“అంతరిక్షం”లో కవిత్వమూ, ముద్దూ

0
2

[box type=’note’ fontsize=’16’] “కథలో మసాలాలు యెక్కువై అరుచికరంగా తయారయ్యింది” అంటూ ‘అంతరిక్షం’ సినిమాను సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]ప[/dropcap]దమూడేళ్ళ క్రితం అంతరిక్షం లోకి పంపిన “మిహిర” ఉపగ్రహం తన కక్ష్య నుంచి తప్పించుకుంది. దాని కారణంగా అది మరో ఉపగ్రహాన్ని ఢీకొని ఆ శిథిలాలు చెల్లా చెదురై మరిన్ని విపత్తులకు దారి తీసే ప్రమాదం వుంది. ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషను ఇప్పుడు ఇరకాటంలో వుంది. ఈ ఆపద నుంచి విముక్తి ప్రసాదించగల వాడు నాయకుడైన దేవ్ (వరుణ్ తేజ్) వొక్కడే. గత అయిదేళ్ళుగా తనకిష్టమైన రంగం నుంచి (అంతరిక్షమూ-ఉపగ్రహాలు) తప్పుకుని తమిళనాట వో పల్లెలో పిల్లలకు పాఠాలు చెబుతుంటాడు. అతన్ని వొప్పించి తెస్తానని బయలుదేరుతుంది రియా (అదితి రావు హైదరి). మొదట నిరాకరించినా, తను “సృష్టించిన” ఉపగ్రహం “విప్రయాన్” నుంచి సంకేతాలు (signals) అమెరికన్ స్పేస్ సైంటిస్టులకు అందినట్టు తెలిసిన తర్వాత వొప్పుకుంటాడు. అతను చేయవలసింది కేవలం శిక్షణ పొంది అంతరిక్షానికి వెళ్ళబోతున్న వ్యోమగాములకు తగిన శిక్షణ ఇవ్వటం మాత్రమే. కాని అతను రకరకాల నాటకాలూ, రాజకీయాలూ ఆడి వొకణ్ణి ఆ బృందం నుంచి తప్పించి తను వెళ్ళే యేర్పాట్లు చేసుకుంటాడు. తర్వాత మిహిర సమస్యను పరిష్కరించి, యెక్కడో తప్పిపోయిన తన విప్రయాన్ ని వెతికి, సరిచేసే తన రహస్య ప్రణాళికను అమలు పరుస్తాడు. అది యేవిధంగా జరుగుతున్నది అన్నది మిగతా కథ.

ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది అంతరిక్షానికీ, ఉపగ్రహానికీ సంబంధించిన కథ. ఇంగ్లీషులో “గ్రావిటి” లాంటి చిత్రాలు వచ్చినప్పటికీ, తెలుగులో ఇది అలాంటి కోవలో మొదటి చిత్రం కావడం మెచ్చుకో తగినదే. ఆ VFXలు, ప్రొడక్షన్ దిజైన్లు (రామకృష్ణ మోనిక లు), నేపథ్య సంగీతం, చాయాగ్రహణం (వి ఎస్ జ్ఞానశేఖర్) బానే వున్నాయి. కేవలం ఇంతే కథగా పెట్టుకున్నా బాగుండేది. ఇతను తీసిన ఇదివరకటి చిత్రం “ఘాజి” లో యెలాంటి డీవియేషనూ లేకపోవడం వల్ల ఆకట్టుకుంది. కాని ఇందులో కథలో మసాలాలు యెక్కువై అరుచికరంగా తయారయ్యింది.

వొక ఉపగ్రహ నిర్మాణాన్నే తీసుకున్నా దాని వెనుక యెన్నో రకాల ఇంజనీర్ల సమిష్టి కృషి వుంటుంది. ఈ చిత్రంలో పదే పదే కీ బోర్డు మీద అక్షరాలు వత్తడం, కోడ్ అనడం, కోడ్ ని మేల్ లో పంపిస్తాననడం అంతా హాస్యాస్పదంగా వుంటుంది. తర్వాత నాయకుడు యేకైక వ్యక్తి అన్నిటినీ చక్కబెట్టడానికి అని చూపించడం తెలుగు సినెమా జాడ్యమే. రజనీ కాంత్ చేసినా దానికో స్టైలు వుంటుంది, నవ్వుకుంటాము. ఇది నవ్వులపాలే. అంతరిక్షంలో అప్పటికప్పుడు వ్యూహాలు మార్చడం, సొంత నిర్ణయాలమీద నాయకుడు వెళ్ళడం, యెవరి మాటా లెక్క చేయకపోవడం ఇవన్నీ అతి అనిపించుకుంటాయి. సంభాషణలైతే కవితాత్మకంగా వుండి ఈ కథకు అసలు నప్పలేదు. అదీ అంతరిక్షంలో, సమస్యల వలయం మధ్య. చాలా తాపీగా. సాంకేతిక సంభాషణలు తక్కువ, చిల్లర వాగ్వివాదాలు యెక్కువ. పక్కనే పేలబోతున్న బాంబు వున్నా రజనీకాంత్ తన మార్కు డైలాగులు యెన్నైనా చెబుతాడు, చివరికి ఆ బాంబు మీద ఉమ్మి ఆర్పినా ఆర్పుతాడు. దాదాపు అదే స్థాయిలో ఇందులోని పాత్రలు ముఖ్యంగా నాయకుడు యెలాంటి ఎమర్జెన్సి అయినా కానీ చాలా తాపీగా దీర్ఘంగా సంభాషిస్తారు. తెలుగు సినెమా కాబట్టి ఇద్దరు నాయికలు, పాటలు మామూలే. ఈ మధ్య ముద్దు కూడా సామాన్యమైపోయింది కాబట్టి ఇందులో వెరైటీగా అంతరిక్షంలో ముద్దు సీను. సరే ఈ లిస్టుకు అంతు లేదు. ఇది మొత్తం గనుక మరిచిపోగలిగితే (కష్టమే అనుకోండి), సంకల్ప్ రెడ్డి ప్రయత్నాన్ని అభినందించగలం.

తన రహస్య ప్రణాళిక అమలు చేయబోతున్న నాయకునితో వో వ్యోమగామి అంటాడు “ఇదేమన్నా షేరింగ్ ఆటో అనుకున్నావా, ఇంకాస్త ముందుకెళ్ళి ఆపు అనటానికి”. సినెమా తన మీద తనే వేసుకున్న విమర్శాత్మక హాస్యం అనుకోవచ్చునా దీన్ని?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here