Site icon Sanchika

అంతరంగం

[dropcap]మ[/dropcap]గధ రాజ్యంలో రామాపురం అనే గ్రామం వుండేది. భద్రం అనే ఒక పాల వ్యాపారి నివసించేవాడు… అతను తన గ్రామానికి దూరంగా అడవిలో తన గుడిసెను నిర్మించుకున్నాడు. అతను గ్రామంలోని సందడి వాతావరణం కంటే అడవులలోని నిశ్శబ్దాన్ని ఇష్టపడ్డాడు. అతను తన రెండు ఆవులతో కలిపి తన చిన్న ఇంట్లో నివసించేవాడు. ప్రతీ రోజు ఉదయం దగ్గర్లో వున్న చెరువు వెళ్ళి ఆవులకు స్నానం చేయించి, వాటిని పచ్చిక బయ్యళ్ళలో కాస్సేపు తిప్పి, తిరిగి తీసుకువచ్చేవాడు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం వలన అవి ఆరోగ్యంగా ఎదిగి ఎక్కువ పాలను ఇచ్చేవి. తనకు అవసరమైన మేరకు పాలను వాడుకొని మిగిలిన వాటిని గ్రామంలో అమ్మి డబ్బు సంపాదించేవాడు. తనకంటూ నా అనేవాళ్ళెవరూ లేకపోవడం వలన అతడిని ఒంటరితనం ఎక్కువగా బాధించేది.

భద్రం నిజాయితీపరుడు. అతను తృప్తిగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు అతనిని ఏదో తెలియని అశాంతి, అసంతృప్తి బాధించేది. ప్రపంచం అంతా చెడుతోనే ఎక్కువగా నిండి వుంది. ‘మానవులు పుణ్యాల కంటే పాపాలే ఎక్కువగా చెయ్యడానికి ఇష్టపడుతున్నారు. వీరికి మార్గదర్శనం చేసేవారే కరువయ్యారు’ అంటూ తనలో తానే తరచుగా మథనపడుతుండేవాడు.

ఒక సాయంత్రం, అమాయకుడైన భద్రం గ్రామంలో పాలు అమ్ముకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఒక సాధువు చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం చూశాడు. సాధువును తేరి పారా పరికించి చూడగా సాధువు ముఖంలో ఏదో తెలియని తేజస్సు, ప్రశాంతత కనిపించాయి. ఈ విషయం తేల్చుకోవడానికి సాధువు కళ్ళు తెరిచేవరకు వేచి వుండాలని నిర్ణయించుకున్నాడు.

కాసేపటి తర్వాత సాధువు మెల్లగా కళ్ళు తెరిచాడు. తన పక్కన ఓపికగా కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు.
“మీకేం కావాలి?” వినయంగా అడిగాడు సాధువు.

“సత్యం మరియు దైవభక్తి మార్గం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజాయితీ ఎక్కడ దొరుకుతుంది?” అంటూ ప్రశ్నల వర్షం సంధించాడు భద్రం.

సాధువు చిరునవ్వు నవ్వి, “సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి చేపలను అదే ప్రశ్న అడగండి. అవి మీకు సరైన సమాధానం ఇస్తాయి.” అన్నాడు.

భద్రం ఆశ్చర్యంతో సాధువు చెప్పినట్టుగానే సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి చేపలను అదే ప్రశ్న అడిగాడు. చేప, “ఓ మానవుడా! మీ ప్రశ్నలకు తప్పక సమాధానం చెబుతాను. ముందు నాకు చాలా దాహంగా వుంది.  నాకు త్రాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురండి.” అని అని మానవ భాషలో అంది.

భద్రం మరింత ఆశ్చర్యంతో, “మీరు నీటిలో నివసిస్తున్నారు. కానీ మీరు ఇంకా త్రాగడానికి నీరు కావాలా? ఎంత విచిత్రం!”

అందుకు చేప ఠక్కున బదులిచ్చింది. “మీరు చెప్పింది నిజమే. ఇదే మీ ప్రశ్నకు సమాధానం కూడా! సత్యం, దైవభక్తి, నిజాయితీ మనిషి హృదయంలో ఉంటాయి. కానీ అజ్ఞానంతో బయటి ప్రపంచంలో వారి కోసం వెతుకుతాడు. అక్కడా ఇక్కడా తిరిగే బదులు నీ అంతరంగంలో చూసుకో, నీకే అవి దొరుకుతాయి. ప్రపంచాన్ని చూసే కళ్ళను మార్చుకో. ఉదాహరణకు మంచి దృష్టితో చూస్తే ప్రపంచంలో అంతా మంచే కనిపిస్తుంది. ప్రేమ అనే ధృష్టితో చూస్తే ప్రపంచమంతా ప్రేమమయమే. మానవులకు అంతరంగ ప్రభోధాన్ని మించిన గురువు, మార్గదర్శి మరొకరు లేరు.”

చేప సమాధానం భద్రానికి ఎనలేని సంతృప్తినిచ్చింది.. అతను చేపకు కృతజ్ఞతలు తెలిపాడు మరియు సంతోషంగా ఇంటికి ఇరిగి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడు. తనలాగే ఈ ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుకున్నాడు.  నాటి నుండి ఈ ప్రపంచాన్ని చూసే కోణాన్ని మార్చుకున్నాడు. తన మకాంను గ్రామంలోకి మార్చి, పది మందితో స్నేహం చేస్తూ, వారి కష్ట సుఖాలలో పాలుపంచుకుంటూ సంతోషంగా జీవితం గడిపాడు.

ఆ రోజు నుండి భద్రంకి ఎప్పుడూ అశాంతి కలగలేదు.

Exit mobile version