అంతర్జాతీయ మహిళా దినోత్సవం

0
2

[dropcap]“అ[/dropcap]మ్మగారూ అమ్మగారూ, మరేమోనండీ మా అమ్మ, నిన్న రేత్రి తలకి దెబ్బ తగిలి ఆస్పత్రిలో జేరినాదండి. ఇయ్యాల పనిలోకి రానని సెప్పమన్నాది” అని పరిగెత్తుకుంటూ రావడంతో వగురుస్తూ చెప్పాడు ఎంకటి అనబడే వెంకటేషు.

అది విన్న సునీత సుప్రియ లిద్దరికీ గుండె జారిపోయింది. అప్పటికి టైము దగ్గర దగ్గర తొమ్మిది.

ఇద్దరికీ పనిమనిషి మంగ మీద పీకల్దాకా కోపమొచ్చింది.

అసలే ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఎన్నోప్లాన్లు వేసుకున్నారు. అవన్నీ ఈ పనిమనిషి రాకపోవడం వల్ల భగ్నమౌతాయని చిరాకు పడిపోవడం మొదలెట్టారు. ఇద్దరికీ చెయ్యాల్సిన పన్లు తలుచుకుంటే గాభరా వచ్చేసింది.

సునీత సుప్రియ లిద్దరూ ఊరికి కొంచెం దూరంగా ఉన్న ఇళ్ళల్లో అద్దెకుంటున్నారు.

ఆ కాంపౌండ్‌లో రెండు మేడలున్నాయి

ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న రోజుల్లోనే, రిటైర్ అయ్యాక ఒకే దగ్గర స్థిరపడదామని అనుకుని, ఊరికి దూరంగా చవగ్గా వస్తోందని స్థలం కొని రెండు మేడలు కట్టించుకున్నారు.

అందులో పెద్దాయన క్రిష్ణమూర్తికి ఇద్దరూ మగపిల్లలు. ఇప్పటి తరం వాళ్ళలాగానే వాళ్ళు విదేశాల్లో స్థిరపడిపోయారు. ‘ఇంక ఒక్కడివీ అక్కడెందుకు మా దగ్గరకి వచ్చెయ్య’మంటే, ఆ మేడ రెండు ఫేమిలీలకి అద్దెకిచ్చి, తమ్ముడికి ఆ ఇంటి బాధ్యత అప్పగించి అమెరికా వెళ్ళిపోయాడు

ఇంక చిన్నాయన ప్రసాదరావు.ఈయన జడ్జిగా చేసి రిటైరయ్యారు.ఆయనకి ఒక కొడుకూ, కూతురూ..

వాళ్ళిద్దరూ ఇండియాలోనే వేరే ఊళ్ళలో ఉంటారు. పిల్లల సెలవులకీ ఏదైనా ఫంక్షన్లకీ వస్తూ ఉంటారు. అందుకని ప్రసాదరావు గారు తను కింద పోర్షన్లో ఉంటూ పై పోర్షన్ ఖాళీగా ఉంచారు.

అయన భార్య భారతమ్మ. కొంచెం చాదస్తం మనిషి. చాదస్తమంటే ఆవిడ పనిమనిషిని వంటింట్లోకి రానివ్వదు. వంటిల్లూ, దేముడి గదీ భోజనాల గదీ అన్నీ ఒకటే.

అందుకే ఆవిడ ఆ గది ఒక్కటీ తుడుచుకుంటుంది. మిగతా ఇల్లంతా మంగ శుభ్రం చేస్తుంది. “ఎందుకమ్మా, నీకీ ప్రయాస అది కూడా మంగ చేతే చేయించకూడదా” అని పిల్లలు అంటే “చేసుకోగలిగినంత కాలం చేసుకోనీయండర్రా ఎప్పుడు చేసుకోలేకపోతే అప్పుడు మీరు చెప్పినట్టే” అని నవ్వేస్తుంది. అంట్లు వెనక వరండాలో వేసేస్తే మంగ తోమి పెట్టాక మళ్ళీ ఆవిడ తొలుచుకుంటుంది. కుక్కర్ మూత లోంచి గాస్కెట్ తీసి తోమమనీ అన్నం వడ్డించుకునే గరిటకి మెతుకులుండి పోయాయనీ ఇలా ఏవో చెప్తుంది.

ఇవన్నీ సుప్రియకీ సునీతకీ కొంచెం వింతగా అనిపిస్తాయి. ఎప్పుడైనా ఆవిడ గురించి వాళ్ళల్లో వాళ్ళు హాస్యంగా మాట్లాడుకుంటారు. వాళ్ళు నేటి తరం వాళ్ళు కాబట్టి మంగని వంటిళ్ళల్లోకి రానిస్తారు. అంట్లు తోమడానికి వేరే జాగా ఉన్నా, సింక్ లోనే అంట్లు తోమినా ఆ నీళ్ళు చుట్టూ తుళ్ళుతూ ఉన్నా పట్టించుకోరు.

ఒకొక్కప్పుడు ఏఁవైనా పదార్ధాలు మిగిలిపోతే మంగే చిన్న గిన్నెల్లోకి సద్దేసి ఫ్రిజ్ లో పెట్టేస్తుంది.

అందుకని మంగకి వాళ్ళంటే కొంచెం ఇష్టం. అదీకాక మంగకి ఇంచు మించుగా వాళ్ళ వయసే ఉంటుంది.

అందుకే ఎప్పుడైనా వాళ్ళు ఆవిడ గురించి హాస్యంగా మాట్లాడితే తను కూడా ఓ మాట కలుపుతుంది.

కాని దానికి భారతమ్మ గారన్నాకూడా ఇష్టమే. ఎందుకంటే దాని మొగుడు తాగుబోతనీ ఇంటికి డబ్బేమీ సరిగా ఇవ్వడనీ ఆవిడ రెండు పూటలా మిగిలినవన్నీ దానికే ఇచ్చేస్తుంది. దాని కొడుక్కి సుబ్బరంగా సరిపోతాయి. ఎప్పుడైనా దాని ఇంట్లో వంటలేక పోయినా కొడుక్కి మాత్రం ఆకలి బాధ ఉండదు.

మంగ రాదని తెలియగానే వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచించటం మొదలెట్టారు. పిల్లలు పొద్దున్నే ఏడు గంటలకల్లా స్కూలు బస్సెక్కి వెళ్ళిపోయారు.ఇంక భర్తలకి డబ్బాలు సర్దేస్తే వాళ్ళూ వెళ్ళిపోతారు. ఇప్పుడు రాత్రి గిన్నెలూ పొద్దున్న గిన్నెలూ కలిపి తోముకుని ఇల్లు శుభ్రం చేసుకుని వెళ్దామంటే టైము సరిపోదు.

అసలు వాళ్ళ ప్లాను ఏమిటంటే రెండు చేతులకీ గోరింటాకు పెట్టేసుకుని తలకి హెన్నా పెట్టుకుని తయారయిపోవడం. మార్నింగ్ షో సినిమాకి వెళ్ళి అట్నుంచటు హోటెల్లో భోంచేసి ఇంటికి పిల్లలు స్కూల్నించి వచ్చే సమయానికి వచ్చెయ్యడం.

ఇందులో భాగంగా తలకి హెన్నా పెట్టుకోవడం నిన్నే పూర్తయి పోయింది. ఏ చీరలు కట్టుకోవాలో డిసైడ్ చేసుకుని వాటి మీదకి డిజైనర్ బ్లౌజులు, మేచింగ్ గాజులూ నిన్నే రెడీ చేసేసుకున్నారు. కానీ సునీతకి నిన్న వేరే ఏదో పని ఉండడంవల్ల ఒక చేతికే గోరింటాకు పెట్టుకోగలిగింది. ఇప్పుడు ఇంకో చేతికి గోరింటాకు అంటే కుదరదు. అదో అసంతృప్తి. మార్నింగ్ షో క్కూడా టికెట్లు బుక్ చేసుకున్నారు. హోటల్లో టేబుల్ రిజర్వ్ చేసుకున్నారు.

కాబట్టి ఇద్దరూ కలిసి ఆలోచించి అంట్లపని సాయంత్రం చూసుకొవడానికీ, ఇల్లుమాత్రం పైపైన తుడుచుకుని, దేముడికి దీపం పెట్టి వెళ్ళిపోడానికీ నిశ్చయించుకున్నారు. మేడమెట్ల మధ్యలో నిల్చుని ప్లానంతా పక్కా అయ్యేక సుప్రియ కిందకి దిగి తన పోర్షన్‌లోకీ సునీత మెట్లెక్కి తన పోర్షన్‌లోకీ వెళ్ళిపోయారు.

కిందకి వెళ్ళేసరికి సుప్ర్రియా వాళ్ళాయన అసహనంగా వెయిట్ చేస్తున్నాడు. సుప్రియ అతనికి త్వరగా టిఫిన్ పెట్టి కారేజీ ఇచ్చేస్తూనే వాళ్ళ ప్రోగ్రాం అంతా గబగబా నాలుగు ముక్కల్లో చెప్పేసింది. ముందు రోజు చెప్పినా ఎందుకైనా మంచిదని మళ్ళీ చెప్పింది. అతను ‘ఆఁ ఊఁ’ అంటూ త్వరగా తయారై వెళ్ళిపోయాడు.

పైన సీను ఇందుకు విరుద్ధం.

సునీతా వాళ్ళాయన ఇంకా పేపర్‌లో ఆ మూలా ఈ మూలా ఏఁవైనా న్యూస్ ఉందేమోనని తిరగేస్తున్నాడు

సునీత కూడా వాళ్ళాయనకి ప్రోగ్రాం అంతా చెప్పి తొందరగా స్నానం చేసి వస్తే అతనికి టిఫిన్ పెట్టి తను కూడా రెడీ అవ్వాలని చెప్పడంతో, ‘అలాగే అలాగే’ అంటూ చెప్పిన పది నిమిషాలగ్గానీ కదల్లేదు. అదైనా సునీత ఇంకోసారి హెచ్చరించాక.

సునీత అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుని తయారయ్యాక చూస్తే అతనూ తయారై పోయాడు. తీరా తాళం కప్ప చేతిలో తీసుకునే సమయానికి “నా సెల్లు నా సెల్లు” అని వెదకడం మొదలెట్టాడు. అతను టీపాయ్ మీదా డైనింగ్ టేబిల్ మీదా వెతికే టైములో సునీత తన సెల్ నించి రింగ్ ఇస్తే అది అతని పేంట్ జేబులో మోగడం మొదలెట్టింది.

మళ్ళీ తాళం కప్ప చేతిలోకి తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చాక ఈసారి సునీత అడిగింది “మీ కళ్ళజోడేదీ” అని.

మళ్ళీ వెదకడం మొదలు. అందరికీ తన మతిమరుపు గురించీ దానివల్ల తనెంత కష్టపడుతోందో నవ్వుతూ సంతోషంగా చెప్పి మురిసిపోయే సునీత ఈవేళ ఎందుకు విసుక్కుంటోందో అతనికి అర్థం కాలేదు.

అదృష్టవశాత్తూ అతనికి గుర్తొచ్చింది. స్నానానికి వెళ్ళినప్పుడు పేపర్ చేత్తో పట్టుకుని వెళ్ళాడు. అది బెడ్ రూంలో ఉండి ఉంటుందని. బెడ్రూంలో కెళ్ళి చూస్తే మంచం మీద తడి తువ్వాలూ, దానికింద పేపరూ దాని కింద కళ్ళజోడూ ఉన్నాయి. మంచం మీద తడి తువ్వాలు చూసి సునీత కోప్పడుతుందేమోనని భయపడుతూ దాన్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ మీద వేశాడు. ఏ కళ నుందో సునీత ఏమీ అనలేదు. అతనూ గబగబా మెట్లు దిగి కింద వెయిట్ చేస్తున్న సుప్రియని విష్ చేసి బండి స్టార్ట్ చేసుకుని వెళిపోయాడు.

సునీత తాళంవేసి కిందకి దిగేసరికి పది దాటింది.

స్నేహితురాళ్ళిద్దరూ ఆటో కోసం వీధి చివరిదాకా నడవాలేమో అని ఆందోళన పడుతూ గేటు దాకా వచ్చేసరికి దేముడు పంపించినట్టు ఒక ఆటో గుమ్మంలో ఆగింది. అందులోంచి భారతమ్మగారు దిగారు. ఆ టైములో ఆవిడ బయటి నించి రావడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆవిడ సాధారణంగా బయటికి వెళ్ళరు. అందులోనూ పొద్దున్న వేళ అసలు వెళ్ళరు. కాని ఇప్పుడవన్నీ కనుక్కునే టైం లేదు.అందుకని ఎక్కువ బేరం ఆడకుండా సినిమా హాలు పేరు చెప్పి ఆటోని పోనిమ్మన్నారు.

సినిమా చూసి హోటెల్‌కి వెళ్ళే సరికి అక్కడ చాలా రష్‌గా ఉంది.

టేబుల్ రిజర్వ్ చేసుకున్నా వివిధ మహిళా సంఘాలన్నీ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉండడం వల్ల ఆలస్యం తప్పలేదు. మొత్తానికి ఎలా అయితేనేం భోజనం చేసి ఇంటి కొచ్చేసరికి టైం నాలుగు దగ్గరవుతోంది.

ఇంటి కొచ్చేసరికి సింకులో గిన్నెలు ఆహ్వానం పలికాయి. కానీ కొంతలో కొంతైనా మహిళా దినోత్సవం వాళ్ళనుకున్నట్టు జరుపుకున్నందుకు సమాధానపడి పిల్లలకి వస్తూ వస్తూ మార్కెట్ నించి తెచ్చిన టిఫిన్లు పెట్టి పనుల్లో పడిపోయారు.

ఆ పట్టు పట్టు మంగ పది రోజులు పైగా పనిలోకి రాలేదు. ఇంక చూడాలి వాళ్ళ అవస్థ. అసలే పిల్లల పరీక్ష రోజులు. పొద్దున్నా సాయంత్రం అన్ని పన్లూ చేసుకోవడం, పిల్లలొచ్చాక వాళ్ళని కూర్చోబెట్టి చదివించడం వీటన్నిటితో చచ్చి దుగ్గుడైనంత పనయ్యింది ఇద్దరికీ.

మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడు మంగని తిట్టుకోవడం, అంతా కాకపోయినా కొంతైనా జీతం కట్ చేసేద్దామని నిర్ణయించుకోవడం లాంటివి జరిగాయి. వాళ్ళు దానికి చాలా చనువు ఇచ్చేసారనీ ఇకమీదట నించీ ముభావంగా ముక్తసరిగా ఉండి దాని పనేదో అది చేసుకుపోయేటట్టు చూడాలనీ కూడా అనుకున్నారు.

తిరిగి వచ్చి పనిలో జాయిన్ అయి మంగ మామూలుగా పని చేసుకుపోవడం మొదలెట్టింది. మొగుడు తాగొచ్చి కొట్టబోతే తప్పించుకోవడంలో పక్కనున్న రాయి మీద పడిపోతే తలకి దెబ్బ తగిలిందనీ మరీ పెద్దది కాదు కాని నాలుగు కుట్లు పడడంవల్ల హాస్పిటల్లో ఉండాల్సివచ్చిందనీ అందుకని పనికి రాలేకపోయాననీ సంజాయిషీ ఇచ్చింది. తల వెనక భాగంలో కుట్లు కూడా చూపించింది..

ఏదో ముక్తసరిగా ముభావంగా ఉందామనుకున్నవాళ్ళు కరిగిపోయారు. కానీ విచిత్రంగా మంగే గబగబా పని చేసుకుని వెళిపోతోంది. పని చేస్తున్నంతసేపూ ఏదో ఒకటి మాట్లాడేది. ఇప్పుడు దాని పనేదో అది చేసుకుపోతోంది.

కానీ మానవ స్వభావం ఏమిటంటే ఇలా కోపంలోనూ విసుగులోనూ తీసుకున్న నిర్ణయాల మీద నిలబడలేదు. పునరాలోచించుకుంటుంది. తెలియకుండానే పాత స్థితికి రావడానికి ప్రయత్నిస్తుంది.

అలా రావడానికి ఏదో సందర్భం దొరకాలంతే. ఆ సందర్భం సునీతకి వచ్చింది. తమ్ముడికి పెళ్ళి కుదిరింది. ఆడపడుచు లాంచనాలు భారీగా ఇస్తామన్నారు. తనకే కాక వాళ్లాయనకీ పిల్లలకీ కూడా బట్టలు పెట్టి కానుకలు ఇస్తామన్నారు ఆడపెళ్ళివారు.

సుప్రియని పైకి పిల్చి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఈ సంతోష వార్తని, పక్కనే పనిచేస్తున్న మంగకి అర్థం కాకూడదని, ఇంగ్లీషులో చెప్పి ఆమాటా ఈమాటా మాట్లాడుతూ ఆ ఊపులో “ఇదుగో మంగా నువ్వు టీ పెట్టేసుకో, పక్కనే కొంచెం కూర కలుపుతూ ఉండు” అని “ఏమంటున్నారు మీ అసింటా మామ్మగారు?” అనడిగింది.

అసింటా మామ్మగారంటే భారతమ్మగారు. ఆవిడ అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు మంగ అక్కడ నిలబడితే ‘కాస్త అసింటా జరుగు’ అని దానికి తగలకుండా నడుస్తారు. సునీత అలా అడగడంలో ‘ఆవిడకీ మాకూ తేడా చూడు’ అనే సందేశం ఉంది.

అది “ఇప్పుడు ఆయమ్మ ఊసెందుకులే అమ్మా! దేవతలాంటి అమ్మగారు” అంది.

వాళ్ళు ఉలిక్కి పడ్డారు.

ఇదివరకయితే అది ఇంకో రెండు చెపితే ముగ్గురూ కలిసి నవ్వుకునేవారు.

సుప్రియ “అదేంటి మంగా, సడెన్ గా ఏంజరిగిందేమిటి? పార్టీ మార్చేశావ్?” అనడిగింది హాస్యంగా. దానికది “ఏం జరగడమేమిటమ్మా నా బతుకే మారిపోనాది ఆయమ్మా బాబుగోర్ల వల్ల” అంది.

అది చెప్పిన దాని వల్ల వాళ్ళకేం తెలిసిందంటే అది పడిపోయి ఆస్పత్రిలో జాయినైనప్పుడు వీళ్ళకి చెప్పినట్టే వెంకటేష్ ఆవిడక్కూడా చెప్పేడు. ఆవిడ వాణ్ని ఏమైనా తిన్నావా అనడిగిందిట. వాడు లేదంటే వాడికి టిఫిన్ పెట్టి బ్రెడ్డు తెప్పించి కాల్చి పాలూ అవీ పట్టుకుని హాస్పిటల్‌కి వచ్చింది. దాని దగ్గర కూర్చున్న తల్లి దగ్గర్నించి విషయమంతా రాబట్టింది. హాస్పిటల్ ఖర్చులకి కొంత డబ్బిచ్చింది. తమ్ముడు పోలీస్ కంప్లయింట్ ఇస్తానంటుంటే దాని మొగుడు వద్దని బతిమాలుతున్నాట్ట. ఆవిడ ఇంటికొచ్చి విషయమంతా జడ్జీ గారికి చెప్పింది. ఇంక ఆయన రంగంలోకి దిగారు. ఆయనకి తెలిసిన ఇనస్పెక్టర్‌కి చెప్పి దాని మొగుణ్ని స్టేషన్‌కి పిలిపించారు. కంప్లయింట్ తీసుకుంటామనీ కాని జడ్జీ గారు చెప్పడం వల్ల, మొదటి తప్పిదంగా ఒదిలిపెట్టి ఇంకోసారి ఇలా జరిగితే గృహహింస నేరం కింద కొట్లో వేసేస్తామనీ బెదిరించారు. మత్తుమందులు మాన్పించే డాక్టర్ దగ్గర జాయిన్ చేశారు. లక్కీగా ఆ డాక్టరు గారి దగ్గరే ఆయన పిల్లల్ని స్కూలికి ఆటోలో దింపడానికి కుదిర్చారు. ఇదంతా జరిగి ఓ వారం రోజులవుతోంది. ఇలాగే కంటిన్యూ అయితే దాని బతుకు బంగారంలా ఉంటుందని సంబరపడుతోంది.

ఇదంతా విన్నాక వాళ్ళల్లో చిన్న అపరాధ భావం కలిగింది. దాని జీతం కట్ చేసే విషయమై పునరాలోచనలో పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here