Site icon Sanchika

అంతరాత్మ

[box type=’note’ fontsize=’16’] “సాధారణంగా తప్పులనేవి తెలిసే జరుగుతాయి.. తప్పు చేసినప్పుడు జరిగే పొరబాట్లు శాతం చాలా తక్కువే… ఆయితే తప్పు చేసినప్పుడు తప్పు చేశామని, చేస్తున్నామని, దిద్దుకొమ్మని అంతరాత్మ చెబుతుంది” అంటున్నారు పొన్నాడ సత్యప్రకాశరావు ఈ అంతరాత్మ కథలో. [/box]

[dropcap]తి[/dropcap]రుమల ఎక్స్‌ప్రెస్ బయలుదేరుటకు సిద్ధముగా యున్నదని ప్రకటన. చాలా రద్దీగా ఉంది. ప్రక్క స్టేషన్‌కి దగ్గరలోనే ఉన్న కళ్యాణమంటపంలో మిత్రుని కుమార్తె పెళ్ళి. సాయంత్రమే వెళ్ళాలి… కుదరలేదు. ముహుర్తం రాత్రి 12 గం.కు. ముహుర్తం టైంకు కూడా రాకపోతే ఊరుకోడు. మా ఇంటికి స్టేషన్ దగ్గర… అక్కడ స్టేషన్‌కి కళ్యాణమంటపం దగ్గర. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్‌కే వచ్చాను. రష్‌గా ఉంటుందని తెలుసు. ప్రక్క స్టేషన్ కాబట్టి గంటలోపులోనే వెళ్ళిపోవచ్చు.

టి.సి.ని బ్రతక నివ్వటం లేదు పాసెంజర్లు… చాలా రద్దీగా ఉంది “నో మాం… లాభం లేదు” అంటు జవాబులు చెప్పిందే చెప్పలేక విసుక్కొంటున్నాడు. జనరల్ బోగీ వైపు చూసే ప్రసక్తే లేదు. నాకు రిజర్వేషన్ లేదు. ‘ప్రక్క స్టేషన్ కాబట్టి టి.సి వచ్చేలోపులోనే దిగేయవచ్చు… అంతగా వచ్చి అడిగితే అప్పుడు చూద్దాం’ అనుకొని రిజర్వ్‌డ్ బోగీ ఎక్కాను. చార్ట్ చూసుకొని ప్రక్క స్టేషన్ బెర్త్‌ల దగ్గర కెళ్ళాను.. అక్కడ ఆల్‌రెడీ నా లాంటి వాళ్ళున్నారు. నేను ఓ వారగా సగం కూర్చోన్నాను.. ఇంతలో హడావుడి పడుతూ  పెద్దఫ్యామిలీ ఎక్కింది. ఆ ఫ్యామిలీ పెద్దని గుర్తుట్టాను.. మా కాలనీలోనో డిప్టామెంటల్ స్టోర్ యజమాని. అతను టికెట్స్ లిస్ట్ చూస్తూ అందరికి బెర్తులు చూపిస్తున్నాడు. చిన్న పెద్దా కలిపి ఓ పాతిక మంది వరకు ఉన్నారు ఆ బృందంలో.. అందరికి ఒకే చోట బెర్త్‌లు రాలేదు. అక్కడక్కడ వచ్చాయి. ఆయన నా వైపు చూసాడు. నేను పలకరింపుగా నవ్వాను. “మీరు తిరుపతేనా” అడిగాడు. కాదని చెప్పాను. అదే ప్రశ్న నేను వెయ్యలేదు. వాళ్ళ వాలకము చూస్తుంటే తిరుపతేనని తెలుస్తోంది. వాళ్ళళ్ళో వాళ్ళు ఏదో చర్చించుకొంటున్నారు. ఆ బృందంలో ఓ పదహారేళ్ళ కుర్రాడు చివరి నిముషం వరకు రానని అఖరున బయలుదేరాడట. అతనికి రిజర్వేషన్ లేదు. ‘మనకి పాతిక బెర్తులున్నాయి కదరా… ఎక్కడో ఒక చోట సర్దుకొంటాడులే..’ అన్నదో పెద్ద తలకాయ.. “అది కాదు నేను చూసేది. టికెట్ తీసుకోవటం కుదరలేదు. టాక్సీ లేటు… కౌంటర్ దగ్గర విపరీతమయిన రద్దీ.. అదీ అలోచిస్తున్నాను.” అన్నాడా సేట్, అని “సరే ఓ పని చేద్దాం.. ఎలాగా అందరి బెర్త్‌లు ఒక చోట లేవు.. టిక్కెట్లనీ నాదగ్గరే ఉన్నాయి. అందరు ఎవరి బెర్తుల దగ్గరకి వాళ్ళు అప్పడే వెళ్ళవద్దు.. ఇక్కడ అక్కడ మాట్లాడుకొంటు తిరుగుతుండండి.. టి.సి బెర్త్ నెంబర్లు టిక్కు పెట్టుకొంటాడు..  వెయిట్ లిస్ట్ పాసెంజర్లు కూడా చాలా మంది ఎక్కే ఉంటారు. ఇంత రద్దీలో మన పాతిక మందికి ఎటెండెన్స్ తీసుకుంటాడా ఏమిటి…? చెకింగ్ వాడు సర్దుకొంటాడు… లైట్స్ తీసేస్తాం కాబట్టి అంతగా పట్టించుకోరు… నేను ఎలాగు బోగీ ఎక్కేముందే టి.సిని ఇంకో బెర్త్ కావాలని అడిగాను.. అతను లేదన్నాడు… కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యండి ఏం పరవాలేదు..” అన్నాడు ఆ సేట్.

ట్రెయిన్ బయలు దేరింది. వెయిట్ లిస్ట్ పాసింజర్లు చాలా మందే ఉన్నారు. టి.సి వచ్చాడు. వెయిట్ లిస్ట్ వాళ్ళని ప్రక్క స్టేషన్‌లో దిగిపోవాలని చెబుతూ టికెట్లు చూసి బెర్తులు టిక్ కొట్టుకుంటూ సాగిపోతున్నాడు. నన్ను అడగక ముందే నేను ప్రక్క స్టేషన్ అన్నాను. అతనేమనలేదు. వెళ్ళిపోయాడు.

నేను సేట్ కేసి చూసాను. “చూసారా నేను చెప్పినట్లే జరిగింది. ఇప్పుడుందరూ ఎవరి బెర్త్‌లలో వాళ్ళు పడుకోండి… ఇదిగో మీరిద్దరూ ఆ పై బెర్త్ ఎక్కేయండి. లైట్ తిసేసి పడుకోండి. బస్” అన్నాడు సేట్.

ప్రక్క స్టేషన్ వచ్చింది.. క్రిందకి దిగాను. ఆ టి.సి. కనబడ్డాడు. థాంక్స్ చెప్పి వచ్చేసాను.. అతనూ తల ఊపాడు… బుర్రగోక్కుంటు… పాసింజర్లకి సమధానాలు చెప్పలేక.

***

నాలుగు రోజుల తరువాత. ‘శ్రీ లక్ష్మీ డిప్టార్ట్‌మెంట్ స్టోర్సు’కి వెళ్ళాను… కౌంటర్‌లో సేట్, గుండుతో.

“ప్రయాణం బాగా జరిగిందాండి” అడిగాను… తలూపాడు… నా ముందు జనం ఉన్నారు… రద్దీగానే ఉంది…

వర్కర్ రాలేనట్టుంది..  సేట్ గారే చీటీలు వ్రాసి డబ్బులు సీసుకొంటున్నారు. నా ముందాయనని ఎక్కడో చూసినట్లనిపించింది. ఆలోచిస్తే గుర్తుకు వచ్చింది. అతను ఆ నాటి టి.సి.యే అతను కావలసిన సరుకులు చెప్పి లిస్ట్  వ్రాయించుకొని డబ్బులు చెల్లించి సరుకులు తీసుకోవడానికి వెళ్ళాడు.. డబ్బులు తీసుకొని లిస్ట్‌మీద స్టాంప్ వేసి ఇస్తారు… అది చూపించి సరుకులు తీసుకోవాలి.

సరుకులు కట్టే కొంటర్‌లో  చీటీలు ఇచ్చాం… టి.సి. వెనుకనే నేను.. నేను అయనని పలకరించాను… “మీరు టి.సి కదా” అని నేను మొన్న అలా ప్రయాణం చేసినట్లు కూడా చెప్పాను. ఆయన అతని విధి సాధక బాధకాలు చెప్పుకొంటు పోతున్నాడు. నేను వింటూ సరుకులు కట్టే వాడి వైపు చుస్తున్నాను. సంచీలో పెట్టి ఎవరివి వాళ్ళకు ఇస్తున్నాడు. సరుకులు కట్టేటప్పుడు చూసాను. టి.సి ఇచ్చిన లిస్టులో నెయ్యి, బెల్లం, అరకిలోలు వ్రాస్తే వాళ్లు కిలోలు కట్టేసారు. టి.సీ కూడా గమనించాడు కాని ఏమనలేదు. బహుశా వేరే వాళ్ళకి అనుకొని ఉండొచ్చు… లేదా బరువు చూస్తున్నప్పుడు తీసేస్తారులే అనుకొని ఉండోచ్చు… కాని బరువు సరిగా చూడలేదు… మేం ఇద్దరం మా మా సరుకులు సంచీలు తీసుకొని బయటకు వచ్చాం… టి.సి సరుకులు చెక్ చేసుకొన్నాడు… అర్థమయ్యింది.. రెండు ఐటెమ్స్ అడిగిన దాని కన్నా ఎక్కువ కట్టారని. సుమారు మూడు వందలు లాభం. అతడిలో ఓ చిన్న మీమాంస. ఇచ్చేయాలా తెచ్చేసుకోవాలా.. అనేది. నేను గమనించి అతనికి బై చెప్పి వచ్చేసాను. బయటకు వచ్చి వెనుకకు చూసాను. అతడేమైనా  ఆ ఎక్కువ కట్టిన విషయం  చెబుతాడా, వేరే కట్టించుకొంటాడా లేదా ఎక్కువకి పైకం కట్టేస్తాడా అని చూస్తున్నాను. అతను ఒక్క క్షణం అటు ఇటు చూసి సంచి పట్టుకొని వెళ్ళిపోయాడు. నిజానికి అతడి లాభాన్ని నేను తప్పించి ఎవరూ గుర్తించలేదు. ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. అతను ఆ లాభాన్ని పొందాలా వద్దా అని ఓ క్షణం అలోచించి వెళ్ళిపోయాడు.. బహుశా “నేనేమి కావాలని మోసం చెయ్యలేదు… వాళ్ళు పొరబాటున ఎక్కువ ఇచ్చారు… రోజు జరిగే లక్షల వ్యాపారంలో ఇవెంత..” అనుకొని సంభాళించుకొని వెళ్ళిపోయిఉంటాడు అనుకొన్నాను…

బహుశా ఆ రోజు సేట్ గారు “నేనూ మర్యాదగానే ఇంకో బెర్త్ కావాలనే అడిగాను..  ఇచ్చుంటే డబ్బులు కట్టేసే వాడిని… వాడు చెక్ చేసి అడిగినా కట్టేసేవాడిని…  వాళ్ళు చెక్ చెయ్యలేదు. నేనేం ఏం చెయ్యను? రైల్వేకి ఓ ముడోందలు లాస్… అయినా రోజూ ఎన్ని కోట్లు పోతున్నాయో.. దాంట్లో ఇదెంత” అనుకొని ఉండోచ్చు…

***

సాధారణంగా తప్పులనేవి తెలిసే జరుగుతాయి.. తప్పు చేసినప్పుడు జరిగే పొరబాట్లు శాతం చాలా తక్కువే… ఆయితే తప్పు చేసినప్పుడు తప్పు చేశామని, చేస్తున్నామని, దిద్దుకొమ్మని అంతరాత్మ చెబుతుంది. పైన సేఠ్, టి.సిని కావాలని ‘మోసం’ చెయ్యలేదు కాని నిజాయితీగా వ్యవహరించలేదు. ‘నిజం దాచటం వేరు’, ‘నిజం చెప్పక పోవడం వేరు..’, ‘అబద్దం చెప్పడం వేరు’. మూడూ మూడు రకాల తప్పులు… అంతరాత్మకి అన్ని తెలుసు.. మనల్ని పై వాడు, పై అధికారి తనికీ చెయ్యకపోయినా అంతరాత్మ చెక్ చేస్తుంది .. మనం  దాన నోరు నొక్కేస్తాం..

ఇంతలో గట్టిగా నవ్వు వినిబడింది. ఆ నవ్వు నా అంతరాత్మదే.. “వాళ్ళద్దరిని విశ్లేషిస్తున్నావు.. నువ్వు చేసిందేమిటి? నువ్వు స్లీపర్ క్లాస్ టిక్కెట్ లేకుండా రిజర్వడ్ బోగీలో ప్రయాణించావుగా.. పైగా ‘ప్రక్క స్టేషన్ వరకే’ అని చెప్పావు. అతడు ఏమనలేదు అడిగి ఉంటే డబ్బులు కట్టేయడమో లేక జనరల్ బోగీకి వెళ్ళిపోవడమో చేసే వాడిని అంటావు… నువ్వు కట్టటడానికి రెడీయే కానీ అడుగలేదు కాబట్టి కట్టలేదు అంటావు.. ఆ సేఠ్‌కి, టీ.సి. కి నీకు తేడా ఏమిటి. రోజు వేల మంది టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారు…. నా దగ్గర టికెట్టు ఉందంటావు అంతేగా అని ఇంకా ఏదో అనబోతుంటే అంతరాత్మ గొంతుని నొక్కేసాను…

Exit mobile version