అంతరం-7

0
2

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో డాక్టర్ జయప్రకాష్ మవినాకులి “అంతర” పేరిట వ్రాసిన నవలను “అంతరం” అనే శీర్షికతో తెలుగులో అందిస్తున్నారు స్వాతీ శ్రీపాద. ఈ ధారావాహికలో ఇది ఏడవ భాగం. [/box]

[dropcap]నే[/dropcap]ను ఉన్న చెట్టు కి౦దకు నెమ్మదిగా వచ్చావు. నేను చీర సరిచేసుకుని సరిగ్గా కూచున్నాను. రెండు చేతులూ పాంట్ ముందు పాకెట్లలో స్టైల్‌గా పెట్టుకుని వచ్చావు. ఖర్చీఫ్ పరచుకుని కూచుని ఎన్నో విషయాలు మాట్లాడటం మొదలు పెట్టావు. నేను నా బాగ్ లాక్కుని దాని జిప్ లాగటం సాగించాను. “ఎందుకంతగా డబ్బు తెచ్చుకున్నావు? బహుశా మీ అమ్మానాన్నా బాగా ఉన్నవాళ్ళు ఏమో” నీ కామెంట్. మొదటిసారి అనుకున్నాను, నువ్వు బీదవాడివేమోనని.

“నీకు అవసరం ఉంటే తీసుకో” అని చెప్పాలనుకున్నాను.

నా ఉద్దేశ్యం చెప్పకుండా నా అమా నాన్నదగ్గర డబ్బు తెప్పించి నీకు సాయం చెయ్యాలనుకున్నాను.

నీకు సహాయపడడం అనే భావన నన్ను ప్రోత్సహించింది. రేపే నాన్నకు ఉత్తరం రాయాలి. ఆయనెప్పుడూ కాదనడు. నాలో ఆనందం నిండి పోయి౦ది. ప్రొఫెసర్ నిన్ను పిలిచాడు. వెంటనే లేచి పరుగెట్టావు, ఖర్చీఫ్ అక్కడే వదిలేసి. నేనది అందుకుని నా బాగ్లో వేసుకున్నాను.

దాని మీద ఏం రాసి ఉందో గుర్తుందా?

స్వీట్ మెమోరీస్ అని వుంది. అది నా విలువైన వస్తువు. నీకు ప్రతిరూపం అది. ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు మనిద్దరి సాన్నిహిత్యాన్ని అది ఆనందంగా వెదజల్లుతుంది.

నువ్వు బిజీగా ఉన్నావు, ఎప్పుడూ అంతేగా. అందరికీ పళ్ళు పంచుతున్నావు. నీకు నీ స్వంత ప్రపంచమే లేదా? ఈ పిక్నిక్ సవ్యంగా జరగడానికి గత పదిహేను రోజులుగా శ్రమిస్తున్నావు.

“ఈ కార్యదర్శి హోదా ఎందుకు? అన్నిటికీ రాజీనామా ఇచ్చి స్వేచ్చగా ఉండు”. ఇది నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఈ విషయం నీ ముందు కదిపాననుకో, “ఎవరో ఒకళ్ళు బాధ్యత నెత్తికెత్తుకోవాలిగా-భవిష్యత్తులోనూ అంతే. రిస్క్ తీసుకోకుండా ఎవరూ హీరోలు అవరు. ప్రతివాళ్ళు వాళ్ళవాళ్ళకు

అనువైన అనందం ఇచ్చే ప్రపంచం వెతుక్కోవాలి”

ఇలాటి ఆశంస లోలోపలి నిగూడమైన ఒక వాంఛ వల్ల ఉబికి వస్తుంది. అది లోలోపలి ఆత్మకు అస్తిత్వానికి ఒక స్థాపన.

“ఎవరైతే రథ చక్రాల సాంకేతికత తెలుసుకోరో వారికి రథం గురించి మాట్లాడే యోగ్యతా ఉండదు. అవకాశం కల్పి౦చుకోవాలి. అది ఆకాశం పైనుండి ఊడి పడదు. నువ్వు కాస్త అమాయకంగా అనిపిస్తావు. నువ్వు నోరు విప్పితే ఆ భగవంతుడే రక్షించాలి”.

మళ్ళీ బస్ తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది. తిరిగి వెనక్కు. మట్టికి.. తిరిగి నగ్నత్వానికి.

ఇప్పుడు అంత గోల లేదు. అందరూ ఆడీ పాడీ అలసిపోయారు. కొరికేస్తున్న చల్లగాలి ఆపాలని చూస్తున్నాను నేను. నువ్వు కనబడలేదు. నేను తల పైకెత్తి నీకోసం చూస్తున్నాను.

శబీన గట్టిగా అరిచింది, దొంగను పట్టుకున్నట్టు “మిస్టర్ ప్రభాకర్, ఇక్కడ కూచో” అంటూ నా పక్కన కూచోబెట్టింది. అది వెళ్లి నీ సీట్లో కూచుంది. వేలవేల కృతజ్ఞతలు దానికి. దీని కోసం మర్నాడు పార్టీ అడిగింది.

నేను ఎంతో ఎక్జైట్ అయ్యాను. నెలసరి నాలుగురోజులు వెనక్కు వెళ్ళింది. అందుకనేమో. అది ఎదురు చూడనిది. నువ్వు నాకు చాలా దగ్గరగా కూచున్నావు. నీ వెచ్చని ఊపిరి నీ స్పర్శ నాకెంతో ఉత్తేజపూరితంగా ఉంది శరీరమంతా.

నీ మొహం నాకు ఎంత దగ్గరగా ఉ౦దంటే ఎడం వైపున పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తో౦ది. ఎడం కనుబొమ్మ పైన మచ్చ కూడా. ఆ వివరాలన్నీ తెలుసుకోవాలని ఎంత ఆతృతగా ఉన్నానో, మాట్లాడేప్పుడు మన మధ్య దూరం అతి తక్కువగా ఉంది. బస్ టర్న్ తిరిగినప్పుడల్లా మన శరీరాలు గుద్దుకు౦టూన్నాయి.

ఒక పురుషుడి ఊపిరి కూడా ఇంత ఉల్లాసకరంగా ఉంటుందా? కాని నువ్వు ఎంత చతురుడివో కదా మనం ఒకరికి ఒకరం మరీ దగ్గర కాకుండా కిటికీ రైలింగ్ పట్టుకున్నావు.

గాలి గట్టిగా వీచినప్పుడు నా చీరకొ౦గు గాలికి ఎగిరి నీ మొహాన్ని కప్పుతో౦ది. ఇది కావాలని చేసిన పనికాదు, అది గమనించు. బస్ అంతా నవ్వుతున్నారు. అందరూ ఎవరి మాటల్లో వారు.

సీట్‌లు ఎత్తుగా ఉండటం వల్ల కావలసినంత మరుగు ఉంది. మసక వెలుతురు. నువ్వు తలచుకుంటే ముద్దు పెట్టుకునే అవకాశం చాలా ఎక్కువ. నా పెదవులు కదిలేవి, కాని నాకు ధైర్యం లేదు. అమ్మాయిలు అంత తొందరగా ముందుకు రారు కదా.

అర్థం చేసుకోలేకపోతే ఎలాటి మగవాడివి నువ్వు? నేనూ నా ప్రేమను నిశ్శబ్దంగానే ప్రదర్శించాను. నీ చేతిని గట్టిగా పట్టుకున్నాను. అనాలోచిత స్పందన విషయంలో నువ్వు గడ్డ కట్టుకుపోయావు. నా నుంచి కాస్త తీసుకో… ఒక అమ్మాయి, ఎవరయినప్పటికీ.

“నేను నీతో నగ్నంగా పడక పంచుకు౦దుకు సిద్ధం” అని అంటే ఏ యువకుడైనా తిరస్కరిస్తాడా.

నాకూ నీ అనుమతి పొ౦దాలని కోరికగా ఉంది. మనసులోని మాట మాతృ భాషలో కన్నా ఇంగ్లీష్‌లో చెప్పడం సులువు.

“ఒకసారి నిన్ను ముద్దు పెట్టుకోడం ఎలా ఉంటుందో…” ఉద్విఘ్నత లేకపోడం వల్లో లేదా మాటలు పెగలక పోడం వల్లో ఆగిపోడం.

ఎంత దగ్గరగా ఉన్నావు, అయినా ఎంత దూరం. మనం నది రెండు తీరాల వద్ద అటొకరు ఇటొకరు ఉన్నట్టు అనుకున్నాను. ఇప్పుడు గాలి వీచింది, మబ్బులు దట్టమై వర్షం మొదలైంది. కిటికీలో నుండి వాన చుక్కలు పడటం మొదలైంది. నేను కిటికీ పక్కన ఉన్నాను. చీర జాకెట్ తడిసిపోయాయి. నువ్వు ఒక్క మాటా లేకుండా మూగవాడిలా కూచున్నావు.

“కొంచం పక్కకు జరుగు” అని అడగాలా నిన్ను. నేనే పక్కకు జరిగి కూచున్నాను. మన తొడలు రాసుకు౦టున్నాయి. నా మొహంలోకి చివ్వున రక్తం చిమ్మింది. బ్రా మొత్తం తడిసి జాకెట్‌కు అతుక్కుపోయి౦ది. గుండె ఎంత వేగంగా కొట్టుకు౦టున్నద౦టే, నువ్వు దాన్ని వినకు౦డా నేను నా చేత్తో గుండెను కప్పాను.

మనం ఎలా ఉన్నా దాని పని అది ఆగకు౦డా చేసుకుపోతో౦ది.

ఏదో పాట పాడుతూ నువ్వు బిజీగా ఉన్నావు.

ఎంత తొ౦దరగా మనం టౌన్ చేరుకున్నాము. మా హాస్టల్ దగ్గర బస్ ఆగింది. అమ్మాయిలంతా దిగారు. ఇద్దరం శుభరాత్రి అని చెప్పుకున్నాం. ఆ రోజును ఎందుకు గుర్తు౦చుకున్నానో తెలుసా? నవ్వకు.

చాలా చిన్నప్పుడు కాళ్ళమధ్య ఒక కర్ర ఉంచుకుని పాడుతూ డాన్స్ చేసే దాన్ని.

తాతగారి కర్ర మా గుర్రం. గంగోత్రి మొత్తం నాలా డాన్స్ చెయ్యాలని అనుకున్నాను.

ఆ తరువాత హాస్టల్ డే వచ్చింది. పిక్నిక్ క్లాసెస్ ముగిసిపోయాయి. ఇన్విటేషన్‌లు ఎలా పంచాలి? రెండు మూడు రోజులు లైబ్రరీకి తీసుకువచ్చాను. నీ రూమ్ లో కూచుని ఏం చేస్తావు? పోస్ట్ చేద్దామని నీ పేరు రాసాను. నీ పేరు రాస్తుంటే నా శరీరమంతా ఒక రకమైన సన్నని కుదుపు. ఒక ప్రత్యేకమైన థ్రిల్ – నీ పేరు రాయడం.

పోస్ట్ చేసిన కార్డ్ నీకు చేరకపోతే, ఎక్కడి నుండో అడ్రస్ రాయకపోతే ఎక్కడికని వస్తావు?

తీరా నా అడ్రస్ రాసాక అది మరెవరి చేతికయినా చిక్కితే…

నా ఒళ్ళు చల్లబడి వణికింది. పెన్ను తీసి అడ్రెస్ రాసే సమయానికి ఇంక్ ముద్దలా పడి అది క్రమంగా పెద్దదయింది. గుడ్డు పొదిగి చిన్న పక్షి నాట్యం చేసింది. అది ఎగిరేదేమో కాని దాని రెక్కలు లాగేశారు.

హాస్టల్ డే రోజున ఎలా డ్రెస్ చేసుకున్నానో తెలుసా? కాలేజిలో చేరేప్పుడు అన్న నాకొక చీర గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇంత ఖరీదైన సిల్క్ చీర బహుమతిగా ఇవ్వడానికి కారణమేమీ లేదు.

అది రోజూ వాడే చీరకాదు. అతనికి బంగారం మీదో, గ్రాండ్ గా ఉండే వస్తువులమీదో ఖర్చుచేయ్యడం ఇష్టం ఉండదు. మైసూర్ వెళ్ళడానికి బస్ స్టాండ్‌కి వెళ్లాను. అన్న నన్ను సాగనంపడానికి వచ్చాడు.

మా పక్కింటి ఆశా ఫోటో తీసుకు౦దుకు సాగర్ వచ్చింది. ఆమె సిల్క్ చీర కట్టుకుని ఉంది. ఆమె నన్ను చూసి నా దగ్గరకు వచ్చింది. అన్న పళ్ళు కొంటున్నాడు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము.

“నీ చీర చాలా బాగుంది, నీకు చక్కగా నప్పింది” అన్నాను.

“నీకూ ఒకటి ఉందిగా ఇదే కలర్ కదూ?” అంది.

“కాదు, ఇంత డార్క్ లేదు. నాది లేత రంగు. ఈ రకమైన అంచు బాగుంది” అన్నాను.

అన్న వచ్చాడు. అతను అది విని ఉంటాడు. నిజానికి నాకు చీర కావాలని కోరికేమీ లేదు.

ఆ విషాద ఘటన తరువాత అలంకరణ సామాగ్రి, బంగారం, చీరల పట్ల ఆసక్తి తగ్గిపోయి౦ది నాకు.

మా వాళ్ళకూ అవి నచ్చవు. స్లీవ్లెస్ జాకెట్, లిప్‌స్టిక్ నిషేధాలు. అన్న బాగ్ పళ్ళతో నింపి అడిగాడు,

“సువ్వీ ఒక చీర కావాలా?” అని.

బస్ బయలు దేరడానికి ఇంకా సమయం ఉంది.

అది కేవలం మర్యాదకు అడిగాడా? అతని వద్ద కావలసినంత డబ్బు ఉందో లేదో? డబ్బు లేకపోతే అతనికి ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది? అది అవమానకరం కదూ?

“రా రిక్షా లో వెళ్దాం” అన్నాడు అన్న. నేనెందుకు కాదనాలి?

ఖరీదైన చీరలు, బంగారు నగలు స్త్రీల శ్రేష్టమైన కోరికలు కదా.

పూల డిజైన్ ఉన్న ఖరీదైన చీర కట్టుకున్నాను. జుట్టు ముడి వేసుకున్నాను.

ఎవరో నీకు ఆహ్వానం ఇచ్చే ఉంటారు. నాకు తెలుసు. మొహమ్మీద మెరిసే చిరునవ్వుతో వచ్చావు. తెల్లటి పాంట్ నీలం జుబ్బా వేసుకున్నావు. మా డిపార్ట్మెంట్ విద్యార్ధులు పార్టీ ఏర్పాటు చేసారు. నవ్వులు, వినోదాలు హాస్యం ఎంజాయ్ చేసారు. నీతో ఏకాంతంగా ఉండాలని అనుకున్నాను. నీకు ఏదో చెప్పాలి. నిన్ను కలవలేకపోయాను. మాటలు గొ౦తులో ఇరుక్కుపోయాయి. మనసునిండా ఉన్న మాటలు హిపోక్రసీలో కరిగిపోయాయి. మాటలు…మాటలు….

హాస్టల్ డే తరువాత వేగంగా పరీక్షలు వచ్చేసాయి. ఇహ మిగిలినవి ఇరవై రోజులే. నువ్వు సీరియస్‌గా మారిపోయావు. క్లాసెస్ అయిపోయాయి. ప్రాక్టికల్స్ ముగిసాయి. అసోసియేషన్ వాలిడిక్టరీ తప్ప అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి.

వీటన్నింటి మధ్యా నీతో మనఃస్పూర్తిగా మాట్లాడాలన్న ఒక తీవ్రమైన వాంఛ.

నీకు పాటలు చాలా ఇష్టం. నా ఎంపిక నీకు నచ్చిన పాటలు ఎంచుకుని నీ ముందు పాడటం. స్కూల్‌కి వెళ్ళేప్పుడు మా అక్క నా జడ వేసేది. నేను అద్దంలోంచి చూస్తున్నాను. అద్దం కొంచం పక్కకు వంచితే దృశ్యం జలపాతంలా కనిపిస్తుంది. గోడలు నాపైన పడుతూ, మరెన్నో చిత్రమైన దృశ్యాలు-ఒక మాంత్రిక ప్రపంచం.

పిల్లల అద్భుత ఊహా ప్రపంచం అధిగమి౦చినది యౌవన శృంగార ప్రపంచం కదా. ఆ రోజులన్నీ ఒకదాని వెనక ఒకటి అదృశ్య౦లో లీనమైపోయాయి. అసోసియేషన్ వాలిడిక్టరీ, సెండాఫ్ మిగిలిపోయాయి. మనం డిపార్ట్మెంట్ టెర్రేస్ మీద కలుసుకున్నాము. మనకు కాంపస్ పూర్తిగా కనిపిస్తో౦ది. ఇ౦కొన్నాళ్ళలో కాంపస్‌తో మన అనుబంధం తెగిపోతుంది. మనం వేర్వేరు స్థలాల నుండి వచ్చి చేరాము. మనం మళ్ళీ వేర్వేరు ప్రాంతాలకు విడిపోతాము. ఎంత చిత్రమైనదీ ప్రపంచం.

గంగోత్రి కాంపస్‌కి రాక పూర్వం మనమ౦ ఒకరికొకరం తెలియము. కాలేజీ వదిలాక, నువ్వు నన్ను మర్చిపోతావేమోనని నా భయం. పరస్పర ప్రేమానుబంధం ఎలా విడగొట్టడం? నువ్వు లేకు౦డా నేను బ్రతకలేను. టెర్రేస్ పైన నిల్చుని చుట్టూ చూస్తున్నాను. ఇకపైన ఏం చేస్తావు? నువ్వు బహుశా మైక్ రిపేర్ చేస్తావు లేదా ఫర్నిచర్ సరిచేస్తావు. నీకెప్పుడూ కాలేజి ఫంక్షన్ల వర్రీయే గదా.

మన క్లాస్ మేట్ సుబ్బప్ప రాధా భాటియాతో వెళ్ళిపోయాడు. నేను వారి గురించి తీవ్రంగా ఆలోచించాను. ఎక్కడకు వెళ్లి ఉంటారు? ఏం చేస్తారు? వీటి గురించి నీకు పట్టనే పట్టదు.

నీ చిరునవ్వు గెలుచుకు౦దుకు ఎ౦దరు క్యూ కడతారో నీకు తెలియదు. నీకు జీవితం ఎలా అనంది౦చాలో తెలియదు. నీకు నీ శక్తి గురించి తెలియదు.

నా జడ ఎవరో లాగినట్టనిపి౦చి౦ది. భయంతో వెనక్కు చూసాను. నువ్వు నిల్చుని ఉన్నావు.

“నీ జుట్టు ఎంత పొడుగు? నాకు ఇష్టం, నీకు నాగవేణి పేరు పెడితే ఎంత బాగా సరిపోయేది? “అన్నావు.

నేను సంతోషించాను. నేను తల వంచుకున్నాను. కారణం మన పరిచయం తరువాత ఇది తొలి పొగడ్త మరి.

ఆడవారి హృదయాలకు పొగడ్తను మించిన ఇష్టంమరేదైనా ఉంటుందా?

“ మొదటి సారి చూస్తున్నట్టుగా కాంపస్ చూస్తున్నావా?”

కళ్ళు పైకెత్తి చూసాను. బ్లాక్ సూట్, బ్లూ టై, తెల్లని వదనం. ఎంత అందం. ఎంత అందంగా ఉన్నావు. కళ్ళు మెరుస్తూ కట్టిపడేస్తూ ..

“అవి తప్పకుండా నావే కదా ప్రభాకర్” అన్నాను. నువ్వు నా పొగడ్త లెక్క చెయ్యకుండా “నీ తియ్యని స్వర౦ తోనే కార్యక్రమం మొదలు కదా ఓకే నా మేడ౦” అన్నావు.

నాకు మూడ్ లేదు. కాని కాదనలేను. నేను కాదంటే నీ కళ్ళు కోపంతో ఎరుపెక్కి ముగింపు చేదుగా మారుతుంది. నీ కళ్ళు ఎంత కొట్టొచ్చినట్టు ఉంటాయి. నువ్వు కళ్ళు విశాలంగా తెరిస్తే నేను భయంతో వణికి పోతాను.

శూన్యం నా మొహం లోకి చూస్తుంది. ఆ కళ్ళను పోగొట్టుకోలేను. నేను నిన్ను చూస్తే అది ప్రేమతో లేదూ భయంతో. కానీ అదేమో నాకు తెలియదు. సముద్రపు నీరంతా కలిసినా నన్ను పవిత్రపరచలేదు. ప్రోగ్రాం మొదలైంది, నాపాటతో.

తరువాత నువ్వు మాట్లాడావు. ఒక చక్కని ధారాళమైన స్పీచ్. ఉద్వేగపూరితం, మేధస్సును పలికి౦చినది. ఇది వరకు స్పీచ్‌ల మాదిరిగాలేదు. ఇది వరకు నీ మాంత్రిక స్వరంతో నువ్వు మాట్లాడటం చాలాసార్లు విని ఉన్నాను కదా. కాని ఆ రోజున నెమ్మదైన నీటి ప్రవాహంలా ఉంది కాని జలపాతంలా కాదు. రెండూ నీరే అయినా ఎంత తేడా వాటికి.

ఇంత గొప్ప నైపుణ్యత నీకిచ్చిన ఆ గొప్ప తల్లి ఎవరు? చక్కగా వివరించావు, స్పష్టంగా మాట్లాడావు, సమర్థత ఒక్కటే జీవితం కాదు. ఎన్నో విషయాలు ఉంటాయి. నీ మాటలు వేదాల్లా అనిపిస్తాయి. తాత్వికత, వాస్తవికత నిండి అన్నీ ఉన్నట్టు.

చివరికి

“నేను ఎవరినైనా నొప్పిస్తే” స్వరం గద్గదమై౦ది. కన్నీళ్లు వచ్చాయి. ప్రొఫెసర్ నిన్ను ఓదార్చాడు. జన సమూహమంతా మ౦త్రముగ్ధలయారు.

నీ పెదవులు దాటి మాటలు రాడానికి నిరాకరించాయి. నీ హృదయం ఎంత మృదువైనది. ఆ సందర్భంలో నీ ప్రత్యర్ధి సుధ… నిజానికి, నా పక్కనే కూచున్న సుధా భట్ ఏడుస్తోంది.

ఎంత సమ్మోహనమైన ఉపన్యాసం. ఎందరో మాట్లాడారు.

కార్యక్రమం ముగిసింది. ప్రొఫెసర్ గదిలో మాట్లాడుతున్నావు. అందరూ చెదిరిపోయారు. మా మా దారులు వెతుక్కుంటూ మేము కదిలాము.

పక్షి కోసం గాలి పంజరం

పరీక్షలకు పది పన్నెండు రోజులే మిగిలాయి. ఎంత మెంటల్ టార్చర్ ఉన్న రోజులో కదా. ఈ రోజుల్లో ఎప్పుడూ నువ్వు బయటకే రాలేదు. రెండు మూడు రోజుల్లోనే నీ లేమి నన్ను బాధపెట్టడం మొదలు పెట్టింది. శబీన నిన్ను లైబ్రరీ లో చూసానని చెప్పింది.

అప్పుడే స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకున్నాను, అది ముడేసుకుని వెంటనే లైబ్రరీకి పరుగెత్తుకు వచ్చాను. ఎవరున్నారక్కడ? రిఫరెన్స్ సెక్షన్‌లో గాని రీడింగ్ రూమ్‌లో కాని లేవు. పాసయ్యానని ఫలితాలు చూసుకు౦దుకు వెళ్లి పాసవలేదని తెలిసిన వ్యక్తి భవిష్యత్తేమిటి?

ఆ మూడ్ సరిగా లేని స్థితిలో నేను నిరాశపడ్డాను. లైబ్రరీ మెట్లు దిగుతూ లైబ్రేరియన్‌కి డాష్ ఇచ్చాను.

సిగ్గుపడుతూ చెప్పాను,” అయాం వెరీ సారీ”.

పరుగెత్తుకు వచ్చి కాంటీన్‌లో కాఫీ తాగాను. మనసు పెద్ద తుఫానులో ఉంది. మీ మొగవాళ్ళు మైండ్ రిలాక్సేషన్ కోసం తాగుతారు, బ్రా౦దీయో బీరో తాగుతారు. అది ప్రభాకరేనా? అబ్బాయిల హాస్టల్‌లో భంగ్ పీలుస్తున్నారని అంటారు. మీ హాస్టల్‌లో ఒకబ్బాయి భంగ్ తాగి నగ్నంగా డైనింగ్ హాల్లోకి వచ్చాడని చెప్పుకున్నారు.

ఈ విషయాలన్నీ శబీనకు ఎవరు చెప్తారు? ఆమె ఇలాటి వన్నీ సేకరించడంలో గొప్ప నిపుణురాలు. మేం అమ్మాయిలం అలా చెయ్యలేం కదా? నిజంగా చెయ్యలేమా?

నిన్ను అడిగితే, నువ్వంటావు, “ఎందుకు సాధ్యం కాదు? కారణం మీర్రు సోషలిస్ట్‌లు కాదా?” సమానత్వం గురించి గట్టిగా మాట్లాడతావు.

హాస్టల్‌లో చాలా మంది ఉన్నారు కదా అబ్బాయిలు.

నాకు చెప్పేందుకు ధైర్య౦ లేదు. నేను మా ఇంటి వైపు కదిలాను. శబీన స్కూటర్ వెనకాల తన బాయ్ ఫ్రెండ్ని కూచోబెట్టుకుని వెళ్తో౦ది. దానిలో అన్నీ మగరాయడి జీన్సే ఉన్నాయి. అదో భయంకరమైన తిరుగుబోతు. ఎలా మగవారిని సమ్మోహన పరచాలో దానికి బాగా తెలుసు.

నిషేధించిన ఫలాలు మరింత తియ్యగా ఉంటాయి. దూరం నుండి, “హే సువ్వీ ముందుగానే ఏప్రియల్ ఫూల్ అయ్యావు” అని వినబడింది. నా కోపానికి హద్దులు లేవు.

హాస్టల్ కి పరుగెత్తి బెడ్ మీద వాలాను రిలాక్స్ అవడానికి. గదిలో వేడిగా ఉంది. తలుపులు పూర్తిగా బార్లా తెరిచి ఉంచాను గాలి లోపలి రాడానికి. ఫాన్లు తిరుగుతున్నాయి. చీర విప్పి పక్కకు గిరవాటు వెయ్యాలనే కోరిక నన్ను బలంగా ఆవహించింది.

మొదటి రోజున బ్రా వేసుకున్న రోజున కూడా ఇలాగే నాలో తిరుగుబాటు, సంచలనం కలిగింది. హైస్కూల్లో విద్యార్ధినిని అప్పుడు. వెళ్ళడానికి సిగ్గుగా ఉండేది. అందరూ నా ఎదనే చూస్తున్నారని నాకు సంకోచంగా ఉండేది. నాకు మాటిమాటికీ ఈ అసౌకర్యం అనిపి౦చేది.

చీర, జాకెట్, బ్రా మొదలైనవన్నీ ఓ పక్కన పెట్టి బెడ్ మీద నగ్నంగా సాగిలపడ్డాను. నా విపరీతపు వెర్రి వ్యామోహానికి నన్ను ని౦ది౦చ౦డి. సత్యానికి నీతులు ఉండవు. హఠాత్తుగా జుట్టు మొలుచుకు వచ్చింది, ఎంత? ఎప్పుడు?

నువ్వు నన్ను వినమ్రతతో పిలవాలా? ఎర్రని గడ్డలా, పండిన మామిడి పండులా నన్ను పిసికేయ్యి. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. నువ్వు దుఃఖిస్తున్న ఈ అమ్మాయిని ఒక ఫుట్‌బాల్‌లా ఎలా నేలకు కొట్టి తన్నగలవు? నిద్ర పో… నిద్రపో… నిద్రపో.. అప్పటి వరకూ..

“ఇది యూనివర్సిటీ హాస్టల్, ఫోన్ ఉండదు. కాల్ చేసేందుకు అవకాశమే లేదు. ఏం చెయ్యాలి?”

పరీక్షల భయం, సమయం పరుగులు పెడుతోంది. ఒక దానివెనక ఒకటి ఊగుతున్న రాత్రీ పగలూ మధ్యన సుదీర్ఘత.

ఆదివారం, సోమవారం ఒకదాని వెనక ఒకటి సాగుతూనే ఉన్నాయి. కాని ఒక్క రోజు గడపడం ఎంత కష్టంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇహ మిగిలిన సుదీర్ఘమైన జీవితమంతా నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి?

ఏం చెయ్యను? ఏం చెయ్యను? కొ౦డ కదిలి మహమ్మద్ వద్దకు వెళ్ళాలి. నేనే మీ హాస్టల్‌కి వచ్చి నీతో మాట్లాడాలి. అది ఎంత కష్టమో నీకు అర్థం కాదు. అబ్బాయిల హాస్టల్‌కి, అదీ నాలాటి వారికి!

నిన్నగాక మొన్న తన మిత్రుడిని కలవాలని వచ్చిన అమ్మాయిని రేప్ చేసారట. మీ అబ్బాయిలు ఎంత పిచ్చివాళ్ళు. దానికి బదులుగా మరొకటి ఆలోచించాను, మా హాస్టల్ వాచ్‌మెన్ పాపయ్యతో ఒక లెటర్ పంపితే. ప్రిన్సిపాల్ అందరికీ తెలుసో తెలియదో కాని పాపయ్య మాత్రం అందరికీ తెలుసు. హాస్టల్ వాచ్‌మెన్ ముఖ్యం కాదు కాని ఈ ఉత్తరం మరెవరికైనా చేరితే… ఆ ఆలోచనకే చెమటలు పట్టాయి.

ఆదివారం రోజు, మొన్న, ఆ కూర్గు అమ్మాయి ఇండోలజీ మీరా రావ్ నీ ఫ్రెండ్ జాగ్రఫీ మోహన్‌తో బయటకు వెళ్ళింది. హోటల్ ఇంద్ర విహార్‌లో తిరిగి వచ్చేప్పుడు రూమ్ బుక్ చేసుకున్నారు. డైని౦గ్ హాల్‌లో సోషియాలజీ ఉమా టీజ్ చేసింది. దానివల్ల మనసు గాయపడిన ఆమె ఊరుకోలేదు. మనసులు ఒకేలా ఉండవు కదా. అంతం లేని మాటల యుద్ధం మొదలైంది. ఎదురులేని ఉమా మాటల్లో చేష్టలలో హద్దులు దాటి౦ది. మీరా బలవత్తరమైనది. యుద్ధం తీవ్రమయి౦ది. విసురుకునే చెప్పుల్లాగా మాటలు అటూ ఇటూ రువ్వుకున్నారు.

మీరా నాలుక విసిరింది.

“అవును నేను నీలాగా కొజ్జాను కాదు. నేనే అతన్ని ఆహ్వానించాను డేట్‌కి. రూమ్ నంబర్ 28. రాత్రంతా ఎంతో ఆనందించాము. కావలసినంత అ౦దుకోగలిగాను. నీదేం పోయింది. రూమ్ రెంట్ కూడా నేనే చెల్లి౦చాను.”

“నీకంత ఆసక్తి ఉంటే ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి బట్టలు విప్పి చూడు, పావలా బిళ్ళంత నల్లని మచ్చ అతని కుడి తొడ మీద ఉంటుంది. చాలా? ఇప్పుడు తృప్తిగా ఉందా?”

పెద్ద స్వరంతో అరుస్తూ వుంది. దాని విషపూరిత దాడి కొనసాగించింది. “అందరూ వినండి. వచ్చే ఆదివారం నేనూ మోహన్ ఇద్దరమే ఊటీ వెళ్తున్నాము. నీలా మేము స్వలింగ సంపర్కులం కాదు. మేము స్వయం తృప్తినీ పొ౦దము నీలాగా. బలమంతా వినియోగించి చెప్తున్నాను. మోహన్ అంతా నా ఇష్టంతోనే చేశాడు, కావాలంటే నా ఒంటి మీద చూసుకోండి నఖక్షతాలూ దంత క్షతాలూ. ఇతరులను సెక్స్ అబ్యూజ్‌లో ఇరికించి పగటి కలలు కనను. మీరంతా పవిత్రమైన సతీ సావిత్రులు. చూస్తావా “ అంటూ తన చీర పైకెత్తడం మొదలు పెట్టి౦ది.

నాకు కోపం వచ్చింది. నేను గనక దాన్ని ఆపకపోతే ఎంత దుర్భరమైన దృశ్యం చూడాల్సి వచ్చేదో.

ఆమెను జుట్టుపట్టి లాగాను. లాగిపెట్టి ఒక్కటిచ్చాను. “పిచ్చెక్కి౦దా?” అడిగాను. ఆమె మళ్ళీ తిరిగి కొట్టలేదు. ఎక్కెక్కి ఏడుస్తూ తనగదిలోకి వెళ్ళిపోయింది.

నాకు తిండి తినబుద్ధి కాలేదు. మీరా ఆవేశం మానవ ప్రవర్తన హద్దులు దాటి పిచ్చిని సూచిస్తోంది. బరువెక్కిన మనసుతో తిండి తినకుండానే నా గదికి వెళ్లాను.

లేడీస్ హాస్టల్లో కూడా వంటవాళ్లు, మేనేజర్ మగవాళ్ళే.

ఆ మేనేజర్‌కి ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్ ప్రేమతో ఉన్న సంబంధం అందరికీ తెలుసు.

గిల్టీ కాన్షియస్‌తో నా గదిలో కూచున్నాను. అంత గట్టిగా నేను చెంపదెబ్బ ఇవ్వకుండా ఉ౦డాల్సి౦ది. అది తడిగుడ్డ వేసుకుంది. కళ్ళు ఎర్రబారాయి. పెదవులు వణికాయి. మాట పెగల్లేదు. వేడి 101 ఫారెన్ హీట్ దాటిపోయిందని రూప చెప్పింది.

ఆమె నుదుటి మీద చెయ్యి వేసాను. ఆమె మేల్కొని నావైపు చూసి పెద్దగా ఏడుస్తూ “సువర్ణా సువర్ణా “ అ౦టో౦ది. నాకు మతి పోయింది.

వెక్కిళ్ళు పెడుతూనే, “నాకు అబ్బాయిలంటే అసహ్యం. వేలమంది అబ్బాయిలను నిర్వీర్యులను చేసే సెక్స్ శక్తి నాకుంది. అది నాకు శాంతి నిస్తుంది” కోపంగా ఉన్నాయి ఆ మాటలు. మొహం రక్తపు ఎరుపుకు తిరిగింది. ప్రేమ పూరిత భాష తీవ్రంగా మారింది. ఆ తీవ్రమైన ప్రవర్తన వెనక ఒక దాచుకున్న బాధ. నియంత్రణ లేని తీవ్రమైన విస్ఫోటం వెనక ఏదో ఆవేదన దాగి ఉంది. ఏదో తృప్తి చెందని ఉద్విగ్నత ఆ చెలరేగిపోయిన ప్రవర్తన వెనకాల ఆమెను నియంత్రణ కోల్పోయేలా చేసి ఉ౦డాలి. ఆమెకు తనదైన ప్రపంచం విలువలు ఉన్నాయి.

ఆమె ఒక అసంతృప్త ఆత్మ అనే నిశ్చయానికి వచ్చాను. చాలా విషాదంగా ఉన్నవాళ్ళు చాలా సెక్సీగా కూడా ఉంటారు. ఆమెకు పెళ్లి, కుటుంబం, సంతానం, సంపద , సంప్రదాయం అన్నీ భ్రమలే.

నువ్వు విన్నావా? గొల్లభామలు తమ ప్రియులను కలిసి వాటిని తినేస్తాయట.

పుస్తకం తెరిస్తే నీ మొహమే కనిపిస్తొ౦ది. నీ చిలిపి మాటలే గుర్తుకు వస్తున్నాయి. నిశ్శబ్దంగా కూచునే దాన్ని. ఆ రోజు నిన్ను ఎలాగైనా చూడాలనుకున్నాను. నాపైన పూర్తిగా దాడి చేశావు నువ్వు. ఏ మూల చూసినా నువ్వే. నిన్ను చూడకుండా బ్రతకలేనని అనిపి౦చి౦ది.

నీ హాస్టల్‌కి బయలుదేరాను. బ్లూ చీర కట్టుకున్నాను. జుట్టు వలయాలు వలయాలుగా ముడి వేసుకున్నాను.

కాంటీన్ దాటి హాస్టల్ కా౦పౌ౦డ్‌లోకి వచ్చాను. గేట్ తెరవడానికి ఏదో భయం. చెమటలు పట్టాయి. చెమటలతో వణికిపోతున్నాను. తడిసి ముద్దముద్దగా మారాను. దాదాపు పడిపోయే దశలో వెనక్కు తిరిగి నా హాస్టల్ వైపు నడిచాను.

వెనక్కు తిరగడం చూసి ఈలలు నన్ను వెన్నాడాయి. భయం, ఆత్రుత టాయ్లెట్‌కి వెళ్లాల్సిన అవసరం. ఆపుకోలేనట్టుగా ఉంది. షేక్స్‌పియర్ అన్నట్టు స్త్రీ అంటేనే సౌకుమార్యమా?

ఎంత సెక్సీగా ఉన్నా ఎంత ఉన్నతమైన చదువులు చదివినా మీ అబ్బాయిలకు మర్యాద తెలియదు.

రాత్రి కల, నిజంగా ఎంత తియ్యని కల. ఎంత అందమైనవాడు, యువకుడు ఆ కలలో. నేను పరుగెడుతున్నాను. అతను నా చెయ్యి పట్టుకున్నాడు. నన్ను ఎదకు ఎద తగిలేలా హత్తుకున్నాడు. మొహం నా మొహం పైకి తెచ్చాడు. ఎంత ప్రసన్నంగా ఉందో ఆ మొహం.

దంతాలు, రక్తదాహం ఉన్న దంతాలు… చేతులు విదిపి౦చుకోవాలని పెనుగులాడాను. చీర, జాకెట్ చిరిగిపోయాయి. నేను కింద పడ్డాను. అతను నా మీద పడలేదు. నన్ను రేప్ చేసే ఉద్దేశ్యం అతనికి లేదు. పెద్దగా నవ్వాడు విలన్‌లా. ఒక కత్తి తీసుకుని నన్ను పొడిచాడు. రక్తం ఉబికి వచ్చింది. ఒకసారి… రెండుసార్లు కత్తితో పొడిచాడు. పెద్దగా అరిచి లేచాను. విపరీతమైన చెమటలో ముద్దలా ఉన్నాను.

కాంపస్ వాతావరణం అందంగా ఉంది. రిస్క్ లేకుండా ఏ ఒక్కరూ మాట్లాడలేరు. ఆ రోజున నేను నీకెంత వ్యతిరేకంగా ఉన్నాను. నువ్వు కనిపించి ఉంటే ముక్కలు ముక్కలు చేసే దాన్నేమో. కాని ఇంకో భావం తళుక్కున మెరిసింది. నీకు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉందేమోనని అనుమానపడ్డాను. కొందరు నీతో పాటు ఉన్నారేమో.

మన కాలేజీ అమ్మయిలకో జబ్బు ఉంది. అబ్బాయిలు మిమ్మల్ని నిర్లక్షం చేస్తున్నారని చెప్తే కోపంతో పొగలు కక్కుతారు. మేమది సహి౦చలేము. అది క్షమించరాని ప్రవర్తన. నిజం చెప్పనా అమ్మాయిల హృదయాలను ఆకర్షించే తెలివి నీకు౦ది.

నువ్వు వారి భావాలు కదిలించి తియ్యని కలలు రేకెత్తి౦చగలవు. నిజం చెప్పాలంటే నువ్వెప్పుడూ స్త్రీ

సున్నిత భావాలను అర్థం చేసుకుందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ దిశలు ఎన్నడూ ప్రయత్నం కూడా చెయ్యలేదు. అందుకే నువ్వు బాధపడాలి. వారి కోపం నీ నాశనం తెచ్చే ఒక శాపం.

సెక్స్‌కి భయపడి నువ్వు పారిపోతున్నావా? లేదా సెక్స్ నిన్ను వెనక వేటాడుతో౦దా?

నువ్వు ఒక నపు౦సకుడివి. మగతనం లేనివాడివి. పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. రోజులు దొర్లిపోతున్నాయి. ఆరు థియరీ రెండు ప్రాక్టికల్స్.

పదకొండో రోజున కాంపస్‌తో మన సంబంధం ముగిసిపోతు౦ది. కాంపస్ ఖాళీ అయిపోతుంది. మళ్ళీ కొత్త నీరు. పాత వారికి వీడ్కోలు. కొత్త వారి ఆగమనం. కొత్త స్వప్నాలు వికసిస్తాయి.

కొత్త ఆదర్శాలు వస్తాయి. కొత్త కోరికలు పుడతాయి. కొత్తనీరు పాతనీరును కొట్టేస్తుంది. ఈ వలయం మళ్ళీ పునరావృత్తం అవుతుంది.

కాంపస్ ఎప్పుడూ పాత కొత్తల మధ్య పవిత్రమవుతూ ఉ౦టు౦ది.

కాంపస్ అంటే ఏమిటి? ఒక స్థలమేనా? ఈ పొడవైన చెట్లేనా? ఈ హాస్టలా? ఈ పెద్ద భవనాలా?

కాంపస్ “యువతీ యువకుల” సమూహం.

నా గది ఖాళీ అవుతుంది. నా ముందు ఎందరో వాడిన మంచం నన్ను బయటకు పంపేస్తూ౦ది. అది ఎదురు చూస్తుంది. ఇది కూడా పాతను భరించలేదు. ఇప్పుడు ఒక విరక్తి భావన. అంతే, మరేమీ లేదు.

నీతో ఎంతో మాట్లాడాలి. పరీక్షల సమయం. నిన్ను డిస్టర్బ్ చేస్తానేమోనని నా భయం. నీ రాత పాడు చెయ్యదలుచుకోలేదు. నా ఏకాంతపు గదిలో ఉండిపోయాను. అది ఒక శూన్యం… మరణం… చివరి వరకూ ఇదే కదా?

ప్రేమ లేకుండా ఒక రోజు అంటే మాట్లాడటం, తినడం, కాలకృత్యాలు, నిద్ర, మరణం. పెళ్లి చేసుకుంటే మరొక పని కూడా అంతే. నేను మరణిస్తున్నాను. బహుశా ఉద్వేగపు నిప్పులో ము౦చి రాస్తున్నాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here