[dropcap]ప్ర[/dropcap]తిమనిషి తన మనసులో కొన్ని ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలను కలిగి ఉంటాడనేది నిజం. అయితే అందరి ముందూ అవి బయటపెట్టరు. అత్యంత ఆత్మీయుల దగ్గర మాత్రమే తమ అంతర్గానాన్ని వినిపిస్తారు.
మన సమాజంలో భార్యాభర్తల బంధం అతి సాధారణం. అయితే ఎవరి ఆలోచనలలో వారు బతుకుతూనే కలసి మెలిసి జీవనం సాగిస్తుంటారు. జీవిత భాగస్వాములనుండి కొన్ని ఆశిస్తూ ఉండడం మామూలే. విభిన్న మనస్తత్వాలు, ఆలోచనలు పూర్తిగా కలవడం అరుదు. ఎక్కడో నూటికో కోటికో ఒకరు అలా కలసిపోయిన జంట కన్పిస్తారు. మిగిలిన వారు సర్దుబాట్లు చేసుకుంటారు. అలా ఉంటేనే శాంతి, సుఖం ఉంటాయి. లేకపోతే ఏర్పడే అపోహలు, అపార్థాలు అశాంతికి గురిచేస్తాయి. కొన్నిసార్లు విడిపోవడం కూడా జరుగుతుంది.
శ్రీమతి అల్లూరి గౌరిలక్ష్మి తన నవల ‘అంతర్గానం’లో మూడు జంటల మధ్య ఆలోచనలు, అపార్థాలు, ఆవేశాలను ఒక మానసిక, సామాజికవేత్తలా విశ్లేషించి చూపారు. ప్రతి జంట సమస్యకు పరిష్కార మార్గాలని కూడా చూపించారు.
ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలు. చాలీ చాలని జీతాలు, ఆయా దంపతులపై ఆధారపడిన తల్లిదండ్రులు, వారందరి మనస్తత్వాలు, మనస్పర్ధలు, కల్లోలాలకు కారణమైన ఆర్థికసంబంధాలను గురించి తనదైన శైలిలో చర్చిస్తూ వివరించారు.
సుజాత, భావన అక్కాచెల్లెళ్ళు. వీరి నేస్తం ప్రియ. ముగ్గురూ కలసి చదువుకున్నారు. ఆశలు, ఆశయాలు కలబోసుకునేవారు.
సుజాత భర్త రామం సోషల్ మాస్టారు. ఇద్దరు పిల్లలు, రామం తల్లిదండ్రులు ఆరుగురు బతకవలసిన సంసారం. సుజాత పదవతరగతి తర్వాత చదువంటే ఇష్టం లేక ఆపేసింది. రామం ఆమెను చదివించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి.
డబ్బు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమెని విసుక్కుంటాడు. డబ్బు సంపాదించేవాడికి తెలుస్తుంది విలువ, నీకు ఎలా తెలుస్తుంది అనే మాటలు ఆమెని మానసిక వేదనకు గురిచేస్తాయి. ఆలోచించి టైలరింగ్ నేర్చుకుని సంపాదనపరురాలవుతుంది. దీని కోసం భర్త పెట్టిన పెట్టుబడి 2000 రూపాయలు అతనికి తిరిగి ఇస్తుంది. మిషను కొనుక్కుని సంపాదనాపరురాలైనా ఆమెకి ఆర్థికస్వేచ్ఛ ఉండదు. సంపాదనంతా తనకివ్వలేదని వాపోతుంటాడు.
రామం తల్లిదండ్రులు కోడలికి ఏ పని లోనూ సాయం చేసేవారు కాదు. కాని ఆమె మిషను కుట్టి కష్టపడుతున్నప్పుడు ఇద్దరూ ఇంటి పనులు, బజారు పనిలో సాయం చేస్తారు. కొడుకు కోడలిని మాటలతో బాధిస్తుంటే వాడి మాటతీరు నీకు తెలిసిందే కదా బాధపడొద్దని ఓదార్పునీ అందిస్తారు.
సుజాతా, రామం ఇద్దరూ కొన్ని మాటలు అనుకున్న తరువాత మనస్పర్ధలకు లోనవుతారు. మళ్ళీ ఆలోచించుకుని పొరపాట్లు దిద్దుకుని కలిసిపోతారు. మునగపోతున్న సంసార నౌక మునిగిపోకుండా ఉండాలంటే భార్యాభర్తలనే సరంగులిద్దరూ ఆలోచించుకుని సర్దుకుపోవాలని ఈ పాత్రల ద్వారా రచయిత్రి తెలియజేస్తారు.
భావన, ఆమె భర్త హరి ప్రైవేటు సంస్థలలో చిరుద్యోగాలు చేస్తుంటారు. వీరికి ఒక కొడుకు. హరి తండ్రి లేడు. తల్లి వీళ్ళ దగ్గరే ఉంటుంది. రామం పీనాసితనంతో కూడిన పొదుపు భావనకు నచ్చదు. అతనికి వ్యసనాలు లేవు. ప్రణాళికా బద్ధంగా ఖర్చుపెట్టాలని అనుకుంటాడు. దానికి భంగం కలిగితే భార్యని విసుక్కుంటుంటాడు. భావన బాధపడుతుంటే అత్తగారు వాడి సంగతి తెలుసుగదమ్మా అని సముదాయిస్తుంది.
పంతాలు, పట్టింపులకు పోయి గొడవ పెట్టుకుంటే సంసారం విచ్ఛిన్నమవుతుంది. శాంతి, సుఖం ఉండవని ఈమె సర్దుకునిపోతుంది.
తన సంపాదనలో తల్లికి అక్కకి అవసరమయినప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలని ఆశ పడుతుంది. తన ఖర్చులకుంచుకుని మిగిలిన జీతాన్ని భర్త చేతికి ఇచ్చేస్తుంది.
కాని భావన తల్లి అనారోగ్యం పాలయినప్పుడు మొదటిసారి అక్కకి డబ్బు పంపించి వైద్యం చేయించడం, రెండవసారి అయిదువేలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించడం నచ్చదు. డబ్బు ఖర్చవుతున్నందుకు విసుక్కోవడం, భావన తల్లి విని బాధపడడం జరుగుతుంది.
కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవడమే జీవితం. హరికి ఊపిరితిత్తుల సమస్య వల్ల హఠాత్తుగా ఒక ఆపరేషన్ అవసరమవుతుంది. అత్తగారు ఫిక్సెడ్ డిపాజిట్ కాన్సిల్ చేసి అతని వైద్య ఖర్చులకిస్తుంది.
ఈ సంఘటన అతని కళ్ళు తెరిపించి, డబ్బు కంటే ప్రేమాభిమానాలు ఎంత అవసరమె గుర్తించడంతో వీరి కథ సుఖాంతమవుతుంది.
మరో ముఖ్యపాత్ర ప్రియ. ధనవంతులమ్మాయి. బ్యాంక్ ఆఫీసర్. బ్యాంక్‌కి రెగ్యులర్‌గా వచ్చే వ్యాపారస్థుడు రమణని ప్రేమించి పెళ్ళిచేసుకుంటుంది. అయితే డబ్బు సంపాదన పట్ల మమకారం తప్పించి, ఎటువంటి సున్నితమైన భావోద్వేగాలు లేని రమణకి దాంపత్య జీవితంతో సహా అన్నీ యాంత్రికమే. అతనిని భరించలేని ప్రియ అతని నుండి విడాకులు తీసుకుంటుంది.
హైద్రాబాద్ బదిలీపై వచ్చిన ప్రియకి తోటి ఉద్యోగి రవిప్రకాష్ పరిచయమవుతాడు. అతని ప్రవర్తన పట్ల ఆకర్షితురాలవుతుంది. అయితే అంతకు ముందే అతనికి భార్య దుర్గ, పిల్లలు ఉంటారు. భార్యని ఒప్పించి ప్రియను పెళ్ళి చేసుకుంటాడు. అతను తన దగ్గర ఎప్పుడూ ఉండాలని ప్రియ కోరిక. కాని అతను అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. ఈ విషయం ప్రియకి బాధ కలిగించినా సర్దుకుపోక తప్పని పరిస్థితి. రెండవ పెళ్ళికి సిద్ధపడే అమ్మాయిలకు సమాజంలో ఎదురయ్యే పరిస్థితులకు ఈమె జీవితం ఓ ఉదాహరణగా చిత్రించారు రచయిత్రి. అటువైపు రవి భార్య దుర్గ తనకు చదువు తక్కువ కావడం వల్ల భర్త అలా చేసినట్లు భావించి ఉన్నత విద్యను అభ్యసిస్తుంది.
మొత్తం మీద ఈ నవలలో 3 జంటలు, నలుగురమ్మాయిలు విభిన్న పరిస్థితులలో జీవనం కొనసాగిస్తూ బతుకుతు, సమస్యలు ఎదురయినపుడు పరిష్కారాలు వెతుక్కుని ఆర్థిక స్వావలంబన సాధించారు. సంసారంలో శాంతి సామరస్యాలను నెలకొల్పుకోగలిగారు. ప్రియ పరిస్థితులే వేరు.
ఈ నవలలో వివిధ వయస్సులలో ముఖ్యంగా సుజాత, భావనల తల్లి, రామం తల్లిదండ్రులు, హరి తల్లి, ప్రియ తల్లి, చీరలమ్మే వర్ధనమ్మ, టైలర్ పాత్రలు మనకి కన్పిస్తాయి. వర్ధనమ్మ, ఆర్థిక సంపాదనకు దారులు వెతుక్కుంటారు. నలుగురికి ఈ రూపంలో స్ఫూర్తిని కలిగిస్తారు. సుజాతకి వీరిద్దరూ స్ఫూర్తిప్రదాతలు.
ఇక ఈ నవలలో కనిపించే ప్రత్యేక అంశం – ఈ నాటి మన టీవీ సీరియల్స్ అత్తమామల వంటి వారు లేక పోవడం సుజాత, భావనల అత్తగార్లు కోడళ్ళతోను, వియ్యపురాలితోను స్నేహం, ప్రేమాభిమానాలతో మసలడం పాఠకులకి హాయిని గొల్పుతుంది.
అందరి అమ్మలు, అత్తలూ ఇలా ఉంటే బావుండని పిస్తుంది. అత్తాకోడళ్ళ సఖ్యత సంసారాల్లో శాంతికి దారి తీస్తుంది.
స్థూలంగా ముగ్గురమ్మాయిల కథే అన్పించినా మరి కొంతమంది వైవిధ్యభరిత స్త్రీ పాత్రలను సృష్టించి వారివారి అంతర్గానాలను పాఠకులకు వినిపించిన అల్లూరి గౌరీలక్ష్మి అభినందనీయులు.
ఈ సంధి యుగంలో మనుషులు సామరస్యంతో, ఓర్పు, సంయమనాలతో ఆలోచిస్తే సమస్యలు పరిష్కరమైయి సంసారాలలో సుఖశాంతులను పొందవచ్చని చక్కనిశైలితో తెలిపారు రచయిత్రి. భార్యభర్తల అలకలు, పిల్లలతో కేరింతలు, చిరుదరహాసాలు, మందహాసాలు మనసుకి హాయినిస్తాయి.
ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకున్న ఈ నవల లోని పాత్రలు తమ బంధాలను బలపరచుకోవడానికి చేసిన ప్రయత్నాలు, వారు ఒకరి కొకరై బతకడానికి ఎలా సర్దుబాట్లు చేసుకున్నారు వారి సంసారాల్లో సరిగమలు పలికించుకోవడానికి వారు అనుసరించిన సమన్వయం, సమస్యలను పరిష్కారాలదిశగా మలుచుకున్నవైనం తెలియాలంటే, సొబగులను ఆస్వాదించాలంటే ఈ నవల చదవాల్సిందే.
***
రచన: అల్లూరి గౌరీలక్ష్మి
ప్రచురణ: చంద్రకాంతి పబ్లికేషన్స్
పేజీలు: 165
వెల: ₹ 100/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్-040-24652387
రచయిత్రి 9948392357