అంతరిక్షంలో మృత్యునౌక-7

0
2

[శ్రీ బంకా పార్దు సంపత్ ‘Redemption of the Century’ అనే పేరుతో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలను ‘అంతరిక్షంలో మృత్యునౌక’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[అరుణగ్రహానికి ఏర్పడిని ముప్పును తప్పించడానికి MSM 6 యొక్క సాహస యాత్ర కథలు కొత్త తరాలకు చేరాయి. నీల్ బ్యారీ, యూరీ ఇవానోవ్‌ల త్యాగాలు వ్యర్థం కాకుండా వారి వారి కుటుంబాలకు ఎంతో పేరు వచ్చింది. వారి కుటుంబాలలోని తరువాత తరాల వారు కూడా వ్యోమగాములవడానికి సిద్ధమయ్యారు. 21వ శతాబ్దంలో ఓసారి బి.బి.సి. వారు ఓ లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి – MSM 6 లో పాల్గొన్న సిబ్బందిని ఆహ్వానించి, ఆ మిషన్ గురించి, అప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడమని అడిగారు. నాసా అధిపతి మిస్టర్ బ్రియాన్, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్, ఎలాషా, అలెక్సిస్, గారిసన్, కృష్ణ, శాటో ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా రాకేష్ కృష్ణ తన అనుభవాలు చెప్తాడు. నీల్, యూరీ గురించి శాటో మాట్లాడుతుంది. భవిష్యత్తులో మార్స్ జనంతో నిండే రోజు వస్తుందని గ్యారిసన్ అంటాడు. ప్రపంచ దేశాలన్నీ మరోసారి సంయుక్తంగా చేయాల్సిన కృషి ఎంతో ఉందని అంటాడు. అణువ్యర్థాల నౌక భూమికి తిరిగివచ్చే అవకాశం ఎంత అని ప్రయోక్త అడిగితే, తన లెక్కల ప్రకారం అది 2070లో భూమి వైపు తప్పకుండా వస్తుందని శాటో చెబుతుంది. తర్వాత ప్రొఫెసర్ ఫాన్సిస్ MSM 6 బృందం గురించి, నేటి తరం యువత గురించి మాట్లాడుతాడు. భవిష్యత్తు మార్స్ మిషన్ నాయకత్వం కోసం అమెరికా పీటర్ ఇలియట్ అనే వ్యక్తిని ఎంచుకుంటుంది. వెంటనే పీటర్ – నీల్ బ్యారీ సంతానం రేచల్, జేమ్స్ బ్యారీలను, యూరీ ఇవానోవ్ కొడుకైన మిషా ఇవానోవాలను తన బృందంలోకి తీసుకుంటాడు. మిషన పని మొదలవుతుంది. – ఇక చదవండి.]

ప్రకరణం-7: ఒక శతాబ్దపు పునరుద్ధరణ

[dropcap]పీ[/dropcap]టర్, అతని కృత్రిమ మేధ రోబో అసిస్టెంట్ ‘మాయ RVM 34’ అప్పుడే ఒక వార్తా ఛానెల్ వారి స్టూడియో నుంచి బయటకు వస్తున్నారు. ఆ రోజుకు అదే అతని మొదటి అసైన్‍మెంట్. RVM అనేది ‘రోబోటిక్ వర్చుయల్ మెషీన్’ యొక్క సంక్షిప్త రూపం. అది, ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం, కాల నిర్వహణ లాంటి దైనందిన వ్యవహారాలను నిర్వర్తించగలదు. ఈ RVM మనతోబాటు రోజంతా నడుస్తూ ఉంటుంది. దానికి మరేమీ నిర్వహణ అవసరం లేదు. అతని నిజమైన సహాయకుడు, అంటే మనిషి, ఇరవై ఏడేళ్ల ఒక ఆఫ్రో-అమెరికన్ యువకుడు.

పీటర్ రూంనుంచి బయటకు వచ్చిన వెంటనే, ఆ మానవ సహాయుడు అతన్ని కలుసుకోవడానికి వేగంగా ముందుకు వచ్చాడు. అతని పేరు ఏరియస్ జోన్స్. మూడేళ్ళు తన దగ్గర పని చేసిన తర్వాత అతని బాస్ అతన్ని ఎ.జె. అని పిలవడానికే ఇష్టపడతాడు మరి!

“బాస్, మీకు జేమ్స్ నుంచి ఒక కాల్ వచ్చింది” అన్నాడు ఎ.జె. కంగారుగా. “అది చాలా ముఖ్యమనీ, మీరు తప్పక ఉండాలనీ చెప్పాడు.”

“ఫ్! అతడు రిలాక్స్ అవాలి! ఒక సెకనులో నేనక్కడ ఉంటాను.” అన్నది మాయ RVM 34. వారు హాలు దాటి భవనం బయటకు వెళ్లారు.

ఎ.జె. వారిని అనుసరిస్తున్నాడు. త్వరగా కదలకపోతే వెనకపడిపోతానేమో అన్నట్లుగా. “అతన్ని పిలవమంటారా?” అనడిగాడు, ఆశతో.

“నీకీపాటికి తెలిసే ఉండాలి మరి. తెలుసుకదా, పిలువు అతన్ని అంతే!” అన్నాడు పీటర్.

అతన్ని పిలవడం అతనికి యిష్టం లేదు. కాని మనసు మార్చుకుని అతన్ని కలవడమే మంచిదనుకున్నాడు. పైగా అతనలా చేయకపోతే ఎ.జె. అతన్నిక అస్తమానం సతాయిస్తూనే ఉంటాడు.

“అలాగే సర్” అన్నాడు ఎ.జె.

పీటర్ తన టెస్లా కార్ రిమోట్ నొక్కాడు. అది పూర్తి ఆటోమేటిక్ కారు. తనంతట తానే డ్రైవ్ చేసుకుంటుంది. ఎగరమని ఆదేశిస్తే ఎగరగలదు కూడా. పీటర్ దరిదాపులకు రాగానే ముదురు ఉదారంగు్లో ఉన్న ఆ కారు ‘బీప్’ మంది; తలుపులు తెరిచే ఉన్నాయని సూచిస్తూ. పీటర్ తలుపు తెరచి, కార్లోకి ఎక్కాడు, ఎ.జె.తో బాటు.

మాయ RVM34, కారును రోబోటిక్ కంట్రోల్ విధానం లోకి మార్చి, జార్జియాలోని అట్లాంటా నగరం రద్దీ వీధులలోకి దూసుకోపోయింది, పార్కింగ్ చేసిన చోటునుంచి.

అంతరిక్ష ప్రయోగశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడతడు. అతని ఇతర సహోద్యోగులు అతని కోసం వేచి చూస్తున్నారు.

“అతడు ఫోనెత్తాడు సర్” అన్నాడు ఎ.జె., స్మార్ట్ ఫోన్‌ను తన బాస్ కిస్తూ.

“స్పీకర్ ఆన్ చెయ్యి, సిల్లీ ఫెలో!” అన్నాడు పీటర్.

“చేశాను సర్.”

“హాయ్ పీటర్! దారిలో ఉన్నావనుకుంటున్నా. ఎదురుచూస్తున్నాం. చాలా ముఖ్యమైన అప్‌డేట్!” అన్నదో గొంతు ఫోన్‍లో.

“అవునవును. వస్తున్నా, జేమ్స్! కాల్ కట్ చేయి” అన్నాడు పీటర్ హడావిడిగా. ఎ.జె. త్వరగా స్పందించాడు.

పీటర్ నిట్టూర్పు విడిచి, కారు యాక్సిలరేటర్‍ను నొక్కమని ఆదేశించాడు.

అది ఇంకా 2030వ సంవత్సరమే. 1970లో మిషన్ టు మార్స్ జరిగి ఇంచుమించు అరవై ఏళ్లయింది. అంతవరకు జరిగిన ప్రోగ్రెస్ పెద్దగా ఏమీ లేదు. కొద్ది సంవత్సరాల క్రితమే మార్స్‌ని నివాసయోగ్యంగా చేసే మిషన్‍ను విశ్వవ్యాప్త కార్యంగా రూపుదిద్దటానికి ప్రపంచమంతా ఏకమైంది.

అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనశాల పేరు ‘స్పేస్ M’. ఇక్కడ ‘M’ అంటే మార్స్. ఆ మిషన్ పేరు GCMMTM. అంటే పూర్తి వెర్షన్, ‘గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ మ్యాన్డ్ మిషన్ టు మార్స్’. అంటే మార్స్‌కు ప్రయాణించే మానవ చోదిత మిషన్ కోసం అంతర్జాతీయ సహకారం. ఆ సమాఖ్యలో ఎన్నో అంతరిక్ష సంస్థలు, ఇతర విడి దేశాలు భాగమయ్యాయి. బృహత్ నాసా, స్పేస్ X, యూరోపియన్ స్పేస్, జపనీస్ జాక్సా, ఇండియన్ ఇస్రో, చైనీస్ CNSR, ఇంకా ఇతర ప్రభుత్వేతర అంతరిక్ష సంస్థలు ఆ GCMMTM గ్రూపులో చేరాయి.

పీటర్ అప్పడే ఒక ఇంటర్వ్యూకు హాజరై తిరిగి వస్తున్నాడు. మొత్తం ప్రణాళిక ఎలా రూపుదాల్చి, సాకారమవబోతున్నదని అందులో అతన్ని ప్రశ్నించారు. దాని గురించి ఇంటర్వూలో అతడెంతో చెప్పి వచ్చాడు; ఆ మిషన్ గురించిన ఆశావహ దృక్పథంతో. అలా పీటర్ అందరి కుతూహలాన్ని పెంచాడు.

అతడు చెప్పిన విషయాల్లో ఒకటి, వాళ్లు మార్స్ కోపంపిన ‘రోవర్’ త్వరలో భూమికి తిరిగి వస్తుందనేది. వెనక్కు తీసుకొచ్చిన నమూనా గురించి కొంత పరిశోధన జరిగిన తర్వాత, మనుషులను అంతరిక్షంలోకి, మార్స్‌కు పంపే మిషన్‌కు సంబంధించిన ప్రణాళికలు ఉంటాయన్నాడు

అతని ఆలోచనల్లోంచి బయటపడలేదింకా. సమీపిస్తున్న కారు హరన్ అతన్ని తెప్పరిల్లచేయలేకపోయింది. ఎ.జె. తట్టగా అతడు ఈ లోకంలోకి వచ్చాడు.

మాయ RVM34 ల్యాబ్ భవనం గేట్ల గుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. కారు ఆటోమేటిగా స్కాన్ అవుతుంది కాబట్టి ఎవరూ తమ గుర్తింపు కార్డులను చూపాల్సిన పని లేదు. మాయ కారును పార్క్ చేసింది. పీటర్, అతని ఇద్దరు సహాయకులు ఇంచుమించు పరిగెత్తినట్లుగా నడిచారు. భవనంలోకి ప్రవేశించి, తన స్నేహితుని వైపు ఉరికాడు పీటర్.

“ఏమిటది?” అని అడిగాడు, తన ఐ.డిని ట్యాప్ చేసి తలుపు తోస్తూ.

“ఉద్వేగం కలిగించేదే మొత్తానికి. మన మార్స్ మిషన్ నమూనా సిద్ధం అయింది!”

***

2031 లో ఒక సమయం.

ఎన్నో దశాబ్దాల పరిశోధన, మార్స్ కోసం మొక్కవోని, నిరంతర తపన తర్వాత అక్కడికి మనుషులను పంపే మిషన్ సాకారమైంది. మొదటి ట్రయల్ అంతకముందు సంవత్సరం

జరిగింది. ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్లు తొలిసారిగా మార్స్ మీద అడుగుమోపిన వాళ్లయ్యారు. వారిని ఒక వ్యూహం ప్రకారం ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసింది. ఎందుకంటే వారు మొత్తం ప్రపంచానికి ప్రతినిధులు. వారి ఎంపికలో ఎటువంటి పక్షపాతం ఉండకూడదు. జేమ్స్ బ్యారీ, రేచల్ బ్యారీ, మిషా ఇవానోవ్, పీటర్‌లు. వారిని చంద్రగ్రహానికి పంపారు. తర్వాత, 2031 లో, ఒక శాస్త్రవేత్తల బృదం మార్స్‌కు ప్రయాణించింది. అక్కడ వారిని ఇంజనీర్లు కొందరు కలుసుకున్నారు.

మూడు సంవత్సరాలపాటు, ప్రపంచవ్యాప్తంగా, ఎంపిక చేసిన ప్రజులు మార్స్‌కు ప్రయాణించిన తర్వాత మార్స్ మీద స్థావరాలను సృష్టించారు; ప్రజలు అక్కడికి వెళ్లి నివసించడానికని.

సాంకేతికాభివృద్ధి కొత్తపుంతలు తొక్కసాగింది. జీవితం అత్యంత ఆధునికమైంది, అనువుగా మారింది. మనుషులకు సౌలభ్యం పెరిగింది. కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగు చూశాయి. భూమి మీదున్న పావు భాగం దేశాలు పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడ్డాయి. దీనివల్ల, శాస్త్రవేత్తలకు, మార్స్‌కు వెళ్లి ఉండేవారి కోసం మంచి వాతావరణాన్ని, పరిస్థితులను కల్పించడం సులువైంది.

2033లో, ఆరుసార్లు నేరుగా మార్స్ మిషన్స్ విజయవంతమయ్యాక మిస్టర్ ఎలన్ మస్క్ అనే ఆయన, Space X కు చీఫ్, తన 63వ ఏట, మార్స్‌కు ప్రయాణించి, అక్కడ స్థిరపడే మిషన్‌లో పాల్గొన్నాడు. ఆ వయస్సులో కూడా ఆయనకి పిల్లలను కనాలనే తపన చావలేదు. ఆ సంవత్సరం ఒక పెద్ద మలుపు. సాధారణ ప్రజులు కూడా మార్స్‌కు వెళ్లి స్థిరపడడానికి ఆసక్తి చూపసాగారు. మార్స్ పై జనాభా వేగంగా పెరగసాగింది. మార్స్ ప్రజలు తమను తాము ‘మార్షియన్స్’ అని పిలుచుకోవడం మొదలెట్టారు. కొన్ని మిషన్స్ తర్వాత, భూమ్మిది వివిధ దేశాల నుంచి వచ్చిన వారంతా కలిసి, ఒకరితో ఒకరు సమన్వయం చేసుకొని జీవించాల్సిన అవసరాన్ని గుర్తించారు. మార్స్ మీద లభ్యమయ్యే పరిమిత వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవలసిన నిజాన్ని వారు గ్రహించారు.

ఇండిపెండెంట్ మార్స్ బాడీ (IMB) స్థాపించబడింది. మార్స్ పై జీవితం క్రమపరిణామం చెందసాగింది. మార్స్ మీద స్థిరపడ్డ ప్రజల్లో అధిక సంఖ్యాకులు శాస్తవేత్తలు, ఇంజనీర్లు, పరిశోధకులు. ఇతరులు IMB అభివృద్ధిలో కీలకమైన వృత్తుల్లో, బలమైన పునాదిగా ఉన్నవారు. ఆ మిషన్ కేవలం ప్రపంచం లోని శాస్త్రవేత్తలకే కాదు, అక్కడికి వెళ్లి ఉండాలనుకునీ ప్రతి మనిషికీ కలగా మారింది.

అలా, మార్స్ మీది మానవులు, ఆ గ్రహంపై తమ జీవితాన్ని సాధ్యమైనంత సులువుగా తీర్చిదిద్దుకోడానికి అవసరమైన విధానాలకు రూపకల్పన చేయడం ప్రారంభించారు. వాతావరణంలో ఆక్సీజన్‌ను సైతం ఉత్పత్తి చేయగల విధానం సృష్టించబడింది. మార్స్‌ను నివాస యోగ్యంగా చేయడానికి ఎంతో డబ్బు ఖర్చయింది. దానికి కావలసిన ఆర్థిక వనరులను, ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా సమకూర్చాయి.

దేశాల మధ్య ఉన్న సయోధ్య కారణంగానే ఇది సులభసాధ్యమైంది. కొన్ని దేశాల దోహదం ఎక్కువగా ఉన్నట్లు తెలిసినా, అన్ని దేశాలకు వారు తిరిగి పొందబోయే ప్రయోజనాలలో వారి స్థానం ఏమిటో బాగా తెలుసు.

మొదటగా, వృత్తినైపుణ్యం లేని మామూలు మనుషులుంటారు కదా! వారి మాటేమిటి? వారు మార్స్‌కు వెళ్లాలనుకుంటే కేవలం పర్యాటకులు గానే వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత, క్రమంగా, మార్స్‌పై ఒక ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. భూగ్రహం నుండి ఆ గ్రహానికి ఎక్కువ వనరులు తరలించడం మొదలైంది. క్రమంగా పరిస్థితి ఇంకా ఇంకా మెరుగైంది.

2045లో రెండు పెద్ద అడగులు పడ్డాయి. తొలిసారి మార్స్‌కు ప్రయాణించిన బృందం నాయకుడు పీటర్ మార్స్‌ను సందర్శించాడు, అక్కడ సాధించిన దాన్ని చూడడానికి. పీటర్ యువకుడిగా ఉన్నపుడు కన్న కల, మానవులను మార్స్‌కు పంపిన చాలా సంవత్సరాల తర్వాత సాకారమైంది. పీటర్ తన జీవితాన్ని మార్స్‌లో గడపడానికి సిద్ధపడ్డాడు. IMBకి తొలి అధ్యక్షుడైనాడు. భూమ్మిది దేశాలకు అదనంగా, మార్స్ ఒక ప్రత్యేక దేశంగా గుర్తింపబడింది.

అతని స్నేహితులు, జేమ్స్, రేచల్, మిషా అతని గురించి చాలా సంతోష పడ్డారు. రెండవ పెద్ద నిర్ణయం, 2045లో జరిగింది, మార్స్‌ను అంతర్గ్రహ దేశంగా ప్రకటించడం.

IMB ఒక దేశంగా, అన్ని రకాల సంస్కృతులను సంప్రదాయాలను తనలో అతి సులభంగా ఇముడ్చుకోగలిగింది. మళ్లీ భూమి మీదకు వెళ్లడానికి అంతే మంది ప్రజలు ఉండేవారు. కేవలం విజిట్ చేసి వెళ్లిపోయేవారు, అక్కడ పని చేసేవారు, అక్కడే స్థిరపడేవారు, ఇలా భూమి మీద ఉన్న దేశాల నుంచి ఎవరయినా సరే, మార్స్‌కు వెళ్లాలంటే అంతర్గ్రహ వీసా తప్పనిసరిగా పొందాల్సిందే.

వీసా సులభంగానే మంజూరయ్యేది. దాని వల్ల భావితరాల వారు, అక్కడ వృత్తి నైపుణ్యంతో బ్రతకగలవారికి సులువైంది.

మార్స్ మీద ఉపయోగించబడి భాషను పరిగణిస్తే, మార్స్‌కు యాత్ర చేయడం, రాత్రికి రాత్రి సంభవించలేదు. అక్కడ స్కూళ్లల్లో తప్పక ఉండే భాష ఇంగ్లీష్ కాదు, ఫ్రెంచ్ కాదు, చైనీస్ కాదు. సంస్కృతభాషాజన్యమైన ఒక యాంత్రిక భాష అది.

మళ్లీ ఇరవయ్యవ శతాబ్దానికి వెళదాం. రాకేష్ కృష్ణ రాసిన ఒక పత్రం ప్రచురించబడింది. దానిలో, కృత్రిమ మేధ (Artificial Intelligence) లోకి సంస్కృత భాషను సమైక్యపరచడం వల్ల వచ్చే లాభాలను వివరించాడు రచయిత. ప్రోగ్రామ్ చేసే రంగంలో మీషా ప్రాతిపదిక ఉంది. దాన్ని అతడు చేపట్టి, దాని మీద పనిచేశాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆ భాషను అతడు రూపొందించిన యంత్రాలలోకి ప్రవేశపెట్టగలిగాడు. దానివల్ల తేలిందేమిటంటే, ప్రత్యేకంగా కోడ్ చేసి, డిజైన్ చేసిన ఆ యంత్రభాషను, మెషీన్లకు కోడ్ చేస్తే, అవి మానవుల ప్రమేయం ఏ మాత్రం లేకుండా నడవడం, నిర్ణయాలు తీసుకోవడం, చర్యలు తీసుకోవడం చేయగలిగాయి.

పీటర్ ఆధ్వర్యంలో మార్స్ లోని ప్రపంచం నడవసాగింది. అట్లే సంస్కృతభాష కూడా. నెమ్మదిగా, స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు, పూర్తిగా మార్షియన్లు అవడానికి నిర్ణయించుకున్నవారి కోసం నెలకొల్పబడ్డాయి. ఆసుపత్రులు కూడ కట్టారు. ప్రజలు అక్కడే పిల్లలకు జన్మనివ్వసాగారు. అక్క పుట్టినవారు జన్మతః మార్షియన్స్. వారికి ఏ వీసాలు అవసరం లేదు.

2040లో, యంత్రాలకు, మనుషులకు తమ భావాలు వ్యక్తం చేసుకోడానికి ఒక ఉమ్మడి భాష ఏర్పడింది. మార్స్ పై యంత్రాలు, సాధారణ స్థితిలో ఉండేవి, అన్నీ అంతా ఆటోమేటిక్ (స్వయంచాలితం) గా నడిచేది. రవాణా సౌకర్యాలు కూడా అంతే. వాహనాలన్నీ పరిశుభ్రమైన, కలుషితంకాని ఎనర్జీతో నడిచేవి. భూమిపై సహజంగా మానవులు చేసే ఉద్యోగాలన్నీ యంత్రాలు చేయసాగాయి.

రోబోలు విరివిగా తయారై, మార్స్ వీధుల్లో, వాటికి నియోగించిన రకరకాల పనులు చేస్తూ, తిరుగుతు కనబడసాగాయి.

ప్రపంచంలోని చాలా విశ్వవిద్యాలయాలు, ప్రోగ్రామింగ్, AI ప్రోగ్రామ్స్ కొరకు సంస్కృతం అత్యుత్తమ భాష అని గుర్తించాయి. దీనికి కారణమైన నిజం ఏమిటంటే సంస్కృత భాష నియమ బద్ధమైంది, సూత్ర బద్ధమైంది. పదాల అర్థాన్ని నిర్ధారించడానికి దానికొక తార్కికమైన వాక్యనిర్మాణం ఉంది. ప్రపంచ భాషలన్నింటిపై దాని ప్రభావం ఉంది.

“జనని సమస్తభాషలకు సంస్కృత భాష ధరాతలంబునన్” అన్న నానుడి భారతదేశంలో ఉంది. ఆ భాషకున్న ఈ గొప్ప లక్షణాల వల్ల, అది మెషీన్ లాంగ్వేజ్‌కు, ప్రోగ్రామింగ్‌కు సరిగ్గా సరిపోతుంది.

మానవులు సహజంగా మాట్లాడే భాషలలోని, లేదా వ్రాసే భాషలలోని పదాల నిజమైన అర్థాలను కనుక్కోవడం కృత్రిమ మేధకు కష్టమయ్యేది. దీన్ని మిషా సోదాహరణంగా వివరించాడు. ఒక అధిక్షేప వాక్యాన్ని (ఎత్తిపొడుపు), దాని అర్థాన్ని విప్పి చెప్పడానికి ఎ.ఐ. ప్రయత్నించిందనుకుందాం. తనను ఆహ్వానించిన ఒక ఇంటర్వూలలో, తన భావాన్ని, ఉదాహరణతో వివరించాడతడు.

చిన్న, మామూలు వాక్యాలు కూడా, ఉదాహరణకు ఆశ్చర్యార్థకాలు, మన సహజ భాషలలో రాస్తి, తప్పుగా అర్థం చేసుకోబడతాయి. ‘వావ్!’ అన్నది తీసుకుందాం. దీని నుండి ఎ.ఐ. నేరుగా రెండు అర్థాలను గ్రహిస్తుంది. మొదటిది, ‘వావ్’ అన్నవ్యక్తి తాను కనుగొన్న దాని వల్ల ఉత్తేజితుడు, సంతోషించినవాడు అవటం. రెండు అతడు దానివల్ల తికమకపడ్డాడు అని కూడా తీసుకోవచ్చు. దాన్ని సంస్కృతం సులభతరం చేస్తుందంటాడు మిషా. దాని వల్ల యంత్రాలు, ఒక దశలో పూర్తిగా స్వతంత్రమయ్యాయి.

IMB నగరరాజ్యం మరింత విస్తరించసాగింది. దాన్ని ఒక దేశంగా పిలవడం సముచితం. 2070 కల్లా దాని జనాభా మూడు మిలియన్లకు చేరుకొంది.

***

“అదీ విషయం. అలా మార్స్‌కు మన ప్రయాణం ముగుస్తుంది” అన్నది రేచల్ చిరునవ్వుతో.

ఆమె ఉపన్యాసం పూర్తికాగానే హల్లోని శ్రోతలందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో తమ ప్రశంసను తెలిపారు. డ్రోన్ కెమెరాలు పైన తిరుగుతున్నాయి. అవి ఒక గొప్ప వ్యోమగామిని, మార్స్ మిషన్ లోని ముఖ్యభాగాలకు సంబంధించిన ప్రతి కోణాన్ని తమలో బంధిస్తున్నాయి.

రేచల్ బ్యారీ పక్కనే, జేమ్స్, మిషా, పీటర్ అసీనులై ఉన్నారు. 2035లో జరిగిన ప్రపంచ స్థాయి అతి పెద్ద ‘షో’ అది. వారందరినీ అప్పుడే ఇంటర్వ్యూ చేశారు.

రేచల్ ఒక చేయి తన పొట్టకానించుకుని రెండవ చేత్తో జనాలకు చేయి ఊపుతూ అభివాదం చేసింది. కొద్దిరోజుల క్రితమే, పీటర్‌తో కలిసి, ఆమె తన రెండవ మార్స్ సాహస యాత్ర నుంచి తిరిగివచ్చింది. అది ఎలా జరిగిందో వివరించడానికి వారి నాహ్వానించారు. వారు, తాము ఒక సెల్ఫ్-సస్టెయినింగ్ ఎకో సిస్టమ్‌ని నిర్మించడంలో తమ విజన్‌ను గురించి మాట్లాడారు.

వారు చర్చించిన ఇతర విషయాలలో మిథేన్ గ్యాస్‌ను సుసంపన్నం చేయడం, C02-02 మార్పు క్రమపరిణామాలు, అవి ఎలా సహజమైన, సింథటిక్ కృత్రిమ ఆకుల ఫొటొసెల్స్ ద్వారా సాధించబడ్డాయి, అది వారు సాధించిన అత్యంత కీలక విజయం, మొదలైనవి.

ఇంటర్వూ తర్వాత, వారి బృందం మళ్లీ పరిశోధనశాలకు వెళ్ళింది. అక్కడ వారు తమ తొలి రోజుల అనుభవాలపై ఒకరి మీద ఒకరు ఛలోక్తులు విసురుకొన్నారు. అంత సేపూ, రేచల్ తన పొట్టను రుద్దుకుంటూనే ఉంది.

లాబ్ చేరిన వెంటనీ ఆమె, భవనంలోని తన ఆఫీసుకు వెళ్లి, చాలా సేపటి శ్రమతో అలసినందువల్ల, ఒక కుర్చీలో చీరబడింది.

తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎన్నో సంవత్సరాలపాటు ఆమె చేసిన కఠోర శ్రమ ఫలించింది అరుణ గ్రహానికి ఆమె సాహస ప్రయాణం ఎన్నో చెప్పగలదు ప్రపంచానికి. అప్పుడు ఆమె తండ్రి ఎక్కడ ఉన్నా, కిందికి చూసి చిరునవ్వు నవ్వుతాడు, కూతురిని అభినందిస్తూ.

మార్స్‌కు ఎంతమందైనా శాస్త్రవేత్తలు వెళ్లి ఉండవచ్చు. కాని రేచల్ మాత్రం దానికి ఆద్యురాలు. మార్స్‌లో మానవ జీవితం అభివృద్ధి చెందటానికి ఆమె సాహసయాత్ర ఒక్కటే కారణం కాకపోవచ్చు. కాని ప్రజులు తమను తాము అనుసంధానంచేసుకునేది దానికి మాత్రమే.

ఛెయిర్లో ముందుకు వంగి, ఆమె తన ఫోన్ అందుకుంది. తన ప్రియమైన మగని నుండి మిస్డ్ కాల్ ఉండడం ఆమెకేమీ ఆశ్చర్యం కాదు. అతని సహాయ సహకారాలు ఆమెకు ఉన్నవే. అతడంటే ఆమెకు చాలా ప్రేమ. అది అటు వైపు నుంచి కూడా అంతే తీవ్రంగా ఉండటం ఆమెను సంతోషంగా ఉంచుతుందెప్పుడూ.

వారిద్దరూ పెళ్లి చేసుకోబోయేముందే, ఆమె పేరు లోని చివరి భాగాన్ని అతడు స్వీకరిస్తానని ఆఫర్ చేశాడు. ఆ పేరు గొప్పతనం అతనికి తెలుసు. అతనామాట అన్నప్పుడు, ఆమెకు ఎన్నడూ తెగని ప్రేమ సంకెళ్ళు వేసినట్లయింది. సాహసయాత్రలకు రెండింటికీ, ఇద్దరూ కలిసి వెళ్లారు, పెళ్లి తర్వాత అది వారిద్దరికీ ఒక అందమైన కలయిక.

వారిద్దరి బంధాన్ని పటిష్టపరచడానికి, ముద్దులొలికే ఒక బాబో, పాపో వారింట వెలయాల్సి ఉంది. దాని కోసం కూడా వాళ్లు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం రాలేదు. ఆమె తన పొట్ట మీద చేత్తో రాసుకుంటూ, మాతృతృపు మధురిమలను మననం చేసుకుంటూ, నవ్వుకుంది. ఆమె కొన్ని నెలల గర్భవతి ఇప్పుడు. అందుకీ మార్స్‌కు తర్వాతి సాహసయాత్ర గురించి ఇప్పుడప్పుడే ఆలోచించే పరిస్థితి లేదామెకు.

ఆమెకు రెండు ఛాయిస్‍లు ఉన్నాయి. భూమిపై ఉండిపోయి, బిడ్డకు జన్మనివ్వడం, బిడ్డను భూగ్రహవాసిగా చేయడం. కాని కొన్ని ఇబ్బందాలున్నాయందులో. మార్స్ పై బిడ్డను కనే వ్యక్తులతో ఆమే మెదటిది కాదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఆమె భయమల్లా, పుట్టే బిడ్డ తాను మార్షియన్‌గా ఉండటానికి ప్రాధాన్యత యిస్తుందా, లేక భూగ్రహవాసిగానా అనేది.

ఆమె భర్తకు ఫోన్ చేసి, తను మార్స్ మీదే తమ బిడ్డకు జన్మనివ్వడం గురించి అతడేమను కుంటున్నాడని అడిగింది. అతడు చాలా సంతోషించాడు. తన ఆనందోత్సాహాన్ని దాచుకోడానికి ప్రయత్నిస్తూ, అది ఆమెనే నిర్ణయించుకోమన్నాడు.

చాలా సేపు అలోచించింది రేచల్. చివరికి మూడోసారి మార్స్‌కు వెళ్లడానికే మొగ్గు చూపిందామె మనస్సు, అక్కడే స్థిరపడి, తన అంతరిక్ష పరిశోధనలు కొనసాగించాలని నిర్ణయించుకుందామె.

మార్స్ పై పిల్లల్ని కనడం అప్పటికింకా సాధారణమైపోలేదు. ఇద్దరు పిల్లలు అక్కడే జన్మించారు.

ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. కుర్చీలో వెనక్కు వాలి, తన బక్క పలచని శరీరంలోకి ఆ విశ్యాసం ఇంకింప చేసుకుంది. లేచి వెళ్లి, మార్స్‌కు వెళ్లే వ్యోమగాముల జాబితాలో తన పేరును చేర్పించుకోవాలి. ఇక అప్పుడే, ఆమె ఫోన్ మోగింది. ఆమె దాన్ని ఎత్తింది.

“హలో! మామా!”

***

మార్స్ ఉపరితలంపై సూర్యుడు తన కాంతిని ఉజ్జలంగా వెదజల్లుతున్నాడు. మార్షియన్లు దానిని తమ గ్రహంపై, ‘మధ్యాహ్నం’ అని అంటారు. ఒక పెద్ద, పారదర్శకమైన గోళం ఒకటి ఉందక్కడ. మార్స్ మీది అసలు గాలికి దూరంగా, ఆక్సీజన్‌ను ప్రసరణలో ఉంచడం కోసం అది ఉపయోగపడుతుంది.

రేమండ్ గబాగబా నడుస్తూ వస్తుంది. అది విశ్వవిద్యాలయ భవనాల్లో ఒకటి. ఆమె తన బాల్యస్నేహితురాలిని కలుసుకోవాలని, వడిగా అడుగులు వీస్తుంది.

“కీరా! ఆగు!” అంటూ అరిచింది. ఆమె చేతుల్లో రెండు పుస్తకాలు, వీపు వెనక వేలాడే ఒక సంచి.

“హాయ్, అమ్మాయ్! నీవు రావడం చూడనే లేదు!’ అన్నది కీరా, వెనక్కు తిరిగి రేమండ్‌ను చూసి.

“చూడలేదు లే; చూడవుగా!” అంది రేమండ్. కీరా దగ్గరికొచ్చి తన చేతిలో పుస్తకాలను కొన్నింటిని ఆమెకిచ్చింది. “నీ దృష్టంతా మగవారి మీదే కదా! అదీ అందమైన వారిపై!”

ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని కిసుక్కున నవ్వుకున్నారు. వారు టీనేజ్ దాటి చాలా కాలమైనా, టీనేజ్ హస్య ప్రవృత్తి వారిని వదలలేదు. రేమండ్ బ్యారీ, రేచల్ బ్యారీ కూతురు. మార్స్ మీద పుట్టిన మొదటి తరం పిల్లల్లో ఒకరు. ఆమె మార్స్ మీదే పెరిగింది. పుట్టినప్పటినుంచి అక్కడే ఉంది. భూగ్రహం గురించి వినడం, తెలుసుకోవడం తప్ప. ఆమెకు ఏమి తెలియదు తన మాతృగ్రహం గురించి. వాళ్ళమ్మ రేమండ్‌ను మార్స్ లోని విద్యావిధానం ప్రకారం తీర్చిదిద్దింది. అక్కడి అత్యాధునిక సాంకేతికతలన్నీ ఆ అమ్మాయికి కొట్టిన పిండి.

భూమిపై ఉండేవారి కంటే, మార్స్‌పై ఉండే వాల్ళు ఎదుర్కొనే సవాళ్ళు మరింత సంక్లిష్టంగా ఉంటాయి. అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడడానికి వారికి ఎక్కువ ప్రేరణ అవసరం.

“ఏమిటీ నీ సంగతి? ఎంతుకంత హడావుడి పడుతున్నావు? ఉండు చెబుతా. ఆఁ! నీవు ఆ భూమ్మిది యువకుడితో చేసిన సంభాషణ వల్లే కదా ఇదంతా?” అని అడిగింది కీరా నర్మగర్భగా. తను చెబుతున్నది కరక్టేనని అమ్మాయికి బాగా తెలుసు.

“ఉండవే తల్లీ! మనం భూమి గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుకుందాం. మరేం వద్దు” అన్నది రేమండ్ తనను తాను సమర్ధించుకుంటూ.

“ఓహ!” అంది కీరా.

“సీరియస్‍గా చెబుతున్నా. అతని తాతయ్యగారు యూరీ ఇవానోవ్, మా తాతయ్యకు స్నేహితుడు. కాబట్టి మా మధ్య సామాన్యమైన విషయాలుంటాయి. అంతే!”

“అబ్బా, నిజంగానా?” అన్నది కీరా, రేమండ్‌ని ఆటపట్టిస్తూ. “నిజంగానేనే! అతనికీ, నాకు లాగానే అంతరిక్షం అంటే ఇష్టం. అతడూ నాలాగే క్లాసులో టాప్. నాకు భూమి అంటే ఎంత కుతూహలమో, అతనికీ మన మార్స్ అంటే అంతే ఆసక్తి, మాది కేవలం వర్క్ రిలేషన్‌షిప్, తెలుసా?”

“అయితే ఇద్దరి మధ్య టింగ్లింగ్ ఏమీ లేదన్నమాట! అతడి పేరేమిటన్నావ్?”అనడిగింది కీరా, హల్లో, ఇద్దరూ విడిపోవాల్సిన ఒక చోట ఆగుతూ. ఇద్దరి క్లాసులూ వేరు మరి.

“అతడి పేరు యూరీ జూనియర్. అతనిపట్ల నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు” అన్నది రేమండ్ నచ్చచెపుతున్నట్లుగా.

“నీ ఎడమకన్ను అదురుతుంది మరి! అబద్ధం చెబతున్నావన్న మాట! బై!” అని నవ్వి, వెళ్లిపోయింది కీరా.

రేమండ్ హాల్లో ఒంటరిగా నిల్చుండి పోయింది తన పుస్తకాలతో. తన పెదవులను కొరుక్కుంది. తను అబద్ధం చెప్పడంలో ఒక పద్ధతి ఉందనీ, ఎప్పుడూ అదురుతూ ఉండే తన ఎడమ కన్ను తననంత సులభంగా పట్టివ్వదనీ, ఆలోచిస్తూ.

***

రేమండ్, యూనివర్శిటీ నుండి డిగ్రీ తీసుకుండి IMBలోనే అత్యంత ఉత్తమఫలితాన్ని సాధించింది. ఆమెను MAA లో చేర్చుకున్నారు. MAA అంటే ‘మార్స్ ఏరోనాటిక్స్ అసోసియేషన్’. అందులో ఆమె సభ్యత్వాన్ని పొందింది. న్యూరల్ నెట్వర్క్స్ గురించి ఆగ్‌మెంటెడ్ స్పేస్ షటిల్ గురించి తనకు చేతనైనదంతా నేర్చుకుందా అమ్మాయి. ఆమె తన అభ్యాస పరిస్థితులను మరింత విస్తృతపరచుకోవాలనుకుంటుంది. అన్ని రంగాల్లో ఆ అమ్మాయి విజయపథాన దూసుకునిపోతుంది. నీల్ బ్యారీ అద్భుత వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నంలో, నిరంతరం శ్రమిస్తూ, తన తాతయ్య, అమ్మలాగా గొప్ప జిజ్ఞాసను, కృషిని కనపరుస్తూ ఉంది.

“ఈ రోజు రేమండ్ ఈ స్థితిలో ఉందంటే, దానికి కారణం వాళ్లమ్మ రేచల్ ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణే! నేను ఇప్పుడు మీకు రేమండ్‌ను పరిచయం చేయబోతున్నాను. ఆమె మన కొత్త ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంతరిక్ష ప్రాజెక్ట్‌’కు రూపశిల్పి. ఈ మిషన్ కేవలం అత్యంత ఆధునాతన రోబోటిక్ వర్చుయల్ మెషిన్స్, RVMలు, ఆరవ తరానికి చెందిన వాటితో నడుస్తుంది. దీనికి మానవుల అవసరమే లేదు.”

ప్రయోక్త ఆమె సాధించినవన్నీ, పొల్లుపోకుండా ఏకరువు పెట్టినట్లే. శ్రోతలకది చాలు. వారు లేచి నిల్చుని, రేమండ్ వేదిక మీదకి వస్తూండగా, తమ కరతాళ జనిత ప్రశంసలు. కురిపించారు. ఆమె వారి వైపు చిరునవ్వులు మెరిపిస్తూ చూసింది. ఆమె ఎర్రని గౌను నిలువెల్లా ధరించి ఉంది. ఎత్తు మడమల జోళ్లు ఆమె ఎత్తును పెంచాయి. లేత పసుపు రంగు లోని తన జుట్టును వెనక్కు దువ్వి, పోనీ టెయిల్ వేసుకొంది.

ఆమె కన్నులు ఇద్దరిపై నిలిచాయి. ఆమె పట్ల గర్వాతిశయంతో చూస్తున్నవారెవరో కాదు, ఆమె అమ్మ, నాన్న. ఆమె ఒక ఉపన్యాసం చెప్పాల్సి ఉంది. కాని దానికి సిద్ధపడి మాత్రం లేదు. “అందరికీ కృతజ్ఞతలు” అంది రేమండ్. “నా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెల్పుతున్నా. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన వారు వారే. నేనెలా పెరిగానో, నాతో బాటు ఈ ప్రపంచం కూడా ఎలా పెరిగిందో తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. అది నాకు గౌరవం కూడా. మా తాతయ్య బాల్యం గురించిన విజయగాథలు నాకు నేర్పించారు. ఆయన 1970లో, అంతరిక్షంలోకి వదిలిన అణుధార్మిక వ్యర్థాల నౌక నుండి మార్స్‌ను ఎలా రక్షించా, భూమి నుండి ఎంత రిస్క్ తీసుకొని ప్రయాణించాడో తల్చుకుంటే నా ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. ఆయన గౌరవార్థం రెండు సెకన్ల పాటు మౌనాన్ని పాటిద్దాం!” ఆమె అభ్యర్థనతో అంతా నిశ్శబ్దం. సరైన సమయం అది. చాలామంది తమ శిరస్సులను వంచి ఆ మహనీయునికి అంజలి ఘటించారు. దాన్ని చూసి రేమండ్ మనసు తృప్తి చెందింది. తన ఆలోచనల పరంపరను శ్రోతల ముందు పరవసాగింది.

“ఆయన చేసిన త్యాగం గొప్పది. దానివల్లే ఇదంతా సాధ్యమైంది.” అన్నదామె, తన చేతులు చాపుతూ. “మన తరం కోసం ఆయన మార్స్‌ను రక్షించాడు. వచ్చే రెండేళ్లలో మనమూ చేయాలనుకుంటున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం, భూమి నుండి మళ్లించబడిన ఆ అణువ్యర్థాల నౌక, ఊహించినట్లుగానే, అతి త్వరలో తిరిగి రాబోతుంది. అది భూమి దిశగానే కదులుతుంది. కృత్రిమ మేధ ఆధారిత స్పేస్ మిషన్‌లో, మనం, ఇక్కడ ఆ ప్రమాదాన్ని రూపుమాపటానికి ప్రతినబూనాము. అలా మనం నీల్ బ్యారీ వారసత్వాన్ని ముందుకు కొనసాగిస్తాము.”

దీనితో అందరూ మళ్లీ ప్రశంసల జోరు పెంచారు. చిరునవ్వుతో, రేమండ్, తన చేతులు పైకెత్తి, తననీ చూస్తున్న శ్రోతలకు అభివాదం చేసింది. వేదిక దిగి తననాహ్వానిస్తు న్న అమ్మ చేతుల్లో ఒదిగిపోయింది.

“నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది చిట్టితల్లీ!”అన్నది రేచల్ మరింత గట్టిగా తన కూతురిని హత్తుకుంటా.

“అమ్మా, నన్ను ఇబ్బందిపెట్టకిక” అని గొణిగింది రేమండ్ గొంతు కీచుబోతుండగా.

భూమి మీద, యూరీ జూనియర్, రేమండ్ ప్రసంగం యొక్క లైవ్ ఫీడ్ (ప్రత్యక్ష ప్రసారాన్ని) మార్స్ నుండి వస్తున్న దాన్ని చూస్తున్నాడు.

యూరీ జూనియర్, యూరీ ఇవానోవ్ మనుమడు. మిషా అతని నాన్న. మిషా తన రెండవ మార్స్ ట్రిప్ తర్వాత భూమికి తిరిగి వచ్చిన తర్వాత, భూమి మీదే స్థిరపడి, తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని, తాను పుట్టిన గ్రహాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతనికి పెళ్లయిందప్పటికే. అతని భార్య ఒక మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. అతడే యూరీ జానియర్. తన నవజాత శిశువును సంరక్షించుకోవడం కూడా అతడు భూమిపై ఉండిపోవడానికి ఒక కారణమే.

యూరీ జూనియర్ పెరిగి పెద్దవాడయ్యాడిప్పుడు. అతడు కూడా తండ్రి అడుగుజాడలలో నడుస్తూ, అరుదైన తన తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వాడే. బాధ్యత అతనికి బదలాయించబడింది. 2070లో చేపట్టబోయే మిషన్ క అతడు సన్నద్ధు డవుతున్నాడు. అతని టీనేజ్ లోనే, అంతర్గ్రహ నెట్వర్క్‌లో రేమండ్‌ను కలుసుకొన్నాడు. అది మార్స్-భూగ్రహాల ప్రజలను నేరుగా అనుసంధానం చేస్తుంది. ఆమె కుటుంబానిది కూడ తన కథే అని తెలిసిన తర్వాత, వారి మధ్య బంధం బలపడింది.

ఇద్దరి నివాస గ్రహలు వేరయినా, ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితులయ్యారు. తమ తమ గ్రహలు ఎలా ఉన్నాయో చర్చించుకోవడం ఇద్దరికీ ఇష్టమే. యూరీ జూనియర్‌కి భూమి అంటే పిచ్చి. రేమండ్‌కేమో మార్స్ అంటే క్రేజ్!

“నాన్నా, ఇలారా, చూద్దువుగాని” అని తండ్రిని పిలిచాడు యూరీ జూనియర్.

“ఏమిట్రా అది?” అన్నాడు మిషా. వంటింట్లో డిన్నర్ కోసం వంట చేస్తున్నాడాయన.

“రేమండ్ ఇప్పడే మిషన్‌ను గ్రహవ్యాప్తంగా ప్రకటించింది డాడీ, అదే, వ్యర్థాల నౌక తిరిగి రావడాన్ని”

“ఓహ్! ఇప్పటికే లేటయ్యింది. వాళ్లీ పని ఎప్పుడో చేసుండాల్సిందిరా అబ్బాయ్! ఇవాళ్రేపు, కాలం వేగంగా పరుగులు తీస్తుంది కద! మనం వెనకబడిపోకూడదు!” అన్నాడు మిషా.

“అంతేనా?”

అణువ్యర్థాల నౌక తిరిగి వచ్చింతర్వాత. మిషన్‌ను నడిపించబోతున్నది తన కొడుకే అని అతనికి తెలుసు. ‘మార్స్’ అన్న పదాన్ని విన్నప్పుడల్లా అతనిలో ఎక్కడో ఒక చోట బాధ కలుక్కుమంటూనే ఉంటుంది. అది నిజం. అతనికి తన తండ్రి గుర్తొస్తాడు. ఆలోచనలను మార్చుకోడానికి అతడు తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. సకారాత్మక దిశలో ఆలోచిస్తాడు. కాని అతని ఆశల కాంతి మసకబారుతోంది. అనుకున్నదాని కంటే త్వరగా.

“నీవు నీ టీంను ప్రిపేర్ చేస్తున్నావా? లేదా ప్రతి ఒక్కరూ తమ పాత అనుభవాల పైనే ఆధారపడుతున్నారా?” ధైర్యం కూడదీసుకొని అడిగాడు మిషా. కొడుకిచ్చిన జవాబు అతని గుండెను తాకింది. అతన్ని చూడడానికీ భయమేసింది.

“అవును నాన్నా, నీవు కంగారు పడాల్సన పనేమి లేదు. పస్తుతానికి స్పేస్ ప్రోగ్రాములో మేము మౌలికంగా చేస్తున్నదదే!”

“వెరీగుడ్! రెడ్ ప్లానెట్ నుంచి మీకందుతున్న సాయం గట్టిదే అని నా నమ్మకం. గుర్తుందిరా నీకు? ఈ ఎ.ఐ. లో వారి పోగ్రామింగ్ భాషను సంస్కృతం ఉపయోగించి సృష్టించిన వాటిని నేనే!”

“ఎందుకు గుర్తు లేదు డాడ్!”

“ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే, తన పేరును మాటిమాటికీ పిలుచుకొనే ఆ మహిళను గురించి నేను చదివింది చాలా తక్కువ రా. తాను చేసే పనిలో ఆమె నిష్ణాతురాలు.”

“నాకు తెలుసు కదా ఆ విషయం!” అన్నాడు యూరీ జూనియర్ ఉద్వేగంగా.

“జేమ్స్ చివరగా పనికి వచ్చింది ఎప్పుడు?” అనడిగాడు మిషా, తన పాత స్నేహితుడిని గుర్తుకు తెచ్చుకుంటూ.

“నాకు గుర్తు లేదు నాన్నా. కాని మేమంతా బాగున్నాం. అతడిప్పుడు లేకపోయినా ఫరవాలేదు”

“నాకు తెలుసు. జస్ట్ నాపాత స్నేహితుడని అడిగానంతే!”

“ఓ! అలాగా.. నేనలా..”

“ష్! బహుశా నీవు వార్తలు వినడంపై దృష్టి పెట్టి ఉంటావులే” అతని వినికిడి శక్తి ఆ వయసులో కూడా అంత బాగుండటం నిజంగా ఆశ్చర్యకరమే.

“ఫియస్తా, వాల్యూం పెంచు” అని మిషా, ఇంటి పరికరాలను అదుపు చేసే స్వయంచలిత ఎ.ఐ.ని పిలిచాడు.

“కొన్ని గంటల క్రితమే, కృత్రిమ మేధ ఆధారిత అంతరిక్ష మిషన్‌కు ప్రధాన రూపశిల్పి అయిన రేమండ్ బ్యారీ, భూగ్రహానికి పొంచి ఉన్న ముప్పును వమ్ము చేయడానికి తమ అంకిత భావాన్ని ప్రకటించారు. దీన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి.”

వార్తలు చెబుతూన్న వ్యక్తి మాట్లాడుతున్నదేమిటో అర్థమైంతర్వాత యూరీ జూనియర్ కళ్లు విచ్చుకున్నాయి. అందరూ సిద్ధంగా దేని కోసం ఉన్నారో, ఆ విపత్తు, ఇంచుమించు వచ్చేసినట్లే అనీ, దాన్ని సాధ్యమైనంత త్వరగా ఎదుర్కొని, దాని అంతు చూడాలనీ వార్తావాహకుడు చెబుతున్నాడు. యూరీ ఇంకా టైముంటుందిలే అనుకున్నాడు. కాని విషయం టి.వి.లో చెప్పేసరికి కొంత అయోమయంలో పడ్డాడు.

తల తిప్పి నాన్న వైపు చూశాడు. అతడు నోరు విప్పక ముందే అతని స్మార్ట్ ఫోన్ మోగింది. దాన్ని తీశాడు. పారదర్శకమైన దాని హాలోగ్రాఫిక్ 3D తెర మీద డిస్ ప్లే అవుతున్న పేరును చూసి అతని ఆతృత మరింత పెరిగింది. చెవి లోని ఇయర్ బడ్స్‌ను తట్టాడు. కాల్ కలిసింది.

“గుడ్ డే, యారీ జూనియర్” అన్నది అవతల నుంచి ఒక గొంతు.

“గుడ్ డే, రేమండ్” అన్నాడు. కొన్ని సెకండ్లపాటు ఊపిరి బిగపట్టి ఇంటి నుంచి బయటపడి, పార్కింగ్ లాట్‌లో ఉన్న తన కారు దగ్గరికి పరిగెత్తాడు.

“వార్తలు విన్నావా?” ఊహించినట్లు ఆమె అడిగింది.

“అది తమాషా ప్రశ్న” అన్నాడు యారీ జూనియర్; కారులో కూర్చుంటూ.

“ఆ వార్తను భూలోకవాసులకు చేరవేయాల్సింది నేనే కదా!”

“నేను అలానే అనుకున్నా, మీ ఆఫీసుకి కాల్ చేసేంతవరకు. ఎ.జె. గారు నీవు ఆఫీసులో లేవని చెప్పారు. తెలుసుకొన్న విషయాలు ఇంకా నీకు చెప్పాల్సి ఉంది. అప్పుడు చెప్పానాయనకు, నా తరపున ఈ వార్తను ప్రజలకు తెలియ చేయమని” అంటూ ఫోన్‌లో వివరించింది రేమండ్, ఆ క్లిష్టపరిస్థితిని కాన్ఫిడెంట్ గానే ఎదుర్కుంటున్నానన్న నమ్మకంతో.

యూరీ జూనియర్ నిశ్చేష్టుడైనాడు. ఆగి ఆలోచించాడు. పెదవులు బిగించాడు అయిష్టంగా. చేత్తో జుట్టు సర్దుకొన్నాడు, రుద్దుకున్నాడు, ఏం అనాలో ఆలోచిస్తూ.

“నేను నీ స్పీచ్ వినడంలో మునిగిపోయా. అందుకే లేటయ్యా!”

“ఓహ్! నిజమా? ఎలా చెప్పాను?” అనడిగింది రేమండ్, అసలు విషయం మర్చిపోయి.

“బ్రహ్మాండంగా చెప్పావు లే, మా నాన్నగారికి కూడా చూపించా తెలుసా? నీ మాటలు ఖచ్చితంగా ఉంటాయి చాలా మటుకు. వ్యర్థాల నౌక కేవలం కొద్ది గంటల దూరంలో ఉందని..”

“ఆ.. దానికి కృతజ్ఞతలు. నీలో చాలా విషయం ఉందే!” అన్నది రేమండ్ కొంచెం సరసంగా. “నీవేం చేస్తావో గాని, వెంటనే ల్యాబ్‌కు వచ్చేయ్. నీ టీమ్‌ను సిద్ధం చెయ్యి. మనకు చాలా పని ఉంది”

“అవునవును. నేను ఇప్పటికే కార్లో ఉన్నా లే!” అని బదులిచ్చి, ఇంజన్ స్టార్ట్ చేశాడు.

“బై”

***

యూరీ జూనియర్ ల్యాబ్ చేరుకున్నాడు. కొంపలంటుకుపోతున్నట్లు, ఎంతో వ్యగ్రతతో, భవనంలోకి పరిగెత్తాడు. ఎన్నో గంటల క్రితమే రావాల్సిన వాడతడు. అప్పటికే మించిపోయింది. వ్యర్థాల వాహనం గురించి తెలిసిన వెంటనే తన దగ్గరికి వచ్చేయనందుకు ఎ.జె. అతనిపై విసుక్కున్నాడు.

“యూరీ గారూ, సుస్వాగతము! మీకీ వార్త అందే ఉంటుందని అనుకుంటా.”

“తెలిసింది” అన్నాడు యారీ దాపరికం లేని ముఖంతో. ఎ.జె. దగ్గరికి వెళ్లి ఆయన చేతి నుండి COMS (కంటిన్యుయస్ ఒపేసిటీ మానిటరింగ్ సిస్టమ్స్) ను లాక్కున్నంత పని చేశాడు.

దానిని చెవులకు తగిలించుకొని మళ్లీ రేమండ్ స్వాగతపు పలుకులు వినసాగాడు.

భూమి మీదున్న పరిస్థితిని గురించి వాళ్లిద్దరూ చాలా చర్చించారు, దాని పరిష్కారాన్ని గురించి కూడా యూరీ ‘కామ్’లో రేమండ్‍కు చెప్పాడు. వారు రూపొందించిన వ్యోమనౌక అత్యంత శక్తివంతమైనదని, 1970 మిషన్ లోని దాని కంటే వంద రెట్లు ప్రభావవంతమైనదని దాని ప్రోబ్ (ఇంకో వ్యోమనౌకకు అనుసంధానించే పరికరం), ఆ అణు వ్యర్థాల నౌకకు  చక్కగా అతుక్కొని, దానిని భూమినుంచి దూరంగా ఉన్న మరో కక్ష్యలోకి తీసుకుపోతుందనీ, అది సోలార్ సిస్టంలోకి మరొక రెండో వేల సంవత్సరాల వరకూ తిరిగిరాదని.

ఆ ‘ప్రోబ్’ భూమిపై నుండి మనుషులు నడుపుతారని చెప్పడం అతడు మరచిపోలేదు. కాబట్టి అది ఎంత శక్తిగలదైనా, మానవ తప్పిదానికి, రిస్స్ లకు కొంత అవకాశం లేకపోలేదని స్పష్టం చేశాడు. గణిత శాస్త్రవేత్తలు, కంప్యూటర్ ప్రోగ్రామర్ల నైపుణ్య విధులన్నీ, వ్యోమనౌకల్లో, కంప్యూటర్లు చేస్తాయి. కాబట్టి చేయవలసిన దాన్నంతా భూమిపైనే చేసేసి, పైకి పంపాలి.

ఇదంతా విని, రేమండ్‌కు తన మీద తనకే నమ్మకం కలిగింది. అత్యంత ఆధునికమైన, కృత్రిమ మేధతో మాత్రమే నడపబడే, లోపల ఎటువంటి మానవ సిబ్బంది లేని, ఆ వ్యోమనౌకను రూపొందించడంలో ఆమె పాత్ర కీలకమైంది. దాన్ని గురించి ఆమె యూరీకి చెప్పింతర్వాత, అతనెంతో ప్రభావితుడైనాడు, సంతోషించాడు కూడా. మానవ జాతినంతా కాపాడే గొప్ప పరిశోధన అది.

“మరి, ఇప్పుడేం చేద్దాం? అణువ్యర్థాల నౌక మనకింకా 75 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. దూసుకొస్తూంది” అన్నాడు యూరీ జూనియర్, ల్యాబ్ లోని కంట్రోల్ రూములో నిలబడి.

అతని బృందం లోని వారంతా, అతనితో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు! వారు తగిన దుస్తులు వేసుకున్నారు, వ్యోమనౌకకు వెళ్లడానికి.

“నీవు సరేనంటే, నీవు సంసిద్ధంగా ఉండాలి మరి. ఉదాహరణకు ప్లాన్ ‘బి’ అనుకుందాం. నీవు ఒప్పుకుంటే, మనం ప్లాన్ ‘ఎ’ ని ఇలా చేయుచ్చు. నేను మార్స్ నుండి స్వయంచలిత వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపుతా. దాని మీద ఒక కన్నేసి ఉంటా. మన మిషన్ ఏమిటి? దాన్ని భూమి నుండి దూరంగా మళ్లించడం. అది సంభవిస్తే, తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు. ఒక క్లారిటీ వస్తుంది. మనం తలపెట్టిన ఈ బృహత్కార్యంలో ప్రాణనష్టం ఉండదు. అదీ ఇందులోని గొప్పతనం!”

“నీతో ఏకీభవిస్తా, ఈ విషయంలో!” అన్నాడు యూరీ జూనియర్.

“అలాగే. గ్రేట్! వ్యోమనౌకను త్వరగా మోహరించే దానిపై పని చేద్దాం. మరింత సమాచారం కోసం సిద్ధంగా ఉండు! థాంక్యూ” అంటున్న ఆమె మాటలకు చిరునవ్వు నవ్వాడతడు. కామ్ డిస్కనెక్ట్ యింది.

“ఆల్ రైట్ ఫ్రెండ్స్, అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి అనుకోని ఆశ్చర్యాలకు మనం అవకాశం ఇవ్వకూడదు. వ్యర్థాల నౌక మనకు, మార్స్‌కు మధ్యనే ఉంది. మార్స్ వారి ఎ.ఐ. వ్యోమనౌక లోనే మన కోసం ఇదంతా నిర్వర్తించడానికి అంగీకరించారు; మనకేం పనిలేకుండా! కాబట్టి వేచి చూద్దాం, పరిశీలిద్దాం” అన్నాడతడు.

మార్స్ ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అణువ్యర్థాల నౌక వారి దిశగా వెళ్లడంలేదు. కాని భూగ్రహం అల్లకల్లోలంగా ఉంది. ముంచుకొస్తున్న విపత్తు వారిని నిలవనీయడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు

రెండు గంటలు వెయిట్ చేశారు వాళ్ళు ఏదైనా సమాచారం వస్తుందేమోనని. ఏదీ రాలేదు. వాళ్ళే చూద్దామని నిర్ణయించుకున్నారు. ప్రెస్ రిలీజ్ ఏమీ లేదంటే, వారనుకోవడం, భూమి నుండి వెళ్ళే వ్యోమనౌక లాంచ్ అయి ఉంటుందని. కాని స్పేస్ ల్యాబ్‌లో  ఉన్న ప్రశాంతత వారిని అయోమయానికి గురిచేస్తుంది.

చివరకు తీవ్రమైన ఆందోళన, భయం (Panic attack) ప్రపంచాన్ని కుదిపివేయక ముందే, ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగబోతూ ఉండగా, యూరీ జూనియర్ ముందుకు వచ్చి ప్రజలకు ప్రకటన చేశాడు, అధికారికంగా!

“ఆందోళన చెందాల్సిన పనిలేదు!” అన్నాడు. “మార్స్‌కు అత్యంత అధునాతన సాంకేతికత ఉంది ప్రస్తుతం. మేం మాట్లాడాం వారితో. వారు క్రింద, ఇక్కడ ఉత్పన్నమయ్యే పరిస్థితులలో కూడా, వచ్చి సాయం చేస్తామని మాటిచ్చారు. వారి ఆటొమేటెడ్ వ్యోమనౌకను వెంటనే మోహరించి, అంతరిక్షంలోకి పంపి, చేయవలసింది చేస్తారు. వ్యర్థాల నౌకకు ప్రోబ్‍ని తగిలించి, దాన్ని దూరంగా మళ్లిస్తారు. ముఖ్యంగా, ఏ వ్యోమగాములనూ కోల్పోయే రిస్క్ లేదిందులో. ఎందుకంటే గొప్ప రోబోటిక్ వర్చుయల్ మెషీన్లు (RVMs) ఈ పనిని నిర్వహిస్తాయి!

మనం మన జీవితాల పర్యంతం దీని కోసమే ప్రిపేరవుతున్నాం. మిగతా ప్రపంచం ఇబ్బంది పడాల్సిన పని లేదు. వ్యోమనౌకకున్న సాంకేతికత, ఖచ్చితత్వంను బట్టి, అందరూ నమ్మాలి. మన శిక్షణ అంతా పనికి రాదేమో అని. కాబట్టి భయం లేదు మిషన్ పూర్తిగా అదుపులో ఉంది.”

దీనితో భూమిపై ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మానవ ప్రాణనష్టం లేకపోవడం వారికి మరింత నచ్చింది. ఊరటనిచ్చింది.

ఇక మార్స్ కొద్దాం. వ్యోమనౌకను మోహరించడానికి వెనక్కు లెక్కించడం (Countdown) మొదలైంది. రేమండ్ నిటారుగా నిలబడి అంకెలు లెక్క పెట్టసాగింది. 5, 4, 3, 2, 1 బ్లాస్ట్ ఆఫ్!!!

ఎటువంటి పొగ రాలేదసలు. వ్యోమనౌక యొక్క శక్తివంతమైన ఇంజన్లు దానిని అంతరిక్షంలోకి లేవనెత్తాయి. దానిని నడిపే ఇంజన్ నుండి నీలిరంగు మంట వెలువడసాగింది.

“NASS 2, అన్ని సిస్టమ్ లను చెక్ చేయండి! నాకు స్టేటన్ చెప్పండి!” అనడిగింది రేమండ్. ఎటువంటి మానవసిబ్బంది లేని, అంతరిక్షంలోకి పోతున్న వ్యోమనౌకతో ఆమె నేరుగా సంభాషించసాగింది.

కాసేపటి తర్వాత, నౌకలో నుంచి ఒక ఆడ గొంతు ప్రతిస్పందించింది. “టవర్ చెక్, సిస్టమ్స్ అన్నీ గ్రీన్!”

ఆ గొంతు టవర్ లోని కంట్రోలు రూములో ప్రతిధ్వనించింది. ఇతర వర్కర్లు ఎ.ఐ. చెప్పిన దాన్ని నిర్దారించుకోడానికి పరుగులు తీశారు అన్ని చోట్లకు.

“ఇంజన్ చెక్: ఇంకా పూర్తి సామర్థ్యంతోనే ఉంది”.. సిబ్బందిలో ఒకరు అరిచారు, తెర వెనుక నుంది. ఒక ‘అనాగ్రామ్’ కీబోర్డు మీద సంస్కృతంలో ఏదో రాసి ఉంది.

“కమ్యూనికేషన్ చెక్”

“ధ్రస్ట్ అండ్ లాండింగ్ చెక్ “

అలా, ఆ పదాలు రూములో ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ, తమ వ్యోమనౌక అద్భుతమైన కండిషన్‌లో ఉందని నిర్ధారించారు. దాంతో రేమండ్ కొంత మేర సంతృప్తిని పొందింది.

“అంతా విన్నావా?” అనడిగింది కామ్ మీద.

యూరీ జూనియర్, కంట్రోలు రూము లోని ఒక సీటుపై కూర్చుని, ఎంతో సహనంగా, మార్స్ మీద ఆటోమేటెడ్ వ్యోమనౌకలో జరుగుతున్న దాన్ని పరిశీలిస్తున్నాడు.

“ఆఁ. విన్నా. ఆందోళన చెందే పనే లేదని నీవు నాకు చెబుతున్నావు, అంతేనా?”

“అవును. కరెక్ట్. హయిగా కూర్చుని మేం వేయబోయే ‘షో’ చూడు” అన్నది రేమండ్. ఆమె గొంతులో ఒక రకమైన ఉద్వేగం. యూరీ జూనియర్ నవ్వుకున్నాడు. భూమి మీదున్న వాళ్ల జీవితాలు ప్రమాదం ఉంటే ఈమె ఆ మిషన్‌ను ‘షో’ అంటోంది!

“నీ ‘షో’ గురించి మా మిగతా సిబ్బందికి ఖచ్చితంగా చెబుతా. వాళ్ళేమంటారో నీ ఐడియా విని, చూద్దాం!”

ఇప్పుడు ఇద్దరూ నవ్వుకున్నారు.

“ఎన్ని రోజులని అనుకొంటున్నాం?” అనడిగాడు యూరీ జూనియర్. అది చాలా గడ్డు ప్రశ్న. రేమండ్‌కు పరిస్థితిలోని అత్యవసర స్వభావం తెలుసు. ఆ ముఖ్యమైన అంశం గురించి ఆమె సిద్ధపడే ఉంది.

“మరో నెల రోజులుంది కదా, కరెక్టేనా NASS 2?”

“అవును కరెక్టే” అన్నది యాంత్రిక గొంతు. “అంచనా వేయబడిన కాలం 29 రోజులు, 7 గంటలు, 16 సెకండ్లు.”

“థాంక్యు!, అదీ విషయం! యూరీ జూనియర్!”

అహోరాత్రాలు, అంతరిక్ష ఏజన్సీ నాయకులిద్దరూ కలిసే కాలం గడిపారు. వారు తమ పని తాము చేస్తున్నట్లు చెప్పుకున్నా, వారి వారి గ్రహాల గురించే వారి సంభాషణకు ఒక ముగింపు.

అందరూ ఊహించిన దానికంటే ముందే ఆ చారిత్రాత్మకమైన రోజు రానే వచ్చింది. దాన్ని D-Day అనొచ్చు. ఫలితం ఏదైనా, దాని ట్యూన్ కనుగుణంగానే అందరూ నృత్యం చేయాలికదా! ప్రపంచమంతా, మార్స్, భూమితో సహా సిద్ధంగా ఉన్నారు; ఊపిరి బిగపట్టుకొని.

“అణు వ్యర్థాలనౌక ఎక్కడుందో తెలిసింది” అని చెప్పింది NASS 2 అందరి మూడ్‌ను సెట్ చేస్తూ.

కంట్రోల్ రూమ్‍లో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు. కాని రేమండ్ వెంటని వారిని వారించింది.

“NASS 2, జాగ్రత్తగా సమీపించండి” అన్నది రేమండ్.

ఆటోమేటెడ్ వ్యోమనౌక వ్యర్థాల మాడ్యూల్‍ను సమీపిస్తుంది. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. వింటున్నారు. అందరికంటే మానసిక శ్రమ పొందుతున్నవారు రేమండ్, యూరీ జూనియర్లే. వాళ్లు మరింత వ్యగ్రతగా పరికిస్తూ, శ్రద్ధగా వినసాగారు.

అకస్మాత్తుగా, ఒక హెచ్చరించే ధ్యని కంట్రోల్ రూమంతా ప్రతిధ్వనించింది. రేమండ్ కళ్ళు విప్పార్చి, ముందుకు అడుగేసింది.

“ఏమయింది? ఏదైనా సమస్యా?” అనడిగాడు యూరీ జూనియర్, ఆ వార్నింగ్ సౌండ్ తన చెవులకు సోకిన వెంటనే, వేగంగా స్పందిస్తూ.

“నాకూ తెలియదు. ఎక్కడో పొరపాటు ఖరిగినట్లుంది. NASS 2, నాతో మాట్లాడు. ఏం జరుగుతోందక్కడ?” అనడిగింది రేమండ్ తట్టుకోలేని ఆతృతతో.

అత్యంత విశిష్టమైన సంస్కృతపోగ్రామింగ్ కారణంగా, ఆ స్పేస్‌షిప్ తనను తాను నిర్వహించుకోగలదు. ఆ విషయం రేమండ్‌కు బాగా తెలుసు. ఏదో జరిగింది దానికిప్పుడు. అందుకే అది స్పందించడం లేదు.

ఆటోమేటెడ్ గొంతు రేమండ్ పిలుపుకు బదులివ్వాలని ప్రయత్నించింది గాని, ఏదో కరకర ధ్వని, తర్వాత పూర్తిగా ఆగిపోయింది.

“ఏమయింది ఇంతకూ?” యూరీ అడిగాడు. అతని గొంతులో అయోమయం, ఆందోళన. రూమంతా తిరుగుతున్నాడు. అతని మేధస్సు పని చేయసాగింది క్రమంగా.

“నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా, ఏది జరగకూడదో, అదే జరిగిందని” అన్నది రేమండ్. “స్పేస్‍షిప్ లోకేషన్ నాకు పంపండి” అని తన టీమ్‌ని ఆదేశించిందామె. కాని మరో అంతరాయం!

“మేం పంపలేం మేడమ్. లోకేషన్ తెలియడం లేదు. మాకు తెలిసిందేమిటంటే మన నౌక వ్యర్థాల నౌకకు అతి దగ్గరగా వెళ్లింది, తర్వాత కనబడలేదు, మళ్లిపోయినట్లుంది” చెప్పాడో కంట్రోల్ రూమ్‍లోని ఓ ఉద్యోగి.

“అంటే, మొత్తం స్పేస్‍షిప్‍ను మనం పోగొట్టుకున్నామనా మీరు చెబుతున్నారు?” అనడిగింది రేమండ్.

“అలాగే అనిపిస్తుంది మేడమ్!”

రేమండ్ ఆశలు కుదేలయ్యాయి. నిరాశ అనే సముద్రం లోతులకు ఆమె హృదయం మునిగిపోయింది. తెర వైపు నిరాశగా చూడసాగింది. ఒకవేళ వాళ్ల లెక్కలు తప్పిఉన్నా, నౌక తనను తాను ప్రయత్నం మీద సంబాళించుకొని ఉండేది.

అలా కాకుండా, మొత్తం నౌకే గల్లంతయిందంటే ప్రమాదం ఇంతకు ముందు కంటే తీవ్రమైనట్టే.

ఇప్పుడు ఆమెకు వాళ్లమ్మ ఎన్నోసార్లు చెప్పిన, 1970లో జరిగిన, వైఫల్యపు కథ గుర్తొచ్చింది . నీల్ బ్యారీ, యారీ తమ ప్రాణాలు ఒడ్డి, మరో ప్రయత్నం చేయబూనిన కథ అది.

ముఖం మీద చేతుల్తో కొట్టుకొంది రేమండ్. ఆమెకు చప్పున గుర్తొచ్చింది. రేడియేషన్.. అణుధార్మికత! దాన్ని పూర్తిగా ఎలా మరిచిపోయారు తాము? అప్పుడే, ఆమెకు తన అంతరాత్మ చెప్పింది. రేడియేషనే, దీనికి కారణం కావచ్చని, అది మరింత పెరిగి ఉండవచ్చని.

“యూరీ జూనియర్! ఇప్పుడే కనిపెట్టాను కారణం..” రేమండ్ అతనితో మాట్లాడటానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు! కామ్‌లో ఏదో సమస్య ఉత్పన్నమైనట్లుంది

“యూరీ, యరీ” అని మూడోసారి బిగ్గరగా పిలిచింది. అటువైపు నుండి స్పందన లేదు. తన ఆందోళనను కోపాన్ని ఆమె నిగ్రహించుకోలేకపోయింది. అవి ఆమెలో పొంగి పొరలుతున్నాయి. కామ్ తీసి నేల మీదికి విసిరింది. అది భళ్ళున పగిలింది. ముక్కలయింది! రూములోని అందరి కళ్లు ఆమెపైనే!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here