతావరణం వాడిపోయింది. దౌర్భాగ్య స్థితి పెరిగింది. అందరూ ఇంట్లోనే ఉండేవారు. బయటకు వెళ్ళే ఆసక్తే లేదు. మాటలకోసం తంటాలు పడేవాళ్ళం. గృహ జీవనం అలా అణగారిపోయి౦ది. నాన్న స్థితి విషాదకరంగా మారి మేం ఆయన మొహం చూడటానికే భయపడేవాళ్ళం

నాన్న ఇంటి బాధ్యత అన్నయ్యకి అప్పగించారు. నాన్నఎప్పుడూ గొణుక్కోడం వినబడేది “ ఇంటి పరువూ ప్రతిష్టా ఒక రకమైన ఒక నిరాశ, విసుగు అనే భావాలకు లొంగిపోయింది” ఆ విషాద మసక వాతావరణంలో ఒక సాహసం కనబడింది.

ఇలాటి దశ ఎంతకాలం?

నేను ఎం ఎ కు అప్లై చేసాను. అన్నయ్య ఒప్పుకున్నాడు.

నాన్న ఏం మాట్లాడలేదు. అమ్మ తడబాటు ధోరణి అలాగే ఉంది. మా నానమ్మ ఇతరుల మాదిరి కాదు.

ఆమె కథ నీకు తెలుసా?

(సశేషం)

Exit mobile version